కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ప్రజాసంక్షేమానికి నిధులు కుమ్మరిస్తున్నాయి. అలాగని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు నగదుతో నిండుకుండల్లా ఉన్నాయనుకుంటే పొరపాటు. అవి చట్టం విధించిన పరిమితులకు లోబడి బ్యాంకుల నుంచి నేరుగా, అదే పనిగా అప్పులు తెచ్చుకొని మరీ ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల అజమాయిషీలోని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడితో ఆగడంలేదు. అవి ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రభుత్వ అధీనంలోని పలు కార్పొరేషన్లు కూడా బ్యాంకులు, ఆర్థిక మార్కెట్ల నుంచి అప్పులు తెచ్చుకునేలా చేస్తున్నాయి. అప్పులు పుట్టించుకోవడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సర్వాధికార గ్యారంటీలు ఇస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజల మద్దతు కోసం రాష్ట్రాలు నిర్లక్ష్యంగా చేస్తున్న అప్పులు, అలా తెచ్చుకున్న సొమ్మును ఖర్చు చేస్తున్న వైనానికి సంబంధించి మచ్చుకు కొన్ని ఉదాహరణలు దిగువ ఇస్తున్నాను.

ఒక రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ తొలి రెండు సంవత్సరాల్లోనే దాదాపు రూ.80,000 కోట్లను అప్పుగా తెచ్చింది. ఇదివరకే దాదాపు రూ.80,000 కోట్లను అప్పుగా తెచ్చిన ఘనత ఆ రాష్ట్ర ప్రభుత్వానిది. తన హయాంలో మూడవ సంవత్సరంలో రూ.47,000 కోట్ల మేర రుణం తెచ్చుకోనుంది. ఇలా తెచ్చుకున్న రుణాన్ని 30 సంవత్సరాల తర్వాత చెల్లించాలి! ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ఆయన కుమారుడు కానీ 30 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉండే అవకాశం లేదు! ఇంతటితో వ్యవహారం అయిపోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో 7.5 శాతం పెంపుదలకు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసు చేసింది. కానీ ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం పెంపుదల ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు! రాష్ట్ర రాజధానిలో మునిసిపాలిటీ తన ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చెల్లించలేకపోతోంది. వేతనాల చెల్లింపు కోసం ఆ మునిసిపాలిటీ అప్పులు చేస్తోంది! కానీ పాలక పక్షం నగరవాసులకు ఏడాదికి రూ.10,000 వరకు ఆస్తి పన్నును రద్దు చేసింది. అంతేకాక ప్రతి ఇంటికి నెలకు ఉచితంగా 20,000 లీటర్ల నీటి సరఫరా, క్షురకులకు, బట్టలు ఉతికేవారికి ఉచితంగా విద్యుత్‌ ‌సరఫరా లాంటి హామీలు సరే సరి. వీటికి తోడు గొర్రెల కాపర్లకు, పశువుల కాపర్లకు రాయితీలు, ఉచితంగా గొర్రెలు, పశువుల పంపిణీ తాయిలాలు నెరవేర్చాలి.

ప్రాంతీయ పార్టీ ఏలుబడిలో ఉన్న మరో రాష్ట్రంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏప్రిల్‌ 23‌న ప్రచురితమైన ప్రచార ప్రకటన ప్రకారం ముఖ్యమంత్రి, లేదా ఆయన దివంగత తండ్రి పేరిట అమలవుతున్న 21 పథకాల కింద 2019 సంవత్సరం మే మాసం నుంచి 2021 సంవత్సరం ఏప్రిల్‌ ‌మాసం నాటికి 4,65,58,594 మంది మహిళలకు రూ.82,368.31 కోట్లు బహుమానంగా అందాయి. ఈ బహుమానంలో ఎక్కువ మొత్తం అప్పుగా తెచ్చి వడ్డించిన సొమ్ము!

తమిళనాడులో ప్రస్తుతం పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వరకు పేదలు, మహిళలు, మైనార్టీలు అంటే ముస్లింల సంక్షేమం పేరిట 500కు పైగా వస్తువులను బహుమతుల జాబితాలో చేర్చాయి. హిందుత్వ పార్టీగా, ధనికులకు అనుకూలమైన పార్టీగా గిట్టనివారు బురదజల్లుతున్న బీజేపీ సైతం దాతృత్వంలో కొద్దో గొప్పో పోటీ పడాల్సి వచ్చింది. ఇందిర కాలం నుంచి సోనియా కుటుంబం నేతృత్వం వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు గరీబీ హఠావో (పేదరికం నిర్మూలించాలి) నినాదం నుంచి మైనార్టీల అభ్యున్నతి, ముస్లిములకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేసింది. ఎస్సీలు లేదా ఎస్టీల సంక్షేమం పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి రావడం కోసం ముస్లిం, కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ ‌బాహటంగా పొత్తు పెట్టుకుంది.

తెలంగాణలో ప్రభుత్వం కొన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే గగ్గోలు వినిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ డిమాండ్‌ అత్యంత దారుణమైనది. ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ సేవకులు సంపదను సృష్టించలేరు. వారు సంపదను వాడుకుంటారు. ఒక విజ్ఞప్తిని సమర్పించుకోవడానికి లేదా న్యాయం కోసం, లేకుంటే చేసుకున్న ఫిర్యాదు పరిష్కారం కోసం దాదాపు ప్రతి పౌరుడు ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారుల్లో (సేవకులు కాదు స్వాములు) అనేక మంది ఎంత నిర్దయగా లంచం డిమాండ్‌ ‌చేసే వైనాన్ని అలాంటి పౌరులు వివరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు తమను నిస్సహాయులుగా చూడటమనేది ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించే వారికి సర్వ సాధారణమే. అయితే పౌరులతో స్నేహపూర్వకంగా మెలగుతూ సమస్యలు పరిష్కరించే అధికారులు మనకు అరుదుగా తటస్థపడుతుంటారు. మనకు కావాల్సింది ఉత్తమ పరిపాలనే తప్ప నిత్యం పదోన్నతులు, వేతనాల్లో పెంపుదల, తమకంటూ ప్రత్యేక సంక్షేమం కోసం పట్టుబట్టే మరింత మంది ప్రభుత్వ అధికారులు కాదు. ఒక నాన్‌ ‌గెజిటెడ్‌ ‌ప్రభుత్వ అధికారికి ఎంతలేదన్నా ఏడాదికి రూ.3,00,00లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి చొప్పున 3 లక్షల రూపాయలతో 8 మంది నిరుద్యోగు లకు ప్రయోజనం చేకూరుతుంది! ఉపాధి ఉన్నది ఉత్పాదకతతో కూడిన పని చేయడానికి, సంపదను సృష్టించడానికి. ప్రభుత్వం పని చేయాల్సింది సంపదను సృష్టించేందుకు సహకరించడానికి. అందరికీ విద్య, ఆరోగ్య సంరక్షణ, శాంతి, భద్రతలను కాపాడటానికి. అందరికీ న్యాయం ఒనగూరేలా చూడటం, భారతదేశ రక్షణ.. ప్రభుత్వం తప్పనిసరిగా, చట్టబద్ధంగా నిర్వహించాల్సిన విధులు. మిగతావన్నీ జరగడానికి మార్గం చూపాల్సినవే తప్ప కార్య నిర్వహణ సంబంధితమైనవి కాదు.

ఈ సందర్భంగా కొన్ని సుభాషితాలను స్మరించుకోవడం ఉత్తమం:

‘‘ప్రభుత్వం పనిచేస్తున్నదంటే దానర్థం అది ప్రజల వినాశనానికే. అదే ప్రభుత్వాలు అప్పులు చేసి లేదా అధిక పన్నులు విధించి సంపన్నమైతే ప్రజలు పేదలైపోతారు’’ అని సాధువు తిరువళ్ళువర్‌ ‌చాలా ఏళ్ల క్రితమే చెప్పారు.

‘‘ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నైతిక విలువలు పాటిస్తూ గౌరవం, ధైర్య సాహసాల పథంలో పయనించేవారు ఉత్తమ పాలకులవుతారు’’ అని సైతం తిరువళ్ళువర్‌ ‌తెలిపారు.

గొప్ప మేధావి, దేశభక్తిపరుడు, న్యాయ కోవిదుడైన నానీ ఫాల్కీవాలా చెప్పిన కొన్ని సూక్తులను ఒకసారి గుర్తు చేసుకుందాం:

–   భారతదేశంలో సామ్యవాదానికి మోసపూరిత అనుసరణే ఉంది. మన ఘనత వహించిన సామ్యవాదం సంపదను ధనవంతుల నుంచి పేదలకు బదలాయించడానికి బదులుగా నిజాయతీపరుడైన ధనికుల నుంచి నిజాయతీ లోపించిన ధనికులకు బదలీ అవుతున్నది.

–   నిద్రా రోగంతో జోగుతున్న సామ్యవాదాన్ని ప్రస్తుతం ప్రపంచమంతా గుర్తించినప్పటికీ.. భారతదేశంలో అధికారికంగా ఆ పని జరగలేదు.

–   మన ప్రభుత్వ రంగ సంస్థలు కృష్ణబిలాలు. సొమ్మును స్వాహా చేస్తుంటాయి. భారతదేశంపై రుద్దిన సామ్యవాదం కోసం అవి భారీ మూల్యాన్ని చెల్లిస్తూనే ఉన్నాయి.

–     సర్వసత్తాక భారతదేశం మొదటి 50 సంవత్సరాల్లో ఆ తర్వాత చేసిన భారీ తప్పిదాన్ని చరిత్ర నమోదు చేస్తుంది. అదేమిటంటే.. ఆనకట్టలు, కర్మాగారాల నిర్మాణానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. మానవ వనరులకు సంబంధించిన విద్య, కుటుంబ నియంత్రణ, పౌష్టికాహారం, ప్రజారోగ్యానికి చాలా తక్కువగా ఖర్చు చేసింది.

–    అధికంగా పన్నుల వడ్డింపు జాతీయ వ్యక్తిత్వాన్ని అమితంగా అవినీతిమయం చేసింది. లోపాలనే ఊపిరిగా చేసుకొని కొనసాగుతున్న పన్నుల వ్యవస్థ, పన్ను ఎగవేత కిటికీ నుంచి గాలి పోసుకోవడానికి అలవాటుపడిన ఆర్థిక వ్యవస్థతోనే జాతి మనుగడ సాగిస్తోంది.

–     ప్రయోజనాల కోసం విన్నవించుకుంటూ, ఉద్రేకపడిపోయే ప్రజలను ప్రభుత్వాలు ఎక్కువ కాలం పాలించలేవు.

–    సామ్యవాదమనే మత్తులో ప్రజలను జోకొట్టే పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు అందరికన్నా అత్యంత సంతోషపరులుగా ఉంటారు.

–    సామాజిక న్యాయం కోసమే సామ్యవాదమనే సత్యాన్ని మనం పూర్తిగా విస్మరించాం. మత విశ్వాసానికి ఏ క్రతువును చేయాలి! సత్యానికి ఏ విశ్వాసాన్ని సూత్రీకరించాలి.

– డాక్టర్‌ ‌త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి, ప్రజ్ఞాభారతి ఛైర్మన్‌

అను: మహేష్‌ ‌ధూళిపాళ్ల

About Author

By editor

Twitter
YOUTUBE