దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం శుభ పరిణామం. మరణాల సంఖ్య ప్రస్తుతం ఎక్కువే కనిపిస్తున్నా జూన్ మొదటి వారానికి పరిస్థితి చాలావరకు అదుపులోకి వస్తుందని అంచనా. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండగా, వైద్యం చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ కొత్త ఉపద్రవం బ్లాక్ ఫంగస్. ఇప్పుడు ఈ కేసుల పెరుగుదల భయపెడుతోంది. నలుపు వెంట తెలుపు ఫంగస్ కూడా బయలుదేరింది. బ్లాక్ ఫంగస్‌ను అదుపు చేసేందుకు కేంద్రం దృష్టి సారించింది. మరోవైపు టీకాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచి కొరతను అధిగమించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. బ్లాక్ ఫంగస్ భయం ఒకవైపు, మూడో దశ కరోనా హెచ్చరికలు మరొక వైపు దేశ ప్రజలను ఇప్పటికీ కంగారు పెడుతూనే ఉన్నాయి.
కరోనా మహమ్మారి రెండో దశ ఉప్పెనలా విరుచుకుపడింది. ఈ ఆరోగ్య సంక్షోభాన్ని కేంద్రం ముందుగా ఊహించి హెచ్చరిస్తూ వచ్చినా, మార్గదర్శకాలను రూపొందించినా క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా లేకపోవడంతో భారీ నష్టం జరిగి పోయింది. ఒక దశలో రోజువారీ కేసులు నాలుగు లక్షలు, మరణాలు నాలుగు వేలు దాటాయి. కరోనా తొలి దశలో ఈ తీవ్రత లేదు. వైరస్ కొత్త వేరియంట్‌లో ప్రమాద తీవ్రత, వేగం, ప్రభావం అధికంగా ఉండటమే ఇందుకు కారణం.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. ఒక దశలో రోజూవారీ కేసుల సంఖ్య 11 వేలకు దగ్గరగా, మరణాలు 100కి దిగువగా వచ్చాయి. వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రావడంతో కరోనా క్షీణించిందనే అభిప్రాయం బలపడింది. అతి విశ్వాసం పెరిగింది. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేయాలని విపక్షాలు, కొన్ని శక్తులు ప్రయత్నించడం బాధ్యతా రాహిత్యమే. వాస్తవానికి కేంద్రం మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలు సూచించింది.
కరోనా కట్టడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచసూత్రాలను సూచించారు. 1.పరీక్షలు నిర్వహించడం, 2.కేసులను గుర్తించడం, 3.చికిత్స అందించడం, 4.కొవిడ్ నిబంధనలు పాటించడం, 5.వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం. ఇవి చాలా ముఖ్యమని కూడా ఆయన చెప్పారు. రాష్ట్రాలలో వైద్య పరంగా మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడంతో పాటు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కరోనా మొదటిదశలో ఆంక్షల అమలు బాధ్యతను కేంద్రం నేరుగా పర్యవేక్షించినప్పుడు, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు గుప్పించారు. దీంతో ఈ బాధ్యతను రాష్ట్రాలకు వదిలేశారు. అయితే కరోనా రెండో దశ తీవ్రత పెరిగే వరకూ చర్యలు చేపట్టకుండా కొన్ని రాష్ట్రాలు ఉపేక్షించాయి. దీని ప్రభావం దేశమంతటా పడింది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల అలసత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన పరిస్థితి చేయి దాటిన తరువాత లాక్‌డౌన్, కర్ఫ్యూలు విధించారు.
తగ్గుముఖం పడుతున్న కేసులు
గత రెండు వారాలుగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒక దశలో నాలుగు లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 2.60 లక్షల దిగువకు వచ్చింది. మే 21 తేదీ నాటి సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 2,57,299. ఒక్క రోజులో కోలుకున్న వారు 3,57,630. వరసగా 9వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. రికవరీ రేటు 87.76 శాతంగా ఉంది. మే 21 తేదీన దేశ వ్యాప్తంగా వైద్యం తీసుకుంటున్న వారి సంఖ్య 29,23,400, ఈ కేసుల సంఖ్య దిగి రావడం శుభపరిణామం. యాక్టివ్ కేసుల శాతం 11.12గా ఉంది. కరోనా తీవ్రత తగ్గుతున్న విషయాన్ని చాలామంది వైద్య నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. అంత మాత్రాన జాగ్రత్తలు అవసరం లేదని కాదు.
కానీ, ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా రోజూవారీ మరణాల సంఖ్య 4 వేలకు పైగానే కొనసాగుతోంది. మే 21వ తేదీన ఒక్క రోజు నమోదైన మరణాలు 4,194. మహారాష్ట్ర (1,263), తమిళనాడు (467)లలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా మే 21వ తేదీ వరకూ కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 2,62,89,290. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా 2,95,525 మంది మృత్యువాత పడ్డారు. 2,30,70,365 మంది కోలుకున్నారు. కొత్తకేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరణాల సంఖ్య కూడా జూన్ మొదటివారం నుంచి గణనీయంగా తగ్గుముఖం పట్టవచ్చు.
కేసుల్లో 13 శాతం తగ్గుదల
గతవారం రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు 13 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటనలో తెలిపింది. మే 16 వరకు నమోదైన కేసులను.. అంతకు ముందు వారంతో పోలిస్తే గత వారం తాజా కేసుల్లో 13శాతం, మరణాల్లో 5శాతం తగ్గుదల ఉన్నట్లు వారాంతపు నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తాజా కేసులు నమోదవుతున్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్ ఉండగా, తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, అమెరికా, అర్జంటీనా, కొలంబియా ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో నేపాల్, ఇండోనేసియా ఉన్నాయి.
దేశంలోని 7 రాష్ట్రాల్లోనే నిత్యం 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 6 రాష్ట్రాల్లో నిత్యం 5 నుంచి 10వేల కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 93కు పైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
విరుచుకుపడ్డ బ్లాక్ ఫంగస్
రెండో దశ కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తున్న మరో ముప్పు బ్లాక్ ఫంగస్. వైద్య పరిభాషలో ‘మ్యుకర్‌మైకోసిస్’ అని పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో అత్యధికంగా 2,281 మందికి ఈ వ్యాధి సోకగా మహారాష్ట్రలో 2,000, ఆంధప్రదేశ్‌లో 910 మంది దీని బారిన పడ్డారు. మొత్తం కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల వాటా 58.66 శాతంగా ఉందని తెలిపింది. వైట్ ఫంగస్ కూడా కొంత కంగారు పెట్టింది.
మ్యుకర్ మైకోసిస్ సాధారణంగా ముక్కు, సైనస్, నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులు, చర్మం, దవడ ఎముకలు, కీళ్లు, గుండె, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో ప్రస్తుతం ఈ ఇన్‌ఫెక్షన్‌ను ముక్కు, సైనస్ ప్రాంతాల్లో ఎక్కువగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండి తెల్ల రక్తకణాల సంఖ్య తక్కువ ఉన్నవారిలో ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ఇక ఇదేమీ కొత్త వ్యాధి కాకపోయినా దీని బారినపడిన వారికి రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మన శరీరంలోని రక్షణ వ్యవస్థ ఈ ఫంగల్ వ్యాధిని తిప్పికొడుతుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి చికిత్సలు చేయించు కున్నవారు దీని బారిన పడే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మరోవైపు ఇది అంటువ్యాధి కాదని అమెరికన్ సంస్థ సీడీసీ చెప్పడం కొంత సాంత్వన.
కరోనా కట్టడికి చేసే వైద్యంలో స్టెరాయిడ్స్ వాడడం వల్ల, వైరస్ బారి నుంచి బయటపడిన తరువాత బ్లాక్ ఫంగస్‌కి గురవుతున్నారని గుర్తించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్టికో స్టెరాయిడ్స్ వినియోగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణలు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల ఆధారంగా పరిశీలిస్తే వారిలో 79శాతం మంది పురుషులే ఉన్నట్లు పరిశోధకులు అంటున్నారు. ఇది సోకిన వందమందిలో 83 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులే. వీరిలో మరణాల శాతం కూడా ఎక్కువ. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న డయాబెటిక్ పేషెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచించారు. కరోనా పూర్తిగా తగ్గక ముందే శరీరం ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుండగా, కొవిడ్ తగ్గాకనే వ్యాధి బయటపడు తుండడంతో సమస్య ఎదురవుతోంది. ఈ పరిశోధన కోసం భారత్ సహా అమెరికా, ఇరాన్‌లో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ రోగులను పరిశీలించారు.
పెద్ద ఎత్తున ఔషధం సిద్ధం
బ్లాక్ ఫంగస్ కూడా మహమ్మారిగా ప్రకటించి రోగులకు అత్యవసర చికిత్స ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కొద్దిరోజులుగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల హెచ్చరిస్తూ వస్తోంది.
దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దీని చికిత్సలో వినియోగిస్తున్న ఆంఫోటెరిసిన్- బి ఔషధం ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కొన్ని రోజుల కిందటి వరకూ ఆంఫోటెరిసిన్ పరిమిత స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే ఆరు సంస్థలు ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తుండగా, ఇప్పుడు మరో ఐదు కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ఈ ఐదు సంస్థలు జులైలోనే ఉత్పత్తి ప్రారంభిస్తాయని, నెలకు లక్షా 11 వేల వయల్స్ అందుబాటులోకి తీసుకొస్తాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం జూన్ వరకు దేశీయంగా ఆంఫోటెరిసిన్ వయల్స్ 5 లక్షల 70 వేలకు మించుతాయని స్పష్టం చేసింది.
టీకా ఉత్పత్తి వేగవంతం
కరోనా వైరస్ విజృంభించిన వేళ దేశంలో వ్యాక్సిన్ల కొరత సమస్యగా మారింది. ప్రారంభలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఉత్సాహం చూపని వారు కేసులు, మరణాల తీవ్రతను గమనించి ఒక్కసారిగా వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగు తీయడం ఒక కారణం. దీంతో దశల వారీగా చేపట్టిన వ్యాక్సినేషన్ క్రమం దెబ్బతిన్నది. దేశ వ్యాప్తంగా మే 21 నాటికి 19,32,97,222 డోసుల టీకాలు ఇచ్చారు. ఈ ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. టీకా పక్రియను వేగవంతం చేసేలా వ్యాక్సిన్ తయారీదారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మరికొన్ని వారాల్లో దేశంలో టీకా ఉత్పత్తి వేగవంతం అవుతుందని, తద్వారా వ్యాక్సిన్ కొరత తీరుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. జూలై నెలాఖరుకు 51 కోట్ల వ్యాక్సిన్ డోసుల సేకరణ పూర్తవుతుందని ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యలో 216 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు ఇస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి కూడా ఈ వారం అందుబాటులోకి వచ్చింది.
420 మంది వైద్యుల మృతి
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా అంకితభావంతో సేవలను అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్‌లో కొవిడ్ సోకి 420 మందికిపైగా వైద్యులు కన్నుమూసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఒక్క వారంలోనే కరోనా వైరస్ కారణంగా 270 మంది వైద్యులు మరణించినట్లు తెలిపింది. వీరిలో 100 మందికిపైగా ఢిల్లీకి చెందిన వారే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వివరాల ప్రకారం కరోనా మొదటి దశలో 748 మంది వైద్యులు మరణించారు. ఐఎంఎఫ్ దాదాపు 3.35 లక్షల మంది సభ్యుల సమాచారాన్ని మాత్రమే రికార్డు చేసి ఉంచుతుంది. అయితే దేశంలో 12 లక్షలకు పైగా వైద్యులు ఉన్నారు.
మరో ప్రమాదకర మ్యూటెంట్
దేశంలో మరో ప్రమాదకర కరోనా వైరస్ మ్యూటెంట్‌ను గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో శరవేగంగా విస్తరిస్తున్న బి.1.618 రకం కరోనాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ నిపుణులు ఈ మ్యూటెంట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. శరీరంలోని యాంటీబాడీస్, ప్లాస్మా ప్యానెల్స్ నుంచి తప్పించుకునే శక్తి దీనికుందని నిపుణులు స్పష్టం చేశారు. ప్రపంచంలో మరికొన్ని దేశాల్లోని ఈ తరహా డబుల్ మ్యుటేషన్లతో పోలిస్తే భారత్‌లో గుర్తించిన రకం అత్యంత ప్రమాదకారి అని నిపుణులు పేర్కొన్నారు. బెంగాల్‌లో బి.1.617 తోపాటు బి.1.618 అనే మరో రకం మ్యూటెంట్ కూడా వేగంగా వ్యాప్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మ్యూటెంట్‌లు రీ-ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ ప్రభావాన్ని దాటి ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తాయా అన్న అంశంపై శాస్త్రవేత్తలు మరిన్ని అధ్యయనాలు చేస్తున్నారు.
ప్రధాని భావోద్వేగం
ప్రధాని మరొకసారి తీవ్రంగా హెచ్చరించారు. ఒకవైపు కరోనా మహమ్మారితో పోరాడుతున్న క్రమంలో, మరోవైపు బ్లాక్ ఫంగస్ ఎదురైన నేపథ్యంలో ఈ పరిస్థితిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు మనం జాగ్రత్తలు పాటిస్తూ సంసిద్ధం కావాలని ప్రధాని మోదీ సూచించారు. ‘‘ఉమ్మడి కృషితో మహమ్మారిని కొంతమేరకు నిలువరించగలిగాం. అయితే- ఇది సంతృప్తి చెందే సమయం కాదు. దీర్ఘకాలంపాటు పోరాటం కొనసాగించాలి. రోగులకు ఇంటి వద్దే చికిత్స అందించడం ద్వారా ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గించవచ్చు. ఇందుకోసం టెలీమెడిసిన్ వంటి సదుపాయాలను వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలి. యువ, విశ్రాంత వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి’’ అని ప్రధాని సూచించారు. కరోనాపై పోరులో వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, వార్డ్‌బాయ్‌లు, అంబులెన్సు డ్రైవర్ల కృషిని ఆయన కొనియాడారు. కరోనా నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు టీకా అత్యంత కీలకమని ప్రధాని మోదీ మరొకసారి గుర్తు చేశారు. వ్యాక్సిన్ పొందడం వల్లే ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఎలాంటి భయం లేకుండా సేవ చేయగలుగుతున్నారని చెప్పారు. కరోనాపై పోరులాగే టీకా కూడా సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. తమవంతు వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇటీవల ప్రధాని మోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఆరోగ్యరంగ నిపుణులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనాతో మృత్యువాతపడ్డవారిని తలచుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్తులెందరినో కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ‘‘మనకు ప్రియమైన అనేక మంది ప్రాణాలను ఈ వైరస్ బలి తీసుకుంది. వారందరికీ నివాళులర్పిస్తున్నా. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని కన్నీళ్లను ఆపుకొంటూ, గద్గద స్వరంతో సమావేశంలో మోదీ వ్యాఖ్యానించారు. కొవిడ్ రోగులకు ఇంటి వద్దే వైద్యం అందడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘రోగి ఎక్కడుంటే.. వైద్య సేవలు అక్కడే (జహాన్ బీమార్.. వహిన్ ఉపచార్)’ అనే కొత్త మంత్రాన్ని ఉపదేశించారు.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్
ఎంతమంది పెట్టుకుంటున్నారు మాస్క్?
కొవిడ్ 19 వైరస్‌ని సాటి పౌరులకు యథాశక్తిన పంచిపెట్టకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని నిపుణులు ఘోషిస్తున్నారు. సోదర సోదరీమణులారా! మాస్క్ తగిలించుకోండి అని మన ప్రధాని మొదలు, చాలామంది రాజకీయ ప్రముఖులు, వైద్యులు ఇక్కడ కూడా మొత్తుకుంటూనే ఉన్నారు. శానిటైజర్ విషయంలో సడలింపు ఇచ్చినట్టే ఉన్నా కూడా మాస్క్‌ని మన్నించడం లేదు. అదేదో ముగుతాడు అన్నట్టే భావిస్తున్నారు. మాస్క్‌తోనే ఆ మహమ్మారిని ఆపగలం అని ఎన్నో సందేశాలు వచ్చాయి. అయినా భారతీయులలో కేవలం 50 శాతమే ఆ సందేశాలనీ, హితోక్తులనీ బుద్ధిగా శిరసావహిస్తున్నారట. ఇది స్వయంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పిన నిజం. నగరాలూ, పట్టణాలలోనే కాదు, పల్లెటూళ్లు, గిరిజన గ్రామాలు కూడా దీని బారిన పడుతున్నప్పటికీ మాస్క్ ధారణ మీద ఇవాళ్టికీ మనవాళ్లకి శ్రద్ధ లేదని కూడా మంత్రిత్వ శాఖ ఆవేదన చెందుతోంది. 25 నగరాలలో సర్వే చేస్తే తేలినదేమిటీ అంటే, 64 శాతం మందికి మాస్క్ అనేది ముక్కును కచ్చితంగా కప్పి ఉంచాలన్న స్పృహ లేదని తేలింది. అంటే ఏదైతే వైరస్ వ్యాప్తికి మూలమని చెబుతున్నారో, ఆ ముక్కునే సూటిగా జాతి జనుల మీదకు గురి పెట్టి, గుండె నిండా స్వేచ్ఛగా తుమ్ముకోవడానికి వీలుగా ఉంచుతున్నారని అర్ధం చేసుకోవాలి. మరొక 20 శాతం మంది మాస్క్ గెడ్డానికి పరిమితం చేస్తున్నారు. ఇంకో రెండు శాతం ఉన్నారు, వీళ్లు మాస్క్‌ని కంఠహారం అన్నట్టు గొంతుకి తగిలించుకుంటున్నారట. అంటే మొక్కుబడి. కేవలం 14 శాతం ప్రజలు వైద్యులు, నిపుణులు చెప్పినట్టు పద్ధతిగా ముక్కునీ నోటినీ కూడా కప్పి ఉంచే రీతిలో తగిలించుకుంటున్నారు.