దేశ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ఆ సేవలూ, వాస్తవ అవసరాల మధ్య అంతరం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం చాలాకాలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తగిన శ్రద్ధ చూపకపోవడంతో ఈ రంగం అవసరమైన మేరకు విస్తరించలేదు. ఇవన్నీ ఉన్నా, ఆధునిక వైద్య పరికరాల వాడకంలోను, అధునాతన విధానాలను అభ్యసించడంలోను దేశం రెండు దశాబ్దాలలో వేగవంతమైన వృద్ధి సాధించిన మాటను మాత్రం విస్మరించలేం. కానీ కరోనా వంటి మహామ్మారి రాగానే మేడిపండు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఆరోగ్యాన్ని రాజ్యాంగం రాష్ట్ర జాబితాలో చేర్చింది. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వాల తక్కువ కేటాయింపులు చేసి, శ్రద్ధ చూపని కారణంగా వైద్యవసతి ఎప్పుడో ప్రవేశపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి దాటలేదు. పేరుకు 108, 104 ఉన్నా ఎప్పుడు మొరాయిస్తాయో అర్థం కాదు. ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు లేవన్న వాస్తవాన్ని గుర్తించే, ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను ఆశ్రయిస్తున్నాయి. ఇది సాధారణ పరిస్థితులలో గట్టెక్కడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగంలోనూ దేశ పరిశోధనలు అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత చిరకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య ప్రాజెక్టుల అమలును అవినీతిమయం చేశాయి. గత 70 ఏళ్లలో ప్రజారోగ్యంపై చూపిన బాధ్యతా రహితమైన ప్రవర్తన, నిర్వహణ ప్రభావం ఇప్పుడు కనిపిస్తున్నది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ మౌలిక సదుపాయాలు కనీస ప్రమాణాలకు చేరుకోలేదు. కొవిడ్19 వంటి మహమ్మారి ప్రభావం ఉన్నప్పుడు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సమన్వయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనేది నిజం. అలాగే అన్ని ప్రభుత్వాలు అందుబాటులో ఉన్న వనరులతో సరైన ఆదేశాలు ఇచ్చి ప్రజలకు సహాయం చేయాలి.
కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందంటూ ఇప్పుడు వినివస్తున్న మాటలను ఒక్కసారి పక్కన పెడదాం. అవి ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత దాడులు. అదే సమయంలో కేంద్రం నిజంగానే ఈ మహమ్మారి పట్ల సరిగా స్పందించలేదా అన్నది కూడా సమీక్షించుకోవాలి. ఒకటి- సరైన సమయంలో మార్గదర్శకాలను విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో లాక్‌డౌన్‌ను విజయవంతంగా కేంద్రం అమలు చేసింది. రెండు- వలస కార్మికుల తరలింపులో ఇబ్బంది వాస్తవమే అయినా సాధ్యమైనంత వరకు వారికోసం కేంద్రం రవాణా, ఆహరం, నిత్యావసర వస్తువులు ఉచితంగా సమకూర్చింది. మూడు- కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆరుదశల్లో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ఆర్బీఐ సమన్వయంతో అన్ని వర్గాలను, అన్ని రంగాలను ఆదుకోవడానికి సమయానుకూలంగా ప్రకటించింది. దార్యిద్రరేఖ దిగువ (బీపీఎల్) కుటుంబాల వారికి గరీబ్ కల్యాణ్ యోజన బాగా పనిచేసింది కూడా. పరిస్థితులను గమనిస్తూ దశలవారీగా అన్‌లాక్ చేయడం గమనార్హం.
కొవిడ్ 19, లాక్‌డౌన్‌ల అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక స్థితి దెబ్బతిన్నదని మనందరికీ తెలుసు. ఈ అనిశ్చితి వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ 2020-21 సంవత్సరపు నాల్గవ త్రైమాసికంలో నెమ్మదిగా పుంజుకుంది. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12% వృద్ధిని అంచనా వేశారు. కొవిడ్ 19 మహమ్మారి నుండి, ప్రతికూల ప్రభావం నుండి బయటపడుతున్నామని భావిస్తున్న తరుణంలో రెండో దఫా కొవిడ్ నెలరోజులుగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.
రాజ్యాంగం ప్రకారమే ఫెడరల్ వ్యవస్థలో నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నప్పటికీ ప్రతి సమస్యను ప్రతిపక్షం రాజకీయం చేయడానికి చూస్తున్నది. మోదీపై దుష్ప్రచారం చేసే దృష్టినే కొనసాగిస్తున్నది. ప్రజలు ఎప్పుడూ సమర్థ నాయకత్వంపై అధిక అంచనాలను కలిగి ఉంటారు. విపక్షం అలాంటి నాయకత్వంపై బురద చల్లేందుకు నిరంతర ప్రయత్నం చేస్తుంది. కొవిడ్ 19 నేపథ్యంలో మోదీపై జరుగుతున్నది ఇదే.
కొవిడ్ 19 రెండవదశ నేపథ్యంలో ప్రతిపక్షాలు మోదీపై చేసిన ఆరోపణలు:
ఎ) ప్రతి 10,000 జనాభాకు 8.6 వైద్యులు, 5 పడకలు ఉన్నట్టు ఈ మధ్య ఒక పత్రికలో వ్యాసం ప్రచురించారు.
బి) టీకాల పరిశోధన కోసం సహాయం, వాటి పనితీరుపై ఆరోపణలు చేశారు.మన అవసరాలు తీరకుండా ఎందుకు టీకాలు ఎగుమతి చేసారని కూడా ఆరోపించారు.
సి) ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఉద్దేశించిన రూ.50 లక్షల బీమా తొలగించారన్న అసత్య ప్రచారం.
డి) వైద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాల మీద నిందలు.
కరోనా వంటి తీవ్ర పరిస్థితులలో అంతా బాగానే ఉందనీ లేదా అసలు ఏమీ బాగాలేదని చెప్పకూడదు. వాస్తవిక దృష్టితో, సమన్వయంతో సమస్యను పరిష్క రించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. రాజకీల లబ్ధికి అర్రులు చాచడం అనైతికం.
ఇంతకీ పై ఆరోపణల గురించిన వాస్తవాలేమిటి? ఆ వార్తాపత్రిక వ్యాసం ప్రకారం, ప్రతి 10,000 మందికి 8.6 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. ఆసుపత్రిలో 5 పడకలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి గత 6 లేదా 7 ఏళ్లలోనే అకస్మాత్తుగా ఉద్భవించిందని ఏవరైనా చెప్పగలరా? లేక ఈ 74 సంవత్సరాల పాలన ఫలితమా? ఆలోచించాలి. కొవిడ్ 19 సమయంలో వైద్యసేవలో ఎదురైన వాస్తవిక సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఎదురైన సంగతిని మనం గమనించాం. ఇప్పుడూ చూస్తున్నాం. ఈ రెండోదశ కొవిడ్‌తో ఇక్కడైనా సంతోషంగా ఉన్నవారు ఏవరూ లేరు. కానీ, ప్రస్తుత పరిస్థితులలో సమృద్ధిగా వనరులు ఉన్న దేశాలతో పోల్చితే పరిస్థితిని చక్కదిద్దడంలో మన దేశ యంత్రాంగం సహేతుకంగా, మెరుగ్గా వ్యవహరించింది. మహమ్మారిని ఎదుర్కోవ టానికి స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం జరుగుతోంది. ఇంతకీ ప్రస్తుత డేటా ప్రకారం వైద్య రంగ మౌలిక సదుపాయాల లోటుకు; మానవ, యంత్ర వనరుల లభ్యత కొరత గురించి ఎవరిని నిందించాలి?
రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని విషయం. అయితే ప్రతి రాష్ట్రం ప్రాథమిక వైద్య మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులపైనే ఆధారపడుతున్నది. దేశానికి స్వతంత్రం సిద్ధించిన తరువాత దేశ జనాభాకు అవసరమైన మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ప్రయోగశాలలు నెలకొల్పడానికి జాగ్రత్తలు తీసుకోలేదు. కానీ, 2014 సంవత్సరం తరువాత ఆధునిక వైద్యశాలలు, వైద్య కళాశాలలు పెంచే చర్యలు చేసినా, అవి పూర్తి సేవలు అందించే స్థాయికి చేరుకున్నాయని ఇప్పటికిప్పుడు చెప్పడం అతిశయోక్తి అవుతుంది.
1999 నుంచి 2004 మధ్యలో నాటి ప్రధాని వాజపేయి అడ్వాన్స్‌డ్ మెడికల్ ఇనిస్టిట్యూషన్స్ కోసం ఆరు ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటు చేయడానికి తొలి అడుగు వేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2003 వరకు కాంగ్రెస్ పాలనలో రెండు ఎయిమ్స్ సంస్థలు మాత్రమే స్థాపించారు. 2013 సంవత్సరంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాయ్‌బరేలిలో ఒక ఎయిమ్స్ స్థాపించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 22 అధునాతన ప్రీమియర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్-ఎయిమ్స్ లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వీటిలో 16 ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. మిగిలిన 6 చివరి దశ పనులు పూర్తి చేసుకుని సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. గత ఏడేళ్లుగా మోదీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో 150కి పైగా మెడికల్ కాలేజీలు ఏర్పాటుకోసం కృషి ఆరంభించింది. ఈ చర్యల తరువాత, 2014 అనంతరం దేశంలో 30,000కి పైగా మెడికల్ సీట్లు పెరిగాయి, మొత్తం మెడికల్ సీట్లు అంతకుముందు 50,000 మాత్రమే. ఇప్పుడు 80,000. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల ప్రజలకు రూ. 50 వేల నుండి 5 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలను అందించడానికి మోదీ ఆయుష్మాన్ భారత్ నెట్‌వర్క్ హాస్పిటల్లో ప్రవేశపెట్టారు. ప్రజారోగ్య రక్షణ కోసం 1.50 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లని ప్రకటించారు.
కొవిడ్ 19 పైన యుద్ధానికి బడ్జెట్ కేటాయింపులే కాకుండా వివిధ వనరుల నుండి నిధులు సేకరించే ఉద్దేశంతో PM CARES స్థాపించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్లకు పైగా దాతలు నుంచి PM CARES విరాళాలు వచ్చాయి. దానిని అత్యవసర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేశారు.
– ఆంధప్రదేశ్ మెడ్‌టెక్ జోన్, ఇతర సంస్థల చేత 2 వేల కోట్ల రూపాయలతో 50,000 పైగా వెంటిలేటర్లు తయారు చేయించి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ఆసుపత్రులకు అందించారు.
– PM CARES ద్వారా వలస కార్మికులకు ఆహారం, వసతి, రవాణా , వైద్య చికిత్స కోసం రూ. 1000 కోట్లు విడుదల చేశారు.
– స్వదేశీ టీకాల ప్రయోగాలు కోసం కేటాయించిన నిధులు రూ.100 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఫ్రంట్‌లైన్ వారియర్స్ కోసం మొదటి దశ టీకా డ్రైవ్‌లో 82% ఖర్చును అంటే రూ. 2,220 కోట్లు PM CARES ద్వారా వినియోగించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు ప్రకటించిన 162 ఆసుపత్రులకు అదనంగా మరో 100 ప్రభుత్వ ఆసుపత్రులకు PM CARES ద్వారా తమ సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ప్రకటించింది.
మరోవైపు, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగం కోసం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ .2,23,846 కోట్ల బడ్జెట్‌లో కేటాయించారు. 2020-21 సంవత్సరంలో రూ 94,452 కోట్లతో పోలిస్తే 137 శాతం పెరుగుదల. కొవిడ్ వ్యాక్సిన్ల కోసం రూ. 35,000 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించింది.
ఇన్ని వాస్తవాలు ఉన్నా విపక్షాలు నిందలు కురిపిస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలు ప్రజలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి రూ. 50 లక్షల బీమా అమలు చేస్తుండగా,ఆ సదుపాయం లేదంటూ దుష్ప్రచారం చేసే స్థాయికి దిగజారారు. 2021 ఏప్రిల్ 24 నాటికి బీమా ఏజెన్సీతో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రకటించిన బీమా ఒప్పంద కాలపరిమితి పూర్తైన సంధర్భంగా, ఈ కాలంలోని అన్ని క్లెయిములు పరిష్కరించి మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్స్ బీమా కొనసాగింపునుకు ప్రీమియం చెల్లించేలోపు ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీయడం భాధ్యత కలిగిన వారు చేసే పనేనా?
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వదేశీ టీకాల పనితీరే లక్ష్యంగా ప్రతికూల విమర్శలు చేశారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు తాము స్వదేశీ వ్యాక్సిన్ తీసుకోమని ప్రకటించారు. ఈ మాటలు పట్టించుకోని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఆత్మనిర్భర్ వ్యాక్సిన్ తయారీకి భారతీయ సంస్థలను ప్రోత్సహించిన బ్రాండ్ అంబాసెడర్‌గా నిలిచారు. చరిత్ర పరిశీలిస్తే, ఇటువంటి పరిస్థితులలో మనదేశం ఎల్లప్పుడూ టీకా దిగుమతులపై ఆధారపడతూ ప్రపంచం వైపు చూసేదన్న వాస్తవం తెలుస్తుంది. ఇప్పుడు మోదీ పాలనలో భారత సహాయం కోసం ప్రపంచం చూస్తోంది. స్వదేశీ వ్యాక్సిన్‌పై ప్రతికూలంగా వ్యాఖ్యానించిన వారు ఇప్పుడు ప్రజలకు విజయవంతంగా టీకాలు వేయడానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని ఆదేశించింది. దీనికి అవసరమైన ఉత్పత్తి పెంచడానికి రూ. 4,500 కోట్లు రుణం కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌కు రుణం ద్వారా ఆర్థిక సహాయం అందించింది. మరోవంక, మే, 2021 నుండి మూడవదశ డ్రైవ్‌లో భాగంగా ప్రజలకు టీకా వేగవంతంగా వేయడానికి భారీ పక్రియతో తయారీ సంస్థల నుండి నేరుగా టీకా ఉత్పత్తిలో 50% రాష్ట్ర ప్రభుత్వాలకు అదించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మొత్తం టీకా ఉత్పత్తిలో, ఇతర దేశాలకు సహాయం అందించడానికి అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. టీకా ప్రయోగాల కోసం, ఆర్థిక, సాంకేతిక సహాయం, నాణ్యత ఆమోదాలు కోసం అంతర్జాతీయ ఏజెన్సీల సేవలను తీసిపారేయలేం.
చివరగా, కొవిడ్ 19 రెండోదశలో ఆక్సిజన్ లభ్యత ముఖ్యమైనది. ఈ అంశం గురించి కూడా అవాస్తవాలు అంబరాన్ని అంటాయంటే అతిశయోక్తి కాదు. దేశంలో వివిధ ప్రాంతాలలో గుర్తించిన 100 ప్రభుత్వ ఆస్పత్రులకు PM CARES ఫండ్ కింద సొంత ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సహయం అందిస్తున్నారు. ఏ ఇబ్బంది రాకుండా ఇంకా 50,000 మెట్రిక్ టన్నుల వైద్య ఆక్సిజన్ సకాలంలో రప్పించడానికి కేంద్రం ప్రణాళికలు అమలు చేస్తున్నది. అవసరమైన వైద్య పరికరాలు, ఆక్సిజన్ లభ్యత కోసం అత్యవసర దిగుమతిలను వేగవంతం చేసింది. ఈ కీలక సమయంలో తమ రాజకీయ వికృత చేష్టలు చేసేవారిని పట్టించుకోవడం కంటే, సమయాన్ని ఇబ్బందులను పరిష్కరించేందుకు వినియోగించడం అవసరం. ప్రజలే అందరికంటే మేధావులు. అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారు.
– దినకర్ లంకా, బి.కామ్., ఎఫ్.సి.ఎ.