సంపాదకీయం
శాలివాహన 1943 శ్రీ ప్లవ వైశాఖ శుద్ధ పంచమి, 17 మే 2021, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
‘ఒక మతం వారు పర మతం పట్ల అసహనం ప్రదర్శించడానికి అనుమతిస్తే అది సెక్యులరిజానికి ఏమాత్రం క్షేమం కాదు. అలాగే ఒక మతవర్గం ప్రదర్శించిన ప్రతిఘటననే ఇతర మతవర్గం కూడా ప్రదర్శిస్తే అది ఉత్పాతానికి దారి తీస్తుంది’ మే 8వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు సారాంశమిది. నిజానికి ఇలాంటి తీర్పు మీడియాలో ఒక వర్గానికి పసందైన మేతను ప్రసాదించేదే. దురదృష్టవశాత్తు ఇది హిందువులకు అనుకూలంగా, హిందువుల మత హక్కును అడ్డగోలుగా ప్రతిఘటిస్తున్న ముస్లింలకు వ్యతిరేకంగా వెలువడడంతో సెక్యులర్ మీడియా ఎల్లెడెలా మౌనం దాల్చించింది.
తమిళనాడు, పెరంబలూరు జిల్లా, వి. కాళత్తూరు గ్రామంలో తరతరాలుగా హిందువులు జరుపుకుంటున్న దేవుడి ఊరేగింపును తమ ప్రాంతం గుండా అనుమతించబోమని ముస్లింలు అడ్డుపడి, ఆ మేరకు కోర్టును కూడా ఆశ్రయించడంతో రాష్ట్ర హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వవలసి వచ్చింది. హిందూ దేవుళ్ల ఊరేగింపులు ముస్లింలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం గుండా వెళితే ‘పాపం’ అంటుకుంటుందన్న కారణంగా ఆ వర్గం అడ్డు కుంటున్నది. దీని మీదనే జస్టిస్ ఎన్. కిరుబాకరాన్, జస్టిస్ పి. వేలుమురుగన్‌లతో కూడిన ధర్మాసనం ఆ కీలకమైన తీర్పును వెలువరించింది.
మొదటిగా ఈ కేసులోని కొన్ని వివరాలు చూద్దాం. చూడాలి కూడా! ఎందుకంటే, ఈ దేశంలో మెజారిటీ మతస్తులలో కంచు కాగడా వేసి చూసినా మత సహనం కనిపించదని కొందరు మూర్ఖుల నిశ్చితాభిప్రాయం. ఇక్కడ మైనారిటీలకు బతికే అవకాశం కూడా స్వల్పమేనని విదేశీ మీడియా, అంతర్జాతీయ హక్కుల దుకాణాల ప్రగాఢ విశ్వాసం. వాళ్లతో పాటు ఇక్కడ ఇదే పంథాలో వాదించే కుహనా సెక్యులరిస్టుల, ద్రవిడవాదుల, కమ్యూనిస్టుల కళ్లు కాస్తయినా తెరుచుకుంటాయేమోనన్న ఆశ. అక్కడి మూడు ఆలయాలలో పురాతన కాలం నుంచి ఉత్సవాలలో జరిపే ఉరేగింపు 2011 వరకు ప్రశాంతంగానే జరిగిందనీ, 2012 నుంచే సమస్య మొదలయిందనీ, ఇందుకు కారణం ఆ గ్రామంలోనే ఒక భాగంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలు అభ్యంతరం చెప్పడమేనని పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ కోర్టువారికి తెలియచేయడమే ఈ కేసుకో మలుపు. హిందూ దేవుళ్ల ఊరేగింపులు సాగితే పాపం చుట్టుకుంటుందని ముస్లింలకి కొత్తగా, హఠాత్తుగా జ్ఞానోదయం అయిందన్నమాట. చిత్రంగా 2012 నుంచి 2015 వరకు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు రక్షణలో గ్రామంలోని అన్ని వీధుల గుండా ఊరేగింపులు జరిగాయి. అంటే పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించడానికి కూడా హిందువులకి కోర్టు అనుమతి కావాల్సిందే. ఆ తరువాతే అభ్యంతరాలు మొదలయ్యాయని కోర్టు గుర్తు చేసింది. జిల్లా మునిసిపాలిటీల చట్టం 1920లోని 180-ఏ ప్రకారం రోడ్లమీద, వీధులలో ప్రవేశించడానికి మతం, కులం, తెగ ఆటంకం కారాదు. అవి ఏ మతానికీ చెందినవి కావు. ఒక ప్రదేశంలో ఒక మత వర్గంవారు అధిక సంఖ్యలో ఉన్నంత మాత్రాన ఇతర మతాల వారు, వర్గాల వారు అక్కడ అడుగుపెట్టరాదని చెప్పడం కుదరదని కూడా హైకోర్టు ఢంకా బజాయించింది. ఒక మతవర్గం వారు అధికంగా ఉన్నారు కాబట్టి, ఆ వీధులలోకి ఇతర మత వర్గాల వారి ఉత్సవాలను అనుమతించరాదంటూ ప్రైవేట్ రెస్పాండెంట్ చేసిన వాదనను ఆమోదిస్తే, ‘ఈ దేశంలో మైనారిటీలు ఎక్కువచోట్ల వారి ఊరేగింపులూ, ఉత్సవాలూ జరుపుకోవడం అసాధ్యమవుతుంది’ అని గొప్ప వాస్తవాన్ని ధర్మాసనం దేశం ముందు ఉంచింది. ఇది కేవలం కోర్టు వారి అంచనా. వాస్తవానికి మైనారిటీల మత హక్కును, అత్యధికంగా మెజారిటీలు ఉండే ప్రాంతాలలో కూడా హరించిన దాఖలాలు దాదాపు లేవు. అందుకే పరమత అసహనం ఏ రూపంలో ఉన్నా, ఏ వర్గం వారిదైనా దానిని నిలువరించవలసిందేనని మద్రాస్ హైకోర్టు కరాఖండీగా చెప్పింది. అయినా కొన్ని దశాబ్దాలుగా ఇరువర్గాలు కలసి చేసుకుంటున్న ఉత్సవం విషయంలో ఇప్పుడు ఈ విభేదాలు ఎందుకు వచ్చాయని కూడా ధర్మాసనం నిలదీసింది. నిజంగానే ధర్మాసనం వేసిన ఈ కీలక ప్రశ్నకు సమాధానం రావాలి.
ఈ కేసులో ఒక వర్గంవారి మత అసహనం సుస్పష్టమని హైకోర్టు ఎలాంటి శషభిషలు లేకుండా నిష్కర్షగా చెప్పింది. కానీ దేశం గమనించవలసిన అంశం- తమ మత అసహనానికి మీరు మద్దతు పలకాలని సాక్షాత్తు కోర్టు వారిని కోరే తెంపరితనం ఎక్కడ నుంచి వచ్చింది? తమిళనాడుతో పాటు రెండు రాష్ట్రాలలో కూడా హిందువుల విశ్వాసాలు, వారి ప్రార్ధనా స్థలాలు అంటే పెద్దగా గౌరవం లేని ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఆ నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. తమ సంప్రదాయాలను, ఉత్సవాలను సాంఘికంగా జరుపుకోవడానికి ఎవరినో ఆశ్రయించవలసిన దుస్థితి ఇక్కడ కొన్నిచోట్ల హిందువులు ఎదుర్కొంటున్న వాస్తవం కూడా మరొకసారి రుజువైంది. మనోభావాలకు వ్యతిరేకం అంటూ కన్యాకుమారి జిల్లాలో భారతమాత విగ్రహానికి ముసుగు వేయించిన ఘనత అక్కడి మైనారిటీలది. ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ ఆ భావనను హిందువులు ప్రదర్శించరు. ఆ భావనే బలపడి ఉంటే మత కలహాలతో ఈ దేశం ఒక రావణకాష్టంలా ఉండేది కాదా! కాబట్టి ఈ దేశంలో హక్కులు లేనివారు ఎవరు? మెజారిటీ హిందువులా? మైనారిటీలా? ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచిద్దాం!