శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైనది
– వల్లేరు మాధురి
‘సరయుని ఇంజనీరింగ్ చదివించావు. అది కూడా బాగానే చదువుకుంది కాబట్టి, అంతగా కావాలనుకుంటే ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకోమను. లేదా మన వాళ్లలోనే ఎవరైనా మంచి కుర్రాడికి ఇచ్చి చేసేస్తే సరి’ అంటూ మొదలెట్టింది మాణిక్యమ్మ.
కొన్నాళ్ల నుంచి రోజూ సాగుతున్న వ్యవహారమే కదా ఇదంతా అని, అసలు ఏమీ మారు మాట్లాడకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఉంది వైదేహి.
‘సరయు పసిపిల్ల. దానికంటే తెలీదు. దానికి అమ్మవి. కాస్త నయానో భయానో నువ్వు ఎలాగైనా నచ్చచెప్పాల్సింది పోయి, ఆడపిల్ల సైన్యంలో చేరుతానంటే ఎలా ఒప్పుకున్నావే పిచ్చి తల్లీ? సరేనని దానితో అనే ముందు, పెద్దదాన్ని నేను ఉన్నాను, నాకు ఒక మాట చెప్పాలని ఆలోచన కూడా రాలేదా?’ అని అడిగింది మాణిక్యమ్మ.
‘అమ్మా! నాకు టైం అయింది. హాస్పిటల్‌కి వెళ్లాలి, నువ్వు జాగ్రత్త. టిఫిన్ తినేసి మందులు వేసుకో. ఇరుగింటికీ పొరుగింటికీ అంటూ బయటకు వెళ్లకు. ఏదైనా అవసరానికి ఒకవేళ వెళ్లవలసి వస్తే మాస్కు పెట్టుకో.
ఆ………అమ్మా! చెప్పడం మర్చిపోయాను. దాన్ని ఏమీ అనకు. నీ మాటలతో దాన్ని విసిగించకు.
ఏదైనా ఉంటే సాయంత్రం నేను హాస్పిటల్ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం’ అంటూ రోజూ చెప్పే జాగ్రత్తలు చెప్పేసి తెల్లకోటు, స్టెతస్కోప్ తీసుకుని అర నిమిషంలో అక్కడ నుంచి బయలుదేరింది డాక్టర్ వైదేహి.
ఈ తల్లీకూతుళ్లు నన్ను ఇంట్లో నోరు తెరవనివ్వరు. అదేదో కరోనా అంట, దాని పుణ్యమా అని బయట నోరు తెరవకూడదు, అంతా నా కర్మ.. అను కుంటూ సరయూ.. సరయూ అని పిలిచింది.
‘ఏమిటే అమ్మమ్మా అంటూ గదిలో నుంచి బయటకు వచ్చింది’ సరయు.
‘ఆ పుస్తకాలు కాస్త ఇటు ఇచ్చి, కాసేపు నా దగ్గర కూర్చో’ అంది.
మాణిక్యమ్మకు పుస్తకాలంటే చాలా ఇష్టం. మంచి మంచి పుస్తకాలు, పురాణాల కథలూ చదువుతూ ఉంటుంది ఖాళీ సమయాల్లో.
పుస్తకాలు అందించి, అమ్మమ్మ పక్కనే కూర్చుంది సరయు.
‘అయినా ఆడపిల్లవి, నీకెందుకే ఈ సైన్యాలు అవన్నీ? హాయిగా పెళ్లి చేసుకొని ఓ బుడతడిని కని నా చేతిలో పెట్టు. మునిమనవడి ముచ్చట్లు కూడా చూస్తాను నా ఊపిరి ఉండగానే’ అంది మాణిక్యమ్మ.
‘అమ్మమ్మా రోజూ చెప్పిన మాటలే చెప్పి చెప్పి నన్ను విసిగించకు.’ అంటూ లేచి వెళ్లిపోయింది సరయు.
‘ఏమిటే? నేను విసిగిస్తున్నానా? నాకే దిక్కు దివాణం లేక మీ దగ్గర పడి ఉంటున్నాను, అనుకుంటున్నావా? ఐదుగురు పిల్లల్ని కన్న తల్లినే నేను.
ఏదో మగ దిక్కు లేని కుటుంబానికి నేను పెద్దదిక్కుగా అయినా ఉందామని గానీ, మీ దగ్గర మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకేం లేదు’ అంటూ అరిచింది మాణిక్యమ్మ.
‘అబ్బా ఏదో సరదాకి అన్నాలే, ఊరుకో అమ్మమ్మా’ అంది సరయు.
‘అయినా నా పిచ్చి కానీ, విత్తు ఒకటైతే చెట్టు మరొకటి అవుతుందా? తల్లికి తగ్గ కూతురు, కూతురు వంత పాడే తల్లి, సరిగ్గా సరిపోయారిద్దరూ’ అంది మాణిక్యమ్మ.
‘అవునులే కానీ అమ్మమ్మా.. నేను అయితే మా అమ్మ కూతుర్ని. మరి మా అమ్మ నీ కూతురేగా’ అంటూ చురక వేసింది లోపలి నుంచి సరయు.
పెద్దదాన్ని నా మాట ఎవరూ వినకపోయినా, దీనికి ఏ మాత్రం తక్కువ లేదు అంటూ ఇంకా ఏదో అనుకుంది మాణిక్యమ్మ.
ఆ కాలంలో మూడవ ఫారం దాకా, అంటే ఇప్పటి ఎనిమిదవ తరగతి దాకా చదువుకుంది మాణిక్యమ్మ. చదువంటే ఆసక్తి, చదివించి ఉంటే ఇంకా చదివేది. కానీ ఆడపిల్లకు చదువెందుకు అనుకునే రోజుల్లో పుట్టింది కదా. అన్నదమ్ములు చదువుకుంటూ ఉంటే, తనకి మాత్రం ఇంటి పనులు, పొలానికి సంగటి ముద్దలు మోసే పనులు అప్పగించారు పెద్దవాళ్లు.
పద్నాలుగు సంవత్సరాలకే మేనమామ సాంబయ్యతో పెళ్లి చేసారు అమ్మానాన్నలు. ఇక అప్పట్నుంచి చదువుల్లేవు, చట్టబండలు లేవు. ఇంటి, వంట పని, భర్తకు తోడుగా పొలంపని. బ్రతుకు బండిని లాగడంలో ప్రవేశం, అనుభవం కలిగాయి.
చూస్తూ చూస్తుండగానే ఐదుగురు పిల్లలకు తల్లి అయింది మాణిక్యమ్మ. నలుగురు మగపిల్లల తర్వాత పుట్టింది వైదేహి. వర్షాకాలంలో ఒకసారి, గాలివానకు తెగి కిందపడిన కరెంటు తీగ పట్టుకుని ప్రమాదవశాత్తు భర్త సాంబయ్య అర్ధాంతరంగా చనిపోయాడు. పొద్దున్నే పొలానికి వెళ్లినవాడు, కాసేపటికి పొద్దు వాలిన సూరీడు లాగా నిస్తేజంగా తిరిగి వచ్చాడు.
ఇక అప్పటినుండి సంసార భారం తనదే. పిల్లలను పెంచి పెద్ద చేసి, ఉన్నంతలో మంచి చదువులు చెప్పించింది. అందరూ బాగా బతుకు తున్నారు. చిన్న కూతురని, ఒకటే ఆడపిల్ల అనీ గారాబంగా పెంచింది వైదేహిని.
వైదేహి ప్రేమించానంటే భార్గవకి ఇచ్చి పెళ్లి చేసింది. ఓ ఏడాది తర్వాత సరయు పుట్టింది వాళ్లకి. మరో నాలుగేళ్లు గడిచాయి. అంతా బాగున్నారు. తను హాయిగా ఉండవచ్చు, బతుకు రథాన్ని ఇంక లాగక్కర్లేదు అనుకునే లోపే అల్లుడి మరణవార్త వినవలసి వచ్చింది. ఆమె ఆనందం కాస్తా ఆవిరై పోయింది.
తనలానే కూతురు కూడా భర్తను కోల్పోయి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందేమిటి భగవంతుడా, అని బాధపడని రోజంటూ లేదు ఆమెకు. మనవరాలి పెళ్లి చేసి, పిల్లాపాపలతో, భర్తతో సరయు ఆనందంగా ఉంటే చూడాలని ఆశ మాణిక్యమ్మకు.
సాయంత్రం వైదేహి హాస్పిటల్ నుంచి రాగానే ఏదోఒకటి తేల్చేయాలని గట్టిగా అనుకుంది. ఆ రాత్రి భోజనాలయ్యాక ధైర్యం కూడదీసుకుని వైదేహిని పిలిపించింది.
‘ఇలా దేశం, ఆదర్శమంటూ మాట్లాడే భార్గవని పెళ్లి చేసుకున్నావు. ఏమయిందీ, సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు భార్గవ. మూడు పదుల వయసు కూడా దాటకుండానే నీ మెడలో తాళి తెగింది. సరయు తండ్రి లేని పిల్ల అయింది.
కళకళలాడాల్సిన ఇంట్లో కన్నీటి సుడిగుండం రేగింది. అప్పటినుంచీ, ప్రాణాలన్నీ పిల్లమీద పెట్టుకొని బతుకుతున్నావు. మళ్లీ ఈ పసిదాన్ని కూడా ఆ దారిలోనే పంపిస్తానని అంటున్నావు. నా మాట విని దానికి నువ్వు నచ్చచెప్పు, నీ మాట కాదనదు. కాస్త నిదానంగా అయినా నిర్ణయం మార్చుకుంటుందేమో’ అంది మాణిక్యమ్మ.
వైదేహికి తెలుసు, తన తల్లి ఒంటరిగా పడ్డ కష్టాలు, బిడ్డల మీద ఆమెకున్న మమకారమే ఆమె చేత ఈరోజు అలా మాట్లాడిస్తున్నాయని.
‘అమ్మా నీకు గుర్తుందా? సరయుకి ఓ నాలుగేళ్లు ఉంటాయి అనుకుంటా అప్పుడు. భార్గవని జెండాలో కప్పి ఇంటికి తీసుకొస్తే చూసింది. నేను ఏడుస్తుంటే నా దగ్గరకు వచ్చిన దానికి, జెండా నాన్నను కౌగిలించుకుందని చెప్పాను.
మరుసటిరోజు, నాన్న ఎక్కడ అమ్మా? అని అది అడిగితే పైకి వెళ్లిపోయారు అని చెప్పాను. అప్పటి నుంచి ఎక్కడ జెండా రెపరెపలాడుతూ కనిపించినా, దాని నాన్నే అనుకునేది ఒక వయసు వచ్చేదాకా.
దేశంకోసం ప్రాణమిచ్చిన భార్గవ రక్తం కదా సరయుది. ఎవరూ నేర్పకుండానే దేశభక్తి దాని నరనరాల్లో నిండిపోయింది. భార్గవకు కప్పిన జెండా ఇంట్లో ఉంది కదా, ఇప్పటికీ అది గర్వంగా చూసుకుంటూనే ఉంటుంది ప్రతిరోజు. దాని ఆశను, ఆశయాన్ని మనం కాలరాయడం న్యాయమా అమ్మా?
ఇక, పెళ్లి అంటావా? దానికి నచ్చినప్పుడు, నచ్చిన వాడిని చేసుకుంటుంది. దాని పెళ్లికి ఇప్పుడే తొందరేముంది చెప్పు?.
అమ్మా ఒకవేళ ఇప్పుడు నీ ప్రాణం కోసం నేను ప్రాణం ఇవ్వాల్సి వస్తే వెనుకాడతానా? నా ప్రాణం మీదికి వస్తే నీ ప్రాణం ఇవ్వడానికి నువ్వు వెనకడు గేస్తావా?
నా తల్లికోసం నేను, నీ బిడ్డకోసం నువ్వు ప్రాణాల్ని కూడా లెక్కచేయం కదా అవసరమైతే. భార్గవ చేసింది కూడా అదే కదా. ఇప్పుడు సరయు చేయాలి అనుకుంటున్నది కూడా అదే. తన శక్తిని, శరీరాన్ని, ఊపిరిని మనందరి అమ్మకోసం, మనదేశం కోసమే ఇవ్వాలనుకుంటోంది అంతే కదమ్మా’ అంది వైదేహి.
‘అంతేనని అంత సులువుగా అంటావేమిటే? అందులోనూ సరయు ఆడపిల్ల కూడానూ’ అంది మాణిక్యమ్మ.
‘నువ్వు కూడా ఆడదానివే కదమ్మా. ఒక్కదానివే ధైర్యంగా నిలబడి ఐదుగురు పిల్లల్ని అన్నీ నువ్వై పెంచావు. మమ్మల్ని ఇంత వాళ్లన్ని చేశావు. ఆరోజు ఐదుగురు పిల్లలు, ఈ రోజు ఐదు కుటుంబాలు. ఒక గృహిణిగా కుటుంబాల్ని.. కుటుంబాల ద్వారా సమాజాన్ని నిర్మించే ఆడదానికి దేశాన్ని నడిపించే శక్తి ఉండదంటావా అమ్మా?’ అని అడిగింది వైదేహి.
‘ఎంతైనా ఆడవాళ్లు సున్నితంగా ఉంటారు, నువ్వెంత చెప్పినా ముక్కు పచ్చలారని బిడ్డను పంపడం నాకు మనస్కరించడం లేదే తల్లీ. పెద్దదాన్ని నా మాట అర్థం చేసుకో.’ అంటూ బ్రతిమాలింది మాణిక్యమ్మ.
‘కదన రంగాన కత్తి తిప్పిన ఝాన్సీ లక్ష్మీబాయి, ఓరుగల్లు రాచబిడ్డ కాకతీయుల రాణి రుద్రమదేవి, పల్నాటి పౌరుషాల నాయకురాలు నాగమ్మ లాంటి ఎందరో వీర వనితల పురిటిగడ్డ అమ్మా మనదేశం.
స్త్రీ రెండంచుల కత్తి లాంటిది. సున్నితంగా, సుకుమారంగా కనిపిస్తూ, ప్రేమామయ మాతృమూర్తి గానూ ఉండగలదు. శక్తి స్వరూపిణిగా, ఉగ్ర రూపిణిగా, మహిషాసుర మర్దినిగానూ ఉండగలదు. రాక్షస వధ చేసిన దేవతల్లో స్త్రీ స్వరూపాలు ఉన్నారని నీకు తెలియనిదేమీ కాదు కదా’ అంది వైదేహి.
మారు ఏమి మాట్లాడకపోయినా, ఇంకా తృప్తిపడని తల్లి మనసుని పసిగట్టింది వైదేహి.
‘స్త్రీ శక్తిని త్రిమూర్తులే గుర్తించారు. సృష్టికర్త అయిన బ్రహ్మ, సరస్వతి దేవిని నాలుక మీద నిలుపుకుంటే, సృష్టి పాలకుడైన విష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలాన నిలుపుకున్నాడు. ఇక సృష్టి లయకారకుడు శివుడు తన శరీరంలో అర్ధ భాగాన్ని పార్వతీ దేవికి ఇచ్చాడు.
ఇప్పుడు ప్రపంచం చాలా ముందుంది. అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు తమ సత్తా చాటుకుంటున్న రోజులు అమ్మా ఇవి. దేశ నిర్మాణంలో, రక్షణలో స్త్రీల అవసరం గుర్తించిన మన అత్యుత్తమ న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ మధ్యే ఆదేశాలు జారీ చేసింది.
అయినా మన సరయుకి ఏమీ భయంలేదు. ఓ వైపు చదువుకుంటూనే ఎన్.సి.సి. లోనూ బాగా రాణించింది. చాలామంది కలలు కనే రాజ్ పథ్ పెరేడ్‌కి వెళ్లింది, కవాతులో పాల్గొని దేశమంతా చూస్తుండగా ప్రెసిడెంట్‌కి సెల్యూట్ చేసిన అదృష్టం సరయుది. అందరికీ దక్కేది కాదు కదా ఈ అవకాశం. నువ్వింకేమి ఆలోచించకుండా ఒప్పుకో అమ్మా, అది చాలా సంతోషిస్తుంది’ అంటూ అమ్మ అంగీకారం కోసం చూస్తోంది వైదేహి.
‘అంతా సరే కాని ఒకవేళ వాళ్ల నాన్నలానే సరయుకి కూడా ఏదైనా……’ అంటూ మాటలు మింగేసి దుఃఖంతో చూస్తోంది మాణిక్యమ్మ.
తల్లి మాటలు పూర్తి కాకపోయినా, ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోగలిగింది వైదేహి.
‘ఏదైనా జరగరానిది జరిగితే అనేగా నీ భయం?
నువ్వు ఎప్పుడూ, ఒక శ్లోకం చెబుతుంటావు కదమ్మా.
‘‘అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ’’. అంటే అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా, చీకటి నుంచి వెలుగు వైపుగా, మరణం నుంచి అమృతత్వం వైపుగా సాగిపోవడమే మానవునికి అత్యుత్తమమైన ధర్మం అని, నా బిడ్డ మానవ ధర్మాన్ని సఫలీకృతంగా నెరవేర్చింది అనుకుంటాను అమ్మా’ అంది వైదేహి.
‘అయినా భార్గవని పోగొట్టుకున్నందుకు, నాకేం బాధ లేదమ్మా. వైద్యం చేసి రోగి ప్రాణాలు రక్షిస్తాడు డాక్టరు. యుద్ధంచేసి దేశాన్ని రక్షిస్తారు సైనికులు. నాకు సంబంధించినంత వరకు యుద్ధం కూడా వైద్యం లాంటిదే. విపత్కర పరిస్థితుల్లో, విజృంభిస్తున్న వైరస్‌కు భయపడి డాక్టర్లు, నర్సులు ఇంట్లో ఉంటున్నారా? ఓ వైపు తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, తోటి మనుషుల ప్రాణాలు కాపాడే పవిత్ర యాగంలో ఎలా నిమగ్నమై ఉన్నారో నువ్వే చూస్తున్నావు కదా!
ప్రాణాలకు భయపడి అందరూ ఇలానే ఆలోచిస్తే ఆపద వచ్చినప్పుడు ఆదుకునే వాళ్లు ఎవరమ్మా? ఈ దేశానికి అవసరం అయితే, సరిహద్దులో సైనికుడు మాత్రమే కాదు, ఇంట్లోని ఇల్లాలు, చంకలోని చంటిబిడ్డ, ఇంకా చెప్పాలంటే గర్భస్థ శిశువు, ఈ మట్టి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రాణాలు ఇవ్వడంలో తప్పు లేదమ్మా. మాతృభూమి కడుపుకోత ముందు నీది, నాది ఎంతమ్మా?
ఏ మనిషి అయినా చనిపోతే, అతని కుటుంబం మాత్రమే ఏడుస్తుంది, బాధ పడుతుంది. అదే ఓ సైనికుడు చనిపోతే దేశభక్తి నిండిన ప్రతి గుండెకు కన్నీళ్లు వస్తాయి. ఇంతటి అదృష్టం దక్కిన భార్గవకి భార్యను అయ్యాను నేను. అంత గొప్ప అదృష్టం నా బిడ్డకు దక్కనివ్వకుండా నేను ఎందుకు అడ్డు పడాలమ్మా?’ అంటూ ప్రశ్నించింది వైదేహి.
వైదేహి మాటలు విన్న మాణిక్యమ్మ కళ్లు చెమర్చాయి. స్త్రీ గృహిణిగా ఇంటిని, తల్లిగా బిడ్డలను రక్షిస్తే చాలనుకునే అమాయకత్వమో, బిడ్డల మీద మమకారం వలన కలిగిన అసహాయ స్థితో తెలియని మాణిక్యమ్మలోని తమస్సు పటాపంచలైంది.
వైదేహిని చూసి బిడ్డల్ని తీర్చిదిద్దే గృహిణి, దేశాన్ని నడిపించడానికి, రక్షించడానికి కీలకం కాగలదని తెలుసుకొని పొంగిపోయింది మాణిక్యమ్మ.
తనలా ఆలోచించే వారందరి భావజాలంలోని తమస్సులు నశించి, భారత భాగ్యోదయ జ్యోతిని వెలిగించే దివిటీలుగా సరయు లాంటి ఆడపిల్లలు ఎందరో ముందుకు రావాలని కోరుకుంటూ సరయుని మనసారా ఆశీర్వదించింది.