మే14న చందనోత్సవం

ఏడాది పొడవునా చందనలేపనంతో దర్శనమిచ్చే సింహగిరి వరహా నృసింహుడు అక్షయ తృతీయ నాడు (వైశాఖ శుక్ల తదియ) చందనోత్సవం పేరిట జరిగే కార్యక్రమంలో నిజరూప దర్శనం ఇస్తారు. పురూరవ చక్రవర్తికి స్వామివారు ఈ తిథినాడే మొదటిసారి దర్శనమిచ్చినందున అప్పటి నుంచే ఆ రోజున నిజరూప దర్శనభాగ్యం సంప్రదాయంగా వస్తోంది. అది భక్త జనావళికి పండుగరోజు.

పురాణగాథల ప్రకారం, స్తంభోద్భవుడు నృసింహుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ప్రహ్లాదుని కోరిక మేరకు వరహా నరసింహావతారాలు కలిపి ‘ద్వైయరూపాలు’ఒకటిగా సింహాద్రిపై అవతరించారు. తిరుమలపై వరాహామూర్తి, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ నృసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ రెండు అవతారాలు ఒకే మూర్తిగా అవతరించి అర్చనలు అందుకుంటోంది మాత్రం సింహాచలాధీశుడే. స్వామి వారు వరహముఖంతో, మానవదేహంతో, సింహవాలంతో అవతరించి ‘శ్రీ వరహ నృసింహమూర్తి’గా దర్శనమిస్తున్నారు. నరహరి కొలువుదీరిన కొండ సింహాకృతిలో ఉండడం వల్ల ‘సింహగిరి, సింహాద్రి’ అని, నృసింహస్వామి వేంచేసిన పర్వతం కనుక ‘సింహాచలం’ అని ప్రఖ్యాతి పొందిందని చెబుతారు. రెవెన్యూ రికార్డులలో మాత్రం ఈ గ్రామం ‘అడవివరం’ అనే నమోదైంది.


నృసింహుడు అనగానే ఉగ్రరూపం జ్ఞప్తికి రావడం సహజం. కానీ సింహాద్రి నాథుడు పరమ శాంతస్వరూపుడు.

‘కుదాంభ సుందర తనుః పరిపూర్ణ

చంద్రబింబానకారి వదన ద్విభుజ స్త్రినేత్రః

శాంతః త్రిభంగి లలితః క్షితి గుప్తపాదః

సింహాచలే జయతి దేవవరో నృసింహః’.. పసిడివర్ణంతో మెరిసిపోతూ చంద్రబింబమంత అందమైన ముఖలక్షణాలతో లలిత సుందరంగా త్రిభంగిలో వయ్యారంగా నిలిచి ఉంటాడు. జారిపోతున్న పీతాంబరాన్ని ముడి వేసుకోకుండా ఒకచేత పట్టుకొని, మరో చేతిని ఊరుపై ఉంచుకొని దర్శనమిస్తారు.

సనకసనందాదుల శాపం బారినపడిన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు. మూడు యుగాలలో విష్ణు ద్వేషులైన సోదరులుగా జన్మిస్తారు. రామకృష్ణావతారాలలో వారిద్దరూ ఒక్కొక్కరి చేతిలో శాపవిమోచనం పొందారు. కృతయుగంలో మాత్రం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సంహరణకు దేవదేవుడు రెండవతారాలు (వరహా, నరసింహ) దాల్చవలసి వచ్చింది.ఈ రెండు అవతారాలు ఒకటిగా శాంతమూర్తిగా దర్శనభాగ్యం కలిగించాలన్న ప్రహ్లాదుడి కోరికను మన్నించిన శ్రీహరి ఇలా సింహాచలేశ్వరుడయ్యాడు. స్వామి వారి ఆజ్ఞ మేరకు అహోబిలంలో నారసింహుడిని అర్చించిన ప్రహ్లాదుడు పాలనా బాధ్యతలు తన కుమారుడికి అప్పగించి సింహాచలానికి చేరుకొని స్వామిసేవలో తరించాడు.

ఆయన తరువాత అర్చనాదులు లేక స్వామిపై పుట్ట వెలిసిందంటారు. అనంతరం కాలంలో విహారానికి వచ్చిన పురూరవ చక్రవర్తికి స్వామివారు కలలో కనిపించి ‘నీ ఎదురుగా గల పుట్టలోనే నేనున్నాను. పాలతో పుట్టను కరిగించి పంచామృతాలతో అభిషేకించి, ధూపదీప నైవేద్యాలతో నన్ను అర్చించు. అనంతరం చందనలేపనం సమర్పించవలసిందిగా’ ఆదేశించినట్లు స్థల పురాణం చెబుతుంది.

తనను వెలికితీసిన రోజే (వైశాఖ శుద్ధ తదియ) భక్తులకు తన నిజరూప దర్శనం కలుగచేయాలని కూడా ఆదేశించారట. దరిమిలా స్వామి దేహం మీది పన్నెండు మణుగుల (480కిలోల) మట్టిని చక్రవర్తి పాలధారతో కరిగించారు. కానీ పాద నమస్కారం చేసుకోలేకపోయారు. ‘స్వామి పాదార్చన భాగ్యం కలుగలేదు కదా?’అని చక్రవర్తి ఆవేదన చెందుతుండగా, ‘దేవదేవుని పాదాలు కొండ పర్వతంలో దిగబడిన వైనాన్ని అశరీరవాణి వివరించిందట. చక్రవర్తి అనంతరం ఆయనకు వజ్రహారాలు సమర్పించి ఉత్సవం నిర్వహించాడు. ఆలయ గోపురాలు నిర్మించి, వేదమూర్తులను రప్పించి వారికి అగ్రహారాలు ఇచ్చి ఆలయనిర్వహణ బాధ్యతను అప్పగించారు.

చందనోత్సవం

అక్షయతృతీయ ముందునాడు బంగారు గొడ్డలి సహాయంతో స్వామి వారిపై గల చందనాన్ని తొలగిస్తారు. మరునాడు వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ఆలయ సమీపంలోని ‘గంగధార’తో సహస్ర కలశాభిషేకం నిర్వహించి నిజరూప దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఏడాది పొడవునా చందనలేపనంతో నిండి ఉండే దై్వ యరూపుడు ఆ రోజు పన్నెండు గంటల పాటు భక్తులకు నిజరూపంతో కనువిందు చేస్తారు. దర్శనానంతరం మళ్లీ అభిషేకం నిర్వహించి 120కిలోల చందనానికి అరవై రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు కలిపి స్వామివారికి లేపనం చేస్తారు. ఇలా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢపౌర్ణమి నాడు మొత్తం 480 కిలోల చందనాన్ని సమర్పిస్తారు. శ్రావణపూర్ణిమ నాడు మేలిముసుగు కరాళ చందన సమర్పణతో ఈ పక్రియ ముగుస్తుంది. చందనలేపనంతో స్వామి మూర్తి శివలింగాకృతిగా మారుతుంది. ఇది హరిహర అబేధానికి ఉదాహరణనని ఆధ్యాత్మికుల భావన.

అప్పన్న తెప్పోత్సవం

ఏటా పుష్యమాస అమావాస్యనాడు శ్రీకృష్ణ అలంకరణలో స్వామివారికి కొండ దిగువన వరహా పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. చందనోత్సవం తరువాత అంత ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు.

శ్రీమద్రామానుజులు, శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డిరాజులు తదితర ఎందరో ప్రముఖులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. శ్రీకృష్ణదేవరాయలు తమ మాతృమూర్తి నాగదేవమ్మ, సర్వారాయలు పేరిట స్వామివారికి కంఠమాల, వజ్రమాణిక్యాలు, కడియాలు, శంఖు చక్రాలు, పతకం మొదలైన ఆభరణాలు సమర్పించినట్లు ఆలయ ప్రాంగణంలో శాసనం చెబుతోంది. కంచి నుంచి కటకం వరకు పాలించిన అనేకమంది రాజులు, రాణులు స్వామివారికి భూరి విరాళాలు సమర్పించు కున్నట్లు ఆలయ స్తంభాలపై, ప్రాకార గోడలపై రాతలు చెబుతాయి. చాళుక్య, చోళ రాజులు, వీరకూటులు, పల్లవులు, వేంగీ చాళుక్యులు, కోరుకొండ నాయకులు, కొప్పుల నాయకులు, నందాపురరాజులు, గాంగులు, వడ్డాదిమాత్యులు, జంతరనాటి సురభి వంశజులు, ఒడిసా గజపతులు తదితరులు సింహాద్రినాథుడిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

అప్పన్న అద్వితీయ భక్తుడు కృష్ణయ్య

శ్రీరంగనాథుడికి రామానుజులు, సప్తగిరి వాసుడికి అన్నమయ్యలా సింహాద్రి నాథుడి దయాపాత్రుడు కృష్ణమాచార్యులు (కృష్ణయ్య). అంధుడిగా పుట్టి కుటుంబ నిరాదరణపాలై స్వామి దయతో బతికిబట్టకట్టి ఆయన కృపకు పాత్రుడయ్యారు. సింహాద్రినాథుడిపై సుమారు నాలుగు వేలకు పైగా కీర్తనలను రాసి ‘ప్రథమాంధ్ర వచన సంకీర్తనా చార్యుడు’గా ప్రసిద్ధులయ్యారు. ఆయన సంకీర్తలను ఆలపిస్తుంటే స్వామి వారు బాలుడిరూపంలో నృత్యం చేసేవాడని స్థలపురాణ గాథ.

విశిష్ట్వాదైత ప్రచారంతో వైష్ణవమతాన్ని సామాన్యులకు చేరువచేసిన సంస్కర్త, శ్రీమద్రామానుజుల పట్ల అపారభక్తి విశ్వాసాలు గల కృష్ణమాచార్యులు ఆయననే ఆదర్శంగా తీసుకుని సమతా, మమతాభావాల వ్యాప్తికి కృషి చేశారు. శ్రీవైష్ణవ సంప్రదాయక చారిత్రక గ్రంథం ‘ఆచార్య సూక్తిముక్తావళి’లో ఆయనను రామా నుజులకు వారుసులుగా అభివర్ణించారు.16 ఏట సంకీర్తనలు ప్రారంభించి 30 ఏళ్ళ వయసుకే ఎంతో పేరు ప్రతిష్ఠలు గడించారు. అన్నమాచార్యుల కంటే ముందు గానే సంకీర్తన రచన, గానాలకు శ్రీకారంచుట్టినా వాటికి అంత ప్రాచుర్యం, వ్యాప్తి దక్కలేదనే వాదన ఉంది. ‘కృష్ణమాచార్యులతోనే గానయోగ్యమైన వైష్ణవ కవిత్వం తెలుగులో ప్రారంభమైంది. లభ్యమైన సింహగిరి వచనాల విశ్లేషణల వల్ల ఎన్నో విశేషాలు తెలియవస్తాయి. కులభేదాలు పాటించక, ఒక మత విశ్వాసాలను నమ్మేవారంతా సమానులనే ఆశయం అమలు చేస్తూ శూద్రునిలో దేవునిచూసి అతనికి తన పెళ్లినాడే తళియ (భోజనం) వడ్డించి వెలి అయిన కృష్ణమాచార్యులు శ్లాఘనీయులు’ అని ప్రసిద్ధ సాహితీవేత్త ఆరుద్ర వ్యాఖ్యానిం చారు. ఆచార్యులు వారు కాకతీయ ప్రతాపరుద్రుడి ఆస్థానాన్ని సందర్శించినట్లు ‘ప్రతాపచరిత్ర’ తెలుపుతోంది. పోతనామాత్యుడు సింహగిరివచనాలతో ప్రభావి తుడైన తొలికవిగా చెబుతారు.

ఆశ్రిత రక్షకుడు

అప్నన్న స్వామి దుండగులను తరిమి కొట్టి ఆశ్రితులను కాపాడాడు అనేందుకు ఆయన మహిమ గురించి ప్రాచుర్యంలో ఉన్న సంఘటనల్లో ఒకటి- మొగలాయి సైన్యం ఆలయాన్ని చుట్టుముట్టి కల్యాణ మండపాన్ని, రథాన్ని కొంతవరకు ధ్వంసం చేసింది.ఈ పరిణామాన్ని ముందుగానే పసిగట్టిన ఆలయ అర్చకులు గోకులపాటి కూర్మనాథకవి, హరివర దాసులు ఆలయలోకి ప్రవేశించి స్వామిని స్తుతిస్తూ పద్య రచన చేపట్టారు. కూర్మనాథ కవి చెబుతుంటే హరివరదాసు శతకాన్ని పూర్తి చేశారు. ఆ వెంటనే తేనెటీగల దండు బయలుదేరి శత్రుమూకను నేటి విశాఖలోని తుమ్మెదలమెట్ట వరకు తరిమాయట.

సర్వవ్యాపి నారాయణుడు ముక్తిప్రదాత. ప్రహ్లాదుడు అహోబిలంలో అర్చించి సింహగిరి చేరి ముక్తి చెందినట్లే, అక్కడి స్వామిని సేవించిన ఫలితమే ఇక్కడా సిద్ధిస్తుందని జైమినిమహర్షి తెలిపారు.

About Author

By editor

Twitter
YOUTUBE