హరిత విప్లవం తరువాత మన దేశంలో వ్యవసాయోత్పత్తి, ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, గత కొన్ని దశాబ్దాలుగా బాగా పెరిగింది. మరోవైపు విచక్షణారహితంగా ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల ఎంతో నష్టం కూడా వాటిల్లింది. ఇదే సమయంలో భూసారం దెబ్బతినడం, ఉత్పాదకత తగ్గిపోవడం, ఉత్పత్తి వ్యయం పెరగడం, పర్యావరణ కాలుష్యం, వ్యవసాయం ఆర్ధికంగా భారం కావడం వంటివి ఆ నష్టాల్లో కొన్ని. దీనితో మళ్లీ పర్యావరణ అనుకూల విధానాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు చూడటం మొదలుపెట్టారు.

మట్టి, నీరు, పోషకపదార్ధాలు, మొక్కలు, సూక్ష్మజీవులు, పురుగులు, జంతువులు, మనుషుల మధ్య ఉన్న సున్నితమైన, అవినాభావ సంబంధాన్ని గుర్తించి పర్యావరణ సంతులనాన్ని కాపాడేవిధంగా సాగేదే సేంద్రియ వ్యవసాయం. ఇందులో సేంద్రియ పదార్ధాలను మాత్రమే ఉపయోగిస్తారు. మట్టిలోని సేంద్రియ పదార్ధపు సంరక్షణే ఇందులో ప్రధాన అంశం. మట్టిలోని సేంద్రియ పదార్ధం పురుగు మందుల దుష్ప్రభావాన్ని తగ్గించడమేకాక మట్టి భౌతిక, రసాయనిక, జైవిక నాణ్యతను క్రమంగా పెంచుతుంది. సేంద్రియ వ్యవసాయపు ప్రాధమిక సూత్రాలు.

–        నేలలో జైవిక క్రియలను పెంపొందిస్తుంది.

–        భూసారాన్ని దీర్ఘకాలం సంరక్షిస్తుంది.

–        పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

–        వ్యవసాయ వనరుల పునర్వినిమయానికి  వీలు కల్పిస్తుంది.

–        పర్యావరణ సంతులనాన్ని కాపాడుతుంది.

సేంద్రియ వ్యవసాయం ద్వారా భూసార నిర్వహణ

మొక్కలు పెరగడానికి పోషక పదార్ధాలు అవసరం. భూమి ఇటువంటి పోషకపదార్ధాలను మొక్కలకు అందిస్తుంది. అధిక జనాభా మూలంగా ఏర్పడిన అవసరాలను తీర్చేందుకు వ్యవసాయోత్పత్తిని పెంచడం, దాని కోసం అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం, పెద్ద మొత్తంలో పురుగుమందుల వాడకం వంటివి భూమిలోని సహజ పోషక విలువలు, పదార్ధాలను దెబ్బతీసాయి. మరోవైపు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు ఉపయోగించడం వల్ల భూగర్భ జలాలు కలుషితం కావడం, పారిశ్రామిక కాలుష్యం, నీటిలో ఆమ్ల, క్షార లక్షణాలు పెరగడం, భూమిలో సూక్ష్మ జీవుల సంఖ్య తగ్గిపోవడం, రసాయనాలతో పండించిన పంటను ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజారోగ్య సమస్యలు తలెత్తడం వంటి అనేకానేక కష్టనష్టాలు వచ్చాయి.

ఈ దుష్పరిణామాలను అరికట్టాలంటే సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. వ్యవసాయంలో రసాయనాల వినియోగానికి పూర్తిగా స్వస్తి పలకడం, లేదా చాలా తగ్గించడం చేయాలి. భూసారాన్ని కాపాడుకుని, ఉత్పాదకతను కూడా పెంచుకోవడానికి వ్యవసాయ వ్యర్ధాలను (మీతీశీజూ తీవఱ•బవ) భూమిలోనే కలపడం, భూమిని తక్కువసార్లు దున్నడం, పంట మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకం, రాతి ఫాస్పేట్‌, ‌కాల్షియం కార్బొనేట్‌ ‌వంటి వాటి వాడకం పెంచడం వంటి పద్ధతులు పాటించాలి. పంట వ్యర్ధాలను నేలలోనే తిరిగి కలిపేయడం వల్ల సేంద్రియ పదార్ధం నేలలో నిల్వ ఉంటుంది. ఈ వ్యర్ధాలే క్రమంగా నేలలో కలిసిపోయి పోషకాలుగా మారుతాయి. కంపోస్ట్ ఎరువు, జంతువుల నుంచి వచ్చే ఎరువు వంటివి కూడా భూసారాన్ని పెంచుతాయి. సేంద్రియ పదార్ధం నేలలో నీటిని నిల్వచేసుకునే సామర్ధ్యం మొదలైన వాటినీ పెంచుతుంది. సేంద్రియ ఎరువుల వల్ల నేలలో సూక్ష్మ జీవులు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల సూక్ష్మ పోషక పదార్ధాలు కూడా పెరుగుతాయి. అలాగే సేంద్రియ పదార్ధాలు మట్టిలో కలిసి మొక్కలకు కావలసిన పోషకాలుగా మారతాయి. నైట్రోజన్‌, ‌ఫాస్ఫరస్‌, ‌జింక్‌, ‌సల్ఫర్‌ ‌మొదలైన పదార్ధాలకు బదులుగా సేంద్రియ ఎరువులు భూసారాన్ని పెంచడంలో ఉపయోగపడతాయి.

 అత్యధిక పోషకాలు అవసరమయ్యే అధిక దిగుబడి పంటలైన చెరకు, పసుపు మొదలైనవాటికి వేరుశెనగ, సోయాబిన్‌, ‌పెసలు, మినుములు మొదలైన వాటిని మార్పిడి పంటలుగా వేయాలి. ఈ పంటలు నేలలో నైట్రోజన్‌ ‌శాతాన్ని పెంచుతాయి. దానివల్ల కృత్రిమ, రసాయనిక నత్రజని అవసరం తగ్గుతుంది. ఈ పంటల సి.ఎన్‌ ‌నిష్పత్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఈ పంటల వ్యర్ధాలు కూడా సులభంగా మట్టిలో కలిసిపోతాయి. దానివల్ల నేల సారం పెరుగుతుంది. కనుక రసాయన ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించడం, పురుగుమందులకు పూర్తిగా స్వస్తి చెప్పడం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం చాలా అవసరం. దీనివల్ల భూసారం పెరిగి భావితరాలకు సారవంతమైన నేలను అందించగలుగుతాం.

‘నేలలో జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. పర్యావరణ పరిరక్షణకు పూనుకుందాం.’

– ‌డా. జి. పద్మజ

– అను: కేశవనాథ్‌

About Author

By editor

Twitter
YOUTUBE