నృసింహావతారం ఇతర అవతారాల కంటే భిన్నమైంది. మహాభాగవతం పేర్కొన్న 21 అవతారాలలో ఇది 14వది కాగా, దశావతారాలలో నాలుగది. ‘పదునాలుగవదియైన నరసింహ రూపంబున కనక కశిపుని సంహరించె’ అన్నారు పోతనామాత్యులు. భగవంతుడు సర్వాంతర్యామి. జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడనే సత్యం చాటడమే ఈ అవతారతత్త్వం. ఇతర అవతారాల లక్ష్యం నెరవేరినంతనే శ్రీమహావిష్ణువు వైకుంఠానికి తరలివెళితే సర్వవ్యాపకుడైన నృసింహుడు భక్తపాలన కోసం ఇలలోనే ఉండిపోయాడు.
నృసింహావతారం సర్వశక్తి సమన్విత స్వరూ పం. త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారానికి అవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం. ‘ఇందుగల డందులేడని సందేహము వలదు/చక్రి సర్వోపగతుండెం దుందు వెదకి చూచిన అందందే కలడు….’ అన్న ప్రహ్లాదుడిని మాటలను నిజం చేస్తూ సర్వవ్యాపిత్వాన్ని చాటిన అవతారం.
‘పరిత్రాణాయ సాధూనాం…’ అన్న ద్వాపరంలోని గీతాచార్యుని వాక్కుకు కృతయుగంలోనే నాంది పడింది. దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు అవసరమైనప్పుడు అవతరిస్తుంటాను అనే భగవానుని పలుకుకు ఆది వరాహ, నృసింహావతారాలు సాక్షీభూతాలు. నృసింహా వతారం త్రిమూర్త్యాత్మకం. పాదాల నుంచి నాభివరకు బ్రహ్మరూపం, నాభినుంచి కంఠవరకు విష్ణురూపం, కంఠంనుంచి శిరస్సు వరకు రుద్రస్వరూపంగా ఆధ్యాత్మికులు అభివర్ణించారు. మరోకోణంలో, ద్వైయరూపాలు సాక్షాత్కరిస్తాయి. పాదాల నుంచి కంఠం వరకు నరత్వం, కంఠంపై భాగం సింహత్వం నిండిఉంటుంది. ‘నర’ అంటే నరుడు (జీవుడు), ‘సింహ’ అంటే హింసించేది (నాశనం చేసేది) అని అర్థం. అజ్ఞానం, అహంకారాది జీవభావాలను నిర్మూలించేవాడు నారసింహుడు అని చెబుతారు. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని హింసించే దుష్ట జీవభావాలను నాశనం చేసి, దైవీభావాన్ని స్థిరపరచ డమే నృసింహతత్వం.
వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు బ్రహ్మమానస పుత్రులు. సనక సనందాదుల శాపం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వారు జన్మిం చారు. ధరను చాపగా చుట్టి సముద్రంలో ముంచిన హిరణ్యాక్షుడిని వరహారూపుడైన హరి సంహరించి భూమిని ఉద్ధరించాడు. సోదరుడిని హతమార్చిన విష్ణువుపై రగిలిన ప్రతీకారవాంఛతో హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ‘నరుల వల్ల కాని, మృగాల వల్ల గాని, పగలుకాని, రాత్రి కాని, ప్రాణం ఉన్నవాడి చేతగాని, ప్రాణం లేనివాడి చేతగాని మరణం లేకుండా వరం కోరుకున్నాడు.
ప్రణాళికాబద్ధం
ప్రణాళిక ఉంటే ఎంతటి కార్యాన్నయినా సులు వుగా సాధించవచ్చు. పురాణకాలంలో దుష్టులను శిక్షించడం నుంచి ఆధునిక కాలంలో దేశ ప్రగతి వరకు ప్రణాళిక ఎంత అవసరమో ఈ అవతారంలోని హిరణ్యకశిపుని వధ సంఘటనను పరిశీలిస్తే తెలుస్తుంది. స్వామి ఎంత ప్రణాళికా బద్ధంగా అవతరించాడో తెలుస్తుంది. శ్రీహరి ప్రత్యక్షంగా శత్రునిర్జనం చేయడానికి ఈ అవతారంలో అవకాశం లేదు. హిరణ్యకశిపుడు ఘోరతపస్సుతో బ్రహ్మదేవుడిని కోరిన వరాలు అలాంటివి మరి. ఆయన పొందిన వరాలకు ఎక్కడా విఘాతం కలుగకుండా పరమాత్మ తన లీలను ప్రదర్శించి కడతేర్చారు. వరహరూపంలో హిరణ్యాక్షుడిని సంహరించిన శ్రీమహావిష్ణువు, కృత ద్వాపర యుగాలలో శ్రీరామ, శ్రీకృష్ణులుగా రావణ కుంభకర్ణులు, శింశుపాలదంతవక్త్రలను సంహరిం చారు. నృసింహావతారంలో మాత్రం వైరి హిరణ్య కశిపుడే మృత్యువును ఆహ్వానించుకునేలా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించారు. శ్రీహరి ఉనికిపై తండ్రీ తనయులు హిరణ్యకశిప, ప్రహ్లాదుడి మధ్య సంవాదం చోటు చేసుకున్న సమయంలో ‘హరి సర్వోపగతుడని అన్నావు కదా? ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అని తండ్రి ప్రశ్నించగా ‘ఔను’అని కుమారుడి నుంచి స్థిరమైన బదులు వచ్చింది. బ్రహ్మ నుంచి అనేక షరతులతో కోరిన వరాలు అండగా ఉండగా డింభకుడి (ప్రహ్లాదుడు) మాటలను ఢాంబికాలుగా భావించి స్తంభాన్ని గదతో బద్ధలు కొట్టాడు. అప్పటికే ఎల్లెడలా వ్యాపించి ఉన్న ఆ హరి సయయం రాగానే స్థూలరూపంలో (వైశాఖ శుద్ధ చతుర్దశినాడు)స్తంభం నుంచి ఆవిర్భవించారు. పగలు-రేయి కాక సంధ్యా సమయంలో, నరుడు -మృగం కాక, సగం మృగం, సగం మానవరూపంలో, ఇంటా-బయట కాక ద్వారం మధ్యలో, నేలన కాక నింగికాక ఒడిలోకి లాక్కొని, ప్రాణసహితం, ప్రాణరహితం కానీ వాడియైన గోళ్ల తోనే చీల్చి వధించాడు.
దుష్ట్టులకు భీకరుడు-శిష్టులకు ప్రసన్నుడు
స్వామి వారి సింహగర్జన, పౌరుషం, ఉత్సాహం, యుద్ధ సంసిద్ధత లక్షణాలు చూసి విధాతాదులే వెరపు చెందారు. హిరణ్యకశిపుడినే కాకుండా ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తాడేమో అన్నంతగా భీతి చెందారు. ఉగ్రరూపాన్ని ఉపసంహరించి త్రిలోకాలకు ప్రియమైన ప్రసన్నాకృతిని ప్రసాదించాలంటూ ఇంద్రాది దేవ తలు, యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుషులు, ఋషులు, పితరులు, సిద్ధులు, నాగులు, మనువులు, ప్రజాపతులు చేసిన విన్నపాలను స్వామి ఆలకించ లేదు. ప్రహ్లాదుని కోసమే ఆ రూపం ధరించిన స్వామి అతని ప్రార్థనతోనే శాంతించి ‘ప్రహ్లాద వరదుడు’గా ప్రసిద్ధులయ్యారు. దుష్టులకు ఎంత భయంకరుడో శిష్టులకు అంతటి ప్రసన్నుడుగా కీర్తినందాడు. భీకరత్వాన్ని, ప్రసన్నతను ఏకకాలంలో చూపిన భగవానుడు. ఉగ్రరూపుడే శరణుకోరిన వారికి మాత్రం కొంగుబంగారమని శంకర భగవత్పాదులు భక్తకోటికి ‘లక్ష్మీ నృసింహ కరావలంబస్త్తోత్రం’ అందిం చారు.
జానపదుల దేవుడు
జానపదులకు నృసింహుడు మహాపూజ్యుడు. చెంచితగా అవతరించిన లక్ష్మీదేవిని ఆడపడుచుగా భావిస్తారు వారు. వారిద్దరికి పెళ్లి జరిపించే పాటలు, యక్షగానాలు, నాటకాలు, చలనచిత్రాలు ఎన్నో వచ్చాయి. మంగళగిరి క్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రాత్రి కల్యాణం, మరుసటి రోజు రథోత్సవం లో చెంచు జాతీయులు ప్రత్యేకంగా పాల్గొనడం సంప్రదాయకంగా వస్తోంది. నృసింహుడు కుల దైవంగా, ఇంటిఇలవేల్పుగా ఆరాధనలు అందుకుం టున్నారు. ముప్పయికి పైగా మంత్రాలతో నార సింహుని కొలుస్తారు.
నృసింహ క్షేత్రాలు
దక్షిణభారతదేశంలో అనేక నృసింహ క్షే•త్రాలు విశేషపూజలు అందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఉత్తరాంధ్రలోని సింహచలం నుంచి రాయలసీమలోని కదిరి వరకు, తెలంగాణలోని యాదాద్రి తదితరక్షేత్రాలు దివ్య నారసింహ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.
అప్పన్నగా సంభావించుకునే సింహాచలంలోని వరహా లక్ష్మీనృసింహస్వామి ఏడాదిలో పన్నెండు గంటలు మాత్రమే (వైశాఖ శుద్ధ తదియ)నిజరూప దర్శనిమిస్తారు. మిగతా సమయమంతా స్వామి మూర్తి చందనంతో కప్పి ఉంటుంది. కృష్ణాజిల్లాలోని వేదాద్రి లోని యోగానంద నరసింహస్వామి ధ్యానముద్రలో దర్శనమిస్తారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో స్వామి వారికి మూడు ఆలయాలు ఉన్నాయి. కొండ దిగువున శ్రీలక్ష్మీనృసింహస్వామి, కొండపైన పానకాల స్వామి, గిరి శిఖరంపై గండాల నరసింహస్వామి కొలువై ఉన్నారు. శ్రీలక్ష్మి ఈ కొండపై తపస్సు చేసి నందున ‘మంగళాద్రి’, ‘మంగళగిరి’గా ప్రసిద్ధమైందని స్థల పురాణం.
కర్నూలు జిల్లా అహోబిలంలో స్వామి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల ఈ క్షేత్రం ‘అహోబలం’ అనీ వ్యవహరంలోకి వచ్చిందట. ఇక్కడికి సమీపంలోని కొండపై నవనారసింహ మూర్తులు (ఉగ్ర, కృద్ద, వీర, విలంబ, కోప, యోగ, అఘోర, సుదర్శన, శ్రీ లక్ష్మీ) కొలువైఉన్నారు. కదిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. హిరణ్యకశిపుని వధ అనంతరం ఆగ్రహావేశాలతో ఈ ప్రాంతానికి వచ్చిన స్వామి ఇక్కడి అడవిలో క్రూరజంతువులను వేటాడారని, అలా అయనకు ‘వేటరాయుడు’ అని పేరు వచ్చిందని చెబుతారు. ఆ వేటరాయుడే జనవ్యవవహారంలో బేట్రాయుడుగా మారిందని తెలుస్తోంది. పదకవితా పితామహుడు అన్నమాచార్య అహోబిలం, కదిరి నృసింహస్వాములను ‘వేదములే నీ నివాసమట విమల నారసింహా…’ అని కీర్తించారు. నృసింహ నారాయణు డు నాలుగు వేదాలలోనూ గోచరిస్తాడు. శంఖ చక్ర గదా పద్మాలతో శోభిల్లే ఆనాలుగు చేతులు ప్రాణ కోటికి ముక్తిదాయకాలు.
ఇక తెలంగాణలోని యాదాద్రి (యాదగిరి గుట్ట)లో యాదమహర్షి తపస్సుకు మెచ్చిన స్వామి జ్వాలా, యోగానంద, గండభేరుండ, లక్ష్మీనర సింహులుగా వెలసి పూజలు అందుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతోంది. అంతర్వేది, పెంచలకోన, కాంచీ పురం, కుంభకోణం, రామేశ్వరం, గయ, బ్రహ్మ కపాలం, హరిద్వారం తదితర క్షేత్రాలు భక్తకోటిని అలరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వందలాది నృసింహా లయాలు ఉండగా, ఒక్కొక్క చోట ఒక్కొక్క విశిష్టత గోచరిస్తుంది.
-డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్