– ఎమ్వీ రామిరెడ్డి

ఆయన సన్నగా ఈలవేస్తూ స్టవ్‌ ‌వెలిగించాడు. బాణలి పెట్టి నూనె వేడెక్కాక తాలింపు గింజలు వేశాడు. నీలిరంగు నైట్‌ప్యాంటు, శనగపిండి రంగు టీషర్టు మీద యాప్రాన్‌ ‌కట్టుకుని మాస్టర్‌ ‌చెఫ్‌లా మారిపోయిన ఆ స్టార్‌ ‌హీరో ఉత్సాహంగా తాలింపు గింజల్ని దోరగా వేయించాడు.

పక్కనే సిద్ధంగా ఉంచుకున్న ఉల్లి పాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు బాణలిలో వేశాడు. గుప్పెడు జీడిపప్పును జతచేశాడు. వేగిన తర్వాత సరిపడా నీళ్లుపోసి, ఉప్పు వేశాడు. నీళ్లు మరిగాక, బొంబాయి రవ్వను సన్నటి ధారగా పోశాడు. ఉండలు కట్టకుండా తిప్పుతూ, ఉప్మా చివరిదశకు చేరుకోగానే కొత్తిమీరతో గార్నిష్‌ ‌చేసి స్టవ్‌ ఆఫ్‌ ‌చేశాడు.

డైనింగ్‌ ‌టేబుల్‌ ‌మీద అన్నీ సిద్ధం చేసి, ‘‘డియర్‌ ‌చిల్డ్రన్‌ అం‌డ్‌ ‌మై డార్లింగ్‌, ఉప్మా రెడీ. వచ్చెయ్యండి’’ అని కేకేశాడు.

అప్పటిదాకా మెయిన్‌ ‌హాల్లోని సోఫాల్లో కూర్చొని ఆయన ‘వంటమాస్టర్‌ ‌క్యారెక్టర్‌’‌ను ఊహించుకుంటూ గడిపిన పిల్లలు, ఆయన భార్య ధనలక్ష్మి గబగబా డైనింగ్‌ ‌టేబుల్‌ ‌వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆయన నాలుగు ప్లేట్లలో వడ్డించి, స్పూన్లు నిలువుగా అమర్చాడు.

ప్లేటు మీదికి వంగి, గట్టిగా వాసన పీల్చి ‘వావ్‌’ అం‌ది కూతురు. నలుగురూ కూర్చొని తినటం మొదలుపెట్టారు. తనో సెలబ్రిటీ అన్న భావం ఆయన మొహంలో ఎక్కడా ప్రతిఫలించటం లేదు.

‘‘ఎలా ఉంది శ్రీమతిగారూ, నా చేతి వంట?’’ నవ్వుతూ అడిగాడు.

‘‘చాలా బావుందండీ. ఇంకొంచెం ఉప్పు పట్టేది’’ అంది ధనలక్ష్మి.

‘‘నో డాడ్‌. అన్నీ బాగా సరిపోయినై. సూపర్‌’’ అం‌ది కూతురు జీడిపప్పులు ఏరుకొని తింటూ.

‘‘ఎస్‌, ‌డాడ్‌. ‌నాకూ నచ్చింది’’ ప్రకటించాడు కొడుకు.

‘‘అమ్మకి కుళ్లురా, తనకన్నా నేనే బాగా చేశానని’’ అన్నాడు పెద్దగా నవ్వేస్తూ.

తినటం పూర్తి కాగానే, ఆయనే అందరి పళ్లేలూ తీసుకెళ్లి, సింక్‌లో పడేశాడు. రెండు ప్లేట్లు కడిగాడు.

కాసేపటి తర్వాత హాల్లోని సోఫాలను, కుర్చీలను వాక్యూమ్‌ ‌క్లీనర్‌తో శుభ్రం చేశాడు.

‘‘ఎక్స్‌లెంట్‌ ‌సర్‌. ‌మా పోగ్రామ్‌ ‌సూపర్‌హిట్‌ అయినట్లే.’’

చప్పట్లు కొడుతూ కాలర్‌ ‌మైకుతో హీరోకి దగ్గరగా వచ్చాడు ఓ టీవీ ఛానెల్‌ ‌రిపోర్టర్‌. ఆ ‌టీవీ కొత్తగా ప్రారంభించబోతున్న ‘‘శ్రీమతి కోసం’’ అనే ప్రత్యేక కార్యక్రమానికి ఇది తొలి ఎపిసోడ్‌.

‘‘‌థాంక్యూ’’ అన్నాడాయన నవ్వుతూ.

‘‘సర్‌, ‌ఫైనల్‌గా మీ వాయిస్‌…’’ అం‌టూ, మైకును ఆయన నోటికి దగ్గరగా పెట్టాడు రిపోర్టర్‌.

‘‘అం‌దరికీ నమస్కారం. ఇంటిభారాన్ని ఏకమొత్తంగా ఇల్లాలిపై మోపకండి. మీ శ్రీమతి కోసం కాస్త సమయం కేటాయించండి. పనుల్లో భాగం పంచుకోండి. పిల్లలకు కథలు చెప్పండి. మనసులు కలబోసుకుని, మమతలు పంచుకోండి…’’

సరంజామా సర్దుకుని, ఖరీదైన ఆ ఇంటినుంచి నిష్క్రమించారు ఛానెల్‌ ‌సిబ్బంది.

సింక్‌లో గుట్టగా పడిన గిన్నెలన్నిటినీ- భర్త కడిగిన రెండు ప్లేట్లతో సహా- శుభ్రంగా తోమిందామె. ఆమె మనసులో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి.

నలుగురు పని మనుషులున్నా వంట మాత్రం తనే చేయాలి. ముంబాయి నుంచి పేరుమోసిన కుక్‌ని తెచ్చిపెట్టారు. తొలిరోజే వాడు వండిన వంకాయ కూర తిని, తుపుక్కున ఊశాడాయన. ‘దరిద్రంగా ఉంది. కూరలు మాత్రం నువ్వే వండు’ అన్నాడు.

దర్శకులూ నిర్మాతలూ రచయితలూ ఆర్టిస్టులూ జర్నలిస్టులూ… నిత్యం ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. టీలూ స్నాక్సూ సరఫరా అవుతూనే ఉంటాయి.

వాళ్లకు తోడు ఛానెళ్ల వాళ్లు. ఇంటర్వ్యూలనీ, ప్రెస్‌మీట్లనీ హడావుడి. అవికాక, ఇదిగో- టీఆర్పీ కోసం ఇలాంటి స్పెషల్‌ ‌మసాలా దినుసులు.

ఇవాళ ఆ ఛానెల్‌ ‌వాళ్లు వచ్చే ముందు.. అన్నీ తనే సిద్ధం చేసి, బౌల్స్‌లో పెట్టి ఉంచితే, ఆయన కెమేరా ముందు కొచ్చి చకచకా పాత్రను రక్తి కట్టించాడు.

నిజానికి ఇందాక నలుగురూ తిన్న ఉప్మా కూడా తనే చేసింది. దఫదఫాలుగా జరిగిన షూటింగ్‌ ‌గ్యాప్‌లో ఆయన చేసిన ఉప్మా బాణలి స్థానభ్రంశం పొందింది.

‘‘రా డియర్‌. ‌పని పూర్తయిందా?’’ వంటగది లోంచి మెయిన్‌ ‌హాల్లోకి వచ్చిన ధనలక్ష్మిని, సోఫాలో కూర్చొని ఇంగ్లిషు మేగజైన్‌ ‌చూస్తున్న భర్త అడిగాడు. తల ఊపిందామె.

‘‘వాళ్లు ఫుల్‌ ‌హ్యాపీ ధనా! అఫ్‌కోర్స్, ‌మనకూ బానే గిట్టుబాటయిందిలే’’ పెద్దగా నవ్వేశాడు.

ఆమె కూడా నవ్వింది. కానీ, ఆ నవ్వులో ఏదో అసంతృప్తి.

‘‘అత్తయ్య ఫోన్‌ ‌చేశారండీ. పాపం, ఆమె ఒక్కత్తే చాలా ఇబ్బంది పడుతోంది. ఆరోగ్యం కూడా బాగోవటం లేదట…’’

‘‘అందుకని… తెచ్చేసుకుందామా? ఏం తక్కువ చేశాను? నెలనెలా ఎంత కావాలంటే అంత పంపిస్తున్నాను. ఆమెను అక్కడే ఉండనివ్వు’’ అంటూ కోపంగా లేచి, బెడ్రూమ్‌ ‌వైపు నడిచాడు.

అతనికి పదేళ్లు నిండకుండానే తల్లి పోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. మారుతల్లి బాగానే చూసుకుంది. కానీ, సినిమారంగం వైపు వెళ్తానంటే వద్దంది. అతను మొండికేశాడు. ఆమె అంతకన్నా భీష్మించుకుంది. మధ్యలో తండ్రి నలిగిపోయాడు.

ఓ అర్ధరాత్రి ఇంటినుంచి పారిపోయి, హైదరాబాదు చేరుకున్నాడు. పట్టు వదలకుండా శ్రమించి, చివరికి హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆమెకు పుట్టిన ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లకూ సాయం చేశాడు.

రెండేళ్లు తిరక్కుండానే తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ఆ మారుమూల గ్రామంలోనే తల్లి ఒంటరిగా జీవనం గడుపుతోంది.

రెండు రోజుల తర్వాత…

ఆరోజు రాత్రి షూటింగ్‌ ‌నుంచి ఇంటికొస్తూనే ‘‘పిల్లలు తిన్నారా?’ అనడిగాడు, అలవాటుగా.

‘‘లేదండీ, ఇద్దరూ వాళ్ల నానమ్మ గదిలో ఉన్నారు’’ చెప్పిందామె, మెరుస్తున్న కళ్లతో.

అతని కళ్లు ఎర్రబడ్డాయి.‘‘ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు?’’ కోపంగా అరిచాడు.

‘‘నేనే! కారు పంపాను. డ్రైవర్‌ ‌వెళ్లి, జాగ్రత్తగా తీసుకొచ్చాడు’’ నింపాదిగా చెప్పిందామె.

బుద్ధుందా… అంటూ కాసేపు ఆక్రోశం వెళ్లగక్కాడు.

ఆమె అతనికి దగ్గరగా వచ్చింది. మంచినీళ్లు అందించింది. సోఫాలో కూచోబెట్టింది.

‘‘మారుతల్లి అయినంత మాత్రాన మమకారం ఉండదని ఎలా చెబుతావు? పేగు తెగిన పాశం ఉండకపోవచ్చు. ప్రేమ పంచిన మోహం ఉంటుంది. పెంపకం తాలూకు వ్యామోహం ఉంటుంది’’.

అతను భార్య కళ్లల్లోకి లోతుగా చూశాడు.

‘‘మీ డైలాగేనండీ… బాక్సాఫీసు బద్దలు కొట్టిన సినిమా. హాళ్లల్లో చప్పట్లు కొల్లగొట్టిన డైలాగు. బాధ్యత విస్మరించిన ఓ యువకుడిలో మార్పు తెచ్చేందుకు మీరు చెప్పిన డైలాగు…’’

ఆమె ఇంకేమీ మాట్లాడకుండా వంటగది వైపు నడిచింది.

అతను కాసేపు అలాగే కూర్చుండిపోయాడు. ఆ తర్వాత లేచి, తల్లి గదిలోకి నడుస్తుంటే, అదే సినిమాలోని మరో డైలాగు అతని మనసులో ప్రతిధ్వనిస్తోంది…

‘‘ఆమె నిన్ను సొంత కొడుకులా చూసుండకపోవచ్చు. నువ్వామెను సొంత అమ్మలా చూస్తే తప్పేంటి?’’

—————————-

సరస్వతి బ్యాంకు నుంచి ఇంటికి వచ్చేసరికి, కూతురితో హాల్లో క్యారమ్స్ ఆడుతున్నాడు భర్త.

‘‘చిన్నా ఏడీ?’’ కొడుకు గురించి ఆరా తీసింది.

‘‘బెడ్‌రూములో పడుకున్నాడు’’ దృష్టిని కాయిన్‌ ‌మీదే కేంద్రీకరించి చెప్పాడు భర్త.

ఐడీ కార్డు, వ్యానిటీ బ్యాగ్‌ ‌సోఫాలో పడేసి, వాష్‌రూములోకి వెళ్లి కాళ్లు కడుక్కొని వచ్చింది.

‘‘వాడిక్కొద్దిగా జ్వరం వచ్చింది. వాంతి చేసుకున్నాడు’’ మెల్లగా చెప్పాడు భర్త.

పడగ్గదిలోకి పరుగెత్తిందామె. బాబు నీరసంగా పడుకొని ఉన్నాడు.

మంచం పక్కనే వాంతి తాలూకు వాసన గుప్పున ముక్కుపుటాల్ని తాకింది.

అరకొరగా తుడిచారేమో… మరకలు అలాగే ఉన్నాయి. తడిగుడ్డ తీసుకొచ్చి, ఫినాయిల్‌ ‌వేసి తుడిచి, గదంతా శుభ్రం చేసింది. మళ్లీ కాళ్లు కడుక్కొని, చేతుల్ని శుభ్రం చేసుకుని వచ్చి కొడుకు పక్కనే కూర్చుంది. ఆ కుర్రాడు లేచి, తల్లి ఒళ్లో పడుకున్నాడు. గొంతు గురగురలాడుతోంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నాడు. భర్తను పిలిచింది.

‘‘జ్వరం కాదండీ, బ్రీతింగ్‌ ‌ప్రాబ్లం…’’ఆమె మౌనంగా రోదిస్తోంది.

‘‘ఇప్పుడేం చేద్దాం’’ అయోమయంగా అడిగాడు.

‘‘ఆస్పత్రికి తీసుకెళ్లండి’’ చెబుతూనే కొడుకుని లేపి, మొహం కడిగింది.

భర్త ప్యాంటు వేసుకున్నాడు. బండి తీయ బోతుండగా అతని ఫోన్‌ ‌మోగింది. రెండు నిమిషాలు మాట్లాడి, సరస్వతి వంక బేలగా చూశాడు.

‘‘ఏమైంది?’’

‘‘బాస్‌ ‌ఫోన్‌. ‌వెంటనే వర్చువల్‌ ‌మీటింగులో జాయినవమన్నాడు’’ ఆమె ప్రతిస్పందనతో సంబంధం లేకుండా, ల్యాప్‌టాప్‌ ఆన్‌ ‌చేశాడు.

‘‘ఏమిటండీ ఇది? పిల్లాడి ఆరోగ్యం కంటే ముఖ్యమా?’’ ఆక్రోశించిందామె.

‘‘కొత్త ప్రాజెక్ట్‌పై ఇంపార్టెంట్‌ ‌డిస్కషన్‌ ‌సరూ. నాకు ప్రాజెక్ట్ ‌లీడ్‌గా అవకాశమిస్తానన్నాడు బాస్‌’’ ‌మాట్లాడుతూనే లింక్‌ ‌మీద క్లిక్‌ ‌చేశాడు.

క్షణం ఆలస్యం చేయలేదామె. స్కూటీ తీసి, కొడుకును ఎక్కించుకుని, ఆస్పత్రికి చేరుకుంది.

కన్సల్టేషన్‌ ‌ఫీజు కట్టి, రిసెప్షన్‌లో వెయిట్‌ ‌చేస్తోంది. కొడుకు ఆమె భుజంపై తల వాల్చాడు.

చుట్టుముడుతున్న ఆలోచనలు ఆమెను కుదురుగా కూర్చోనివ్వటం లేదు.

భర్త మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌. ‌నెలలో అయిదార్రోజులైనా టూర్లలో ఉంటాడు. మిగతా రోజుల్లో ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది. పిల్లలు ఇబ్బంది పెట్టేవాళ్లు కాదు.

అతనికి వంటగదితో శత్రుత్వం. అటువైపు రాడు.

ఇద్దరు పిల్లలు పుట్టాకే తనకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కొత్తలో కొన్నాళ్లు అత్తగారు ఉన్నారు. ఆమె వెళ్లిపోయాక, భర్త కిచెన్‌తో కొద్దిగా దోస్తీ కుదుర్చు కున్నాడు. కాఫీ పెట్టడం, కూరగాయలు కోయడం వంటి పనులందుకునేవాడు. అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది.

సాధనమున పనులు సమకూరాయి సరస్వతికి. వంట చేసి, భర్తకూ, పిల్లలకూ తనకూ బాక్సులు సర్ది… పనులు తెముల్చుకుని సమయానికి బ్యాంకుకు చేరుకునే విద్యలో స్వయంసమృద్ధి సాధించింది.

అదే అదనుగా భారాన్నంతా భర్త తన మీదికి బదిలీ చేశాడు. ఇంటిపనీ వంటపనీ ఆఫీసు పనీ…

నిజానికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా తనకెంతో సౌలభ్యం. ఇంటినుంచే పని చేయొచ్చు. ఇంటిపనిని ఎంతోకొంత పంచుకోవచ్చు. కానీ, సాయంత్రం తను ఇంటికి వచ్చేసరికి హాట్‌స్టార్‌లోనో నెట్‌ఫ్లిక్స్‌లోనో మునిగిపోయి ఉంటాడు.

తనే టీ పెట్టివ్వాలి. టెర్రస్‌పై ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టాలి. ఇస్త్రీబట్టలు బీరువాలో సర్దాలి.

రాత్రికి మళ్లీ వంటయజ్ఞం.

‘‘అమ్మా! మిమ్మల్నే పిలుస్తున్నారు’’ నర్సు పిలుపుతో డాక్టరు గదిలోకి నడిచింది సరస్వతి.

డాక్టర్‌ ఏం ‌చెబుతాడోనని భయపడుతోంది. కొవిడ్‌ ‌దెబ్బతో జ్వరం కూడా క్యాన్సర్‌లా మారింది.

బాబును పరీక్షించాక ‘‘లంగ్స్‌లో చిన్న ప్రాబ్లమ్‌ ఉన్నట్లుంది. అడ్మిట్‌ ‌చేసి, రెండురోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుదాం’’ అని చెప్పాడు డాక్టర్‌.

ఆమె అడ్మిషన్‌ ‌రాయించుకుని, బాబుతోపాటు రూముకు చేరుకుంది.

డ్యూటీ డాక్టర్‌ ‌వచ్చి ఏవో మందులు రాశాడు. నర్సు రెండు ఇంజక్షన్లు చేసింది. ల్యాబ్‌కు తీసుకెళ్లి నాలుగు రకాల టెస్టులు చేశారు. భర్తకు ఫోన్‌చేసి చెప్పింది. ఇంట్లో పాప ఒక్కతే ఉంటుందని, అతన్ని ఆస్పత్రికి రావద్దని తనే చెప్పింది.

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో భర్తను ఆస్పత్రికి పిలిపించుకుని, తను ఇంటికి చేరుకుంది.

కూర వండి, భర్తకూ కూతురికీ చపాతీలు సిద్ధం చేసి, మళ్లీ ఆస్పత్రికి చేరుకుంది.

మరుసటి రోజు రిపోర్టులు వచ్చాయి. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని సాయంత్రానికి డిశ్చార్జ్ ‌చేశారు. ఆమె ఊపిరి పీల్చుకుని బాబుతో ఇంటికి చేరుకుంది.

భర్త, కూతురు దిగులుగా కూర్చొని ఎదురు చూస్తున్నారు. టీవీ ఆఫ్‌ ‌చేసి ఉంది.

‘‘కంగారు పడనక్కర్లేదన్నారు’’ ముక్తసరిగా చెప్పి, బాబును బెడ్‌రూములో పడుకోబెట్టి, దుప్పటి కప్పింది. సరస్వతిని అలసట కమ్మేసింది. కుర్చీలో కూల బడింది.

భర్త ఓ ప్లేటులో ఇడ్లీలు పెట్టుకుని సరస్వతి దగ్గరకు వచ్చాడు.

‘‘నేనే చేశాను సరూ. ప్రామిస్‌, ఇకముందు కూడా చేస్తాను…’’

భర్త కళ్లల్లో క్షమాపణ! సరస్వతి మొహంలో సంతోషపు వెలుగు!

—————————-

అర్ధరాత్రి దాటింది. సూరికి కడుపులో మెల్లగా మొదలైన నొప్పి క్రమంగా పెరిగి పెద్దదయింది.

తట్టుకోలేక లేచి, లైటు వేసింది. భర్త గాఢనిద్రలో ఉన్నాడు. సాయంత్రం తాగిన మత్తు ఇంకా దిగిపోలేదు. అరిచినా, కదిపినా లేవలేదు.

అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్లి, మూడు ఇళ్లకు అవతల ఉన్న గది తలుపు తట్టింది.

పార్వతి వెంటనే తలుపు తీసింది. సూరి కష్టం గమనించి, లోపలికి తీసుకెళ్లింది.

తన భర్తను లేపి, సైట్‌ ‌సూపర్‌వైజర్‌కు ఫోన్‌ ‌చెయ్యమని చెప్పింది.

‘‘అయ్యో, సూరికి నొప్పులు మొదలైనై. సైటులో ఉండే డైవరు కోమాట సెప్పండి బాబూ. కారులో తీసుకెల్తే పానాలు దక్కుతయ్యి’’ అన్నాడు పార్వతి భర్త.

‘‘ఆఫీసు కారుంది కాన్పులు చెయ్యటానికా? పోరా’’ అని, ఫోన్‌ ‌స్విఛాఫ్‌ ‌చేశాడు సూపర్‌వైజర్‌.

‌శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలస వచ్చిన దాదాపు నాలుగు వందల మంది హైదరాబాదు నగరశివారులో బహుళ అంతస్తుల భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు.

డెబ్భై ఎనభై కుటుంబాలు నివసించేలా రేకులతో పోర్షన్లు వేశాడు కాంట్రాక్టరు.

ఆడవాళ్లంతా ఉదయం అయిదుకు ముందే లేస్తారు. చిల్లరమల్లర పనులు చేసుకుని, తాముండే షెడ్డుకు చివర్లో రాళ్లతో ఏర్పాటు చేసుకున్న పొయ్యిలు వెలిగిస్తారు.

సూరిని లోపల మంచంపై పడుకోబెట్టి, సపర్యలు చేస్తోంది పార్వతి. ఆమెను చూస్తుంటే, పార్వతికి కడుపు తరుక్కుపోతోంది.

సూరి మొగుడు మరీ బద్ధకస్తుడు. కనీసం కట్టెపుల్లలు కూడా తేడు. డ్యూటీ దిగాక సూరే వెళ్లాలి. చీకట్లోనే ఏరుకొస్తుంది. నాలుగేళ్ల కొడుకు పనులు చూసుకుని, స్నానంజేసి, భర్తకు అన్నం పెట్టి, మధ్యాహ్నానికి బాక్సులు సిద్ధం చేసి, తనూ నాలుగు ముద్దలు లోపల పడేసుకుని సైటులోకి వస్తుంది. ఎనిమిదో నెల పడ్డాక ఆడాళ్లంతా వద్దని వారించినా భర్తకు భయపడి ఇటుకలు మోస్తూనే ఉంది.

ఇదంతా సూరి చరిత్రే కాదు; అక్కడ నివసించే అరవై డెబ్భై కుటుంబాలదీనూ.

చూస్తుండగానే నొప్పులు ఎక్కువై లుంగలు చుట్టుకుపోతోంది సూరి.

పార్వతి భర్త తోటి కార్మికులందరినీ లేపాడు. సైట్‌లో వెలుగుతున్న భారీ లైట్ల వెలుతురే ఆ కార్మికవాసానికి ఆధారం. ఆ వెలుగులోనే నిలబడి కొందరు ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నారు, ఏదో ఒక సాయం దొరక్కపోతుందా అన్న ఆశతో. ఓ కుర్రాడు 108కు కొడుతున్నాడు.

నలుగురు ఆడవారిని లోపలికి పిలిచింది పార్వతి. తను గబగబా వెళ్లి చెత్తపరకలు తెచ్చి, నేల మీద పరిచింది. దాని మీద పాత దుప్పటి వేసి, సూరిని పడుకోబెట్టారు.

నొప్పులకు తాళలేకపోతోంది సూరి. పక్కన కూర్చొని ధైర్యం చెబుతోంది పార్వతి.

బయట నిలబడిన మగాళ్లంతా నిస్సహాయంగా చూస్తున్నారు. ఎవరో వెళ్లి, నీళ్లు చల్లి మరీ సూరి మొగుణ్ని తీసుకొచ్చారు. మత్తు నుంచి బయటపడిన అతగాడు ఆకాశానికి దండాలు పెడుతున్నాడు.

‘‘అక్కా, తట్టుకోలేనేఈ నెప్పులు. పానం పొయ్యేట్టుందే’’ సూరి కిందా మీదా అవుతోంది.

‘‘ఓర్సుకోవాలే. ఈ టైమ్‌లో మంత్రసానులు యాడ దొరుకుతారు?’’ అంది పార్వతి.

‘‘లేదక్కా, నేను బతకను’’ అల్లాడిపోతోంది సూరి.

‘‘బిడ్డ అడ్డం తిరిగినట్టుంది’’ ఎవరో అన్నారు.

‘‘కాళ్లు ఇంకొంచెం ఎత్తుగా పెట్టవే’’ ఇంకెవరిదో సలహా.

పార్వతి కళ్లు మూసుకుని ఏదో గుర్తు తెచ్చుకుంది. కొత్త బ్లేడు తెప్పించింది.

‘‘సూరీ, నువ్వు ధైర్యంగా ఉంటేనే బిడ్డ నీకు దక్కుతుంది. నేనున్నా. నా మాట నమ్ము. నేను చెప్పినట్టు చెయ్యి, చాలు’’ నమ్మకం ఇనుమడించేలా చెప్పింది పార్వతి.

ఆ కుర్రాడి ప్రయత్నం ఫలించి, 108కు ఫోన్‌ ‌కలిసింది.

ఇద్దరక్కల ప్రసవాలను దగ్గర్నుంచి చూసిన అనుభవంతో, పట్టా లేని వైద్యురాలిలా శ్రమిస్తోంది పార్వతి. చూస్తున్న వారందరిలోనూ అంతకంతకూ ఉత్కంఠ పెరిగిపోతోంది.

పార్వతి శ్రమ ఫలించి, ముప్పావుగంట తర్వాత… భూమ్మీద కొత్త కేరింత వెలువడింది.

పావుగంట తర్వాత పసిగుడ్డును బయటికి తీసుకొచ్చి, పైకెత్తి పట్టుకొని చూపిస్తూ ‘‘ఆడపిల్ల’’ అంది పార్వతి పెద్ద గొంతుతో.

అందరూ చప్పట్లు కొట్టారు.

సూరి కళ్లు మూతలు పడ్డాయి.

అప్పుడే వచ్చి ఆగిన 108 వాహనంలోంచి ఇద్దరు నర్సులు దిగారు, దేవదూతల్లా!

About Author

By editor

Twitter
YOUTUBE