మే 9న మాతృ దినోత్సవం

అమ్మది కొండంత ప్రేమ. దాన్ని పిల్లలందరికీ పంచుతుందాతల్లి! ఆ ప్రేమను పంచడం పొత్తిళ్ల నుంచే మొదలవుతుంది. ఎవరిని వారిగా నిలబెట్టేంత వరకు సాగుతుంది అది. అసలు తన (అమ్మ) బొందిలో ప్రాణమున్నంత వరకు భువిని దివిగా మార్చేటంత దేవత అమ్మ. పసికందు బుగ్గ గిల్లినా, ఊయలూపి జోల పాడినా, చిట్టిపొట్టి మాటలకు మురిసినా.. ప్రతి క్షణం కనిపించేది తల్లిప్రేమలోని దివ్యత్వమే. బుడిబుడి నడకల అడుగులకు అడుగడుగునా మైమరచేదీ ఆ మాతృత్వమే. అంతటి దైవాన్ని గుర్తుచేసుకోవాలని, అందుకో తేదీని నిర్ణయించుకోవాలని ఎవరో మనకు చెప్పడమేమిటి- వెర్రి కాకుంటే? అసలంటూ మరిస్తే కదా, మళ్లీ జ్ఞప్తికి తెచ్చుకోవడానికి! అంతర్జాతీయ మాతృ దినోత్సవం ప్రతి ఏటా మే నెల రెండో ఆదివారం (ఈసారి తొమ్మిదిన) నిర్వర్తించాలంటున్న ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు ఒక కారణం చూపుతున్నాయి. వాటి వివరాల సంగతీ సందర్భాలూ ఇప్పుడు చూద్దాం.


ఒక్కసారి చరిత్ర పుటలను తిరగేస్తే- గతంలో మదరింగ్‌ ‌సండే పేరిట ప్రత్యేకించి ఇంగ్లండులో ఉత్సవాలు జరిగేవి. అవి ప్రజలు సంప్రదాయంగా జరుపుకొనే వేడుకలు. ఇంటింటా తల్లిని సమాదరిస్తూ మాటలు, పాటలతో భావ వ్యక్తీకరణ చేసేవారు. అటు తర్వాత ఓ అమెరికా మహిళ ముందుకొచ్చి ‘శాంతికి ప్రతీక అమ్మ’ అంటూ ఆ దేశమంతటా సంబరాలకు కారకురాలయింది. అంతర్యుద్ధం పేరు విన్నారు కదా. అది కలిగించిన నానారకాల వేదనలు, రోదనలు మరచేలా, ప్రతి ఒక్క గృహంలోనూ మాతృప్రేమను తలచుకొని గౌరవించుకునే పద్ధతి. నిర్వాహకురాలి తనయ అదే విధానానికి అనంతర కాలంలో అత్యంత ప్రాచుర్యం కలిగించింది. జనని రెండో వర్ధంతి నుంచే ప్రారంభించి, సరికొత్త రీతికి శ్రీకారం పలికింది. పరిణామక్రమంలో మనతో పాటు మరెన్నో దేశాలు అనుసరిస్తూ వస్తున్నాయి. వాటన్నిటి పరిగణన దరిమిలా, ఆ మహోత్సవాల ప్రస్తుత వయసు సంఖ్యాపరంగా 111 వత్సరాలు!

త్యాగ చరిత- రాగ భరిత

జనని అంటే…కుటుంబమంతటినీ ఒక్కటిగా ఉంచే ముడి. అది సడలకుండా ఉన్నంతవరకే ఆ ఇంటికి పట్టు. ఇతరత్రా పరిస్థితి వేరు. కాస్తంత ఎదిగిన వెంటనే, బిడ్డలు ఎవరి దారి వారే చూసుకుంటారు. అందుకే అక్కడ- కన్నవారి దగ్గరికి చేరి భక్తిగౌరవాలు చూపడానికి నిర్దేశిత తేదీలు ఉన్నాయి. మనకు అలా కానేకాదు. కాకుంటే రోజువారీకి అదనంగా – నిర్ణయించిన ఈ రోజునా ఇక్కడ ప్రేమ వ్యక్తీకరణం ఆహ్వాననీయమే మరి. ‘ప్రథమం గురుకార్యం చ/ దైవకార్యం ద్వితీయకం/ తృతీయ మపిచాతిథ్యం/ స్వాత్మకార్యం చతుర్థకమ్‌’ అం‌టుంది ప్రాచీన శ్లోకం. అంటే…ఏ మనిషైనా తొలిగా పాటించతగింది గురువాక్యం. తదుపరి పనులు -దైవకార్య నిర్వహణ, అతిథులకు సమాదరణ. అనంతరమే సొంతపని. వీటన్నింటినీ మించి ప్రతివారూ తప్పనిసరిగా చూపి తీరవలసింది అమ్మమీద ప్రేమ. అది లేని జీవితం పరమ వ్యర్థం. ఆ దేవుడు అన్నిచోట్లా ఉండలేకనే తల్లిని సృజించాడంటారు. అవును, అదంతా అక్షర సత్యం. నడక, నడత, నాగరికత – అన్నీ నేర్పిస్తుందామె. తనను సంతానం విస్మరించడమంటే- వారిని వారు ఉపసంహరించుకోవడం. కన్నతల్లి త్యాగ పునాదిపైనే ఎవరి జీవనభవంతైనా నిలుస్తుంది. కాదూ కూడదంటే మానవత సమస్తం భూస్థాపితమైనట్లే!

ఎన్నటికీ తీర్చుకోలేనిది మాతృరుణం. ‘జ్ఞానంతు ప్రధానం న తు కర్మహీనం/ కర్మ ప్రధానం న తు బుధ్ధిహీనం/ తస్మాదుబాభ్యాం తు భవేత్ప్రసిధ్ధిః/ న హ్యేక పక్షో విహగ ప్రయాతి’. దీని భావార్ధం: ఎక్కడైనా వికాసం అత్యవసరమే. అది కర్మ లేని చోట ఉపయోగరహితం. పనీ ముఖ్యమే. అలా అని జ్ఞాన చింతన కొరవడితే, అది ప్రయోజన రహితం. ఆలోచన, ఆచరణ- రెండూ ప్రాణికి కీలక బాధ్యతలు. అవి జతపడినప్పుడే మానవ జీవనం సార్ధకం. పిల్లలను కని పెంచి పోషించే వేళల్లో మాతృమూర్తి ఎంతెంత శ్రమ పడుతుందో ఇక్కడే కాదు- ఎక్కడైనా, ఏ లోకంలోనైనా, ఎవరికైనా సాధ్యమేనా? బదులు ఇచ్చుకోవడమన్నది ఎప్పటికీ సాధ్యమవదు. ఆ రుణచెల్లింపు అసంభవం. ఇవన్నీ తెలిసి మసలుకోవా లన్న తెలివిడిని ఐరాస తనదైన ప్రణాళికతో కలిగిస్తోంది. దానిలో భాగమే ఇటీవలి కాలంలో ఢిల్లీ ప్రాంతీయ కేంద్రంగా ఏర్పాటైన మాతృవందన సంస్థ. పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చడం, పాఠశాల స్థాయి నుంచే కుటుంబ బాధ్యతల గురించి బోధించడం -ప్రధాన లక్ష్యాలు. మరికొంత కాలానికి ఈ కార్యక్రమాలు ఒక రూపం సంతరించుకోవచ్చు.

పై లోకంలో అమృతం ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఈ ఇలలో ఆ మాటకు అర్థం మాత్రం తల్లి- అని కవిస్వరం. కని పెంచుతున్న పిల్లల కోసమే తనువులోని అణువణువూ కరుగుతున్నా అదో అనుబంధంగా, అదే ఏకైక బాధ్యతగా తలుస్తుంది తల్లి. భూదేవి వంటి సహనశక్తి కనబరుస్తున్నందుకే తాను ధాత్రిగా పేరొందింది. అందించే ఆ సేవకు విలువ కట్టగల వారెవ్వరు? మానవీయతకు కోవెలగా నిలిచే మాతృహృదిని పదిలం చేసుకునేది ఎందరు? చూస్తూ ఉండగానే కాలం గడుస్తుంది. అమ్మ రూపూ రేఖా మారుతూ వస్తోంది. దరి చేర్చుకోకపోగా, విదిలించి, వదిలించు కునే పెను జాడ్యమూ పెరుగుతున్నది. ముఖం ముడతలు పడి, తల ముగ్గుబుట్టగా మారి, చూపు సన్నగిల్లి, చేతులు వణికి, కాళ్ల సత్తువతగ్గి దీనమై పోతున్నది ఆమె పరిస్థితి. అప్పుడంతా ఎండుటాకుల గలగల! అందుకని బిడ్డలెవరూ సానుభూతి ప్రదర్శించ నక్కర్లేదు. పాద నమస్కారాల చిత్రీకరణ లతో ప్రసార సాధనాలను నింపాల్సిన పనీ లేదు. అమ్మను అమ్మలా చూసుకుంటున్నామా లేదా? అని తమలోకి తాము తొంగి చూసుకుంటే చాలు, అదే పదివేలు!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE