‘జాగృతి’తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖాముఖీ

–     ట్రేస్‌, ‌టెస్ట్, ‌ట్రీట్‌ ‌కేంద్రం విధానం

–   దుష్ప్రచారాన్ని దేశం గమనిస్తున్నది

–     ప్రాణాల ముందు రాజకీయాలు చిన్నవి

–    సంవత్సరాంతానికల్లా వ్యాక్సినేషన్‌ ‌పూర్తి

–    టీకా ఉత్సవ్‌కు అంతా సహకరించాలి


ఏప్రిల్‌ 7‌వ తేదీనే ఆక్సిజన్‌ ‌గురించి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసినా, రాష్ట్రాలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకపోవడం వల్లనే ప్రాణవాయువు విషయంలో ఇబ్బందులు తలెత్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 160కి పైగా ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించినా రాష్ట్రాల అలసత్వం కారణంగానే అవి నిర్మాణానికి నోచుకోలేదని  ఆయన ఆరోపించారు. రాష్ట్రాలు కోరకముందే పరిశ్రమల నుంచి ప్రాణవాయువును ఆసుపత్రులకు తరలించిన సంగతిని గుర్తించాలని కోరారు. ఆక్సిజన్‌, ‌కరోనా నిరోధక వ్యాక్సిన్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతుంటే అరికట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు, పత్రికలు అదేపనిగా కేంద్రం మీద నిందలు వేసినంతమాత్రాన సమస్య పరిష్కారం కాదని అన్నారు. విదేశీ సాయం పంపిణీలో జాప్యం లేదని చెప్పారు. మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తులకు అవసరమైన అనుమతులు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఔషధ నియంత్రణ శాఖ మాత్రమేనని కూడా కేంద్రమంత్రి చెప్పారు. దేశమంతా కొవిడ్‌ 19 ఏకరూపంలో లేదనీ, ఆ కారణంగానే లాక్‌డౌన్‌ ‌నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టిందని స్పష్టం చేశారు. ఈ సంవత్సరాంతానికి భారతీయులందరికీ వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం పూర్తి కాగలదనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం ఒక సంక్షోభం అంచుకు చేరుకున్న సమయంలో జాగృతి కోసం గౌ.శ్రీ. కిషన్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలు:

మొదటి వేవ్‌ ‌కరోనాను అత్యంత సమర్ధంగా ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం రెండవ వేవ్‌ ‌తీవ్రతను, వేగాన్ని అంచనా వేయడంలో ఎందుకు వెనుకపడింది?

మొట్టమొదటిసారిగా భారతదేశంలో కరోనా ప్రారంభమైనప్పుడు భారత వైద్య ఆరోగ్య వ్యవస్థకు దానిని ఎదుర్కొనగలిగే మౌలిక వసతులు లేకుండే. అందుకోసం మార్చ్ 22‌న జనతా కర్ఫ్యూ ప్రకటించి మార్చ్ 25 ‌నుండి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించడం జరిగింది. లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన రోజు భారతదేశంలో మాస్కులు కానీ, సానిటైజర్లు కానీ, పీపీఈ కిట్లు కానీ, అవసరమైనంత ఆక్సిజన్‌ అం‌దుబాటు కానీ, వెంటిలేటర్లు కానీ లేకపోయాయి. లాక్‌డౌన్‌ ‌రోజు నుండి కేంద్ర ప్రభుత్వం నిర్విరామ కృషి ఫలితంగా వీటన్నింటిని సమకూర్చుకోగలిగాం. పీపీఈ కిట్లు, మాస్కులు, సానిటైజర్లను మనం విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. లాక్‌డౌన్‌ ‌కంటే ముందు తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉంటే కేంద్ర ప్రభుత్వం 1250 అదనపు వెంటిలేటర్లను ఆ ప్రభుత్వానికి సమకూర్చింది. దీంతో పాటు ప్రపంచం మొత్తం మీద కరోనా దుష్ప్రభావాన్ని ఎదుర్కొనడానికి ఇవ్వాల్సిన చికిత్స పట్ల డాక్టర్లకు కూడా అవగాహన లేని నేపథ్యం నుంచి ఈరోజు సమర్థవంతంగా కరోనా రోగులకు చికిత్స అందించి, మరణాలను అరికట్టుగలుగుతున్నాం. అయితే అన్‌ ‌లాక్‌డౌన్‌ ‌ప్రారంభమైన తర్వాత దేశంలో ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాలలో పని ప్రారంభించిన నేపథ్యంలో 2021లో మరోసారి సెకండ్‌ ‌వేవ్‌ ‌రూపంలో కరోనా విజృంభిస్తోంది. ఇది శాస్త్రవేత్తలు ఊహించినదాని కంటే ఎక్కువ వేగంతో వ్యాపిస్తోంది. ఫలితంగా ఎక్కువ మంది ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయినప్పటికీ సమర్థవంతంగా కరోనా రోగులకు చికిత్స అందిస్తూ,కరోనా మరణాలను ప్రపంచ దేశాల కంటే తక్కువ స్థాయిలో 1.09 శాతానికి దిగువన ఉంచగలుగుతున్నాం. కరోనా రెండో వేవ్‌ ‌తీవ్రంగా ఉన్నప్పటికీ దేశమంతా ఏకరూపంగా లేని కారణంగా లాక్‌డౌన్‌ అం‌శాన్ని రాష్ట్రాల నిర్ణయాలకే వదిలివేసింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక కార్యకలాపాలకు అడ్డు రాకుండా కరోనాను నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. ఈ రెండో వేవ్‌ను మే నెలాఖరు వరకు నియంత్రించగలమన్న సంపూర్ణ విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

ఈ దశ కరోనా కట్టడి కోసం భారత్‌ ‌చేస్తున్న పోరాటానికి దాదాపు నలభయ్‌ ‌దేశాలు బాసటగా నిలుస్తున్నట్టు చెప్పాయి. కానీ ఆ దేశాల నుంచి వచ్చిన సాయం సకాలంలో బాధితులకు చేరడం లేదని ఇప్పుడు ఒక వర్గం మీడియా ఆరోపణ. ఇది నిజమేనా? ఆ సాయం పంపిణీలో లోపం/జాప్యం ఎవరిది?

భారతదేశంలో జనాభా ఎక్కువ, జనసాంద్రత ఎక్కువ. అందువల్ల కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ తీవ్రతను నియంత్రించడానికి, పెరుగుతున్న కరోనా రోగులకు సమర్థవంతంగా చికిత్స అందించడానికి, ముఖ్యంగా ఆక్సిజన్‌ ‌వంటి అత్యవసర అవసరాలను తీర్చడానికి ప్రపంచంలోని చాలా దేశాలు మనకు సహకారాన్ని అందిస్తున్నాయి. ఆక్సిజన్‌ ‌సిలిండర్లు, ఆక్సిజన్‌ ‌కాన్సన్‌‌ట్రేటర్లు, ఆక్సిజన్‌ ‌ప్లాంట్లకు కావాల్సిన యంత్ర సామాగ్రిని యూరప్‌, అమెరికా దేశాలు మనకు అందిస్తున్నాయి. వీటిని వెంటవెంటనే కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలకు అందించడం జరుగుతోంది.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ సహకారాన్ని వినియో గించుకొని కరోనా నియంత్రించడానికి, కరోనా రోగులను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ ‌లాంటి పెద్ద రాష్ట్రాలలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా చికిత్సకు అవసరమైన ప్రాణవాయువును కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందించడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు మోదీ ప్రభుత్వం దౌత్యనీతి కారణంగా అమెరికా లాంటి దేశాలు మనదేశంలో ఉత్పత్తి అవుతోన్న కరోనా వ్యాక్సిన్‌ ‌కు అవసరమైన ముడి పదార్థాలను కూడా యుద్ధ ప్రాతిపదికన అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో వైద్య, ఆరోగ్య రంగంలోని యంత్రాంగం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమర్థత పైనే కేంద్రం ఇస్తున్న సహకారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

మెడికల్‌ ఆక్సిజన్‌ ‌కొరత పేరుతో దేశంలో చాలా రాజకీయాలు, అవకతవకలు జరిగిపోతున్నాయి. ఒక వర్గం మీడియా దృష్టిలో ఈ సమస్య జాతీయ సంక్షోభం స్థాయికి చేరింది. కోర్టుల హెచ్చరికలు తీవ్రంగా ఉన్నాయి. ఇందులో కేంద్రం బాధ్యత ఎంతవరకు? రాష్ట్రాల పాత్ర ఏమిటి?

దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ అం‌దుబాటులో లేని కారణంగా కరోనా చికిత్సలో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవం. అయితే మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తులకు కావాల్సిన అనుమతులు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఔషధ నియంత్రణ శాఖ మాత్రమే. పరిస్థితి తీవ్రతను గుర్తించిన మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు రాకపోయి నప్పటికీ దేశంలోని అనేక పరిశ్రమలకు ఉపయోగించే ఆక్సిజన్‌ను వెంటనే ఆపు చేయించి, ఆ ఆక్సిజన్‌ను మెడికల్‌ ఆక్సిజన్‌గా మార్చి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్‌ ‌మేరకు అందించడం జరుగుతోంది. విశాఖ స్టీల్‌, ‌రూర్కెలా స్టీల్‌ ‌ఫ్యాక్టరీ, భిలాయ్‌ ఉక్కు కర్మాగారం, బళ్లారి వంటి అనేక పరిశ్రమలలో పారిశ్రామిక ఆక్సిజన్‌ ‌సిలిండర్‌ ‌వినియోగాన్ని ఆపి మెడికల్‌ ఆక్సిజన్‌గా మార్చి ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఆయా పారిశ్రామిక కేంద్రాల నుండి వీటి సరఫరా కోసం రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు కారణంగా భూమార్గంలో ఆక్సిజన్‌ ‌రవాణాను చేయగలిగే ట్యాంకర్లు పూర్తిస్థాయిలో అందు బాటులో లేని కారణంగా ఆక్సిజన్‌ అవసరమైన ప్రాంతాలకు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవం. ఏప్రిల్‌ 7‌నే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాని కారణంగా తగిన వేగంగా ఆక్సిజన్‌ ‌సరఫరా జరగడం లేదు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ‌ఫండ్‌ ‌నుంచి దేశంలో 160కి పైగా ఆక్సిజన్‌ ‌ప్లాంట్లకు నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా అవి నిర్మాణానికి నోచుకోలేదు. ఉదాహరణకు తెలంగాణకు 6 ఆక్సిజన్‌ ‌ప్లాంట్లు కేటాయించినా వాటిని సకాలంలో నిర్మించి, వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాస్తవానికి ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నప్పటికీ,కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని అన్ని పారిశ్రామిక ఉత్పత్తులను నిలిపివేసి, మెడికల్‌ ఆక్సిజన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తోంది. దీనిపై మీడియాలో వస్తున్న ప్రచారాలన్నీ సత్యదూరాలు, అవాస్తవాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని అందిపుచ్చు కొని కరోనా బారినపడ్డ ప్రజలకు ఆక్సిజన్‌ అం‌దుబాటులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.

ఆత్మ నిర్భర భారత్‌ ‌స్ఫూర్తితో దేశమే కరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేసుకున్నది. ప్రపంచ దేశాలకు అందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాక్సిన్‌ ‌సామర్ధ్యాన్ని గుర్తించింది. ఇప్పుడు సొంత రాష్ట్రాల అవసరాలు తీరని పరిస్థితి తలెత్తింది. వ్యాక్సినే పరిష్కారం అని కొందరు నిపుణులు, వైద్యులు ఘంటాపథంగా చెబుతున్న నేపథ్యంలో ప్రజలలో దీని కొరత మరీ భయాందోళనలు రేపుతోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

భారతదేశం కరోనాను నియంత్రించి, అరికట్టే చర్యలలో భాగంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తికి కావాల్సిన పరిశోధన లను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పరిశోధన సంస్థలు గత ఏప్రిల్‌ ‌నుంచే ప్రారంభించాయి. భారత దేశంలోని వ్యాక్సిన్‌ ‌తయారుచేసే సీరం ఇండియా, భారత్‌ ‌బయోటెక్‌ ‌వంటి కంపెనీలు భారత ప్రభుత్వ సాంకేతిక సహకారంతో పరిశోధనలు ప్రారంభించి 2021 జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ వ్యాక్సిన్‌ ‌ప్రారంభ దశలోనే కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధంగా 2021 చివరి నాటికి దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వ్యాక్సిన్‌ ‌తొలిదశలో ప్రధానమంత్రితో సహా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేసినప్పటికీ ఆశించినంత వేగంగా వ్యాక్సినేషన్‌ ‌జరగలేదు. దానికి తోడు కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌తీవ్ర రూపం దాలుస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కృషి కారణంగా ప్రజలలో వచ్చిన అవగాహన ఫలితంగా వారు వ్యాక్సిన్‌ ‌వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దానికి అనుగుణంగా ఈ రెండు కంపెనీలు ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా ఈ సంస్థలకు అందించింది. ఈ కారణంగా ఈ జూలై నెల వరకు ఈ రెండు పరిశ్రమలు ప్రతి నెలా కనిష్టంగా 10 నుంచి 15 కోట్ల డోసుల వరకు ఉత్పత్తి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ ఆగస్టు నుంచి కనీసం 20 కోట్ల డోసులు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటు న్నాయి. ఫలితంగా 2021 సంవత్సరాంతానికి దేశంలో 18 ఏళ్లు పైబడి కరోనా వ్యాక్సిన్‌కు అర్హులైన ప్రతి ఒక్కరికీ 2 డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు ప్రపంచంలో వివిధ దేశాలలో తయారవుతున్న స్పుత్నిక్‌, ‌ఫైజర్‌, ‌జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ ‌వంటి కంపెనీలు భారతదేశంలోని వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని పరిశోధనలు ప్రారంభించాయి. మూడోదశ పరిశోధనలు పూర్తికాగానే ఆ వ్యాక్సిన్‌లను కూడా భారతదేశంలో అందుబాటులో ఉంచాలని కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. వీటన్నిటిని సమగ్రంగా సిద్ధం చేస్తే 2021లో భారతదేశం కరోనాపై పూర్తి నియంత్రణ సాధిస్తుందని కేంద్ర ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. అయితే భారతదేశంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు, నాయకులు, కొన్ని పత్రికలు వ్యాక్సిన్‌పై చేస్తున్న దుష్ప్రచారం దేశ శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదని భావిస్తున్నాను.

వ్యాక్సిన్‌ ‌కేటాయింపులు, పంపిణీ పకడ్బందీగా జరిగిందని వార్తల ద్వారా తెలుస్తోంది. అయినా వ్యాక్సిన్‌, ‌దానితో పాటు మెడికల్‌ ఆక్సిజన్‌ ‌బ్లాక్‌ ‌మార్కెట్‌కు ఎలా తరలిపోయాయి? రెమ్‌డిసివర్‌ ‌పాతికవేల రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ధర పలికిందని వార్తలు వచ్చాయి. లోపం ఎక్కుడుంది?

భారతదేశం మొత్తం ప్రపంచంలోనే వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో మొదటిస్థానంలో ఉంది. అమెరికా కంటే ముందుంది. ఇప్పటికే 16 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ ‌మొదటి డోసు పూర్తి చేసుకున్న ఏకైక దేశం భారతదేశమే. 138 కోట్ల జనాభా ఉన్న పెద్ద దేశంలో టీకా ఉత్సవ్‌ ‌పేరుతో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక సమర్థవంతమైన చర్యల కారణంగా ఇది మరింత వేగవంతంగా ముందుకు సాగుతోంది. వ్యాక్సినేషన్‌ అనేది నాకు తెలిసినంత వరకు ఎక్కడా బ్లాక్‌ ‌మార్కెట్‌లోకి తరలే అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ ‌బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌జరగకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకుంది, తీసుకుంటోంది కూడా. దీంతో పాటు మెడికల్‌ ఆక్సిజన్‌ ‌కొరతను ఆసరాగా చేసుకొని కొంతమంది బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి ఆక్సిజన్‌ ‌రవాణా సరఫరాను వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించగలిగితే ఈ బ్లాక్‌ ‌మార్కెట్‌ను తగ్గించ వచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఈ బ్లాక్‌ ‌మార్కెట్‌ను నిరోధించగలుగుతుంది కాబట్టి బ్లాక్‌ ‌మార్కెటింగ్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతో పాటు కరోనా రోగుల చికిత్స కోసం ఇచ్చే రెమ్‌డెసివిర్‌ అనే మందు బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌జరుగుతుందని తెలిసింది. కరోనా బారినపడ్డ ప్రతి రోగికి రెమ్‌డెసివిర్‌ అనే ఇంజక్షన్‌ అవసరం లేదని గుర్తించాలి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇస్తున్న చికిత్సలో రెమ్‌డెసివిర్‌ ‌తప్పనిసరి అని జరుగుతున్న ప్రచారం కారణంగా దీని డిమాండ్‌ ‌పెరిగింది. రెమ్‌డెసివిర్‌ అనే మందు పేటెంట్‌ ‌పరిధిలో ఉన్న కారణంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఈ మందును ఉత్పత్తి చేస్తున్నందున పెరిగిన డిమాండ్‌ ‌మేరకు అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, వైద్య సిబ్బంది దీనిని బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రెమ్‌డిసివిర్‌ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరిన్ని కంపెనీలకు ఈ మందు తయారు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఒక వారంలోపు ఆయా కంపెనీల ఉత్పత్తులు ప్రారంభమై పూర్తి స్థాయిలో రెమ్‌డెసివిర్‌ ఇం‌జక్షన్‌ అవసరమైనంతగా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నాను. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని కేటాయించిన 30వేల ఇంజక్షన్లకు బదులుగా 1.25 లక్షలకు పైగా వినియోగం జరిగింది. దీనిని బట్టి రెమ్‌డెసివిర్‌ ఇం‌జక్షన్‌ ‌వాడకం ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థమవుతుంది. ఈ కొరతను అవసరంగా మార్చుకొని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారేమో అని అనిపిస్తోంది. దీనికి తోడు కొంతమంది దుర్మార్గులు నాణ్యత లేనటువంటి (జూబతీఱశీబ •తీబస్త్ర) ఇంజక్షన్‌లను రెమ్‌డెసివిర్‌ ‌పేరు మీద అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. దీని వల్ల రోగం తగ్గకపోగా రోగి మరింత ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ. అందుకోసం కరోనా రోగులెవరూ కూడా బ్లాక్‌ ‌మార్కెట్‌లో రెమ్‌డెసివిర్‌ ‌పేరు మీద వస్తోన్న మందులను కొనొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

లాక్‌డౌన్‌ను ఆఖరి ఆస్త్రంగానే ప్రయోగించా లని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. అదే రాష్ట్రాలకు కూడా సూచిస్తున్నారు. కానీ ప్రజలలో అత్యధికులు కరోనా కట్టడికి అవసరమైన నిబంధన లను పాటించడంలేదన్నది స్పష్టం. రోజువారీ కేసులు లక్షలకు చేరుకుంటున్న తరణంలో ఈ క్లిష్ట సమస్యను ఎలా పరిష్కరించవలసి ఉంటుంది?

దేశంలో కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌కారణంగా కరోనా బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ, అది ఇప్పుడు 4 లక్షలు దాటిందన్నది వాస్తవం. అయితే 2020 లాక్‌డౌన్‌ అనుభవాలతో దేశం మొత్తం మీద కరోనా వ్యాప్తి ఏకరూపంగా లేని కారణంగా ఆయా రాష్ట్రాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ ‌విధించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా నిర్దేశించింది. అయితే లాక్‌డౌన్‌ ‌కంటే ఎక్కువ కరోనాను నియంత్రించగలిగే ట్రేస్‌, ‌టెస్ట్ అం‌డ్‌ ‌ట్రీట్‌ (‘3 ‌టి’) అనే మూడు అంశాలను సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్రం చెప్పింది. దీంతో పాటు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రాంతాలలో కంటైన్మెంట్‌ ‌జోన్లను ప్రకటించి కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అదే సందర్భంగా వ్యాక్సినేషన్‌పై కూడా సమర్థవంతంగా ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది.అయితే ఆయా రాష్ట్రాలు పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్‌, ‌నైట్‌ ‌కర్ఫ్యూ, కంటైన్మెంట్స్ ‌చేయడంతోపాటు ట్రేస్‌, ‌టెస్ట్, ‌ట్రీట్‌ (‘3 ‌టి’) విధానం కూడా అమలు చేస్తున్నాయి. ఏది ఏమైనా మే నెలాఖరు వరకు కరోనా విజృంభణను నియంత్రించగలమన్న విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేస్తోంది. ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర ఆర్థికాంశాలు, పేదల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్‌ ‌కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. దీంతో పాటు దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆర్బీఐ కూడా అనేక వెసులుబాట్లు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకొని కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆశిస్తున్నాను.

కరోనాను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బీజేపీ మీద, మోదీ ప్రభుత్వం మీద అవమానకరమైన విమర్శలకు దిగుతున్నాయి. కానీ ఈ విమర్శలలోని నిజా నిజాలను సాధారణ ప్రజానీకం దృష్టికి తెచ్చే యత్నం జరగడం లేదని చాలామంది భావన. బాధ కూడా. ఇది నిష్క్రియాత్మక ప్రభుత్వం కాదన్న సగటు భారతీయుడి నమ్మకాన్ని వమ్ము చేసేందుకు యత్నిస్తున్నారు. రైతుల పేరుతో జరుగుతున్న అరాచకంలో బయటపడిన టూల్‌కిట్‌ ‌కుట్రకు ఇది కొనసాగింపేనన్న అభిప్రాయం కూడా ఉంది. దీని మీద మీ స్పందన!

2020 మార్చ్ 25‌న భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించి కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం చేసిన కృషిని కొన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే దేశ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించి, లాక్‌డౌన్‌ అమలులో పూర్తిగా కరోనాను నియంత్రించడానికి ముందు వరసలో ఉండి పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు సంఘీభావంగా నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అందుకొని కొవ్వొత్తులు వెలిగించారు, చప్పట్లు కొట్టారు. అన్‌ ‌లాక్‌డౌన్‌ ‌ప్రారంభమైన తర్వాత నరేంద్ర మోదీగారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ప్యాకేజీ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను వివిధ వర్గాలకు, వివిధ రూపాల్లో అందించింది. నరేంద్ర మోదీ పట్ల రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను సహించలేని కొన్ని రాజకీయ పార్టీలు, విదేశీ భావజాలంతో పని చేస్తున్న కొన్ని సంస్థలు అర్థం లేని విమర్శలతో ప్రకటనలు చేస్తున్నారు. చివరకు ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ప్యాకేజీని కూడా విమర్శించారు. ఇంత కష్టకాలంలో కూడా దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టి, ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీని బద్నాం చేయడానికే ఈ రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తుంటే దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు విమర్శించడాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వలస కార్మికుల సమస్యను భూతద్దంలో చూపి మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయల అదనపు నిధులతో (బడ్జెట్‌ ‌కేటాయింపులు కాకుండా) గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ వలస కార్మికులను ఆదుకున్నది. గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజన కింద ప్రతి పేదవానికి అన్నం పెట్టింది. ఆకలి చావులు లేకుండా చూడ గలిగింది. చివరకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వ్యాక్సిన్‌ ‌పరిశోధనలను కూడా విపక్షం తప్పుపట్టింది. వ్యాక్సిన్‌పై నమ్మకం లేదని, వేసుకోవద్దని కొందరు ప్రతిపక్ష నేతలు బహిరంగ ప్రకటనలే చేశారు. ఇంత చేస్తున్నా భారత ప్రజలు ఈ రాజకీయ పార్టీలను, విదేశీ భావజాలం ముసుగులో పని చేస్తున్న కమ్యూనిస్టులను, వారి ప్రభావంతో నడుస్తున్న కొన్ని పత్రికా ప్రసార సాధనాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని రకాల ఆదేశాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఆత్మవిశ్వాసం నింపాల్సిన కొన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. మీ ప్రశ్నలోనే దుష్ప్రచారం ఉందని అంటున్నప్పుడు ఇది తప్పకుండా దుష్ప్రచారమేనని నేను భావిస్తాను. ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు ఈ దుష్ప్రచారాన్ని, దాని వెనక ఉన్న శక్తులను ప్రజలే తిప్పికొడతారు. అందుకే కరోనా కంటే ముందు ప్రపంచం, కరోనా తర్వాత ప్రపంచం.. అందులో భారతదేశం పాత్ర దానికనుగుణంగా కార్యాచరణ ఇది మోదీ గారి దార్శినికతకు అద్దం పడుతుంది. అయితే ఇదే సందర్భంగా ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ప్యాకేజీలో భాగంగా గత జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో పార్లమెంటులో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనలు దురదృష్టకరం. దీని వెనక ఉన్న స్వదేశీ, విదేశీ శక్తులను, కుట్రలను భారత రైతాంగం అర్థం చేసుకుంది. మరీ ముఖ్యంగా పంజాబ్‌ ‌రైతులు మొన్న రబీ కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తిగా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కుట్రపూరిత రైతు ఉద్యమాలకు రాబోయే రోజులలో మద్దతు లభించదని నేను భావిస్తున్నాను.

ఈ కల్లోల కాలంలో దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలుగువారికి మీరిచ్చే సందేశం.

ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా కబళిస్తున్నది. ప్రపంచ మానవాళి వికాసానికి, అభివృద్ధికి ఇది అడ్డంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనాను నియంత్రించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భారతదేశం కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ కరోనాను అరికట్టడానికి రాత్రింబవళ్లూ కృషి చేస్తున్నది. ఇందులో భాగస్వాములంతా సమర్థవంతంగా పని చేస్తున్నారు, అనేక ప్రయోగాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. నాకు తప్పకుండా విశ్వాసం ఉంది… ఈ సంవత్సరాంతానికల్లా కరోనాను నియంత్రిస్తామని, కరోనాపై విజయం సాధిస్తామని! అయితే ఈ క్లిష్ట సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు సంయ మనంతో, కలసికట్టుగా, సమర్థవంతంగా కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో కలసి కరోనాను నియంత్రిం చేందుకు రాజకీయాలను దూరం పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రజల ప్రాణాల ముందు రాజకీయాలు చాలా చిన్నవి. ఓట్లు, సీట్లు అసలు ముఖ్యమే కాదు. కరోనాను ఎదుర్కొనేందుకు ధైర్యమే ఒక మందు. ధైర్యంగా ఉందాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాలను పాటిద్దాం.. మాస్కులు ధరిద్దాం.. భౌతికదూరాన్ని పాటిద్దాం.. చేతులను కడుక్కుందాం.. కరోనాకు దూరంగా ఉందాం.. ఏ కారణం చేత కరోనా మనకు వచ్చినా ధైర్యంగా కరోనాను జయిద్దాం. ఇప్పటికే దేశంలో 2 కోట్లకుపైగా ప్రజలు కరోనాను జయించారు. వాళ్లందరి మార్గంలో మనమూ వెళ్దాం. దీంతోపాటు టీకా ఉత్సవ్‌ను కూడా మరింత వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు సహకరిద్దాం..

About Author

By editor

Twitter
YOUTUBE