చైత్రమాసంలో వచ్చే హిందూ నూతన సంవత్సరం లేదా నవరాత్రి, దీనినే కశ్మీర్‌లో ‘నవరెహ్’ అంటారు. ఈ ఉత్సవం కశ్మీరీ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. మూడు దశాబ్దాల తరువాత ఈసారి కశ్మీరీ హిందూ శరణార్థులు ఈ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకున్నారు. ఈ ఉత్సవాలను సంజీవని శారదా కేంద్రం నిర్వహించింది. ఏప్రిల్ 12న శిర్యభట్ అపూర్వమైన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ త్యాగ దివస్ జరుపుకున్నారు. ఏప్రిల్ 13న సంకల్ప దివస్, చివరిరోజు (ఏప్రిల్ 14) చక్రవర్తి లలితాదిత్యుని గుర్తుచేసుకుంటూ శౌర్య దివస్ పాటించారు. మూడు రోజుల ఉత్సవాల చివరి రోజున ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవాల నిర్వహణలో జమ్ముకశ్మీర్‌కు చెందిన 150 సామాజిక, ధార్మిక సంస్థలు పాలుపంచుకున్నాయి.
జమ్ముకశ్మీర్‌తో పాటు విదేశాల్లో ఉన్న హిందువులకు నవరెహ్ శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ హోసబలే.. దేశం, సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వహించాలన్న సంకల్పానికి బలం కొన్ని వందల రెట్లు ఉంటుందని అన్నారు. శతాబ్దాల పాటు విదేశీ శక్తులతో పోరాడిన మన పూర్వీకులు ఎప్పుడూ తమ పోరాటాన్ని ఆపలేదని, నిరాశకు గురికా లేదన్నారు. శిర్యభట్ త్యాగభావన, లలితాదిత్యుని శౌర్యం నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని అన్నారు. బప్పరావల్ సహాయంతో లలితాదిత్యుడు అరబ్ దురాక్రమణదారులను తరిమికొట్టారని ఆయన గుర్తుచేశారు.
కశ్మీరీ హిందువుల త్యాగాల గురించి దత్తాత్రేయ తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. కొన్ని దశాబ్దాలుగా హిందూ ధర్మాన్ని కాపాడటంలో కశ్మీరీ హిందువులు చేసిన త్యాగాలు అపూర్వమైనవని అన్నారు. తికలాల్ తప్లూ, జస్టిస్ నీలకంఠ గంగు, సరళాభట్, ప్రేమ్‌నాథ్‌భట్ వంటివారు మతమౌఢ్యానికి బలయ్యారని, హిందువులుగా పుట్టడం, కశ్మీరీలు కావడమే వారి పాపమైపోయిందని ఆయన విచారం వ్యక్తంచేశారు.
కశ్మీరీ హిందువులను రక్షించడం కోసం గురుతేజ్ బహదూర్ తన జీవితాన్ని త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. గతంలో అనేకసార్లు కశ్మీరీ హిందువులు తమ స్వస్థలాన్ని వదిలిపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావలసి వచ్చింది. 1989-90లో కూడా ఏడవసారి కశ్మీరీ హిందువులు అలాగే తరలి పోయారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ వేడుకలను చూస్తే కశ్మీరీ హిందువుల పట్టుదల, కష్టాలను తట్టుకుని నిలబడగలిగిన శక్తి వెల్లడవుతున్నాయి.
యూదులు, టిబెటన్ల ఉదాహరణలను ప్రస్తావించిన దత్తాత్రేయ హోసబలే తమ మాతృభూమి నుండి తరిమివేయబడి ప్రపంచంలోని వివిధ దేశాల్లో తలదాచుకున్న యూదులు తరతరాలుగా తమ మాతృభూమిని చేరుకుని, అక్కడ తమ పండుగలు యథావిధిగా జరుపుకునే సంకల్పాన్ని, లక్ష్యాన్ని మరచిపోలేదని, చివరికి ఆ పోరాటంలో విజయం సాధించారని అన్నారు. చైనా దురాక్రమణ మూలంగా టిబెటన్లు కూడా తమ భూమి నుంచి దూరమయ్యారు. ఇప్పటికీ వారు తమ మాతృభూమిని తిరిగి పొందేందుకు పోరాడుతూనే ఉన్నారు. జమ్ముకశ్మీర్‌లో జిహాదీ అకృత్యాలను అడ్డుకునేందుకు భారత సైనికులు, పారమిటరీ బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారని సర్ కార్యవహ గుర్తుచేశారు.
ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో పరిస్థితుల గురించి ప్రస్తావించిన ఆయన 370 అధికరణం, 35ఏ అధికరణాల రద్దు ఈ కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్‌లు చేపడుతోందని అన్నారు.
నవరెహ్ మహోత్సవం, 2021 నిర్వహణలో పూర్తి సహాయ సహకారాలు అందించిన సంస్థలన్నిటికి సంజీవని శారదా కేంద్ర ఉపాధ్యక్షులు అవతార్ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సర్ కార్యవాహ స్ఫూర్తివంతమైన సందేశం జమ్ముకశ్మీర్ హిందువుల మనోబలాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచిందని, దేశంతోపాటు ప్రపంచమంతా జమ్ముకశ్మీర్‌కు అండగా నిలబడుతుందన్న నమ్మకాన్ని కలిగించిందని అవతార్ కృష్ణ అన్నారు.
ఆర్గనైజర్ నుండి
అను: కేశవనాథ్