– పెండ్యాల గాయత్రి

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘వినీల్‌… ‌మన విక్కీ… విక్కీ…’’

‘‘విక్కీకి ఏమయింది నవ్య?’’

‘‘విక్కి… విక్కీ.. కనిపించడం లేదు వినీల్‌!’’

‘‘అదేంటి… నువ్వింట్లోనే ఉన్నావు కదా?’’

‘‘నేను ల్యాప్‌టాప్‌లో వర్క్ ‌చేసుకుంటూ విక్కీకి మొబైల్‌ ఇచ్చాను. వాడు ఆడుకుంటున్నాడనుకున్నా.. వర్క్ ‌పూర్తయ్యాక చూస్తే,’’ ఏడుస్తూ అంది.

‘‘అలా ఏడవకు, ఎక్కడికీ పోడు.. ఇంట్లో ఏదో ఒక గదిలో ఉంటాడులే చూడు.. నేను బయలుదేరా… ఐదు నిమిషాలలో వచ్చేస్తా.’’

‘‘అరగంట నుండి వెదికాను వినీల్‌… ఎక్కడా కనిపించలేదు.’’

‘‘నేనొచ్చేస్తున్నా.. నువ్వలా కంగారు పడక ప్రశాంతంగా చూడు, ఇల్లు వదలి ఎక్కడికీ పోడు.’’

కట్టయిన సెల్‌ఫోన్‌ను కుర్చీలో విసిరేసి, కన్నీళ్లను తుడుచుకుని,  మరొకసారి కాళ్లకు, కళ్లకు పని పెట్టింది నవ్య. మూడు విశాలమైన పడకగదులు, ఆ మూడు గదులు ఏకమైనంత హాలు, హాలులో సగం పరిమాణంలో ఉన్న వంటగది, హాలు ముందున్న వరండ, వరండాను అనుకుని ఉన్న పార్కింగ్‌ ‌ప్రదేశం, దానిముందున్న ఖాళీ స్థలం అన్ని చోట్లా, ‘‘విక్కీ!’’ అని కేకలు పెడుతూ, వెదికింది. బయటకు వచ్చి పక్కింటివాళ్లను, ఎదురింటి వాళ్లను, తెలిసిన వాళ్లను, కనిపించిన ప్రతి వాళ్లను వదలకుండా అడిగింది.. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె ఆందోళన కట్టలు తెంచుకుంది.  వెన్ను విరిగినట్లు నరాలన్నీ మెలిబెడుతుంటే అతికష్టం మీద ఇంట్లోకి వచ్చి, వరండాలో ఉన్న అక్వేరియాన్ని ఊతంగా పట్టుకుని నిలబడింది. కొద్ది నీళ్లమధ్య పరుగులు పెడుతున్న చేపపిల్లల్లా, కన్నీళ్ల మధ్య జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నాయి.

——————-

కోట్లాది రూపాయల ఆదాయాన్ని కళ్లచూసే వ్యాపారవేత్త ఇంట్లో ఏకైక సంతానంగా పుట్టింది నవ్య. సకల సుఖాలు అనుభవిస్తూనే ఇంజనీరింగ్‌ ‌పూర్తిచేసి, అవసరం లేకున్నా ఉద్యోగంలో చేరింది. నాన్న స్నేహితుడు, వ్యాపార భాగస్వామి కొడుకు అయిన వినీల్‌తో వైభవంగా వివాహం జరిగింది. ఎంత సంపద ఉన్నా, తమ ఉద్యోగాలను వదులుకోమని పెద్దలకు చెప్పి, హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. నవ్య, వినీల్‌ ‌దంపతులు.

నగర రణగొణ ధ్వనులకు దూరంగా తమ అభిరుచుల మేరకు విశాలమైన ఇల్లు కట్టుకుని ఏ లోటు లేకుండా పాలూ, మీగడల మేళవింపుగా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు.

అయితే… ఒకటి కాదు, రెండు కాదు ఆరు సంవత్సరాలు గడచిపోయాయి.. కానీ, తను తల్లి కాలేకపోయింది. దేవుళ్ల చుట్టూ, డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టింది. లక్షలాది రూపాయలు మంచినీళ్ల మాదిరి ఖర్చు చేశాక, అతి కష్టం మీద ఒక బాబుకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు, అత్తమామలు బాబును  దగ్గరుంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నా, వాడిని వదలి ఉండలేక తమ దగ్గరే ఉంచుకుని, మూడవ ఏడు రావడంతోనే బడిలో చేర్పించి, తనూ ఉద్యోగంలో చేరింది. వాడి ఎల్కేజీ పూర్తవకముందే కరోనా కారణంగా మూసివేసిన బడులు నెలలు గడచినా తెరువకపోవడంతో తాను ఇంటినుండే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

బిడ్డను కంటికి రెప్పలా, ఒంటికి బట్టలా అనుక్షణం కాచుకుంటోంది. విక్కీయే తన లోకంగా బ్రతుకుతోంది.

——————-

‘బాబును ఎవరైనా… డబ్బుకోసం కిడ్నాప్‌.!!’

ఆ ఆలోచన రావడంతోనే నిలుచున్నదల్లా నేలపైకి ఒరిగి పోబోతుండగా, వినీల్‌ ‌వచ్చి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు.

అతన్ని చూడగానే ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. వినీల్‌ ‌నవ్యను ఓదార్చి, తన స్నేహితుడి సోదరుడు ఎస్‌.ఐ.‌గా ఇదే ఏరియాలో  పనిచేస్తున్నాడనీ, అతనితో మాట్లాడుదామని ధైర్యం చెప్పి… అతడికి ఫోన్‌ ‌చేసాడు వినీల్‌.

‘‘ఎస్‌ఐగారూ, మా విక్కీ కనిపించట్లేదండీ!’’

‘‘కుక్కలను, పిల్లులను వెదికి పెట్టడానికే నటయ్యా.. పోలీసులున్నది?’’

‘‘అయ్యో.. సార్‌! ‌విక్కీ అంటే నాలుగు సంవత్సరాల మా బాబండీ!’’

‘‘విక్కి, లిక్కి, రిక్కి కన్నా మంచి పేరే దొరకలేదటయ్యా.. మీకు?’’

‘‘మావాడి పేరు వేదాన్ష్ అం‌డీ! ముద్దుగా ‘విక్కీ’ అని పిలుచుకుంటాం.’’

‘‘ప్రేమానురాగాలతో పాటు పేర్లను కూడా కూని చేసేస్తున్నారు.. ప్చ్ ఏం‌చేస్తాం?’’

‘‘సార్‌… ‌మా బాబు ఒక గంట నుండి కనిపించట్లేదండీ!’’

‘‘ఇప్పుడే వాట్సాప్‌లో వైరల్‌ అయిన ఒక వీడియో చూస్తున్నానయ్యా! నీకు ఒక అడ్రస్‌ ‌మెసేజ్‌ ‌పెడతాను, మీరక్కడికి వచ్చేయండీ.. మేము కూడా వస్తున్నాము.’’

‘‘సార్‌.. ‌మా …బా…బు కేదైనా… ప్రమాదం?’’

ఈ కంగారు పిల్లలను నిర్లక్ష్యంగా వదిలివేసినప్పుడు ఉండదెందుకయ్యా?’’ త్వరగా వచ్చేయండి!’’

కాల్‌ ‌కటైపోవడంతో వణుకుతున్న చేతులతో అడ్రస్‌ ‌తెలిపే మెసేజ్‌ ‌కోసం వెదుకుతున్న వినీల్‌ను గట్టిగా కుదుపుతూ,

‘‘నా బిడ్డకు ఏమయింది వినీల్‌? ‌చెప్పు ఏమయిందీ..!’’

తల్లడిల్లిపోతున్న నవ్యను గుండెలకు పొదుముకుని,

‘‘మన విక్కీకేమీ కాదురా! నీ ధైర్యమే వాడికి శ్రీరామరక్ష.. పదా వెళదాం… ఇదిగో, ఎస్‌ఐగారు అడ్రస్‌ ‌మెసేజ్‌ ‌చేశారు, మన పక్కవీధిలోనేలా ఉంది త్వరగా వెళ్లవచ్చు.’’ అంటూ బైక్‌ ‌తీసాడు వినీల్‌.

….‌ప్రయాణిస్తున్నారేగానీ, ఇద్దరి ఆలోచనలు ఆ బైక్‌ ‌కన్నా వేగంగా పరిగెడుతున్నాయి. నవ్య అంత వేదనను భరిస్తూ నిశ్శబ్దంగా ఉండలేక, వినీల్‌తో ఆపకుండా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది.

‘‘ఈ పెద్దవాళ్లా, వాళ్ల వ్యాపకాలు వదులుకుని ఇక్కడికి రాలేరు. చేస్తున్న ఉద్యోగాలు కాదనుకుని మనమా ఊరు వెళ్లలేం. బాబుతో గడపడానికి తగినంత సమయం దొరకదు. వాడి ఆనందం కోసమని, ఆలోచించకుండా ఖర్చుపెట్టి రకరకాల ఆట వస్తువులు, సాంకేతిక పరికరాలు, బుల్లి వాహనాలు లాంటివి అనేకం కొన్నాం. అవన్నీ వదిలేసి అమ్మానాన్నతో ఆడాలి అంటాడు వాడు. లాక్డౌన్‌ ‌మొదలైనప్పటినుంచి బడి లేకపోవడంతో పిల్లలెవరు కనిపించక నా వెంటే తిరుగుతుంటాడు. కరోనా భయం చేత ఎవ్వరూ పిల్లలను ఇంట్లోనుండి బయటకు రానివ్వడం లేదు,  ఇతర పిల్లలతో కలవనివ్వట్లేదు.

ఆటల పిచ్చితో తెగ అల్లరి చేస్తుంటే ఏదో విధంగా వాడిని ఏమార్చి ఆఫీస్‌ ‌పని పూర్తి చేసుకుంటున్నాను. ఇవాళ కూడా ఎలాగో బుజ్జగించి, ఫోన్‌ ‌విక్కీ చేతికిచ్చి నా పనిలో లీనమయ్యాను. పని అయిపోయాక చూస్తే ఫోన్‌ అక్కడే ఉంది, వాడు కనపడలేదు! ఏమయినట్లు? ఊరుకాని ఈ ఊరులో మన కుటుంబానికి ఆత్మీయులు గానీ, ఆగర్భ శత్రువులు గానీ ఎవరు లేరు కదా? బాబే స్వయంగా ఎక్కడికైనా వెళ్లగలిగే అంత వయసు, ఊహ రెండూ లేవాయె. ఇంతటి మహానగరంలో ‘మీ ఇల్లెక్కడ బాబు?’ అని ఎవరైనా అడిగినా చెప్పలేని పసివాడైపోయె. ఆ పోలీసేమో విషయం చెప్పకుండా వీడియో అంటాడు, పక్కవీధిలోకి రమ్మంటాడు. విక్కీ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? అమ్మా నాన్న అంటూ మనం కనిపించక ఎంతలా తల్లడిల్లిపోతున్నాడో..!’’

మాటలలో అంతటి రద్దీని దాటుకుని, ఎస్‌.ఐ ‌చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎస్‌.ఐ ‌వినీల్‌ ‌దంపతులను సమీపించి,

‘‘కన్నబిడ్డ ఏంచేస్తున్నాడు? ఎటు వెళుతున్నాడు? అన్న చిన్న విషయాలు కూడా గమనించలేనంత ఏమరపాటులో తల్లి ఉండకూడదమ్మా! ఇదిగో.. ఒకసారి ఈ వీడియో చూడండీ!’’ అంటూ సెల్‌ఫోన్‌ అం‌దించబోయాడు.

వేదనాసంద్రాన్ని అణచిపెట్టి ఉన్న నవ్య ఎస్‌.ఐ. ‌మాటలు వినడంతోనే కన్నీటి సునామీ అయ్యింది.

‘‘అవును సార్‌..!! ‌కన్నతల్లికి ఏమరపాటు అసలుండకూడదు… కానీ, పరిస్థితులు వికటించి తల్లడిల్లిపోతున్న ఆ తల్లిని.. మరో గొప్పతల్లి కన్నకొడుకు విపరీత చేష్టలతో, వెటకార వ్యాఖ్యలతో ఇంకాస్త వేధించవచ్చు.’’  ధారలు కడుతున్న కళ్లను తుడుచుకోవడానికన్నట్లు పక్కకు తిరిగిన నవ్య రోడ్డుకు కాస్త దూరంలో మట్టినేలపై చలనరహితంగా పడుకుని ఉన్న బాబును చూచి, పరుగున వెళ్లి, ఎత్తుకుని, వాడు నిద్రపోతున్నాడని అర్థంచేసుకుని, ఒంటికంటుకున్న మట్టి దులిపి, ఆబగా ముద్దులాడుతూ భర్తవద్దకు తీసుకొచ్చింది.

‘‘మీ బాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో  చూపించాలనే, అక్కడే వదిలేశాను’’ అన్నాడు ఎస్‌ఐ.

ఆ ‌మాటలేవీ పట్టించుకోకుండా, అమితా నందంతో బాబును అందుకున్న వినీల్‌ ‌కూడా వాడిని ముద్దాడుతూ చుట్టూ ప్రపంచాన్ని మరచిపోయాడు. ఆ స్పర్శకు మేలుకున్న విక్కీ కళ్లు నులుముకుని, నవ్వుతూ,

‘‘డాడీ… మమ్మీ! మమ్మీ!! ఎక్కడ?’’ అన్నాడు.

‘‘ఇదుగో’’ అంటూ నవ్యను చూపించాడు వినీల్‌.

‘‘‌కాదు!! మన మమ్మీ కాదు,, నువ్వు చెప్పిన సెకండ్‌ ‌మమ్మీ!! నేనిప్పటిదాకా ఆ మమ్మీతో ఎంచక్కా ఆడుకున్నాగా…!’’ అంటున్న బాబు మాటలకు నవ్య విస్తుపోగా, బాబును బయటకు తీసుకొచ్చినప్పుడల్లా తను ఎవరి దగ్గర కాసేపు ఆడిస్తాడో, ఎవరినైతే ‘సెకెండ్‌ ‌మమ్మీ’ అని పిలవమని విక్కీకి చెప్పాడో గుర్తుకొచ్చి, వాడి జ్ఞాపకానికి ఆశ్చర్యపడిపోతూ నవ్వుకున్నాడు వినీల్‌.

‘‘‌నేను రోజు ఆ మమ్మీ దగ్గరకు వచ్చీ చక్కగా ఆడుకుంటా డాడీ! ప్లీజ్‌ ‌డాడీ!  డాడీ!’’ వినీల్‌ ‌గడ్డం పట్టుకుని మరీ గోముగా అడిగాడు విక్కీ. అసలు విషయం తెలియని నవ్య అయోమయంగా, కోపంగా చూస్తుంటే, ఆమెను ఉడికించాలనుకుంటూ..

‘‘అలాగే ఆడుకుందువుగాని నాన్నా!’’ అన్నాడు. వినీల్‌ ‌చేతుల్లోంచి బాబును విసురుగా లాక్కుని,

‘‘ముందిక్కడనుంచి ఇంటికెళదాం పదండి!’’ అంటూ ముందుకు కదిలింది నవ్య.

‘‘ఆగండి మేడం! మీబాబు కనిపించగానే అలా వెళ్లిపోతున్నారు.. చాలా ముఖ్యమైన ఈ వీడియో చూడకపోతే ఎలా?’’ ఎస్‌.ఐ ‌మాటలు వ్యంగ్యంగా అనిపించడంతో అతడివైపు ఒక చూపు విసిరి వినీల్‌ ‌కోసం కూడా చూడకుండా, ఏడుస్తున్న బాబును బుజ్జగిస్తూ.. అక్కడనుండి విసవిసా వెళ్లిపోయింది.  ఇంటికి చేరుకున్నా కానీ, వాడు మూలుగు ఆపకపోయేటప్పటికి బ్రతిమాలుతూ బిస్కెట్‌ ‌తినిపించబోగా, ‘‘నాకు బిక్కీ వద్దు, ఆ మమ్మీనే కావాలి. అక్కడికే వెళ్తాను.,’’ అంటూ మారాం చేయసాగాడు.

ఇందాకటివరకు బాబేమయ్యాడో అని ఆందోళన పడడం, వాడు కనిపించి ‘సెకండ్‌ ‌మమ్మీ’ అంటూ షాకివ్వడం, ఇంతసేపైనా వినీల్‌ ఇం‌టికి రాకపోవడం లాంటి విసుగులన్నీ ఏకమై, ముసురుపట్టిన తుఫానులా ఆమె సహనాన్ని సంహరించడంతో బాబు వీపుపై గట్టిగా చరిచింది… ఎప్పుడూ దెబ్బలెరుగని వాడు బిత్తరపోయి, గుక్కపట్టి ఏడుస్తుండగా ఇంట్లోకి వచ్చిన వినీల్‌, ‌తన మొబైల్‌ ‌లోని వీడియో ప్రారంభించి, నవ్యకు ఇచ్చి, విక్కీని ఎత్తుకుని మిద్దెపైకి వెళ్లి, వాడిని ఆడించసాగాడు.

బొంగరంలా బాబుతో గిన్నిగిరి తిరుగుతూనే, దాన్ని తిప్పగలిగిన తాడు గురించి ఆలోచిస్తున్నాడు. ‘ఈ జీవ ప్రపంచంలో కన్నతల్లి కన్నా మిన్నగా బిడ్డను కాచగలిగినవారు ఉండరు అంటారే, అంతటి కన్నతల్లికి కోపమొచ్చేటప్పటికి కన్నబిడ్డను సైతం కొట్టగలిగింది కదా!! మరి, మమత తెలియని, మాటరాని ఆ తల్లిని ఈ పసివాడు కొద్దిసేపట్లోనే అంతలా అల్లుకుపోవడమేంటి? తను ఒక వాలుగా పడుకుని, వీడు మెడపైకి ఎక్కి కూర్చుని ఊగుతుంటే, చెవులు పట్టుకులాగుతుంటే, ముక్కులో వేళ్లు పెట్టి కెలుకుతుంటే, మూతిపై ముద్దుగా గుద్దుతుంటే, మెడను పట్టి మెలిపెడుతుంటే, తులిపిగా వళ్లంతా గిల్లుతుంటే, కాళ్లతో చనువుగా తన్నుతుంటే, తనను పరుపుగా చేసుకుని పడుకుంటుంటే, పడుకుని తాపీగా అటూ ఇటూ పొర్లుతుంటే, శిలాప్రతిమలా స్థిరంగా, సేవాసదనంలా శాంతంగా, ప్రేమభాండంలా హుందాగా లాలించిన ఆ తల్లితో ఆడి ఆడి అలసి, అక్కడే నిద్రించిన బాబుకు బాసటగా పహారా కాస్తూ, కాల మెరుగక నిలుచున్న ఆ తల్లి విక్కీకి అమ్మ కాదంటే ఎలా? వీధిధూళితో, గడ్డితో నిండిన ఆ ప్రదేశాన బాబును కరిచేందుకు వచ్చిన తేలును తన కాలితో తొక్కి, తేలుకాటుకు గురైన ఆ జనని, ఈ వేదకు అమ్మ కాదంటే ఎలా?’

‘‘డాడీ…డాడీ…! ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటీ? సెకెండ్‌ ‌మమ్మీలా నువ్వుకూడా గప్చిప్‌గా ఆడేస్తావా…?’’ విక్కీ మాటలతో తేరుకున్న వినీల్‌ ‌నవ్వీ..

‘‘నీకు ఎలా నచ్చితే అలా ఆడతా నాన్నా!’’ అన్నాడు.

‘‘మరీ.., మమ్మీ కోపగించుకుంటుందెందుకు?’’ బుంగమూతి పెట్టాడు.

‘‘ఇకనుంచి కోపగించుకోదు నాన్నా! ఆ మమ్మీని నీకు పరిచయం చేసిందెవరు? మన మమ్మీనే కదా! పూజ చేసినప్పుడల్లా తనను పిలిచి, బొట్టుపెట్టీ, నీతో పండ్లు,  తినిపిస్తుంది కదా మన మమ్మీ..? ఇవాళ ఉదయం కూడా ఆ మమ్మీకి పండు నువ్వే ఇచ్చావు కదా…!’’

‘‘అవును డాడీ!’’

‘‘మరి నువ్వూ మన మమ్మీకి చెప్పకుండా అలా ఆ మమ్మీ వెంట వెళ్లిపోవచ్చా చెప్పు? నువ్వు కనిపించకపోయేసరికి పాపం మన మమ్మీకి ఎంత భయమేసిందో తెలుసా?’’

‘‘మమ్మీ లాపీ చూసేప్పుడు పిలిస్తే అరుస్తుంది.. అందుకనీ., రోడ్డుపై వెళుతున్న ఆ మమ్మీతో ఆడుకుందామని వెళ్లాను డాడీ..! ఈసారి వెళ్లేప్పుడు చెప్పే వెళ్తాగా!’’

‘‘అలా వెళ్లకూడదు నాన్నా! బైట డాగీలు ఉంటాయి, కరిచేస్తాయి అని చెప్పాను కదా.. అయినా ఇకనుండి మేమిద్దరమూ నీతో ఆడుకుంటాంగా!’’

‘‘అంతా వట్టిదే

‘‘నిజం విక్కీ! కావాలంటే కిందకెళ్లి మన మమ్మీని అడుగుదాం పదా..!’’

అంటూ కిందకొచ్చి చూసిన ఆ ఇద్దరికీ ఇంట్లో ఎక్కడా నవ్య కనిపించలేదు. లాన్‌లో ఉందేమోనని బయటకు వస్తుండగా… గో మాతతో కలసి ఇంట్లోకి వస్తున్న నవ్య కనిపించింది.

ఆ దృశ్యాన్ని చూసిన బాబు ఉదయభానుడల్లే వెలిగిపోతూ, వినీల్‌ ‌చేతుల్ని దులపరించుకుని దిగిపోయి,

‘‘మమ్మీ…!’’ అని బిగ్గరగా అరుస్తూ ఆవును అల్లుకుపోయాడు. ఆవుకూడా  బాబుకు అందుబాటులో ఒంగి, మూతితో ముద్దులాడసాగింది.

ఆ సన్నివేశానికి చలించి, చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ..

‘‘సారీ వినీల్‌!’’ అం‌ది నవ్య.

‘‘అయ్యో.. అదేంటి నవ్యా? ఆవును గోమాత అంటారుగా! అందుకే మన బాబుకు ‘మమ్మీ’ అని పిలవమని చాలాసార్లు నేనే చెప్పాను. ఈ కరోనా మొదలయిన దగ్గరనుండి వాడిని పార్క్‌కు తీసుకెళ్లినప్పుడల్లా ఆవుతో ఆడుతున్నాడు కూడా.’’ అంటూ ఆమెను హత్తుకున్నాడు వినీల్‌.

‘‘అవునా.. నేనైతే వైరస్‌ ‌భయంతో వాణ్ణి ఆవు వచ్చినప్పుడు కూడా దగ్గరకు పోనివ్వట్లేదు. ఆ అపురూపమైన వీడియో ఎవరు తీసారు వినీల్‌?’’

‘‘ఎస్‌.ఐ. ‌గారబ్బాయీ, వాళ్లింటి పక్కనే ఆవుతో ఆడుతున్న మన విక్కీని చూసి గుర్తుపట్టి, పిలిచాడ•… వీడు ఆవుతో ఆడుతూ పట్టించుకోలేదట.. ఆ దృశ్యం ఎంతో ముచ్చటగా అనిపించడంతో ఫోన్‌తో వీడియో తీశాడ•. మనవాడు ఆడి ఆడి అలసి ఆవు పక్కనే పడుకుని నిద్రపోతుంటే, ఆ దృశ్యం వాళ్లమ్మకు చూపించాలని పిలిచి, అక్కడే ఉండి గమనిస్తూ ఉన్నాడట. ఇంతలో అక్కడే పాకుతున్న తేలును ఆవు తొక్కిందట, అదిచూసిన ఆ అబ్బాయి వెంటనే వాళ్ల నాన్నకు, వాళ్ల బాబాయికి, అదే మా ఫ్రెండ్‌ అని చెప్పా కదా వాడికి ఫోన్‌ ‌చేశాడట! అందరూ కలిసి ఆవుకు ఇంజక్షన్‌ ‌వేయించి, మనకు చెపుదామను కునేటప్పటికి మనమే ఫోన్‌ ‌చేశామట. తల్లిదండ్రులుగా మనకు కాస్త హిల్ట్ ఇవ్వాలనిపించి, ఇదంతా దాచారట…! ఇవేవీ తెలియక మనం కంగారుపడ్డాం నవ్యా!’’

‘‘అవునా.. అయ్యో! ఇవేవీ తెలుసుకోకుండా నేను ఆవేశపడిపోయి, ఆయనను ఏదేదో అనేశాను.’’

‘‘పర్లేదులే.. తల్లి మనసేంటో ఆయనకు తెలియదా?’’

‘‘లేదు వినీల్‌! అం‌దరూ… ‘ఇంటింటి కల్పవల్లి’ అని, ‘తెలుగింటి కామధేనువు’ అని, ‘భారతావని భాండాగారం’ అనీ గోమాతను భక్తిగా స్మరిస్తుంటే ఏమో అనుకునేదాన్ని. ఇవాళ పసివాడైన నా బిడ్డ ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకోగలిగాను.’’

‘‘అయితే ఈ మిట్టమధ్యాహ్నం పూజించాలనిపించిందా… హుటాహుటిన వెళ్లి గోమాతను తీసుకొచ్చావు…!’’

‘‘పుణ్యం పేరుతో పసుపు పూసి, బొట్లు పెట్టి, ఒక పండు ఇచ్చి వీధిలోకి తరిమి వేస్తే ఆ గోమాత ఆకలితీరక, చెత్తకుండీలలో, సైడ్‌ ‌కాలవలలో పడవేసిన పదార్థాలకోసం క్యారీ బ్యాగులను కూడా తినేయడం వలన పవిత్రమైన ఆ తల్లిదేహం విషపూరితమవుతోంది వినీల్‌!’’

‘‘అవును నవ్యా! ఈ మహానగరాలలో వీధికొక ఆవు డొక్కలు పీక్కుపోయి, ఎముకలు పొడుచుకొచ్చీ నిస్తేజంగా తిరుగుతూ ఉంటే, చూసి మనసు మెలిపెడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.’’

‘‘అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను వినీల్‌!’’

‘‘‌చెప్పు నవ్యా..ఏంటది?’’

‘‘సంరక్షించే వాళ్లు లేక కొన్ని ఆవులు వీధులపాలవుతుంటే, వయసుడిగి, వట్టిపోయిన కొన్ని ఆవులు వెట్టి వాళ్లకు బలౌతుంటాయి. కూర్చొని తిన్నా తరగనంత సంపద మనకు ఉంది కదా వినీల్‌!’’

‘‘‌నీ ఆలోచన నాకర్థమయింది నవ్యా! నిరాదరణకు గురవుతున్న గో మాతలను సమీకరించి, మనమే ఆశ్రయమిస్తే బావుంటుంది అనే కదా!?’’

‘‘అవును వినీల్‌! ‌తమ పాలతో బాలలందరి బొజ్జలు నింపి, ప్రేమను పంచే ఆ అమ్మలు కూడా మన అమ్మలతో సమానమే కదా?’’

‘‘నిజం నవ్యా! మన ఇంటి దగ్గరలోనే ఒక ఖాళీ స్థలం అమ్మకానికి వచ్చింది. ఆ స్థలాన్ని మనమే కొనుగోలు చేసి, అక్కడ గోశాలకు ఏర్పాట్లు చేద్దాం. అందాకా ఈ గోవు మన ఇంటి వసారాలోనే ఉంటుంది.’’

‘‘థాంక్యు వినీల్‌! ‌మనకు పాలు తెచ్చే రాజుకు చెప్పి, ఈ తల్లికి మేత ఏర్పాటు చేస్తాను.’’

‘‘ఐ… భలే! భలే!! ఆవు మమ్మీ, వాళ్ల ఫ్రెండ్సూ ఎంచక్కా మనింట్లోనే ఉంటే రోజు హాయిగా ఆడుకోవచ్చు..!’’ గంతులేస్తున్న బాబును ఎత్తుకుని ముద్దాడుతూ..

‘‘నువ్వూ.. ఎందరో తల్లుల ముద్దుల బాబువు నాన్నా…!’’ మురిపెంగా అంది నవ్య.

About Author

By editor

Twitter
YOUTUBE