కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యకరమైన ఫలితాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయిదేళ్ల క్రితం 2016లో జరిగిన ఎన్నికల్లో కనీసం ఉనికే లేని పార్టీ ఇప్పుడు అధికారంలో కీలక భాగస్వామి కావడం ఆషామాషీ విషయం కాదు. దాదాపు నాలుగో వంతు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఇప్పుడు ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఓ బలమైన రాజకీయ శక్తి అనడంలో అతిశయోక్తి లేదు. మొత్తం 30 సీట్లకుగాను భారతీయ జనతా పార్టీ ఆరు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా నిలబడటం ఇందుకు నిదర్శనం. మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుత అధికార అఖిల భారత ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ అధినేత రంగసామి ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇది నాలుగోసారి. రెండు స్థానాల్లో పోటీచేసిన రంగసామి తట్టాంచావడిలో గెలుపొందగా, ఆంధప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణం కాకినాడ సమీపంలోని యానాంలో మాత్రం పరాజయం పాలయ్యారు.
యానాం పేరుకు పుదుచ్చేరిలో భాగమైనప్పటికీ ఏపీ సరిహద్దుల్లో ఉండటం వల్ల తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనపడుతుంటాయి. భౌగోళికంగా పుదుచ్చేరి మూడు రాష్టాల మధ్య విసిరేసినట్లు ఉంటుంది. పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలు తమిళనాడుకు సమీపంలో ఉంటాయి. మహే ప్రాంతం కేరళ సరిహద్దుల్లో విస్తరించి ఉంటుంది. యానాం ఆంధప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. గతంలో ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్, అసోం, త్రిపురల్లో ఏకంగా అధికారాన్ని అందుకోవడాన్ని స్ఫూర్తిగా తీసుకుని పుదుచ్చేరిలోనూ అలాంటి ప్రయత్నమే పార్టీ చేసింది. బీజేపీ సాధించిన ఓట్లు, సీట్లను చూస్తే ఆ ప్రయత్నంలో కొంతవరకు విజయవంతమైందని చెప్పవచ్చు. ఈ పునాదులతో వచ్చే ఎన్నికల నాటికి సొంతంగా అధికారాన్ని అందుకోవడానికి ఇప్పటినుంచే పార్టీ ప్రణాళికలు, వ్యూహాలు రచించనుంది. పుదుచ్చేరిలో గౌరవ ప్రదమైన సీట్లు, ఓట్లు సాధించడంతో ద్రవిడ ప్రాంతంలో పార్టీ విస్తరణకు బలమైన పునాదులు పడ్డాయి. దీని ప్రభావం మున్ముందు పొరుగున ఉన్న తమిళనాడులో పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం.
బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, నిన్న మొన్నటి దాకా పుదుచ్చేరిని ఏలిన కాంగ్రెస్‌ను వెనక్కునెట్టి రెండో స్థానంలోకి రావడం భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. పార్టీకి చెందిన నమశివాయ మన్నాడిపేట నియోజకవర్గం నుంచి విజయకేతనం ఎగురవేశారు. కామరాజ్ నగర్ నుంచి జాన్‌కుమార్ విజయ దుందుభి మోగించారు. ఒసుదు స్థానం నుంచి జె. శ్రావణకుమార్ గెలుపొందారు. కళాపేట నుంచి కల్యాణ సుందరం, నెల్లితోపు నుంచి రిచర్సడ్ జాన్‌కుమార్, మానవెలి నుంచి ఎంబాళం ఆర్. సెల్వమ్ విజేతలుగా నిలిచారు. గత ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా లేని పార్టీ ఇప్పుడు ఆరు సీట్లకు ఎదగడం విశేషం. కేవలం సీట్లే కాకుండా ఓట్ల శాతాన్ని కూడా పార్టీ పెంచుకుంది. 13.66 ఓట్ల శాతంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. పార్టీలు సాధించిన ఓట్ల శాతంలో ఇది రెండో అత్యధికం. 16 సీట్లకు పోటీచేసిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించగా, 9 సీట్లకు పోటీచేసిన కమలం పార్టీ 6 సీట్లు సాధించడం గమనార్హం. అదే సమయంలో 13 సీట్లకు పోటీచేసిన డీఎంకే ఆరు స్థానాలకే పరిమితమైంది. పక్కనున్న తమిళనాడులో ఆ పార్టీ విజయ కేతనం ఎగురవేసినప్పటికీ పుదుచ్చేరిలో మాత్రం చతికిలపడింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు సీట్లు సాధించి కాంగ్రెస్ నాయకత్వంలోని నారాయణస్వామి సర్కారులో కీలక భాగస్వామిగా వ్యవహరించింది. అయిదేళ్ల పాటు పుదుచ్చేరిని పాలించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. 14 సీట్లకు పోటీచేసిన హస్తం పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితమవడం కొడిగడుతున్న ఆ పార్టీ ప్రాభవానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎన్‌ఆర్ కాంగ్రెస్, భాజపా కూటమిలోని అన్నాడీఎంకే నాలుగు చోట్ల పోటీ చేసినప్పటికీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. మరో ఆరుగురు స్వతంత్రలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
వాస్తవానికి పుదుచ్చేరిలో భాజపా బలం మొదటినుంచీ నామమాత్రం. 2011 ఎన్నికల్లో మొత్తం 30 సీట్లకు పోటీ చేసినప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. కేవలం 2.4 శాతం ఓట్ల శాతానికే పరిమితమైంది. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారంలో భాగస్వామి కావడం గమనించదగ్గ విషయం. పుదుచ్చేరిలో భవిష్యత్తులో భాజపా మరింత బలపడటానికి తాజా ఎన్నికలు అవకాశం కల్పించాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని కమలం భర్తీ చేయడానికి అవకాశం ఉంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఓటుబ్యాంకులో గణనీయమైన మార్పుండదు. కానీ జాతీయ పార్టీల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆ పార్టీలపై ప్రభావం చూపుతుంటాయి. 2019లో ఒకేఒక్క పుదుచ్చేరి లోక్‌సభ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ దెబ్బతింటే మరో జాతీయ పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. నష్టపోయిన జాతీయపార్టీ ఓటుబ్యాంకు మరో జాతీయ పార్టీకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కాంగ్రెస్ దెబ్బతిన్న మేరకు భాజపా లబ్ధి పొందే అవకాశాన్ని తోసిపుచ్చలేం. మొన్నటి ఎన్నికల్లో జరిగింది కూడా అదే. అయిదేళ్లు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడగా ఆ మేరకు భాజపా లబ్ధి పొందింది. అందువల్లే రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.
పెరుగుతున్న, బలపడుతున్న భాజపా ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి రంగసామి సరిగ్గానే గుర్తించారు. అందువల్లే కమలానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు, మంత్రివర్గంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులకు చోటు కల్పించేందుకు ఆయన అంగీకరించారు. భాజపా మద్దతు లేకుండా సంకీర్ణ సర్కారు మనుగడ సాగించడం కష్టమైన పనే. చిన్న రాష్ట్రం కావడం వల్ల పుదుచ్చేరిలో ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య ఆరుకు మించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ ఉపముఖ్యమంత్రి పదవి, మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించేందుకు ముఖ్యమంత్రి రంగసామి ముందుకు రావడం భారతీయ జనతా పార్టీ బలానికి నిదర్శనం. భాజపా శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నమశివాయకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. రంగసామి ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరైన తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ మేరకు చర్చలు జరిపారు. రంగసామికి నమశివాయ సమీప బంధువు. ఆ రకంగా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం కూడా ఉంది.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన కొత్తల్లో అంటే ఎనిమిది, తొమ్మిదో దశకాల్లో అది ఉత్తరాది పార్టీ అనే విమర్శలు ఉండేవి. దక్షిణాదిన దాని బలం పరిమితమనే భావన ఉండేది. ఇది పాక్షిక సత్యమే తప్ప పూర్తిగా వాస్తవం కాదు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఎనిమిదో దశకంలో నాటి విశాఖపట్నం నగర పాలక సంస్థను భాజపా కైవసం చేసుకున్న విషయం పాతతరం వారికి గుర్తుండే ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి ఏపీలో 1998లో నాలుగు పార్లమెంటు సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. నాటి ఎన్నికల్లో కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగరరావు, కాకినాడ నుంచి సినీనటుడు కృష్టంరాజు, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ విజయం సాధించిన విషయం కొందరికి తెలియకపోవచ్చు. వీరిలో కృష్ణంరాజు, దత్తాత్రేయ కేంద్రమంత్రులు కూడా అయ్యరు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ నాలుగు చోట్ల గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), సోయం బాపూరావు (ఆదిలాబాద్) కమలం జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. మొన్నటి దుబ్బాక, నిన్నటి హైదరాబాద్ నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా సత్తా చాటింది. అధికార తెరాసకు చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తెరాసకు గట్టి పోటీదారుగా నిలిచింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలహీనపడటం, వామపక్షాలు ఉనికి కోల్పోవడం తదితర పరిణామాల నేపథ్యంలో భాజపా ఎదగడానికి మంచి అవకాశం ఏర్పడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో శ్రేణులు దూకుడును ప్రదర్శిస్తున్నాయి.
ఇప్పుడు దక్షిణాదిన కీలకమైన కర్ణాటకలో చక్రం తిప్పుతోంది. 2007లోనే పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. బి.ఎస్. యడ్యూరప్ప, డి.వి.సదానంద గౌడ, జగదీశ్ షెట్టర్, దివంగత అనంతకుమార్ వంటి సీనియర్ నేతలు పార్టీ బలోపేతానికి పాటుపడ్డారు. వీరిలో దివంగత అనంతకుమార్ తప్ప మిగిలిన నేతలు ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. యడ్యూరప్ప ఇప్పుడు సీఎంగా చక్రం తిప్పుతున్నారు. 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లోనూ కర్ణాటకలో సింహభాగం సీట్లు కమలం ఖాతాలోనే పడటం గమనార్హం. ఇప్పుడు దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరిల్లో పార్టీ బలో పేతంగా ఉంది. తమిళనాడు, కేరళ, ఏపీల్లో పార్టీ బలోపేతానికి వ్యూహరచన చేస్తోంది. మున్ముందు ఈ రాష్టాలలోనూ వికసించేందుకు కమలం శ్రేణులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఒకప్పుడు (1984లో) దేశవ్యాప్తంగా రెండు సీట్లకు పరిమితమైన పార్టీ ఇప్పుడు 300లకు పైగా సీట్లతో శక్తిమంతంగా మారింది. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఒక అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా మార్చేసింది. 2014, 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న హస్తం పార్టీ ఇప్పటికిప్పుడు కోలుకునే అవకాశాలు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిస్థితులను గమనించినప్పుడు దక్షిణాదిన మిగిలిన రాష్టాల్లోనూ కమలం పార్టీని విస్తరించ డానికి, బలోపేతం చేయడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు.
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్