ఈటల రాజేందర్‌. ‌తెలంగాణ మలిదశ ఉద్యమకాలం నుంచి టీఆర్‌ఎస్‌లో ముఖ్యనేత. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. మాజీ మంత్రి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ యవనికపై హాట్‌ ‌టాపిక్‌గా మారిన వ్యక్తి. దాదాపు మూడు వారాలుగా రాష్ట్రంలో నిత్యం చర్చల్లో నానుతున్న నాయకుడు. వివాదం మొదలైన క్రమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మద్దతు చూసి తెలంగాణ వ్యాప్తంగా కలకలం చెలరేగింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఉదయిస్తోందన్న విశ్లేషణలు కొనసాగాయి. ఈటల కూడా అదే స్థాయిలో ప్రభుత్వంపైనా, కేసీఆర్‌పైనా విమర్శనాస్త్రాలు సంధించడం అందరినీ ఆలోచింపజేసింది. కేసీఆర్‌ ‌మాదిరిగానే మాటతీరు ఉండే ఈటల.. తానో వ్యక్తిని కాదని, ఓ శక్తిని అన్నట్లుగా ప్రకటనలు చేశారు. దీంతో తెలంగాణ అంతటా వేడి రగిలింది. ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి వణుకు పుట్టించింది. అయితే, ఇప్పుడు కాస్తంత వేడి తగ్గినా ఆ అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌లో శరవేగంగా పావులు కదిలాయి. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలకు సంబంధించినవిగా పేరున్న కొన్ని మీడియాల్లో ఈటల భూకబ్జాలంటూ రోజంతా కథనాలు ప్రసారమయ్యాయి. మెదక్‌ ‌జిల్లాలోని అచ్చంపేటలో అసైన్డ్ ‌భూములు అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఆరోపించాయి. జమున హేచరీస్‌ ‌పేరుతో అక్కడ చేపడుతున్న భారీ ప్రాజెక్టు కోసం ఈటల రాజేందర్‌ ‌మంత్రి హోదాలో ఉండి అక్రమాలకు పాల్పడ్డా రంటూ ఆ కథనాల్లో విమర్శలు వచ్చాయి. ఆ సాయంత్రమే ఆ కథనాలకు, ఆరోపణలకు స్పందనగా అంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈటల భూ కబ్జాల ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. మరుసటిరోజే మెదక్‌ ‌జిల్లా కలెక్టర్‌తో పాటు.. ఏసీబీ, విజిలెన్స్ ‌బృందాలు అచ్చంపేటలో విచారణ చేపట్టారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్ ‌భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్‌ అక్కడికక్కడే ప్రకటించారు. ఆ వెంటనే దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సీఎస్‌కు అందించారు. మరొకవైపు కేబినెట్‌లో ఈటల రాజేందర్‌ ‌నుంచి వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖను తొలగించి.. సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారు. ఆ మరుసటిరోజే ఈటలను కేబినెట్‌ ‌నుంచి బర్తరఫ్‌ ‌చేశారు.

ఈ నేపథ్యంలో ఈటల కూడా వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి తనపై భూకబ్జాల ఆరోపణలు వచ్చిన రోజు రాత్రే శామీర్‌పేట్‌లోని తన నివాసంలో ఆయన ప్రెస్‌మీట్‌ ‌నిర్వహించారు. తనపై వచ్చిన ఆరోపణ లన్నీ అర్థరహితమని, తాను స్వయంగా వ్యాపారం చేసి చెమటోడ్చి సంపాదించిన డబ్బులతోనే జమున హేచరీస్‌ ‌ప్రారంభించానని వివరణ ఇచ్చారు. అసైన్డ్ ‌భూములు అసలు ఆక్రమించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ‌కావాలని తనను టార్గెట్‌ ‌చేశారని, అందుకే తనపై వార్తలు ప్రసారం చేయించి.. విచారణకు ఆదేశించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తానే తప్పూ చేయలేదని ప్రకటించారు. ఈ పరిణామం తర్వాత ఈటల రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా తాను రాజీనామా చేయబోనని ప్రకటించడంతో పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరిగింది.

నాలుగైదు రోజుల పాటు రాజకీయాలు హైదరాబాద్‌ ‌శివారులోని శామీర్‌పేట్‌ ‌కేంద్రానికి మారాయి. స్వపక్షాలు, విపక్షాలు అటువైపే దృష్టి సారించాయి. కేసీఆర్‌ ‌నిర్ణయం, వ్యవహారశైలిని విపక్షాలు తప్పుపట్టాయి. ఈటల రాజేందర్‌కు అండగా నిలిచాయి. కాంగ్రెస్‌, ‌బీజేపీ ముఖ్యనేతలు కూడా ఈటలను బాహాటంగా సమర్థించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌కు వెన్నంటి ఉంటూ ఆర్థికంగా, నైతికంగా, అన్ని రకాలుగా అండదండలుగా ఉంటున్నా.. అవసరం తీరిందన్న కారణంగా కేసీఆర్‌ ఈటలను పక్కకు పెట్టారని, అది కూడా అవమానకర రీతిలో వ్యవహరించడంపై మండిపడ్డారు.

ఇక, ఓ దశలో ఈటల రాజేందర్‌ ‌నివాసం తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువుగా కూడా మారింది. హైదరాబాద్‌ ‌నుంచే కాకుండా, తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌ ‌నుంచి భారీ సంఖ్యలో సన్నిహితులు, అభిమానులు, కార్యకర్తలు శామీర్‌పేట్‌కు క్యూ కట్టారు. ఈటల రాజేందర్‌ ‌భవితవ్యంపై ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో, ఏ వ్యూహాన్ని అనుసరిస్తారో అని ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే, ఈ ఎపిసోడ్‌ ‌క్రమంలో ఈటల కొద్దిరోజుల పాటు నిత్యం మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేశారు. కేసీఆర్‌ అం‌డ్‌ ‌కో పైన తనదైన శైలిలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఒకదశలో కేసీఆర్‌కు తానే ప్రత్యామ్నాయం అన్నట్లుగా ఎదుటివాళ్లకు ఆలోచన కలిగే రీతిలో మాట్లాడారు. ఆ ఊపులో భాగంగానే శామీర్‌పేట్‌ ‌వేదికగా ఓ ప్రకటన చేశారు. తాను సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌ ‌వెళ్తున్నానని, అక్కడ తన అనుచరులు, పార్టీ నేతలు, అభిమానులు, సన్నిహితులతో మాట్లాడతానని, అందరి అభిప్రాయాలు తీసుకొని, వాళ్ల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఆ వెంటనే హుజురాబాద్‌ ‌బయలుదేరి వెళ్లారు. ఆ ర్యాలీలో వెయ్యికార్లు పాల్గొన్నట్లు ఈటల అభిమానులు పేర్కొన్నారు. దారిలో ఆయా గ్రామాల్లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం శామీర్‌పేట్‌లో బయలుదేరిన కాన్వాయ్‌ ‌హుజురా బాద్‌ ‌చేరడానికి రాత్రి పది గంటలయింది. హుజురాబాద్‌లో కిక్కిరిసిన జనం ఆయనకు స్వాగతం పలికారు.

తన నియోజకవర్గంలో మూడు రోజులు ఉన్న ఈటల సన్నిహితులు, అభిమానులతో వరుస మంతనాలు జరిపారు. ఎన్నారైలతో వర్చువల్‌ ‌మీటింగ్‌లు కూడా నిర్వహించారు. విస్తృతంగా అభిప్రాయసేకరణ చేశారు. హుజురాబాద్‌లో ఉన్నన్ని రోజులూ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ప్రకటించినట్లుగానే హుజురాబాద్‌ ‌వేదికగానే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు గురించి కీలక ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. హైదరాబాద్‌ ‌వెళ్లాక.. సన్నిహితులతో చర్చలు జరిపి తన నిర్ణయం ప్రకటిస్తానని మీడియాతో చెప్పి హైదరాబాద్‌ ‌వెళ్లిపోయారు. అయితే, ఇక్కడే భిన్న దృశ్యాల గురించి మాట్లాడుకోవాలి. హైదరాబాద్‌ ‌నుంచి వందల కార్ల కాన్వాయ్‌తో హుజురాబాద్‌ ‌వెళ్లిన ఈటల అక్కడినుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమై వెళ్లిన సమయంలో, ఆ స్థాయిలో కాదు.. కనీసం అందులో పదో వంతు కూడా స్పందన కనిపించలేదు. దీంతో.. తొలుత ఉవ్వెత్తున ఎగిసిన ఈటల ఎపిసోడ్‌ ఊహించని స్థాయిలో పడిపోయింది. ఈటల హుజురాబాద్‌కు వెళ్లిన సమయంలో ఉన్న జనం స్పందన ఆ తర్వాత క్రమంగా పలుచబడింది. ఆయన క్యాంపాఫీస్‌లో రోజురోజుకూ జనం రాక తగ్గిపోయింది. ఆయనతో భేటీ అయ్యే నేతలు, కార్యకర్తల సంఖ్య కూడా తగ్గింది. అందుకే ఈటల తన మకాంను తిరిగి హైదరాబాద్‌కు మార్చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈటల ముందు పలు దారులున్నాయి. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా మీడియాలో, సోషల్‌ ‌మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది కూడా. అయితే, తన మనసులో మాట మాత్రం ఆయన బయటపెట్టడం లేదు. బీజేపీలోకి వెళ్లాలంటే దారులు తెరిచే ఉన్నాయని సోషల్‌ ‌మీడియాలో ప్రచారం నడుస్తోంది. అలాగే, కాంగ్రెస్‌ ‌పార్టీలోనూ ఈటలకు అవకాశం ఉంది. ఇక, కొత్తపార్టీ పెట్టడానికి కూడా ఆయనకు అవకాశం ఉంది. కానీ, ఆయన పూర్తి సందిగ్ధంలో పడిపోయా రన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రోజుల తరబడి చర్చలు సాగుతున్నా.. కచ్చితమైన నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ఒకరకంగా ఈటల దారీ తెన్నూ తెలియక తికమకపడుతున్నారని అంటున్నారు. అందుకే తొలుత దుందుడుకుగా వ్యవహరించినా, ఆ తర్వాత సైలెంట్‌ అయ్యారు. ఆచితూచి మాట్లాడుతున్నారు. పెద్దగా విమర్శలు చేయడం లేదు. చాలా చాకచక్యంగా, పరుష పదజాలం వాడకుండా జాగ్రత్త పడుతున్నారు.

అయితే, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు అనంతర పరిణామాల గురించి కాకుండా ప్రభుత్వం తనపై కేసులు బనాయిస్తే వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలి? ప్రజాబాహుళ్యంలో ఎలాంటి సానుభూతిని పొందాలి? బీసీ సామాజిక వర్గాన్ని ఎలా కూడగట్టాలి? అనే అంశాలపై ఆయన సమాలోచనలు, చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా తనను కలిసిన, తనతో చర్చించిన వాళ్లంతా ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లు చెప్పినా, వినడానికే పరిమితమయ్యారు. తన అభిప్రాయంగానీ, మనసులో మాటను గానీ ఎవరితోనూ పంచుకోలేదని తెలుస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రధానంగా తాను బీసీ బిడ్డనని చెప్పుకోవడానికి ఈటల రాజేందర్‌ ‌పదే పదే తాపత్రయపడుతున్నారు. సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. మొదట్లో ఈ అంశాన్ని ముఖ్యంగా ఎత్తిచూపిన ఈటల.. ఆ తర్వాత ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే బీసీ సంఘాల్లో ఈటలపై సానుభూతి కనిపిస్తోంది. ఆ సానుభూతిని అలాగే కొనసాగించేలా ఏంచేస్తే బాగుంటుందన్న దానిపై దృష్టిపెట్టారు. బహుజన, సామాజిక తెలంగాణ నినాదంతో కొత్త పార్టీ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 70శాతం మంది బీసీ జనాభా ఉండటం, వాళ్లకే రాజ్యాధికారం అంటూ కొత్త నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడం వంటి వ్యూహాలు అనుసరిస్తున్నారని, ఈ దిశగా కొందరు పనిచేస్తున్నారని వినికిడి.

అయితే, మరో విశ్లేషణ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తొలినుంచీ కేసీఆర్‌ ‌టార్గెట్‌గా దుందుడుకుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి… ఈటల రాజేందర్‌తో కలిసి కొత్తపార్టీ పెట్టాలన్న యోచన కూడా ఉందంటున్నారు. ఈ దిశగా ఇప్పటికే రేవంత్‌రెడ్డి, ఈటల కలిసి పలుమార్లు రహస్య చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న తర్వాతే కేసీఆర్‌.. ఈటలను టార్గెట్‌ ‌చేసి బలవంతంగా, అవమానకర రీతిలో బయటకు పంపించినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈటల ఎపిసోడ్‌ ‌తర్వాత.. రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళమెత్తడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్వయంగా ఈటల నివాసానికి వెళ్లి కొన్ని గంటలపాటు చర్చలు జరపడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేక శక్తిని కూడగట్టాలని రేవంత్‌రెడ్డి ఎప్పటినుంచో చూస్తున్నారు. అందుకే రేవంత్‌ను పలు కేసుల్లో ఇరికించారు. అయినా వెనక్కి తగ్గని రేవంత్‌రెడ్డి మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈటలతో గతంలో భేటీ అయినట్లు సమాచారం. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు తానొక్కడిగా పోరాడితే అంతగా ప్రయోజనం ఉండదని రేవంత్‌ ‌భావిస్తున్నారు. అందుకే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటలతో కలిసి ముందుకెళ్లే వ్యూహం రచించినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటు.. ఈటల కూడా తాజా పరిణామాల నేపథ్యంలో తానొక్కడినే కేసీఆర్‌ను ఎదుర్కోలేనని, రేవంత్‌, ‌విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి అడుగు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే.. రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, ‌కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డిలు కలసి ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీలోకి.. టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ నుంచి పెద్ద ఎత్తున అసంతృప్త నేతలు వలసలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌పార్టీ లోంచి చాలామంది అటువైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే, టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులు చాలామంది ఈటలతో టచ్‌లో ఉన్నారని సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల భవిష్యత్‌ ఏం‌టి? ఆయన మదిలో ఉన్నదేంటి? ఆయన తీసుకునే స్టెప్‌ ఏం‌టి? అభిమానులు, సన్నిహితులకు చూపించే భరోసా ఏంటి? అన్న విషయాల్లో స్పష్టత కనిపించడం లేదు. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

 -సుజాత గోపగోని, 6302164068  : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE