సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ చైత్ర బహుళ చతుర్దశి – 10 మే 2021, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‘అంధగజ న్యాయం’ అని ఉంది. ఇక్కడ న్యాయం అంటే కోర్టులలో చెప్పేది కాదు. సామెత, నానుడి వంటివాటికి సమీప బంధువు. అంధగజ న్యాయం అంటే అంధులు, ఏనుగు కథకి సంబంధించినది. కొంతమంది అంధులకి ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. ఎవడో వాళ్లని ఏనుగు దగ్గరకి తెచ్చి వదిలాడు. ఒకడు దాని కాళ్లు తడిమి, తెలిసింది… ఏనుగు స్తంభంలా ఉంటుంది అన్నాడట. ఇంకొకడు తొండం తాకాడు. స్తంభంలా కాదు, బాగా బలిసిన పాములా ఉంటుంది అని ప్రకటించాడు. దంతాలు ముట్టుకున్న మరొక అంధుడు, అబ్బే, ఏనుగు పనితనంతో చేసిన గునపంలా ఉంటుందని నిర్ధారించాడు. ఇక దాని పొట్టని రాస్తూ మరొకడు, ఏనుగు గోడలా ఉంటుందని తేల్చాడు. ఒకడు ఎలాగో దాని పైకెక్కి చెవులు ఊగడం పసిగట్టాడు, వెంటనే చెప్పేశాడు, పెద్ద విసనకర్రనే ఏనుగు అంటారు అని. ఈ ఉపమానాలు మారుతూ ఉంటాయి. కానీ విషయం తెలియకపోయినా, మొత్తం తెలిసినట్టు మాట్లాడే మేధావుల జ్ఞానసంపద గురించి చెప్పవలసి వస్తే ఈ న్యాయాన్ని ప్రయోగిస్తారు.

అంధులు తనని శల్యపరీక్ష చేస్తున్నప్పుడు దురదృష్టం కొద్దీ ఆ ఏనుగు ఘీంకరించలేదు. లేకుంటే ఆ శబ్దానికి ఏం పేరు పెట్టేవారో!

ఈ నానుడి భారతదేశ భావప్రకటనా ధురంధరులకు సరిగ్గా సరిపోతుంది. వీళ్ల వేదిక సామాజిక మాధ్యమం. భూమ్యాకాశాలే సరిహద్దులుగా వీళ్లు తమ అరకొర జ్ఞానాన్ని విరివిగా పంచుతూ ఉంటారు. నెటిజన్లు వగైరా వగైరా పేర్లతో వీళ్లని పిలుస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పునాదిగా అసత్యాలనీ, అర్ధంలేని విషయాలనీ వీళ్లు లోకం మీదకు వదిలిపెడుతూ, ఏనుగు కథలో అంధులతో పోటీ పడుతున్నారు. కుతర్కం అంటే వీళ్లకి మరీ ప్రీతి. అయితే వీళ్లు దివాంధులు. అనగా, కళ్లున్నప్పటికీ, అవి పని చేస్తున్నప్పటికీ పట్టపగలే కనిపించదు. విస్తృతార్థంలో చెప్పాలంటే కావలసినవాటినే చూస్తారు. ఎదురుగా ఏనుగంత నిజం ఉన్నా, అది వీళ్ల చట్రం పరిధిలో ఇమడకపోతే గుర్తించడానికి కళ్లనే కాదు, బుర్రనీ, చెవులనీ కూడా ఉపయోగించరు. వాళ్ల చెవులూ, కళ్లూ, బుర్ర నిజం చెప్పే లక్షణాన్ని కోల్పోయాయి. దీనికి మందు లేదు. అంత పెద్ద రుగ్మత.

 ‘రిజైన్‌ ‌మోదీ’ అన్న హ్యాష్‌టాగ్‌ ‌వ్యవహారం చూస్తే ఇదే అనిపిస్తుంది. మహారాష్ట్రలోని ఓ  ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌ ‌లీకైతే అది మోదీ వైఫల్యమని ఆ ఏనుగు ఫేం అంధుల శైలిలో తేల్చేశారు వీళ్లు. ఆ మరునాడు ఆ రాష్ట్రంలోనే ఒక ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి కొందరు కొవిడ్‌ ‌రోగులు చనిపోయారు. ఆ వార్త వీళ్లకి కనపడలేదు, వినపడలేదు. ఆ విధంగా చూస్తే వీళ్లు అంధులు ప్లస్‌ ‌బధిరులు కూడా. ముఖ్యమంత్రులతో, కేంద్ర మంత్రిమండలితో ప్రధాని ఎన్ని సమావేశాలు జరిపారు! ఆ సంగతి ఈ అంధులు/బధిరులకి తెలియదు.

 సుదూరంగా ఉన్న వీరి సోదర అంధుల గురించి కూడా చెప్పాలి. వారెవరు అంటే, విదేశీ మీడియా. విదేశీ మీడియా అంధులు మన అంధగజ న్యాయంలో అంధుల కంటే దారుణం. వీరి ఘన నేపథ్యం గురించి కళ్లు, చెవులు పనిచేస్తున్న వాళ్లందరికీ తెలుసు. రిజైన్‌ ‌మోదీ హ్యాష్‌టాగ్‌ ‌తొలగించి ఫేస్‌బుక్‌ ‌ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేశారంటోంది వాల్‌‌స్ట్రీట్‌ ‌జర్నల్‌ అనే అమెరికా విషపుత్రిక. భారత్‌ ‌బెదిరిస్తేనే తొలగించిందని కూడా తీర్మానించింది. అదొక్కటే కాదు, చాలా విదేశీ పత్రికలు మన దేశవాళీ మేధావుల అజ్ఞానాన్ని విశ్వానికి పంచుతూ తీట తీర్చుకుంటున్నాయి. దీనికి కొసమెరుపు ఏమిటంటే, మేం ఫేస్‌బుక్‌కి ఏమీ చెప్పలేదు, ఎవరి భావ ప్రకటన వాళ్లది, ఎవరి ఏడుపు వాళ్లు ఏడవచ్చు. అభ్యంతరం లేదని భారత ప్రభుత్వం కీలెరిగి వాత పెట్టింది. ఈ వాస్తవం తెలుసుకోకుండానే ఆ జర్నల్‌ ‌ఫేస్‌బుక్‌ను అడ్డం పెట్టుకుని భారత్‌ను ఆడిపోసుకుంది. కాబట్టి మీడియా, సామాజిక మాధ్యమాలు దివాంధులతో కిటకిటలాడుతున్నాయని  చెప్పడానికి సందేహించాలా? ఇప్పుడు విదేశీ మీడియా అనే అంధుల దృష్టిలో భారత్‌ ఎలా ఉందంటే- పాతిక ముప్పయ్‌ ‌మంది మినహా 136 కోట్ల మంది   ఆక్సిజన్‌ అం‌దక ఎగశ్వాసతో కోరస్‌గా అలమటిస్తున్నారు. ఆసుపత్రుల ముందు పడిగాపులు పడి ఉన్నారు. అయితే, రెండు మూడు ముక్కులకు కూడా చాలినంత ఆక్సిజన్‌ను కేంద్రంలోని ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోంది. స్మశానాలన్నీ అంగుళం ఖాళీ లేకుండా శవాలతో నిండిపోయాయి. వ్యాక్సిన్‌ ‌దొరక్క జనం తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు- ఇలా. భారత్‌ అనే భద్రగజాన్ని విదేశీ మీడియా, దానితో పోటీ పడుతూ దేశీయ అంధులు/బధిరులు ఇలా పోటీలు పడి మరీ దృశ్యీకరిస్తున్నారు. అదికూడా- గుడ్డెద్దు చేలో పడినట్టు. అన్నట్టు ఇది కూడా న్యాయమే- అంధగోక్షేత్ర న్యాయం. అంధపరంపరా న్యాయం అని మరొకటి ఉంది. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవలిసింది కూడా. అంటే ఒక గుడ్డివాడు చేసే తప్పుపనే మిగిలిన అంధులంతా చేస్తారు అని.

రెండో దశ కరోనాలో భారత్‌ ఎదుర్కొంటున్న ఉత్పాతాన్నే నిరుడు అమెరికా, ఇటలీ, బ్రెజిల్‌, ‌రష్యా ఎదుర్కొన్నాయి. అప్పుడు వాల్‌‌స్ట్రీట్‌లు, గోల స్ట్రీట్‌లు ఎక్కడ బబ్బున్నాయో! చైనా మీద అంత గోల జరిగినప్పుడు ఎక్కడ పడి విశ్రమించాయో! తప్పిదాలుంటే చెప్పవచ్చు. కానీ అబద్ధాలు ప్రచారం చేయడం నీచం, నికృష్టం. ఇది జాతి వివక్ష. నయా అనాగరికత. దేశవాళీ దివాంధులకు కూడా ఇదే నీతి వర్తిస్తుంది. భారత్‌లో మానవహక్కులు లేవనీ, అల్పసంఖ్యాకులను సరదాగా చంపుతూ ఉంటార•నీ, మహిళలను బతకనివ్వరనీ కొన్ని సంస్థలు ఇచ్చే సమాచారాన్ని  వీలైనప్పుడల్లా విదేశీ పత్రికలు ప్రపంచం మీద వెదజల్లుతూ ఉంటాయి. అది గురవింద న్యాయం.

About Author

By editor

Twitter
YOUTUBE