‌ప్రాణం కాపాడుకోవడానికి చివరి నిమిషంలో మనషి పడే తపన మాటలకు అందదు. చావు అంచులకు వెళుతున్న తన వారి ప్రాణాలు నిలబెట్టడానికి అతడి రక్తసంబంధీకులు పడే ఆరాటం కూడా అంతే. ఒక మహమ్మారి చుట్టుముట్టినప్పుడు, ఒక ఉత్పాతం వెల్లువెత్తినప్పుడు ఆ తపన, ఆరాటం మరింత శక్తిని పుంజుకుంటాయి. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఇలాంటి అనుభవాలు మనం చూస్తున్నాం. ప్రాణవాయువు కొరత, ఆసుపత్రులలో పడకల లేమి, గగన పుష్పాల మాదిరిగా ఉన్న వ్యాక్సిన్లు జనాన్ని ఒక ఘోర నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తున్నాయి. కొన్ని వార్తలు వింటూ ఉంటే మానవత్వం ఏమైపోయిందన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇలాంటి వాతావరణంలో నారాయణ్‌ ‌దభాల్కర్‌ ఉదంతం వినడం గొప్ప సాంత్వన.

నాగ్‌పూర్‌ ‌వాసి నారాయణ్‌కు 85 ఏళ్లు. కరోనా సోకింది. ఆయన కూతురు, అల్లుడు నాగపూర్‌లోని గాంధీనగర్‌ ఇం‌దిరాగాంధీ మున్సిపల్‌ ఆసుపత్రిలో అష్టకష్టాలు పడి ఒక పడక సంపాదించారు. శరీరంలో ప్రాణవాయువు శాతం మరీ తగ్గిపోవడంతో ఏప్రిల్‌ 22‌న హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పుడే ఆయన ఒక దృశ్యం చూశారు. తన భర్తను కాపాడమని, ఒక పడకను కేటాయించమని ఒక యువతి అక్కడి సిబ్బంది కాళ్లావేళ్లాపడుతున్నది. అతడు చావు అంచులకు చేరిపోయాడు.

ఆ సమయంలోనే నారాయణ్‌ ఒక నిర్ణయం తీసుకున్నారు. తనను డిశ్చార్జ్ ‌చేసి తన పడకను ఆ యువతి భర్తకు కేటాయించమని డాక్టర్లను కోరారు. ఇందుకు కూతురు, అల్లుడు అంగీకరించలేదు. అయినా ఆ పెద్దాయన వారికి నచ్చ చెప్పారు. ‘నేను నిండు జీవితం చూసేశాను. ఆ యువకుడి ప్రాణరక్షణ ఇప్పుడు నా ప్రాణం కంటే ముఖ్యం’ అని చెప్పగలిగారు.

ఆయన కోరినట్టే జరిగింది. తన అంగీకరాన్ని తెలియచేస్తూ సంతకం కూడా చేసి ఇచ్చారు. మూడు రోజుల తరువాత నారాయణ్‌ ఇం‌ట్లోనే కన్నుమూశారు.

ఇంతకీ ఈ ఉదంతాన్ని ఎంతో గొప్పగా చెప్పిన సోషల్‌ ‌మీడియాకు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సభ్యుడని చెప్పడానికి మాత్రం మనసొప్పలేదు.

ఓం శాంతి శాంతి శాంతి

About Author

By editor

Twitter
YOUTUBE