వందేళ్ల ఖిలాఫత్ ఉద్యమం – 8
1920 ఆగస్ట్ నుండి 1922 మార్చి వరకు జరిగిన మలిదశ ఖిలాఫత్ ఉద్యమ చరిత్ర అంతా రక్తసిక్తమే. ముందు బలప్రయోగం చేశారు. ఆ తర్వాత నరమేధానికి పాల్పడ్డారు. సహాయ నిరాకరణ ఉద్యమం బలప్రయోగానికీ, ఆ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండ నరమేధానికీ దారితీసింది.
ఖిలాఫత్, సహాయనిరాకరణ కవలలే
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ పూర్ణస్వరాజ్యం సాధించటానికి ప్రారంభించారని మనం పాఠ్యగ్రంథాలలో చదువుకున్నాం. అది వాస్తవం కాదు. డా।।అంబేడ్కర్ సహాయనిరాకరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారో, ఎందుకు ప్రారంభించారో సవివరంగా చెప్పారు. ఆయన మాటలలోనే ఆ వివరాలు, ‘ఖిలాఫత్ ఉద్యమానికీ, సహాయ నిరాకరణ ఉద్యమానికీ మధ్య ఉన్న సంబంధం గురించి చాలామందికి తెలియదు. స్వరాజ్య సాధనకు కాంగ్రెసు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టిందని అనేకులు అనుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం 1920 సెప్టెంబర్ 7, 8 తేదీలలో కలకత్తాలో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే సహాయ నిరాకరణకు ఆ సంస్థ నిర్ణయించింది. సెప్టెంబర్, 1920కి ముందున్న పరిస్థితులను ఏమాత్రం పరిశీలించినా సహాయ నిరాకరణకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ కాదన్న వాస్తవం బహిర్గతమవుతుంది. సహాయ నిరాకరణకు మూలం ఖిలాఫత్ ఉద్యమంలో ఉంది. అంతేకాని స్వరాజ్యం కోసం కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమంలో లేదు. సహాయనిరాకరణను ఖిలాఫత్ ఉద్యమకారులు టర్కీకి మద్దతుగా ప్రారంభించారు. ఖిలాఫత్ ఉద్యమ కారులకు సహాయం చేసేందుకు సహాయనిరాకరణను కాంగ్రెస్ దత్తత తీసుకొంది. సహాయ నిరాకరణ ఉద్యమ లక్ష్యం స్వరాజ్యం కాదు. దాని ప్రధాన లక్ష్యం టర్కీ ఖిలాఫత్ వ్యవస్థ పరిరక్షణ. స్వరాజ్యం రెండవ లక్ష్యం మాత్రమే. స్వరాజ్య లక్ష్యం హిందువులను ఖిలాఫత్ ఉద్యమంలో భాగస్వాములను చేయటానికి వేసిన ఎత్తుగడ మాత్రమే.
‘ఖిలాఫత్ ఉద్యమం అక్టోబర్ 17,1919న ప్రారంభమైంది. దేశమంతటా ఆ రోజును ‘ఖిలాఫత్ దినం’గా ప్రకటించారు. నవంబర్ 23న ఢిల్లీలో జరిగిన ‘మొదటి ఖిలాఫత్ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావటానికి సహాయనిరాకరణ ఒక సాధనంగా పనికి వస్తుందా అని ముస్లింలు పరిశీలించారు. మార్చి 10, 1920న కలకత్తాలో జరిగిన సమావేశంలో సహాయ నిరాకరణ వారి ఉద్యమ లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడే ఉన్నత శ్రేణి సాధనంగా గుర్తించారు. ఆగస్ట్ 1,1920 నుండి సహాయ నిరాకరణ ప్రారంభమైంది.
‘పై వివరాలను బట్టి సహాయనిరాకరణను ఖిలాఫత్ కమిటీ• ప్రారంభించిందనీ, కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణను కాంగ్రెస్ వారు లాంఛనంగా ఆమోదించారనీ తెలుస్తుంది. అంతేకాక సహాయనిరాకరణను స్వరాజ్య సాధన కోసం కాక, ముసల్మానులు చేపట్టిన ఖిలాఫత్ ఉద్యమానికి సాయపడేందుకు ప్రారంభించారనీ తెలుస్తుంది. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం చేసిన తీర్మానాన్ని పరిశీలిస్తే, ఇది మరింత సుస్పష్టం అవుతుంది’ (Pakistan or The Partition of India, pp. 137-139).
ఖిలాఫత్ వాదుల సహాయ నిరాకరణ
1920, ఫిబ్రవరి 28,29 తేదీలలో మౌలానా అజాద్ కలకత్తా ఖిలాఫత్ సమావేశానికి అధ్యక్షత వహించారు. షరియత్ ప్రకారం ముస్లిమేతర ‘ఇస్లామిక్ శత్రువులకు’ సహకరించటం పాపమని ఉద్ఘాటించారు. సహాయ నిరాకరణను ఇస్లామిక్ తర్క్-ఇ-మవలత్ (సాంఘిక బహిష్కరణ)గా ఆయన పేర్కొంటూ, అదొక్కటే ముస్లింలకు ఉన్న ఏకైక సాధనమని చెప్పారు (The Khilafat Movement in India, 1919-24, Quershi, p.88)
గాంధీజీ సలహామీద ఖిలాఫత్ వాదులు హిందూ-ముస్లిం నాయకులతో 1920 జూన్ మొదటివారంలో ఒక సమావేశం నిర్వహించారు. కేవలం ఖిలాఫత్ సమస్య మీదనే ప్రభుత్వం తలపెట్టిన శాంతి వేడుకలను బహిష్కరించాలని గాంధీజీ పిలుపిచ్చారు. జలియన్‌వాలా బాగ్ దారుణ మారణ కాండ, పంజాబ్‌లో సైనిక పాలన విధింపులను కూడా ఆ బహిష్కరణకు కారణాలుగా చూపాలని కొందరు చేసిన సలహాలను గాంధీజీ కొట్టివేసారు. హిందూ- ముస్లిం సంయుక్త ఖిలాఫత్ సమావేశంలో మాట్లాడుతూ గాంధీజీ, ‘పంజాబ్ బాధ ఎంత తీవ్రమైనదైనప్పటికీ, ఆ అంశం మీద, మనం ఆంగ్ల సామ్రాజ్యం అంతా జరుగుతున్న వేడుకలను బహిష్కరించలేం. కనుక ఒక ఖిలాఫత్ అంశం మీదే, మనం శాంతి వేడుకలకు దూరంగా ఉండటం సబబుగా ఉంటుందని వ్యక్తిగతంగా నా అభిప్రాయం’ అన్నారు. కానీ, ఖిలాఫత్ వాదులు పంజాబ్‌లో దారుణ మారణకాండ అంశాన్ని తెరమీదకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే ప్రజలు ఆ మారణకాండ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. అది గమనించి గాంధీజీ కూడా ఆ సమస్యపై మాట్లాడటం మొదలె ట్టారు. కాంగ్రెస్ దాని సంప్రదాయ, చట్టబద్ధ పద్ధతుల నుండి తప్పుకొని సహాయ నిరాకరణ ప్రతిపాదనను పరిశీలించటం ఒక పెద్ద వివాదాస్పద అంశమైంది. ఆ ప్రతిపాదనను చర్చించేందుకే కలకత్తాలో సెప్టెంబరు 4-9 తేదీలలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. (The History of Congress, Pattabhi Seetaramaiah, 1934, p. 336)
హిందూ నాయకుల వ్యతిరేకత
సహాయనిరాకరణ ఉద్యమాన్ని అనేకమంది హిందూ నాయకులు వ్యతిరేకిస్తుడంటంతో, ఖిలాఫత్ వాదులు అభద్రతకు లోనయ్యారు. జాతీయ కోణం నుండి ఆలోచించి హిందువులతో మాట్లాడి వారికున్న సందేహాలను, భయాలను నివృత్తి చేయటం కోసం ముస్లిం ఛాందస వర్గం సిద్ధంగా లేదు. గాంధీజీ తప్ప మిగిలిన కాంగ్రెస్ నాయకులెవ్వరూ ఖిలాఫత్ వాదులకు మద్దతునివ్వలేదు. (History of Freedom Movement in India, R.C. Majumdar, Vol.3, p.64)
కాంగ్రెస్‌లోని మితవాదులు ఖిలాఫత్ ఉద్యమం పుట్టుకే సరైనదికాదని, ఆచరణ సాధ్యం కానిదని భావించారు. డా।। అనిబీసెంటు ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వటం జాతి మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం వంటిదని హెచ్చరిచారు. మద్రాస్ ప్రెసిడెన్సీ న్యాయవాది- జనరల్ శివస్వామి అయ్యర్ ఖిలాఫత్ ఉద్యమం దేశానికి భారీ ఉపద్రవం తీసుకొని రాగలదని జోస్యం చెప్పారు. వి.యస్.శాస్త్రి ఖిలాఫత్ ఉద్యమం హింసాత్మకంగా మారే స్వభావం గలదనీ, దాని వలన తీవ్రనష్టం దాపురించగలదనీ హెచ్చరించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో అడ్వకేట్- జనరల్‌గా పనిచేసిన శ్రీనివాస్ అయ్యంగార్ ఉద్యమ మూడు నాల్గుదశలు చట్ట వ్యతిరేకం, హానికరం అని పేర్కొన్నారు. మదన్ మోహన్ మాలవ్యా కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రారంభ కులలో ఒకరైన సురేంద్రనాథ్ బెనర్జీ తన అసమ్మతిని బహిరంగంగానే వ్యక్తపరిచాడు.
అతివాద వర్గంలో తిలక్ ఉద్యమానికి మద్దతు తెలపగా, మోతీలాల్ నెహ్రూ ఉద్యమం హింసాత్మ కంగా మారుతుందేమోనని భయపడ్డారు. చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్, ఎన్.సి.కేల్కర్, వల్లభాయి పటేల్ వంటి వారు ఖిలాఫత్ ఉద్యమ ఆవశ్యకత పట్ల, దాని ఫలితాల పట్ల అనేక అనుమానాలు వ్యక్తపరిచారు.
కాంగ్రెస్‌లో గాంధీజీకి మద్దతు లేదు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు తెలపటానికి ప్రసిద్ధిగాంచిన కాంగ్రెస్ వాదులు ఎవ్వరూ బహిరంగంగా ముందుకు రావటంలేదు. అనేక అనుమానాలు, భయాలు, సందేహాల మధ్య గాంధీజీ ఒంటరివాడయ్యారు. కాని గాంధీజీ తన అభిప్రాయాన్ని కాంగ్రెస్ మీద రుద్దే ఉద్దేశంలోనే ఉన్నారు. అందుకే ఆయనకు, ఇతర ఖిలాఫత్ వాదులకు 1920 సెప్టెంబర్‌లో కలకత్తాలో జరిగే ప్రత్యేక సమావేశం చాలా కీలకంగా మారింది.
ముందు ఖిలాఫత్ – తర్వాత స్వరాజ్యం
కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బొంబాయి నుండి, మద్రాస్ నుండి ప్రత్యేక రైళ్ల• నడిపారు. వాటికి ఖిలాఫత్ రైళ్లు అనిపేరు పెట్టారు. వాటిలో ముస్లింలను భారీ ఎత్తున కలకత్తాకు తరలించారు. కాంగ్రెస్ లోని జాతీయవాదుల అభ్యంతరాలు లెక్కచెయ్యకుండా ఖిలాఫత్ అనుకూలురుతో సభా ప్రాంగణాన్ని నింపివేసారు దానితో ఖిలాఫత్‌కు మద్దతు తీర్మానానికి, సహాయ నిరాకరణ ప్రతిపాదనకు కావలసిన మెజారిటీని తీసుకొని వచ్చారు. సహాయ నిరాకరణ ప్రతిపాదన గురించి సబ్జెక్టు కమిటీలో మూడు రోజులపాటు చర్చించారు. 144 మంది అనుకూలంగాను, 132 మంది వ్యతిరేకంగాను ఓటువేశారు. భారీగా ముస్లింలను సమీకరించినందువలన సహయ నిరాకరణకే చివరకు ఓటుపడింది. (Speches and Writings of Mahatma Gandhi, Introduction by C.F.Andrews, Madras, 1922, pp. 46-48).
సహాయ నిరాకరణ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, గాంధీజీ ఇలా అన్నారు, ‘భారతదేశ ముస్లింలు ఇస్లాం గౌరవాన్ని కాపాడలేకపోతే, గౌరవప్రదమైన వ్యక్తులుగా, వారు విశ్వసించే ప్రవక్త అనుచరులుగా ఉండలేరు. పంజాబ్ పట్ల భయంకరంగానూ, ఆటవికంగానూ (ఆంగ్లేయులు) ప్రవర్తించారు. ఈ రెండు తప్పులను సరిదిద్దటానికి, దేశం ముందు సహాయ నిరాకరణ ప్రతిపాదనను తీసుకొని రావటానికి ధైర్యం చేస్తున్నాను.’
పంజాబ్ అంశాన్ని గాంధీజీ ప్రస్తావించటం, ఆంగ్లేయులు చేసిన దారుణ మారణకాండను ప్రస్తావించటం, అందుకోసం సహాయనిరాకరణ ప్రతిపాదన వ్యూహాత్మకం చేసినవే. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగాను, జలియన్‌వాలా బాగ్ నరమేధానికి వ్యతిరేకంగా, అమృత్‌సర్ కాంగ్రెస్ సమావేశంలో (1919) సహాయ నిరాకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు దానిని ఆయన వ్యతిరేకించారు. యుద్ధానంతరం ప్రభుత్వం తలపెట్టిన శాంతి వేడుకలను బహిష్క రిచేందుకు జలియన్‌వాలా బాగ్ దురంతం సరైన అంశం కాబోదు అని కూడా ఆయన అంతకు ముందు అన్నారు (History of Freedom Movement in India, R.C. Majumdar, Vol.3, p.89).
కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి పెద్ద ఎత్తున ముస్లింలను సమీకరించారు. కలకత్తా పట్టణంలోని టాక్సీ డ్రైవర్లను సమీకరించి, వారిచేత తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయించారన్న అపవాదును కాంగ్రెస్ నాయకత్వం ఖండించలేదు. సమావేశం 5 వేలమందికి పైగా ప్రతినిధులతో కిక్కిరిసిపోయింది. వారిలో సగంమంది కూడా ఓటు వెయ్యలేదు. తీర్మానానికి అనుకూలంగా 1876 మంది, వ్యతి రేకంగా 804 మంది ఓటు వేశారని ప్రకటించారు (A.C.Niemeijer, ibid, 1972, p.109).
1920 ఏప్రిల్‌లో ఖిలాఫత్ సమావేశం చేసిన సహాయనిరాకరణ ప్రతిపాదనలను సెప్టెంబర్‌లో కాంగ్రెస్ సమావేశంలో చేసిన ప్రతిపాదనలను పోల్చి చూస్తే, ఖిలాఫత్ వాదులు కాంగ్రెస్ కంటె తీవ్రంగా సహాయ నిరాకరణను అమలు చేయటానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. సహాయనిరాకరణ ఉద్యమంలో ప్రజలు చురుకుగా పాల్గొన్నప్పటికి, ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఖిలాఫత్ వాదులు కోరుకున్న విధంగా కాక, టర్కీ సామ్రాజ్య విచ్ఛిన్న దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ సందర్భంలో గాంధీజీ చేసిన వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకోవాలో పాఠకుల విజ్ఞతకు వదిలేద్దాం. ఆయన ఇలా వ్రాశారు, ‘ముసల్మానులు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు. మరింత శక్తిమంతమైన చర్యల కోసం కాంగ్రెస్‌ను, ఖిలాఫత్ సంస్థలను అడుగుతున్నారు. అందువల్ల వారు స్వరాజ్యం వచ్చేవరకు ఎదురుచూడటానికి సిద్ధంగాలేరు. స్వరాజ్యం సిద్ధించటం నిరవధికంగా ఆలస్యం కావచ్చు. కనుక ఖిలాఫత్ ఉద్యమ విజయ అవకాశాలు మొరుగయ్యే పక్షంలో, కొంతకాలం పాటు స్వరాజ్యంకోసం చేస్తున్న పోరాటాన్ని వాయిదా వెయ్యటానికి నేను సంతోషంతో ఒప్పుకుంటాను’ (History of Freedom Movement in India, R.C. Majumdar, Vol.3, p.96).
ఇస్లామిక్ మతకోరల ఆవిష్కరణ
ఖిలాఫత్ నాయకత్వం దేశమంతటా విస్తృతమైన ప్రచారం చేపట్టింది. ప్రతి సాయంత్రం ముఖ్యమైన పట్టణాలలో ముస్లిం స్వచ్ఛంద కార్యకర్తలు ప్రధాన వీధుల్లో కత్తులు, కటార్లు, గొడ్డళ్లు తిప్పుతూ ప్రదర్శన ఇచ్చేవారు. ‘ఇస్లాం ప్రమాదంలో పడింది’ అన్న అభిప్రాయాన్ని ముస్లిం ప్రజానీకంలోకి తీసుకొని వెళ్లటానికి, ‘క్రైస్తవ మతశుక్తుల కుట్ర’కు ఎదురొడ్డి నిలవవలసిన అవసరాన్ని చెప్పటానికి కరపత్రాలు ముద్రించి పంచేవారు. పద్యాలు, గేయాల ద్వారా ఆకట్టుకొని ముస్లిం ప్రజానీకంలో ఒక అభద్రతా భావాన్ని, సృష్టించి, రెచ్చగొట్టారు. ప్రజల నుండి నిధులు సమీకరించటమే కాక, ఖిలాఫత్ రూపాయి నోట్లను ముద్రించి, చెలామణి చేశారు. ఈ రూపాయి నోట్ల మీద ఖురాన్ సూక్తులను ముద్రించారు.
ముస్లిం మత పెద్దలు లౌకికవాద భావజాలానికి సామాన్య ముస్లింలలో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోయారు. సహాయనిరాకరణ ఉద్యమం ద్వారా ముస్లిం విశ్వాసాలను ఇస్లామీకరణ చేయటానికి పూనుకొన్నారు. శాసనసభల స్థానాలలో మతపెద్దల కమిటీలు వస్తాయనీ, అవిశ్వాసుల న్యాయస్థానాల స్థానంలో షరియా న్యాయస్థానాలు ఏర్పాటు అవుతాయనీ, ప్రభుత్వ పాఠశాలల స్థానంలో దార్-ఉల్-ఉలమ్‌లు ప్రారంభమవుతాయనీ చెప్పారు. జమాయిత్-ఉల్-ఉమ్మా-ఐ-హింద్ సహాయ నిరాకరణ ఉద్యమంలో చేపట్టిన ప్రతిచర్యను మత గ్రంథాలను ఉటంకిస్తూ సమర్థిస్తూ ఒక సామూహిక ఫత్వాను జారీ చేసింది. అంతేకాక సహాయ నిరాకరణను వ్యతిరేకించే వారిని మత త్రిసభ్య సంఘాల ద్వారా శిక్షిస్తారని కూడా ప్రకటించింది. (The Khilafat Movement: Religious Symbolism and Political Mobilisation in India, Gail Mimault, 1982, p. 146).
ఖిలాఫత్ వాదులు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. కాంగ్రెసు పార్టీ నిధులను, చివరకు తిలక్ స్వరాజ్య నిధిని సైతం ఖిలాఫత్ ఉద్యమం కోసం ఖర్చు చేశారు. ఆ నిధులకు లెక్కలు చెప్పలేదు. సొమ్ము కాంగ్రెస్‌ది, షోకు ఖిలాఫత్‌ది అయింది.
అఫ్ఘాన్ అమీర్‌కు ఆహ్వానం
1921 వేసవి నుండి కొందరు ఖిలాఫత్ వాదులు హింసను ప్రేరేపించే ఉపన్యాసాలు చేయసాగారు. ఆంగ్ల సైన్యంలో పనిచేయటం మత ద్రోహం కిందకు వస్తుందని సామూహిక ఫత్వాను జారీచేసి, రహస్యంగా సైన్యంలో ఉన్న ముస్లిం సైనికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. 1920-21లో అఫ్ఘాన్ అమీర్‌ను భారత్‌దేశం పైకి దాడి చేయమని అర్థించించారు. మద్రాసులో ఒక సమావేశంలో మహమ్మదాలీ మాట్లాడుతూ ఒకవేళ అఫ్ఘాన్ అమీర్ దాడిచేసినట్లయితే, ముస్లింలు ఏం చెయ్యాలో, చెయ్యకూడదో బోధించాడు. అమీర్ కనుక దేశాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే, ఆ దాడిని తిప్పకొట్టాలని, అలాకాకుండా ఇస్లాంను, ఖిలాఫత్‌ను అణచివేస్తున్న శత్రువుల పీచమణచడానికి దాడిచేస్తే వారితో చేయిచేయి కలిపి పోరాడాలని ముస్లింలకు మార్గదర్శనం చేసాడు. మహమ్మదాలీ ఇచ్చిన ఈ ఉపన్యాసం హిందువులను భయ భ్రాంతులకు గురిచేసింది. గాందీజీ యంగ్ ఇండియాలో ఇలా రాశారు, ‘బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫ్ఘాన్ అమీర్ యుద్ధం చేసేటట్లయితే, నేను తప్పకుండా అతనికి సాయపడతాను. ఎందుకంటే జాతి నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కులేదని, అట్టి ప్రభుత్వానికి సాయం అందించటం నేరమవుతుందని నాదేశ ప్రజలకు బహిరంగంగానే చెప్తాను’ (Niemeijer, ibid, p. 129-130). ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ వైస్రాయి రీడింగ్‌కు పంపిన ఒకనోట్‌లో (జనవరి 12, 1922) ‘సందేహం లేదు. ముస్లిం రౌడీలు చంపటానికి, హింసాత్మక చర్యలకు పాల్పడటానికి సిద్ధంగా ఉన్నారు’ అని హెచ్చరించాడు. బెంగాల్ లోనూ, ఉత్తరప్రదేశలలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు స్టేషనులు, ఇతర ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి (Qureshi, ibid, p. 221). ఉత్తరప్రదేశ్‌లో గోరక్‌పూర్ జిల్లాలోని చౌరీ చౌరా పోలీసు ఠాణామీద 1922 ఫిబ్రవరి 4న మూడు వేలమంది ఖిలాఫత్ నిరసనకారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఠాణాను తగులబెట్టారు. 21 మంది పోలీసులను, చౌకీదారులును నిరసనకారులు కత్తులతో, గొడ్డళ్లతో నరికి చంపారు. గాంధీగారు బహిరంగంగా జరిగిన హత్యాకాండ పట్ల పశ్చాత్తాపం వ్యక్తపరచి తన ఉద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసారు. ముస్లిం ఛాందసవాదులు చేపట్టిన ఉద్యమం రెండు ముఖ్యమైన పరిణామాలకు దారితీసింది. మొదటిది మూకు మ్మడిగా ముస్లింలు అఫ్ఘానిస్తాన్‌కు వలస వెళ్లారు. ముస్లింలను హిజ్రత్ చేయమని ఆదేశించిన ఫలితమే ఇది. రెండవది మలబార్ తీరంలో జరిగిన హిందు వుల ఊచకోత. మోప్లాలను జిహాద్ చేయమని ప్రేరే పించిన ఫలితంగా జరిగిన దారుణమారణ కాండలో వేలాదిమంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వచ్చే భాగాల్లో వాటిని గురించి విడివిడిగా చర్చిద్దాం.
వచ్చేవారం : చరిత్రాత్మక భంగపాటు -హిజ్రత్