మంచో చెడో ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం నిత్యం వార్తల్లో వెలిగిపోతూనే ఉంటుంది. ప్రస్తుత విషయానికే వస్తే.. ఓవైపు దేశమంతా కొవిడ్‌ ‌మహమ్మారితో పోరాడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం సొంత పార్టీ రెబల్‌ ఎం‌పీ రఘురామ కృష్ణంరాజుకు రాజద్రోహం ముద్రవేసేందుకు శక్తియుక్తులు అన్నింటినీ ధార పోస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వం బడ్జెట్‌ ‌సమావేశాలను ఒకేఒక్క రోజులో చాప చుట్టేసింది. రూ. 2 కోట్ల 29 లక్షల పైచిలుకు బడ్జెట్‌ను మరో మాట, మరో చర్చ లేకుండా అసలు సభలో ప్రతిపక్షమే లేకుండా ‘మమ’ అనిపించింది. రాజ్యాంగ అనివార్యత దృష్ట్యా ఒక్కరోజులోనే బడ్జెట్‌ ‌క్రతువు మొతాన్ని కానిచ్చారు.

ఇక అసలు విషయానికొద్దాం. ముందుగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయానికొస్తే కారణాలు ఏవైనా ఆయన పార్లమెంట్‌ ‌సభ్యుడిగా ఎన్నికైన తొలి నాళ్ల నుంచే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను విమర్శిస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రచ్చబండ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇంచుమించుగా సంవత్సరంన్నరంగా ఈ రచ్చబండ రాజకీయం సాగుతూనే ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. అయితే, ఈ మధ్య కాలంలో కృష్ణంరాజు క్విట్‌ ‌ప్రో, అక్రమాస్తుల కేసుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ ‌రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. కోర్టు ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి జగన్‌కి నోటీసులిచ్చింది.

ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇన్నిరోజులు కృష్ణంరాజు విమర్శలను చూసి చూడనట్లు వదిలేసిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇక ఉపేక్షించి లాభంలేదని నిర్ణయానికి వచ్చిందో ఏమో కానీ సీఐడీని రంగంలోకి దించింది. కోర్టు సెలవు దినాలు చూసుకుని ఆయన్ని అరెస్ట్ ‌చేశారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇటూ అటూ చేతులు మారుతూ బంతి కింది కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం చేరుకుంది. చివరకు ఏ మలుపు తిరుగుతుందో ఏమో చూడాలి.

పగ, ప్రతీకారంతో రగిలిపోయే వారికి, ముఖ్యంగా నేర చరితులకు ప్రత్యేకించి శత్రువులు అవసరం ఉండరు అంటారు పెద్దలు. స్వహస్తాలతో ఎవరి గోతిని వారే తవ్వుకుంటారు. ఈ వ్యవహారంలో ఇంతవరకు అయితే అదే అనిపిస్తుంది. కనీసం ఒక్కరోజు రెబెల్‌ ‌రాజును జైల్లో తోయించాలని పన్నిన పథకం పారలేదు. అన్న కళ్లలో ఆనంద మెరుపు రేఖలు చూడాలని ప్రభుత్వ వర్గాలు రచించిన పథకం పారలేదు.

అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల విషయానికి వస్తే.. ఒక్కరోజులో గవర్నర్‌ అ‌డ్రస్‌, ‌బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టడం.. ఆమోదం పొందడం.. పనిలో పనిగా అధికార పార్టీ భాషలో పతిపక్షం మీద విమర్శలు గుప్పించడం.. జగన్మోహన్‌రెడ్డి సూక్తులు, సుభాషితాలు.. అన్నీ అయిపోయాయి. నిజమే. ప్రస్తుతం రోజుకు 20 వేల పైచిలుకు కొత్త కరోనా కేసులు, వంద పైచిలుకు మరణాలు నమోదవుతున్న పరిస్థితుల్లో స్థిమితంగా ఓ పదిరోజులో పక్షంరోజులో సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌పై సవివరంగా చర్చించే పరిస్థితి లేదు. కానీ, ఒక్కరోజులో రూ. 2 కోట్ల 29 లక్షల పైచిలుకు బడ్జెట్‌ను తూతూ మంత్రంగా కానీయడం, అంతగా సమర్థనీయం కాదు. అలాగే, గవర్నర్‌ ‌ప్రసంగాన్ని అదే తీరున కానివ్వడం కూడా విమర్శలకు తావిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం, తెలుగుదేశం సమావేశాలను బహిష్కరించి నిరసన తెలియచేసింది. మాక్‌ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వాన్ని విమర్శల్లో ముంచెత్తింది.

బడ్జెట్‌లో ఐదో వంతు మొత్తాన్ని సంక్షేమం పేరిట నేరుగా ఓటర్ల జేబులకు చేరే విధంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌రెడ్డి కేటాయింపులు చేశారు. గత బడ్జెట్‌లో పెద్ద పీట వేసిన విధంగానే ఈ బడ్జెట్‌లోనూ ఆసరా, చేయూత, భరోసా, అమ్మఒడి, గోరుముద్ద.. ఇలా నేరుగా ప్రజల బ్యాంక్‌ ‌ఖాతాల్లోకి సొమ్ములు జమ చేసే పథకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. రూ. 48.083.92 కోట్లు నేరుగా జనం జేబుల్లోకి చేరే విధంగా బడ్జెట్‌ ‌రూపొందించారు. అంతేకాదు, ఓవైపు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన విధంగా సుస్థిర అభివృద్దికి ప్రాధాన్యం ఇస్తున్నామని అంటూనే ఆర్థికమంత్రి బుగ్గన చివరకు పిల్లలను కూడా వదలకుండా (బహుశా ‘నేటి బాలలే రేపటి ఓటర్లు’ అనే విశ్వాసంతో కావచ్చు. ఈసారి మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా బడ్జెట్‌ ‌కేటాయింపులు చేశారు) ఏ సామాజిక వర్గానికి ఎంత మేలు జరుగుతుందో, ఏ వర్గానికి ఎంత ‘ఉచితం’ అందుతుందో చూపించే ప్రయత్నం చేశారు. మంత్రి మాటల్లోనే చెప్పాలంటే, మొత్తం 22 పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ములు జమవుతాయి. ఇందుకోసం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో రూ. 4,141 కోట్లు అదనంగా కేటాంచారు. అయితే, ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే దానికి ‘అప్పు చేస్తాం’ అనే సమాధానమే వస్తోంది. వీటిల్లో ముఖ్యమైన వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ ‌చేయూత, అమ్మ ఒడి పథకాల అమలుకు అవసరమయ్యే రూ.16,890 కోట్ల కోసం రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ ‌ద్వారా వివిధ సంస్థల నుంచి రుణాలను సేకరిస్తోంది.

నిజానికి, బడ్జెట్‌ ‌సమగ్ర స్వరూపాన్ని చూస్తే.. పథకాలు, పందేరాల విషయంలో ఉన్న స్పష్టత, ఆదాయం విషయంలో కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవిధంగా చూస్తే బడ్జెట్‌లో వాస్తవ దృక్పధం లోపించిందనే అభిప్రాయం వినిపిస్తోంది. గత సంవత్సరంలో మొత్తం రాబడి రూ. 1,61.958.50 కోట్లు ఉంటుందని ప్రభుత్వం ఆశించింది. కానీ, వచ్చింది రూ. 1,18,063.09 కోట్లు మాత్రమే. ఈ ఏడాది గత•ం కంటే భిన్నంగా ఉంటుందని ప్రభుత్వం ఎలా అంచనా కొచ్చిందో కానీ, నాలుగు కీలక పద్దుల పరిధిలో రూ.1,77,196.48 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా ప్రభావం గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఇంకా ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా గత సంవత్సరం గ్రామీణ ప్రాంతాలపై అంతగా ప్రభావం చూపని కరోనా ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ అధిక ప్రభావం చూపుతోంది. మరోవైపు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా కట్టడి, వాక్సినేషన్‌కు కలిపి రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితులలో ఇది కరోనా కట్టడికి ఏమాత్రం సరిపోదు. వచ్చే మార్చిలోగా అవసరం అయితే గ్లోబల్‌ ‌టెండర్లకు వెళ్లి అయినా ప్రజలందరికీ టీకాలు వేయించవలసి ఉంటుంది. నిజానికి, జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వం కరోనా విషయంలో మొదటి నుంచి శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌ ‌కేటాయింపులు ఉన్నాయి.

అభివృద్ధి కోణంలో చూస్తే.. బడ్జెట్‌లో మూలధన వ్యయం పద్దు కింద రూ.31,198.38 కోట్లు చూపించారు. అయితే, గత సంవత్సరం బడ్జెట్‌లో చూపిన రూ.29,907.62 కోట్లలో సగంకంటే కాసింత ఎక్కువగా రూ. 18,797.39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ లెక్కన ఈ సంవత్సరం అభివృద్ధి వ్యయం ఇంకా కిందకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం పాస్టర్లు, ఇమాంల పట్ల గల ప్రత్యేక ప్రేమను మరోమారు ప్రకటించు కుంది. ఇటీవలనే వారికి ఇస్తున్న నెల జీతాన్ని రూ. 5000 నుంచి ఏకంగా రూ.10,000 లకు పెంచిన ప్రభుత్వం బడ్జెట్‌లో ఇందుకోసం రూ.120 కోట్లు కేటాయించింది. అర్చకులకు కూడా అంతే మొత్తాన్ని కేటాయించింది. అయితే, రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవుల జనాభా హిందూ జనాభాలో ఒక వంతు కూడా ఉండదు. అయినా అర్చకులతో సమనంగా పాస్టర్లు, ఇమాంలకు బడ్జెట్‌ ‌కేటాయింపులు చేయడాన్ని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అదీగాక, అర్చకులకు దేవాలయాల ఆదాయం నుంచి జీతాలు చెల్లిస్తోంది. కానీ, క్రైస్తవ ఫాదర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఇక సహజంగానే ప్రతిపక్షాలు బడ్జెట్‌ను తూర్పార పట్టాయి. అధికార పార్టీ నాయకులు ఈ కేటాయింపులను ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు మేలు చేసే బడ్జెట్‌ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దివాలకోరు బడ్జెట్‌ అం‌టూ విమర్శించారు. ఇక ప్రజల మనసులో ఏముందో!?

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE