– డా।। ప్రభాకర్‌ ‌జైనీ

వాకాటి పాండు రంగరావు స్మారక  దీపావళి కథల పోటీకి ఎంపికైనది


బంజారాహిల్స్ ‌హాస్పిటల్‌ ‌నుండి నేను ఉండే మధురానగర్‌ ‌పెద్ద దూరమేం కాదు. కానీ, కొన్ని యోజనాల దూరం ప్రయాణం చేసినంత అలసటగా ఉంది. నేను నా కారు స్టార్ట్ ‌చేసాను కానీ, ఎక్కువ దూరం నడపలేక, కారు రోడ్డు పక్కకు ఆపి రెండు చేతులతో కణతలు నొక్కుకున్నాను. తల పగిలి పోతుందేమో అన్నంతగా పోటు వస్తుంది. దానికితోడు గుండెల్లో ఉప్పొంగుతున్న దుఃఖం కళ్ల గుండా బయటకు దుముకుతుంది. ఆ వార్త విన్నప్పటి నుండి నా ఒంట్లో నుండి పొగలు చెలరేగుతున్నాయి.

‘నిజంగా ఇట్లా జరుగుతుందా? మనుషులు ఇంత మెకానిక్‌గా, అయిన వారి పట్ల ఇంత నిర్లిప్తంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించగలుగుతారా?’ మనసు ఆలోచనలతో రగిలిపోసాగింది.

—————–

ఒక ప్రొడ్యూసర్‌ ‌కెమెరాల కోసం వస్తానంటే ఎదురు చూస్తూ ఆఫీసులో కూర్చున్నాను. సినిమా షూటింగులకు కెమెరాలు అద్దెకు ఇవ్వడం మా బిజినెస్‌.

‘‌షూటింగ్‌ ‌జరపడానికి సినిమా నిర్మాతల దగ్గర కెమెరాలు ఉండవు. వాళ్లు బయట – నాలాంటివారి – దగ్గర నుండి రోజు వారీ అద్దెకు తీసుకుని షూటింగు జరుపుకుంటారు. కానీ, ఈ విషయం సామాన్య ప్రజలకు తెలియదు.

సినిమా నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. సినిమా నిర్మాణంలోని 24 క్రాఫ్టులలో ప్రతీక్రాఫ్టూ రోజు రోజుకీ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కెమెరా ఫీల్డులో నెలకో కొత్త కెమెరా సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అవుతుంది. అందుకే, అంతకుముందు మనం కలలో కూడా ఊహించలేని అద్భుత సుందర దృశ్యాలు ఇప్పుడు వెండితెరమీద ఆవిష్కృత మవుతున్నాయి.

ఈ కెమెరాలను జర్మనీ, అమెరికా, సింగపూర్‌ల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి తెలియనిదేమంటే, ఒక్కో కెమెరా విలువ యాక్సెసరీస్‌తో కలిపి కోటి రూపాయలపైనే ఉంటుంది. ఈ కెమెరాలకు వాడే అల్టాప్రైమ్‌, ‌మాస్టర్‌ ‌ప్రైమ్‌లెన్సుల విలువ కూడా యాభై అరవై లక్షలపైనే ఉంటుంది. వీటికితోడు, మానిటర్లూ, ఫిల్టర్లూ, కేబుల్స్, ‌లాప్టాపులూ వంటి అనేక పరికరాలు ఈనాటి అత్యాధునిక సినిమా షూటింగుకు అవసరమవుతాయి. కెమెరా విభాగం ఇప్పుడొక ప్రత్యేక సబ్జెక్టుగా రూపుదిద్దుకుంది.

నిర్మాతలకు ఈ కెమెరాల సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. వాటి మెయింటెనెన్స్‌కు సంబంధించిన అవగాహన కూడా ఉండదు. అందుకేవాళ్లు బయట నుండి కెమెరాలను అద్దెకు తీసుకుంటారు. ప్రతీ కెమెరా వెంబడి మా తరఫున నలుగురైదుగురు కెమెరా అసిస్టెంట్లు షూటింగులకు వెళ్తారు. కెమెరా యోగక్షేమాలు చూడడం, లెన్సులు మార్చడం, కెమెరాను మోసుకెళ్లడం వంటి పనులు చేస్తారు.

వాళ్లకు యూనియన్‌ ‌నిర్ణయించిన ప్రకారం బేటాలు ఉంటాయి. అన్నీ కలిపి, కెమెరా రేంజ్‌ని బట్టి, లైట్లు, లెన్సులను బట్టి కెమెరా అద్దె రోజుకు అరవైడెబ్భైవేలు ఉంటుంది.

 ఇది కెమెరామెన్‌కు నిర్మాత చెల్లించవలసిన రెమ్యునరేషన్‌కు అదనం. అలాగే, కేవలం రోజుకు రెండుమూడు వేలకు దొరికే కెమెరాలు కూడా ఉంటాయి. అందుకే, మాలాంటివాళ్లు ఈ బిజినెస్‌లోకి దిగాల్సి వచ్చింది.

కాబట్టే ఒక కొత్త సినిమా మొదలవుతుందనగానే, ఆ కెమెరా కాంట్రాక్టస్ ‌సంపాదించడానికి కెమెరా ఓనర్లు ఎవరి ప్రయత్నం వారు చేస్తుంటారు. ఒక సినిమాకు అగ్రిమెంట్‌ అయిపోతే మాకు యాభై అరవై లక్షల ఆదాయం ఎటూపోదు. కెమెరాలను షూటింగులకు, అద్దెలకు తిప్పకుండా, ఇంట్లో ఉంచుకుంటే డెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌. ఆదాయం లేకపోగా కెమెరా అసిస్టెంట్లకు జీతాలభారం కూడా మనమీద పడుతుంది.

అందుకే, నేను కూడా మార్కెట్‌లో బాగా తిరుగుతుంటాను. కెమెరామెన్లూ, ప్రొడక్షన్‌ ‌మేనేజర్లతో సత్సంబంధాలు పెట్టుకుంటాను. క్రమం తప్పకుండా వాళ్లకు పార్టీలూ, గిఫ్టులూ ఇస్తూ వారిదృష్టిలో నేను ఉండేలా చూసుకుంటూ ఉంటాను. కాబట్టి వారు నిర్మాతలకు నా పేరు రికమెండ్‌ ‌చేస్తుంటారు.

ఆ క్రమంలోనే, నాకు తెలిసిన మేనేజర్‌, ఒక కొత్త నిర్మాతను పట్టుకొస్తున్నానని చెప్పడంతో ఆఫీసులో వెయిట్‌ ‌చేస్తున్నాను.

నిర్మాత మా ఆఫీసుకు వస్తున్నాడనగానే మా వాళ్లు హాల్లో ట్రైపాడ్‌ ‌స్టాండుల మీద కొత్తగా వచ్చిన కెమెరాలను మౌంట్‌ ‌చేసి అంటే అమర్చి, షూటింగ్‌ ‌మోడ్లో ఉంచుతారు. ఆ హాలును దాటిన తర్వాతనే నా రూములోకి రావలసి ఉంటుంది. ఆ కాస్త సమయంలో కెమెరాలను నిర్మాత అబ్బురంగా చూస్తూ ఉండి పోవాలని మా ఆలోచన.

కాసేపటికి నిర్మాతతోపాటూ కెమెరామెన్‌, ‌మేనేజర్‌ ‌కూడా వచ్చారు. అతని పేరు నాయుడు అని పరిచయం చేసారు. నేను నా విజిటింగ్‌ ‌కార్డు ఇచ్చాను.

 అతను సినిమా రంగానికి కొత్తవాడని ఐదు నిముషాల్లోనే నాకర్థమయ్యింది. రియల్‌ఎస్టేట్‌ ‌రంగంలో బాగా ఇబ్బడిముబ్బడిగా సంపాదించి నట్టుగా అతను చెప్పిన హౌజింగ్‌ ‌వెంచర్ల గురించి చెప్తే నా కర్థమయ్యింది. లెక్క లేనంత డబ్బు సంపాదించినవారి తర్వాత అడుగు సినిమా రంగమే కాబట్టి

కెమెరామెన్‌, ‌మేనేజరు కలిసి అతన్ని ముగ్గులోకి దింపాలని ప్రయత్నిస్తున్నారని కూడా అర్థమయింది. నేను ఎంత వ్యాపారవేత్తనే అయినా నిర్మాతను ముంచి డబ్బులు సంపాదించాలని అనుకోను. అందుకే, అన్యమనస్కంగానే, వాళ్లకు కొటేషన్‌ ఇచ్చి పంపాను.

ఆ రోజు రాత్రి నన్ను ఒక ఐదు నక్షత్రాల హోటలుకు రమ్మని నిర్మాత ఫోన్‌చేసాడు. నేను వెళ్లగానే,

‘‘ఇప్పుడు చెప్పండి?’’ అన్నాడు నవ్వుతూ.

‘‘ఏంటిసార్‌?’’ అన్నాను నేను బిత్తరపోయి చూస్తూ.

‘‘కాకమ్మ కబుర్లు చెప్పి, మా వాళ్లు నన్ను సినిమా ముగ్గులోకి దించుతున్నారు. ఇదేకదా మీ ఆలోచన?’’ అన్నాడు గ్లాసులోని విస్కీ సిప్‌ ‌చేస్తూ. నేను రెండు నిముషాలు ఆలోచించి,

‘‘ఔను నాయుడుగారూ! మీకు సినిమా రంగంలో అనుభవం లేదు. అందుకే, మొదటిసారే ఇంత పెద్ద బడ్జెటుతో ప్లాన్‌ ‌చేస్తున్నారని నాకు అనుమానమొచ్చింది. ఇంకా హీరో హీరోయిన్‌లు కన్ఫర్మ్ ‌కాలేదు. కథ, పాటలు ఫైనలైజ్‌ ‌కాలేదు. పీప్రొడక్షన్‌న్‌లేవీ మొదలే పెట్టలేదు. అప్పుడే షూటింగు కోసం కెమెరాలు కావాలని రావడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ, అడగందే సలహా ఇవ్వొద్దని నేను ఈ రంగంలో నేర్చుకున్న మొదటి పాఠం.’’

‘‘అందుకే పొద్దున మౌనంగా ఉన్నాను. కానీ, నా మనసులో ఇటువంటి ఆలోచన ఉందని మీరెలా కనిపెట్టగలిగారు?’’ అనిప్రశ్నించాను.

‘‘రెడ్డిగారూ! నేను సినిమా ఫీల్డులో లేకపోయినా, వ్యాపారం ఎలా చేయాలో, వ్యవహారం ఎలా నడపాలో క్షుణ్ణంగా తెలిసినవాణ్ణి. మీరు పొద్దున్న మేం వచ్చినప్పుడు ఉన్నంత హుషారుగా తర్వాత లేరు, ఎందుకో ఇబ్బందిగా ఫీలయ్యారు. నాతోపాటు వచ్చిన వాళ్లు అత్యుత్సాహం చూపుతున్నా మీరు ఏదో చెప్పాలనుకుని చెప్పలేక తటపటాయించడం నేను గమనించాను. అందుకే, అసలు విషయం తెలుసుకుందామని ఇక్కడికి పిలిచాను. ప్లీజ్‌ ‌తీసుకోండి’’  అంటూ విస్కీ అందించాడు.

నాకు సంతోషం కలిగింది. నాయుడుగారు నేననుకున్నంత అమాయకుడు కాదు. అటువంటి వాళ్లతో వ్యవహారం నెరిపితే, నాకైతే, ఎదుటివారిని మోసం చేస్తున్నామన్న గిల్టీకాన్షియస్‌నెస్‌ ఉం‌డదు.

‘‘మీ ఆలోచన సరైందేసార్‌? ఎం‌దుకో వాళ్లు చాలా ఆతృతలో ఉన్నట్టు అనిపించింది. సినిమా తీయాలనుకోవడం అనే నిర్ణయం సులభమేకానీ, అందుకు చాలా తతంగం ఉంటుంది. బ్యానర్‌, ‌సినిమా టైటిల్‌ ‌రిజిస్టర్‌ ‌చేయించాలి. ఎఫ్‌డీసీలో పర్మిషన్‌ ‌తీసుకోవాలి. ఆఫీసు, స్టాప్‌వంటి చాలా పనులుంటాయి. వీటన్నింటికీ కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది. అవేవీ లేకుండానే కెమెరాలు కావాలని రావడం నాకు ఆశ్చర్యమేసింది. నిర్మాత కలకాలం సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని సార్‌ ‌నేను! ఏదో దొంగ మాటలు చెప్పి రెండు రూపాయలు సంపాదించడం నా పద్ధతికి విరుద్ధం సార్‌! ఇప్పటి వరకు డబ్బులు ఏమైనా ఇచ్చారా?’’ అని అడిగాను.

‘‘ఎక్కవ ఏం ఇవ్వలేదు. రెండు మూడు లక్షలు ఖర్చయ్యాయి. అంతే!’’ అన్నాడు.

ఆ రోజు నుంచి నాయుడుగారూ నేను మంచి దోస్తులమయ్యాం. నాయుడు గారు సినిమా తీసారు కానీ, పాతబ్యాచ్‌తో కాదు. వాళ్లు నలభై కోట్లు ఖర్చవుతుందని చెబితే నేను వేరే టీమును మాట్లాడి ఒక మీడియం రేంజ్‌ ‌సినిమాను పదికోట్లలో పూర్తి చేసేవిధంగా ప్లాన్‌ ‌చేసి ఇచ్చాను. అది ఒక మోస్తరు హిట్‌ అయింది కూడా. అయితే, నేనెక్కడా ప్రత్యక్షంగా ఇన్వాల్‌ ‌కాలేదు. నా కెమెరాలు కూడా నేను ఇవ్వనన్నాను. దాంతో నాయుడిగారికి నా మీద గురి కుదిరింది. స్నేహం పెరిగింది.

నాయుడుగారు తరువాత సినిమాలు తీయలేదు. ఏదో, ఇంట్లో వాళ్ల తృప్తికోసం, ఓ సినిమా తీసిపడేసారు. కానీ, నాతో స్నేహం మాత్రం మానలేదు.

ఆయన చాలా బిజీ. నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులతో హైదరాబాదు నగరంలో రియల్‌ఎస్టేట్‌ ‌శరవేగంగా పుంజుకుంది. విల్లాలు, డూప్‌లెక్స్ ‌భవంతులు, అపార్ట్‌మెంట్‌ల సంస్కృతి బాగా పెరగడంతో నాయుడు గారు ఆ పనుల్లో తలమునకలుగా ఉండేవారు.

రియల్‌ఎస్టేట్‌ ‌వ్యవహారాలు అంతస్మూత్‌గా సున్నితంగా పరిష్కారంకావు. వాటికి అంగబలం, అర్థబలంతో పాటు రాజకీయ నాయకుల, పోలీసుల సహాయ సహకారాలు కూడా అవసరం. మనం న్యాయంగా ఉన్నా, అవతలివారు, పోటీదారులు పన్నే ఎత్తుగడలను తట్టుకోవాలంటే ఆ మాత్రం పటాటోపం ఉండాల్సిందే.

అందుకే నాయుడుగారు అడుగు తీసి అడుగేస్తే ఆయన చుట్టూ అంగరక్షకులూ, బౌన్సర్లూ తెల్లచొక్కామాటున కదిలేవారు. ఎవరైనా చూస్తే వాళ్లంతా ఏదో రాజకీయపార్టీ కార్యకర్తల్లా ఉండేవారు.

ఆయనకు నాలో ఏం నచ్చిందో గానీ నాకు రోజూ ఫోన్‌ ‌చేసేవాడు. నాకు తెలియని స్థలాల విషయంలో నా సలహాలు అడిగేవాడు. నేను,

‘‘నాకేం తెలుసు సార్‌?’’ అం‌టే,

‘‘మీకు తెలియదని నాకు తెలుసు రెడ్డిగారూ! కానీ మీతో మాట్లాడాలనిపించి ఫోన్‌ ‌చేసా! బాగున్నారా? చేతిమీద సినిమాలున్నాయా? ఏమైనా పని ఉంటే చెప్పండి! సీయంతోనైనా సరే చెప్పి చేయిస్తా!’’ అని నవ్వేవాడు.

‘‘అంత పెద్ద పనులు నాకేం ఉంటాయి సార్‌?’’ అనడంతో ‘సరే, సరే’ అంటూ సంభాషణ ముగించేవాడు.

ఆయన వ్యవహారంలో ఎంత ఘనుడైనా, సుకుమార హృదయం కలవాడు. సమాజంలో జరిగే ప్రతీ చిన్న అన్యాయానికి చలించిపోయేవాడు. భార్య భుజం మీద తలాన్చి కన్నీరు కార్చేవాడు. నాతో ఆ విషయాలన్నీ పంచుకునేవాడు. పిల్లలిద్దరితోనూ, భార్యతోనూ వీలైనప్పుడల్లా సంతోషంగా గడిపేవాడు.

అట్లాంటిది నాకు ఒకరోజు ఆయన దగ్గర నుంచి ఫోన్‌ ‌వచ్చింది.

‘‘బాగున్నా…..’’ అని అడగబోతుండగానే, ఫోనులో ఆయన భార్య ఏడుపు వినిపించింది. నాగుండె గతుక్కుమంది. వణుకుతూ,

‘‘ఏమైందండీ?’’ అని అడిగాను.

‘‘నాయుడుగారు హాస్పిటల్లో ఉన్నారు. బ్రెయిన్‌‌స్ట్రోక్‌ ‌వచ్చింది!’’ అని చెప్పడంతో నేను నిర్ఘాంతపోయాను.

వెంటనే నాయుడి గారిని చూడడానికి బయల్దేరాను. కానీ, పాత విషయాలన్నీ గుర్తుకొచ్చాయి.

తర్వాత హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు, ఏదో ల్యాండ్‌ ‌స్కాం జరగడంతో మెదడులో నరాలు చిట్లి, కోమాలోకి వెళ్లాడనీ, ఆపరేషన్స్ ‌చేసినా ఫిఫ్టీఫిఫ్టీ ఛాన్స్ ‌మాత్రమే అని చెప్పారని అనడంతో విషాద సాగరంలో లంగరు వేసినట్టుగా నా మనసు కృంగిపోయింది.

——————

ప్రతీరోజులాగే ఆరోజు కూడా నాయుడి గారిని పరామర్శించడానికి వెళ్లాను. అనుకున్నట్టుగానే నాయుడిగారికి చేసిన శస్త్ర చికిత్స ఫెయిలయిందనీ, వెంటిలేటర్‌ ‌మీద ఉంచారని చెప్పారు. వెంటిలేటర్‌ ‌తీస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారట. నా మనసు చేదు మాత్ర తిన్నట్టుగా అయింది. నవ్వుతూ, కులాసాగా, దర్జాగా ఉన్న నాయుడిగారి ముఖమే కళ్ల ముందు మెదిలింది.

నాకు నాయుడుగారూ ఆయన భార్య తప్ప అక్కడ ఎవరూ తెలియదు. నాయుడుగారి భార్య ఎక్కడో లోపల ఉంది. అయినా నాకు అక్కడి నుంచి వెళ్లాలని అనిపించలేదు. నిస్తేజంగా ఆ స్పెషల్‌ ‌రూమ్‌ ‌ముందే కూలబడిపోయాను. కానీ, ఆ స్పెషల్‌ ‌రూమ్‌ ‌ముందర కొంతమంది హడావుడిగా తిరుగుతున్నారు. బహుశా వాళ్లంతా నాయుడు గారి బంధువులయి ఉండవచ్చు.

ఐదు నిముషాల తర్వాత ఒక జ్యోతిష్య సిద్ధాంతి లోపలికి వెళ్లడం గమనించి కొంచెం ఆశ్చర్య పోయాను. ఓ గంట తర్వాత ఆ సిద్ధాంతి నోట్లకట్ట జేబులో దోపుకుంటూ బయటకు వచ్చాడు.

ఆయనతో పాటూ ఒక పెద్దాయన కూడా బయటకు వచ్చి సిద్ధాంతికి నమస్కారం పెట్టి, సాగనంపి,

‘హుష్‌.. అబ్బబ్బ…’ అనుకుంటూ నా పక్క కుర్చీలో కూలబడ్డాడు. రెండు నిముషాల తర్వాత తేరుకుని, నన్నుచూసి,

‘‘మీరూ….?’’ అంటూ అనుమానంగా చూసాడు. నేను విచారంగా,

‘‘నేను నాయుడి గారి ఫ్రెండునండీ! నాయుడి గారి మిస్సెస్‌ ‌లేరా? ఇప్పుడు నాయుడి గారికి ఎలా ఉంది?’’ అని ఆతృతగా అడిగాను.

‘‘ఇంకెక్కడి నాయుడు గారండీ? బ్రెయిన్‌ ‌డెడ్‌అయి వెంటిలేటర్‌ ‌మీద ఉన్నాడు. మంచి ముహుర్తం చూసి వెంటిలేటర్‌ ‌తీసేయడమే!’’ అన్నాడు.

నేను విస్తుపోయి,

‘‘అంటే నాయుడు గారిని మూహూర్తం చూసి చంపేస్తారా?’’ అని గద్దించాను. ఆయన కొంచెం కంగారుపడుతూ,

‘‘మేం చంపేయడమేమిటండీ? ఆయనే కోమాలో, వెంటిలేటర్‌ ‌మీద ఉన్నాడు. అలా ఎన్ని రోజులు ఉంచుతామండీ? రేపటి తర్వాత నెలరోజుల వరకు మంచి రోజులులేవు. అందుకే, ఈ రాత్రికే సిద్ధాంతి మూహూర్తం పెట్టాడు. ఆ మూహూర్తానికి వెంటిలేటర్‌ ‌తీసేస్తే, మరణించిన తర్వాత సద్గతులు ప్రాప్తిస్తాయి. ఇంతకు మీ పేరేమిటన్నారు? నాయుడి గారి భార్యను పిలుస్తా నుండండి!’’ అంటూ లేచి నిలబడ్డాడు.

నేను తల అడ్డంగా ఊపుతూ, లేచి నిలబడి మౌనంగా అక్కడి నుంచి లోపలికి నడిచాను.

లోపల మంచం మీద వెంటిలేటర్‌ ‌మీద ఉన్న నాయుడి గారిని దూరం నుండే చూస్తూ బయటకు నడిచాను.

‘మనం ఎంతో అభివృద్ధి సాధించాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి చెందాం. కానీ, ఇదేమిటి? చావుకు మూహూర్తం పెట్టుకోవడమా? మూహూర్తం పెట్టుకుని చావును ఆహ్వానించడమా? అట్లా చేస్తే సద్గతులు ప్రాప్తిస్తాయా?

ఒకవేళ నిజంగానే అటువంటి సద్గతులే ఉన్నాయనుకుంటే కృత్రిమ మూహూర్తపు మరణం వల్ల అవి లభిస్తాయా?

మూఢాచారాలు ఎంత వరకు వెళ్లాయంటే గ్రహబలం చెప్పే సిద్ధాంతులు ఆరోజు వర్జ్యం, రాహుకాలంతోపాటూ, సిజేరియన్‌ ఆపరేషన్ల జననాలకు కూడా మూహూర్తాలు ఫేస్‌బుక్కులో పోస్టు చేస్తున్నారు.

నేను చూసిన ఓ తమిళ సినిమాలో పెద్ద కార్పోరేట్‌ ‌హాస్పిటల్లోనే ఒక జ్యోతిష్య సిద్ధాంతి ఉండి డెలివరీకి వచ్చిన వాళ్లకు మూహూర్తాలు పెడుతుంటాడు. ఆపర్టిక్యులర్‌ ‌సుమూహూర్తంలో పుట్టిన పిల్లలు శుభయోగంతో ఐఏఎస్‌ ఆఫీసర్లు, సినిమాస్టార్లు, స్పోర్టస్ ‌సెలబ్రిటీలు అవుతారని చెబుతుంటాడు.

కానీ, నిజానికి అలా పెట్టుడు మూహూర్తాన పుట్టిన వాళ్లంతా శుంఠలూ, రౌడీస్‌, ‌స్మగ్లర్లూ, హంతకులుగా తయారవుతారు.

స్వాభావికంగా ప్రసవం జరిగినప్పుడు మంచి మూహూర్తం ఉంటే, అలా పుట్టిన వాళ్లు గొప్ప వారవుతారని అనుకున్నా – నిజానికి అది కూడా కరెక్టు కాదు – అందులో కొంత అర్థం ఉంది.

పిల్లలను పెంచేటప్పుడు వాళ్లకు నేర్పే విద్యాబుద్ధులు, సంస్కారాన్ని బట్టి వాళ్లు ఏదైనా సాధిస్తారు గానీ, సిజేరియన్‌ ‌మూహూర్తంలో కన్నంత మాత్రాన అదిసాధ్యమా? అలా అయితే స్మగ్లర్లు, హంతకులు, రాజకీయనాయకులకు పుట్టే పిల్లలంతా గొప్పవాళ్లు అవుతారు మరి పేదల సంగతి ఏమిటి?

నా కైతే ఇదంతా జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమాత్ముడి సృష్టినే వెక్కిరించినట్టుగా, దేవుడితోనే గేమ్స్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఇలా మరణానికి కూడా మూహూర్తం పెడతారని మీరెప్పుడైనా అనుకున్నారా?

About Author

By editor

Twitter
YOUTUBE