కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రపంచ దేశాలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. వైరస్‌వ్యాప్తిని అరికట్టడం కోసం అనేక దేశాలు ఆర్థికంగా నష్టదాయకమైనా తిరిగి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొన్న భారత్‌లో కూడా రెండు నెలలుగా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వ విభాగాల నిర్లిప్తత, ప్రజల నిర్లక్ష్యం మూలంగా వ్యాధి బాగా వ్యాపించిందని భావిస్తున్నవారు కూడా వ్యాక్సిన్‌లతో వైరస్‌ను ఎదుర్కొనవచ్చని అంటున్నారు.
వ్యాక్సిన్‌లు రంగంలోకి రానంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్‌లు ఉపయోగించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనల అమలులో చాలా కచ్చితంగా ఉన్నాయి. కానీ వ్యాక్సిన్‌లు రావడంతో ప్రజలు ఈ జాగ్రత్తలను గాలికొదిలేశారు. వ్యాక్సిన్‌లు వచ్చిన కొత్తలో సరైన, శాస్త్రీయమైన పద్ధతిలో వాటిని పరీక్షించలేదని విమర్శలు చేసినవారే ఆ తరువాత మాట మార్చి ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపణలు మొదలుపెట్టారు.
వ్యాక్సిన్ మైత్రీ విధానాన్ని అనుసరించి ప్రభుత్వం వివిధ దేశాలకు వ్యాక్సిన్‌లు పంపడం వల్ల స్థానికంగా వ్యాక్సిన్‌ల కొరత ఏర్పడి ప్రజలు చనిపోతున్నారని గుండెలు బాదుకున్న విమర్శకులంతా ఇప్పుడు వైరస్‌ను అరికట్టడం కోసం ప్రపంచ వ్యాక్సిన్ పక్రియలో భారత్ కూడా పాలుపంచుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
జనవరి 10, 2020న చైనా జెనోమ్ అమరికను తెలిపిన తరువాత కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్‌లు కనిపెట్టే పక్రియను వివిధ దేశాలు ప్రారంభించాయి. అమెరికా, చైనాల్లో మార్చి 2020లోనే పరీక్షలు నిర్వహించారు. రష్యా, బ్రిటన్‌లు కూడా ప్రజలందరికీ వ్యాక్సిన్‌లు వేసే పక్రియ ప్రారంభించడంతో వ్యాక్సిన్ యుద్ధం మొదలైంది.
ఏప్రిల్ 15 నాటికి 13 వాక్సిన్‌ల వైద్యపరీక్షలు ప్రారంభమయ్యాయి. వాక్సిన్‌ల ఆవిష్కారం, తయారీ కోసం నాలుగు సంస్థలను ఏర్పాటు చేశారు.
– వివిధ అమెరికా ప్రభుత్వ సంస్థలతో ఏర్పాటు చేసిన OWS (Operation Warp Seed)
– అమెరికా జాతీయ ఆరోగ్య సేవల విభాగం 18 జీవ ఔషధ కంపెనీలతో కలిసి ఏర్పాటు చేసిన ACTIV OWSలో భాగమే.
– వాక్సిన్‌లకు సంబంధించిన పరీక్షల సమన్వ యానికి COVPN (COVID -19 Prevention Trails Network).
– వివిధ దేశాలకు చవకగా వ్యాక్సిన్‌లు అందించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏర్పాటు చేసిన COVAX.
కానీ వివిధ దేశాలు అనుసరిస్తున్న ‘వ్యాక్సిన్ జాతీయవాదం’ (మా వ్యాక్సిన్ మా ప్రజల కోసమే) ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ అందించాలన్న ఆలోచనకు గండికొట్టింది. వ్యాక్సిన్ కార్యక్రమానికి సహకరించాల్సింది పోయి అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్‌లను తమ కోసమే నిల్వచేసుకోవడంతో తృతీయ ప్రపంచ దేశాలకు అవి అందుబాటులోకి రాలేదు. COVAXలో 190 దేశాలు చేరినా సంపన్న దేశాలు వ్యాక్సిన్ ఉత్పాదక దేశాలు, కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరపడం ప్రారంభించాయి.
ఒక నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో కేవలం 16శాతం మాత్రమే ఉండే సంపన్న దేశాలు ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 50శాతానికి పైగా చేజిక్కించుకున్నాయి. ఇదే విధంగా సంపన్న దేశాలు వ్యాక్సిన్‌ను నిల్వచేసుకోవడం కొనసాగిస్తే పేద దేశాలకు 2024నాటికి గానీ వ్యాక్సిన్ అందదు. మరోవైపు వైరస్‌కు చెందిన కొత్త రకాలు ప్రపంచంలో వ్యాపిస్తుండడంతో ఈ మహమ్మారిపై పోరాటం ఎప్పటికీ ఒక కొలిక్కిరాదు. దక్షిణాఫ్రికాలో కనిపించిన కరోనా కొత్తరకం వైరస్‌ను నిర్వీర్యం చేయడంలో ఆస్ట్రా జెనికా మందు విఫలమైందని తేలింది. ఇలాంటి పరిస్థితిలో వ్యాక్సిన్ పక్రియ ఆలస్యమైతే మరింత ప్రాణనష్టంతోపాటు ఆర్థికనష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడం అత్యవసరం.
వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి, పేద దేశాలకు అందుబాటులోకి తేవడానికి అవకాశం కల్పించడం కోసం మేధోహక్కులను తాత్కాలికంగా తొలగించాలని నవంబర్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్యసంస్థ కౌన్సిల్ సమావేశంలో భారత్, దక్షిణాఫ్రికాలు కోరాయి. దీనిని ట్రిప్స్ (Trade related aspects of Intellectual Property Rights) ముందుంచాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన విషయాల్లో మేధోహక్కులను సడలించ వచ్చన్న అంశం నిజానికి ట్రిప్స్‌లో ఉంది కూడా.
నవంబర్ 20న జరిగిన ప్రపంచ వాణిజ్యసంస్థ కౌన్సిల్ సమావేశంలో భారత్ తన వాదనను ఇలా వినిపించింది, ‘ఒక పక్క ఈ దేశాలు పరిమితంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఎక్కువశాతం చేజిక్కించుకుంటున్నాయి. దీని వల్ల అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు వ్యాక్సిన్లు ఏమాత్రం లభించడం లేదు. మరోవైపు విచిత్రంగా ఇవే దేశాలు మేధోహక్కుల తాత్కాలిక తొలగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ విధంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే మార్గాలను మూసివేస్తున్నాయి.’ సంపన్న దేశాలు ఇలా తమ అవసరాలకు మించి వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్న సమయంలో భారత్ మాత్రం 70 దేశాలకు వ్యాక్సిన్ అందించి సహకరించింది.
దీనిని వ్యతిరేకించిన దేశాలు మేధోహక్కుల పరిరక్షణలో విఫలమైతే అమెరికాలో అనేక పరిశ్రమలు దెబ్బతింటాయని, 45 మిలియన్ ఉద్యోగాలు మాయ మవుతాయని వాదిస్తున్నాయి. తమ మేధోహక్కులను సవాలు చేయడానికి ప్రయత్నిస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవలసిందిగా బైడన్ ప్రభుత్వాన్ని అమెరికా మందుల కంపెనీలు కోరాయి. గతంలో ఒబామా ప్రభుత్వం ఇలా తమ మేధోహక్కులను కాపాడేందుకు థాయిలాండ్, ఇండోనేషియాలపై వాణిజ్యపరమైన ఆంక్షలు విధించిన సంగతిని తాము సమర్పించిన ప్రత్యేక 301 నివేదికలో ఆ కంపెనీలు గుర్తుచేశాయి కూడా.
మార్చి10న వరుసగా ఎనిమిదవసారి అమెరికా ఫార్మా కంపెనీలు దక్షిణాఫ్రికా, భారత్‌ల తీర్మానాన్ని అడ్డుకున్నాయి. తీర్మానం ఆమోదం పొందాలంటే 168 దేశాల ఆమోదం లభించాలి. దీనికోసం ప్రపంచ వాణిజ్య సంస్థ కౌన్సిల్ జూన్ 8న మళ్లీ సమావేశమవుతుంది. వ్యాక్సిన్ తయారీ, పంపిణీలలో ప్రభుత్వరంగ సంస్థలదే ప్రధాన భాగస్వామ్యం కావడం, ప్రైవేట్ కంపెనీలకు ఇందులో తక్కువ పాత్ర ఉండడం వల్ల వ్యాక్సిన్ పక్రియను నియంత్రించే అధికారం, హక్కు ప్రైవేటు కంపెనీలకు ఉండదని విశ్లేషకులు అంటున్నారు.
యూరప్‌కు చెందిన బయోన్ టెక్ కంపెనీతో కలిసి వ్యాక్సిన్ తయారుచేసిన అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ జర్మనీ ప్రభుత్వం నుంచి 445 మిలియన్ డాలర్లు పొందింది. అలాగే మోడర్న కంపెనీకి అమెరికా ప్రభుత్వం నుంచి 1 బిలియన్ డాలర్ల పరిశోధన గ్రాంట్, జాన్సన్ జాన్సన్‌కు 1.45 బిలియన్ డాలర్ల గ్రాంట్ లభించాయని బిఎస్‌ఏ ప్రాజెక్ట్ సమన్వయకర్త అచల్ ప్రభల వెల్లడించారు.
మేధోహక్కులు పోతాయని గగ్గోలుపెడుతున్న ఈ మందుల కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్‌లపై అపారమైన లాభాలు గడించాయి. తమ వ్యాక్సిన్‌ల వల్ల ఇతరత్రా ఇబ్బందులు వస్తే అందుకు ప్రజలు తమపై కేసులు పెట్టకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని అమెరికా ఔషధ కంపెనీ ఫైజర్ షరతులు విధించింది. అంతేకాదు సైనిక స్థావరాలు, ఫెడరల్ బ్యాంకుల వద్ద నిల్వలు తమ అధీనంలో ఉంచాలని, ఒకవేళ ప్రజలు తమపై కేసులు వేస్తే ఈ ఆస్తులు అమ్మి ఆ ఖర్చు క్రింద జమకట్టుకుంటామని అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాలతో బేరసారాలకు దిగింది.
చైనా కూడా వ్యాక్సిన్ వ్యాపారాన్ని జోరుగా సాగించింది. తమ దేశపు వీసా కావాలంటే తమ వ్యాక్సిన్‌లే కొనుగోలు చేయాలని 19 దేశాలకు షరతు విధించింది. ఆ దేశాల్లో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, గ్రీస్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, ఇటలీ, నైజీరియా, నార్వే, పాకిస్తాన్, దక్షిణ కొరియాలు ఉన్నాయి.
చైనా తయారుచేసిన వ్యాక్సిన్‌ల పట్ల ఆ దేశ పౌరులే సందేహాలు వ్యక్తంచేస్తున్నా, ఆ దేశం మాత్రం తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు నాసిరకం వ్యాక్సిన్‌లనే ఉపయోగిస్తోంది. తైవాన్‌ను గుర్తించిన దేశాలను దారికి తెచ్చుకునేందుకు వాక్సిన్ ద్వారా భయ పెడుతోంది. చైనా ఎత్తులకు చిత్తైన పరాగ్వే ఆ నాసిరకం వాక్సిన్ కోసం తైవాన్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. కానీ, భారత్ తన వ్యాక్సిన్ లను పరాగ్వేకు పంపడంతో చైనా వ్యూహం పూర్తిగా విజయవంతం కాలేదు. తనపై వచ్చిన చెడ్డ పేరును తుడుచుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడంలేదు. వ్యాక్సిన్ తయారీలో సంయుక్త భాగస్వామ్య ప్రతిపాదనను బంగ్లాదేశ్ తిరస్కరిస్తే, చైనా వాక్సిన్‌లను పరీక్షించి చూడటానికి తమదేశంలో ‘చెత్త బుట్టలు ఖాళీ లేవంటూ’ కంబోడియా సమాధానమిచ్చింది.
ప్రపంచ ఆధిపత్యం కోసం తాపత్రయపడుతూ అమెరికా, చైనాలు ఇలా వ్యాక్సిన్ యుద్ధానికి తెర తీస్తే ‘సర్వేభవంతు సుఖినః’ (అందరూ బాగుండాలి) అని విశ్వసించే భారత్ ఉదారంగా తన వ్యాక్సిన్‌లను ప్రపంచ దేశాలకు అందజేసింది.
ఒకపక్క తమ వ్యాక్సిన్ తమ ప్రజల కోసమేనంటూ పంతాలకు పోతున్న అమెరికా హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రల సరఫరాను మాత్రం భారత్ చేయవలసిందేనని, అలా చేయకపోతే ‘తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని’ హెచ్చరించింది. సంక్షోభాన్నే అదనుగా తీసుకుని బైడన్ ప్రభుత్వం 1950 నాటి ప్రమాదకరమైన రక్షణాత్మక ఉత్పత్తి చట్టం (ణవ•వఅవ జూతీశీ•బమీ•ఱశీఅ మీ•)ను తిరిగి అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఏ మందులు ఎంత తయారుచేయాలి, ఎంత నిల్వ చేయాలన్నది ప్రభుత్వమే నిర్ణయించవచ్చు. ప్రభుత్వం అందించిన అపారమైన నిధులతో ఇప్పటికే అమెరికా ఔషధ కంపెనీలు పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌లు తయారుచేసి నిల్వ చేశాయి. మే నెల ఆఖరు నాటికి 600 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ తయారు చేయాలని ఈ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది అమెరికా అసలు అవసరాల కంటే రెట్టింపు అన్నమాట. ణ చట్టం కింద మరిన్ని మోతాదులు తయారుచేయమని ప్రభుత్వం ఈ కంపెనీలను ఆదేశించవచ్చు. మరోపక్క తయారుచేసిన వ్యాక్సిన్‌లను అమ్ముకునేందుకు వీలుగా ఇతర దేశాల్లో వ్యాక్సిన్ తయారీని అడ్డుకునే ప్రయత్నం చేసింది అమెరికా. భారత్‌కు ముడి పదార్థాల సరఫరాను నిలిపివేసింది. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టివేసినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం 18సార్లు ఈ ణ చట్టాన్ని అమలు చేసింది. వ్యాక్సిన్‌లతోపాటు కొవిడ్ పరీక్ష కిట్‌లు, చేతి తొడుగులు, మాస్క్‌లు, ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని విపరీతంగా పెంచింది అమెరికా. ఈ విచ్చలవిడి ధోరణి వల్ల భారత్‌తో పాటు అన్నీ దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
విచిత్రమేమిటంటే ట్రంప్ అనుసరించిన ‘అమెరికా ప్రయోజనాల సంరక్షణ’ విధానాన్ని దుయ్యబట్టిన అక్కడి ప్రజానీకమే ఇప్పుడు బైడన్ అనుసరిస్తున్న ‘మా వాక్సిన్ మా ప్రజల కోసం’ అనే పద్ధతిని మెచ్చు కుంటున్నారు. వాక్సిన్ తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల సరఫరా, పంపిణీని అడ్డుకోవడం వంటి అమెరికా చర్యలు ఆ దేశపు నిహిత స్వార్థ ప్రయోజనాలను బయటపెడుతున్నాయి. ట్రంప్ విధానాల్లో చాలా వాటికి స్వస్తి పలికిన బైడన్ వ్యాక్సిన్ ఎగుమతిపై నిషేధాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. పెద్దఎత్తున వ్యాక్సిన్‌లు నిల్వ చేయడం, వ్యాక్సిన్‌ల తయారీపై మేధోహక్కులను తాత్కాలికంగా తొలగించాలన్న ప్రతిపాదనను అడ్డుకోవడం, ముడి పదార్థాల ఎగుమతిని నిషేధించడం వంటి చర్యల ద్వారా అమెరికా తన పరపతిని, మంచిపేరును తానే తగ్గించుకుంటోంది.
– డా।। రామహరిత, అనువాదం: కేశవనాథ్