భారత ఆర్ధికవ్యవస్థకు వ్యవసాయం మూలమైతే, వ్యవసాయదారుడికి రుతుపవనాలు, సకాలంలో వర్షాలు చాలా అవసరం. వరదలు, వర్షాభావ పరిస్థితులు, భూసారం తరగిపోవడం వంటివి పంట దిగుబడిని బాగా తగ్గించేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో జల సంరక్షణ, జల నిర్వహణ అనేవి అత్యంత ముఖ్యమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే స్వచ్చమైన జలంలో 70శాతం వ్యవసాయానికే ఖర్చవుతోంది. భారత్‌లో ఇది మరింత ఎక్కువ. ఇక్కడ 85శాతం నీరు వ్యవసాయానికి ఉపయోగిస్తు న్నారు. ప్రపంచవ్యాప్తంగా 301 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంటే అందులో 38శాతం భూమిలో వ్యవసాయం భూగర్భ జలాల ఆధారంగా జరుగుతోంది. ఇక భారత్‌లో 60శాతం వ్యవసాయ భూమి భూగర్భజలాలపైనే ఆధారపడి ఉంది.
పాత నీటిపారుదల పద్ధతుల్లో నీరు పూర్తిగా భూమిలో ఇంకి మొక్కలకు అందుతుందనేది ప్రశ్నార్ధకమే. ఎక్కువ నీరు వ్యర్ధమయ్యే అవకాశం ఉంది. కాలువల ద్వారా నీటిని పెట్టడం ఒక పద్దతి. ఇప్పటికీ ఎక్కువమంది రైతులు ఈ పద్దతినే అనుసరిస్తున్నారు. కాలువలో నీరు ఎక్కువ శాతం మొక్కను చేరకుండానే ఆవిరైపోతుంటుంది. వ్యర్ధమవుతున్న నీటిని తిరిగి మొక్కలకు అందించే వ్యవస్థ కూడా ఏది లేదు.
పంట దిగుబడిని బట్టి నీటి వినియోగ సామర్ధ్యం కూడా అంచనా వేయవచ్చును. మన దేశంలో ఇది కేవలం 38శాతం మాత్రమే. కాబట్టి నీటిని సక్రమంగా ఉపయోగించుకునే విధానాలను అవలంబించడం అవసరం. నీటిని సద్వినియోగం చేసుకునేందుకు 1) పంట దిగుబడి పెంచేందుకు నీటిని ఉపయోగించడం 2) నీటి వృధాను అరికట్టడం 3) మెరుగైన మట్టి, నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా నీరు ఎక్కువగా నే•లలో ఇంకేటట్లు చూసుకోవడం.
- పంట దిగుబడిని పెంచడానికి క్రింది
పద్ధతులు పాటించవచ్చును.
– వర్షపు నీటిని ఎక్కువగా ఉపయోగించు కోవడం. (వర్షపునీటి సంరక్షణ)
– నీరు ఎక్కువగా ఆవిరికాకుండా జాగ్రత్త పడటం
– మేలురకం వంగడాలను ఉపయోగించడం
– మెరుగైన వ్యవసాయ, ఆర్ధిక పద్ధతులను అనుసరించడం
– నూతన పద్ధతులు, సాంకేతిక విధానాన్ని అనుసరించేవిధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం
– అడవులను పెంచడం వంటి వ్యవసాయేతర (ప్రజలకు ఉపయోగపడే పంటలకు సంబంధించని) కార్యకలాపాల కోసం తక్కువ నీటిని ఉపయోగించడం
– వర్షపాతపు పరిమాణాన్ని, నాణ్యతను అంచనా వేసి పంటలను నిర్ణయించడం.
వర్షాధారిత పంటల దిగుబడి పెంచడం అంటే మెరుగైన సాంకేతిక పద్ధతులను ఉపయోగించడంతో పాటు రుణ సదుపాయం, మార్కెటింగ్ సౌకర్యాలు మొదలైనవి కూడా అందుబాటులోకి తేవడం. ఇందులో రైతులు, భూకమతాల యజమానులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది సేవలు, స్థానిక ప్రభుత్వాలు, ప్రాంతీయ/రాష్ట్ర ప్రభుత్వాలు మొదలైనవన్నీ లాభపడతాయి.
- నేలలో, ముఖ్యంగా మొక్క వేర్ల చుట్టూ, తేమను పెంచడం
జల సంరక్షణ అంటే అందుబాటులో ఉన్న స్వచ్ఛజలాన్ని పొదుపుగా, బాధ్యతాయుతంగా వాడటం. నీటిని వృధా చేయకుండా అవసరమైనంత మేరకే ఉపయోగించడం అనేది వ్యవసాయంలోనే కాక మిగిలిన జీవనరంగాల్లో కూడా చాలా అవసరం. దీనికి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కచ్చితమైన విధానాలను, వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేయాలి. నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకుని ప్రస్తుత, భవిష్యత్ అవసరాలు తీరేవిధంగా చూసుకోవడమే జల సంరక్షణ. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నీటిని అందించడానికి సంరక్షణ ఒక్కటే మార్గం. జల సంరక్షణ ఏ మేరకు అవసరమన్నది జనసంఖ్య, తలసరి నీటి అందుబాటు, నీటి నిల్వ సదిపాయాలు, మొత్తం వర్షపాతం, వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నీటి అవసరాలు మొదలైన విషయాల ఆధారంగా నిర్ణయిస్తారు.
జల సంరక్షణకు కింది పద్ధతులు అవలంబించవచ్చును
అ. వర్షపు నీటి సంరక్షణ : వ్యర్ధంగా పోయే వర్షపు నీటిని కూడా నిల్వచేసి, ఉపయోగించడం ఇందులో ముఖ్యమైన అంశం. ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకోసం వర్షపు నీటిని నిల్వచేసి వాడవచ్చును. వర్షపు నీటి సంరక్షణ వల్ల నేల సారం కూడా పెరుగుతుంది. పంటకు ఎంత నీరు అవసరమవు తుందన్నది అంచనా వేయగలగడమే వర్షపు నీటి సంరక్షణలో ప్రధాన అంశం. అలా అవసరమైన నీటిని అందించడం కోసమే ఈ విధానాన్ని అవలంబిం చాలి. బహిరంగ కమతాలలో వ్యవసాయం కంటే గ్రీన్‌హౌస్ కమతాలలో నీటి వినియోగం చాలా బాగుంటుంది. ఆవిరి అయ్యే నీరు తక్కువగా ఉండటం, మొక్కకి మొక్కకి మధ్య దూరం తక్కువగా ఉండటం, బిందు సేద్యం, పంట దిగుబడి సమయం తక్కువగా ఉండడం వంటివి గ్రీన్ హౌస్ సేద్యపు ఉపయోగాలు.
ఆ. గ్రీన్‌హౌస్ సేద్యం: ఇది జల సంరక్షణకు ఎంతో ఉపయోగకరమేకాక దీనివల్ల దిగుబడి కూడా ఎక్కువ అవుతుంది.
ఇ. బ్లాక్ ప్లాస్టిక్, సేంద్రియ బ్లాక్ ప్లాస్టిక్ లేదా సింథటిక్ మల్చ్ వంటివి నీరు ఎక్కువ ఆవిరికాకుండా నిరోధించడమేకాక కలుపును కూడా అదుపుచేస్తాయి. సేంద్రియ మల్చ్‌లు మట్టిలో కలిసిపోయి పోషక విలువలను అందిస్తాయి.
ఈ. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలు: నేల స్వభావం, నైసర్గిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంచుకోవాలి. ఉదాహరణకు, నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో స్థానికంగా బాగా పెరిగే పంటలనే వేసుకోవాలి. దీనివల్ల మట్టి నాణ్యత అంతగా లేకపోయినా, నీరు లభ్యం కాకపోయినా పంట మాత్రం బాగా పెరుగుతుంది. ఇటువంటి వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వంగడాల వల్ల దిగుబడి బాగుంటుంది.
ఉ. పంట మార్పిడి: మట్టి నాణ్యతను కాపాడటంపై దృష్టి పెడితే దానివల్ల నేలలో తగిన తేమ ఉండి, పంట బాగా పెరుగుతుంది. నీటి అవసరం కూడా తగ్గుదుంది. సేంద్రియ ఎరువుల వాడకం, భూమిని తక్కువసార్లు దున్నడం వంటి పద్ధతులవల్ల మట్టి నాణ్యత పెరుగుతుంది.
ఊ. పశువుల మేతలో మార్పు: ఒకే భూమి పశువుల మేత కోసం ఉపయోగించకుండా మేత ప్రదేశాన్ని మారుస్తూ ఉండడం వల్ల గడ్డి బాగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ పద్ధతివల్ల ఎక్కువ నీరు భూమిలోకి ఇంకడం, గడ్డి తక్కువ నీటితోనే పెరగడం, సేంద్రియ ఎరువు లభ్యత పెరగడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి.
ఎ. అటవీ వ్యవసాయం: చెట్లను వ్యవసాయ భూమిలో భాగం చేయడం అటవీ వ్యవసాయం. ఈ పద్ధతివల్ల మట్టి సారవంతం కావడమేకాక పంటకు, పశువులకు ఉపయోగకరం.
ఏ. సేంద్రియ వ్యవసాయం: దీనివల్ల మట్టిలో తేమను కాపాడటమేకాక భూగర్భజలాలను పెంచుకునే వీలుంటుంది. రసాయనాలు నీటిలో కలవకుండా అరికట్టవచ్చును.
ఐ. పంటను తడిపే పద్ధతిలో మార్పు: మెరుగైన నీటి నిర్వహణ పద్దతుల వల్ల సహజ వనరుల సంరక్షణ సాధ్యమవుతుంది.
ఒ. మొక్కలకు సరైన సమయంలో, సరైన చోట, తగినంత ప్రమాణంలో, సరిగ్గా నీరు పెట్టడం తెలిస్తే దానివల్ల ఎంతో సహజ వనరులు ఆదా అవుతాయి. మట్టి నాణ్యతను పెంపొందించడం, కాపాడటంపై దృష్టి పెడితే అప్పుడు నీటి అవసరం కూడా తగ్గుతుంది. కంపోస్ట్ ఎరువుల వాడకం, తక్కువసార్లు దున్నడం వంటివి మట్టి నాణ్యతను పెంచుతాయి.
ఓ. మెరుగైన నీటిపారుదల వ్యవస్థ: బిందుసేద్యం వంటి ఆధునిక పద్ధతుల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చును. బిందుసేద్యంలో మొక్క వేర్లకే నేరుగా నీరు అందిస్తాం. దీనివల్ల తక్కువ నీటితోనే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చును.
ఔ. మునిసిపల్ నీటిని తిరిగి ఉపయోగించడం: శుద్ధి చేసిన నీటిని వ్యవసాయానికి, పరిశ్రమల్లో, ప్రజల అవసరాలకు అందించవచ్చును. శుద్ధీకరణ మోతాదును బట్టి ఎంత నీటినైనా వ్యవసాయానికి, పరిశ్రమలకు వాడవచ్చును. అయితే ఇలాంటి నీటిని గడ్డి పెంపకం, పశువుల దాణా పెంపకం వంటివాటికి ఉపయోగిస్తారు.
దేశంలోని జల వనరులలో 85శాతం వ్యవసాయ అవసరాలకే ఖర్చవుతున్న పరిస్థితిలో ఒక యూనిట్ నీటికి లభించే దిగుబడిని పెంచడం చాలా అవసరమయింది. భూగర్భజలాలు తరిగిపోవడం, నీటి వనరులు తగ్గడం వంటి సమస్యల నేపధ్యంలో పంట విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
వ్యవసాయ నీటి వనరులను పరిరక్షించడానికి ప్రత్యేక ప్రయత్నం అవసరమైనా అది చాలా ముఖ్యం. సహజ జల సంరక్షణ ద్వారా సహజ వనరులను కాపాడుకోవడమేకాక పంటకు ఎక్కువ నీరు అందించే వీలు కలుగుతుంది. నేలలో తేమను కాపాడుకునే పద్ధతులను అనుసరించడం వల్ల నీటి అవసరాలు తగ్గించుకోవచ్చును. బిందుసేద్యం మొదలైన పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. నీటిపారుదల పద్ధతులు, నూతన సాంకేతిక విధానం గురించి రైతులకు అవగాహన కల్పించాలి. ఎక్కువమంది రైతులు ఈ పద్ధతులను అనుసరిస్తే నీటి వాడకం తగ్గుతుంది. తద్వారా సహజవనరులపై ఒత్తిడి తగ్గుతుంది.
– డాక్టర్ ఎస్. కిరణ్‌కుమార్ రెడ్డి (ఉస్మానియా యూనివర్సిటీ)
– డాక్టర్ హరీశ్ గుప్తా (ఉస్మానియా యూనివర్సిటీ)
– డాక్టర్ నీతా ఖండేల్‌వాల్ (ఎస్.డి.ఎ. యూనివర్సిటీ, గుజరాత్)
అను: కేశవనాథ్