– ఆలూరి పార్థసారథి

ఆటోవాడు మెయిన్‌ ‌రోడ్డులోంచి స్పీడ్‌గా మలుపు తిప్పగానే కనిపించింది పాత కాలంనాటి మా ఇల్లు. ఆ విసురుకి ఆటోలోంచి పడిపోతానేమోనని భయం వేసింది. అసంకల్పితంగా ఆటో కమ్మీని గట్టిగా పట్టుకున్నాను. నా తోటి స్కూలు పిల్లలంతా నన్ను చూసి ఫకాల్న నవ్వారు. నేనేం పట్టించుకోలేదు. ‘‘ఆపు ఆపు ఇల్లోచ్చేసింది!’’ అని అరిచాను.

‘‘తెలుసు బాబూ!’’ అన్నాడు. స్పీడ్‌ ‌తగ్గించి బ్రేక్‌ ‌వేశాడు. నేను ఒక్క దూకుతో దిగేశాను. నా స్కూల్‌ ‌బ్యాగు, వాటర్‌ ‌బాటిల్‌ ఆటోలోంచే నా చేతికందిం చాడు.

‘‘నెల డబ్బులిస్తారేమో, అమ్మగార్ని అడుగు బాబూ! నీతోపాటు ఆటోలో వచ్చే మిగిలిన పిల్లలందరూ ఇచ్చేశారు’’ అన్నాడు.

‘లేవు’ అని నాకు తెలుసు! కానీ చెప్పలేకపోయాను.

అలాగే అని తలాడించి, భారంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి వీధి అరుగు మీదకి చేరాను. కుడివైపు గది, ఎడమవైపు గది తలుపులకి పెద్ద పెద్ద తాళంకప్పలు ఎప్పటిలా వేసే ఉన్నాయి. నిజానికి ఆ రెండు వీధి అరుగు గదులు పాడు పడిపోయాయి. ఇంట్లోకి వచ్చి చూస్తే కాని, వాటి పైన డాబా పడిపోయిందన్న సంగతి కాని, గదుల్లోంచే పగటి పూట ఆకాశం, రాత్రి పూట చుక్కలూ కనిపిస్తాయని కాని ఎవరికీ తెలియదు.

వీధి తలుపులు మాత్రం దగ్గరగా చేరవేసి ఉన్నాయి, రోజూలాగే. లోపలనుంచి గడియ వేసి లేదు. నెమ్మదిగా ఒక తలుపు తోసుకుని లోపలికి వెళ్లాను.

ఏ మార్పూ కనిపించలేదు. అలాంటిది, ఇప్పటి కిప్పుడు డబ్బులెక్కడ్నుంచి వస్తాయ్‌!

ఆటోవాడు డబ్బులడుగుతున్నాడని అమ్మకెలా చెప్పడం!

మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవ దాటి బార్లా తెరచి ఉన్న ద్వారంలోంచి గుమ్మందాటి వరండాలోకి చేరాను. ఆ మండువా చూరు ఒకవైపు ఒరిగిపోతూ ఉంటే, పడిపోకుండా ఉండాలని పెట్టి ఉంచిన రెండు స్తంభాల్లాంటి తాటిదాపులు, రోజూలాగే అసహ్యంగా మా నిస్సహాయతని చాటుతూ నా కళ్లకి కనిపించాయి.

నేనేం చెయ్యను!

నన్ను చూసి అమ్మ నా భుజాల మీద బరువు తగ్గించింది. ‘‘ఏంటీ, ఇంకా ఆటో చప్పుడు వినిపిస్తోంది. ఇక్కడే నిలబడ్డాడా? ఎందుకు?’’ అని నన్నడిగింది.

నేనేం చెప్పలేకపోయాను.

‘‘సరేలే! నేను చూస్తాను. ఈలోగా నువ్వు కాళ్లుచేతులూ కడుక్కో. టిఫిన్‌ ‌చేసి ఆటలకి పోదువు గాని’’ అని చెప్పి అమ్మ బయటకి వెళ్లింది.

నేను గబగబ బూట్లు, సాక్సు విప్పేసి పరుగు పరుగున అమ్మదగ్గరకి, బయటకి చేరాను. అప్పటికే ఆమె వీధి మెట్లు దిగుతోంది.

అమ్మ.. ఆటోవాడితో ‘‘డబ్బులేనా? ఇప్పుడు సాయంసంధ్య వేళ కాదు గాని, రేపు ఉదయం స్కూలుకెళ్లేటప్పుడు ఇస్తాలే!’’ అని చెప్పింది.

ఆటోవాడు మాట్లాడకుండా ముందుకి దూసుకు పోయాడు. హమ్మయ్య అనుకున్నాను.

తిరిగి మండువా చేరి ఒక మూలగా ఉన్న గుండిగలోంచి ఇత్తడి చెంబుతో నీళ్లు తీసి సబ్బుతో శుభ్రంగా కాళ్లు, చేతులు, మొహం కడుక్కున్నాను. ఒక్క చుక్క నీరైనా మండువా మధ్యలోనున్న తులసికోట మీద పడకుండా జాగ్రత్తపడ్డాను. లేకపోతే అమ్మ గఁయ్యిమంటుంది.

రేపు మాత్రం ఎక్కడ్నుంచొస్తాయ్‌! అమ్మ డబ్బులెక్కడ్నుంచి తెస్తుంది? అని మళ్లీ నా మనసు పీకింది. ఏమో! తెస్తుందేమో! ఆటోవాడికివ్వడానికే లేవు! ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది. అదెలా అమ్మకి చెప్పడం! అలాగే కాళ్లీడ్చుకుంటూ వెళ్లి మండువా దాటి హాల్లోకి చేరాను.

అక్కడ హాల్లో ఒక పక్కగా ఒక మండువా వైపు దూలానికి లావుపాటి గొలుసులతో వేలాడుతున్న పెద్ద మద్దిచెక్క ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాను. ఉయ్యాల భారంగా ఊగసాగింది.

ఒకవేళ ఆటోవాడికివ్వడానికి అమ్మ డబ్బులు తెస్తే! అదేదో ఎక్కువ డబ్బులొస్తే! అని ఆశ పడ్డాను. ఎలాగైనా అమ్మకీ విషయం చెప్పాలి, తప్పదు అనుకున్నాను.

ఈలోగా అమ్మ నాకు టిఫిన్‌ ‌ప్లేట్‌ ఉయ్యాల బల్ల మీదకే అందించింది.

ప్లేట్‌ అం‌దుకుని సంశయిస్తూ ‘అమ్మా!’ అన్నాను.

ఊగుతున్న ఉయ్యాల బల్లని ఆపి అమ్మ నా తల నిమిరింది. ‘ఏంటి నాన్నా, చెప్పు!’ అంది.

గబుక్కున ఊయల దిగి హాల్లోనే ఒక మూలనున్న స్టడీ టేబుల్‌ ‌మీద పెట్టిన స్కూల్‌ ‌బ్యాగు అందుకున్నాను. అందులోంచి నా స్కూల్‌ ‌డైరీ తీసి బెరుకుబెరుకుగా అమ్మ చేతికిచ్చాను.

అమ్మ, ఈరోజు పేజీ తీసి చదివింది.

నిబ్బరంగా ‘‘ఒస్‌! ఇం‌తేనా! టర్మ్ ‌ఫీజ్‌ ‌కట్టాలి. అంతేగా! ఎల్లుండి వరకు టైముంది. కట్టేద్దాంలే! నువ్వేం బెంగపెట్టుకోకు. ముందు టిఫిన్‌ ‌తిను.’’ అని భరోసా ఇచ్చింది.

ఎక్కడ్నుంచొస్తాయ్‌! అనుకున్నాను. అయినా, అమ్మ మీద నమ్మకమే నాకు. మాట ఇచ్చిందంటే నిలబెట్టు కుంటుంది. ఏదో ఒకటి చేస్తుంది. ఎలాగైనా సాధిస్తుంది. అని ధీమా పడ్డాను.

ఉయ్యాల తేలికగా ఊగసాగింది.

హాల్లోంచే అమ్మ ‘‘ఏఁవండీ! మీ తమ్ముడికి ఫోన్‌ ‌చేస్తానన్నారు. ఏమయింది? అడిగారా? ఏఁవైనా మీ ఎకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్‌ ‌చేస్తానన్నాడా?’’ అనడిగింది.

నాన్నగారు వీధి గుమ్మానికి ఎదురుగా తులసి కోటకి అటువైపు వరండా గదిలో అనారోగ్యంతో పడుకుని ఉన్నారు. అక్కడ్నుంచే నీరసంగా అతని సమాధానం నాకు వినిపించింది.

‘‘ఏమోనే. ఎన్నిసార్లు చేసినా రింగ్‌ అవుతోంది. కానీ ఫోన్‌ ఎత్తట్లేదు. బిజీగా ఉన్నాడో ఏమో! వాడేం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాడో!’’

‘‘మీ వల్లేం కాదు కాని, ఉండండి మా చెల్లాయికి ఫోన్‌ ‌చేస్తాను. తోటికోడలు కంటే ముందు ఆమె నా చెల్లెలు. విషయమేదో నేనే చెప్తాను’’ అని అమ్మ సెల్‌ ‌తీసి పిన్నికి కాల్‌ ‌చేసింది. నా పక్కనే, ఉయ్యాల మీద కూర్చొని మాట్లాడసాగింది.

పిన్ని గొంతు వినపడగానే అమ్మ ‘‘ఏమే ఎలా ఉన్నారు మీరంతా, కులాసాయేనా?’’ అనడిగింది.

అంతే! పిన్ని అమ్మకి ఛాన్సివ్వకుండా మొదలెట్టింది.

‘‘ఏం చెప్పనక్కా! ఒకటా రెండా? అన్నీ సమస్యలే. రెంటు, కరెంటు, పిల్లల ఫీజులు, వెచ్చాలు, బట్టలు, రోజువారీ ఖర్చులు.. అబ్బబ్బబ్బా పిచ్చెక్కి పోతోంద నుకో! ఇతనికేం పట్టదు. పగలూ రాత్రీ ఒకటే ధ్యాస. పని పని పని. ఆఫీసు పని. ఇంట్లో మనుషులున్నారని, ఇంటికి అతను తెచ్చే జీతంరాళ్లు ఏమాత్రం చాలవని, ఎన్నిసార్లు నెత్తీ నోరూ మొత్తుకున్నా అర్థమవదు. బెల్లంకొట్టిన రాయిలా కూర్చుంటారు. అన్నీ నేనే చూసుకోవాలి, అందులోనే!’’

ఇక అమ్మ నీళ్లు నమలడం ఆరంభించింది. అసలు విషయం చెప్పడం మానేసి ‘‘అది సరేగాని, మరిది గారున్నారా? ఆఫీసునుంచి వచ్చేశారా? మీ బావగారు మాట్లాడతానన్నారు. ఒకసారి ఫోన్‌ ఇవ్వు’’ అని చెప్పింది.

‘‘అలాగే అక్కా! రెండు నిమిషాలు ఆగు. అతను వేరే గదిలో ఉన్నారు. ఆఫీసు పనేదో చేసుకుంటున్నారు. తలుపులేసుక్కూర్చున్నారు’’ అంది.

అయినా, ఆమె గొంతు వినిపిస్తూనే ఉంది. గట్టిగా కాదు గాని, మెల్లగా.

‘‘ఏమండీ వెర్రి గంగిరెద్దులా ప్రతిదానికీ తల ఆడించెయ్యకండి. అతనేంటంటే అది, ఎంతంటే అంత, దానకర్ణుడిలా దానం చేసెయ్యకండి. చెయ్యి కొంచెం వెనక్కి బిగించి ఉంచండి. సడలించకండి. ఇప్పట్నుంచే మనం జాగ్రత్త పడకపోతే, తరవాత సాగదీసుకోవడం కష్టం! వింటున్నారా! ఇదిగో మీ అన్నయ్య మాట్లాడతారట తీసుకోండి. రెండు ముక్కల్లో తెక్కొట్టేయండి. సాగదీయకండి.’’ అని మా ‘హితబోధ’ పాఠంలో ఆవు తన దూడకి చెప్పినట్టు చెప్పింది.

మా అమ్మ అప్పుడు ఒక నిట్టూర్పు విడిచి ఊయల బల్ల మీంచి దిగింది.

ఫోన్‌ ‌పట్టుకుని నాన్నగారి గదిలోకి వెళ్లింది. ఆ గది తలుపులు వేసేసింది.

ఉయ్యాల స్తంభించిపోయింది.

ఈలోగా మా అక్క హైస్కూల్నుంచి తిరిగొచ్చింది.

కాళ్లు, చేతులు కడుక్కుని వంటింటివైపు వెళ్లింది.

తిరిగి నా దగ్గరకొచ్చి ‘అమ్మేదిరా?’ అనడిగింది. నా పక్కనే ఉయ్యాల బల్ల మీద కూర్చుంది.

ఈలోగా ఫోన్‌ ‌పట్టుకుని, అమ్మ తిరిగొచ్చింది.

‘‘నువ్వెప్పుడొచ్చావే?’’ అనడిగింది అమ్మ, అక్కని.

‘‘ఇప్పుడే వచ్చాను కాని, ఇంతకీ అసలు విషయం చెప్పు. చిన్నాన్న ఏమన్నాడు? తనే వస్తున్నానన్నాడా? లేక డబ్బులేమైనా ఎకౌంట్లో వేస్తానన్నాడా?’’

‘‘లేదే! అలాంటిదేం లేదు. వాళ్లే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారుట. ఇంకా తనే మీ నాన్నగార్ని మనిల్లు తాకట్టు పెట్టయినా సరే కొంత పైకం సర్దమని చెపుదామనుకుంటున్నాడుట. ఈలోగానే మీ నాన్నగారు ఫోన్‌ ‌చేశారని చెప్పాడు. అలా ముందరి కాళ్లకి బంధం వేశాడు. ఇంకేముంది! మీ నాన్నగారు ‘అయ్యో తండ్రీ, అలాగా? సరేలే! చూద్దాం! ఏదో ఒకటి చేద్దాం. నువ్వు దిగులు పెట్టుకోకు’ అని తమ్ముడికి ధైర్యం చెప్పారు. అంతేకాని, మన కష్టాలేమీ ఏకరువు పెట్టలేదు. ఇక మీ చిన్నాన్నేం సాయం చేస్తాడు మనకి? ఆ ఆశ లేదు. అయినా నేను మాత్రం మా చెల్లెలితో నోరు విప్పి, మా బాధలిలా ఉన్నాయని చెప్పగలిగానా? మనకి సహాయం చెయ్యాలని మీ పిన్నికి ఏ కోశానా లేదని స్పష్టంగా తెలుస్తుంటే, నేనే ఏమీ అనలేకపోయాను. ఇక మీ నాన్నగారు తన తమ్ముడితోనేమంటారు!’’ అని అమ్మ అక్కకి చెప్పింది.

అక్కకి ఎప్పుడూ లాగే సర్రున కోపం వచ్చింది. విసురుగా ఉయ్యాల దిగింది. ఆ విసురుకి ఉయ్యాల జోరందుకుంది.

‘‘సిగ్గూ లజ్జా లేకపోతే సరి, వాళ్లిద్దరికీ! ఇన్నాళ్లూ నాన్నగారు చేసినవన్నీ మర్చిపోయారు. విశ్వాస ఘాతకులు! గోముఖవ్యాఘ్రాలు! ఈ ఇల్లు బాగు చేయించడం పోయి, దీని మీద అప్పుచేసి అతగాడికి నాన్నగారు ఇవ్వాలా? మనిషా …’’

‘‘చాల్లే ఊరుకో! నీకంటే పెద్దవాళ్లని అలా అనకూడదు. సభ్యత కాదు. పెద్ద వాళ్లకి గౌరవం, మర్యాద ఇవ్వడం నేర్చుకో. నీ ఆవేశం కొంచెం తగ్గించు. పైవాళ్లెవరైనా విన్నారంటే నిన్ను కాదు, నన్నంటారు. ఇదా వీళ్లమ్మ నేర్పింది? అనుకుంటారు’’ అని అమ్మ చిన్నగా నవ్వింది.

‘‘ఆకలి మీదున్నట్టున్నావు. ఉండు. నీక్కూడా టిఫిన్‌ ఇక్కడికే తెస్తాను’’ అని చెప్పి క్షణాల్లో టిఫిన్‌ ‌తెచ్చి అక్క చేతికిచ్చింది. ఈలోగా ఊయల జోరు తగ్గింది. అక్క నా పక్కకొచ్చి కూర్చుంది.

‘‘ఇల్లు జాగ్రత్త! నేను ఇప్పుడే వచ్చేస్తాను. కొంచెం పని ఉంది. బయటకి వెళ్లాలి’’ అని అక్కకి చెప్పి నన్ను ఆటో తెమ్మంది.

———————–

అమ్మ బయల్దేరి వెళ్లిన కొంతసేపట్లోనే మా తాతగారు, బామ్మ వాళ్లూరి నుంచి వచ్చారు.

తాతయ్య అంటే స్వంత తాతయ్య కాదు, మా నాన్నగారికి స్వంత చిన్నాన్న.

వాళ్లు పాపం ఇంట్లోకి అడుగు పెట్టారో లేదో అక్క సణగడం మొదలెట్టింది.

‘‘మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు, వీళ్లు కూడా ఇప్పుడే రావాలా! వచ్చారంటే మాత్రం పదిహేను-ఇరవై రోజులైతే గాని కదలరు. అతుక్కు పోతారు. కరవులో అధిక మాసం అంటే ఇదే! అమ్మా వాళ్లు కూడా అంతే, ఒకంతట వాళ్లని వెళ్లనియ్యరు’’ అని సాగదీస్తూ, వంటింట్లోకి వెళ్లింది.

వాళ్లిద్దరూ కాళ్లు, చేతులు కడుక్కొని నేరుగా నాన్నగారి గదిలోకి వెళ్లారు. నేను కూడా వారి వెనకే వెళ్లాను.

నాన్నగారు తాతగార్ని చూసి, లేచి కూర్చున్నారు.

‘‘ఏరా అబ్బాయ్‌! ఎలా ఉన్నావ్‌? ఇం‌తకు ముందుకంటే ఇప్పుడు బాగా కోలుకున్నట్టున్నావే గుడ్‌. అయినా, మరికొద్ది రోజులు రెస్ట్ ‌తీసుకో. బాగా సత్తువొచ్చాక, వెళ్దువుగాని పనిలోకి’’ అన్నారు తాతగారు.

బామ్మ కూడా నాన్నగార్ని పలకరించింది. అలా వాళ్లు ముగ్గురూ మాట్లాడుకుంటుండగా అక్క కాఫీ పట్టుకొచ్చి వాళ్లిద్దరికీ ఇచ్చింది.

ఇంతలో ఆటో ఆగిన చప్పుడయింది. నేను వీధి గుమ్మం వైపు పరుగెత్తాను.

అమ్మని చూస్తూనే, ‘‘తాతగారు వాళ్లు వచ్చారు’’ అని చెప్పాను.

అమ్మ గబగబ కాళ్లు కడుక్కుని నాన్నగారి గదిలోకి వెళ్లింది. ‘‘బాగున్నారా మావయ్యగారూ, అత్తయ్యగారూ?’’ అని పలకరించింది. ‘‘మీరు మాట్లాడుతూ ఉండండి. నేనిప్పుడే వచ్చేస్తాను’’ అని చెప్పి అక్కడి నుంచి అక్క దగ్గరికి వెళ్లింది.

అక్క చేతిలో నోట్లకట్ట పెట్టింది. ‘‘జాగ్రత్తగా పెట్టు. రేపు వీడి స్కూలుకి వెళ్లి ముందు వీడి టర్మ్ ‌ఫీజు కట్టు. అట్నుంచి అటే నువ్వు మీ స్కూలుకి వెళ్లొచ్చు.. సరేనా!’’ అంది.

అక్క ‘‘అలాగే! కానీ నువ్వు చేసిన పని నాన్న గారికి తెలుసా?’’ అనడిగింది.

‘‘నాన్నగారికి చెప్పకుండా, అతనికి తెలియకుండా నేనెప్పుడైనా ఏదైనా చేస్తానమ్మా? అతని అంగీకారం తోనే చేశాను. ఓకేనా!’’

నాకేమీ అర్థమవలేదు. ఒకటే అర్థమయింది. అమ్మ సాధించింది!

అమ్మ నాతో ‘‘ఒరేయ్‌ ‌నువ్వు కూడా గుర్తు చెయ్యి. రేపు ఆటోవాడి డబ్బులిచ్చెయ్యాలి. మనలాగే, పాపం వాడెన్ని ఆశలు పెట్టుకున్నాడో! వాడికేం ఖర్చులు న్నాయో!’’ అని చెప్పింది. ఆనందంతో నా మొహం విప్పారింది.

అక్క డబ్బులు లోపల పెట్టి వచ్చింది. ఈలోగా బామ్మ హాల్లోకొచ్చింది. ‘‘అమ్మాయ్‌! ఇది లోపల పెట్టు. అబ్బాయ్‌ ‌చికిత్సకి, ఇంట్లో ఖర్చులకి, అవసరానికి పనికొస్తుంది’’ అని బొద్దుగా ఉన్న కవరు అమ్మ చేతిలో పెట్టింది. అక్క నమ్మలేనట్లు, ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసుకుని బామ్మవైపే చూస్తూ ఉండి పోయింది.

‘‘ఫరవాలేదు అత్తయ్యగారు! ప్రస్తుతానికి ఉన్నాయి. మాకేం ఇబ్బంది లేదు. కౌలు డబ్బులన్నీ మాకే ఇచ్చేస్తే మీకెలా! మీరక్కడ ఇబ్బంది పడతారు. మాకొద్దు’’ అంది అమ్మ.

‘‘మేమూ ఇలాంటివన్నీ పడిన వాళ్లమే. తళతళ లాడే బంగారుగాజులు పోయి చేతికి మట్టి గాజులు వచ్చినప్పుడు, మెడలోని నగల స్థానే పసుపుతాడు చేరినప్పుడు కూడా అర్థం చేసుకోలేనంత మూర్ఖురాల్ని కాదు. ఇంకేం చెప్పకు. ఉండనీ! ఆ పల్లెటూర్లో మాకు పైసా ఖర్చుండదు. తరతరాల నుంచి ఉన్న ఊరు. ఆ మాత్రం మాకు దినం గడవకపోదు! ఈ పట్నవాసంలో మీకే అడుగడుక్కీ డబ్బవసరం’’

అమ్మ తన ఒంటి మీది బంగారం కూడా అమ్మేసిందా! అనుకున్నాను. ఏమైనా, మా అమ్మ గ్రేట్‌!

———————–

మర్నాడు ఉదయాన్నే కాఫీలయ్యాక తాతగారు, నాన్నగారితో ‘‘ఇక వస్తాం రా అబ్బాయ్‌!’’ అన్నారు.

నాన్నగారు వెంటనే లేచి చిన్నపిల్లాడిలా తాతగార్ని చుట్టేసుకున్నారు. నాన్నగారి కళ్లంబడి ఒకటే నీళ్లు. తాతగారు కూడా భుజం మీద కండువా తీసి కళ్లొత్తుకున్నారు. నాన్నగారి వీపు నిమిరారు.

ఎప్పుడూ లాగే అమ్మ తాతగార్నీ బామ్మని కూర్చోబెట్టి తాంబూలం ఇచ్చింది. కాళ్లకి దణ్ణం పెట్టింది. నాన్నగారు కూడా వాళ్లిద్దరి కాళ్లకీ దణ్ణం పెట్టారు.

బామ్మ ఆ పళ్లెంలోంచి పసుపు, కుంకుమ, పూలు తీసుకుంది. ‘‘ఇవి చాలు’’ అంది. బట్టలు, డబ్బులు తీసుకోలేదు సరికదా, ‘‘ఇలాంటప్పుడయినా ఈ ఆచారాలు – సంప్రదాయాలు, పద్ధతులు-పాడూ తగ్గించుకోవాలి. ఎవరూ ఏమీ అనుకోరు, ఆక్షేపించరు. మీ గురించి మీ మంచితనం గురించి ఎవరికి తెలియదు కనుక!’’ అని సున్నితంగా అమ్మకి చివాట్లు వేసింది.

అప్పుడు నాన్నగారు ‘‘పోనీ మా కోసం, మరికొద్ది రోజులు ఉండకూడదా బాబాయ్‌!’’ అన్నారు.

అక్క బామ్మ చేతిలో బ్యాగ్‌ ‌లోపలి గదిలో పెట్టేయడానికి తీసేసుకుంది.

అప్పుడు తాతగారు ‘‘ఈదలేక కొట్టుకుంటున్న వాడికీ, మునిగిపోతున్న వాడికీ, ఒడ్డునుండి చెయ్యందించాలి. అండగా నిలబడి దరికి చేర్చాలి. అంతేగాని, వాణ్ణి చుట్టేసుకుని ఊపిరి సలుపనివ్వ కుండా చెయ్యకూడదు. గుదిబండలాగా భారమై మరింత వేగంగా ముంచేయకూడదు. ఇప్పటికిలా కానియ్యి. మళ్లీ నువ్వు కోలుకుని హాయిగా గాలి పీల్చుకున్నాక వస్తాం. అప్పుడు ఎక్కువ రోజులు మళ్లీ సరదాగా గడుపుదాం’’ అన్నారు.

అమ్మ ఒప్పుకోలేదు. ‘‘మీలాంటి పెద్దవాళ్లు ఎవరికీ గుదిబండలు కారు. గట్టిగా నిలబడి ఊతమిచ్చే అండలు. మీకున్న ఒక్క పొలం ఎలాగా కౌలుకిచ్చే శారు. ఇక హాయిగా ఇక్కడే మాతోపాటే ఉండిపోండి. కలో గంజో కలిసే తాగుదాం. మా అందరికీ ధైర్యంగా, ఆనందంగా ఉంటుంది. ఈ మాట ఏనాడో చెప్పవలసింది. మీ అబ్బాయి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యమయిపోయింది. ఇక మిమ్మల్ని వదలం’’ అని బామ్మ చేతులు పట్టేసుకుంది.

బామ్మ తృప్తిగా ‘‘నీలాంటి గృహిణులు ఇంటి కొక్కరు ఉంటే చాలు!’’ అంది. తాతగారి వైపు ఏమంటారన్నట్టు చూసింది.

తాతగారు చిరునవ్వుతో ‘‘గృహిణులంతా ఒకటైపోతే మేమేం చేస్తాం!’’ అని తిరిగి ఉయ్యాల బల్ల మీద నా పక్కన చతికిలబడ్డారు.

నేను, అక్కా ఇరు పక్కలనుంచి తాతగార్ని ఆనందంగా చుట్టేసుకున్నాం. మా ఉయ్యాల కూడా ఆనందంగా ఊగసాగింది.

About Author

By editor

Twitter
YOUTUBE