అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆరంభమైంది. ఇది భారతీయ జాగృతిలో కొత్త మలుపు. ఇందుకు అనేక కారణాలు. ఆధ్యాత్మిక పరమైనవి, రాజకీయ, సామాజిక కారణాలు కూడా ఇందుకు తోడ్పడినాయి. రామమందిరం భారతీయులను ఏకం చేస్తున్నది. అంటే చారిత్రక తప్పిదాలను సవరిస్తున్నది. ఈ క్రమంలోనే భారతీయులకు ఆరాధ్యగ్రంథం రామాయణం, పూజనీయ పురాణపురుషుడు రాముడి జీవితగాథకు సంబంధించినవిగా చెప్పుకునే, హిందువులు ప్రగాఢంగా విశ్వసించే పుణ్యస్థలాల మీద ఇప్పుడు ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. వాటిని అభివృద్ధి చేయ సంకల్పించాయి. ఇదొక ఐక్యతా సందేశమే. హిందువులందరినీ ఏకం చేయడం, కొండకోనలలో ఉండే గిరిపుత్రులతో ఆలింగనం కూడా ఇందులో భాగం. రాముడు నడయాడిన ప్రదేశమంతా కొండాకోనాయే కదా! సంఘం, దేశం, కుటుంబం మధ్య ఉండవలసిన బంధం గురించే కాదు, సమస్త జీవజాలంతో మానవునికి ఉండవలసిన బాంధవ్యం గురించి కూడా ఆ మహాకావ్యం చెబుతుంది.
పితృవాక్య పరిపాలన కోసం రామచంద్ర ప్రభువు అయోధ్యాపురిని విడిచి పెట్టి అడవులకు బయలుదేరాడు. వెంట సీతమ్మ, లక్ష్మణస్వామి కూడా ఉన్నారు. ఆయన అడవులకు నడచిన దారి వర్ణనలతో, మార్గ మధ్యంలో ఆయన కలుసుకున్న వ్యక్తుల ఉదంతాలతో రామాయణ కావ్యం ఎంతో శోభాయ మానంగా ఉంటుంది. మర్యాదారామన్న నడిచినట్టు చెప్పే అదే దారిని ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక రహదారిగా, పర్యాటక కేంద్రంగా మలచాలని సంకల్పించింది. రాముడి జీవితంతో ముడిపడి ఉన్న అయోధ్య-చిత్రకూట్‌లను కలపుతూ ఈ రహదారిని నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నది. నిజానికి జనవరి 21, 2015న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇచ్చిన ప్రకటనతో వీటన్నిటికి కదలిక వచ్చిందనిపిస్తుంది. ఆనాడు విలేకరులతో మాట్లాడుతూ గడ్కరి, ఇది రామభక్తుల ప్రభుత్వమని నిర్ద్వంద్వంగా చెప్పారు. అదే సమయంలో అయోధ్యను, నేపాల్‌ను కలుపుతూ ‘రామ్-జానకి మార్గ్ నిర్మించనున్నట్టు కూడా ఆయన చెప్పారు.రామ వన గమన మార్గ్ గురించి కూడా అదే రోజు ఆయన ప్రస్తావించడం విశేషం. ఇప్పుడు ఆ బృహత్ ప్రణాళిక నిజరూపం దాల్చబోతున్నది.
రామాయణ వస్తు ప్రదర్శనశాల
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభ మైంది. ఆ మహా కార్యక్రమానికి అనుబంధంగా పలు సాంస్కృతిక, పర్యాటక పథకాలను కేంద్రం, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోతున్నాయి. అయోధ్య-లక్నో జాతీయ రహదారిలో ఉన్న రామస్నేహి ఘాట్ దగ్గర ఒక దివ్యమైన వస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేయడానికి కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సన్నాహాలు ప్రారంభించారు. రామాయణ గాథతో సంబంధం ఉన్న వస్తువులు, కళాఖండాలతో ఈ వస్తు ప్రదర్శనశాల, సాంస్కృతిక కేంద్రం నిర్మిస్తారు. లక్నోకు 54 కిలోమీటర్లు, అయోధ్యకు 64 కిలోమీటర్ల దూరంలోను ఉన్న రామస్నేహి ఘాట్ ఇందుకు వేదిక కాబోతున్నది. ఈ వస్తు ప్రదర్శన శాలలోనే ఏర్పాటు చేస్తున్న బొమ్మలాట ఎంతో ప్రత్యేక మైనది. భారత్ సహా రష్యా, జపాన్, ఇండోనేషియా, మలేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాలలో ప్రాచుర్యంలో ఉన్న రామకథలే ఇతివృత్తంగా ఆ బొమ్మలాట ఉంటుంది. అలాగే మధుబ్, అయోధ్య, చత్తీస్‌గడ్, ఆంధప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, శ్రీలంకలకు చెందిన వంటకాలతో ఇక్కడే ఒక వంటశాల కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ కూడా ఒక రామమందిరం నిర్మిస్తారు. ఈ వస్తు ప్రదర్శన శాల – సాంస్కృతిక కేంద్రం పదెకరాల స్థలంలో రూపొందిస్తారు. రామాయణం ప్రాతిపదికగా ఉండే పుస్తకాలతో ఒక భాండాగారం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
రామ వన గమన మార్గం
210 కిలోమీటర్ల ఆ రహదారికి ‘రామ వన గమన మార్గం’గా పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోనే అయోధ్య నుంచి చిత్రకూటం వరకు ఆ మార్గం నిర్మిస్తున్నారు. ఫైజాబాద్, సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, జెత్వారా, శ్రిన్వేర్‌పూర్, మాంఝన్ పూర్, రాజాపూర్ పట్టణాల మీదుగా ఈ రహదారిని నిర్మిస్తారు. తమ రాష్ట్రాలలో కూడా ఇదే పేరుతో జాతీయ రహదారి నిర్మించాలన్న ఆకాంక్ష గురించి ఇప్పటికే మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని సంప్రతించాయి. రామ వన గమన మార్గం పథకం తొలిదశలో ప్రతిపాదిత మార్గంలోని ఎంపిక చేసిన ఎనిమిది ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం రూ.137.45 కోట్లు ఖర్చు చేస్తారు. 28,96, 731ఏ జాతీయ రహదారులతో కూడా ఈ మార్గం అనుసంధానమై ఉంటుంది.ఈ మార్గం నిర్మాణంలో భాగంగానే శ్రిన్వేర్‌పూర్ దగ్గర గంగ మీద ఒక వారధి కట్టాలని ప్రతిపాదించారు. ఎంపి, చత్తీస్‌గఢ్‌ల ప్రతిపాద నలు కూడా కలిపి మొత్తం పథకానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్న సంగతి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కర్ చెప్పారు. మొత్తం 4,080 కిలోమీటర్ల మార్గమిది. రూ. 35,000 కోట్లు ఖర్చు చేస్తారు. భారత్‌మాలా పరియోజన పథకంలో ఇది అంతర్భాగంగా ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో చిత్రకూట్‌తో పాటు శారదా శక్తిపీఠాన్ని (మైహార్ ఆలయం) కూడా ఈ మార్గం కలుపుతుంది.
చత్తీస్‌గఢ్‌లో రామ వన గమన పథ్
2019 నవంబర్‌లోనే రామ వన గమన పథం పేరుతో ఈ మార్గ నిర్మాణం గురించి ప్రకటించింది. అయోధ్య నుంచి రాముడు అడవులకు వెళ్లినప్పుడు చత్తీస్‌గఢ్ ప్రాంతంలోని 75 ప్రదేశాల గుండా నడిచి వెళ్లాడని అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. అందులో 51 ప్రదేశాలలో బస చేశాడని కూడా వారు నమ్ముతారు. ఇందులోని ఎనిమిది పుణ్యస్థలాలను రామగమన పథం ప్రణాళిక తొలిదశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో సీతామారి- హర్చయిక (కురియా జిల్లా), రామ్‌గఢ్ (సర్గుజా జిల్లా), తుర్తురియా (బాలోదాబజార్- భాతాపారా జిల్లా), శివారినారాయణ్ (జాంజ్‌గీర్-చంపా జిల్లా) చందఖురి (రాయ్‌పూర్ జిల్లా), శిహావా (సప్తరుషి ఆశ్రమం-ధంతారి జిల్లా) రాజిం (గరియాబండ్ జిల్లా), జగదల్పూర్ (బస్తర్ జిల్లా) ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లో కూడా…
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కమల్‌నాథ్ ముఖ్య మంత్రిగా ఉండగానే రామ్ వన గమన పథ్ ప్రణాళికకు యోజన చేసింది. అయోధ్య శ్రీరాముడిదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించిన వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గ నిర్మాణానికి పథకం రూపొందించింది. చిత్రకూట్ సహా పన్నా, బధ్వారా (కట్నీ జిల్లా), రామ్‌ఘాట్ (జబల్‌పూర్), దిందోరి, షాదోల్, రామ మందిర్ తలాబ్, రామనగర్ మాండ్లా, అమర్‌కంటక్ (అనుపూర్ జిల్లా)లకు అభివృద్ధి చేస్తున్నారు. చిత్రకూట్ నుంచి అమర్ కంటక్‌కు నాలుగు వరసల జాతీయ రహదారితో పాటు, పాదయాత్రకు కూడా వేరే మార్గాన్ని నిర్మించనున్నారు. ఇందులో సైకిల్ పర్యాటకం, పచ్చదనం అభివృద్ధికి కూడా చోటు కల్పిస్తున్నారు.
చిత్రకూట్
ఇది అటు ఉత్తరప్రదేశ్, ఇటు మధ్యప్రదేశ్‌లో కూడా విస్తరించి ఉన్న అద్భుత ప్రదేశం. అరణ్యవాసం కోసం అయోధ్య నుంచి బయలుదేరిన సీతారాములు, లక్ష్మణుడు చిత్రకూట్‌లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దత్తాత్రేయుడు, మార్కండేయుడు, అత్రి వంటి మహామునులంతా ఇక్కడే తపస్సు చేశారని ప్రతీతి. చిత్రకూట్ అంటేనే అనేక అద్భుతాల పర్వతమని అర్ధం. వాల్మీకి, కాళిదాసు సహా ఎందరో సంస్కృత మహాకవులు ఈ పర్వతం గురించి వర్ణించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆరంభ మైన నేపథ్యంలో భారతీయులు జరుపుకుంటున్న తొలి శ్రీరామనవమి ఇదే. అందుకే ఈ ఏడాది నవమి ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. మందిర నిర్మాణానికి భారతీయులు ఆనందంగా వితరణ చేశారు. హిందువులే కాదు, మైనారిటీలు కూడా తమ వంతుగా ఈ ఆలయ నిర్మాణానికి సహృదయంతో నిధి సమర్పించారు. ఒక కృతక సెక్యులర్ వాతావరణం నుంచి మొదటిసారి బయటపడే ప్రయత్నం దేశంలో కనిపించింది. ఇదే చాలామందికి నచ్చలేదు. హిందు వులు, మైనారిటీలు; మరీ ముఖ్యంగా ముస్లింలు సఖ్యంగా ఉండడానికి ఇష్టపడని మేధావులు ఇక్కడ ఉన్నారు. హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉండిపోవాలని తపించే ముస్లిం మత పెద్దలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అయోధ్య రాముడిదేనంటూ భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తరువాత కూడా చాలా మంది దొంగ మేధావులు, సెక్యులరిజం ముసుగులో పత్రికా రచయితలుగా చెలామణి అవుతున్న మతోన్మాదుల సంగతి చెప్పనక్కరలేదు. ఒకసారి మసీదు కడితే, అది ఎప్పటికీ అల్లా ఆస్తే అని, మళ్లీ ఏనాటికైనా అయోధ్య కట్టడం మాదేనని వీరంగం వేసిన ఉన్మాదులు కొందరు. వీరికి మద్దతుగా ఇలాంటి తీర్పు వచ్చినా ముస్లిం సమాజం మౌనంగా ఉండి పోవడం వింతే అంటూ బుగ్గలు నొక్కుకున్న పత్రికా రచయితలు ఇంకొందరు. కానీ ఈ దేశానికి, ఇక్కడి అత్యధిక సంఖ్యాకులైన హిందువులకు రాముడు ఆరాధ్యదైవం. ఆ ఒక్క అంశాన్ని అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేమన్న సంకేతాలు ఇవ్వడం సంఘర్షణకు పిలుపునివ్వడమే. ఈ ప్రమాదాన్ని ఇప్పుడు దేశంలో గుర్తిస్తున్నారు.అది శుభ పరిణామం. మారుతున్న ఈ వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి పట్ల మాత్రం అన్ని వర్గాలు అప్రమత్తంగానే ఉండాలి.