‘పేదరికం, ఆకలి అనుభవిస్తున్నప్పటికి అటవీ పర్యావరణం కాపాడటంలో, వన్యప్రాణి సంరక్షణలో ‘చెంచు’ గిరిజనుల కృషి మరువలేనిది. ప్రభుత్వం ITDA, ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందిపుచ్చుకుంటూ ఇప్పుడిప్పుడే చాలామంది చెంచులు సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు, ఇతర వన్యప్రాణి సంరక్షణలోనూ, పులుల గణనలోనూ చెంచు గిరిజనుల పాత్ర మరువలేనిది. ఇది భారత ప్రభుత్వం ప్రకటించిన ‘జాతీయ పులుల సంరక్షణ ఎక్సలెన్స్’ అవార్డు రావడానికి దోహదం చేసింది.’
(ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ‘పోస్టర్’ విడుదల చేసిన సందర్భంగా ఫారెస్ట్ ఉన్నతాధికారి ఎన్. ప్రదీప్‌కుమార్ (PCCF & Head of Forest Force) చేసిన వాఖ్య.)
జీవి వైవిధ్యాన్నీ, అడవినీ, అటవీ జంతువు లనూ రక్షిస్తూనే సంచార జీవనం సాగించే గిరిజనులు చెంచులు. ఆంధప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంత మైన ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలలోనూ, తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో చెంచులు నివసిస్తున్నారు. అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో చెంచులు విస్తరించారు. అటు పూర్వపు నిజాం రాజ్యానికీ, ఇటు బ్రిటిష్ పరిపాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీకీ సరిహద్దుగా ఉన్న కృష్ణానదికి ఇరువైపుల ఉన్న ప్రాంతాలే వారి ఆవాసం. చెంచులు చాలావరకు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని గూడేలలో (పెంట అని కూడా అంటారు) నివసిస్తూ ఉంటారు. అటవీసంరక్షణలో అధికారులకు తోడ్పడానికి ముందుంటారు.
అభివృద్ధి చెందిన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గూడేల్లో నివసిస్తున్నప్పటికి ఆ అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో చెంచులు వెనుకబడే ఉన్నారు. ఇక మారుమూల అడవిలో ఉన్న చెంచుల అభివృద్ధి గురించి చెప్పాలా! ఇందుకు కారణం-భారత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పులుల అభయారణ్యంగా ప్రకటించడమనుకోవచ్చు. ఆ నియమ నిబంధనలు కొంత అడ్డంకిగా మారుతున్నాయి. అటు పౌష్టి కాహారం, ఇటు వైద్యం, అభివృద్ధి కార్యక్రమాలు అందించడం కూడా అధికార యంత్రాంగాలకు ఇబ్బందిగా పరిణమిస్తున్నది. ప్రభుత్వం పులుల అభయారణ్యంలో ఉన్న కొన్ని గూడేలను మామూలు ప్రాంతానికి మార్చి పక్కా ఇళ్లు నిర్మించి పునరావాసం కల్పించినా అక్కడ ఇమడలేకపోతున్నారు. కొత్త ప్రాంతంలో శుభం కలగదని, ప్రాణనష్టం జరుగు తుందని భావించి తిరిగి పాత ఆవాసాలకు (మారుమూల గూడెం) చేరుతున్న పరిస్థితులను గమనించవచ్చు. ప్రభుత్వ ఐ.టి.డి.ఎ. ఆర్.డి.టి లాంటి స్వచ్ఛంద సంస్థ సహకారంతో అటవీ అభ్యంత రాలను అధిగమించి పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లోని 33 గిరిజన తెగలలో 08 తెగలను ఆదిమజాతి సమూహాలుగా (PVTG) భారత ప్రభుత్వం గుర్తించింది. అడవినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ‘చెంచుతెగ’ను 1975లో ఆదిమ జాతి సమూహంగా (Paticularly volunarable group) గుర్తించారు. రాష్ట్ర విభజన తరువాత ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలలోని 27 మండలాలలో 186 చెంచు గూడేలలో 27,857 మంది చెంచు జనాభా ఉన్నట్టు తేలింది. చెంచు జనాభా అంతరించిపోతున్నదనేది కేవలం అపోహ. కాకపోతే చెంచు జనాభావృద్ధి మిగిలిన రాష్ట్ర జనాభావృద్ధితో పోలిస్తే చాలా తక్కువ.
ఆకలి, రక్తహీనత, ప్రకృతి వైపరీత్యాలకు బలికావడం, ఉపాధి కోసం వలసలు వంటి పరిస్థి తులు చెంచుల సంస్కృతిని, నేపధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. చెంచుల సంక్షేమానికీ, అభ్యుదయానికీ ప్రభుత్వం ఐ.టి.డి.ఎ. రూపంలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ వాస్తవంగా వాటి ఫలాలను వారు అందుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల నుండి వారు బయటపడటానికి, జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి ప్రయత్నం జరుగుతున్నది. కొంత మేరకు వారు పౌష్టిక ఆహారం సమకూర్చుకోవడంతో పాటు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి, అటవీ ఫలసేకరణ మీద తక్కువ ఆధారపడేటట్లు చేసి, అటవీ సంరక్షణకు తోడ్పాటునందించడానికి కొన్ని అదనపు సౌలభ్యాలతో ఏర్పరచిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం-చెంచు ప్రత్యేకం’ విశేషంగా ఉపకరిస్తుందని విశ్వసించవచ్చు.
ఈ పథకం ఐ.టి.డి.ఎ. ఆధ్వర్యంలో ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలలోని చెంచుగూడేలలో జూన్ 2009 నుండి ముందస్తు చెల్లింపు పద్ధతి ద్వారా అమలు చేస్తున్నారు. సాధారణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోల్చి చూస్తే చెంచు ప్రత్యేక పథకంలో కొన్ని అదనపు సౌలభ్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, పని ప్రారంభించక ముందే 50 శాతం కూలీ డబ్బు ముందస్తుగా చెల్లిస్తారు. చెంచులలో సాధరణమైపోయిన రక్తహీనత, పౌష్టికాహార లోపం, విటమిన్ల లోపం వంటి వాటిని అధిగమించడానికి ఈ వెసులుబాటు కల్పించారు. పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ నెలకు 15 రోజుల చొప్పున సంవత్సరమంతా ఉపాధి చూపుతారు (రూ.3555/- ప్రతి నెలకు/ ఒక కూలీకి).
ఈ ప్రత్యేక పథకం క్రింద, అటవీ హక్కుల చట్టం క్రింద సాగు హక్కును కల్పించి భూములను అభివృద్ధి పరచడం, అభివృద్ధి చేసిన భూములలో సరిహద్దు కందకాలు తవ్వించడం వంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. దీని ద్వారా నేల మీది సారవంతమైన మట్టి వర్షాలకు కొట్టుకుపోకుండా నివారించవచ్చు. కందకాలలో వర్షపు నీరు నిల్వ ఉంచటం వలన పంటలకు సమృద్ధిగా నీరు లభించటంతో పాటు, అడవి జంతువుల దాహార్తి తీర్చటానికి ఉపయో గపడుతుంది. అంతేకాకుండా నీరు నిల్వ ఉండటానికి అడవిలో ఫారెస్టు అధికారులు సూచించిన అనువైన ప్రదేశాలలో ఫారం పాండు నిర్మాణాలను చేపట్టడం, మట్టి రహదారుల ఏర్పాటు, మరమ్మతులు చేయటం, ఈ పథకం క్రింద అభివృద్ధి చేసిన భూములలో ఆసక్తి మేరకు ఉద్యానవన తోటల పెంపకాన్ని ప్రోత్స హించడం ద్వారా లబ్ధిదారులకు స్థిరమైన ఆదాయ వనరులను చేకూర్చడం సాధ్యమవుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని 3 జిల్లాల చెంచులు (ప్రకాశం, కర్నూలు, గుంటూరు) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం, చెంచు ప్రత్యేకం రాకముందు అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా కుటుంబాలను పోషించుకునేవారు. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత చెంచులకు అటవీ హక్కు చట్టం ద్వారా సంక్రమించిన భూములలో కంప మొద్దుల తొలగింపు, పొలం సరిహద్దు కందకాలు త్రవ్వటం, ఫారం పాండు, కొండవాలు ప్రాంతంలో కందకాల తవ్వకం, ఉద్యానవన పంటలు, భూమికోత నివారణ పనులు, పొలం సరిహద్దు గట్లమీద మొక్కలు పెంపకం, పొలాలకు ఒండ్రుమట్టి తోలడం, దున్నడం, నీటి నిల్వ, నీటి సంరక్షణ పనుల ద్వారా చెంచుల భూముల అభివృద్ధికి ప్రయత్నం జరుగుతున్నది.
సంచారజీవులైన చెంచులు జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా వారి భూములను అభివృద్ధి చేయడం వలన స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ROFR భూములలో పత్తి, మిర్చి, కంది, జొన్న, మామిడి వంటి పంటలు వేస్తూ రైతులుగా మారుతున్నారు.
చెంచులు అడవిని కన్నతల్లిగా భావిస్తారు. పులులను దైవంగా, తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అత్యాశపరులుకాదు, అటవీ ఉత్పత్తులను అవసరానికి మించి తీసుకోరు. ఉదాహరణకు, తేనె సేకరించినపుడు, కొంత భాగాన్ని అక్కడే సురక్షితంగా నేల మీద వదలి వేస్తారు. ఎందుకంటే పులులు, వన్య ప్రాణులు తేనెను సేకరించలేవు.
ఇటీవల ఫారెస్టు శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక పత్రాన్ని విడుదల చేశారు. నల్లమల ప్రాంతంలోని ‘నాగార్జున శ్రీశైలం పులుల అభయారణ్యం’ (3,727 చదరపు మైళ్లు) దేశంలోని అతి పెద్ద పులుల అభయారణ్యమనీ, ఇక్కడ దాదాపు 60 పులులు నివసిస్తున్నట్టు తాజాగా నిర్వహించిన పులుల గణన ద్వారా తేలిందనీ అధికారులు ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేశారు. పులుల గణనలో దాదాపుగా 300 మంది చెంచులను టైగర్ ప్రొటెక్షన్ వాచర్లుగా ఉపయోగించుకున్నామనీ, పులులు, వన్యప్రాణి సంరక్షణలో ఇక్కడ నివసించే చెంచులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారనీ, తద్వారా ‘జాతీయ పులుల సంరక్షణ ఎక్సలెన్సీ’ అవార్డు రావడానికి కారణమయ్యారనీ ఫారెస్టు ఉన్నతాధి కారులు తెలియజేశారు. దీనికి ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ పులుల రక్షణకు ఫారెస్టు అధికారులు, చెంచులు చేస్తున్న కృషిని అభినందించారు.
చెంచు తెగ ప్రధానంగా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నది. అటవీ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా, దోపిడిదారులు, స్మగ్లర్ల నుండి అడవిని, అడవీ జంతువులను కాపాడటంలో తోడ్పాటునందిస్తున్నది. అడవిని తల్లిగా భావిస్తూ ప్రభుత్వం ITDA ద్వారా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు RDT, అజీమ్ ప్రేమ్‌జీ ఫిలాంత్రపిక్ సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటును చెంచులు అందుకుంటున్నారు. అలా ఇప్పుడిప్పుడే క్రమేపి అభ్యున్నతి వైపు అడుగులు వేస్తున్నారు. స్వర్గీయ డా।। వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న (2004-2009) కాలంలోను, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు గిరిజనుల మీదున్న మమకారంతో అటవీ హక్కుల చట్టం (ROFR Act)-2006ను అమలు పరచడంలో దేశంలో ప్రథములుగా నిలిచారు. ఈ ఇద్దరి ముఖ్య మంత్రుల అభీష్టం మేరకు 3 జిల్లాల కలెక్టర్లు, ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో దాదాపు 3,345 కుటుంబా లకు 10,153.00 ఎకరాల అటవీ భూమిని ITDA ద్వారా సాగు హక్కు కల్పించారు. ఇందులో ఒక్క 2020 సంవత్సరంలోనే 2వ విడతలో దాదాపుగా 2270.00 ఎకరాలు అటవీ భూమిపై 964 చెంచు కుటుంబాలకు సాగు హక్కు కల్పించారు.
సంచారజీవులు.. సంప్రదాయప్రియులు
శ్రీలంక ప్రాచీన తెగ ‘వేద్దా’ల మాదిరిగానే చెంచులు ఎక్కువ శాతం రింగుల జుత్తు, విశాల వదనం, చప్పిడి ముక్కు, పొడవాటి దవడతో పొట్టిగా, నల్లగా ఉంటారు. వారి పూర్వీకులలాగా ఆకులతో శరీరాన్ని కప్పుకోవడం ఇప్పుడు లేకపోయినా, మగవాళ్లు గోచీ మాత్రమే పెట్టుకుంటారు. ఆడవాళ్లు నూలు రవిక, చీర కట్టుకుంటారు. అటవీ చెంచుల కన్నా నిరుపేదలు దేశంలో ఉండరు. విల్లంబులు, కత్తి, గొడ్డలి, గుంతలు తవ్వే కర్ర, కొన్ని కుండలు, బుట్టలు, మరికొన్ని బింకపాతలు చెంచులకు వారసత్వంగా వచ్చే ఆస్తిపాస్తులు. ఇంటికొక కుక్కను పెంచుకుంటారు. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్ర భావనలు బలంగా కనిపిస్తాయి. వేటనూ, అడవి పండ్లనూ ప్రసాదిస్తుందని విశ్వసించే ఒక దేవతను పూజిస్తారు. వారి కులదైవాలతో పాటుగా నరసింహస్వామి, భ్రమరాంభ మల్లికార్జున స్వాములను ఆరాధ్యదైవాలుగా కొలుస్తారు. కొంతమంది శివుడిని బయన్నస్వామిగా పూజిస్తారు. భ్రమరాంబాదేవిని ‘చెంచిత’ పేరుతో, వారి తెగ ఆడబిడ్డగా చెప్పుకుంటారు. దీనికి ఆధారం శ్రీశైలం దేవాలయం ప్రాకారాల మీది అక్షరాలలో ఉంది కూడా.
ఛత్రపతి శివాజీ శ్రీశైలం విచ్చేసినప్పుడు చెంచులే దారి చూపి, సపర్యలు చేసి సహాయం చేశారని అంటారు. శ్రీశైలంలో ఏటా జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో మకర సంక్రాంతి రోజున నిర్వహించే కల్యాణోత్సవం చెంచులు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీ. జీవితం దేవుడి వరప్రసాదమేననీ, మరణించిన జీవుడు దేవుడులో కలసిపోతాడనీ, చెంచులు నమ్ముతారు. అప్పటికప్పుడు ఆశువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. వారి ఆటల్లో సింగి, సింగడు నాయికా, నాయకులు. డప్పు వాద్యానికి తగినట్టుగా చిందులేస్తారు. ఇప్ప సారా తాగితే మైమరిచి నర్తిస్తారు. నెమలి నృత్యం, పులివేషాలలో నృత్యమే వారికి ముఖ్యమైనది. చెంచుల కథలు జానపద కళా రూపాల్లో ఒకటి. మొండి వ్యాధులను కూడా ఆయుర్వేదం, మూలికల ద్వారా నయం చేసే పరిజ్ఞానం వారిలో కొంతమందికి ఉంది.
పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో చెంచులు భక్తి భావంతో దానధర్మాలు గావిస్తూ శ్రీశైలయాత్రను సాగించడాన్ని వర్ణిస్తాడు. చెంచుల స్వభావం, పగ ప్రతీకారం వంటి ప్రవర్తనలను శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ వర్ణిస్తుంది.మహాకవి ధూర్జటి రచించిన ‘శ్రీకాళహస్తి మహాత్మ్యం’ చెంచుల జీవిత వైభవాన్ని, వస్త్రధారణ మొదలు జాతర వేడుకల దాక పలు సందర్భాలలో వల్లిస్తుంది. ఈ కావ్యంలో అగుపడే ‘తిన్నడి కథ’ గిరిజన సంస్కృతిని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. చెంచుల జీవనం, వేట పద్ధతులు, ఆహార పానీయాలు, వస్త్రధారణ, జాతరలు, వైద్యం వంటి అంశాలను వివరిస్తుంది.
ప్రతి చెంచు గూడేనికి ఒక పెద్దమనిషి (ఇప్పటి వాడుకలో వి.టి.డి.ఎ, ప్రెసిడెంట్) ఉంటాడు. ఇతనిని గూడెమంతా కలసి ఎన్నుకుంటుంది. ఇతను తన గూడెం వ్యవహరాలను చూస్తూనే, ఇతర గూడేలతో సత్సంబంధాలు నెరపడం వంటివి చేస్తుంటాడు. ఏ శుభకార్యం జరిగినా ఆయన తప్పని సరిగా హాజరై ఆశీర్వచనాలు అందజేస్తాడు. కర్మకాండలలోను ప్రధాన పాత్ర ఆయనదే. చెంచులు ఒక చోట స్థిరంగా ఉండరు. వారిలో వారు తగువు లాడుకొని ఇంకొక చోటికి మారుతారు. కొన్ని గూడెంలలో ఇప్పటికీ• కొంతమంది తాగిన మైకంలో పరస్పరం విల్లంబులతో దాడి చేసుకుంటారు. చెంచుల వివాహ నిశ్చయ కార్యక్రమం సాధారణంగా పెళ్లికుమార్తె ఇంట్లో జరుగుతుంది. నేటికీ కట్నాలు లేవు. ఉమ్మడి కుటుంబాలు ఉండవు. వివాహం జరిగిన వెంటనే విడిగా కాపురం పెట్టుకుంటారు. చాలా కుటుంబాలలో వివాహానికి పూర్వమే మగవాడు ఒక గుడిసెను ఏర్పాటు చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది. చెంచులలో మారుమనువు ఆచారం ఉంది.
ఆధునిక ప్రపంచంలో మహిళలు ధరించే చుడీదార్, చీరలు వంటి వస్త్రాలు కొంతమంది ధరిస్తున్నప్పటికీ అక్కడ ఇతర విద్యా, ఆరోగ్యం వంటి అభివృద్ధి మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో కనిపించడం లేదు. వైద్యం చేయడానికి వచ్చే వైద్యులు, సిబ్బందికి సహకరించని వారు కనిపిస్తారు. రాకపోతే వైద్యుల నిర్లక్ష్యం అంటూ, వస్తే ఎందుకు వచ్చారని ప్రశ్నించే వారు కూడా కనిపిస్తారు. ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు చాలావరకు బయటపడుతున్నారు.
– డా।।బి. రవీంద్రరెడ్డి, ప్రాజెక్టు అధికారి, ఐ.టి.డి.ఎ. శ్రీశైలం