భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, ఆంధప్రదేశ్‌కి చెందిన జస్టిస్ ఎన్.వి. రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తదుపరి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రమణ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజే జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సిఫార్సు చేయడంతో ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. 2022 ఆగస్టు 26 వరకు.. అంటే సుమారు 16 నెలలపాటు భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా రమణ ఈ పదవిలో కొనసాగుతారు.
నూతలపాటి వెంకటరమణ కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలోని సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు సరోజిని, గణపతిరావు. రమణ కంచికచర్ల ఉన్నత పాఠశాలలో చదివారు. తొలుత అమరావతిలోని ఆర్వీఆర్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1982లో నాగార్జున విశ్వ విద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదై, న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
వృత్తిపట్ల ఎంతో నిబద్ధత ఉన్న జస్టిస్ ఎన్.వి. రమణ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్), వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ కౌన్సిల్‌గా ఉన్నారు. క్యాట్‌లో కేందప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్.వి. రమణ ఆంధప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. ఆంధప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సుప్రీం కోర్టు వరకూ..
ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డి మురుగేశన్ జూన్‌లో పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణ 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 2014 ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటికి జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆ పదవిలో రమణ రెండో తెలుగువ్యక్తి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో తెలుగువ్యక్తిగా జస్టిస్ రమణ రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో ఈ పదవిలో జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు పనిచేశారు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి తెలుగువ్యక్తికి ఈ ఘనత దక్కింది.
తెలుగుభాషలో మాట్లాడేందుకు సిగ్గు పడొద్దు!
జస్టిస్ ఎన్.వి. రమణ తెలుగుభాషపై ఎంతో మక్కువ చూపిస్తారు. ఉమ్మడి రాష్ట్ర న్యాయవ్యవస్థలో తెలుగు అమలుచేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. మనకు తెలిసిన, మన యాసతో కూడిన, మన తెలుగుభాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసేవారు. కేసుల విచారణ కక్షిదారుకు అర్థమయ్యే తెలుగులో ఉండాలని, న్యాయవాదులు ఏం మాట్లాడుకుంటున్నారో వారికి తెలిసేలా ఉండాలని జస్టిస్ రమణ చెప్పేవారు. ఈ దిశగా జరిగిన ప్రయత్నాల్లో భాగంగా జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధికార భాషా సంఘంతో కలిసి ఒక సెమినార్ నిర్వహించారు. న్యాయవ్యవస్థలో తెలుగుభాష అమలు నిమిత్తం ఈ సెమినార్ పలు తీర్మానాలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం కూడా సమ్మతించి తెలుగు అమలుకు సహకరిస్తామని హామీ ఇచ్చింది.
సుమోటోగా ఎన్నో కేసులు
సివిల్, క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగ పరమైన అంశాల్లో జస్టిస్ రమణ దిట్టగా పేరొందారు. రాజ్యాంగ పరమైన వివాదాలు, కార్మిక చట్టాలు, ఎన్నికల సర్వీసులకు సంబంధించిన కేసులపై న్యాయవాదిగా హైకోర్టు, సుప్రీంకోర్టులతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై సుమోటోగా పిటిషన్‌లను విచారణకు స్వీకరించి స్థానిక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ ఢిల్లీలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 20ఏళ్ల విద్యార్థి నిడో తానియాను దుకాణాదారులు కొట్టిచంపిన విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సుమోటోగా విచారించారు. అదనపు కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అంతేగాక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. న్యాయవ్యవస్థలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని గుర్తించి ఢిల్లీ హైకోర్టులో ఇ-ఫైలింగ్‌ను ప్రారంభించారు.
చరిత్రాత్మక తీర్పులు
జస్టిస్ ఎన్.వి. రమణ సర్వోన్నత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఈ ఏడేళ్లలో ఎన్నో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. రాజ్యాంగ, వాణిజ్య, ప్రజాసంక్షేమ విషయాల్లో విస్పష్టమైన తీర్పులు వెలువరించారు. ఉరిశిక్ష పడిన ఖైదీ మానసిక అనారోగ్యానికి గురైతే అతన్ని వదిలిపెట్టాలని మహారాష్ట్రకు సంబంధించిన ఓ కేసులో చెప్పారు. శిక్షను మార్చడానికి వారి మానసిక అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పారు. ఖైదీలకూ గౌరవం ఉంటుందని, దాన్ని దక్కకుండా చేయడానికి వీల్లేదని జస్టిస్ రమణ పేర్కొన్నారు. నేరాలకు శిక్ష విధించేటప్పుడు క్రైమ్‌టెస్ట్, క్రిమినల్ టెస్ట్, కంపేరిటివ్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ అని మూడు పరీక్షల ఆధారంగా విశ్లేషించుకోవాలని జస్టిస్ ఎన్.వి. రమణ ధర్మాసనం పేర్కొంది. శిక్ష విధించే ముందు క్రిమినల్ కోర్టులు అనుసరించాల్సిన విధానాలను ఈ తీర్పు స్పష్టంగా నిర్దేశించింది. ఇంటర్‌నెట్ ద్వారా వ్యక్తంచేసే భావప్రకటన కూడా ప్రాథమిక హక్కు కిందికే వస్తుందని అనూరాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ రమణ విడమరిచి చెప్పారు. ఆ తీర్పే కశ్మీర్‌లోయలోకి ఇంటర్‌నెట్ తిరిగి రావడానికి బాటలు వేసింది. న్యాయబద్ధమైన అభిప్రాయం, ఆవేదన, ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడానికి సీఆర్‌పీసీలోని సెక్షన్ 144ని ప్రయోగించకూడదని ఈ తీర్పు నిర్దేశించింది.
సమాచార హక్కు, వ్యక్తిగత గోప్యత హక్కులకు సమాన స్థాయి ఉంది. అందువల్ల ఇందులో ఒకదాని కంటే మరొకటి గొప్పది కాదని సుభాష్‌చంద్ర అగర్వాల్ కేసులో జస్టిస్ రమణతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.
స్వరాజ్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సంక్షేమ రాజ్యంలో సమాఖ్య వ్యవస్థ స్వరూపం నిర్వచనాన్ని చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలు కేసులో తీర్పునిస్తూ సహకార సమాఖ్య వ్యవస్థ అవసరం గురించి స్పష్టంగా వివరించారు. ప్రజల ఆహార భద్రతకు భరోసా కల్పించడంతోపాటు, పౌష్టికాహార లక్ష్యాన్ని చేరుకొనేందుకు దోహదపడేలా ఆయన నిర్దేశాలు జారీచేశారు.
రాజకీయాలకు సంబంధించి..
శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ వర్సెస్ కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ కేసులో రాజ్యాంగంలో అయోమయం, విరుద్ధ అభిప్రాయాలకు తావిచ్చేలా ఉన్న పదో షెడ్యూలుపై జస్టిస్ రమణ స్పష్టమైన ప్రకటన చేశారు. రాజకీయ నాయకులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ‘కేవలం రాజ్యాంగాన్ని సంరక్షిస్తానని, దాని గౌరవాన్ని కాపాడతానని ప్రమాణస్వీకారం చేయడం ఒక్కటే సరిపోదు. రోజువారీ విధి నిర్వహణలో రాజ్యాంగ విలువలు కనిపించడం అవసరం. రాజ్యాంగం నుంచి ఆశించేది అదే అని పేర్కొన్నారు.
రాజకీయాల్లో బేరసారాల్లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడానికి, ప్రజాస్వామ్యం సమర్థవంతంగా, సున్నితంగా కొనసాగడానికి శాసనభలో బలపరీక్ష ఎంత ముఖ్యమో శివసేన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ ఎన్.వి. రమణ స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితి తొలగించడానికి తక్షణం బలనిరూపణ చేపట్టాలని ఆదేశించారు. అది ఆ రాష్ట్రంలో బేరసారాలకు అడ్డుకట్ట వేసి సమర్థ న్యాయం అందించడానికి దారితీసింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులపై ఉన్న నేర కేసుల విచారణలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించి, విచారణలను క్రమబద్ధంగా, వేగవంతంగా కొనసాగించడానికి వీలుగా అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ ఎన్.వి. రమణ పలు ఆదేశాలు జారీచేశారు. ప్రజాప్రతినిధులు అంటే ఓటర్ల విశ్వాసం, నమ్మకానికి నిధి లాంటి వారని, అలాంటి వ్యక్తుల నేపథ్యం గురించి ఓటర్లకు తెలియాలని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యవస్థల స్వచ్ఛతను కాపాడటమే ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.
సంక్షేమ తీర్పులు
ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో జస్టిస్ ఎన్.వి. రమణ ఒకరు. ఈ కేసులో మెజారిటీ న్యాయమూర్తుల తీర్పుతో ఆయన విభేదించారు. కులాలు, మతాలవారీ రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నారు. వివాహ సంబంధమైన కేసుల్లో సాధ్యమైనంత వరకు దంపతులను కలిపి ఉంచడానికి జస్టిస్ రమణ తన తీర్పుల ద్వారా ప్రయత్నాలు చేశారు. గృహిణులకూ కుటుంబంలో సంపాదన ఆర్జించే వారితో సమానమైన హోదా ఇవ్వాలని, కుటుంబానికి వారు చేస్తున్న సేవలను గుర్తించాలని కీర్తి వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కేసులో జస్టిస్ రమణ కీలకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్నో శక్తిమంతమైన తీర్పుగా పలు మహిళా సంఘాలు అభివర్ణించాయి. భారతీయ మహిళలకు సాధికారత కల్పించే సమర్థమైన చర్యగా పేర్కొన్నాయి.
వాణిజ్య చట్టాలపై కీలక తీర్పులు
జస్టిస్ ఎన్.వి రమణ వాణిజ్య చట్టాలకు సంబంధించిన ఇతర విషయాల్లోనూ తీర్పులు వెలువరించారు. పోటీ చట్టాలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు లెక్కించడానికి అనుసరించాల్సిన సూత్రాల గురించి ఎక్సెస్ కార్పొరేషన్ కేర్ లిమిటెడ్ వర్సెస్ సీసీఐ కేసులో తీర్పు చెప్పారు. జరిమానాలు రాజ్యాంగ ధర్మాలు, నైష్పత్తిక సూత్రాలను అనుసరించి ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అంతకుముందు స్పష్టత లేకపోవడంతో, కాంపిటీషన్ ట్రైబ్యునళ్లు ఏకపక్షంగా జరిమానాలు విధించేవి. ఈ సమస్యకు తెరదించుతూ జస్టిస్ రమణ ఉత్పత్తి టర్నోవర్ లెక్కింపునకు రెండు సూత్రాలు నిర్దేశించారు
సెక్యూరిటీ మార్కెట్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో సెబీ వర్సెస్ కన్నయ్యలాల్ బల్‌దేవ్ పటేల్ కేసులో జస్టిస్ రమణ స్పష్టత ఇచ్చారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ మార్కెట్‌కు నష్టం చేకూరుస్తుందని చెప్పారు. కీలకమైన రహస్య సమాచారాన్ని స్టాక్‌బ్రోకర్లకు చేరవేసి ముందస్తుగా వాటాలు కొనడం, అమ్మేయడానికి ఉపయోగించడం చట్టవిరుద్ధమని, అది మార్కెట్లకు నష్టాన్ని కలుగజేస్తుందని చెప్పారు. ఈ కేసులో ఆయన చేసిన సూచనలకు అనుగుణంగా సెబీ చట్టంలో సవరణలు చేశారు.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్