– పొత్తూరు రాజేందప్రసాద్‌ ‌వర్మ

సర్వమంగళ బ్యాగ్‌ ‌పట్టుకొని రైల్వే స్టేషన్‌లో దిగేసరికి సాయంత్రం ఆరు గంటలైంది. అంతకుముందు ఎలమంచిలి పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. కావ్య తప్ప ఈ ఊరిలో తెలిసినవారెవరూ లేరు. ఆమె ఇల్లు కూడా స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంగా ఉంటుందని ఫోన్‌లో చెప్పింది.

‘‘సర్వమంగళా నువ్వేం గాబరా పడనవసరం లేదు. నువ్వు ప్యాసింజర్‌లో నుంచి దిగగానే మామయ్య గారు నీకోసం చూస్తుంటారు. ’’ కావ్య ఫోన్‌లో చెప్పిన విషయం తలచుకొని కాస్త ధైర్యం తెచ్చుకుంది.

ఇంతలో ఫోన్‌ ‌రింగయింది.

చూస్తే కొత్త నంబరు. ఎవరు? అనుకుంటుండగా ‘‘అమ్మా.. ఎక్కడున్నావు? ఇప్పుడే ప్యాసింజర్‌ ‌కదిలిపోయింది. నువ్వు గేట్‌ ‌దగ్గరకు వచ్చేయ్‌..’’ ‌కావ్య మామయ్య గారని అర్థమైపోయింది.

‘‘నమస్కారం సోమేశ్వరరావు గారు. నేను మెయిన్‌ ‌గేట్‌ ‌దగ్గరలోనే ఉన్నాను..’’ అంటుండగా డెబ్బయి సంవత్సరాల వృద్ధుడు ఆమె వద్దకు వచ్చాడు. ‘‘సర్వమంగళ నువ్వే కదా?’’ చనువుగా అడిగాడు.

బ్యాగ్‌ ‌కిందపెట్టి రెండు చేతులెత్తి నమస్క రించింది.

‘‘కావ్య చెప్పిందమ్మా.. గంట ముందు నుంచే ట్రైన్‌ ‌కోసం ఎదురుచూస్తున్నాను. ప్యాసింజర్‌ ‌కదా చాలామంది దిగారు. అందుకే ఫోన్‌ ‌చేసాను. నంబరు కావ్య ఇచ్చింది. పదమ్మా చీకటి పడుతోంది..’’ ఆమె జవాబు కోసం చూడకుండా బ్యాగ్‌ను అందుకుని బైటికి నడిచాడు. అక్కడ ఎదురుగా ఆగి ఉన్న ఆటో ఎక్కి సర్వమంగళను కూడా ఆహ్వానించాడు.

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌గా పనిచేస్తున్న ఆమెకు సోమేశ్వరరావు చనువు ఆశ్చర్యం కలిగించింది. నిత్యం కార్లో తిరిగే ఆమెకు ఆటో ప్రయాణం కొత్తగా అనిపించింది.

పావుగంట తర్వాత ఇంటిముందు ఆటో ఆగింది.

‘‘ఆలస్యం అయిందని మా రాముడు ఎదురు చూస్తుంటుంది..’’ అంటూ బ్యాగ్‌తో లోపలికి దారి తీసాడు. అప్రయత్నంగా అతడిని అనుసరించింది మంగళ.

కావ్య తన స్నేహితురాలిని సాదరంగా ఆహ్వానించింది.

‘‘రామ్మా… ఎప్పుడు బయల్దేరావో.. ఈ ప్యాసింజర్‌ ‌బండి ఎప్పుడూ లేటే. ఎలమంచిలిలో ఎక్స్‌ప్రెస్‌లు రావాయె… మొత్తం మీద క్షేమంగా వచ్చేసావు..’’ అంది అత్తయ్యగారు.

‘‘రాముడూ అమ్మాయి కాళ్లు కడుక్కునేందుకు నీళ్లివ్వు.. పలకరింపులు తర్వాత..’’ సోమేశ్వరరావు చిరు మందలింపు.

అప్పుడు అర్థమైంది రాముడంటే రామలక్ష్మి అనే అత్తగారి పేరని.

కాళ్లు కడుక్కున్న తర్వాత బ్యాగ్‌ ‌తీసుకుని నేరుగా కావ్య గదిలోకి వెళ్లిపోయింది సర్వమంగళ. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. ఫోన్‌లో అనేక సార్లు కావ్య తన అత్తమామల మంచితనం గురించి చెప్పేది. తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది.

‘‘అమ్మాయి.. వేడి నీళ్లతో స్నానం చేసేయ్‌.. ‌రాత్రి మన టిఫిన్‌ ‌మినపకుడుం సిద్ధం చేస్తాను..’’ రామలక్ష్మి వారి గది గుమ్మం వద్దకు వచ్చి నెమ్మదిగా చెప్పింది.

మినపకుడుం ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు తింది. మళ్లీ ఇప్పుడు ఆ పేరు వింటోంది సర్వమంగళ.. బెంగళూరులో బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు తినడం తప్ప తెలుగుతనం ఉట్టిపడే టిఫిన్‌ ‌తిని చాలా సంవత్సరాలు దాటిపోయింది.

‘‘అత్తయ్య, మావయ్యల ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. ఎంత కొత్తవాళ్లు వచ్చినా వారు అలాగే ఉంటారు. నన్ను కూడా ఒక్క పని చేయనివ్వరు. మిలట్రీలో పనిచేస్తున్న ఒక్కగానొక్క కొడుకు ఆరునెలలకో సంవత్సరానికో వస్తుంటారు. అంతవరకు వారికి అన్నీ నేనే. ఒక్కమాటలో చెప్పాలంటే కూతుర్ని.. కోడల్ని.. అన్నీ నేనే..’’ కావ్య మెరుస్తున్న కళ్లతో చెప్పింది.

సర్వమంగళ ఫ్రెషప్‌ అయ్యేసరికి ఏడున్నర అయింది.

‘అమ్మా కావ్యా.. నువ్వు, మంగళా రెడీ అయితే వచ్చేయండి. టిఫిన్‌ ‌రెడీగా ఉంది. మామయ్య గారు కూడా ఎదురు చూస్తున్నారు..’’ రామలక్ష్మి అంది.

‘‘ఇంత తొందరగానా?’’

‘‘సర్వమంగళా.. ఇది సిటీ కాదు. పల్లెటూరు. రాత్రి పది గంటలకు భోజనం చేయడం ఇక్కడ కుదరదు. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులూ ఈ పద్ధతినే ఫాలో కావాలి.. తెలిసిందా?’’ కావ్య అంది.

‘‘మోహన్‌ అయితే ఈ టైమ్‌కి ఎప్పుడూ తినలేదు. రాత్రి పది గంటలకు రావడం. వచ్చేటప్పుడు ఏదో పార్సిల్‌ ‌తేవడం. ఇద్దరం తొందర తొందరగా తినడం.. అలసిపోయి పడుకోవడం.. వారంలో నాలుగైదు రోజులు అలాగే జరుగుతుంది..’’ సర్వమంగళ కావ్యతో అంది.

‘‘మోహన్‌, ‌నువ్వు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తులు కాబట్టి మీకు తినడానికి కూడా తీరిక దొరకదు.. కానీ ఇక్కడలా కాదు.. పద టిఫిన్‌ ‌చేద్దాం..’’ అంది సర్వమంగళ. అప్రయత్నంగా లేచింది కావ్య.

డైనింగ్‌ ‌టేబుల్‌ ‌మీద అన్నీ సర్ది ఉన్నాయి. రామలక్ష్మి, సోమేశ్వరరావులు పక్కపక్కన కూర్చున్నారు. సర్వమంగళకు, కావ్యకు ఎదురెదురుగా రెండు ప్లేట్లు పెట్టి ఆహ్వానించారు. మినపపిండితో చేసిన రొట్టెను ముక్కలు చేసి ప్లేటులో వడ్డించారు. ఉల్లిపాయ, టొమాటొ చట్నీ పెద్ద గిన్నెలో ఉంది. దాని పక్కన ఆవకాయ కూడా పెట్టారు. ఫ్రిజ్‌లోని బాటిల్స్ ‌కూడా పక్కన పెట్టి రెండు గ్లాసులు ఉంచారు.

సోమేశ్వరరావు తింటున్న ప్లేటు పక్కన చిన్న గిన్నెలో చట్నీ ఉంది.

సర్వమంగళ దానివైపు చూస్తున్న విషయాన్ని గమనించి..‘‘ఈయనకు చట్నీలో కారం తక్కువ ఉండాలి. ఉప్పు అసలు వేయకూడదు.. అందుకే ముందుగా ఈ గిన్నెలోకి తీసి మిగిలినది మన ముగ్గురి కోసం తయారు చేసాను..’’ అంది రామలక్ష్మి.

ఈ వయసులో కూడా భర్త మీద ఎంత శ్రద్ధో అనుకుంది మంగళ. కబుర్లు చెప్పుకుని టిఫిన్‌ ‌పూర్తి చేసేసరికి గంట పట్టింది.

‘‘సర్దడంలో అత్తయ్యగారికి సాయం చేయాలి.. నువ్వు టీవీ చూస్తుండు మంగళా.. నేను వచ్చే స్తాను…’’ కావ్య మంగళను గదిలోకి పంపించింది.

మరో అరగంటకు కావ్య వచ్చి సర్వమంగళ పక్కన కూర్చుంది.

వాకిట్లో మల్లె పందిరి కింద కుర్చీలు వేసుకుని రామలక్ష్మి, సోమేశ్వరరావులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

వారిద్దరినీ చూస్తుంటే ముచ్చట వేసింది.

కావ్య, సర్వమంగళ కబుర్లలో పడ్డారు.

చిన్నప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు. సర్వమంగళ ఇంజనీరింగు చదివిన తర్వాత మోహన్‌తో పెళ్లి కావడం, ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్లుగా పనిచేయడంతో అక్కడే స్థిరపడిపోవడం జరిగింది. మిలట్రీలో పనిచేసే వ్యక్తితో వివాహం కావడంతో కావ్య అత్తమామలతో కలిసి ఉంటోంది. దూరంగా ఉంటున్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా కావ్య, మంగళ ఫోనులో మాట్లాడుకుంటూనే ఉంటారు.

‘‘చాలామంది అత్తమామలు లేకపోతే బాగుంటుందని అనుకుంటుంటారు. కానీ నాకు మాత్రం అత్తయ్య, మామయ్య అంటే ప్రాణం. వారు కూడా నన్ను అలానే చూసుకుంటారు..’’ కావ్య చెప్పింది.

‘‘నీలాంటి వారు అరుదుగా ఉంటారు.’’ సర్వమంగళ అంది.

‘‘నా లాంటివారు ఎక్కడైనా తారసపడతారు. కానీ మా అత్తయ్య, మామయ్య లాంటి జంట మాత్రం కాగడా పెట్టి వెతికినా ఎక్కడా కనిపించరు..’’

కావ్య ఆ మాటలు అంటున్నప్పుడు రామలక్ష్మి పక్క గదిలోకి వచ్చి గ్లాసుతో నీళ్లు తీసుకొని మళ్లీ బైటికి వెళ్లింది. ఆమెను చూసి ‘‘మీ అత్తయ్య గారు ఎన్నింటికి పడుకుంటారు?’’ అడిగింది సర్వమంగళ.

‘‘బీపీ మాత్ర తీసుకుని వెళుతున్నారంటే మరో అరగంటలో లోపలికి వచ్చి పడుకుంటారు. మామయ్య గారికి అన్నీ సమయానికి అమర్చి పెడతారు. మాత్రలు కూడా సమయానికి అందిస్తారు..’’ అంది కావ్య.

‘‘పెళ్లయి నాలుగైదేళ్లకే భర్తల మీద విరక్తి వస్తోంది. ఇన్ని సంవత్సరాలైనా ఇంతటి అనుబంధం ఉండటం గొప్ప విషయమే…’’

‘‘మంగళా నీకో విషయం తెలుసా? మా అత్తయ్య, మామయ్య ఇద్దరూ యాభై సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారట..’’

‘‘వెరీ ఇంట్రెస్టింగ్‌’’

‘‘‌నిజంగా వీరి అనుబంధం గురించి సినిమా డైరెక్టర్‌ ఎవరికైనా తెలిస్తే వీరి కథను వెండితెరకు తప్పకుండా ఎక్కిస్తారు. రచయితలకెవరికైనా తెలిస్తే గొప్ప కథను కూడా రాసేయగలరు.’’ కావ్య చెప్పింది.

‘‘వీరి గురించి తెలుసుకోవలసిందే.’’ సర్వమంగళ అంది.

మొబైల్‌ ‌రింగ్‌ అయితే మంగళ చూసింది. అవతల మోహన్‌.

‌విసుగ్గా ఫోన్‌ ఆన్‌ ‌చేసింది.

‘‘క్షేమంగా చేరావా? ఎలా ఉన్నావు?’’ ఫోన్‌లో పరామర్శలు.

సర్వమంగళకు సమాధానం చెప్పాలని అనిపించ లేదు..‘‘బాగున్నాను’’ అంది. ముక్తసరిగా.

తర్వాత కావ్య ఆ ఫోన్‌ అం‌దుకుని…‘‘అన్నయ్య గారూ.. సర్వమంగళ నా పక్కనే ఉంది. మా టిఫిన్లు అయిపోయాయి. ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. తర్వాత నిద్ర పోవడమే..’’ అంటుండగా సర్వమంగళ ఫోన్‌ అం‌దుకుని కట్‌ ‌చేసింది. ‘‘పరామర్శలు అయిపోయాయి కదా?’’ అంది.

కావ్య ఆమె వైపు అయోమయంగా చూసింది.

 — – – —-

ఉదయం లేచేసరికి సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి.

రేడియోలో నుంచి సుప్రభాతం వినిపోస్తోంది.

కావ్య ఇంటిముందు ముగ్గులు పెడుతోంది.

దూరంగా పాదులకు సోమేశ్వరరావు గోతి తవ్వుతున్నారు.

రామలక్ష్మి పైపుతో నీళ్లు పెడుతున్నది.

రాత్రి చీకటిలో సరిగ్గా చూడలేదు. ఇంటి చుట్టూ ప్రహారీ ఉంది.

లోపల వంకాయ, టొమాటొ, కొత్తిమీర మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయి. మరో మూల వివిధ రకాల పూల మొక్కలు, వాటిని ఆనుకుని గోంగూర, తోటకూర, పాలకూర పాదులు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నట్లు అర్థమైంది.

‘‘మీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇంత తొందరగా లేవడం ఆశ్చర్యం. మరో గంట పడుకోలేక పోయావా?’’ కావ్య నవ్వుతూ పలకరించింది.

‘‘అమ్మా మంగళా.. కాఫీ తాగుతావా? టీ పెట్టమంటావా?’’ రామలక్ష్మి గారు సర్వమంగళను చూసి దూరం నుంచి అడుగుతున్నారు.

తను ఇంకా బ్రెష్‌ ‌చేయలేదన్న విషయం గుర్తొచ్చి సర్వమంగళ సిగ్గు పడిపోయింది. గబగబా బాత్‌రూంలోకి పరుగెట్టింది.

బైటికి రాగానే కావ్య బ్రూ కాఫీ అందించింది.

‘‘ఇది నా కాఫీ కాదు, అత్తగారు కలిపింది. మామయ్య గారు నాలుగైదు సార్లు తాగుతారు. ఆయన కోసం ఫిల్టరు తీసి ఉంచుతారు..’’ అంది కావ్య.

‘‘కాఫీ చాలా రుచిగా, చిక్కగా ఉంది.’’

‘‘మామయ్య గారు ఉదయాన్నే లేచిన వెంటనే బజారుకు వెళ్లి పాల ప్యాకెట్‌ ‌తీసుకుని వచ్చి స్టవ్‌ ‌మీద పెట్టిన తర్వాత పొలం పనిలో పడతారు. ఆయన గారికి అత్తయగారు సాయం చేస్తారు. తర్వాత ఇద్దరూ కలిసి సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేసుకుంటారు. తర్వాత స్నానం చేసి ఇతరపనులు మొదలుపెడతారు.’’

‘‘చాలా సిస్టమేటిక్‌గా ఉంటున్నారే..’’ సర్వమంగళ అంది.

‘‘అవును. వారిద్దరు నిజంగా ఆది దంపతుల్లా ఉంటారు..’’

 — – – – —

‘‘ఒకే వాతావరణం, ఒకే పరిస్థితులు చూస్తుంటే నాకెందుకో విసుగ్గా అనిపిస్తోంది…’’ ఆరోజు ఆఫీసు నుంచి రాగానే మోహన్‌ అన్నాడు.

సర్వమంగళ ఆశ్చర్యపోయింది.

‘‘పెళ్లయి నాలుగేళ్లు కూడా పూర్తి కాకముందే మీకెందుకు అలా అనిపిస్తోంది. నాకు అర్థంకావడం లేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా మీరు బోర్‌ ‌కొడుతున్నారు..’’ ధైర్యం తెచ్చుకుని అంది.

భార్య మాటలు మోహన్‌ ‌తట్టుకోలేకపోయాడు.

‘‘సంపాదిస్తున్న భార్య మాట వినదని మా బామ్మ చెప్పే మాట నీ విషయంలో నిజం అనిపిస్తుంది..’’

‘‘సంపాదించడమే నాకు ఇబ్బంది అయి పోయింది. మీతో పాటు నేనూ ఉద్యోగం చేస్తున్నాను. ఉదయం నుంచి మీరెన్ని పనులు చేస్తారో అన్ని పనులూ చేస్తున్నాను. కానీ మీకు వంట చేసిపెట్టడం.. టిఫిన్‌ ‌సిద్ధం చేయడం వంటి పనులు అదనంగా చేయవలసి వస్తోంది. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నాకూ ఎవరైనా టీ అందిస్తే బాగుణ్ణు అని అనిపిస్తుంది.’’

‘‘నన్ను టీ చేసి అందించమంటావా?’’

‘‘ఏం.. తప్పేం ఉంది? ఒకరోజు మీరు టీ చేయొచ్చు, మరోరోజు నేను చేయొచ్చు. నేను వంట చేస్తే కూరగాయలు తరుగుతూ మీరు సాయం చేయవచ్చు. కలిసికట్టుగా పని చేసుకోవడంలో తప్పేముంది?’’

‘‘సర్వమంగళా.. ఎందుకో నీ ఆలోచనలు విడ్డూరంగా ఉన్నాయి. ఇలా ఆలోచించడం తప్పు అనిపించడం లేదా?’’

మోహన్‌ ‌మాటలు సర్వమంగళకు పీకల దాకా కోపం తెప్పించాయి.

ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఉప్మా చేసింది. తాను తిని కొంచెం మోహన్‌ ‌కోసం టేబుల్‌ ‌మీద పెట్టింది. ‘‘ఉప్మా తినండి..’’ అంది.

‘‘ఉప్మా నేను తిననని నీకు తెలుసు.. ఎందుకు చేసావు? నీకు కోపం వచ్చిన ప్రతిసారి నేను తినకూడదని ఉప్మా చేస్తుంటావు? ఉప్మా చేసిన ప్రతిరోజూ నేను కడుపు కాల్చుకుంటుంటాను. నీకు తెలుసు కదా?’’

‘‘నాకు నచ్చింది చేసుకుని తినే స్వేచ్ఛ కూడా నాకు లేదా?’’

‘‘సర్వమంగళా.. నీకు నా మీద ప్రేమ తగ్గి పోయింది. మొదట్లో ఉన్నట్లు ఉండటం లేదు. నీలో ఏదో అసంతృప్తి పేరుకుని పోయింది..’’ అన్నాడు మోహన్‌.

‌భర్త తనను బాగా అంచనా వేయగలిగాడని అనుకుంది.

‘‘ఎలమంచిలిలో ఉంటున్న కావ్య అనే ఫ్రెండ్‌ ‌తన దగ్గరకు రమ్మని చాలా రోజులుగా అడుగుతోంది. భర్త మిలట్రీలో ఉండడం వల్ల అత్తమామలతో కలిసి ఉంటోంది. వెళ్లాలని అనుకుంటున్నాను. ఏమంటారు?’’

మోహన్‌ ఏమీ మాట్లాడలేదు. తర్వాత.. ‘‘కొద్ది రోజులు దూరంగా ఉండటం కూడా మంచిదేమో. ఒకరి విలువ మరొకరికి తెలుస్తుంది. నువ్వు కావ్య ఇంటికి వెళ్లాలంటే నాకు అభ్యంతరం లేదు. వారం, పది రోజులుండి రా..’’ అన్నాడు మోహన్‌.

‌వెంటనే కావ్యకు ఫోన్‌ ‌చేసింది. మోహన్‌తో జరిగిన వాదోపవాదాలు చెప్పింది. ఏ ట్రైన్‌లో రావాలి? ఎక్కడ దిగాలి? వంటి విషయాలు ఫోన్‌లోనే వాకబు చేసింది.

‘‘పెళ్లి అయిన నాలుగేళ్లకే నువ్విలా అయిపోతే ఎలా? మా అత్తయ్య, మామయ్య పెళ్లయి యాభయ్యేళ్లు దాటాయి కాని కొత్తగా పెళ్లయిన జంటలా ఉంటారు. నువ్వు మా ఇంటికి రావడం బాగుంటుంది. వెంటనే బయల్దేరు.’’ అంది కావ్య.

సర్వమంగళ అలా ఎలమంచిలి వచ్చింది.

కావ్య దగ్గరికి వచ్చి వారం రోజులు అయిపోయింది.

రోజూ కబుర్లు చెప్పుకోవడం, రామలక్ష్మికి పనుల్లో సాయం చేయడం, ఆ భార్యాభర్తలిద్దర్ని గమనించడం నిత్యకృత్యం అయిపోయింది.

తను వచ్చిన వారం రోజుల్లో వారిద్దరు ఒకర్నొకరు పల్లెత్తు మాట అనుకున్నట్లు చూడలేదు. రోజంతా కలిసికట్టుగా, ఆనందంగా ప్రతి పనిని వంతులవారిగా చేయడం సర్వమంగళకు ఎంతో ముచ్చట వేసేది.

‘‘అత్తయ్య గారూ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట కదా?’’ రామలక్ష్మి ఒంటరిగా ఉన్నప్పుడు అడిగింది సర్వమంగళ.

జవాబు చెప్పకుండా ముసిముసి నవ్వులు నవ్వింది.

‘‘కావ్య చెప్పిందా?’’

సర్వమంగళ అవునన్నట్లు తలాడించింది.

‘‘ఎప్పుడో చాలా కాలం కిందటి సంగతి.. మొదటి చూపులోనే ఒకరంటే ఒకరికి నచ్చేసాం.. పెళ్లయి పిల్లలు పుట్టినా మా మధ్య ప్రేమ తరిగిపోలేదు పైగా పెరిగిపోయింది. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవిస్తున్నాం. నేను ఆయన్ని అర్థం చేసుకున్నాను. ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇద్దరం విలవిల్లాడి పోతాం. ఇన్నాళ్ల జీవితంలో మాకు గొడవలెప్పుడూ రాలేదు. మాట పట్టింపులు వచ్చినా వెంటనే కలిసిపోతాం. ఒక్కరోజు ఆయనతో మాట్లాడకుండా నేను ఉండలేదు. నా మాట లేకుండా ఆయన కూడా ఉండలేరు.’’ చెప్పింది రామలక్ష్మి

‘‘అత్తయ్య గారూ మీరు గ్రేట్‌..’’

‌రామలక్ష్మి మరోసారి చిన్నగా నవ్వుకుంది.

‘‘మీకెప్పుడూ సోమేశ్వరరావు గారు బోర్‌ అనిపించలేదా?’’

‘‘భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గకుండా చూసుకోవడం ఒక కళ. ఏళ్లు గడుస్తుంటే పిల్లలు, సంసారం, బాధ్యతలు, అనారోగ్యం వంటివి ఉంటాయి. కానీ ఆయన నాకు మాత్రమే అర్థమయ్యే చూపు విసురుతారు…’’ అంది.

సర్వమంగళ ఆమెకు దగ్గరగా జరిగి కూర్చుంది.

‘‘మాలో ప్రతి ఊహా రెండోవారికి తెలుసు. ఎప్పుడో ఎక్కడో ఏకాంతంలో కూర్చుని మాట్లాడుకున్న మధుర క్షణాలు మా ప్రేమబంధం మాసిపోకుండా, వెలసిపోకుండా కాపాడుతూనే ఉంటాయి. కొద్దిరోజుల ఎడబాటు తర్వాత కలుసుకున్న ప్రతిసారి అప్పుడే మొదటిసారి కలుసుకున్న అనుభూతి, ఆయన వేళ్లు నాకు తగిలితే ఎప్పుడో పెళ్లయిన మొదట్లో కలుసుకున్నప్పటి అనుభూతి కలుగుతుంది. మా ప్రేమ నలగని పువ్వు. భార్యభర్తల మధ్య ప్రేమ అలాగే ఉండాలి..’’ నెమ్మదిగా చెప్పింది.

సర్వమంగళకు చాలా వరకు మబ్బులు విడిపోయాయి.

బెంగళూరుకు ఫ్లైట్‌ ‌టికెట్‌ ‌బుక్‌ ‌చేసింది. తర్వాత కావ్య దగ్గరికి వచ్చి ‘‘కావ్య.. ఎలమంచిలి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు టాక్సీ మాట్లాడాలి. సాయంత్రం వెళ్లిపోతున్నాను..’’ అంది.

‘‘మరోవారం ఉంటావనుకున్నాను. ఇంత సడెన్‌గా వెళ్లిపోతున్నావు?’’

ఆమెకు ఏమీ జవాబు చెప్పకుండా మోహన్‌కు ఫోన్‌ ‌చేసింది..‘‘ఇంటికి వచ్చేస్తున్నాను. మీరు ఆఫీసు నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉంటాను.. ఈరోజు నుంచి మన ఇంట్లో ఉప్మా టిఫిన్‌ ‌బంద్‌. ‌మీరు తినని ఉప్మా నేనూ తినను.. చేయను..’’ అంది.

కావ్య ఆమె వైపు అయోమయంగా చూస్తుండిపోయింది.

About Author

By editor

Twitter
YOUTUBE