సామాజిక సమరసతా వేదిక కార్యక్రమాలను రూపొందించుకొని నిర్వహించటంలో ఏప్రిల్‌ ‌మాసం చాలా కీలకమైనది. ప్రముఖ సామాజిక సంస్కర్తలు, అణగారిన వర్గాలను పైకి తీసికొని రావడానికి నిరంతర కృషి సల్పినవారునైన మహాత్మాజ్యోతిరావుఫులే, బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌, ‌బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌ ‌గార్ల జయంతులు ఈ నెలలోనే వస్తాయి. ముగ్గురి జయంతులు వేర్వేరుగా జరుపుకోవటం కాక, ఒకే వేదికపై ముగ్గురినీ ఒక్కరోజే స్మరించుకోవటం ఉపయుక్తంగా ఉంటుంది. 5 ఏప్రిల్‌ ‌బాబూ జగజ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి, 11 ఏప్రిల్‌ ‌మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి, 14 ఏప్రిల్‌ ‌డా।। అంబేడ్కర్‌ ‌జయంతి. ఈ సంవత్సరం మహావీర్‌ ‌జయంతి 8 ఏప్రిల్‌ ‌రావటం మరో విశేషం. మహావీరుడు 2500 సంవత్సరాల క్రితమే హిందూసమాజంలోని కుల అసమానతలను వ్యతిరేకించిన వ్యక్తి.

సామాజిక సమానతకై ప్రధానంగా పై ముగ్గురు మహాపురుషులు చేసిన కృషిని సమాజం ముందుంచవలసి ఉంది. వారు హిందూ సమాజంలో నెలకొని ఉన్న కుల అసమానతలు, అంటరానితనం దూరం చేసి ఆరోగ్యవంతమైన దురాచారాలులేని ఆధునిక హిందూసమాజం ఏర్పడటంకోసం కృషిచేశారు. కార్మిక ఉద్యమంలో ముగ్గురు కీలక పాత్ర వహించారు.

సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోరావు ఫులే

మహాత్మా జ్యోతిరావు ఫులే 11 ఏప్రిల్‌ 1827‌లో జన్మించారు. 28 నవంబర్‌ 1890‌లో తనువును చాలించారు. వీరి జీవనకాలంలోనే 1857  స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై మరింత బిగుసుకుంది. అనంత లక్ష్మణ కాన్హరే, వాసుదేవ బలవంత ఫడ్కే వంటి విప్లవకారులు బలిదానాలు చేసినా, సాధారణ ప్రజలలో స్వాతంత్ర ఇచ్ఛ బైటపడని కాలం అది. ఆంగ్లేయుల పాలనే చాలా బాగుందని భారతీయ విద్యావంతులు శ్లాఘిస్తున్న కాలం అది. మహరాష్ట్ర అనేక సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లు. శూద్రులుగా భావింపబడే పువ్వులు అమ్ముకునే కులంలో జ్యోతిరావు జన్మించారు. 13వ ఏటనే వివాహం అయినది. తండ్రి సహకారంతో వివాహానంతరం చదువును కొనసాగించారు. జాన్‌స్టువర్ట్ ‌మిల్‌ ‌వ్రాసిన ‘ఆన్‌ ‌లిబర్టీ’, థామస్‌ ‌పెయిన్‌ ‌వ్రాసిన ‘ది డిగ్నిటీ ఆఫ్‌ ‌మాన్‌’ అనే గ్రంథాలు, జార్జి వాషింగ్టన్‌, ‌శివాజీల జీవితచరిత్రలు జ్యోతిరావు జీవనంపై చెరగని ముద్రవేశాయి. ఆనాడు హిందూ సమాజంపై బ్రాహ్మణ (పురోహిత) వర్గ ఆధిపత్యానికి వ్యతిరేకంగా శూద్ర, అతి శూద్ర (అశ్పృశ్య) వర్గాల సమానతకోసం ఉన్నతికోసం కృషిచేశారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అని గుర్తించి శూద్ర, అతి శూద్ర వర్గాల ఉన్నతికోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించటం కోసం కృషిచేశారు. స్వయంగా తన భార్య సావిత్రిబాయి చేత అతిశూద్ర మహిళలకోసం పాఠశాలను ప్రారంభింపచేశారు. తన ఇంటిలోని బావిలో అతి శూద్రులు నీటిని తోడు కోవటంకోసం అవకాశం కల్పించిన మహా పురుషుడు. హంటర్‌ ‌కమీషనర్‌కు నివేదిక సమర్పిస్తూ – శూద్ర, అతిశూద్ర మహిళల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించా లనీ, ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యమివ్వాలనీ, విద్యలో ఉపాధికల్పన, నైతిక విలువలు, ఆరోగ్య అంశాలు ఉండాలని, రైతు వర్గాల నుండి ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని ఆనాడే వారు పేర్కొన్నారు.

బాల్య వివాహాలను, వితంతు స్త్రీలకు శిరోముండనం వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. బ్రాహ్మణ పూజారి వర్గ ఆధిపత్యానికి నిరసనగా 24 డిసెంబర్‌ 1873‌లో సత్యశోధక సమాజాన్ని ప్రారంభించారు. ‘‘మనందరం దేవుని సంతానం. దేవుని దృష్టిలో మనందరం సమానం. ఈ భేదాలు మనం సృష్టించుకున్నవే. దేవునికి, మనిషికి మధ్య మరొక మధ్యవర్తి అవసరం లేదు. నిర్బంధ విద్య, స్వదేశీ వస్తు వినియోగం ఆచరించాలి. మూఢాచారాలను వ్యతిరేకించాలి. మతపరమైన శుభ, అశుభ కార్యాలు, వివాహం తక్కువ ఖర్చుతో చేయాలి.’’ – ఇవి ఆయన ప్రారంభించిన సత్యశోధక సమాజపు ముఖ్య లక్ష్యాలు. బ్రాహ్మణ పూజారి లేకుండానే వివాహాలు చేయించాడు. మరాఠి భాషలో వివాహం చేయించే విధానాన్ని రూపొందింప చేశారు.

5 సెప్టెంబర్‌ 1875‌న ఆర్యసమాజ ప్రచార కార్యక్రమ భాగంలో స్వామి దయానంద సరస్వతి పూనాకు వచ్చినపుడు వారి కార్యక్రమం ఎలాంటి విఘ్నం లేకుండా విజయవంతం చేసిన విశాల హృదయుడు జ్యోతిరావు. నిమ్నవర్గాలను సైతం తనపాలనలో సముచిత స్థానం కల్పించిన శివాజి జీవితాన్ని కొనియాడుతూ శివాజి చరిత్ర పై కవితలతో పుస్తకం రాశారు. గుర్తింపులేకుండా పడియున్న శివాజీ సమాధిని బైటకుతీసి తన సొంత ఖర్చుతో దర్శనీయ స్థలంగా చేశారు. మీ ఆంగ్లేయ పరిపాలనాకాలంలో మా సామాజిక పరిస్థితుల్లో రైతుల పరిస్థితుల్లో ఏమి మంచి మార్పు రాలేదంటూ నిర్భయంగా 1888లో బ్రిటీషు యువరాజు ముందు ప్రసంగించిన ధీరోదాత్తుడు జ్యోతిరావు. అందరూ ఆడంబరంగా సూటు బూటు ధరించివచ్చిన బ్రిటీషు యువరాజు గౌర వార్ధపు విందుకు ఒక పల్లెటూరి పేదరైతుగా ధోవతి, అంగీ, తలపాగా, గొంగళి ధరించి వచ్చిన సాహసి.

సంతానం లేదు కనుక మరో వివాహం చేసుకోమని తండ్రి, కుటుంబసభ్యులు ఎంత వత్తిడి చేసిన మరో వివాహానికి అంగీకరించలేదు. పిల్లలు లేకపోవడానికి భార్యే కారణం ఎందుకు కావాలి ? భర్తలో కూడా లోపం ఉండచ్చుకదా! అని ఎదురు ప్రశ్న వేశారు. కాశీ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ భర్తను కోల్పోయి గర్భవతిగా ఉండటం తటస్థించింది. ఆమెను జ్యోతిరావు చేరదీసి రక్షణ కల్పించాడు. ఒక పిల్లవాడిని కని ఆమె చనిపోయింది. ఆ బాలుడికి యశ్వంత్‌ అని నామకరణం చేసి ఆ బాలుడినే దత్తపుత్రుడుగా స్వీకరించిన విశాలహృదయుడు జ్యోతిరావు ఫులే. వారు మంచి కవి, రచయిత, వక్త. అనేకమంది అనుయాయులను నిర్మాణంచేసుకుని తన తరవాతకూడా తను ప్రారంభించిన సామాజిక ఉద్యమం కొనసాగేట్లు కృషిచేసిన ఉద్యమకారుడు ఆయన.

తాను నడుపుతున్న పాఠశాలలో పనిచేస్తున్న ఒక అతిశూద్ర ఉపాధ్యాయుడు పేదరికం కారణంగా క్రైస్తవమతం స్వీకరిస్తున్నాడని తెలిసి, ఆ ఉపాధ్యాయుని జీతంపెంచి క్రైస్తవ మతమార్పిడి సరికాదని నచ్చచెప్పాడు. హిందూమతంలోని దురాచారాలు లోపాలకు వ్యతిరేకంగా జీవితాంతం ఉద్యమించిన క్రైస్తవ మత మార్పిడి సమస్యకు పరిష్కారం కాదని సత్యశోధసమాజం ద్వారా పురోహిత వర్గం అవసరంలేని నూతన సమ సమాజం కోసం కృషిచేశారు. వారి రచనలలో ఏకమయ (ఏకాత్మత), ఏకమయలోక (ఏకాత్మరాష్ట్ర), శబ్దప్రయోగాలు ఎక్కువగా చేశారు. తాను వ్రాసే ఉత్తరాలపైన ‘సత్యమేవ జయతే’ అని వ్రాసేవారు. జీవిత చరమాంకంలో అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురి అయ్యారు. ప్రజలచే మహాత్మునిగా గౌరవించబడ్డారు. సామాజిక సమతా ఉద్యమానికి మహాత్మా జ్యోతిరావు ఫులేను సమకాలిన యుగంలో మొదటి వ్యక్తిగా పేర్కొనాలి.

సామాజిక సమానత్వాన్ని రాజ్యాంగబద్ధం చేసిన డా।। అంబేడ్కర్‌

‌భీమ్‌రావ్‌ 14 ఏ‌ప్రిల్‌ 1891‌లో జన్మించారు. 6 డిసెంబర్‌ 1956‌లో తనువు చాలించారు. తండ్రి రామ్‌ ‌జీ సక్పాల్‌ ‌మిలటరీలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. జ్యోతిబాఫులే, కబీర్‌ ‌దాస్‌ల ప్రభావం తండ్రినుండి భీమ్‌రావు సంక్ర మించింది. తండ్రి ప్రోత్సాహంతో బరోడా మహరాజ్‌ ఆర్ధిక సహకారంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివారు. ఆర్ధిక శాస్త్రవేత్త కావాలన్నది వారికోరిక. సామాజిక శాస్త్రం, చరిత్ర, ఆర్ధిక శాస్త్రం, న్యాయ శాస్త్రం ఇలా ఎన్నో అంశాలలో ఉన్నత చదువులను పూర్తిచేశారు. బరోడా సంస్థానంలో పొందిన కులవివక్ష, అంటరానితనపు అవమానాలతో నిమ్నవర్గాల ఉన్నతికై సామాజిక సమతకై జీవితాన్ని సమర్పించుకున్నారు. మహాడ్‌లో మంచినీటి చెఱువు పోరాటం, నాసిక్‌లో కాలారామ్‌ ‌మందిర సత్యాగ్రహం వంటి సామాజిక సమతా ఉద్యమాలను నిర్వహించారు. ప్రజలను మేల్కొల్పటంకోసం మూకనాయక్‌ ‌వంటి పత్రికలను నిర్వహించారు. ఆశించిన మేరకు హిందూ సమాజం నుండి సహకారం లభించలేదు. నిరాశ, నిస్పృహలతో ‘‘నేను హిందువుగా పుట్టాను, కాని హిందువుగా చావను, అసమానతలు లేని మతాన్ని స్వీకరిస్తాను’’ అని 1933లో ప్రకటించారు. వారి ప్రకటన హిందూ సమాజంలో ఒక పెద్ద దుమారాన్ని లేపింది. వైస్రాయ్‌ ‌మంత్రి మండలిలో కార్మికశాఖామంత్రిగా పనిచేసి అనేక చారిత్రిక నిర్ణయాలను తీసుకున్నారు. ఒక మేధావిగా, విద్యావంతునిగా, ఉద్యమకారునిగా, పేదకార్మికుల ఉన్నతి కోసం పనిచేసిన పరి పాలనాదక్షునిగా పేరు తెచ్చుకున్నారు. ‘‘విద్యా వంతులుకండి, సమైక్యమవండి, ఉద్యమించండి’’ అని నిమ్నవర్గాలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. అనేక విద్యా సంస్థలను నెలకొల్పి నడిపించారు.

స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగసభలో తను ఊహించని విధంగా డ్రాఫ్టింగ్‌ ‌కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగాన్ని తయారు చేయటంలో తన అపారమైన ప్రతిభాపాటవాలను వినియోగించారు. బలమైన కేంద్ర ప్రభుత్వం, అమెరికా, ఇంగ్లండు నుండి సమ్మిళితంగా స్వీకరించిన పార్లమెంటరీ ప్రజాసంస్థ, ప్రజలందరికి రాజకీయంగా, సామాజికంగా సమానత్వం, శతాబ్దాలుగా సామాజిక దురాచారాలకు గురైన షెడ్యూలు కులాల, తెగల, ప్రజల సమగ్రాభివృద్ధికోసం విద్య, ప్రభుత్వోద్యోగాలు, రాజకీయరంగాలలో రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, ఒకే రాజ్యం నుండి ఒకే రాష్ట్రం (నేషన్‌) ‌వైపు, భారత్‌ను తీసుకు వెళ్లటంలో… ఇలా అనేక అంశాలు రాజ్యాంగంలో పొందుపరచారు. రాజ్యాంగ సభలో ఉన్న ఆనాటి సమాజపు జాతీయ నాయకత్వం, భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సమ సమాజంతో కూడిన బలమైన భారతను నిర్మించడానికి అవసరమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించటం డా।। ఆంబేడ్కర్‌ ‌జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం.

నా స్వభావం దృష్టా నేను రాజకీయ నాయకుడ్ని కాదు, ఉద్యమకారుణ్ణి కాదు, సమాజ అవసరాల కోసం నేను ఉద్యమించాల్సి వచ్చింది. కుటుంబ పరంగా నాకు లభించింది ధార్మిక ప్రవృత్తి. కొందరు పెద్దలకు ఇచ్చిన మాటమేరకు హిందూ సమాజానికి తక్కువ హాని కలిగించే రీతిలో నేను హిందుమతాన్ని వదిలి బౌద్ధధర్మాన్ని స్వీకరిస్తున్నాను. విదేశీ క్రైస్తవ, ఇస్లాం మతాలను స్వీకరించదలచుకోలేదు అని 1956లో బౌద్ధధర్మ స్వీకరణ సందర్భంగా పేర్కొన్నారు. 1956లో షెడ్యూల్డు కులాల ఫెడరేషనను రద్దుచేసి రిపబ్లికన్‌ ‌పార్టీని ప్రారం భించారు. మార్కిజం కంటే బౌద్ధధర్మ జీవనవిధానం సమగ్రమైనదని 1956లో ప్రపంచ బౌద్ధధర్మ సమ్మేళనంలో ప్రసంగించారు. దేశ విభజనతో వేర్పాటుభావం కలిగిన ముస్లింలను వదులుకోవటం భారతదేశానికి, ముస్లిం సమాజానికి మంచిదని సలహా ఇచ్చారు. డా।। ఆంబేడ్కర్‌ ‌ప్రపంచంలోనే ఉన్నత స్థాయి మేధావి, పండితుడు. అనేక గ్రంథాల రచయిత, ఉద్యమకారుడు, భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప జాతీయ నాయకుడు.

గొప్ప పరిపాలనాదక్షుడు బాబు జగ్జీవన్‌ ‌రామ్‌

‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ 5 ఏ‌ప్రిల్‌ 1908‌లో జన్మించారు. 6 జులై 1986 తనువును చాలించారు. పండిత మదనమోహన మాలవ్య ప్రోత్సాహంతో, బిర్లా ఆర్థిక సహకారంతో బెనారస్‌ ‌విశ్వ విద్యాలయంలో ఇంటర్‌ ‌పూర్తిచేశారు. 1922లో అర్రా టౌన్‌ ‌స్కూల్‌లో చదువుతున్న రోజులలో హిందువులకు, మహమ్మదీయులకు మంచినీటి కుండలు వేర్వేరుగా ఉండేవి. జగ్జీవన్‌ ‌రామ్‌ ‌హిందువుల మంచినీటి కుండనుండి నీరు తీసుకోవటం భరించలేని వారు కొందరు ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్‌ అస్పృశ్య కులాలవారికని మూడవ మంచినీటి కుండ పెట్టించాడు. జగ్జీవన్‌ ‌రామ్‌ ‌దానినుండి నీటిని తీసుకొనడానికి నిరాకరించటమే గాక, రెండుసార్లు అలా పెట్టిన కుండలను పగులగొట్టాడు. అలా తాను హిందువులకు అభిన్నమైన వాడినని గర్వంగా ప్రకటించాడు.

కలకత్తాలో డిగ్రీ చదివారు. ఆనాటి బెంగాల్‌లోని సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌డా।। బి.సి. రాయ్‌, ‌ప్రపుల్లచంద్ర ఘోష్‌ ‌వంటి సామాజిక రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం లభించింది. 1929 లాహోర్‌ ‌కాంగ్రెస్‌ ‌సభలకు హాజరయ్యారు. 1930 నుండి నిమ్న వర్గాల ఉద్యమాలలో పాల్గొన్నారు. తాను స్వయంగా కబీర్పంథీ అయినప్పటికీ, అఖిలభారత రవిదాస్‌ ‌మహాసభను ఏర్పరచి, కలకత్తా కేంద్రంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒక ప్రక్క నిమ్నవర్గాల ఉద్యమాలలో పాల్గొంటూనే మరొకప్రక్క స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 27 మే 1936లో పాట్నాలో సామూహికంగా షెడ్యూలు కులాలవారిని మతం మార్చే క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలను బహిరంగంగా వ్యతిరేకించారు. నిమ్నకులాల లీగ్‌కు జాతీయ అధ్యక్షుడుగా చాలాకాలం పనిచేశారు. 25 ఆగస్టు 1945లో ఏర్పడిన మంత్రివర్గంలో బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌కార్మికశాఖ మంత్రిగా చేరారు. భారత రాజ్యాంగసభలో రాజ్యాంగ సభ సభ్యునిగా చురుకైన పాత్రను పోషించారు.

1946నుండి 1952వరకు కార్మికశాఖ మంత్రిగా, 1952నుండి 1956వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా, 1956-57 రవాణాశాఖ మంత్రిగా, 1957 – 62 రైల్వేశాఖ మంత్రిగా, 1967-70ల మధ్య ఆహార, వ్యవసాయశాఖా మంత్రిగా, 1970 రక్షణ శాఖామంత్రిగా వివిధ మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఏ మంత్రిపదవి ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత బాబు జగ్జీవనరామ్‌ది. ఒక మంచి పరిపాలనాదక్షుడిగా వారు పేరు తెచ్చు కున్నారు. భారత రాజ్యాంగ సభ సభ్యునిగా, తరువాత కేంద్రమంత్రిగా పరిపాలనలో ఉంటూ నిమ్నవర్గాల ప్రగతికోసం అవసరమైన నిర్ణయాలను ప్రభుత్వం చేత చేయించటంలో వారు ఎప్పుడూ చురుకైన పాత్రను పోషించారు.

దేశంలో హేమాహేమీలు సైతం ఎన్నికలలో ఓడిపోయిన సందర్భాలున్నాయి. 1936 నుండి 1986వరకు మరణించేంతవరకు ఒకే నియోజకవర్గం నుండి 50 సంవ్సరాలపాటు తిరుగులేకుండా నిరంతరంగా ఎన్నికైన ఘనత బాబు జగ్జీవన్‌ ‌రామ్‌కు ఉంది. అత్యయిక పరిస్థితిని ఉప సంహరించు కోమంటు ప్రధాని ఇందిరాగాంధికి 1 ఫిబ్రవరి 1977లో సలహా ఇచ్చారు. ఆమె జగ్జీవన్‌రామ్‌ ‌సలహాను పెడచెవిన పెట్టింది. మరురోజే 2 ఫిబ్రవరిన కేంద్ర మంత్రిమండలికి రాజీనామా చేశారు. తరువాత జనతాపార్టీ హయాంలో రక్షణశాఖా మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు. 1980లో ప్రతిపక్ష నాయకునిగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉంటూనే జులై 6 1986న తనువు చాలించారు. ‘‘అంటరానితనం నిర్మూలనకు హిందూమతాన్ని వదిలి వెళ్లటంకాని, మతమార్పిడి కాని ఏమాత్రం మార్గం కాదని’’ బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌పదే పదే షెడ్యూల్డు కులాలనుద్దేశించి స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దేశ ప్రగతిలోనే తమ ప్రగతి, దేశం విముక్తిలోనే తమ విముక్తి, దేశం ఉద్దరణలోనే తమ ఉద్దరణ ఇమిడి ఉందని హరిజనులు గుర్తించాలని బాబూజీ మొదటినుండి చివరివరకూ తన సోదర ప్రజానీకానికి ఉద్బోధిస్తుండే వారు.

మహాత్మా జ్యోతిరావు ఫులే కాలంనాడు చదువుకున్న ఉన్నత స్థానంలో ఉన్న షెడ్యూల్డు కులాలవారులేరు. డా।। అంబేడ్కర్‌ ‌కాలంనాటికి కొద్దిమంది ఉన్నత చదువులు చదివి సామాజిక రాజకీయ రంగాలలో నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ఒకప్రక్క నిమ్నవర్గాల అభివృద్ధికోసం కృషిచేస్తూనే అన్ని వర్గాల ప్రజలతో తత్సంబంధాలను కొనసాగిస్తూ తన ప్రతిభాపాటవాల ద్వారా అందరినుండి గుర్తింపు పొందుతూ ఒక సమర్థవంతుడైన పరిపాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్నారు.

– కె. శ్యామ్‌‌ప్రసాద్‌, ‌జాతీయ కన్వీనర్‌, ‌సామాజిక సమరసత

About Author

By editor

Twitter
YOUTUBE