మట్టిపనీ, పొలం పనులూ చేస్తూ భూమిని నమ్ముకున్న రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలకేమాత్రం తీసిపోరు. కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తల ధోరణితో రైతులు అయోమయానికి గురయి నష్టపోతున్నారు. సాగు పద్ధతుల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలా,వద్దా అనే సందిగ్ధావస్థకు లోనవుతున్నారు. వ్యవసాయమంటే నాకూ ఆసక్తే. చిన్నతనంలో కొంతమేర పొలం పనులు చేశాను. నాగలి పట్టి పొలం దున్నాను. ఎడ్లబండి నడిపాను. పాదులు తవ్వి కూరగాయలు పండించాను. చదువుకుంటూనే ఆసక్తిగా ఈ పనులన్నీ చేశాను. మా నాన్నగారు, తాతగారు న్యాయవాదులు. న్యాయవాదవృత్తిని కొనసాగిస్తూనే పొలం పనులు చేసేవారు. పంటలు పండించటం వంటి పనుల్లో నాకు సంతృప్తి కలుగుతుంది.

దేశం దాటి వెళ్లే అవకాశం దొరికినప్పుడు నేను తొలిసారిగా ఇంగ్లండ్‌ ‌వెళ్లాను. అక్కడి నగరాల్లోని బజారులలో తిరుగుతున్నప్పుడు నాకు అర్థమయింది ఏమిటంటే- దొరకని వస్తువంటూ లేదు. కానీ వ్యవసాయోత్పత్తులు పెద్దగా కనపడలేదు. అక్కడ వ్యవసాయం పెద్దగా లేదేమోనని అనుకున్నాను. తర్వాత గ్రామీణ ప్రాంతాల వైపుకెళ్లాను. విశాలమైన వ్యవసాయ భూములన్నీ ఖాళీగా, పచ్చదనం లేకుండా కనిపించాయి. ఓ రైతుని అడిగాను, విషయమేమిటని! ఆ రైతు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి లోను చేసింది. కోత పని ముగిశాక ప్రతి మూడేళ్లకోసారి, రెండేళ్ల పాటు తప్పనిసరిగా వ్యవసాయ భూమికి విరామం ఇవ్వాలని అక్కడ ఓ చట్టం ఉంది. అందుకే ఖాళీగా వదిలేశామన్నాడాయన. కనీసం ఓ అర్ధ ఎకరం పశువుల మేత కోసం ఉపయోగించుకోవచ్చు కదా అని అడిగాను. చట్టం దానికి ఒప్పుకోదని జవాబిచ్చాడు. అంతేకాదు, రసాయనిక ఎరువులు అధికంగా ఉపయోగించటం మూలాన భూమికి రెండేళ్ల విశ్రాంతిని చట్టం తప్పనిసరి చేసిందని చెప్పాడు.

తరువాత ఆఫ్రికా వెళ్లాను. కేవలం నాలుగు వందల ఏళ్ల నుండి అక్కడ వ్యవసాయం జరుగుతోంది. అంతకు ముందు వ్యవసాయక్షేత్రాలన్నీ బీడు పడ్డ మైదానాలే. నాలుగు వందల ఏళ్ల నుండి అక్కడ వ్యవసాయం జరుగుతోందని చెప్పాను కదా! అయినా పంటలు పుష్కలంగా, వ్యవసాయోత్పత్తులు పెద్ద పెద్దగా, తాజాగా కనబడ్డాయి. కానీ అవి ఏ మాత్రం రుచీపచీ లేనివి. అక్కడ నేను భోజనం చేశాను. వంకాయ కూర తిన్నా వంకాయ రుచి, గోబీ తిన్నా గోబీ రుచి కాస్త కూడా లేదు. కారణం- విపరీతంగా రసాయనిక ఎరువులు ఉపయోగించటం.

మన దేశ వ్యవసాయోత్పత్తుల్లో ఉండే రుచి ఆఫ్రికా వ్యవసాయ ఉత్పత్తుల్లో లేదు. అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు వాడినప్పుడు భూమికి విపరీతంగా నీరు కావాలి. దాంతో రుచి పోతుంది.

అంతదాకా ఎందుకు? గతంలో మనం తిన్న ఆహారధాన్యాల్లోని రుచిని ఇవాళ మన పిల్లలు ఆస్వాదించే అవకాశం ఉందా? మనదేశంలో గతంలో ఉన్న వ్యవసాయ పద్ధతులు ఇప్పుడున్నాయా? మన గత వ్యవసాయ పద్ధతులు ఎంత గొప్పగా ఉండేవి! వర్షాకా ఆరంభంలో విత్తనాలు చల్లి, వర్షాలు ఆగాక పంట కోసుకొని వెళ్లేవారం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చాక ఇక్కడి సారవంతమైన భూమి దాదాపు బంజరయిపోయింది. రసాయనిక ఎరువుల మూలంగా భూసారమంతా దెబ్బ తింటోంది.

పంజాబ్‌లో ప్రత్యేకంగా కేన్సర్‌ ‌రైలు నడుస్తోంది. రసాయనిక ఎరువుల కారణంగా భూమిలో, ఆహారంలో, జలంలో కాలుష్యం విపరీతంగా చేరింది. ఈ కారణంగా కేన్సర్‌ ‌లాంటి జబ్బులు మనుషుల్ని కబళిస్తున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అలాంటి జబ్బులు పెరిగిపోతూనే ఉన్నాయి.

నాగ్‌పూర్‌ ‌దగ్గర దేవలాపూర్‌లో ఓ గోశాల ఉంది. గో ఆధారిత వస్తువుల ద్వారా మనిషికి ఆరోగ్యాన్ని చేకూర్చేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. గో పంచితంతో కొనసాగుతున్న ప్రయోగాలు అద్భుతం. పేటెంట్‌ ‌సాధనకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు వారు. గోశాల నిర్వాహకులు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. ప్రయోగాల గూర్చి వివరిస్తూ నన్ను ఓ మామిడిచెట్టు కిందకు తీసుకువెళ్లారు. సీజన్‌ ‌కాదు కాబట్టి కాయలు లేవు. చెట్టు ఆకు తుంచి రుచి చూడమన్నారు నిర్వాహకులు. ఓ ఆకు తుంచి నమిలాను. ఆశ్చర్యం. నోరంతా మామిడిపళ్ల రుచితో నిండిపోయింది. ఆ తరవాత అక్కడే భోజనం చేశాను. వడ్డించిన పప్పు ఎంత రుచికరంగా ఉన్నదో! నా చిన్నప్పుడు కూడా నేను అంత రుచికరమైన పప్పు తినలేదు. పప్పుకి అంత రుచి ఎలా వచ్చిందని అడిగాను? గో ఆధారిత వ్యవసాయం చేస్తామనీ, రసాయనిక ఎరువులు ఎంత మాత్రం ఉపయోగించటం లేదనీ చెప్పారు. గో ఆధారిత వస్తువులనే ఎరువులుగా వాడటం వల్ల ధాన్యాలు రుచికరంగా ఉంటున్నాయని కూడా చెప్పారు.

ముందు నేను మిమ్మల్ని పెద్దన్నలని సంబోధిం చాను. జ్ఞానంలో మీరంతా గొప్పవారు కనుకనే అలా సంబోధించాను. నేను కేవలం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. పశువులకు చికిత్స చేసే డాక్టర్ని మాత్రమే. అయితే, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివి, బయటి ప్రపంచంలో అడుగెట్టిన విద్యార్థి జ్ఞానం కన్నా, పొలంలో దిగి పంట పండించే రైతుకున్న జ్ఞానమే గొప్పదని భావిస్తాను నేను. గతంలో మనకు యూనివర్సిటీలు లేవు, శాస్త్రవేత్తలూ లేరు కదా! వ్యవసాయానికి సంబంధించి మన రైతులే మన శాస్త్రవేత్తలు. వారి పొలాలే ప్రయోగశాలలు. వేల సంవత్సరాలుగా మన దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ విధానానికి మన రైతులే శాస్త్రవేత్తలు కదా! సేంద్రియ పద్ధతుల్లో పుష్కలంగా పండించారు కదా! పది వేల ఏళ్లు కొనసాగించినప్పటికీ సేంద్రియ సాగు విధానంతో వ్యవసాయ భూమి ఎన్నడూ బీడు పడలేదు కదా! మన ప్రాచీన సేంద్రియ సాగుతోనే వారు పలురకాల వరి ధాన్యాలను ఆనాడే పండించారు కదా! కనుక మనం ఇప్పటికైనా మన ప్రాచీన సేంద్రియ సాగు విధానం వైపు మరలాల్సిన అవసరం ఉంది. ఆధునిక వ్యవసాయ విధానంలోని ప్రతి అంశాన్నీ మనం స్వీకరించాల్సిన అవసరం లేదు. మన ప్రాచీన సాగు విధానం తోనే ఎక్కువగా లాభాలు చేకూరుతాయి, తక్కువ పెట్టుబడి ఖర్చుతో హెచ్చు లాభాలు పొందవచ్చు.

 దైనందిన సేంద్రియ వ్యవసాయ విధానంలో ఏ మాత్రం ఖర్చు ఉండదని ఒక వక్త చెప్పారు. భోపాల్‌లో వారికో వ్యాపార కార్యాలయముంది. అది నాలుగు స్తంభాలతో కూడిన పెద్ద అరుగు. దానిపై అంతే ఎత్తయిన పైకప్పు (మిద్దె) నిర్మించారు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఆ మిద్దెపై మట్టి పరిచారు. అందులో అమృత జలాన్ని కలిపారు. అది అమృత్‌ ‌పట్టిగా మారింది. అప్పట్నుంచి అక్కడ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఏడాది పొడవునా అక్కడున్న ఐదారు కుటుంబాలవారికి ఆ మిద్దె కూరగాయలు, ఆకుకూరలు పంచుతుంటారు. దాంతో అది ఖాళీ అయిపోతుంది. దైనందిన సేంద్రియ వ్యవసాయ ప్రయోగాల కారణంగా ఇలాంటి మంచి ఫలితాలు మన అందరికి దక్కుతున్నాయి.

ఈ సేంద్రియ సాగు రైతులను రుణ పంజరం నుంచి విముక్తుల్ని చేస్తుంది. రైతులకు నిజమైన స్వాతంత్య్రం ఇస్తుంది. తమకు అవసరమైన విత్తనాలను తయారు చేసుకునే అవకాశం ఇస్తుంది. పరంపరానుగతమైన ఈ సేంద్రియ సాగు విధానాన్ని విస్మరించటం వల్లే బీటీ విత్తనాలు, ఆ విత్తనాలూ, ఈ విత్తనాలనీ చెప్పుకుంటూ, మన రైతులు విత్తనాల కంపెనీలకు బానిసలవుతున్నారు. అదే సేంద్రియ సాగు పద్ధతులలో ఏ కంపెనీని దేబిరించాల్సిన అవసరం ఉండదు. ఇంత క్రితం ఒక వక్త చెప్పారు – తామే తయారుచేసుకున్న 15 రకాల విత్తనాలు ఉన్నాయని. ఇది విని చాలా సంతోషం కలిగింది.

నిజమే. తమకు అవసరమైన విత్తనాలు తామే తయారు చేసుకుంటూ, తమ భూముల్ని తామే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకుంటూ రైతులు తమకు తామే సర్వాధిపతులుగా మారవచ్చు. సేంద్రియ పద్ధతుల్ని అమలు చేయడంతో భూమి సదా సారవంతంగా ఉంటుంది. అనేక రకాల పంటలు పండించవచ్చు. భూమి సారవంతంగా ఉండటానికి పశుసంపద కూడా అవసరమే. లభ్యమవుతున్న జలాన్ని ఉపయోగించుకుంటూ వ్యవసాయ భూమిలో నీటి వనరులను వృద్ధి చేయాలి. ఈ విధంగాను భూమిని మరింత సారవంతం చేయవచ్చు. జొన్న తరవాత వేరుశనగ పంట వేయొచ్చు. తద్వారా భూమిలో నైట్రోజన్‌ ‌శాతం పెరుగుతుంది. లభ్యమవుతున్న జలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అవసరమైన రీతిలో నిల్వ చేసుకోవాలి. ఇక్కడ ఏడు చెరువుల విధానం ఉందని నిర్మల్‌కు వస్తుంటే తెలిసింది. ఈ చెరువులు ఇటు సేద్యానికీ•, అటు చేపల పెంపకానికీ ఉపయోగిస్తుంటారు.

 అందరికి తెలిసినదే అయినా ఒక్క విషయం మళ్లీ చెబుతున్నాను. సంప్రదాయానుసారంగా వ్యవసాయాన్ని కొనసాగించినప్పుడే మనుగడ ఉంటుంది. గతంలో భారత్‌ ‌సమస్త ప్రపంచానికి అన్నం పెట్టేది. ధాన్యం ఉత్పత్తుల, దిగుబడుల విషయానికొస్తే భారత్‌ ‌వందేళ్ల పాటు కాదు, ఏకంగా వెయ్యేళ్ల పాటు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేది. బ్రిటిష్‌ ‌వాళ్లు రాక ముందు, మొగలుల పాలనలో కూడా భారత్‌ది అగ్రస్థానమే. బ్రిటిష్‌ ‌వాళ్లు ఇక్కడి వ్యవస్థని చెడగొట్టారు. రెండుసార్లు కృత్రిమ కరవు సృష్టించారు. ఆ కారణంగా పరిస్థితి దెబ్బతింది.

 దేశ ఆత్మనిర్భరతకు వ్యవసాయమే మూలం. మన వ్యవసాయోత్పత్తులతోనే మన ఆర్ధిక వ్యవస్థను అద్భుతంగా మార్చేయవచ్చు. మనం మన వ్యవసాయంతోనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి వేగంగా అభివృద్ధిని సాధించగలం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి – దిగుమతుల కారణంగా కూడా ఆర్థికాభివృద్ధిని సాధించగలం. బయటి దేశాలు అభివృద్ధి కోసం పరిశ్రమలని నెలకొల్పుతున్నారు. మన సారవంతమైన భూములలో సేంద్రియ విధానంతో సాగు చేసి బయటి దేశాలకు దీటుగా వ్యవసాయ ఆధారిత, వ్యాపార పరిశ్రమలను నెలకొల్పవచ్చు. ఆ సత్తా మన రైతులకుంది. అలాటి ఆత్మవిశ్వాసం ఇక్కడి మనరైతుల్లో చూశాను. ఏకలవ్య ఫౌండేషన్‌ ‌ద్వారా కొనసాగుతున్న ప్రోత్సాహాన్ని కూడా చూశాను.

ఆ మధ్య బిహార్‌కు వెళ్లినప్పుడు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని చూశాను. పన్నెండెకరాల తన భూమిని సాగు చేసుకునేందుకు ఓ ఉన్నతాధికారి ఉద్యోగానికి రాజీనామా చేశారు. అది చూసి ఉన్నత విద్యావంతు లయి, ఉన్నతోద్యోగాలు చేస్తున్న ఆయన కొడుకు- కోడలు కూడా అవి వదిలి సేంద్రియ వ్యవసాయం చేసుకునేందుకు వచ్చారు. నీటి కొరత వల్ల పొలం లోనే చెరువు తవ్వించారు. పొడవాటి వెదురు బొంగుని తూములా పెట్టి దానికో చక్రాన్ని అమర్చినారు. సహజసిద్ధమైన వర్షపు నీటిని, వరద నీటిని ఆ చెరువులోకి మళ్లించి పొలానికి ఉపయోగిస్తున్నారు. హిమాలయాల నుంచి మంచు కరిగి నేరుగా మారి నేపాల్‌ ‌వైపు ప్రవహిస్తున్నప్పుడు ఆ జలాన్ని కూడా తమ చెరువు వైపు మళ్లించి ఔషధ వనస్పతులు కూడా పండిస్తున్నారు. దీనిని ప్రతి రైతూ ఆదర్శంగా తీసుకోవాలి.

ఏ భూమి పైన మనం ఆధారపడుతున్నామో ఆ భూమిని రక్షించుకోవాలి. మన పర్యావరణం కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాలి. ధర్మం ఆధారంగా మన రైతులు వ్యసాయాన్ని కొనసాగిస్తు న్నారు. అది కూడా లాభాపేక్షలేని వ్యవసాయం. దాన్ని నేనిక్కడ చూశాను. భూమి విషతుల్యం కాకుండా, ఆహార ధాన్యాలు విషతుల్యం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారధాన్యాలు పండించే దిశగా రైతులు అడుగులు వేయాలి. ధర్మం ఆధారంగా సమాజాన్ని రక్షించుకోగలిగే సమర్థుడుగా రైతు మారాలి. వేదాలను మన ప్రమాణంగా భావిస్తాం. వ్యవసాయం చేయండి కానీ జూదమాడొద్దు అని  వేదం చెబుతుంది. వ్యాపారమంటే జూదమే.

 ప్రతి రైతుని నేను కోరుతున్నదొకటే. మీ మీ గ్రామాల్లో మీరంతా ఐకమత్యం కావావ్వాలి. ఆందోళనలు చేసేందుకు కాదు. ఇవాళ రైతుల పేరిట జరుగుతున్న ఆందోళనలు తీరు సరిగా లేదు. మీ మీ గ్రామాల కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం సంఘటితం కావాలి. సేంద్రియ సాగు వికాసం కోసం పాటు పడాలి. గ్రామ వికాసంతో రైతుల శక్తి పెరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే గ్రామంలో సేంద్రియ సాగు చేసే రైతుకు ఎడ్లు అందు బాటులో లేకుంటే, గ్రామంలోని రైతులంతా కలసి ఒకరోజు ఆ రైతు పొలాన్ని దున్నే విషయంలో సహకరించవచ్చు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి చేయూత కొనసాగుతోంది. సంతోషకరమైన విషయం ఏమంటే ఏకలవ్య ఫౌండేషన్‌ ‌త్వరలో ఈ పధ్ధతిని ఈ ప్రాంతంలో అమలుపరచేందుకు సమాయత్తం కానుంది.

మీరంతా రైతులు. బలరామ స్వరూపులు. ఇక్కడ మిమ్మల్నందరినీ చూసి ఆనందిస్తున్నాను. బలరాముడు తన నాగలితో యమున నీటిని పొలాల వైపుకి మళ్లించాడు. దేశ వికాసానికి ధర్మబద్ధంగా పనిచేస్తున్న మీరంతా భూమి అమృతతుల్యం చేసేందుకు సేంద్రియ సాగు విధానాన్ని కొనసాగిస్తామని, దానిని విస్తరింప జేస్తామని సంకల్పం చేసుకోవాలి. అలాటి సువర్ణ దినాలు త్వరలో వస్తాయని ఆశిస్తాను. విషతుల్యంకాని ఆహార ధాన్యాలను మీరు అందిస్తారని ఆశిస్తాను.

 (ఫిబ్రవరి 26న ఆదిలాబాద్‌ ‌జిల్లా గుడిహత్నుర్‌ ‌మండలం లింగాపూర్‌లో ఏకలవ్య ఫౌండేషన్‌ ‌నిర్వహించిన సేంద్రియ రైతు కుటుంబాల సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆనాటి ఆయన ప్రసంగానికి వ్యాసరూపం)

About Author

By editor

Twitter
YOUTUBE