వందేళ్ల ఖిలాఫత్ ఉద్యమం-7
1918 నుంచి 1922 వరకు జరిగిన ఖిలాఫత్ ఉద్యమాన్ని రెండు దశలుగా విభజించవచ్చు. 1918 నుంచి 1920 మధ్య జరిగినది మొదటి దశ. ఈ దశలో సభలు, సమావేశాలు పెట్టి, తీర్మానాలు చేసి, ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చారు. ప్రజాభి ప్రాయాన్ని ప్రభావితం చేయటం, సంస్థాగత నిర్మాణం ఈ దశలోనిదే. 1920 ఆగస్ట్ నుండి 1922 మార్చి వరకు రెండవదశ. దీనిలో బల ప్రయోగానికీ, దారుణ హింసాకాండకూ దిగారు. ఈ రెండు దశలు కూడా దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ఉద్యమకారులు అనుసరించే విధానాలను ప్రతిబింబిస్తాయంటే ఆశ్చర్యం కాదు. బలహీనంగా ఉన్నప్పుడు బోధించటం, ముస్లిం సమాజం సంఘటితమై, బలాన్ని పుంజుకొన్నాక లక్ష్యం కోసం మారణకాండకు పాల్పడటం వారు ఎప్పటి నుండో అనుసరిస్తున్న పద్ధతులు. ఖిలాఫత్ ఉద్యమకారులు సైతం ఆ పద్ధతులనే అనుసరించారు.
పెరిగిన ముస్లిం అసంతృప్తి జ్వాలలు
మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ఒట్టొమాన్ సామ్రాజ్యం చిన్నాభిన్నమై, పూర్వవైభవం కోల్పో యిందని ఇంతకుముందు తెలుసుకున్నాం. మిత్రదేశాల మధ్య జరిగిన రహస్య సంధులు, 1915-18 మధ్య చేసుకున్న యుద్ధ విరామ ఒప్పందాలు •ర్కీ సామ్ర్యా విచ్ఛిన్నానికి దారితీశాయి. ఒక దేశంగా టర్కీ భవితవ్యం, ఖిలాఫత్ వ్యవస్థ కొనసాగటం, ఇస్లాం పవిత్రస్థలాల భద్రత గురించి అనేక సందేహాలకు, భయాలకు ఆ సామ్రాజ్య విచ్ఛిన్నం కేంద్ర బిందువైంది. మన దేశ ముస్లిం మతఛాందసవాదులకు ఖిలాఫత్, పవిత్ర స్థలాల రక్షణ అత్యంత ప్రీతి పాత్రమైన అంశాలు. •ర్కీ పతనంతో దేశంలో ముస్లింల ప్రాముఖ్యం కూడా తగ్గగలదని వారు భావించారు. ఆంగ్లేయులక• విధేయులుగా ఉన్నందువలన ముస్లింలకు ఒరిగిందేమీ లేదని కూడా ఫిర్యాదు చేయటం మొదలుపెట్టారు.
1918లో మాంట్‌ఫర్డ్ నివేదికలో ఈ విధంగా పేర్కొన్నారు. ముస్లింలకు ‘‘1909లో ప్రత్యేక ప్రాతినిధ్యంతో పాటు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. ఇది శాశ్వత పాతిపదిక మీద ఏర్పాటుచేసిన సౌకర్యమని ముస్లింలు అనుకుంటారు. వాటి నుండి వెనుకకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తే ముస్లింలు అసంతృప్తికి గురవుతారు. నిరసన జ్వాలలు చెలరేగుతాయి. ముస్లిం సమాజ విధేయతను మనం పొందలేం. అందువలన వాటిని కొనసాగించటమే మేలని మేం భావిస్తున్నాం. అయితే వారు ఆధిక సంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాలలో ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. అందుకు ఎటువంటి హేతుబద్ధత కన్పించదు’’ (The Report on Constitutional Reforms, London, 1918, p. 188). ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాలలో ప్రత్యేక నియోజక వర్గాలు ఎత్తివేయటం మంచిదన్న సిఫారసు వారి దృష్టికి రాగానే ముస్లిం నాయకులు గొంతు చించుకోవటం మొదలెట్టారు.
ముస్లిం ఛాందసవాదులు నడిపే పత్రికలు రెచ్చగొట్టే వ్యాసాలు ప్రచురించడంతో వాటిని ప్రభుత్వం నిలిపివేసింది. మహమ్మద్-అల్-హసన్‌ను, ఆలీ సోదరులను, అబ్దుల్ కలాం అజాద్‌ను, హజరత్ మెహ్నీలను నిర్బంధంలోకి తీసుకున్నారు. మరికొందరు నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1917 నుంచి యుద్ధం కారణంగా నిర్బంధంలో ఉన్న నాయకుల విడుదలకై ఒక ఉద్యమం కూడా నడిచింది.
ఐక్యత పట్ల గాంధీజీ గాఢానురక్తి (Obession)
1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి వచ్చారు. నిర్బంధంలో ఉన్న ముస్లిం నాయకులు విడుదల కోసం చేపట్టిన ఉద్యమానికి గాంధీజీ మద్దతు కోసం1917 శీతాకాలంలో ప్రయత్నాలు జరిగాయి. ఆయన ముస్లిం స్నేహితుల సంఖ్య క్రమేపి పెరిగింది. ఆలీ సోదరులు, హకిమ్ అజ్మల్‌ఖాన్, మౌలానా అబ్దుల్ బారి ఆ స్నేహవర్గంలో ఉన్నారు. యుద్ధపరిణామా లపై ఏప్రిల్ 1918లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో టర్కీ భవితవ్యం పట్ల ముస్లింలకు ఉన్న ఆందోళనకు అనుకూలంగా, వారికి నచ్చేటట్లు ప్రసంగించటంతో వారు గాంధీజీ పట్ల కృతజ్ఞులుగా ఉన్నారు.
1919 ఫిబ్రవరిలో రౌలట్ చట్టం వచ్చింది. కొన్ని రాజకీయోద్యమ కేసులను న్యాయవ్యవస్థతో నిమిత్తం లేకుండా విచారించటానికీ, అనుమానితు లను, విచారణ లేకుండా నిర్భందించటానికీ ఈ చట్టం ప్రభుత్వానికి విస్తృతాధికారాలను కల్పించింది. దీనికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నిరసన జ్వాలలు చెలరేగాయి. అమృత్‌సర్‌లో ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌లో శాంతియుతంగా సమావేశమైన ప్రజలపై జనరల్ డయ్యర్ కాల్పులు జరపటంతో దేశం అంతా అట్టుడికిపోయింది.
దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన నాటి నుండి, హిందూ ముస్లిం ఐక్యత భావన పట్ల గాంధీజీకి ఒక రకమైన పిచ్చి పట్టుకొంది. గాంధీజీలోని ఈ ప్రత్యేక లక్షణం గురించి అంబేడ్కర్ మాటల్లో తెలుసుకుందాం, ‘భారతదేశంలో అడుగుపెట్టగానే, ఆయన ఆరు నెలలలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొని వస్తానని చేసిన ప్రకటన ప్రజలందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అయితే అందుకు ఆయన కొన్ని షరతులు విధించాడు. హిందూ-ముస్లిం ఐక్యత మొదటి షరతు. హిందూ-ముస్లిం ఐక్యత లేకుండా స్వరాజ్యం రాదని ఆయన ప్రగాఢంగా నమ్మటమే కాకుండా, పదేపదే ఆ విషయమై మాట్లాడేవారు. హిందూ-ముస్లిం ఐక్యతను ఒక రాజకీయ నినాదంగా మార్చటమే కాక, ఇరువర్గాల మధ్య ఐక్యత కోసం కృషి చేశాడు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా తాను తలపెట్టిన సత్యా గ్రహంలో పాల్గొనేవారు హిందూ-ముస్లిం ఐక్యతకు కట్టుబడి ఉంటామన్న ప్రతిజ్ఞ తీసుకోవాలని గట్టిగా చెప్పారు. వాస్తవానికి హిందూ-ముస్లిం ఐక్యతకు భంగం కలిగించే అంశాలు ఏవీ రౌలట్ చట్టంలో లేవు. అయినప్పటికీ అటువంటి ప్రతిజ్ఞ చేయవలసిందే నని గాంధీజీ తన అనుచరులను ఆదేశించారు. ఆయన ఉద్యమబాట పట్టిన తొలినాళ్ల నుండి హిందూ- ముస్లిం ఐక్యతకోసం పరితపించారు. (ఆ విషయమై ఆయన చాలా పట్టుదలగా ఉండేవారు.) హిందూ-ముస్లింల మధ్య ఐక్యతను సాధించటమే ఆయన ప్రధాన లక్ష్యమైంది కూడా.’’ (Pakistan or The partition of India, pp. 135-136).
గాంధీ – బారి మధ్య ఇచ్చిపుచ్చుకోవటం (Quid Pro Quo)
టర్కీ భవితవ్యం గురించి ముస్లిం ఛాందస వాదులలో నెలకొన్న ఆందోళన కేవలం కొన్ని పట్టణాలకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్, బెంగాల్, పంజాబ్, సింధు రాష్ట్రాలలోని పెద్దపట్టణాలకే ఆందోళన పరిమితమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కావలసిన జనసమీకరణ ముస్లిం ఛాందసవాదులు చేయలేకపోయారు. హిందువుల మద్దతును వారు కోరుకున్నారు. వారి అంతర్జాతీయ ఇస్లామిక్ ఆకాంక్షలకు హిందువుల మద్దతు కూడ గట్టటం ఎట్లా అన్నది వారి ముందున్న పెద్ద సమస్య. హిందూ-ముస్లిం ఐక్యతను ఎలాగైనా తీసుకొని రావాలన్న, గాంధీజీ పిచ్చి పట్టుదల వారికి బాగా కలసి వచ్చింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచు రించిన ‘స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర’ గ్రంథానికి సేకరిం చిన అధ్యయన పత్రాలలో విలువైన సమాచారం దొరుకుతుంది (Study Material, Vol.3, p.139). అందులో ఒక పత్రంలో ఇలా పేర్కొన్నారు. ‘‘1919 మార్చిలో గాంధీజీ లక్నోలో అబ్దుల్ బారికి అతిథిగా ఉన్నారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా తాను తలపెట్టిన సత్యాగ్రహం గురించి ఆయన అబ్దుల్ బారితో చర్చించారు. తన ఉద్యమం విజయవంత మవుతుందని, ఉద్యోగులకు, సైన్యానికి కూడా పాకి ప్రభుత్వం అచేతానావస్థకు చేరుతుం దని ఆయనకు చెప్పినట్లు తెలుస్తు న్నది. ఉద్యమం ఊపు మీద ఉన్నప్పుడు అబ్దుల్ బారిని ‘షేక్-ఉల్- ఇస్లామ్’గా ఎన్నిక చేద్దామని, ఖిలాఫత్ గురించి, పవిత్ర స్థలాల భద్రత గురించి ముస్లింల డిమాండ్లను చర్చకు పెట్టవచ్చునని గాంధీజీ ఆయనతో చెప్పారట. ఈ ముస్లిం డిమాండ్లకు హిందువులు కూడా మద్దతు ప్రక టిస్తూ వైస్రాయికి వినతిపత్రం ఇస్తారని, ఒకవేళ ఈ డిమాండ్లను అంగీకరించకపోతే ఆంగ్లపాలకులపై జిహాద్ తప్పదని హెచ్చరిస్తారని కూడా అనుకొన్నారట.
హిందువులు అందించే ఈ సహాకారానికి బదులుగా షేక్-ఉల్-ఇస్లామ్‌గా అబ్దుల్ బారి ఒక ఫత్వా ఇవ్వాలని, ఆ ఫత్వాలో ఇబ్రహీం బలి ఇచ్చినది గొర్రెనే కాని, ఆవును కాదని పేర్కొనాలని, గోవధను భవిష్యత్తులో పూర్తిగా నిషేధించాలని, ఒక అవగాహనకు గాంధీజీ-బారిలు వచ్చారని తెలుస్తున్నది. అయితే దేశంలో అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు జరగటంతో ఈ పథకం అమలు కాలేదు’’. పైన లభ్యమైన సమాచారం ప్రకారం గాంధీజీ, బారి తమతమ లక్ష్యాల కోసం ఎదుటివారిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తున్నది. గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపర్చారు. ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీజీ మద్దతు ముస్లిం ఛాందస వాదులకు ఎంతైనా అవసరం. అంతేకాక మొత్తం ఉపఖండానికే ‘షేక్- ఉల్-ఇస్లామ్’గా బారి ఎన్నికకానున్నాడు. అది ఆయనకు పెద్ద గౌరవాన్ని అందించే అవకాశం. కనుక గోసంరక్షణకు బారి ఒప్పుకొన్నారు. అయితే రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహం ఎంతో కాలం జరగలేదు. ఏప్రిల్ 18, 1919న గాంధీజీ ఆ సత్యాగ్రహాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు.
సంఘటితమైన ఇస్లామీయులు
బొంబాయికి చెందిన కొందరు ధనవంతులైన ముస్లింలు బాంబే ఖిలాఫత్ కమిటీని మార్చి 19, 1919న ప్రారంభించారు. అదే సంవత్సరం మే మధ్యలో అఫ్ఘానిస్తాన్ అమీర్ అమానుల్లా బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించాడు. దీనితో మన దేశ ముస్లిం ఛాందసవాదుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అమీర్ ప్రతినిధులతో మంతనాలు సాగించారు. బేషరతుగా మద్దతు ప్రకటించారు. అబ్దుల్ బారి ముస్లింలను రెచ్చ గొడుతూ, జిహాద్‌కు పిలుపునిస్తూ సుదీర్ఘ కరపత్రాలు విడుదల చేశాడు. (The Khilafat Movement in India, 1919-24, A.C. Niemeijer, 1972, p.75; Qureshi, ibid, p.67).
టర్కీకి అనుకూలంగా అనేక భారత ముస్లిం ప్రతినిధివర్గాలు లండన్‌కు వెళ్లాయి. కాని ఆశించిన ప్రభావం కనపడలేదు. దానితో అఖిల భారత స్థాయిలో ఒక ముస్లిం సమావేశాన్ని లక్నోలో నిర్వహించారు. వెయ్యిమంది ముస్లింలు వివిధ ప్రాంతాల నుండి హాజరయ్యారు. ఒక సెంట్రల్ ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేయాలనీ, అక్టోబరు 17న ‘ఖిలాఫత్ దినం’గా ప్రకటించాలనీ ఆ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానం తీసుకోవటం ముస్లింలీగ్‌కు ఇష్టంలేదు. అందువల్ల ఖిలాఫత్ కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బాంబే ఖిలాఫత్ కమిటీనే ‘ది సెంట్రల్ ఖిలాఫత్ కమిటీ ఆఫ్ ఇండియాగా’ మార్చారు (Qureshi, ibid, p.71).
సెంట్రల్ ఖిలాఫత్ కమిటీ లక్ష్యాలు
- టర్కీలో న్యాయబద్ధమైన, గౌరవప్రదమైన శాంతిని తీసుకొనిరావటం.
- ఖిలాఫత్‌ను పునరుద్ధరించటం.
- ఇస్లామిక్ పవిత్రస్థలాలను షరియాలో పేర్కొన్నట్లుగా పరిరక్షించటం.
- టర్కీ సమగ్రతకు కట్టుబడి ఉంటామన్న ఆంగ్ల పాలకుల హామీలు అమలు అయ్యేలా చూడటం.
పై లక్ష్యాల కోసం ఆంగ్ల పాలకులను, ఇండియన్ వైస్రాయిని ఒప్పించేందుకు కృషి చేయటం, దేశమంతటా ఖిలాఫత్ ఉద్యమ లక్ష్యాలను వివరిస్తూ ప్రచారం చెయ్యటం కూడా కమిటీ లక్ష్యాలుగా పేర్కొన్నారు.
పై లక్ష్యాలను చూసినప్పుడు దేశానికి సంబంధిం చిన ఒక్క అంశం కూడా ఖిలాఫత్ ఉద్యమ లక్ష్యాలలో లేదన్న వాస్తవం తెలుస్తుంది. స్వాతంత్య్రానికి సంబంధించీ, స్వయం నిర్ణయాధికారం గురించీ ఒక్కమాట కూడా లేదు.
సంస్థాగతంగా పై నుండి కింద వరకు ఖిలాఫత్ కమిటీలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా పనిచేసేవారిని, కార్యకర్తలను తయారుచేయటానికి యోజన చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మత ఛాందసవాదుల డిమాండ్లకు తన అంగీకారం తెలిపింది. దానితో చాలాచోట్ల కాంగ్రెసు పార్టీ కార్యాలయాలు ఖిలాఫత్ ఉద్యమానికి కేంద్రాలుగా మారాయి. పంజాబ్, సింధు, బెంగాల్, బొంబాయి, మద్రాసు రాష్ట్రాలలో పెద్ద సభలు పెట్టారు. గ్రామాలకు కూడా ఉద్యమం పాకింది. ముస్లిం ఛాందసవాదులతో పాటుగా సామాన్యులు కూడా ఉద్యమంలో పాల్గొనటం మొదలెట్టారు. అంతవరకు ఛాందసవాదులకే పరిమితమైన ఉద్యమం సామాన్య ముస్లింలను సైతం తాకింది. జిన్నా వంటి మితవాద ముస్లిం నాయకుడికి ఇది నచ్చలేదు. ‘ఇదొక బూటకపు’ మతపిచ్చిగా ఆయన వర్ణించాడు. దాని వలన భారత దేశానికి గాని, భారత ప్రజానీకానికి కాని ఎటువంటి మేలు కలుగదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
హిందూ నాయకుల వ్యతిరేకత
ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతునిచ్చి కాంగ్రెస్ పెద్ద పొరపాటు చేసింది. కాంగ్రెస్ మద్దతుదారులలో సైతం ఖిలాఫత్ ఉద్యమం వలన హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత నెలకొనగలదనే విషయంలో సందేహాలు పొడసూపాయి. ఖిలాఫత్ ఉద్యమం మత, రాజకీయ లక్ష్యాలు హిందువులకు సంబంధించినవి కావు. ఈ దేశానికి సంబంధించినవీ కావు. పండిట్ మదన్ మోహన్ మాలవ్యా ఈ ఉద్యమ లక్ష్యాలతో విభేదించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1918లో ఖిలాఫత్‌కు మద్దతు ఇవ్వటానికి ఆయన ఒప్పుకోలేదు. 1897లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన శంకర్ నాయర్, లోక్‌మాన్య తిలక్, వల్లభాయిపటేల్ మొదలైన వారు ఆ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతును బహిరంగంగానే వ్యతిరేకించారు. బిపిన్ చంద్రపాల్ ‘పాన్ ఇస్లామిజం’ వైరస్ వంటిదని తీవ్రంగా వ్యతిరేకించాడు. మన దేశానికి సంబంధించిన అనేక అంశాలు ఉండగా ఖిలాఫత్ సమస్యను పరిష్కరించ టానికి మనమెందుకు పూనుకోవాలని మోతీలాల్ నెహ్రూ ప్రశ్నించారు. గాంధీజీ సన్నిహితుడు, ప్రముఖ న్యాయవాది వి.యస్. శ్రీనివాసశాస్త్రి ఖిలాఫత్ ఉద్యమాన్ని దూరంగా ఉంచమని గాంధీజీకి సలహా ఇచ్చాడు కూడా.
గాంధీజీ ఎంత ప్రయత్నం చేసినా, ‘ఖిలాఫత్ దినం’ రోజున (అక్టోబరు 17) పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొనలేదు. ఢాకా, బొంబాయి, లక్నో, హైదరాబాద్ (సింధు)లలో మాత్రమే హిందువులు ముస్లింలతో కలిశారు. హర్తాళ్ పాటించారు (Qureshi, ibid, p.76)
ఖిలాఫత్ సహాయ నిరాకరణ
మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన సందర్భంగా దేశమంతటా శాంతి సమావేశాలు నిర్వహించాలని ఆంగ్ల ప్రభుత్వం ఆదేశించింది.ఈ సమావేశాలను బహిష్కరించాలని ఖిలాఫత్ ఉద్యమనాయకులు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను మరొకసారి ఏకరవు పెట్టారు. బ్రిటన్‌కు ఒక ప్రతినిధివర్గాన్ని పంపారు. ఆ ప్రతినిధివర్గం తన యత్నంలో విఫలమైతే, ఇంగ్లండ్ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సహాయం నిరాకరించా లని కూడా తీర్మానించారు.
ఖిలాఫత్ ఉద్యమానికి హిందువుల మద్దతు కూడగట్టడం కోసం నవంబర్ 24, 1919న హిందూ-ముస్లిం ప్రతినిధులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. గాంధీజీని మచ్చిక చేసుకోవటం కోసం, ఆ సమావేశానికి ఆయననే అధ్యక్షుడిగా ఉండ మన్నారు. కానీ బ్రిటిష్ వస్తు బహిష్కరణను గాంధీజీ వ్యతిరేకించారు. కనుక వస్తు బహిష్కరణకు ఇచ్చిన పిలుపును ముస్లింలు ఉపసంహరించుకున్నారు. హిందువులను మెప్పించటం కోసం ఫజలుల్ హక్ జలియన్‌వాలా బాగ్ హింసాకాండను నిరసించటం కూడా ఉద్యమ లక్ష్యాలలో ఒకటిగా పెట్టటానికి ప్రయత్నం చేసాడు. కాని గాంధీజీ ఒప్పుకోలేదు. ఖిలాఫత్ సమస్యే సహాయ నిరాకరణకు ప్రధాన అంశంగా ఉండాలని ఆయన అన్నారు. 1920 ఏప్రిల్, మే నెలల్లో సహాయనిరాకరణ కార్యక్రమాన్ని ఖిలాఫత్ ఉద్యమకారులు రూపకల్పన చేశారు.
ఖిలాఫత్ ఉద్యమాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పక్షాన్ని గాంధీజీ ఏవిధంగా తటస్థులుగా మార్చి, ఆ సంస్థ మీద బలవంతంగా ఖిలాఫత్‌ను రుద్దారో తెలుసుకోవటం అవసరం కూడా. అదో పెద్ద కథ. గాంధీజీ వంటి మిత్రుడు దొరికినప్పుడు ముస్లిం ఛాందసవాదులకు ఇంకేంకావాలి? అందుకే నచ్చచెప్పటం ఆపి తరువాతి దశలో నరహింసకు వారు దిగారు.
- ఆంగ్లమూలం: శ్రీరంగ గాడ్బొలే
డా।। బి. సారంగపాణి