సంపాదకీయం
శాలివాహన 1941 శ్రీ ప్లవ చైత్ర శుద్ధ సప్తమి – 19 ఏప్రిల్ 2021, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
హిందూ ఆలయాల చరిత్ర సంక్షుభితమైనది. దాదాపు వేయేళ్ల నుంచి మన గుళ్లూ గోపురాలూ సంక్షోభంలోనే, పంటి బిగువున మనుగడ సాగిస్తున్నాయి. నిజానికి అధిక సంఖ్యాకులైన వారి ప్రార్ధనా మందిరాలకు రక్షణ స్వల్పం. ఈ మధ్య కొన్నేళ్లుగా దేవాలయాల పునర్ వైభవం గురించి ఆశాజ్యోతి మినుకు మినుకుమంటున్నది. అయోధ్య రామచంద్ర ప్రభువుదే అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించడం అందులో ముఖ్యమైనది. 2024 సంవత్సరానికల్లా రామమందిర నిర్మాణం పూర్తవుతుందని కూడా నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే కాశీలోని జ్ఞానవాపి మసీదులోకి భారత పురావస్తు సంస్థకు చెందిన ఐదుగురిని అనుమతించి వాస్తవాలను అధ్యయనం చేసే అవకాశాలు కల్పించాలని కొద్దివారాల క్రితం కోర్టు తీర్పు చెప్పడం కూడా జరిగిన తప్పులను దిద్దుకునే క్రమంలో జరిగిన చర్యే. ఏప్రిల్ 9వ తేదీన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్ చేసిన ప్రకటన ఒక ప్రాంతంలోనే అయినా, ముమ్మాటికీ ఆలయాల కొత్త శకానికి నాంది పలికేదే. ఆ రాష్ట్రంలోని 51 ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
హిందూ దేవాలయాలకు ప్రభుత్వాల అజమాయిషీ నుంచి విముక్తి కల్పిస్తామని బీజేపీ విధానంగా స్వీకరించింది. మన ఆలయాల మీద ప్రభుత్వ నీడను వ్యతిరేకిస్తూ ఇటీవల దృఢ సంకల్పంతో ఉద్యమిస్తున్న ప్రాంతాలలో తమిళనాడు ఒకటి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అన్నా డీఎంకేతో కలసి పోటీ చేసిన బీజేపీ ఆలయాలను ప్రభుత్వ ఆధిపత్యం నుంచి తప్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అలాగే సద్గురు జగ్గీవాసుదేవ్ ఇదే అంశం మీద ఉద్యమించడం శుభసూచకం. సద్గురు, విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే కూడా ఉత్తరాఖండ్ నిర్ణయాన్ని స్వాగతించారు.
ఇక్కడే మరొక్క అంశం ప్రస్తావించాలి. ఉత్తరాఖండ్‌కు తీరథ్‌సింగ్ కంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన త్రివేంద్ర సింగ్ రావత్ బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు సహా 51 పుణ్యస్థలాలను ప్రభుత్వ అధీనంలోకి తెచ్చారు. దీని మీద బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణియన్ స్వామి కోర్టును ఆశ్రయించారు కూడా. దీనిని ఎవరూ తప్పు పట్టలేరు. ఇంతలోనే తన కంటే ముందు పదవీ బాధ్యతలు నిర్వహించిన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి తీరథ్ సవరించి మంచిపని చేశారు. కుంభమేళ ఏర్పాట్లను సమీక్షించడానికి హరిద్వార్ వెళ్లిన ముఖ్యమంత్రి సాధువులను, సంత్‌లను కూడా కలుసుకున్నారు. త్రివేంద్ర నిర్ణయాన్ని సాధువులు ఆదినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పుణ్యక్షేత్ర పురోహితులు కూడా తప్పు పడుతున్నారు. మార్చి 14వ తేదీన వీరంతా తమ నిరసనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేశారు కూడా. ఈ నేపథ్యంలోనే వారితో సమావేశమైన వెంటనే తీరథ్ నిర్ణయాన్ని వెల్లడించారు. చార్‌ధామ్ దేవస్థానం ఏర్పాటు చేయాలన్న పాత ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కూడా సమీక్షిస్తామని కొత్త ముఖ్యమంత్రి చెప్పారు. ఈ దేవస్థానం మండలికి ముఖ్యమంత్రే అధ్యక్షులుగా ఉండాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకుని సంవత్సరం కాకుండా పునరాలోచించుకోవలసి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదన్నదే సాధారణ హిందువుల అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత గూడు కట్టుకోవడం మొదలయింది.
దాదాపు పదహారు, పదిహేడు శతాబ్దాలలో ఈస్టిండియా కంపెనీ జోక్యంతో హిందూ ఆలయాలు పాలకుల అదుపులోకి వెళ్లడం మొదలయింది. అంతకు ముందు ముస్లింల పాలనలో దేవాలయాలు అనుభవించిన క్షోభ అంచనాకు అందదు. ఎన్ని ఆలయాలు ధ్వంసమైనాయో, ఎంత శిల్ప కళాసంపద నాశనమైందో, ఎంత ఆస్తి దోపిడీకి గురైందో చెప్పలేం. తరువాత ప్రజాస్వామ్యం వచ్చింది. ఆపై చాప కింద నీరులా సెక్యులరిజం వచ్చింది. చాలాచోట్ల ముస్లింల, ఆంగ్లేయుల కాలాలకు మించి హిందూ ఆలయాలు అపవిత్రమయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో ద్రవిడవాదం, కేరళలో వామపక్షం హిందూ పుణ్యక్షేత్రాల విధ్వంసమే అజెండాగా చిరకాలం మనుగడ సాగించాయి. చివరికి అవే ఓడిపోయాయి. కేరళ కమ్యూనిస్టులు శబరిమలై ఉద్యమకారుల మీద చూపిన అతికి మొసలి కన్నీరు కార్చగా, ద్రవిడవాదులు తాజా ఎన్నికల ప్రణాళికలో గుడులకు వేయి కోట్లు కేటాయించి ఆషాఢభూతులను మరిపించారు. తిరుమల దేవస్థానం నుంచి సొమ్ము దోపిడీ అవడం గురించి దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. తాజాగా బెజవాడ దుర్గ దేవస్థానంలో అదే పునరావృతమయింది. ఆస్తులు ఉన్నా చాలా ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు లేవన్నది చేదు వాస్తవం. దేవస్థానాలను రాజకీయ నిరుద్యోగులతో, హిందూ ద్వేషులతో నింపడం మరొక ఘోరం. ఈ దుస్థితికి ముఖ్య కారణం దొంగ సెక్యులర్, ప్రజాస్వామిక ప్రభుత్వాలు. ముస్లింల, క్రైస్తవుల ఆరాధనా స్థలాల మీద లేని అదుపు హిందూ దేవాలయాల మీద ఎందుకు అన్న ప్రశ్న ఇలా ఉత్పన్నమైనదే.
ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పుడు ప్రభుత్వాలు దేవాలయాలను అప్పగించడాననికి ముందుకు వస్తే పవిత్రంగా, సమర్ధంగా నిర్వహించడానికి హిందువులు, మఠాలు, సాధువులు ఐక్యంగా, స్థిరచిత్తంతో ముందుకు రావడం ఒక ఎత్తు. ఇది మన ధర్మాన్ని రక్షించుకోవడానికి, సుసంపన్నం చేసుకోవడానికి వచ్చిన మహదవకాశంగా భావించాలి. సామాజిక న్యాయ పునరుద్ధరణకు, తద్వారా హిందూ సమాజ పటిష్టతకు ఇది దోహదం చేస్తుంది. ఆలయాల అప్పగింతకు ఉద్యమం, వాటి నిర్వహణకు సంసిద్ధత సమంగా నిర్మాణం కావాలి.