కాలం గడుస్తున్న కొలది జాతి జీవనంలో సంఘం ఆవశ్యకత, గొప్పదనం మరింతగా దృగ్గోచరమవుతున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి చెందిన స్వయంసేవకులు అన్ని రంగాల్లో సకారాత్మక పరివర్తన తెచ్చేందుకు క్రియాశీలురై ఉన్నారు. సమాజంలోని అతి పెద్ద సమూహం దీనిని నిరంతరం అనుభవిస్తూ పలవరిస్తోంది. సహజంగానే ఇలాంటి సంస్థని స్థాపించిన వారె•వరు, వారి ఆలోచన విధానం ఎలాంటిదో తెలుసుకోవాలన్న ఉత్సుకత, జిజ్ఞాస నానాటికీ సమాజంలో పెరుగుతోంది.
డాక్టర్జీ.. డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ బాల్యం నుండే దేశం గూర్చి ఆలోచించేవారు. ఆ రోజుల్లో స్వేచ్ఛా స్వాతంత్య్ర అంశాలపై లోకమాన్య బాలగంగాధర తిలక్ వెలిబుచ్చే నిర్దిష్ట ఆలోచనా విధానాలకు నాగ్‌పూర్‌లో హెచ్చుగా గుర్తింపు ఉండేది. తిలక్‌గారి మాటలు డాక్టర్జీని సూదంటు రాయిలా ఆకర్షించేవి.
విజయదశమికి ఊర్లో ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపన్యాసమివ్వాలన్నా లేక తమ విద్యాలయంలో ‘‘వందేమాతరం’’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నా డాక్టర్జీ స్వయం స్ఫూర్తి పొంది అడుగు ముందుకేసేవారు. ఈ ప్రచండ ధైర్యమే వారిలో తేజోపూర్ణమైన దేశభక్తిని నింపింది. ఈ పరిణామక్రమమే, సంఘం లాంటి విశాలమైన, పవిత్ర యుగ పరివర్తన కార్యాన్ని ఆయన ఆరంభించేటట్టు చేసింది. తానున్న వర్తమానకాలం కన్నా దేశ క్షేమం కోసం ఎన్నో అడుగులు ముందుకు వేసి భావికాలాన్ని గూర్చి ఆయన ఆలోచించే వారు, ప్రణాళికలు రూపొందించేవారు, ఈ కారణంగానే త్వరలోనే వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వర్తమాన సమయంలో కూడా ఆధునిక, సందర్భోచితమైన పరిణామక్రమంలో శుభ శక్తి రూపంలో గోచరిస్తుంది.. వ్యక్తమవుతుంది. వారిలోని గుణాలు, ఆలోచనలు పవిత్ర స్వరూపంగా సాక్షాత్కరించేవి.. వారి ప్రతిబింబమే సంఘ కార్యంలోనూ, కార్యకర్త ల్లోనూ నేటికీ చూడగలుగుతున్నాం. డాక్టర్జీలో దేశభక్తి జన్మతః ఎలా ఉండిందో అలానే సంఘం కూడా జన్మతః దేశభక్తికి మరో రూపంగా భాసిల్లింది. ఈ గుణమే ప్రతి స్వయంసేవకుని ప్రవృత్తికి ఆధార భూతమైంది, అభిన్నంగా మారింది. సంఘం చేపట్టే ప్రతి కార్యంలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రాధాన్యత నిచ్చే ప్రతి అంశం ‘‘రాష్్ర ప్రథమ్’’ (దేశమే ప్రథమం)గా ఉంటుంది.ఏ విధంగా దేశ స్వాతం త్య్రం, దేశ ఆస్తిత్వం, దేశ సంస్కృతి విషయాలలో డాక్టర్జీ రాజీ పడేవారు కారో సంఘం కూడా ఈ నాటికీ ఆ అంశాలలో రాజీ పడదు.
నాగ్‌పూర్‌లో జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో డాక్టర్జీ స్వయంగా పాల్గొన్నారు. ఆంగ్ల ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపింది. జైలు నుంచి విడుదలయినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంచి కార్యాలను ముందుకు తీసికెళ్లేందుకు ప్రజలను ముందుంచి తాను వెనక ఉండి ప్రోత్స హించడం ఆయన ప్రవృత్తి. ప్రచార ఆర్భాటాలకి ఆయన దూరంగా ఉండేవారు. సంఘం కూడా గొప్పల వెనక పరుగులు తీయకుండా మంచి కార్యాలపై విశ్వాసం ఉంచి సమాజ సామర్థ్యాన్ని వృద్ధి చేస్తూ, అందులో భాగంగానే అవసరమైన కార్యకలాపాల రూపకల్పనకు ప్రోత్సాహమిస్తుంది. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, గోసేవ ద్వారా వ్యవసాయం చేయడంతో పాటు పెక్కు సహాయ పథకాల అమలు పట్ల వహించాల్సిన జాగరూకత, కార్యకలాపాల్లో శిక్షణ మొదలయిన వాటికి మార్గదర్శనం చేస్తూ సమృద్ధి – సంతోషాలని పంచేందుకు కూడా సంఘం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఆనాటి సమాజంలో ఉన్న జాతిభేదాలను, అసమానతలను డాక్టర్జీ ఎన్నడూ అంగీకరించలేదు. అందరిలోనూ ఉన్న ఈశ్వర తత్త్వమొక్కటే, హిందూ ధర్మంలోని ఈ ముఖ్య సిద్ధాంతానికి అనుగుణంగా వారి ధర్మం, సంస్కృతి, సామాజిక సందర్భాను సారంగా గుర్తింపు ఉండేది. దీనికి అనుగుణంగా సంఘంలో ఆరంభం నుండి సమాన రూపంలో అందరికీ ద్వారాలు తెరిచే ఉన్నాయి. సంఘానికి సంబంధించిన కార్యక్రమాల్లో, శిబిరాల్లో బాధ్యతలను అప్పగించినప్పుడు కానీ, వాటిని నిర్వర్తించే సమయంలో కానీ, ఏ స్థాయిలోనయినా పరిచయ కార్యక్రమమప్పుడు ఎవరి వర్గాన్నీ, ఆర్ధిక నేపథ్యాన్ని ప్రస్తావించడమనేది ఉండనే ఉండదు. డాక్టర్జీ జీవించి ఉన్న సమయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, గాంధీజీ సంఘం శిబిరాలను సందర్శించి అక్కడ ఉన్న సమానత – సమరసతలను చూసి ప్రశంసించారు. ఇవాల కూడా సంఘంలో అలాంటి వాతావరణమే కొనసాగుతోంది. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒక్క తాటి పైకి తెచ్చే ప్రయత్నాలను కొనసాగిస్తూనే సంఘం మునుముందుకు వెళుతోంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో డాక్టర్జీ ప్రభావితమయ్యారు. శివాజీ మహారాజ్ ఎలాగయితే తన సైన్యంలో, పాలనలో అన్ని వర్గాల వారిని చేర్చి సంపూర్ణ హిందూ సమాజ స్థాపనకు నడుం బిగించారో, అదేవిధంగా సంఘం ద్వారా సమస్త హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని డాక్టర్జీ సంకల్పించారు. ఇవాళ కూడా సంఘం సమాజంలో స్వయంసేవకులతో ఒక సంఘటనా శక్తిగా తయారు చేయడానికి బదులుగా, సంపూర్ణ సమాజాన్ని బలీయమైన సంఘటనా శక్తిగా మార్చేందుకు సమర్పిత భావంతో పని చేస్తోంది.
డాక్టర్జీ చదువుకునే రోజుల నుండే మిత్ర బృందాలతో కలివిడిగా ఉండేవారు. ఆ మిత్రు లందరిని ఆయన దేశభక్తి వైపు, సేవాకార్యాల వైపు మరల్చేవారు. చెప్పాలంటే ఒకరినొకరు సహకరించు కోవటం, సామాజిక కార్యాల్లో భాగంగా ప్రజలకు సేవ చేయటం ఆయనకున్న సహజ స్వభావం. ఆ రోజుల్లో సంఘం తొలి కార్యక్రమం కూడా నాగ్‌పూర్ దగ్గరలోని రామ్‌టెక్‌లో శ్రీరామనవమికి జరిగింది. స్వయంసేవకులు త్యాగ నిరతితో ప్రజలకు సేవలందించారు. నేడు కూడా స్వయంసేవకులు స్వాభావికంగా కొత్త కొత్త వారితో పరిచయాలు పెంచుకొని, వారిని మిత్రులుగా మార్చుకొని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొనేట్లు చేస్తూ ఉంటారు. వర్తమాన సమయంలో కరోనా కారణంగా ఉత్పన్న మయిన పరిస్థితుల్లో సంఘానికి చెందిన వివిధ అనుబంధ సంస్థలు, స్వయంసేవకులు సమాజానికి అందజేసిన సేవా కార్యక్రమాలను దేశ ప్రజలంతా చూశారు.
పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కడయితే ప్రజల మధ్య సయోధ్య చాలా చాలా తక్కువగా ఉంటుందో అక్కడ సంఘం అందరిని కలుపుకుని వెళ్లే పద్ధతి ఒక మార్గంగా అగుపడుతుంది. ఒక భవనంలో కానీ, అపార్ట్‌మెంట్‌లో కానీ ఒక స్వయంసేవక్ ఉంటే అక్కడి వాతావరణంలో జీవం ఉట్టి పడుతుంది. నిర్లక్ష్యానికి గురవుతున్న ఒక గ్రామంలో స్వయంసేవక్ ఉంటే అక్కడి వారినందరిని ఒక్క చోటికి చేర్చి జాగృత పరుస్తాడు. అంతేకాదు పరస్పర సహకారానికి ఊపిరు లూది గ్రామ వికాసానికి చక్కటి బాటపరుస్తాడు.
దేశభక్తి అనేది ఒక అభిప్రాయం కాదనీ, ఒక వ్రతమని డాక్టర్జీ చెప్పేవారు. హృదయం అదృశ్యంగా ఉండి దేహానికి ఎలా సేవలందిస్తుందో, అదేవిధంగా దేశసేవ చేయాలనీ, పెరుగును కవ్వంతో చిలికి అందులోంచి వచ్చే వెన్నని సమాజానికి సమర్పిత భావంతో అందజేసి తాను ఆ మజ్జిగతో సంతృప్తి చెందినప్పుడే త్యాగ భావన జాగృతమౌతుందని కూడా ఒకానొక సందర్భంలో డాక్టర్జీ చెప్పారు. డాక్టర్జీలో కేవలం ఇలాంటి ఆలోచనలే కాదు, కార్యసాధన కోసం అత్యంత సహజమైన కఠోర పరిశ్రమ, త్యాగ భావన, సేవా తత్పరతతో పాటుగా యావద్దేశంలో పురుషార్థాలను జాగృతపరచే సాధన కూడా ఉండింది. ఆయన అడుగుజాడల్లోనే సంఘం అప్రతిహతంగా మునుముందుకు సాగుతోంది.
– సునీల్ అంబేకర్, ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత ప్రచార ప్రముఖ్
అను : విద్యారణ్య కామ్లేకర్