(ఏప్రిల్‌ 25, 2021)

‘‌చీరాల-పేరాల ఉదంతం ఆ ప్రాంతానికే చెందిన సమస్య అయినా, దాని చండ ప్రభావం వల్ల అది ముఖ్యమయిన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని మేటి ఉదంతంగానూ రూపొందటం చేత అది యావత్తు భారతావని దృష్టినీ ఆకర్షించింది’ అన్నారు టంగుటూరి ప్రకాశం (‘నా జీవితయాత్ర’).

 భారత జాతీయ కాంగ్రెస్‌ ‌మితవాద వర్గానికీ, అప్పుడే జాతీయోద్యమ నాయకత్వం చేపట్టిన గాంధీజీకీ బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం జలియన్‌వాలా బాగ్‌ ‌దురంతం, మాంటేగ్‌-‌ఛెమ్స్‌ఫర్డ్ ‌సంస్కరణలతో సడలిపోయింది. 1920 నాటి కలకత్తా కాంగ్రెస్‌ ‌ప్రత్యేక సమావేశాలలో సహాయ నిరాకరణ ఉద్యమం గురించి గాంధీ ప్రతిపాదించారు. దీనితో ఒక్క సంవత్సరంతోనే స్వాతంత్య్రం వస్తుందని కూడా చెప్పారు. ఈ సమావేశాలకు గుంటూరు ప్రాంతం నుంచి కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి (స్వామీ సీతారాం) హాజరయ్యారు. నాటి కాంగ్రెస్‌లో ఆ ఉద్యమం గురించి ఏకాభిప్రాయం లేకపోయినా భారతీయులు మాత్రం గాఢంగా నమ్మారు. గాంధీ చేసిన సహాయ నిరాకరణ ప్రతిపాదననే ఆ సంవత్సరం డిసెంబర్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ‌వార్షిక సమావేశాలు ఆమోదించాయి. ఈ పిలుపు నేపథ్యంతో దేశంలో చాలాచోట్ల ప్రజలు అహింసాయుత పంథాలో ఉద్యమంలోకి వచ్చారు. ఆ క్రమంలోని ఒక అద్భుత ఉద్యమ ఘట్టమే చీరాల-పేరాల.

భారతదేశం మీద తన ఆధిపత్యాన్ని పటిష్టం చేయడంలో బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వానికి బాగా ఉపయోగపడిన అంశాలు – మన సమాజంలోని విభజనలు, చీలికలు. ధనికులు, భూస్వాములతో నిండి ఉండే జస్టిస్‌ ‌పార్టీ బ్రిటిష్‌ అడుగులకు మడుగులొత్తేది. జాతీయ కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా నాయకత్వం(ప్రధానంగా) వహించిన బ్రాహ్మణులను తీవ్రంగా వ్యతిరేకించడం జస్టిస్‌ ‌పార్టీ సిద్ధాంతాలలో ఒకటి. కానీ ఇదేమీ పట్టించుకోని ప్రజాశ్రేణులు జాతీయ కాంగ్రెస్‌ ‌వెంటే నడిచాయి. జమీందార్లు, సంస్థానాధీశులు, కులీనులను బ్రిటిష్‌ ‌జాతి ముందునుంచి మచ్చిక చేసుకుంటూనే ఉంది. అలా హిందువుల మధ్య కూడా బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వం చీలికలు తెచ్చింది. నిజానికి ఆ మూడు అంశాలే చీరా-పేరాల ఉద్యమానికి నేపథ్యంగా కనిపిస్తాయి.

మొదటిదశ

చేనేత, రంగుల అద్దకమే ప్రధాన వృత్తిగా ఉండే ఊరు చీరాల. సముద్ర తీరానికి మూడు కిలోమీటర్ల ఇవతల ఉన్న ఆ ఊరి చుట్టూ కొబ్బరి, తాడి తోపులు, ఇతర చెట్లు, పెద్దగా పండని భూములు ఉండేవి. ఒక ఆలయం, ఒక చర్చి, ఒకే ధాన్యం మిల్లుతో అప్పుడప్పుడే (నాటి గుంటూరు జిల్లాలో) ఆధునిక వాసనలు సంతరించుకుంటున్నది. చీరాల, జాండ్రపేట, పేరాల, వీరరాఘవపేట అనే నాలుగు గ్రామాలు కలిపి పంచాయతీ యూనియన్‌గా ఏర్పరిచారు. ఈ ఏర్పాటు పన్నుల నిరాకరణ ఉద్యమం జరగడానికి దాదాపు నలభై ఏళ్ల ముందే, అంటే 1880 ప్రాంతంలోనే జరిగింది. ఆ యూనియస్‌ ‌వార్షికాదాయం రూ.4,000/-. ప్రధానంగా చేనేత కార్మికులు, రోజు కూలీలే ఉండే ఆ గ్రామాలు ఆనందంగానే ఉండేవి. ఇలా ఉండగానే 1919 నవంబర్‌లో మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ ప్రభుత్వం పిడుగుపాటు వంటి వార్త వెలువరించింది. చీరాల-పేరాల కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన రెండు గ్రామాలే యూనియన్‌లో ఉంటాయి. అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చు- ఇదే ఆ ప్రకటన సారాంశం. ప్రజలు విస్తుపోయారు. పెరిగే పన్నుల భారం వారి వెన్నులో వణుకు పుట్టించింది. మునిసిపాలిటీ ఏర్పడితే అప్పటిదాకా రూ. 4,000/- ఉన్న పన్నులు పదిరెట్లు, అంటే రూ. 40,000/-కి చేరతాయి.

పన్ను బాధ స్థానికులకు అంత వేగంగా అనుభవానికి రావడానికి గట్టి కారణం ఉంది. 1914లోనే చీరాలను విడదీసి మునిసిపాలిటీగా ఏర్పరచాలని మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ ఆలోచించింది. ఆ సంవత్సరం వచ్చిన ప్లేగ్‌, ‌సంభవించిన మరణాల ఆధారంగా శానిటరీ కమిషనర్‌ ‌మునిసిపాలిటీ ఏర్పాటుకు సిఫారసు చేశాడు. కానీ మునిసిపాలిటీగా మార్చడం వల్ల పెరిగే పన్నులను భరించే శక్తి ప్రజలకు లేదని నాటి జిల్లా కలెక్టర్‌ అభిప్రాయపడడంతో ఆ ప్రతిపాదన మూల పడింది. 1915లో జిల్లా బోర్డు కూడా చీరాల మునిసిపాలిటీ ఆలోచనకు విముఖత చూపించింది. ఇక్కడ ఒక ప్రశ్న. మునిసిపాలిటీగా మార్చడం ద్వారా ఒక ప్రాంతాన్ని ప్లేగ్‌ ‌వంటి అంటువ్యాధి నుంచి కాపాడగలమా? పక్కనే ఉన్న ఒంగోలు అనుభవం ఇందుకు విరుద్ధంగా ఉంది. 1876 నుంచే ఒంగోలు మునిసిపాలిటీ పాలనలో ఉంది. కానీ 1914 నాటి ప్లేగ్‌ ‌సంక్షోభం ఆ పట్టణాన్నీ వదలలేదు. ప్రాణనష్టమూ తప్పలేదు. ఈ వాస్తవాలను చీరాల వాసులు మరచిపోలేదు. మునిసిపాలిటీ నిర్ణయం ఇంకా అమలులోకి రాని క్రితమే, అంటే ఫిబ్రవరి 20, 1920లో రేట్‌ ‌పేయర్స్ అసోసియేషన్‌ ‌పేరుతో స్థానికులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ నేపథ్యంతో వెంటనే అర్జీలు పెట్టారు. ప్రతినిధి బృందాలు మద్రాస్‌ ‌వెళ్లాయి. ఫలితం శూన్యం. రెండు నెలలకల్లా చీరాలను మునిసిపాలిటీగా మార్చినట్టు ప్రకటన వచ్చింది. ఆర్‌డీఓ చైర్మన్‌గా, పదకొండు మంది కౌన్సిలర్లను ప్రభుత్వమే నియమించింది. ఈ ప్రకటన, పన్నులు కట్టవలసిన సమయం ఒకేసారి వచ్చాయి. మేం కట్టలేమని సవినయంగానే ప్రజలు ఆర్‌డీఓకు విన్నవించు కున్నారు. ముందు పన్నులు కట్టండి, తరువాత అప్పీలు సంగతి చూద్దాం అన్నాడాయన. ఈ మాట నమ్మి ఆరుమాసాలకు గాను పన్నులు చెల్లించారు. కానీ తమ వినతులకు సానుకూల స్పందన మాత్రం రాలేదు.

అప్పుడే మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీని ఏలుతున్న జస్టిస్‌ ‌పార్టీ ప్రభుత్వానికి కళ్లు బైర్లు కమ్మే పరిణామం జరిగింది. ప్రభుత్వం నియమించిన పదకొండు మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రజల కోరికలో న్యాయం ఉందని ప్రకటించారు. వెంటనే కలెక్టర్‌ ‌వచ్చి విచారించాడు. గ్రామస్తుల నుంచి మళ్లీ అదే విన్నపం వచ్చింది. మునిసిపాలిటీ ఆలోచన వద్దు. మళ్లీ నాలుగు గ్రామాలతో యూనియన్‌ను పునరుద్ధరించాలి. ఆఖరికి మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ స్థానిక స్వయం పాలన వ్యవహారాల మంత్రి రాజా రామరాయణింగార్‌ (‌పానగల్‌ ‌రాజా) చీరాల రావలసి వచ్చింది. ప్రజలే కాదు, రాజీనామాలు చేసిన కౌన్సిలర్లు కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలనే కోరారు. రామరాయణింగార్‌ ‌వ్యవహరించిన తీరు అగ్నికి ఆజ్యం పోసిందే తప్ప, సమస్యను పరిష్కరించలేదు. ఆయన పంతానికి పోయారు. బెదిరింపులకు దిగారు. పోలీసు బలగాలు దించి, సామూహిక సుంకం వసూలు చేస్తామని హెచ్చరించారు. రైల్వేస్టేషన్‌, ‌పోస్టాఫీస్‌, ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎత్తేస్తామని బెదిరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించకుంటే సైన్యాన్ని దించుతామని తుది హెచ్చరిక కూడా చేశారు. లోపాయికారీగా తన జస్టిస్‌ ‌పార్టీ వక్రబుద్ధిని కూడా ప్రదర్శించారు. చీరాలకు సమీపంలోనే ఉన్న నిడుబ్రోలు మునసబు ద్వారా కొందరు బ్రాహ్మణే తరులకు ఎర వేశారు. కులాన్ని రెచ్చగొడుతూ నామిటేడెడ్‌ ‌పదవులు ఇస్తానని చెప్పాడు (‘ట్రాజడీ ఆఫ్‌ ‌చీరాల-పేరాల’: జీవీ కృష్ణారావు). ఈ దుష్ట పాచికలాట విజయవంతం కాలేదు.

రెండోదశ

 చీరాల నుంచి మద్రాస్‌ ‌వెళ్లిన తరువాత కూడా మంత్రాంగం సాగిస్తూనే ఉన్నారు రామ రాయణింగారు. మిషనరీలు, ఇతర సభ్యులు ఉన్న కొత్త కౌన్సిల్‌ ‌సభ్యులను సంప్రదించారు. ప్రజలు ఎన్నుకునే చైర్మన్‌ ‌కాకుండా ప్రభుత్వమే జీతమిచ్చి ఏర్పాటు చేసే చైర్మన్‌ అయితే ఎలా ఉంటుందో యోచించమని కోరారు. చిత్రంగా ఈ కౌన్సిల్‌లో సభ్యునిగా ఉన్న అమెరికన్‌ ‌మిషనరీ థామస్‌, ‌చీరాలను మునిసిపాలిటీగా మార్చవలసిన అవసరమే లేదని జవాబిచ్చారు. మునిసిపాలిటీగా స్థాయి పెంచితే ప్రజలు పన్నులు చెల్లించలేరని ఆ కౌన్సిల్‌ ‌తేల్చి చెప్పింది. అయినా రామరాయణింగారు ఏప్రిల్‌ 1, 1921‌న కౌన్సిల్‌ అభిప్రాయాన్ని చెత్తబుట్టలో వేసి రూ.390/- వేతనంతో ఒక చైర్మన్‌ ‌నియమించి పంతం నెగ్గించుకున్నానని అనుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రజల సహనాన్ని నశింప చేసింది. తిరగబడ్డ ప్రజలు టోల్‌గేట్‌ను ధ్వంసం చేసి, రైలు పట్టాల మీద వేసి దగ్ధం చేశారు. కలకత్తా మెయిల్‌ ‌కొద్దిసేపు నిలిచిపోయింది. ప్రభుత్వం అణచివేత ఆరంభించింది. వందమంది రిజర్వు పోలీసులు దిగారు. వేతనం పుచ్చుకుని పనిచేస్తున్న చైర్మన్‌ ‌పోలీసుల సాయంతో ప్రజల మీద పడి హింసించడం మొదలుపెట్టాడు. పన్నులు కట్టని వారి ఆస్తులను జప్తు చేయడం ఆరంభించాడు. కానీ వాటిని వేలం వేస్తే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇంత ప్రజాగ్రహం ఎందుకో నాటి ‘ది హిందూ’ పత్రిక విలేకరి డీఎస్‌ఆర్‌ ‌రావు విశ్లేషించారు. ఆ వివరాల ప్రకారం- అక్కడ చేనేత, దాని అనుబంధ పరిశ్రమలలో పనిచేసే వారి రోజువారీ సంపాదన కేవలం నాలుగు నుంచి ఐదు అణాలు (అణా-ఆరుపైసలు). కాబట్టి ఇక్కడి ప్రజలు పన్నులు చెల్లించడానికి నిరాకరించారనే కంటే, పన్నులు కట్టే స్థితిలో లేరని చెప్పడం సబబు. అందుకే అక్కడ జరిగింది అణచివేత. 1921 మార్చిలో పన్నులు కట్టని నేరానికి పన్నెండు మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అందులో ఒకరు రావూరి అలిమేలు మంగమ్మ, నిరుపేద మహిళ. గాంధీయుగం ఆరంభమైన తరువాత రాజకీయనేరారోపణతో దేశం మొత్తం మీద జైలుకు వెళ్లిన తొలి మహిళ అలిమేలుమంగమ్మ (‘హిస్టరీ ఆఫ్‌ ‌ఫ్రీడం మూవ్‌మెంట్‌ ఇన్‌ ‌గుంటూర్‌ ‌డిస్ట్రిక్ట్- 1921-1947’; ‌డా.బి. శేషగిరిరావు) అని చెబుతారు.

మూడోదశ

ఒక్క ఏడాదిలో స్వాతంత్య్రం అన్న గాంధీజీ నినాదంతో స్వరాజ్యం గురించి కలగంటున్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఇదే సమయంలో ఉద్యమంలోకి వచ్చారు. ఎడింబర్గ్‌లో ఎం.ఏ. అర్ధశాస్త్రం చదివి, రాజమండ్రి, మచిలీపట్నాలలో ఉద్యోగం చేశారు. స్వతంత్ర భావాల వల్ల వాటిలో ఇమడలేక జాతీయోద్యమంలోకి వచ్చారాయన.1920 ప్రాంతంలో చీరాల దగ్గర ‘శ్రీమదాంధ్ర విద్యా పీఠ గోష్టి’ అనే విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ‘రామదండు’ అనే స్వచ్ఛంద దళంతో ఆయన బెజవాడ జాతీయ కాంగ్రెస్‌ ‌సభలను (మార్చి 31, ఏప్రిల్‌ 1, 1921) ‌విజయవంతం చేసి ఖ్యాతి గాంచారు. చిత్తరంజన్‌దాస్‌, ‌మహమ్మదలీ (అలీ సోదరులలో ఒకరు), గాంధీజీ వంటి జాతీయ కాంగ్రెస్‌ ‌పెద్దల మెప్పు పొందారు. బెజవాడ నుంచి ఏప్రిల్‌ 6‌న గాంధీజీ చీరాల వచ్చారు. పన్నులు కట్టడానికి నిరాకరించి జైలుకు వెళ్లిన అలిమేలుమంగమ్మతో సహా అందరినీ గాంధీజీ సత్కరించారు. మునిసిపాలిటీ వద్దని ఏకగ్రీవంగా ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా పెద్ద తప్పుచేసిందని వ్యాఖ్యా నించారు. అప్పుడే భవిష్యత్‌ ‌కార్యక్రమం గురించి గాంధీజీని గోపాలకృష్ణయ్య సలహా కోరారు. రెండు మార్గాలు సూచించారు గాంధీజీ. ఒకటి, సహాయ నిరాకరణతో పన్నులు చెల్లించకపోవడం. రెండు, ఖిలాఫత్‌ ‌నేపథ్యంలో ముస్లింలు చేపట్టిన హిజారత్‌ (‌ముస్లిం సంప్రదాయాలు గౌరవించేచోటుకి తరలిపోవడం), తులసీదాస్‌ ‌చెప్పిన దేశత్యాగం. ఇక్కడే గాంధీజీ ధోరణి వివాదాస్పదంగా కనిపిస్తుంది. ‘మీరు చేసే కార్యం విజయవంతమైతే కాంగ్రెస్‌ ‌మిమ్మల్ని అభినందిస్తుంది. అపజయం పొందితే ఆ బాధ్యత కాంగ్రెస్‌ ‌తనపై పెట్టుకోదు’ (‘ఆంధప్రదేశ్‌లో గాంధీజీ’, తెలుగు అకాడమి) అన్నారు. కాంగ్రెస్‌ ‌మీద ఆధారపడవద్దు మీ సహనంతోనే జయించండి అన్నారన్నమాట. ఇందులో దుగ్గిరాల ‘దేశత్యాగం’ వైపు మొగ్గడానికి కారణం ఉంది. సహాయ నిరాకరణ, పన్నుల నిరాకరణలో ఏదో ఒక దశలో సహనం నశిస్తుంది. వ్రతం చెడుతుంది. చీరాల శివార్లలోని భూములలో రామ్‌నగర్‌ ‌పేరిట ఒక గ్రామాన్ని నిర్మించారు గోపాలకృష్ణయ్య. ఇందులో రామదండు పాత్ర విశిష్టమైనది. అప్పటికే భారతీయులంతా సాక్షాత్తు దైవంలా భావిస్తున్న గాంధీజీ చెప్పిన స్వరాజ్యం మీద ఆయనకు గురి కుదిరింది. స్వరాజ్యం ఎలా ఉండాలో రామ్‌నగర్‌లో ప్రతిబింబింప చేయాలని స్వప్నించారు. అక్కడ ఒక కొత్త సామాజిక వాతా వరణం కల్పించడం ఆయన ఉద్దేశం. హిందూ ముస్లిం విభేదాలు లేకుండా, బీదాబిక్కీ, పెద్దకులం చిన్నకులం తారతమ్యం లేకుండా ఉండాలని కోరు కున్నారు. అదే ఆ రామభక్తుడు కలగన్న రామరాజ్యం. స్వరాజ్యం అంటే రామరాజ్యమనే ఆయన ఉద్దేశం. రామ్‌నగర్‌ను తాళనగరం అని కూడా ఆయన పిలుచుకున్నారు.

నాలుగోదశ

ఏప్రిల్‌ 25, 1921. ఆ ‌వేసవి రాత్రి మహాత్మా గాంధీకీ జై అన్న నినాదంతో చీరాల-పేరాల గ్రామాల ప్రజలు తాత్కాలికంగా నిర్మించిన రామ్‌ ‌నగర్‌కు ప్రయాణమయ్యారు. పేద, ధనిక; ఉన్నత, చిన్న కులాల తేడా లేకుండా అంతా తమ సామగ్రితో బయలుదేరారు. ‘ఆ దృశ్యాన్ని చూసి నేను కన్నీళ్లను ఆపుకోలేకపోయాను’ అని రాశారు ప్రముఖ భావకవి బసవరాజు అప్పారావు. ఈ వార్తను మరునాటి సంచికలో (ఏప్రిల్‌ 26) ‌హిందూ ప్రచురించింది, ‘ఎడ్లబళ్ల వరసలు, తమ తమ వస్తువులతో వ్యాపారులు రాత్రంతా కదిలారు.’ దాదాపు పదిహేనువేల మంది. కేవలం గాంధీజీ సూచన మీద గౌరవంతో కదిలారు. చీరాల నుంచి 75 శాతం, పేరాల నుంచి 50 శాతం రామ్‌నగర్‌ ‌చేరుకున్నారు. అన్నీ పర్ణశాలలే. చిన్నా పెద్దా, 20 నుంచి 40 రూపాయల వ్యయంతో నిర్మించారు. అక్కడే పంచాయతీ, న్యాయ వ్యవస్థలను గోపాలకృష్ణయ్య ఏర్పాటు చేశారు. ఆయన మాటే అక్కడ వేదవాక్కు. నిజానికి ఆ సంవత్సరం మార్చి 31న విజయవాడలో చిత్తరంజన్‌దాస్‌ ‌చేసిన వ్యాఖ్య కూడా దీనికి అద్దం పడుతుంది. అప్పటికే, అక్కడ గవర్నర్‌ ‌పాలన లేదనీ, ఉన్నదల్లా గోపాలకృష్ణయ్య పాలనే అని దాస్‌ ‌వ్యాఖ్యానించారు. కానీ పరిస్థితు లన్నీ రామ్‌నగర్‌కు అనుకూలంగా లేవు. ఆ సంవత్సరం ఉష్ణోగ్రతలు దారుణంగా ఉన్నాయి. వర్షాలూ ఎక్కువే. వదిలివచ్చిన ఇళ్లలో పాములు, నక్కలు సంచరించడం ఆరంభమైంది. దారులన్నీ పచ్చగడ్డితో నిండిపోయాయి. రామ్‌నగర్‌ ‌చేరినవారిలో చాలామంది నిరుపేదలు. కొన్ని విరాళాలు వచ్చాయి. మే3వ తేదీన టంగుటూరి ప్రకాశం రామ్‌నగర్‌ ‌వెళ్లారు. ఆయన ఒక్కరే రూ. 3,000 విరాళం ఇచ్చారు. ‘ఆ పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులలో నేను చీరాల ప్రాంతానికి వెళ్లాను. అచ్చట ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఆ గ్రామాలకు చెందిన యావత్తు జనమూ బీదాసాదా ముసలీ ముక్కీ, బ్రాహ్మణ అబ్రాహ్మణాది విభేదాలు ఈషణ్మాత్రం లేకుండా ఏకగ్రీవంగా ఆ గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాలలో స్థావరాల ఏర్పాటు చేసుకోవడానికి ఆనందంగా బయలుదేరారు. ఇంతకంటే ఆశ్చర్యకర మైన సంఘటన ఉంటుందా’ అని రాశారు (‘నా జీవితయాత్ర’). ప్రభుత్వ అధికారులు కొందరిని పురమా యించి చీరాలలో ఖాళీగా ఉన్న ఇళ్లలో కొన్నింటిని తగులబెట్టించారు. రామ్‌నగర్‌ ‌నిర్మించిన చోటు ప్రభుత్వానిది కాబట్టి, అక్కడ గుడిసెలు వేసినందుకు రూ.1,026 వంతున జరిమానా విధించారు.

ఐదోదశ

ఎన్ని చేసినా రామ్‌నగర్‌ను ఆర్థికంగా ఆదుకోవడం గోపాలకృష్ణయ్యకు శక్తికి మించిన పనే అయింది. చిన్న చిన్న విరాళాలు తాళనగరం ఖజానాను పటిష్టం చేయలేకపోతున్నాయి. సెప్టెంబర్‌ 28, 1921‌న బరంపురంలో జరిగిన ఆంధ్ర మహాసభలకు దుగ్గిరాల హాజరయ్యారు. అక్కడ కొంత నిధి వసూలు చేయడం ఆయన ఉద్దేశం. ఆ రోజునే వేదిక మీద స్థానిక స్వపరిపాలనా శాఖామంత్రి రామరాయణింగార్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ రోజు సాయంత్రం గురజాడ కృష్ణమూర్తిపంతులు అనే ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుంటే పోలీసులు వచ్చి వారెంట్‌ ‌చూపించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ‌టీజీ రూథర్‌ఫర్డ్ ‌సంతకంతో ఆ వారెంట్‌ ఉం‌ది. దాని ప్రకారం రెండు నెలల పాటు ఎక్కడా గోపాలకృష్ణయ్య ప్రసంగించరాదు. కానీ ఆ ఆదేశాన్ని తాను ఉల్లంఘిస్తున్నట్టు ప్రకటించారాయన. అక్టోబర్‌ 1‌న మరొక వారెంట్‌ ‌జారీ చేసి అరెస్టు చేశారు. అక్కడ నుంచి తిరుచ్చి జైలుకు తరలించారు. 1922 అక్టోబర్‌లో విడుదలయ్యారు.

గోపాలకృష్ణయ్య జైలుకు వెళ్లిన తరువాత చీరాల-పేరాల నెమ్మదిగా ఖాళీ అయిపోయింది. రామ్‌నగర్‌ ఉద్యమ వేదిక చరిత్రలో భాగమైంది. కానీ ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. విభజించి పాలిం చడం ఆంగ్లేయుల తత్త్వం. ఇక్కడ మనం విడి పోయాం, వాళ్లు ఏలారు అనడం సబబు. హిందూ ముస్లింల మధ్యనే కాదు, హిందువుల మధ్య కూడా వారు విభజన రేఖలు గీశారు. అంతేనా, జాతీయ కాంగ్రెస్‌కు కూడా ఆంగ్లేయుల నుంచి ఆ విభజించే నైజంతో పాటు, వివక్షను కూడా అంటించుకున్న దేమోనని అనిపిస్తుంది. చీరాల-పేరాల ఉద్యమ వైఫల్యంలో ప్రతిబింబించేది ఇది కాదా?

About Author

By editor

Twitter
YOUTUBE