– మహ్మద్‌ ‌షరీఫ్‌

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి…

ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి….

రాక్షస సంహారానికి భగవంతుడు దశావతారాలెత్తాడు. కలియుగంలో మానవుల బాధలను తీర్చడానికి, మానసిక సమతౌల్యాన్ని సాధించడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి స్త్రీ రూపంలో ఆదిశక్తే అమ్మగా, భార్యగా ఈలోకంలో రకరకాల పాత్రలను పోషిస్తోంది. సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, లోకమనుగడకే కాక, సంసారానురక్తి, సహజీవన శక్తిగా నిలిచి, విభి•న్న కాలాల్లో భిన్న పాత్రలతో ఈ లోకాన్ని నడిపిస్తున్న గొప్ప శక్తియే స్త్రీ. యుగాలు మారినా, కాలాలు మారినా ఆ శక్తి పాత్ర ద్విగుణీకృతమైందే కాని ఎప్పుడూ సన్నగిల్లలేదు..

దూరంగా రేడియో పాట, దానికి అర్థం వినపడుతోంది.

ఏందే భూది గింత పొద్దుగాల్లొచ్చినవు, అన్న దొర మాటలకు భయపడినంత పనైంది భూదికి.

నీ బాంచన్‌ ‌దొర గిట్లనే వొచ్చిన… గది… గది…

అమ్మగారి దగ్గర కొచ్చినవా! పో లోపటికి.

దొర్సాని నీ కాల్మొక్కుత గా వొరి గోసిన కూలి పైసల కొచ్చిన. గీపూటకు పొయ్యిమీదికి ఏమిలేదు, నీ గులాప్‌ ‌దాన్ని.

నేను దొరకు జెపుతగని, గా బాసాన్లు తోము.

గట్లనే దొర్సాని, గా కూలిపైసలు ఇప్పియ్యి.

దొర్సాని బాసాన్లు తెచ్చి గచ్చుల పెట్టంగనె, భూది కడుగుతుంటె. దొర్సాని కుర్చీమీద కూర్చొని ఊర్లోని విషయాలు ఒక్కొక్కటి అడుగుతుంటె భూది తెలిసినవి చెప్పుకుంటూ తెలియంది ఏమోనమ్మా అంటూ బాసాన్లు తోమేసింది.

ఏమండి భూదికి కూలి పైసలట…..

ఏ కూలే భూది అని దొర వాసర్ల గూసొని గట్టిగ అడ్గంగనె, పైన పానం పైననే పోయి నట్లయ్యింది.

మొన్న చెరువు కింద వొరి గోసింది దొర.

వరికేమన్న గింజలున్నయా, ఒట్టి గడ్డేనాయె భూది.

దొర, అంతా ఎండకు మాడిపోయిన గడ్డే. పసుల మ్యాతకొస్తదని, నువ్వేకదా దొర కోపిచ్చి కట్టలు కట్టి పెట్టుమన్నవు.

సరే లేవే నేను చిట్టి రాసిస్తా, సౌకారి దగ్గరకు పోయి, నూకలు ఇస్తడు తీసుకపో.

గట్లనే దొర నీ కాల్మొక్త ! అని దొర రాసిన చిట్టిని సౌకారి దుకాణానికి పోయి చూపెట్టింది. సౌకారి ఐదు కిలోల నూకలు, ఉప్పు, మిర్పకాయలు, మంచినూనె, చింతపండు కాయిదంల పొట్లాలు గట్టి ఇయ్యంగనే, ఉరుకులు పరుగులతో ఇల్లు చేరింది భూది.

అమ్మా ఆకలే, బువ్వొండే అని పిల్లలు అనగానే, జెర్రాగుండ్రి బిడ్యా నూకలు తెచ్చిన పొయ్యిమీద ఎక్కిస్త. అయ్య ఏడికి పోయిండ్రా.

ఎవరో పొయిల కట్టెలు కోసము మొద్దు నరుకుమన్నరట.

పొయ్యి మీద నూకలు ఉడుకుతుంటె, ఇంత చింతపండును, ఉప్పు మిర్పకాయలేసి తొక్కు నూరింది.

నూకల గంజి ఒంపి, అందులో ఉప్పేసి, బాగా కలిపి బిడ్యా అయ్యొచ్చేటాకల్ల మనిషింత గంజి తాగుండ్రి అని ఇద్దరి గిన్నెలల్ల పోసి ఇచ్చింది. వాళ్లు తాగుతుంటె, బొగ్గుతోటి పండ్లు తోముకొని, మొఖం కడుక్కుంది. అప్పుడే సామయ్య గొడ్డలి పట్టుకొని బయటనుంచి వొచ్చిండు.

ఏమేయ్‌ ఏమన్న వొండినవా! అని అలసిపోయిన గొంతుతో అడిగాడు సామయ్య.

కాళ్లుశేతులు కడుక్కోనిరా, పెడత అని భూది, అందరికి నూకల బువ్వ, చింతకాయ తొక్కు గిన్నెల వెట్టి, ఎవ్వరిది వారికి ఇచ్చింది. ఆకలికి అమృతంలా అనిపించింది అందరికి.

పిల్లలకు ఇంకింత ఉంటె పెట్టే, తింటరేమో అన్నడు సామయ్య. భూది వండిన కుండను చూపిస్తూ  అందరికి పిడికెడు వొస్తట్టు వొండిన. ఒకటే పూట కడుపునిండ తింటె ఐదు కిలోల నూకలు రెండు రోజులల్ల అయిపోతయి. మల్ల ఏమిదింటరు. కరవు వొచ్చి మూడేండ్లు ఎల్లి నాలుగోది నడవవట్టె, చెరువులు ఎండె, తాగుతందుకు నీళ్లు దొరకక కోసు దూరం పొయ్యి మోట బావులకాడనుండి తెచ్చుకోవర్తిమి. ఇంట్ల వాడుకుంతందుకు, సర్కార్‌ ‌శాదబాయికాడ ఎప్పుడు పదిమంది నిలవడే ఉండవట్రి. బాయిల బొక్కెన గూడ మునగకపాయె, శెంబెడు, శెంబెడు శేదుకుంట కడవలు నింపెటాకళ్ల, రెండు కడవలకు గంట వట్టవట్టె. అర్రలున్న అన్ని దొంతులు సదిరినా శారెడు ఇత్తులు లేకపాయె. రేపు వానలు వడితె ఇతనాలకని వుంచిన మక్కజొన్నలు బట్టల గట్టి దూలం మీద పెట్టినయే మిగిలినయి. పండో, కాయో దొరుకుతదంటె వానలు లేక ఎక్కడియక్కడ చెట్లు ఎండిపాయె. ఆ దేవున్కి ఎప్పుడు దయోస్తదో ఏమో, వానలు ఎప్పుడు పడ్తయో ఏమో. దేవుడా జల్దిన కండ్లు దెరువు.

పిల్లలకు కరవు, కష్టమేమి తెలుస్తది. ఆటకోకిలి పిల్లలు అవ్వా ఆకలి అనంగనే కండ్లల్ల నీళ్లు రావట్టె ఏం జెయ్యాలె. పాత శీరెను శింపి నడుముకు గట్టిగా కట్టుకొని ఆకలి కాకుండా, నడుస్తందుకు ఆసరగా ఉంటుందని ఆలోచించుకొని భూదేవి కట్టుకుంది. అవ్వా గట్ల ఎందుకు కట్టుకున్నవు అని పిల్లలు అడిగితె, నడుముకు గట్టిగా ఉంటుందని, వొడ్యాలము బదులు అని పిల్లలకు శెప్పేది. తాను కడుపు గట్టుకొని, మొగనికి, పిల్లలకు బుక్కెడు పెడుతూ, తాను మాత్రం గంజిలో కొన్ని అన్నం మెతుకులు, ఉప్పు వేసుకొని తాగి కడుపు నింపుకొనేది.

స్వామికి రెండు ఎకరాల భూమి, ఒక పాలిచ్చె బఱ్ఱె ఉండె. రెండెకరాల భూమిలో కూలీలతో దున్నించి పంట పండించేవాడు. భార్య భూదేవితో కలిసి కూలీకి వెళ్లేవాడు. తమ భూమిలోని పంట సంవత్సరానికి తినడానికి భోజనానికి, రోజు చేసే కూలి, ఖర్చులకు పోను కొంత వెనుక వేసుకొనేవారు. బఱ్ఱె పాలతో పెరుగు, చల్ల చేసి అందరికి దానం చేసేవారు. పిల్లలను సర్కారు బడికి పంపేవాళ్లు. ఒక్కసారి కరవు రావడం అది నాలుగేండ్లు సుక్కవాన పడకుండా రావడం వలన, పనిలేక పంటలు పండక, తిండి దొరకక చావు బతుకుల మధ్య నడుస్తుంది సంసారం. కరవు వల్ల ఏ సౌకారి అప్పు ఇవ్వకపోగా, అంతకుముందు మాట్లాడినట్లు మాట్లాడడం కూడా లేదు. పట్నం దిక్కు పనికి పోయినోళ్లు అక్కడ పనిలేక తిరిగి రావట్రి. చేద్దామంటె పని దొరకదు. తిందామంటె తిండి లేదు. తాగుదామంటె నీళ్లు లేవు. ఇదొక భయంకరమైన కరవు. ఈ కరవు నుండి బయటపడితె గాని మనిషి ఉండడు. లేకపోతే ఊళ్లకు ఊళ్లు స్మశానం లెక్క అయిపోతయి.

– – – – – – – – – – –

ఏమయ్యా ఏమైన పని దొరికిందా, బయటినుండి ఉసూరుమంటు ఇంటికొచ్చిన మొగన్ని అడిగింది భూది.

లేదే ఏమిలేదు మొన్న కట్టెలు కొట్టిన కూలి తెచ్చుకుందామని పోతె రేపు రమ్మన్నడు. ఇన్ని తైదలు పెడత అన్నడు.

ఆడోళ్లందరు చిన్నగుట్ట అడవికాడికి పోతున్రట. యాపగింజ లేరుతందకు. నేను పిల్లలను యెంటేసు కొని పోత. రేపు మస్కులనే పోవాల్నట.

పెద్దోన్ని తీసుకపో, శిన్నోడు వద్దే. వాడు అంతదూరం నడవడు.

ఇద్దరొస్తె నాలుగిత్తులు ఎక్కువ దొరుకుతయి. వస్తా, వస్తా బురద కుంట్ల కడుక్కొని రావాలె.

పిల్లలు పైలం, ఇస్కులుకు పోయె పిల్లలు ఎప్పుడు ఏ పని చెయ్యని పిల్లలు, ఈ కరవు వల్ల గిసోంటి పని చేయవలసి వచ్చె.

మస్కులనే భార్యా పిల్లలను లేపి, తలో సంచిచ్చి యాపగింజ లేరుతందుకు తోలిండు సామయ్య.

వాడకట్టొల్లు, ఆడోల్లందరితో కలిసి భూది, పిల్లలను తోలుకొని ఏడుకోసులు నడుసుకుంటూ పోయి, శిమ్టి సంచి నిండ యాపపండ్లను ఏరుకొచ్చిండ్రు. తొవ్వలున్న బురదకుంట్ల బండమీద పోశి నీళ్లు వోసుకుంటు చేతులతో రాసుకుంటూ కడిగి, నీళ్లు కారుతుంటె సంచిల నింపు కొచ్చిండ్రు. సంచిని వాకిట్ల గుమ్మరిచ్చి ఎండ వోశి పిల్లలు కాళ్లుశేతులు కడుకున్నరు. నూకలు పొయ్యి మీద వెట్టి కాళ్లుశేతులు కడుక్కుంది భూది.

ఈరోజు గండం గడించింది మరి రేపటి కెట్ల అని ఆలోచిస్తూ ఏమిచేయాలో తోచక భర్త వైపు చూస్తూ, పిల్లల దిక్కు చూస్తూ కళ్ల నీళ్లు పెట్టుకుంటూ ఏడ్వవట్టింది.

భూది ఏడ్వకే – నువ్వు ఏడుస్తే నాకు ఎటూ మన్సునవట్టదే అంటూ భార్యను ఓదార్చాడు.

నాయినా అమ్మ పేరేందే, భూది, భూది అని ఎప్పుడు పిలుస్తుంటవు.

అదా బిడ్యా నువ్వు దేనిమీద నిలబడ్డవు.

నేనా భూమి మీద, అంటె అమ్మపేరు భూమి గదేరా, భూదేవి, ఈ పపంచం అంత మోస్తది. గిప్పుడు ఈ ఇంటి బరువంతా మోసున్నది.

మరి నీ పేరు సామయ్య అంటరు కద. గదేనా నీ పేరు.

నా పేరు మా అవ్వ, అయ్య ఏడుకొండల స్వామి అని వెట్టిండ్రు గట్ల అందరికి పిలువరాక స్వామి, స్వామి అని పిలుసుకుంటు గిప్పుడు సామయ్య అయింది బిడ్యా.

ఏమయ్యా ఇంట్లొక ఇత్తు లేక పాయె శేస్తందుకు పనిలేక పాయె. ఆకలితో పిల్లలు సచ్చిపోతరు. నువ్వు కోపము శెయ్యనంటె నేనొకటి శెపుత అని గునిగింది భూది.

శెప్పే ఎర్రిమొఖమా, నువ్వు ఏమి శెప్పినా ఇంటి గురించే ఉంటది.

గీ పుస్తెలు తీసుకపోయి అమ్మెయ్యి మూడునెలల సరిపొయ్యె గాసమొస్తది. లేకుంటె పిల్లలు ఆకలి తోటి సచ్చిపోతరు.

వద్దే భూది పెండ్లిల మామయ్య, అవ్వ కోడలికి పేమతో తెచ్చింది. గది గూడ అమ్మితే నేను సచ్చేదాక నీకు శేపియ్యనేమో.

పేమ బంగారంల ఉండదయ్య, నీ శేతులతో పసుపుకొమ్ము కట్టు చాలు గదే నాకు బంగారం లెక్కనే.

గట్లనే తీసి ఇయ్యే, సౌకారి ఇంటిదాక పోయివొస్త. అని భూది ఇచ్చిన పుస్తెలు తీసుకొని సౌకారి ఇంటికి పోయి అమ్మి కింటల్‌ ‌బియ్యము, తీసుకొచ్చి ఇంట్లో ఏశిండు.

ఒక్కసారి గంత బియ్యాన్ని సూశి శాలా రోజులయ్యింది. ఆ ఇంటొళ్లకు.

అమ్మా ఆకలేస్తుందే అన్నమొండు అని శిన్నోడు అంటుంటె.

అమ్మా ఈరోజు పసుపన్నంవొండె అని పెద్దోడు శిన్నప్పుడు తిన్న అని బతిమాలాడు.

గట్లనే బిడ్యా అని ఆ దినము కడుపు నిండ తినాలని పసుపు వేసి వండింది. సామయ్య గాలాలతో పట్టుకొచ్చిన శాపలతో దప్డం గాసింది భూది.

చీకటి పడుతుంటె దీపాలు ముట్టించింది భూది. పిల్లలు ఎప్పుడు తిందామని వంట ఇంటి దిక్కే చూస్తున్నరు.

అందరు వరుసగా కూర్చున్నరు. అందరి గిన్నెల్లో నిండ అన్నం శాపల దప్డం బోసింది భూదేవి. అది చూడగానే ఆనందంతో ఉప్పొంగింది వాళ్ల మనసు.

ఒకసారి సుడిగాలి రావడం వలన, దీపం ఆరిపోతుందని అన్ని దర్వాజలు కిటికీలు మూసింది భూది. దర్వాజ సందులనుంచి, ఎంటిలేటర్ల నుండి దుమ్ముతో కూడిన గాలి ఇంట్లో అంత నిండి పొయ్యింది. రెండు బుక్కలు తిన్నరో లేదో, దుమ్ము పడకుండా అందరు గిన్నెల మీద చేతులు అడ్డం బెట్టుకొని కూసున్నరు. ఉరుములు, మెరుపులతో వాన. ఇల్లు అక్కడక్కడ ఊరుస్తుంటె భూది కుండలు, గిన్నెలు పెట్టింది.

ఇగ తినరాదు బిడ్యా, మీరు తినుండ్రి అని స్వామి బువ్వ తినకుండ లేచిండు. పిల్లలు నాలుగు ముద్దలు తిని వారు లేచిండ్రు. ఎడతెరిపి లేకుండా కుండపోతగా రాత్రి ఒంటిగంట వరకు ఒకటే వాన. వాన వెలియగానే వెన్నెల ఆకాశంలో, బయట ఒకటే చప్పుడు. అందరం బయటకొచ్చి సూస్తె ఆనందంతో ఇండ్లనుంచి ఊరు ఊరంతా బయట కొచ్చిండ్రు, మేము అందరిలో కలిశాం.

కొంతమంది అప్పుడే చెరువుకు పోయిండ్రు. చెరువు నిండి అలుగు వారుతుంది. అది రాత్రిలాగా లేదు. కరవు పోయి అందరికి తెల్లారినట్లు అనిపించింది.

తెల్లారగనే అంతా సందడే, నాగండ్లు తీసుకొని దున్నుటకు మొగవాళ్లు శేన్లళ్లకు పోతుంటె నిన్న మొన్న రూపాయి అప్పు ఇవ్వని కోమటొల్లు పిలిచి అందరికి ఉద్దెరగా సామాను, ఇత్నంవొడ్లు, జొన్నలు అన్ని ఇయ్యవట్రి. ఎంత మార్పు చెరువు నిండడంతో పంటలు పండినట్లు సౌకార్లు అప్పులు ఇయ్యవట్రి. నాలుగేండ్ల కరవులో అందరిలో ఒకరకమైన బాంధవ్యాలు, ప్రేమలు దూరమై రేపు ఎలా ఉంటుందో, బ్రతికిన వాడే మనవాడు ఎవరేమనుకున్నా సరే అని మొండిగా ఉన్న సేట్లు వాన కురియంగనే అందరిపై ప్రేమ కురిపిస్తూ లావాదేవీలు శేయవట్టిండ్రు.

తెల్లారంగనే నా దగ్గరికిరా, నా దగ్గరికిరా కూలికి అని పోటి మీద పిలవ వట్టిండ్రు రైతులు.

బిడ్యా ఇక మన కష్టాలు దూరమైనయి. మీ అవ్వ కడుపు గట్టుకొని తక్కువ దిని నాకు, మీకు ఇంత ఎక్కువ అంబలో, గంజో పోసిందిరా, లేకుంటె కరవులో సచ్చిపోయెటోల్లం.

అవ్వా నీ ఆకలికై కడుపుకు బట్టకట్టుకొని మాకు వెట్టినవు. నీకెమన్న అయితె ఎట్ల అని పిల్లలు భూదిని అడిగారు.

మీకు ఆకలితీరితే నాకు ఆకలి తీరినట్లె బిడ్యా. మీ ప్రేమనే నాకు కడుపు నింపింది. తల్లిప్రేమ అంటె గదే బిడ్యా అని ఇద్దరిని రెండు సంకల్లో తీసుకొని దుఃఖించింది.

భూదేవి ఇక ఏడ్వకే మన కష్టాలు తీరినవి. ఆ దేవుడు కన్ను దెరిశిండు, వాన గురిపించిండు. ఇక మనకు భయం లేదు.

అవతార పురుషుడే అమ్మ రూపమున అవతరించె ఈ లోకమున… అని దూరం నుండి పాట వినబడుతుంది.

అది నిజమే అనిపించింది మాకు !

About Author

By editor

Twitter
YOUTUBE