– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్
అనుకున్నట్టే అయింది. రెండోదశ కరోనా, బహురూపి కరోనా ఇప్పుడు మొదటి దశ కరోనాను మించి వేగంతో దేశాన్ని కబళిస్తున్నది. తొలి కరోనా శరవేగంతో వస్తే, గాలిద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్న ఈ దశ కరోనా వాయువేగంతో కమ్ముకొస్తున్నది. ఒకప్పుడు అమెరికా, బ్రెజిల్, ఇంగ్లండ్, రష్యా వంటి దేశాలలో రోజుకు లక్షలలో నమోదవుతున్న కేసులను చూసి మనమంతా భయపడ్డాం. ఇప్పుడు అంతటి ప్రమాదం మన ముంగిటకే వచ్చింది. మళ్లీ లాక్‌డౌన్ జాడలు తోసుకువస్తున్నాయి. గుడులు, బడులు మూతపడుతున్నాయి. కొన్ని నగరాలు రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఢిల్లీ వారం పాటు లాక్‌డౌన్ విధించింది. వలస కార్మికులు మళ్లీ స్వస్థలాలకు ప్రయాణమవుతున్నారు. ఒక పెద్ద ముప్పును ఎదుర్కొనక తప్పదా అన్న భావన సర్వత్రా వ్యాపించిన మాట నిజం. పాజిటివ్ కేసులలో అమెరికా, బ్రెజిల్, టర్కీలను అధిగమించి భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. సోమవారం (ఏప్రిల్ 20) నాటి సమాచారం ప్రకారం ఒకే రోజు 2,73, 810 కేసులు నమోదైనాయి. 1600 మందికి పైగా బలయ్యారు. దీనికి కారణం- కరోనా తీవ్రత మాత్రమే కాదు, ప్రజల అలసత్వం కూడా.
తొలిదశ కరోనాను దేశం సమర్థంగానే ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు, మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపు చర్యలను పకడ్బందీగా అమలు చేసి కరోనాను కనిష్టస్థాయిలోనే ఉంచింది. మరణాలను నియంత్రించింది. పాలకులు, అధికార యంత్రాంగం, ప్రజలు సమన్వయంగా ముందుకు సాగడంతో మహమ్మారిని అదుపులో ఉంచగలిగింది. కానీ ఈ దశ కరోనా విలయ తాండవం చేస్తోంది. బాధితులతో వైద్యశాలలు కికిటలాడుతున్నాయి. ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అత్యంత విషాదంగా స్మశానాల ఎదుట మృత దేహాలతో జనం బారులు తీరుతున్నారు. తొలిదశ అనంతరం కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో ఒకింత నిర్లక్ష్య భావన పెరిగింది. ఇక ఏమీ కాదన్న ధీమా పెరిగింది. నివారణ చర్యలను ఉపేక్షించారు. భారతీయుల్లో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి ఉందని, కరోనా ఇక ఏమీ చేయదన్న కొందరి వ్యాఖ్యలు కూడా నిర్లక్ష్యానికి కారణమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, బంధువుల రాకపోకలు, ప్రభుత్వ పరంగా ఎన్నికల నిర్వహణ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పెరిగాయి. ఈ కనీస జాగ్రత్తలు పాటించడమే ఇప్పటికీ మేలైన నివారణ చర్యలని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. మందుల వాడకం, వైద్యశాలల్లో చేరడం నివారణలో రెండో దశ పక్రియ. మొదటి పక్రియను పకడ్బందీగా అమలు చేస్తే దాదాపుగా కరోనాను నియంత్రణలో ఉంచవచ్చు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం, వైద్య రంగం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
గాలిద్వారా కరోనా వ్యాపిస్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందుకు బలమైన ఆధారాలు ఉన్నట్లు అంతర్జాతీయ వైద్య పత్రిక ద లాన్సెట్ వెల్లడించింది. బ్రిటన్, అమెరికా, కెనడాలకు చెందిన ఆరుగురు వైద్య నిపుణులు ఈ విషయాన్ని నిర్ధారించారు. దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు లేని వారి నుంచి కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మొత్తం కేసుల్లో ఈ తరహా కేసుల వాటా దాదాపు 40 శాతం వరకు ఉండవచ్చని అంచనా. మరోపక్క కళ్లలో నుంచీ వైరస్ చొరబడు తుందన్న తాజా వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీన్ని నివారించేందుకు కళ్లను పూర్తిగా కప్పి ఉంచే జోళ్లను వాడాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి సూచిస్తున్నారు. ఉపరితలాలపైనా వైరస్ ఉండొచ్చన్న వార్తలు ఆందోళన కలిగించేవే. ముఖ్యంగా శీతల ఆహార పదార్థాలపై వైరస్ ఎక్కవ కాలం మనగలుగుతుంది. అయితే అది అంతగా విస్తరించకపోవచ్చు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అన్నింటి కన్నా ముఖ్యమైనది స్వాబ్ సేకరణ. దీనిని సరిగా రవాణా చేయకపోయినా, ప్రయోగశాలల్లో సరిగా నిల్వ చేయకపోయినా తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రెండు మూడుసార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మరోపక్క అన్ని దేశాల్లో కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు నెలల నుంచి కేసులు రెట్టింపు అవుతున్నా యని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ హెచ్చరించారు. తొలిదశలో అమెరికా, బ్రెజిల్, ఇటలీ వంటి దేశాలు కేసులు, మరణాల్లో ముందుండేవి. ఇప్పుడు భారత్ ఆ స్థానానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 18నాటికి దేశంలో 1,47,88,109 కేసులు నమోదు కాగా, 1,77,150 మంది మరణించినట్లు అంచనా. ఒక్క ఏప్రిల్ 18వ తేదీనే 2,61,500 కేసులు నమోదు కాగా 1,620 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 18వ తేదీ నాటికి 48వేలకు పైగా కేసులతో బ్రెజిల్, 48,176 కేసులతో అమెరికా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఏప్రిల్ 18న 7,70,529 కేసులు నమోదు కాగా, 11,320 మంది కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,18, 51, 207 కేసులు నమోద య్యాయి. 30, 29, 516 మందిని కరోనా బలి తీసుకుంది. ఈ గణాంకాలు ప్రజలను, పాలకులను భయపెడుతున్నాయి.
మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, యూపీ, మధ్యప్రదేశ్‌ల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. తెలంగాణలో గత రెండువారాల్లో 107 మంది మరణించినట్లు సర్కారీ లెక్కలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈనెల 17న ఒక్కరోజే 5093 కేసులు నమోదు కాగా, 15 మంది కన్నుమూశారు.మొత్తం కేసుల్లో మరణాల శాతం తక్కువగా (0.51 శాతం) ఉన్నప్పటికీ ఈ సంఖ్య క్రమేపీ పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కరోనాపై పోరులో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పేరున్న పోలీసుల విషయంలో తెలంగాణ సర్కారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలిదశలో కరోనాతో దాదాపు 60 మంది పోలీసులు కన్నుమూశారు. పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్ విధుల్లో పాల్గొనేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరీ అత్యవసరమైతే తప్ప దర్యాప్తుల కోసం కొత్త ప్రాంతాలకు వెళ్లరాదు. మాస్కుధారణ ఎట్టి పరిస్థితు ల్లోనూ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏపీలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఈనెల 17న 35,992 నమూనాలను పరీక్షించగా 6582 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఈనెల 18న 10,723 కేసులకు 42 మంది కన్నుమూశారు. కర్ణాటకలో 19,067 కేసులకు 81 మంది మృత్యువాత పడ్డారు.
కేంద్రం చర్యలు…
రెండోదశ కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం తన సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇప్పుడు ఎక్కువ కంగారు పెడుతున్న సమస్య, మెడికల్ ఆక్సిజన్ కొరత. వాయువేగంతో కేసులు పెరుగుతున్నందున ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు చేపట్టింది. డిమాండ్ మేరకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు 24 గంటలూ ఆక్సిజన్ ట్యాంకర్లను నడపాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం షిఫ్టులవారీగా పని చేయాలని, ఖాళీ సిలిండర్లను భర్తీ చేసే ప్లాంట్లు 24 గంటలూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశ్రామిక సిలిండర్లను కూడా మెడికల్ ఆక్సిజన్ సరఫరా కోసం అనుమతించారు. నైట్రోజన్ ట్యాంకర్లను ఆక్సిజన్ ట్యాంకర్లుగా మార్చి కొరతను అధిగమించాలని నిర్దేశించారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా 132 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించారు. వీటి ఏర్పాటును వేగవంతం చేయాలని నిర్ణయించారు. చికిత్సకు వాడే రెమ్‌డెసివిర్ ఔషధం దుర్వినియోగం కాకుండా చూడాలని, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. జనవరి-ఫిబ్రవరిల్లో ఈ ఔషధం ఉత్పత్తి 27 నుంచి 29 లక్షల వయల్స్ మేరకు ఉండగా, మే నెల నాటికి 74.10 లక్షల వయల్స్‌కు చేరుకుంటుందని అంచనా.
వెంటిలేటర్ల కొరతపైన ప్రధాని సమీక్షించారు. దీనికి సంబంధించి ఓ విధానాన్ని రూపొందించాలని, అందుబాటలో ఉన్న ఉపకరణాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో దాని రవాణా, సరఫరాపై ఆంక్షలు విధించరాదని మరోపక్క కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు సూచించారు. మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రాలకు కేంద్రం 162 ప్రెజర్ స్వింగ్ అడార్స్‌ప్షన్ (పీఎస్‌ఏ) కేంద్రాలను మంజూరు చేసింది. తెలంగాణకు రెండు, ఏపీకి ఒకటి మంజూ రయ్యాయి. వీటిద్వారా ఆక్సిజన్ ఉత్పత్తవుతుంది. ఈ వాయువు సరఫరాకు సంబంధించి జాతీయ గ్రిడ్ పై భారం కూడా తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాలకు 360 టన్నుల వంతున ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. రైళ్లద్వారా సరఫరా చేసే ధ్రువీకృత ఆక్సిజన్ సరఫరా కోసం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
కరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. 9 మినహా మిగిలిన పరిశ్రమలకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సరఫరా ఉండదని స్పష్టం చేసింది. దీనివల్ల మెడికల్ ఆక్సిజన్ లభ్యత పెరిగి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుంది. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తి పెంచడం, అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను హేతుబద్ధంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. టీకా మందులు, ఔషధ కర్మాగారాలు, ఉక్కు కర్మగారాలు, అణు ఇంధన సౌకర్యాలు, ఆక్సిజన్ సిలిండర్ తయారీ సంస్థలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఆహారశుద్ధి పరిశ్రమలు, ప్రాసెసింగ్ పరిశ్రమలకు మాత్రం ఆక్సిజన్ సరఫరాలో మినహాయింపు ఉంటుంది. కరోనా కట్టడిలో తనవంతు పాత్ర పోషించేందుకు టాటాస్టీల్స్ ముందుకు వచ్చింది. వివిధ వైద్యశాలలకు రోజువారీ 300 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించింది. రోజుకు 50 నుంచి వంద టన్నుల ఆక్సిజన్ సరఫరాకు జిందాల్ స్టీల్స్ ముందుకు వచ్చింది. కొద్దిరోజుల్లో మెడికల్ ఆక్సిజన్ రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. డిమాండ్ ఉన్న చోటుకు రైళ్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తారు.
ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం…
ఈ కష్టకాలంలోనూ ప్రైవేట్ వైద్యశాలల వ్యాపారధోరణి ఆందోళన, ఆవేదన కలిగిస్తోంది. విస్తు గొల్పుతోంది. ముందస్తుగా లక్షరూపాయలు చెల్లిస్తేనే లోపలికి అనుమతిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నగదు మాత్రమే తీసుకుంటున్నాయి. చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డులను అనుమతించడం లేదు. బీమా సౌకర్యం ఉన్నా తమకు సంబంధం లేదని, ముందుగా నగదు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఏడాది క్రితమే కరోనా చికిత్సకు సర్కారు ధర ఖరారు చేసినా ఇప్పుడు వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల పడకలున్నప్పటికీ కృత్రిమ కొరత చూపుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు సిఫారసులు ఉంటేనే పడకలు కేటాయిస్తున్నాయి. సర్కారు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సొమ్మే ప్రధానమన్నట్లు వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐసొలేషన్‌లో అయితే రోజుకు రూ.4 వేలు, ఐసీయూలో అయితే రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన చికిత్స అయితే రూ.9వేలు వసూలు చేయాలని గత ఏడాది తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇతర చికిత్సలకు కూడా ధరలను నిర్ధేశించింది. ప్రస్తుతం ఈ ధరలు ఎక్కడా అమలు కావడం లేదన్నది చేదునిజం. దీనిపై ఫిర్యాదులు అందినా అధికార యంత్రాంగం కంటితుడుపు చర్యలు చేపట్టి చేతులు దులిపేసుకుంది. ఈ ఏడాది అసలు దాడులే లేవు. కరోనా రోగుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, మానవీయ కోణోంలో స్పందించాలన్న ఇండియన్ మెడికల్ అసోసియషన్ వినతులకు కార్పొరేట్ వైద్య వర్గాల నుంచి స్పందన కరవైంది.
మరోపక్క ప్రభుత్వ వాదన భిన్నంగా ఉంది. పడకల కొరతలేదని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కలిపి దాదాపు 63వేల పడకలు అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చెప్పారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ వైద్యశాలను పూర్తిగా కరోనా చికిత్సలకే కేటాయించారు. గత ఏడాది కూడా ఇక్కడ పూర్తిగా కరోనా చికిత్సలే చేశారు. ప్రస్తుత రెండోదశ తీవ్రత నేపథ్యంలో ఇక్కడ సాధారణ వైద్య సేవలను నిలిపివేశారు. పూర్తిగా కొవిడ్ సంబంధ చికిత్సలనే చేస్తున్నారు. రోగుల సంఖ్య పెరిగితే మున్ముందు 360 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంది. కొరతను అధిగమించడానికి కేంద్రంతో చర్చిస్తున్నాం. గత కొన్ని నెలలుగా కరోనా తీవ్రత తగ్గడంతో ఔషధ సంస్థలు రెమ్‌డెసివిర్ తయారీని నిలిపివేశాయి. త్వరలోనే మరో 3లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వస్తాయని ఈటల వెల్లడించారు. బాధితులకు సత్వరమే వైద్యం అందించేందుకు వైద్యశాఖలో పూర్తిగా సెలవులు రద్దు చేసిన సంగతి కూడా చెప్పారు. 24 గంటలు సేవలు అందించేం దుకు వైద్య శాఖలోని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు.
అర్థం లేని రాజకీయ విమర్శలు…
ప్రధాన ప్రతిపక్షంగా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇచ్చి సహకరించాల్సిన కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతన్నాన్ని ప్రదర్శిస్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా అర్థరహిత విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, పాలకులకు దిశా నిర్దేశం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వినీ కుమార్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం విస్తు గొల్పుతోంది. ఈ విషయంలో కోర్టుల జోక్యం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తక మానదు. పాతికేళ్లు పైబడిన వారందరికీ టీకా అందించాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కోరుతున్నారు. తగిన మేరకు వాక్సిన్ ఉత్పత్తి లేని తరుణంలో ఉన్న కొద్దిపాటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా వయసు పైబడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తరవాత ఇతరుల గురించి ఆలోచించాలి. ఈ విషయాన్ని సోనియా గుర్తించినట్లు లేదు. టీకాల పంపిణీకి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొన్ని సూచనలతో కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలన్నది ప్రధాన సూచన. తమకు స్వేచ్ఛలేదని ఏ ఒక్క రాష్ట్రం కూడా ఆరోపించలేదన్న సంగతిని గుర్తించాలి. టీకాల సరఫరాలో సమస్య ఉందని ఏ రాష్ట్ర సర్కారూ చెప్పలేదు. కేవలం రాజకీయ కారణాలతోనే మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు ఆరోపణలను సంధిస్తోంది. అంతకు మించి మరో కారణం లేదు. తగినంత ఆక్సిజన్ ఇవ్వడానికి కేంద్రం ముందుకు రావడం లేదని ఉద్ధవ్ విమర్శించడం, ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే నిరాకరించిందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చెప్పడం, దానితో శివసైనికులు నోరు మూయడం అత్యంత జుగుప్సా కరంగా ఉంది. విపక్ష పాలిత సర్కారు కూడా ఈ తరహా ఆరోపణలు చేయక పోవడం గమనార్హం. నిజానికి మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉన్నందదున టీకాలు, ఇతర మందులు, ఆక్సిజన్ సరఫరాలో దానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర విషయాల్లో రాజకీయాలు ఉండవచ్చు, చేయవచ్చు. కానీ ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో కుత్సిత రాజకీయాలు ఎవరు చేసినా తప్పే. అందువల్ల పార్టీలకు అతీతంగా, రాజకీయ విభేదాలను విస్మరించి మహమ్మారిపై యావత్ జాతి ఏకమై పోరాడాల్సిన తరుణమిది. యంత్రాంగంలోని లోపాలను వెతకడం కన్నా ప్రతి ఒక్కరూ తమవంతు చేయూత అందించాల్సిన సమయమిది. అన్నింటికన్నా ప్రజల ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకం. అప్పుడే కరోనా రెండో దశను జాతి అధిగమించ గలుగుతుంది. అప్పటివరకు రాజకీయాలను పక్కనపెట్టాలి.