హిమాలయాల్లో గడిపినవి పదిరోజులే. కానీ లెక్కలేనన్ని మధురానుభూతులతో మనసంతా నిండిపోయింది. హైదరాబాద్‌ ‌నుండి ఢిల్లీ మీదుగా శ్రీనగర్‌ ఆరుగంటల గగనయానం. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వంద కిలోమీటర్ల దూరంలోని సోన్‌మార్గ్ (‌సముద్ర మట్టానికి 8859 అడుగుల ఎత్తులో) చేరుకున్నాను. కశ్మీర్‌ ‌లోయలోని అత్యంత రమణీయ ప్రదేశాల్లో ఇదొకటి.

మరునాడు ‘బైథాల్‌’ (‌Bhaital) అనే ప్రదేశానికి చేరుకొని హెలికాప్టర్‌ ‌ద్వారా అమరనాథ్‌ ‌దర్శనం. ఏడు నిమిషాలే ఈ ప్రయాణం. గగనసీమ నుంచి వీక్షించిన ఆ కొండల దృశ్యాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అమరనాథ్‌ ‌యాత్ర  ఆషాఢ- శ్రావణ పూర్ణిమ (నెలరోజులు) వరకే. పెహల్‌గావ్‌ (‌చందన్‌వాడి), సోన్‌మార్గ్ (‌బైథాల్‌)‌లు రెండుచోట్ల నుంచి వెళతారు. హెలికాప్టర్‌, ‌గుర్రాలు లేదా కాలినడకన యాత్ర సాగుతుంది. మెడికల్‌, ‌ఫిట్‌నెస్‌ ‌సర్టిఫికెట్‌ అవసరం. ‘పంచతరణి’ అనే స్థలం వరకు హెలికాప్టర్‌, ‌తర్వాత నడక, గుర్రాలు లేదా డోలీలతో అమరనాథ్‌ ‌గుహ చేరుకోగలం. దాదాపు 40 నిమిషాల నడక. మానసిక, శారీరక సంసిద్ధతలు రెండూ అవసరం.

ఎన్ని ఇక్కట్లు ఉన్నా హిమసానువుల మధ్య ఉండే ఆ గుహలో మంచుతో స్వయంసిద్ధంగా ఏర్పడే ‘అమరనాథ’ దర్శనం మరుపురాని అనుభూతి. మార్గమంతా ప్రకృతి రామణీయకతను వీక్షించి ఆనంద పరవశులవుతాం. సాయంత్రానికల్లా మళ్లీ సోన్‌మార్గ్ ‌చేరుకున్నాను.

మూడోరోజు ప్రయాణం కార్గిల్‌వైపు. పర్వతాల గుండా సాగింది. జోజిలా పాస్‌ (11649 అడుగుల ఎత్తులో) ద్వారా జీరో పాయింట్‌ ‌నుండి ఘుమ్రీ (Ghumri) చేరుకున్నాను. సింధునది దగ్గర, ఘుమ్రీలో 1947-48 కాలంలో జరిగిన ‘జోజిలా యుద్ధం’లో వీరమరణం పొందిన మన జవాన్ల స్మారకస్తూపం దగ్గర (Zozila war Memorial) నివాళులర్పించాను. తర్వాత వచ్చేదే ‘డ్రాస్‌’ (‌Drass), ప్రపంచంలోనే మనిషి నివసించే రెండవ అత్యంత శీతల ప్రదేశం.1999లో జరిగిన ‘కార్గిల్‌’ ‌యుద్ధంలో పాకిస్తాన్‌ ‌ఘోరంగా ఓడిపోయింక్కడే. ‘టోలిలాంగ్‌’ (ఇక్కడి పర్వత శ్రేణుల పేరు) యుద్ధంలోనే హైదరాబాద్‌కు చెందిన మేజర్‌ ‌పద్మపాణి ఆచార్య వీరమరణం చెందాడు. ఎంతోమంది మన భారతీయ వీర జవాన్లు కార్గిల్‌లో ప్రాణాలర్పించి భారత్‌ను గెలిపించారు.

‘ఆపరేషన విజయ్‌’ (‌Operation Vijay) పేరుతో 26 జూలై 1999 రోజు మనం విజయం సాధించాం. వారి సంస్మరణార్థం ఇక్కడ నిర్మించిన ‘కార్గిల్‌వార్‌ ‌మెమోరియల్‌’‌ను ‘వీరభూమి’గా పిలుస్తారు. వీర మరణం చెందిన ప్రతి సైనికుని పేరుతో ఇక్కడ స్మారకం, త్రివర్ణ పతాకం ఉంచారు. ఒక ఫలకం మీద హిందీ భాషలో..

‘శహీందోంకీ చితాపర్‌

‌లగేంగే హర్‌ ‌బరస్‌మే

వతన్‌ ‌పర్‌ ‌మర్‌ ‌మిట్‌నే వాలోంకా

యహీ బాకీ నిషాన్‌ ‌హోగా’ (మన వీర జవాన్ల సాహసానికి, మాతృదేశానికై వారి ప్రాణాలు పణంగా పెట్టి శత్రువులతో పోరాడి వీరమరణం చెందిన మీకు ఇది నిదర్శనంగా ఉంటుందని శిరస్సు వంచి జోహార్లు అర్పిద్దాం) అని రాశారు.

గంట తరువాత బాధాతప్త హృదయాలతో ముందుకు సాగాం. ఒకవైపు సింధునది, మరొకవైపు ఎత్తైన పర్వతాలు మార్గంగా ఎన్నో వంతెనలు దాటుతూ కార్గిల్‌ ‌చేరుకున్నాను. శ్రీనగర్‌, ‌లేహ్‌ ‌మార్గంలో బస చేయడానికి అనువైన ప్రదేశమిది.

సాయంకాలం ‘కార్గిల్‌’‌లో నేడు మన వీర జవానులు అనుక్షణం కాపలా కాస్తున్న హథీమాతా (Hathi Matha) పర్వాతలపైకి వెళ్లాను.

ఈ ప్రదేశంలో నియంత్రణ రేఖ (Lion of Control)) ఉంది. పర్వతాల పై భాగంలో భారత జవాన్ల క్యాంపులు, పర్వతాల క్రింద పాకిస్తాన్‌కు చెందిన ఖుందుర్‌మాన్‌ (‌Khundur maan) ను చూశాను. ఆ పైకి అనుమతి లేదు. పాస్‌పోర్టు చూపాక నిజ నిర్ధారణ చేసుకొని కొంతదూరం వెళ్లడానికి సైనికులు అనుమతించారు. కార్గిల్‌ ‌నుండి జంస్కార్‌ (Zanskar Valley)  లోయ మరోవైపు లే (Leh) మార్గాలున్నాయి. పర్వాతారోహకులకు ‘జంసార్క్’ ‌ముఖ్య ప్రదేశం. ఇక్కడి నుంచి ‘జంస్కార్‌’ ‌నది ప్రారంభమై లే సమీపంలో సింధునదిలో సంగమిస్తుంది.

నాల్గవరోజు ఉదయమే ‘కార్గిల్‌’ ‌హోటల్‌ ‌నుంచి చెక్‌ అవుట్‌ ‌చేసి లే (Lehర) వైపు మా ప్రయాణం సాగింది. కార్గిల్‌-‌లే మార్గంలో ప్రతిచోట సైనికుల వాహనాలు కనపడ్డాయి. ముల్‌దేఖ్‌ అనే చోట ఓ ఆలయాన్ని దర్శించాను.  ఈ మార్గంలో పర్వతాల మీద ఎక్కడా వృక్ష సంపద లేదు. ‘నమికాల’ (12198 అడుగుల ఎత్తులో) అనే ప్రదేశంలో ‘తుపానులు’ సర్వసాధారణం. ఫోతేలా (13479 అడుగుల్లో) బౌద్ధ పతాకాలు చూస్తూ ‘లమయురే’ (Lamayure) చేరాం- చుట్టూ ఉన్న పర్వతాల రంగులు మారుతుంటాయి. ఇవి లద్దాఖ్‌లోని దర్శనీయ స్థలాలు కూడా. దాదాపు ప్రతిచోట పురాతన బౌద్ధారామాలను (Monestry) చూడ వచ్చు. నుర్లా, సన్‌పోల్‌, ‌లికర్‌ ‌మొదలైన ప్రదేశాలను, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ లే సమీపంలో జంస్కార్‌-‌సింధునదుల సంగమ స్థలం, మ్యాగ్నెట్‌ ‌హిల్స్ ‌చూచి హోటల్‌ ‌చేరుకున్నాను.

మరునాడు ‘లే’ పట్టణ పరిసరాల్లోని దర్శనీయ స్థలాలను చూశాను. పట్టణానికి కొంత దూరంలో ‘కారు’ అనే గ్రామ సమీపాన లద్దాఖ్‌లోని అతి పెద్దదైన ‘హెమిస్‌ ‌బౌద్ధారామం’లో (Hemis Monestry) పద్మాసీనుడైన శాక్యముని బుద్ధ విగ్రహం, ‘మహాకాలుని’ కుడ్యచిత్రాలు చూడాలి. సౌరమాన ప్రకారం 5వ నెలలో 10,11వ రోజుల్లో ఇక్కడ వేడుకలను జరుపుకుంటారు. ఇక్కడ ప్రార్థనా చక్రాలు (Prayer Wheels) తిప్పితే మంచిదని నమ్మకం. రెండురోజుల పాటు జరిగే ఉత్సవాలలో పద్మసంభవుని (ప్రస్తుతం బోధిసత్వుడని పిలుస్తారు) ఆరాధిస్తారు. ‘లద్దాఖ్‌’ ‌చేరుకొని బౌద్ధం ప్రచారం చేసినవాడీయన.

తర్వాత ‘థీస్లీ ఆరామం’ (Thisley) లోని మైత్రేయ ఆలయం, విశాలమైన ప్రార్థనా స్థలంతోపాటు ‘లమోభాంగ్‌’ అనే స్థలం నుండి ప్రకృతి రామణీయ కతను మనం చూడవచ్చు. కొండపై ఉన్నందువల్ల, అద్భుతంగా ఉంటుంది.

అక్కడ నుండి దగ్గర్లోని ‘డ్రుక్‌ ‌వైట్‌ ‌లోటస్‌ ‌సూరల్‌’ ‌దర్శించి షే (Shey Monestry)లో ఏడున్నర అడుగుల ఎత్తైన పద్మాసన స్థితిలో ఉన్న బుద్ధభగ వానుడు, మరొకచోట అయిదు భంగిమలలో, వివిధ వాహనాలపై ధ్యానముద్రలోని బుద్ధ విగ్రహాలు మనల్ని ఆకట్టుకుంటాయి. బౌద్ధారామాలన్నీ ఎత్తైన కొండలపై ఉన్నందున, వెళ్లడం శ్రమతో కూడుకున్నా, చూడదగ్గవి. తర్వాత సమీపంలోని ‘సింధూఘాట్‌’‌లో ‘సింధూనదీ’ దర్శనం నాపై చెరగని ముద్ర వేసింది.

కైలాస పర్వతాల్లో పుట్టి (ఆనాటి టిబెట్‌) ‘‌లద్దాఖ్‌’ ‌ప్రాంతంలో సాగుతున్న సింధూనది ఘాట్‌ ‌నిర్మాణానికి జూన్‌ 7, 2000‌లో నాటి భారత ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజపేయి శిలాన్యాసం చేశారు.  జూన్‌1, 2001‌లో  ఎల్‌.‌కె.అడ్వానీ  ‘సింధూఘాట్‌’ ‌ప్రారంభించారు. సింధూదర్శన్‌ ‌పేరిట ఇక్కడ ఉత్సవాలు  జరుగుతాయి. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంతసేపైనా గడపవచ్చు.

తర్వాత ‘హాల్‌ ఆఫ్‌ ‌ఫేమ్‌’ ‌మ్యూజియం చూశాను. భారతీయ సైనికులు దీనిని నిర్వహిస్తున్నారు. చైనా, పాకిస్తాన్‌లతో జరిగిన యుద్ధాల విశేషాలు, అమరవీరులైన జవానులకు సంబంధించిన చిత్రాలు మనల్ని యుద్ధభూములకు తీసుకెళ్తాయి. ‘ఆపరేషన్‌ ‌విజయ్‌’ ‌పేరిట మన సైనికులు పాకిస్తాన్‌ను ఓడించిన విశేషాలతో సాగే అరగంట చితప్రదర్శన తప్పక చూడాలి. ఇక్కడ వీర జవానుల సంస్మరణార్థం స్మారకం కూడా నిర్మించారు. దగ్గర్లోనే సిక్కు గురుద్వారా ‘పధేర్‌ ‌సాహెబ్‌’ ఉం‌ది. 1515-18 కాలంలో గురునానక్‌ ‌దేవ్‌ ‌దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఇక్కడ నివసించాడట. తర్వాత ‘జంగ్సక్‌- ‌సింధూ’ నదుల సంగమ స్థలాన్ని చూశాను. సూర్యాస్తమానం తర్వాత లేనగర్‌లో శాంతిస్తూపాన్ని సందర్శించాను. ధర్మచక్రాలను త్రిప్పుతూ, దైత్యులను సంహరిస్తున్న బుద్దుడు ఇక్కడ దర్శనమిస్తాడు. కొండపై నుంచి లే నగరం సాయంవేళ దేదీప్యమానంగా కన్పిస్తుంది. ‘ఓం మణి పద్మే హుం’ అనే మంత్రం అనేక ప్రార్థనాస్థలాల్లో అగుపిస్తుంది. సింధూఘాట్‌ ‌మార్గంలోనూ అందమైన బౌద్ధస్థూపాల మందిరం ఉంది.

ఆరవరోజు ప్రయాణం ‘నూబ్రా లోయ (Nubra Vally) వైపు సాగింది. ‘నూబ్రా’ అంటే పచ్చదనం. లద్దాఖ్‌ ‌లోయలలో కెల్లా లోతైనది, అందమైనది. లే కంటే మూడువేల మీటర్ల దిగువన ఉన్నది. 120 కిలోమీటర్ల మార్గం దుర్గమమైనా, మార్గంలో ఎత్తైన మంచుకొండలు, పర్వతాలు చిన్న చిన్న లోయలు  నదీ ప్రవాహాలు చూస్తూ సాగిపోతాం. మార్గంలో 18380 ఎత్తులో ‘ఖర్‌రుంగులా’ (Kharunla pass) కనుమ. ప్రపంచంలో అతి ఎత్తైన మోటారు రోడ్డు మార్గం గల ప్రదేశం. మంచువర్షం, ఫ్లాష్‌ఫ్లడ్స్ ఎప్పుడొస్తాయో తెలియదు. కొన్నిసార్లు, రోజుల తరబడి ఈ మార్గం మూసివేస్తారు.  ఇక్కడ ‘మాతాజీ’ మందిరమున్నది  – ‘మినీ కైలాసయాత్ర’ను తలపిస్తుంది. ‘ఖల్సార్‌’ అనే స్థలంలో సైనిక క్యాంపులను చూస్తూ ‘నుబ్రా’ ప్రాంతీయ రాజధాని డిస్కట్‌ (‌Disket) కొండలపై 14వ శతాబ్దికి చెందిన ‘డిస్కట్‌’ ‌బౌద్ధారామంలో ఎత్తైన బుద్ధభగవానుని విగ్రహాన్ని చూశాను. ఇక్కడి నుండి ‘నుబ్రావ్యాలీ’ దృశ్యం మరువరానిది. హోటల్‌లో కొంతసేపు విశ్రమించి, సాయంత్రం 7 కిలోమీటర్ల దూరంలోని ఇసుకతిన్నెలు, రెండు కొమ్ముల ఒంటె (Camel)పై ప్రయాణం చేశాను. మరుపురాని సందర్శనా స్థలాల్లో ఇదొకటి. ‘నూబ్రా వ్యాలీ’ చుట్టూ ‘సియాచిన్‌ ‌గ్లేసియర్స్’‌లో భారత సైన్యం చైనాతోనూ, కారకోరమ్‌ ‌రేంజిలో పాకిస్తాన్‌తోనూ యుద్ధం గావించిన ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశాలిక్కడ ఉన్నాయి.

ఆ రాత్రి మా బస ఈ ప్రదేశంలోనే. ఏడవరోజు లే వైపు తిరుగు ప్రయాణంలో మళ్లీ ఖర్‌దుంగా టాప్‌లో అరగంట గడిపాను. ఆర్మీ హరికేఫ్‌ ‌హోటల్‌లో ‘చాయ్‌’ ‌వేడి వేడిగా, ఆ చల్లని వాతా వరణంలో తాగుతుంటే అదొక అనుభూతి. ‘షిమోక్‌ ‌ఖతార్‌’‌లో River rafting చేయవచ్చు, ఎక్కడ చూసినా రంగురంగుల పూలు, చిన్న వృక్షాలు, ‘యాక్‌’(Yak) ‌లు కనబడతాయి. లద్దాఖ్‌ ‌చాలా శుభ్రంగా ఉంటుంది.  ప్లాస్టిక్‌పై పూర్తిగా నిషేధం ఉంది. ‘టక్‌మార టోపా’ అనే ప్రదేశంలో జలపాతాలు చూడముచ్చట గొల్పుతాయి.

ఎనిమిదవ రోజు లద్దాఖ్‌లోని అతి ముఖ్యమైన ‘పాంగాంగ్‌ ‌సరస్సు’ (Pangong lake) వైపు 149 కి.మీ. ప్రయాణం. దారంతటా ప్రకృతి ఓ అద్భుతం. ఒకవైపు ఎత్తైన మంచుకొండలు, మరొకవైపు (ముఖ్యంగా శక్తి- జింగారం అనే ప్రదేశాల మధ్య)లోయలు. 17586 అడుగుల ఎత్తులోని చాంగ్స్‌లా పాస్‌ ఈ ‌మార్గంలో ముఖ్యమైనది. హిమాలయ పర్వతశ్రేణుల్లోని చల్లని ప్రదేశమిది. ఈ మార్గంలో పశ్చిమ జాతికి చెందిన గొర్రెల మందలు మందలుగా కన్పిస్తాయి. దార్సుక్‌ ‌గ్రామం వద్ద తాన్సీలోయలో వృక్షసంపద ముగ్ధుల్ని చేస్తుంది. మధ్యాహ్నం ‘పాంగాంగ్‌ ‌లేక్‌’ అని పిలిచే పెద్ద (160 కి.మీ. పొడవు, 7 కి.మీ. వెడల్పు) ఉప్పునీటి సరస్సును చేరుకున్నాను. ఎత్తైన కొండల మధ్య హిమపాతాల వల్ల ఏర్పడిన ఈ సరస్సు దాదాపు రెండొంతులు టిబెట్‌ ‌భూభాగంలో ఉంది.

సూర్యకిరణాలు నీటిపై ప్రసరించి, మనకు ‘సరస్సు’ నీలవర్ణంలో కనిపిస్తుంది. కొండలపై నుంచి చూస్తే ఇక్కడి దృశ్యాలు ఇంకా అద్భుతం. ఎంత సమయం గడిచినా సరస్సు జలాల్లో క్రీడలు, చుట్టూ ప్రకృతి మనసును ఆకర్షిస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా బౌద్ధుల రంగురంగుల పతాకాలు ఎగురుతూ ఉంటాయి.  సరస్సు దగ్గర బసకు ఏర్పాట్లున్నాయి. సాయంత్రంవరకు ‘సరస్సు’ దగ్గర వివిధ స్థలాల్లో గడిపి బసకు చేరుకున్నాను. అది సరస్సు ఒడ్డునే.

తొమ్మిదోరోజు లేకు మా తిరుగుప్రయాణం. పాంగాంగ్‌ ‌సరస్సు దగ్గర ఫోటోలు, వీడియో తీసుకుని, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ  చాంగ్లా పాస్‌ (Changla Pass) ‌చేరుకున్నాం – 17600 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ‘పాస్‌’ (Pass). ఇక్కడ చాంగ్లా బాబా మందిర మున్నది. ఇక్కడ మేమున్నప్పుడే, మంచువర్షం ప్రారంభమైంది.మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో లే చేరుకుని ‘ప్యాలెస్‌’ ‌చూడడానికి వెళ్లాను.

లే ప్యాలెస్‌ (Leh Palace)  అని పిలిచే ఈ కోట ప్రస్తుతం కొంత శిథిలావస్థలో నున్నా ఇక్కడ ‘మైత్రేయ’ బుద్ధ విగ్రహం, కుడ్యచిత్రాలు, ప్రార్థనాలయాలను  చూడవచ్చు. ఇది లే (లద్దాఖ్‌)‌లో యాత్రలో చివరిరోజు.  చారిత్రకంగా లద్దాఖ్‌, ‌టిబెట్‌ ‌మతపరం గాను, సంస్కృతీ నాగరికతల వ్యాపారపరంగాను సాదృశ్యాలు కలిగి ఉన్నాయి. ‘సిల్క్‌రూట్‌’ ‌ద్వారా లద్దాఖ్‌, ‌భారత్‌ ‌నుండి ఆసియా ఖండంలోని దేశాలతో వర్తకం సాగినట్లు చరిత్ర చెబుతుంది.

లద్దాఖ్‌ అం‌తా రోడ్డు మార్గంగా ప్రయాణించి అద్భుత జ్ఞాపకాలతో పదవరోజు లే నుండి ఢిల్లీ – అటు నుండి మధ్యాహ్నం వరకు వాయుమార్గంగా హైదరాబాద్‌ ‌చేరుకున్నాను. దేశంలోని గొప్ప యాత్రాస్థలాల్లో లద్దాఖ్‌ ఒకటి.

About Author

By editor

Twitter
YOUTUBE