ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం దేశ ప్రజలకు గరిష్ట సుపరిపాలన, కనిష్ట అధికార వినియోగ విధానాన్ని అందించడమే. 1990 దశకంలో సంస్కరణల దశ ప్రారంభమైన తరువాత, పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సంస్కరణల అమలు తప్పనిసరి అయింది. ఈ సంస్కరణల యుగంలో కొన్ని రంగాలలో ప్రభుత్వానికి పరిమిత పాత్రే ఉన్నందున, అప్రధానమైన బాధ్యతలను తగ్గించుకోవటం అనివార్యమయింది.

 1947లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ)లను స్థాపించింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన దేశానికి ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు అందించడం అనివార్యం. ప్రైవేట్‌ ‌రంగంలో నాడు దేశీయంగా భారీ పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలకూ వనరులు పరిమితమే. అందువల్ల పారిశ్రామిక పెట్టుబడులు, ఇతర పరిమితులు ప్రతికూలాంశాలుగా మారాయి. పీఎస్‌యూలు దేశానికి చిరకాలం సేవలు అందించాయనడంలో సందేహం లేదు. కానీ గత 30 ఏళ్ల కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఆ నేపథ్యంలో దేశం బయట, లోపల జరిగే ఆర్థిక పరివర్తనలు, సవాళ్లు మన మీద పలు విధాలుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ పోటీ వాతావరణంలో అంతిమ ఫలితమే కీలకం కాబట్టి వాటిని గమనంలోకి తీసుకోకపోతే గ్లోబల్‌ ‌మార్కెట్లో మన ఉనికి లుప్తమయ్యే ప్రమాదం ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థలో లైసెన్స్‌రాజ్‌ను తొలగించడానికి 1990 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేసింది. ఇంకా దశలవారీగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణకు సిఫారసు చేసింది. ఇందుకు కారణం ఉంది. పన్ను చెల్లింపుదారులైన ప్రజల డబ్బును నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థలకు సహాయంగా అందించడానికి వినియోగించుకోవడం, ఉత్పాదకత లేని సంస్థలకు తరలించడం వంటి కారణాలతో ఉత్పాదక అభివృద్ధి వ్యయాలకు నిధుల కొరత ఏర్పడుతుంది. అందుకే నష్టాలు నమోదు చేస్తున్న నాన్‌ ‌స్ట్రాటజిక్‌ ‌ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసే బదులు, ప్రైవేటు భాగస్వామ్యం కోసం కేంద్రం అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలలో తన వాటాను కొంత భాగం, లేదా మొత్తం ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనివార్యమయింది.

 పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూరే వనరులను వివిధ ప్రత్యామ్నాయాలతో ఆయా సంస్థలు మంచి ఉత్పాదకతను సాధించడానికి ఉపయోగిస్తే తప్పా? సంస్థలో గరిష్ట సామర్థ్యాన్ని వినియోగించుకుని ఉత్పత్తి, ఉత్పాదకత, వ్యయ నియంత్రణ వంటి లక్ష్యాలను సాధించడానికి సమర్థ ప్రైవేట్‌ ‌భాగస్వా మ్యానికి చోటిస్తే ఏమిటి తప్పు? దీనివల్ల వినియోగ దారుల అవసరాల మేరకు నాణ్యమైన సేవలు అందుతాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, యంత్రీకరణతో కూడిన సంస్థల విస్తరణలకు ఆయా వ్యాపకాలలో అనుభవం ఉన్న ప్రైవేట్‌ ‌భాగస్వామ్యం తప్పనిసరి.

ఆర్థిక రుగ్మతతో బాధపడుతున్న ప్రభుత్వరంగ సంస్థలను సానుకూలంగా మలచడానికి బ్రాండ్‌ ఇమేజ్‌తో, నాణ్యమైన ఫలితాలు సాధిస్తున్న అంతర్జాతీయ సంస్థల ప్రైవేట్‌ ‌భాగస్వామ్యం వల్ల ప్రోత్సాహక వాతావరణం తీసుకురావచ్చు.

కార్ల వ్యాపారంలో మారుతి సుజికి విజయం మన దేశంలో ఒక కేస్‌ ‌స్టడీ. 1982లో భారత ప్రభుత్వం సరైన సమయంలో, వ్యూహాత్మక నిర్ణయంతో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. మారుతి – సుజికి జాయింట్‌ ‌వెంచర్‌ ‌విజయవంతం కావడానికి జపాన్‌కి చెందిన సుజుకి ఈక్విటీ 1987లో 26% నుండి 40% వరకు, 1992లో 50%, 2013 నాటికి 56.21%కి చేరుకుంది. అదే సమయంలో మారుతి ఉద్యోగ్‌ ‌లిమిటెడ్‌ (‌MUL) అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. 1993లో 1.20 లక్షల కార్లు అమ్ముడవ్వగా, 2018-19లో ఆ అమ్మకం18 లక్షలకు చేరింది. ప్రస్తుతం ఆ సంస్థ నగదు నిల్వలు ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితితో రూ. 40 వేల కోట్ల మేరకు చేరాయి. ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో దేశానికి రూ.1.80 లక్షల కోట్లు, ఇంకా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు రికార్డు స్థాయిలో కార్లు ఎగుమతి చేసింది. దీనిని ప్యూహాత్మరహిత ప్రభుత్వరంగ సంస్థల వ్యాపార కార్యకలాపాల వృద్ధికి నమూనాగా చూడాలి. కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ ‌నివేదిక ప్రకారం నష్టాలతో పనితీరు బాగాలేని సంస్థలలో 189 ప్రభుత్వరంగ సంస్థలే. వీటిలో 80% సంస్థలకు వాటి మూలధనం కూడా ఆవిరి అయిపోయేంతగా నష్టాలు వచ్చాయి. దీనితో రూ.1.50 లక్షల మేరకు భారీగా నష్టాలు పేరుకుపోయాయి. ఇదంతా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారంగా మారి పన్ను చెల్లింపుదారుల ధనం వృధా అవుతున్నది. అయినా కేంద్రం మౌనంగా కూర్చోలేదు. వివిధ చర్యల ద్వారా ఆర్థిక సహాయం అందించి కొన్నింటిని పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. కానీ వాటిలో చాలావరకు ఖాయలా పడినవే. మరికొన్ని ఖాయలా పడడానికి సిద్ధంగా ఉన్నాయి. మరో ముఖ్యమైన కేస్‌ ‌స్టడీ మహారాజా ఎయిరిండియా. ఈ సంస్థకి 2012లో రూ.30 వేల కోట్ల బెయిలౌట్‌ ‌ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం అందించింది. కానీ, ఈ ప్రణాళిక మొత్తం విఫలమైంది. ఆశించిన ఫలితాలను సాధించడంలో విఫలం కావడంతో పాటు, నష్టాల కారణంగా సంస్థకు రూ. 50 వేల కోట్లకు పైగా అప్పు మిగిలింది. దీనితో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరయింది. నీతి ఆయోగ్‌ ‌సంప్రదింపులతో, నిపుణుల అభిప్రాయం ప్రకారం చర్యలు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై దృష్టి పెట్టింది.

విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌విషయానికి వద్దాం. ఇది ఆర్థిక సమస్య మాత్రమే కాక, భావోద్వేగ సమస్యగా కూడా మారినందున పెట్టుబడులు ఉపసంహరణకు సంబంధించి అధ్యయనం చేయవలసిన పెద్ద కేస్‌ ‌స్టడీగా మారింది. 32 మంది బలిదానంతో, ఆంధ్రుల హక్కు నినాదంతో సోవియెట్‌ ‌రష్యా సహకారంతో సంవత్సరానికి 3.5 మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యంతో 1982లో ప్రారంభమయింది. దీనిని రాష్ట్రీయ ఇస్పాత్‌ ‌నిగం లిమిటెడ్‌ (RINL)గా స్థాపించారు. ఆ సమయంలో కార్పొరేట్‌ ‌రంగానికి ప్రైవేట్‌ ‌పెట్టుబడి అవకాశాలు తగినంతగా లేకపోవడంతో దీనిని కేంద్రం ప్రభుత్వరంగ సంస్థగా ప్రారంభించింది. ఈ సంస్థ ఆపరేటింగ్‌ ‌నష్టాలను (పన్నులకు ముందు) నమోదు చేసింది. 2015-16- రూ1,702 కోట్లు, 2016-17 -రూ 1,690 కోట్లు, 2017-18 -రూ. 307 కోట్లు, 2018-19- రూ. 1,369 కోట్లుగా ఆ నష్టాలు ఉన్నాయి. ఆడిట్‌ ఆర్థిక నివేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత 2019- 20 సంవత్సరంలో వచ్చిన నష్టాల గురించి తెలుస్తుంది. లాక్‌డౌన్‌ ‌సమయంలో ప్లాంట్‌ ‌మూతపడింది. దీనితో ప్లాంట్‌ ‌వాస్తవ ఉత్పత్తి సామర్థ్యం 20,000 టన్నులు కాగా అది 13,000 నుండి 14,000 టన్నుల మేరకు తగ్గిపోయింది. RINLకి సొంత గనులు లేనందున, ముడి ఇనుప ఖనిజం ఖర్చు అధికంగా ఉండటం వలన నష్టాలు వచ్చాయన్న వాదన ఉంది. కాబట్టి క్యాపిటివ్‌ ‌కన్సంప్షన్‌ ‌కోసం గనులు కేటాయించాలని కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నారు. RINLనుSAILలో విలీనం చేయడం ద్వారా లాభాల బాటలోకి మరల్చవచ్చునని ఇంకొందరు చెబుతు న్నారు. ఎందుకంటే ఆంధప్రదేశ్‌ ‌ప్రజల భావోద్వేగాలు ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో ముడిపడి ఉందని సమాధానం ఇస్తున్నారు. అయితే, విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌విస్తరణకు రూ .8,600 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రం పట్ల తమకున్న ఆదరణను ప్రధాని వెల్లడించారని మే 20, 2006న నాటి ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి డాక్టర్‌ ‌వై.ఎస్‌. ‌రాజశేఖర్‌ ‌రెడ్డి చెప్పారు. అలాగే ఈ ప్లాంట్‌ను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా లిమిటెడ్‌ (‌సెయిల్‌)‌లో విలీనం చేయవద్దని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేసిన విషయం గుర్తు చేసుకోవాలి. వింత ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం సెయిల్‌లో విలీనం చేయాలనే ఉద్దేశంతోనే RINLలో రూ.8,600 కోట్లు అదనపు పెట్టుబడులు పెట్టింది. అంటే అప్పటి ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకే ఆ చర్య ఆగిపోయింది. ఆ సమయంలో RINLని SAILలో విలీనం చేసి ఉంటే, ఈ రోజు ఈ స్టీల్‌ ‌ఫ్యాక్టరీ సెయిల్‌లో క్యాపిటివ్‌ ‌వినియోగం కోసం సొంత గనుల సమస్య లేకుండా కొనసాగించే పరిస్థితి ఉండేది.

అంతకు ముందుటి సంగతి కూడా ఉంది. అటల్‌ ‌బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పునర్నిర్మాణం ద్వారా రెండుసార్లు మూలధనం సహాయం అందించింది. 1993 -94 సంవత్సరంలో మొదటిసారి రూ. 1,184 కోట్లు భారత ప్రభుత్వ రుణం ఈక్విటీ క్యాపిటల్‌గా, రూ .1,604 కోట్లు 7% నాన్‌ ‌రీడీమబుల్‌ ‌ప్రిఫరెన్స్ ‌షేర్లుగా మార్చారు. ఇంకా, కేంద్రం రూ .149.40 కోట్ల వడ్డీ మాఫీకి సహాయం చేసింది. ఈ చర్యల వల్ల సంవత్సరానికి 582 కోట్ల వడ్డీని ఆదా చేయడానికి అవకాశం వచ్చింది. మళ్లీ 1998లో రెండవసారి రూ. 1,333.47 కోట్ల రూపాయల రుణాన్ని 7% నాన్‌ ‌రీడీమబుల్‌ ‌ప్రిఫరెన్స్ ‌షేర్లుగా మార్చారు. ఇది సంవత్సరానికి 325 కోట్ల వడ్డీని సంస్థకు ఆదా చేయడానికి వీలు కల్పించింది. విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం అవసరమైన ప్రతిసారి సహాయాన్ని అందించింది. కాని యూనిట్‌ ఆపరేటింగ్‌ ‌లాభాల వైపు మరల్చడంలో విఫలమైంది.

గతాన్ని బట్టి స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరించడం గురించి ఆంధప్రదేశ్‌లో ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. అయితే సంస్థ నిరంతర నష్టాలు మూసివేతకు దారితీస్తాయనేది నిపుణుల వాదన. అదే జరిగితే త్యాగాలకు అర్థం లేదు. అందువల్ల, ఉద్యోగులు, సంస్థపై ఆధారపడినవారిని కాపాడటానికి ప్రపంచ స్థాయి సమర్థ నిర్వహణ ద్వారా యూనిట్‌లో పునరుజ్జీవనం తేవడం అవసరం. RINL 24,000 ఎకరాలకు పైగా విలువైన భూములను కలిగి ఉన్నందున ఈ ప్రతిపాదన చుట్టూ చాలా ఊహా గానాలు జరుగుతున్నాయి. ఆదమరిస్తే ఇవి చౌకగా పరాయీకరణ చెందడంవల్ల కేంద్ర ప్రభుత్వానికి భారీ నష్టాలు వస్తాయి. ఇదే సమయంలో దక్షిణ కొరియా స్టీల్‌ ‌వ్యాపార దిగ్గజం పోస్కో విశాఖపట్నంలో గ్రీన్‌ ‌ఫీల్డ్ ఇం‌టిగ్రేటెడ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటుకు తమ ఆసక్తిని తెలియజేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి RINLతో అవగాహనా ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో RINL 7.30 మిలియన్‌ ‌టన్నుల సామర్థ్యం గల ప్లాంట్‌. ఈ ‌సముద్ర తీర ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ను ముడి ఇనుము సౌకర్యవంతంగా దిగుమతి చేసుకోగలిగే గంగవరం ఓడరేవు ఆధారంగా ప్రతిపాదించారు. 2005లో ఒడిశాలోని జగత్సింగ్‌ ‌పూర్‌లో సంవత్సరానికి 12 మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్య ప్లాంట్‌ ‌కోసం పోస్కో ప్రతిపాదించింది. దీని కోసం పోస్కో, ఒడిశా ప్రభుత్వం మధ్య 2005లో అవగాహన ఒప్పందం కుదిరింది. కాని స్థానికుల నిరసనల కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు. అయితే పోస్కో ప్లాంట్‌ ఏర్పాటుకు 5000 ఎకరాలకన్నా తక్కువ ఉన్నా చాలునని ప్రతిపాదించింది. కొత్త ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం భూమి అవసరాలను జాగ్రత్తగా అంచనా వేయాలి. ప్రతిపాదిత కొత్త ఉక్కు కర్మాగారం కోసం, టై-అప్తో సహాయక యూనిట్ల కోసం సెజ్‌ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక వనరులను ఉపయోగించుకోవడంతో బాటు ఉపాధి అవకాశాల అభివృద్ధికి ఆస్కారం కలుగుతుంది. మిగిలిన భూమిలో కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇతర పారిశ్రామిక ప్రాజెక్టులను చేపట్టవచ్చు.

ప్రపంచం కుగ్రామమై (గ్లోబల్‌ ‌విలేజ్‌), ‌సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌) ‌కీలక•ంగా మారింది. అందువల్ల, అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం సమగ్ర వృద్ధి కోసం ప్రాధాన్యతలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, వ్యూహాత్మక లక్ష్యం, మరోవైపు ప్రజల ఆకాంక్షలు, వారి అవసరాలకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఈ 70 సంవత్సరాల కాలంలో ప్రపంచంతో పాటు భారత్‌ ‌కూడా పెనుమార్పులు సంతరించుకుంది. అయినా ప్రజల భావోద్వేగాలూ ముఖ్యమే. కానీ ఆర్థిక వ్యవస్థలో అంతిమ ఫలితం ప్రభావం భావోద్వేగాలకంటే ప్రబలంగా ఉంటుంది. ఎందుకంటే దేశ సమగ్ర వృద్ధి, ప్రజా శ్రేయస్సు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశం. చివరగా, సానుకూల లేదా ప్రతికూల భావోద్వేగాలు దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ప్రతిబింబించకపోవచ్చు. కారణం ఆర్థిక ఫలితాలకు భావోద్వేగాలు ఉండవు. నష్టాలలో కూరుకుపోయి కష్టాలలో ఉన్న, కష్టాలలోకి వెళ్లబోతున్న ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరణ సరైన సమయంలో చేయకపోతే అది విపత్తుకు దారితీసే ప్రమాదం ఉంది.

– దినకర్‌ ‌లంకా, బి.కాం., ఎఫ్‌.‌పి.ఏ.

About Author

By editor

Twitter
YOUTUBE