ప్రభుత్వాధికారులు ప్రభుత్వ సంస్థలలో ఎవరికి ఇష్టమైన ఉద్యమాలు వాళ్లు నడుపుకోవచ్చా? ఎవరి బుద్ధికి తోచినట్టు వాళ్లు తమ అభిప్రాయాలను అవతలి వారి మీద రుద్దవచ్చా? అందులోను సంక్షేమ గురుకుల పాఠశాలల్లో తమ పైత్యమంతా ప్రదర్శించవచ్చా? తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల వ్యవస్థ కార్యదర్శి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ ‌సమక్షంలో 15వ తేదీన జరిగిన ప్రహసనం గమనిస్తే ఇదే అనిపిస్తుంది.
ఇంతకీ తెలంగాణలో సంక్షేమ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం నడుపుతున్నదా? స్వేరోస్‌ ‌నిర్వహిస్తున్నదా? కొన్ని వార్తా సంస్థలు సంక్షేమ గురుకుల పాఠశాలలకు ఆహారం, చదువు అంతా తానే అయి స్వేరోస్‌ అం‌దిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఇది ఎవరి సంస్థ? ప్రభుత్వం నియమించినదా? ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటూ ఈ సేవలన్నీ గురుకుల పాఠశాలలకు స్వేరోస్‌ అం‌దిస్తుంటే, ఈ ప్రతిజ్ఞ తెచ్చిన ప్రకంపనాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ప్రభుత్వం బాధ్యత. ఈ స్వేరోస్‌ ఉద్యమం నిర్వహించే పవిత్రమాసం వేడుకల సందర్భంగానే ఒక ప్రతిజ్ఞ వినిపించింది. భీమదీక్ష అని దీనికే పేరు పెట్టారు. ఈ సంవత్సరం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ధూళికట్ట బౌద్ధ క్షేత్రం దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. గురుకుల పాఠశాల పూర్వ విదార్థులందరినీ ఇక్కడ కలిపి ఇలాంటి దారుణమైన ప్రతిజ్ఞ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ప్రవీణ్‌కుమార్‌తో పాటు, అక్కడే నిలబడి చోద్యం చూస్తున్న యూనిఫారమ్‌లోని పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఇంతకీ ఏమిటా ప్రతిజ్ఞ? ‘మేము రాముడిని ఆరాధించం’, ‘మేం వినాయకుడిని పూజించం’, ‘మేం శ్రాద్ధకర్మలను ఆచరించం’ ఈ విధంగా సాగిందా ప్రతిజ్ఞ.
ఇది వైరల్‌ అయింది. ఆగ్రహావేశాలు వ్యక్తమైనాయి. స్వేరోస్‌ ఉద్యమం ఏ మతానికీ వ్యతిరేకం కాదని దీనికి ఆ సీనియర్‌ ఐపీఎస్‌ ‌వివరణ ఇచ్చారు. కానీ రాముడు, వినాయకుడు ఇవన్నీ ఏ మతానికి సంబంధించినవి? స్థానికంగా ఉన్న బౌద్ధ కుటుంబ సభ్యుడు ఒకరు వేదిక ఎక్కి బుద్ధ వందనం చదివారని కూడా ముక్తాయించారాయన. ఇంతగా వివరణ ఇస్తున్నారంటే స్వేరోస్‌కూ, ప్రవీణ్‌కుమార్‌కు ఏమిటి సంబంధం? ఇది డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌బౌద్ధంలోకి మారినరోజు తీసుకున్న ప్రతిజ్ఞ అని చెబుతున్నారు. హిందూ దేవీదేవతలను ఆరాధించం అని వారందరితో పాటు ప్రవీణ్‌కుమార్‌ ‌కూడా చేయి సాచి ప్రమాణంలో పాల్గొని ఇప్పుడు ఇలాంటి వివరణ ఇవ్వడం ఏమి విజ్ఞత? అంటే డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌పేరును అడ్డం పెట్టుకుని ఈయన హిందూధర్మం మీద యుద్ధం ప్రకటించారని భావించవలసి వస్తుంది. అసలు ఒక మతాన్ని దారుణంగా అవమానపరుస్తూ స్వేరోస్‌ ఉద్యమం అందరి కోసం అంటూ ఎలా బొంకుతారు? ఏ మతానికీ తాము వ్యతిరేకంగా కాదని చెప్పడానికి ఇప్పుడు ఆయనకు ఉన్న నైతిక హక్కు ఏమిటి? సమాజంలో సమానత్వం అంటే ఇదా నిర్వచనం? ఇప్పుడు ఆ బౌద్ధుడు చదివినదానికీ, తమ స్వేరోస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నట్టు ఆయన చెబుతుంటే నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తున్నట్టు లేదా? ఈయన మీద ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లలకు వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా గుళ్లు గీయించారీయన.
భీమదీక్షకు ఈయన ఇచ్చిన నిర్వచనం చూస్తుంటే ఈ దేశ ప్రజలను వెర్రివాళ్లను చేయాలన్న తపన చాలానే ఉన్నట్టు భావించాలి. భీమదీక్ష అంటే హేతువాదం, క్రమశిక్షణ అట. సర్వమత సహనంతో వెలిగిపోతుందట. ఇప్పుడు ఈ ప్రతిజ్ఞతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే గింటే అందుకు విచారం మాత్రం వ్యక్తం చేస్తున్నారట. సరే, డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ఇస్లాం గురించి ఏమన్నారో కూడా ధైర్యంగా చెబితే ఈ జాతి తరిస్తుంది. జ్యోతిరావు ఫూలే, డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ఆశయాలతో వారి ఆశయాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ ఇలా హిందూమతాన్ని ఒక అధికారి ద్వేషిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం దాల్చినట్టు?
ఇలాంటి పోకడలను అరికట్టాలని కోరుతున్నవారిని నోరు విప్పకుండా చేస్తున్న ప్రయత్నం మరీ వికృతం. ప్రవీణ్‌కుమార్‌ ‌ధోరణి దేశ వ్యతిరేకంగా ఉన్నదని ఎస్‌సి రిజర్వేషన్‌ ‌పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం రెండేళ్ల క్రితం చెప్పబోతే సాక్షాత్తు హైదరాబాద్‌ ‌ప్రెస్‌క్లబ్‌లోనే ఆయన మీద దాడి జరిగింది. సంక్షేమ పాఠశాలలు మత మార్పిడి కేంద్రాలుగా మారిపోయాయంటూ అప్పుడు శ్రీశైలం చేసిన ఆరోపణా తీవ్రమైనదే. ప్రవీణ్‌కుమార్‌ ‌నిర్వహణలో ఆ పాఠశాలలన్నీ జాతి విద్రోహక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయన్న ఆరోపణ కూడా కలవరం కలిగించింది. ఆనాటి దాడిలో పాల్గొన్న వారి వాదన పరమ నీచంగా ఉంది. శ్రీశైలం వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నదట. ఈ దాడి, శ్రీశైలం మీద దాడి చేసినవారు చెబుతున్న మాట నిజానికి వాళ్లేమిటో కచ్చితంగా వెల్లడించడం లేదా? నాటి ఆరోపణకు తాజా సంఘటన ఊతమిస్తున్నది.
విశ్వవిద్యాలయాలలో తిష్ట వేసిన అర్బన్‌ ‌నక్సల్స్ ‌దేశ వ్యతిరేక ప్రచారంతో వాటిని భ్రష్టు పట్టిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో, హక్కుల ఉద్యమాల పేరుతో విద్యా సంస్థల నిండా విషాన్ని కుమ్మరిస్తున్నారు. ఏ స్థాయితోనివైనా విద్యాలయాలు జ్ఞాన వికాస కేంద్రాలుగానే ఉండాలి. శాస్త్రీయ దృక్పథం పెంచాలి. హేతువును అన్వేషించేందుకు ప్రోత్సహించాలి. ఒక మతాన్ని ద్వేషించడం ద్వారా ఇవన్నీ విద్యార్థులకు తెలిసిపోతాయని ఇలాంటి నిర్వాహకులు అనుకుంటే అంత కంటే అజ్ఞానం ఉండదు.

About Author

By editor

Twitter
YOUTUBE