శివ అనే పదానికి కల్యాణప్రదాత, కల్యాణ స్వరూపుడు అని అర్థాలు ఉన్నాయి. జ్ఞాన నేత్రుడు, సత్వగుణోపేతుడు, ఆదిదేవుడు, అమృతమయుడు, ఆనందమయుడు అని వేదాలు సదాశివుని లక్షణాలను వివరించాయి.
‘శివేతి చ శివం నామ యస్య వాచి ప్రవర్తతే
కోటి జన్మార్జితం పాపం తస్యనశ్యతి నిశ్చితమ్!!’ (శివ అనే మంగళకర నామాన్ని ఉచ్ఛరించేవారి కోటి జన్మాల పాపాలు నశించి తీరతాయి) అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. పాలసముద్రం మధనంలో ఉద్భవించిన హాలహల భక్షణనే ఆయన పరోపకార పరాయణత్వానికి, దయాంతరంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన భక్తసులభుడు. భక్తులంటే పరమ ప్రీతి. దేవదానవులు, మంచిచెడు లనే భేదభావాలకతీతంగా కోరిన వెంటనే వరాలిచ్చే బోళాశంకరుడు. అనర్హులకు అభయమిచ్చి చిక్కుల్లో పడిన సందర్భాలపై కథనాలూ ఉన్నాయి. ‘చిక్కుల’లో పడడమూ ఆయన లీలగానే భావించాలి. ఆదిదేవుడికి ఆ మాత్రం తెలియదా? ‘జాతస్య మరణం ధ్రువమ్’ అన్నట్లు కోరరానివి కోరినప్పుడు వాటి పర్యవసానాన్ని వారు అనుభవించాల్సిందే. అలాంటి వారికి వరం ఇవ్వడంతో పాటు ముగింపునూ నిర్దేశించే ఉంచుతాడనేందుకు అనేక కథ•లూ ఉన్నాయి.
‘శివ’ అంటే మంగళకరం. ‘శివరాత్రి’ అంటే మంగళకరమైన రాత్రి. ‘శివప్రియాతు దుపాసానార్ధా రాత్రి శివరాత్రి’ (శివునికి ప్రియమైన, శివారాధనకు ఉత్కృష్టమైన రాత్రే శివరాత్రి) అని స్కాంధ పురాణం పేర్కొంటోంది.శివారాధనకు నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి అని మూడు పర్వదినాలు ఉన్నా మహా శివరాత్రికి మరింత విశిష్టత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక కథనం ప్రకారం, తమలో ఎవరు అధికులమని బ్రహ్మ, విష్ణువుల మధ్య ఒకసారి వాగ్వాదం చోటుచేసుకొని, వాదన ముదిరి ప్రళయానికి దారితీసింది. ఈశ్వరుడు తేజోమూర్తిగా వారిద్దరి మధ్య ఉద్భవించి జ్ఞానోపదేశం చేశారు. అందుకే మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రిని లింగోద్భవ కాలంగా పరిగణించి శివారాధనలు, శివార్చనలు చేయడం అనవాయితి.
శివలింగం మూలం బ్రహ్మ స్వరూపమని, మధ్య భాగం విష్ణు స్వరూపమని, పైభాగం ఓంకార స్వరూపమైన సదాశివరూపమని చెబుతారు.కనుక శివరాత్రి నాడు పంచాక్షరీ పఠనంతో శివలింగపై నీటినిపోసి మారేడుదళం ఉంచితేనే సకల దేవతలను అర్చించిన పుణ్యఫలం దక్కుతుందని పెద్దలమాట. సాధారణ పూజలకే సంతసించి సాయుజ్యాన్ని ప్రసాదించే భక్తసులభుడు శివుడు. కన్నప్ప, సాలెపురుగు-పాము-ఏనుగు (‘శ్రీకాళహస్తి’) కథ తెలిసిందే కదా!
మహాశివరాత్రి అంటే ముఖ్యంగా మూడు వ్రతాలతో కూడింది. అవి. అభిషేకం, ఉపవాసం, జాగరణ. ఉపవాసం శారీరక శుద్ధికి, జాగారంతో చేసే ధ్యానం మనోశుద్ధికి ఉపకరిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
అభిషేకం
విష్ణువు అలంకారప్రియడు. శివుడు అభిషేక ప్రియుడు. మహన్యాసపూర్వక నమకచమకాదులతో ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేసిన వారినీ, మనస్ఫూర్తిగా హరహర అంటూ చెంబెడు నీళ్లు పోసి మారెడు పత్రం సమర్పించిన వారినీ సమానదృష్టితో కరుణిస్తాడు.
ఉపవాసం
‘ఉపవాసం’ (ఉప+వసము) అంటే పస్తు ఉండడం అని లౌకిక అర్థంలో స్థిరపడి పోయింది. కానీ ‘ఉప’ అంటే సమీపం, ‘వస’ అంటే ఉండడం అని నిఘంటు అర్థం. ఎవరి సమీపాన అంటే, భగవంతుని సమీపంలో అని అర్ధం చెప్పుకోవాలి. ఆయనకు సమీపంలో ఉండడం అంటే భక్తి కలిగి ఉండడమే. జపం, తపం, సత్ గ్రంథపఠనం, సత్సాంగత్యం శ్రేష్ఠతాలని పెద్దలమాట.
జాగరణ
మంగళకరమైన శివనామంతో మనసును ప్రసన్నంగా ఉంచుకోవవడమే జాగరణ. జాగరణ అంటే ఆత్మావలోకనం చేసుకోవడం. జన్మనెత్తినప్పటి నుంచి ఇంతవరకు మన జీవితం ఎలా సాగింది? తెలుసుకున్నది ఎంత? ఎదుర్కొన్న అనుభవాలు, చవిచూసిన అనుభూతులు, వెంటాడిన భయాలు ఏమిటి? నడక, నడత ఎలాంటిది? చేసిన తప్పొప్పులు ఏమిటి? లాంటి అంశాలను జ్ఞాన చక్షువులతో దర్శించి ఆత్మవిమర్శ చేసుకుని మహాశివుడి మన్నింపును కోరడమే దీని అంతరార్థమని పెద్దలు చెబుతారు. చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపంతో మెలకువగా ఉన్నప్పుడే ‘జాగరణ’మాటకు సార్థకత తప్ప మొక్కుబడిగానో, కాలక్షేపంగానో పరిగణిస్తే జాగరణ వృథా ప్రయాసే అవుతుంది.
శివాలయదర్శన విశిష్టత
‘పది కొంపలులేని పల్లెనైనను’ రామమందిరం ఉంటుందన్నట్లే శివాలయం లేని ఊరే ఉండదు. పంచారామాలు, పంచభూతలింగాలు, ద్వాదశ లింగాలు, అష్టాదశశక్తిపీఠాలు సుప్రసిద్ధాలు. వీటిలో పంచారామాలనే తీసుకుంటే వాటన్నిటిని కలిగి ఉండడం ఆంధ్రదేశం అదృష్టంగా చెబుతారు.
పంచారామాల విశిష్టత
తారకాసుర సంహార వేళ ఆతని మెడలోని ఆత్మ(అమృత)లింగం ముక్కలై ఐదుచోట్ల పడడం వల్ల అవి పంచారామాలుగా ప్రసిద్ధమయ్యాయి. వాటిలో నాలుగు గోదావరి తీరంలో ఉభయ గోదావరి జిల్లాలో నెలవై ఉండగా, ఒకటి గుంటూరు జిల్లాలో కృష్ణాతీరంలో కొలువుతీరింది. వీటన్నిటిని ఇంద్రాది దేవతలు ప్రతిష్ఠించి, తొలిపూజాదికాలు నిర్వహించా రని పురాణకథనం. ఈ క్షేత్రాలన్నిటిలో శ్రీ మహావిష్ణువే క్షేత్రపాలకుడు కావడం విశేషం.
దాక్షారామం
తూర్పు గోదావరి జిల్లాలోని దాక్షారామంలో భీమేశ్వరుని సూర్యభగవానుడు ప్రతిష్ఠించాడట. ఇది భోగలింగం.ఇక్కడి మహేశ్వరుడు నిత్యం వివిధ పరిమళ ద్రవ్యాలతో మహాభిషేకాలు అందుకుంటాడు. అష్టాదశ పీఠాలలో ఇది ద్వాదశ పీఠ•ంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి దేవేరి మాణిక్యాంబ పద్దెనిమంది మహాశక్తులలో ఒకరు. కనుక దాక్షారామం శైవ కేత్రంగానే కాక శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఐదు ప్రాకారాలు కలిగిన ఆలయంలో గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఐదడుగుల వెడల్పుగల పానపట్టంపై 14 అడుగుల శివలింగం ఠీవిగా దర్శనమిస్తుంది. దీనిని ‘వ్యాసకాశీ’గా అభివర్ణిస్తారు. వ్యాసుడు వారణాశిని విడిచిన తరువాత తీర్థయాత్రలు చేస్తూ దాక్షరామంలో పరమేశ్వర సాన్నిధ్యాన్ని తిరిగి పొందారు. ప్రస్తుత ఆలయాన్ని చాళుక్య భీముడు క్రీ.శ. 892-922 మధ్య అభివృద్ధి చేశారని శాసనాధారాలు చెబుతున్నాయి. మహా శివరాత్రిని పురస్కరించుకొని, శరన్నవరాత్రుల సందర్భంగా ప్రధాన ఉత్సవాలు నిర్వహిస్తారు.
కుమరారామం
తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట సమీపంలో కుమారరామ లింగేశుని యోగమూర్తిగా తారకాసుర సంహారకుడు కుమారస్వామి ప్రతిష్ఠించాడు. దీనిని స్కంధారామం (స్కంధుడనేది కుమారస్వామి పేరు) అనీ వ్యవహరిస్తారు. ఈ ఆలయం రెండు అంతస్తులతో ఉంటుంది. తొమ్మిది అడుగుల శివలింగానికి పై అంతస్తులో అభిషేకం, అర్చనలు జరుగుతాయి. మాండవ్య నారాయణుడు క్షేత్రపాలకుడు. చైత్ర, వైశాఖ మాసాలలో ఉదయం సూర్యకిరణాలు స్వామివారిపై, సాయంవేళలో అమ్మవారు బాలత్రిపుర సుందరిపై ప్రసరించడం విశేషం. తూర్పు చాళుక్యరాజు చాళుక్యభీముడు ఆంగ్లశకం 892-922 మధ్య ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.
సోమారామం
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సమీపం లోని గునుపూడిలోని సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆయన ప్రతిష్ట కావడం వల్ల శివలింగంపై షోడశ కళలు కనిపిస్తాయి. పున్నమి, అమావాస్య రోజులు చంద్రకళలు ప్రదర్శిస్తాడు. రెండడుగుల ఎత్తుగల పానపట్టంపై మూడు అడుగుల ఎత్తయిన ధవళ వర్ణంలోని ఈ లింగం అమావాస్య నాటికి గోధుమ వర్ణంలోకి మారి, పున్నమి నాటికి తిరిగి శ్వేతవర్ణం సంతరించుకుంటుంది. రాజరాజేశ్వరీ దేవి సహిత సోమేశ్వ రాలయానికి జనార్దనస్వామి క్షేత్రపాలకుడు. ఆంగ్లశకం 10వ శతాబ్దంలో చాళుక్యరాజు జటాచోళుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు.
క్షీరారామం
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పూర్వనామం క్షీరారామం. క్షీర రామలింగేశ్వరుడని సాక్షాత్తు శ్రీమహావిఘ్ణవు ప్రతిష్టించారని రెండున్నర అడుగుల ఎత్తుగల శివలింగాన్ని శ్రీరాముడు, ఉపమన్యువు అనే బాలభక్తుడు లాంటి మహా పురుషులు ఈ స్వామిని అర్చించారని చెబుతారు. అమృత లింగంలోని శిరోభాగం ఇక్కడ పడడంవల్ల లింగం కొప్పు ఆకారంలో ఉంటుంది. దక్షిణాయన, ఉత్తరాయన ప్రారంభంలో రాజగోపురం మీదుగా శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించడం ఇక్కడి ప్రత్యేకత.
తారకాసుర సంహారానికి ముందే ఉపమన్యుడనే బాలుడు ఈ క్షేత్రంలో శివారాధన చేశారని ప్రతీతి. ఆకలితో అలమటిస్తున్న ఆ బాలుడు శివుడిని ప్రార్ధించడంతో పార్వతీ సమేతంగా ప్రత్యక్ష మయ్యారట. పార్వతీదేవి తన అరచేతి నుంచి పాలను ధారగా పోయడంతో పెద్ద చెరువు ఏర్పడిందని, ఆ ‘క్షీరపురి’ పాలకొలనుగా క్రమేపి పాలకొల్లుగా మారిందని చెబుతారు. ఈ ఆలయాన్ని చాళుక్య భీముడు ఆంగ్లశకం 915-18 మధ్య పునరుద్ధ రించారని తెలుస్తోంది.
అమరావతి
గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఇంద్ర, బృహస్పతులు ప్రతిష్టించినట్లుగా చెప్పే తొమ్మిది అడుగుల అమరలింగేశ్వర లింగం రాజసంతో ఉట్టిపడుతుంటుంది. ఎనిమిది అడగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తున కలిగిన పానపట్టంపై ఈ లింగం ప్రతిష్టిత మైంది. రెండు అంతస్తులు గల ఆలయంలో పై నుంచే అభిషేక, అర్చనాదులు నిర్వహిస్తారు. బాలచాముండేశ్వరి సహిత అమరేశ్వరుని ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. కృష్ణవేణమ్మ మొదటి ప్రాకారాన్ని ఒరుసుకుంటూ సాగుతుంది. ఇక్కడ వేణుగోపాలస్వామి క్షేత్రపాలకుడు. మహాశివరాత్రితో పాటు ఆశ్వయుజ పంచమి నుంచి నవరాత్రి బ్రహోత్సవాలు నిర్వహిస్తారు.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్