– పాణ్యం దత్తశర్మ
‘‘తొరగా రాయే! బండెళ్లి పోతాది!’’ అంటూ ఐదేళ్ల కొడుకు మద్దిలేటిని ఎత్తుకొని ముందు నడుస్తున్నాడు సుంకన్న.
చంకలో సంవత్సరం వయసున్న కూతురు ఎల్లమ్మను మోస్తూ ‘‘వస్తున్నా ఉండు మామా!’’ అంటూ అనుసరిస్తూన్నది సుంకన్న భార్య అచ్చమ్మ.
సుంకన్న కుటుంబం కర్నూలు నగరంలోని బుధవారంపేటలో ఉంటారు. చెప్పులు కుట్టటం, బ్యాగులకు జిప్పులు రిపేరు చేయడం అతని వృత్తి. ప్రస్తుతం వాళ్లు కర్నూలు రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారు. రాత్రి 12 గంటల తర్వాత కాచిగూడ నుంచి వచ్చే ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’’లో వాళ్లు తిరుపతికి వెళ్లాలి.
సుంకన్న నెత్తిన సామాన్లతో ఒక చిన్న గోనెసంచి, అచ్చమ్మ చేతిలో బట్టలతో ఒక కర్రల బ్యాగు ఉన్నాయి. ఇంకో పెద్ద ప్లాస్టిక్ కవర్‌లో జొన్న రొట్టెలు, కొరివి కారం ఉన్నాయి.
వాళ్లు స్టేషన్ చేరుకునే సరికి రైలు వస్తుందనే ప్రకటన చేస్తూ ఉన్నారు. టికెట్ కౌంటరు వద్ద తిరుపతికి రెండు ఫుల్ టికెట్లు, ఒక అరటికెట్టు కొన్నాడు సుంకన్న. ‘‘జనరల్ పెట్టెలు ఎటువైపుంటాయి సారూ!’’ అని కౌంటర్‌లో మనిషి నడిగాడు సుంకన్న.
‘‘ఇంజను వైపుకెళ్లండి’’ అని జవాబు.
కుటుంబంతో ప్లాటుఫారమంతా దాటుకొని ముందు వైపు నిల్చున్నారు.
మరికొద్దిసేపటికీ రైలు వచ్చి ఆగింది.
యథాప్రకారం ఉన్న రెండు జనరల్ పెట్టెలూ కిక్కిరిసి ఉన్నాయి.
‘‘బాబ్బాబు! రొంత స్థలమియ్యండి!’’ అంటూ తలుపు దగ్గరున్నోళ్లను బరిగ పోయి (బ్రతిమిలాడి) ఎట్లో పెట్టెలోకి ప్రవేశించాడు.
రెండు టాయిలెట్ల మధ్య ఉన్న స్థలంలో ఇరుక్కొని నిలబడ్డారు సుంకన్న కుటుంబం. కూత వేసి బండి కదిలింది.
‘‘గోయిందా! గోయింద!’’ అని అరిచాడు సుంకన్న. భార్య గొంతు కలిపింది. మరికొందరు గొంతులు కలిపారు.
కొడుకును భుజాలమీద మోస్తున్నాడు సుంకన్న. అచ్చమ్మ చంకలో కూతురు. సామాను కాళ్ల దగ్గర.
డోన్ స్టేషన్‌లో రైలాగింది.
‘‘నాయనా! మంచినీళ్లే!’’ అన్నాడు భుజాలమీది కొడుకు. కొడుకును దించి, సంచిలో ప్లాస్టిక్ సీసా తీసుకొని, ఫ్లాట్‌ఫాం మీదకు దిగాడు సుంకన్న.
దగ్గరలో ఉన్న కొళాయి దగ్గరకు పోయి తిప్పుతే నీళ్లు రాలేదు.
‘‘వాటర్ బాటిల్, కూలింగ్ వాటర్ బాటిల్!’’ అని ఒక టబ్బులో నీళ్ల సీసాలను మోస్తున్న మనిషిని పిలిచి ధర అడిగాడు సుంకన్న.
‘‘వీడిది వాటర్ బాటిల్ కొనే మొగమేనా!’’ అని అనుమానంతో సుంకన్న వైపు చూస్తూ ‘‘ఇరవై’’ అన్నాడు వాడు.
అమ్మో! అనుకొని ‘‘వద్దులే’’ అంటూ రైలెక్కాడు. పిల్లవాడు నీళ్లకోసం ఏడుస్తూ ఉంటే విధి లేక రైల్లోనే వాష్‌బేసిన్‌లోని కుళాయిలో నీళ్లు పట్టి కొడుక్కు తాపించి, తామూ తాగారు. ఎల్లమ్మకు ఆ సమస్య లేదు. తల్లిపాలున్నాయి.
రాత్రంతా నిలువు కాళ్లపై, జాగారం చేస్తూ, మరుసటి రోజు పొద్దున తిరుపతి చేరుకున్నారు. జనసంద్రం లాగుంది తిరుపతి స్టేషను.
జనరల్ వెయిటింగ్ రూములో కాలకృత్యాలు తీర్చుకొని, మొగాలు కడుక్కొని రొట్టెలు తిన్నారు. మెల్లగా నడుస్తూ మెట్లదారి వద్దకు చేరుకున్నారు.
చిన్న చెప్పుల రిపేరు షాపు పెట్టుకోడానికి గ్రామీణ బ్యాంకులో లోను శాంక్షనవుతే తిరుపతికి వచ్చి వెంకన్నకు తలనీలాలిస్తానని మొక్కుకున్నాడు సుంకన్న. దేవుని దయతో లోను వచ్చింది. గవర్నమెంటు ఆసుపత్రి గోడనానుకొని, పుట్‌పాత్ మీదే చిన్న బంకులో తన వృత్తిని ప్రారంభించాడు.
పిల్లల నెత్తుకొని అవతలగా మెట్లెక్కసాగారు. కాయకష్టం చేసిన శరీరాలు కాబట్టి వాళ్లకు శ్రమ అనిపించలేదు. మధ్యలో కాసేపు ఆగి ‘టీ’ తాగారు. మధ్యాహ్నం దారిలో అమ్ముతున్న ‘పులిహోర’ కొనుక్కొని తిన్నారు.
చీకటి పడుతుండగా తిరుమల చేరుకున్నది సుంకన్న కుటుంబం. రూము తీసుకొనే స్తోమత ఎలాగూ లేదు. మళ్లీ మిగిలిన రొట్టెలు తిని, సంచిలోని దుప్పటి తీసి, పుష్కరిణి దగ్గరలో నేలమీద పడుకొన్నారు.
తెలవారుజామునే లేచి, దేవస్థానం వారి బాత్‌రూముల్లో స్నానాలు చేశారు. ధర్మదర్శనం క్యూలో నిల్చున్నారు. గోవింద నామాలతో పరిసరాలు ప్రతిధ్వనిస్తున్నాయి.
సుంకన్న భక్తి పారవశ్యంతో ‘‘గోయిందా!’’ అని అరుస్తూ ముందుకు సాగుతున్నాడు కుటుంబంతో.
ఆవిధంగా ఏడెనిమిది గంటలపాటు మెల్లగా క్యూలో కదులుతున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ‘క్యూ’ ఆగిపోయింది.
—————-
టి.టి.డి. ఈవో గారు కంగారు పడిపోతున్నారు. కేంద్రమంత్రి వర్యులు స్వామి వారి దర్శనానికి విచ్చేయడమే ఆ కంగారుకు కారణం! ఘాట్‌రోడ్డులో, తిరుమల అంతా గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. కొండమీదంతా పోలీసులే.
అన్ని రకాల ‘క్యూ’లు అపివేశారు. అధికారు లందరూ మంత్రిగారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఎంతకూ రాలేదు.
ధర్మదర్శనం క్యూలో భక్తులకు అసహనం పెరిగిపోతుంది. సుంకన్న కూతురు గుక్కపట్టి ఏడుస్తూంది. కొడుకు భుజాలు దిగడం లేదు. దేవస్థానం వారు సప్లయి చేసిన ఆహార పొట్లాలు, మజ్జిగ వారికి కొంత ఊరట.
‘‘మంత్రిగారొచ్చేంత వరకూ మన గతి యింతేనా!’’
‘‘మంత్రయితే గొప్పేటి!’’
‘‘దిసీజ్ టూ మచ్’’
‘‘భగవాన్ కేలియే ఇంతజార్ సహీ హై! యే మినిస్టర్ కేలియే లోగోంకో పరేశాన్ కరనా అచ్చా నహీ హై’’
రకరకాల వ్యాఖ్యానాలు.
జనాలు క్యూలో ప్రవేశించి 10 గంటలు దాటింది. స్వామి దర్శనం ఎంత ఆలస్యమయినా సహిస్తారు గాని, ఇట్లా ఎవరి కోసమో ఆగిపొమ్మంటే ఎలా సహిస్తారు.
‘‘క్యూ కదలనివ్వాలి!’’
‘‘మంత్రిగారొచ్చేంతవరకూ ఆగేది లేదు!’’
కేకలు!
క్యూలో గొడవ పెద్దదయింది! సెక్యూరిటీ సిబ్బంది రంగ ప్రవేశం చేశారు. కేకలు వేస్తున్న వారిపై జులుం చేశారు.
———————–
ఎట్టకేలకు మంతిగ్రారు వేంచేశారు. ఆగమ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో, జె.ఇ.ఓ., ఇతర ఉన్నతాధికారులు వినయ విధేయతలతో ఆయనను ‘రిసీవ్’ చేసుకున్నారు. క్షణాల్లో మంత్రివర్యులు స్వామి వారి వద్దకు వెళ్లారు. దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఎంతో వ్యగ్రతతో మంత్రిగారి ప్రక్కనే ఉండి ఆలయ ప్రాశస్తాన్ని వివరిస్తున్నారు.
ఈవో గారు మంత్రివర్యులకు ‘‘శేషవస్త్రం’’, ‘‘ప్రసాదం’’, స్వామివారి ఫొటో బహుకరించారు. చివరకు మంత్రిపుంగవులు, తమ పరివారంతో నిష్క్రమించారు.
—————————
దాదాపు 18 గంటల నిరీక్షణ తర్వాత సుంకన్న కుటుంబానికి స్వామి వారి దర్శనం లభించింది! సుంకన్న, అచ్చమ్మ స్వామివారి దివ్యమంగళ విగ్రహానికి నమస్కరించారు. పిల్లలతో దండం పెట్టించారు. అక్కడ ఉద్యోగులు వారిని కదలమని గద్దిస్తూ ఉండగా వెనక్కి తిరిగి స్వామివారిని చూస్తూ, చూస్తూ, ఆలయం బయటకు వచ్చారు.
—————————
మరునాడు అన్ని పేపర్లలో ఈ వార్త వచ్చింది. ‘‘తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫలానా మంత్రిగారు!’’ టి.వి. ఛానల్స్‌లలో కూడా ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి. స్వామిని దర్శించుకోవడం మంత్రిగారి ఘనత అయినట్లుగా, ఇతర జనాలకు దర్శనం గంటల కొద్దీ ఆపేయడం దేవస్థానం ఘనత అయినట్లుగా! మంత్రులే కాదు గవర్నర్లు, జడ్జిలు, ఐఏఎస్‌లు, ఎవరు తిరుమలకు వచ్చినా ఈ పేపర్ల వారికి, టి.వి. ఛానల్సు వారికీ అది ఒక వార్త ఎందుకవుతుందో, ఎందుకవ్వాలో మరి!
————————-
నడిరేయి! ఒక జాము! స్వామివారు మెట్లు దిగి తిరుచానూరుకు వెళుతున్నారు. పవళింపుసేవ అయిపోయిన తర్వాత ప్రతిరాత్రీ ఆయన అమ్మవారి వద్దకు బయలుదేరుతారు. ఆయన చరణాల కాంతితో మెట్లు ధగధగ మెరుస్తున్నాయి. అలమేలుమంగ స్వామి కోసం ఎదురుచూస్తున్నది. స్వామివారిని చూడగానే అనంత సంతోష భరితాంతరంగ అయినది మంగ.
స్వామి అమ్మవారిని గ్రుచ్చి ఎత్తి, కౌగలించి, శయన మందిరానికి తోడ్కొని వెళ్లారు. జగత్తును ఉద్ధరింపచేసే ఆ దివ్యదంపతులు విశ్రాంతిగా, ఏకశయ్యా గతులైనారు.
తరువాత ప్రకృతీ పురుషులు రతికేళి నోలలాడారు. స్వామివారి నీలకలేబరంపై అమ్మవారి మేని పసిడికాంతులు ప్రతిఫలించాయి.
మోచేయి ఊతగా ఏడుకొండల వాడు పవ్వళించి ఉండగా విశ్వ మాత ఆయన పాదాలు మృదువుగా ఒత్తుతూ ఇలా పలికింది.
‘‘నాధా! మీ దర్శనానికి వచ్చే వారిలో ఉన్నత పదవులతో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు ఈ ప్రత్యేక దర్శన భాగ్యమేల! ఈ వివక్ష నాకు దుస్సహంగా ఉంది.’’
చిన్మయమూర్తి శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు.
‘‘దేవీ! ఈ వివక్ష నేను చూపేదికాదు! స్వార్థపరులు, అజ్ఞానులైన మానవులు సృష్టించు కున్నది! నా దృష్టిలో అందరూ సమానులే! మంత్రి నన్ను దర్శించుకుంటున్నప్పుడు నాకెంత చికాకుగా ఉంటుందో తెలుసా! నేను గీతలో ఏనాడో చెప్పాను.
‘‘సర్వత్ర సమదర్శినః యోగినః!’’
అందరినీ సమానంగా చూడగలిగిన వాడే యోగి! నేను యోగి గమ్యుడనని నీకు తెలియదా సఖీ! కర్నూలు నుంచి వచ్చిన చర్మకారుడు సుంకన్న అష్టకష్టాలు పడి నా దర్శనానికి వచ్చినపుడు నాలో ఏదో గగుర్పాటు! అతని భక్తి స్వచ్ఛమయినది! మరొకమాట అతడు నిజమయిన యోగి!
ఎందుకంటావా! ‘‘యోగః కర్మసుకేశలమ్!’’ అని నేనే చెప్పియున్నాను. తన వృత్తి యందు ఎవడు నిబద్ధుడో, నిజాయితీపరుడో, అది ఏ వృత్తి అయినా అతడే నిజమయిన యోగి. ఆ సుంకన్న తన వృత్తిలో ఏనాడూ దురాశకు పోలేదు. ఇతరులను వంచించలేదు.
అటువంటి వారి కొరకు నేను వెలసియున్నాను కాని, ధనాధికార మధాందులయిన నీచ మానవుల కొరకు కాదు. నన్నెవరు త్రికరణ శుద్ధిగా కొలుస్తారో వారినే నేననుగ్రహిస్తాను. అనుచిత విధానాల ద్వారా నన్ను దర్శించుకొనే వారికి, నన్ను దర్శింపజేసే వారికీ, నేను దొరకను. అటువంటి వారి మీద నాకు ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. సమయమాసన్నమైనపుడు వారు తమ అపచారాలకు తగిన మూల్యం చెల్లిస్తారు’’
స్వామివారి మాటలతో ప్రఫుల్లాంతరంగయైన మంగ ‘‘నా స్వామి బంగారం!’’ అంటూ ఆయన వక్షస్థలాన చేరింది.
———————
తిరుగు ప్రయాణంలో మళ్లీ టాయిలెట్ల మధ్యన సుంకన్న కుటుంబం నిలబడి జనరల్ బోగీలో ప్రయాణిస్తూంది…
అచ్చమ్మ మగడినడిగింది ‘‘కాదయ్యా! ఆ మంత్రిగారు ఎంత అదృష్టవంతులో కదా! స్వామిని అంత వైభోగంగా, అంత తొందరగా దర్శించు కున్నాడు’’
సుంకన్న ఇలా అన్నాడు.
‘‘పిచ్చిదానా! మనకు దేవుడిచ్చిన దర్శనం మన జన్మలు పండించింది. మనకొచ్చిన ఆనందం ఆ మంత్రికెందుకు వస్తుందే. స్వామి మనలాంటోళ్లనే దయ చూస్తాడు గాని, అలాంటోళ్లను గాదే!’’