– డాక్టర్‌ ‌సృష్టి పుఖ్రెమ్‌

‌మయన్మార్‌లో అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకోవడం భారత్‌ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ ‌విధానం పాలిట శాపమైంది. అయినప్పటికీ, సైనిక నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగించడం భారత్‌కు అనివార్యమైంది. ఆ విధంగా చైనా మయన్మార్‌లో చొచ్చుకుపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. మయన్మార్‌లో పెండింగ్‌ ‌ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి కూడా ఇది తప్పనిసరి.

టాట్మాడా (మయన్మార్‌ ‌సాయుధ బలగాలు) ఫిబ్రవరి 1, 2021న ఒక ఏడాది కాలానికి దేశ పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోవడంతో, ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంతో మయన్మార్‌ ‌సాగిస్తున్న ప్రేమయాత్ర ఒక్కసారిగా ముగిసిపోయింది. ఎన్నికల్లో మోసానికి పాల్పడిన అభియోగాలపై దేశ కౌన్సెలర్‌, ‌జాతీయ ప్రజాస్వామ్య లీగ్‌ (ఎన్‌ఎల్‌డీ) ప్రభుత్వానికి తిరుగులేని నాయకురాలు ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీతో పాటు, దేశాధ్య క్షుడు విన్‌ ‌మైంట్‌ను టాట్మాడా నిర్బంధించింది. ఎన్‌ఎల్‌డీ ఇటీవల, అంటే 2020 సంవత్సరం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్‌ఎల్‌డీ నాయకులు, ముఖ్యమంత్రు లతో పాటుగా సైన్యం అంటే పడని అనేకమంది జర్నలిస్టులు, కార్యకర్తలు ఖైదీలయ్యారు. ఈ సైనిక కుట్ర మయన్మార్‌ ‌రాజకీయ చరిత్రలో మూడవదిగా నిలిచిపోతుంది. 1962 సంవత్సరంలో మొదటి కుట్ర, 1988 సంవత్సరంలో రెండవ కుట్ర చోటుచేసుకున్నాయి. ప్రస్తుత సైనిక కుట్ర మయన్మార్‌ ఆర్థిక వృద్ధిని పట్టాలు తప్పిస్తుంది. ఇది మయన్మార్‌ ‌రాజకీయ చిత్రపటం  రూపురేఖలను మార్చడమేకాక, దక్షిణ, ఆగ్నేయ ప్రాంత భౌగోళిక రాజకీయాలను అస్థిరపరిచేంత సామర్థ్యాన్ని అది సంతరించుకున్నది. చారిత్రకంగా, మయన్మార్‌ ‌తన విదేశాంగ విధానంలో ఎవ్వరితోనూ పెద్దగా కలవని ఒక విధానాన్ని అనుసరిస్తున్నది. కానీ 1980 దశాబ్దం చివరికి వచ్చేసరికి, ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూనే, అది చైనా మీద పూర్తిగా ఆధారపడటం పెరిగిపోయింది. దేశం ప్రజా స్వామ్యం దిశగా పురోగమిస్తుండగా, శతాబ్దపు తొలి దశకంలో ఇలా ఆధారపడే క్రమంలో మార్పు మొదలైంది.

ప్రస్తుత ప్రభుత్వ నిర్మాణం పూర్తిగా ప్రజాస్వామ్య యుతమైనది కాదు. 2008 నాటి రాజ్యాంగం పార్లమెంట్‌లో 25 శాతం స్థానాలను సైన్యానికి దఖలు పరిచింది. అంతేకాక 75 శాతం మెజార్టీ లేకుండా రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయడానికి వీలు లేకుండాపోయింది. దీనికి తోడు టాట్మాడా కీలకమైన మూడు మంత్రిత్వశాఖలను తన గుప్పిట ఉంచుకుంది. తదనుగుణంగా, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తమంతట తాముగా దేశీయ లేదా విదేశాంగ విధానాన్ని నిర్ణయించే స్వేచ్ఛ లేకుండా పోయింది. సైనికకుట్ర నిస్సందేహంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఒక వేళ టాట్మాడా వాగ్దానం చేసిన ఏడాది కాలం కన్నా ఎక్కువ కాలం సంక్షోభం కొనసాగిన పక్షంలో మయన్మార్‌ ‌నే విన్‌ ‌శకం నాటి ఎవ్వరితోనూ పెద్దగా కలవని విధానంలోకి పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో కేవలం చైనా, కొద్దో గొప్పో భారత్‌ ‌మయన్మార్‌తో సత్సంబంధాలకు సుముఖత వ్యక్తం చేయవచ్చు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో సైన్యం తన బలగాలను మయన్మార్‌లోని పట్టణ కేంద్రాల్లో మోహరింపజేయవచ్చు. ఆ పట్టణ కేంద్రాలు నిరసనలకు ఆజ్యం పోసే అవకాశం ఉంది. టాట్మాడా పట్టణ కేంద్రాల్లో మోహరించి ఉన్న కారణంగా సరిహద్దుల్లో దాని ఉనికి నామమాత్రంగా మిగిలి పోతుంది. ఇది మయన్మార్‌లో అంతర్గత తిరుగుబాట్లు మళ్లీ పుట్టుకురావడానికి దారితీస్తుంది. ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న అనేక తిరుగుబాటు బృందాలు పాలనాధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకోవడంపట్ల తమ వ్యతిరేకతను ఇప్పటికే వినిపించాయి. ఏదో ఒకరకంగా, గడచిన రెండు సంవత్సరాలుగా సైన్యానికి, దేశ పశ్చిమ ప్రాంతంపై పట్టు కలిగి ఉన్న తిరుగుబాటు బృందం అరకన్‌ ఆర్మీకి (ఏఏ) మధ్య చోటు చేసుకున్న ఘర్షణలకు వేలాదిగా యోధులు, సామాన్య పౌరులు బలైపోయారు. రఖినె, చిన్‌ ‌రాష్ట్రాల్లో అనేక మంది ప్రజలకు నిలువ నీడ లేక నిరాశ్రయులైపోయారు. అంతేకాక పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తున్నట్టుగా ఇల్లూ వాకిలీ లేని రోహింగ్యాలు ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్‌ ‌స్టేట్‌, అల్‌ ‌ఖైదాల ప్రోద్బలంతో శీఘ్రగతిన తీవ్రవాద బాట పట్టారు.

శాంతి స్థాపన కోసం ఉగ్రవాద సంస్థ అరకన్‌ ఆర్మీని నియోగిస్తూ గత మార్చి మాసంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే అవకాశాలను లేకుండా చేసింది. రఖినె రాష్ట్రంలో ఓటింగ్‌ను మయన్మార్‌ ఎన్నికల కమిషన్‌ ‌రద్దు చేయడం సమస్యను మరింత జటిలపరిచింది. అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నట్టుగా ఎన్నికలు ముగిసిన వెంటనే అరకన్‌ ఆర్మీ, టాట్మాడా రెండూ కూడా ఓటింగ్‌ ‌రద్దు చేసిన ప్రాంతాల్లో ఎన్నికలకు పిలుపునిస్తూ సమన్వయ ప్రకటనలు జారీ చేశాయి. మరీ ముఖ్యంగా, కీలకమైనప్పటికీ అంతంతమాత్రపు ఒక కాల్పుల ఒప్పందం కొనసాగుతున్న కారణంగా తుపాకుల మోత ఆగిపోయింది. నామమాత్రంగా కుదుర్చుకున్న ఈ ఒడంబడిక అమల్లోకి వచ్చి రెండు నెలలు దాటిపోయింది. దీంతో తలోదిక్కుకు అన్నట్టుగా చెల్లాచెదురైపోయిన పౌరులు తిరిగి ఇంటి ముఖం పట్టారు.

ఒకరి పొడ అంటే మరొకరికి పడని రాజకీయ పార్టీలు పకడ్బందీగా ఎన్నికల నిర్వహణపై మూడు సార్లు సమావేశాలు జరిపి చర్చించుకున్నాయి. సంక్షోభానికి స్వస్తి దిశగా తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు జరిపాయి. రఖినె రాష్ట్రంలో సంక్షోభ పరిష్కారానికి సంబంధించినంత వరకు సైనిక పాలనలోని ప్రస్తుత సంధి కాలం, పరిహాస పూర్వకంగానైనా ఒక ఆశను చిగురింపజేయవచ్చు.

అనేక విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు సైనిక చర్యలను విమర్శించాయి. ‘ప్రజాస్వామ్యం దిశగా చోటుచేసుకునే పురోగతి ప్రాతిపదికగా బర్మాపై ఆంక్షలు తొలగిపోతాయి’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ‘ఆ పురోగతిని తోసిరాజన్న పక్షంలో దానిపై ఒక సత్వర సమీక్ష అనివార్యమవుతుంది’ అని కూడా ఆయన చెప్పారు. ‘సమన్యాయ పరిపాలనను, మానవహక్కులను గౌరవించి, అన్యాయంగా నిర్బంధానికి గురైన వారిని విడుదల చేయండి’ అని బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి బోరిస్‌ ‌జాన్సన్‌ ‌టాట్మాడాకు సూచించారు. ఐరోపా యూనియన్‌, ‌దాని సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఇదే తరహా విమర్శలు చేశారు. ఇక చైనా నుంచి వచ్చిన స్పందన అందరూ ఊహించినట్టుగానే ఉంది. అక్కడి విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మయన్మార్‌లో పరిస్థితిని ‘పరిగణనలోకి’ తీసుకున్నారు. ‘మయన్మార్‌లో అన్ని పార్టీలూ రాజకీయ, సామాజిక సుస్థిరతను నెలకొల్పే దిశగా రాజ్యాంగం, సమన్యాయ పరిపాలన పరిధికి లోబడి వారి మధ్య విభేదాలను సక్రమంగా పరిష్కరించుకోవాలి’ అని ఆశించారు. చైనాను మయన్మార్‌కు పొరుగున ఉన్న ఒక మిత్రదేశంగా ఆ దేశపు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ ‌వెన్‌బిన్‌ ‌తెలిపారు. మయన్మార్‌ ‌ప్రభుత్వంతో ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించుకుంటూ వచ్చిన బంధాలు ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఏఎస్‌ఈఏఎన్‌)‌లో సభ్య దేశం కూడా అయిన ఆ దేశంతో మరింత పటిష్టమైన సంబంధం నెలకొల్పుకోవడానికి చైనాకు మరింత ఊతమిచ్చాయి. మయన్మార్‌కు వస్తుదాయక మద్దతు ఇవ్వజూపుతూనే రఖినె రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నానాటికి పెరిగిపోతున్న అంతర్జాతీయ ఒత్తిడి నుంచి మయన్మార్‌కు అవి రక్షాకవచంలా నిలిచాయి. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ 2020 ‌సంవత్సరంలో తొలిసారి జరిపిన విదేశీ పర్యటనతో సింగపూర్‌ ‌తర్వాత మయన్మార్‌లో రెండవ అతి పెద్ద పెట్టుబడి దారుగా చైనా అవతరించిందనే వార్తలు వచ్చాయి.

భారత్‌కు ఆచరణీయ సూచనలు

 భారత్‌ ‌యాక్ట్ ఈస్ట్ ‌విధానానికి (ఏయీపీ) సైనిక పాలన తాత్కాలికంగా ఒక ఎదురు దెబ్బ. భారత సైన్యం టాట్మాడాతో, ప్రభుత్వంతో అద్భుతమైన సంబంధాలను కలిగి ఉన్నది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడంలో పెద్దగా పట్టింపు లేని సైనిక ప్రభుత్వంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. అయితే, అంతర్జాతీయ సమాజం మయన్మార్‌ను పక్కనపెట్టవచ్చు. అది, మయన్మార్‌లో లేదా మయన్మార్‌ ‌ద్వారా తలపెట్టిన అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏఈపీ అత్యధికంగా మయన్మార్‌కు అనుకూలంగా ఉంది. అది పొరుగున ఉన్న ఆగ్నేయాసియా దేశానికి మరింత కనెక్టివిటీని సమకూరుస్తుంది. ఒకవేళ తెగలపరంగా చోటుచేసుకునే తిరుగుబాట్లతో మయన్మార్‌లో అస్థిరత పెరిగిన పక్షంలో ఈ ప్రాజెక్టుల్లో చాలా వాటికి అసాధారణమైన జాప్యం చోటు చేసుకోవచ్చు లేదా అవి ఆర్థికంగా అక్కరకు రానివిగా మిగిలిపోయే అవకాశం ఉంది. సానుకూలత విషయానికి వస్తే, ప్రజాస్వామ్య ప్రభుత్వ హయాంతో పోల్చినప్పడు, అపరిష్కృతంగా ఉన్న వాటిని చకచకా పరిష్కరించడంలో టాట్మాడా సామర్థ్యం ఎంతో మెరుగైనది.

 మయన్మార్‌ ‌పరిణామాలపై భారత్‌ ‌తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ‘మయన్మార్‌లో ప్రజాస్వామ్య సంక్రమణ పక్రియకు మద్దతు ఇవ్వడంతో భారత్‌ అచంచలమైంది. సమన్యాయ పరిపాలన, ప్రజాస్వామ్య పక్రియలది తప్పనిసరిగా పైచేయిగా ఉండాలని మేం విశ్వసిస్తున్నాం’ అని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఒక ప్రజాస్వామ్య దేశం నుంచి ఊహించిన విధంగానే ఆ ప్రకటన ఉంది. కానీ, మయన్మార్‌తో భారత్‌ ‌నెరపుతున్న సంబంధాల్లో ఏదైనా అనూహ్యమైన మార్పులను ఊహించుకోవడం తొందరపాటు అవుతుంది. భారత్‌కు మయన్మార్‌తో సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. తద్వారా చైనా మయన్మార్‌లో చొచ్చుకుపోకుండా చూడవచ్చు. చైనా, ఎన్‌ఎల్‌డీ మధ్య స్నేహానికి సంబంధించి ఇటీవల వెలువడిన సంకేతాలపై టాట్మాడా ఏ మాత్రం సంతోషంగా లేకపోవడం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన ఒక అంశం.

మయన్మార్‌ ‌ప్రభుత్వం ప్రజాస్వామ్య బాట పట్టేందుకు ప్రయత్నించాలి. అందుకు పట్టే సమయాన్ని త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి వినియోగించుకోవాలి. త్రిభుజ హైవే లేదా ఇండియా-మయన్మార్‌-‌థాయ్‌లాండ్‌ (ఐఎం‌టీ) ప్రాజెక్టును పట్టాలెక్కించాలి. అది మయన్మార్‌కు తోడు భారత్‌, ‌బంగ్లాదేశ్‌, ‌థాయ్‌ల్యాండ్‌, ‌మలేసియా దేశాల మీదుగా ఖాట్మండు నుంచి సింగపూర్‌కు నిరంతరాయంగా రాకపోకలు సాగించడానికి మార్గం సుగమం చేస్తుంది.

భారత విదేశాంగ కార్యదర్శి, భారత సైనిక దళాల అధిపతి 2020 సంవత్సరం అక్టోబర్‌లో చేపట్టిన మయన్మార్‌ ‌పర్యటన ఆ దేశానికి భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధానంగా చూపింది. సైన్యంలో ఉన్నతాధికార శ్రేణుల ప్రమేయంతో ఇతర దేశాలతో దౌత్యపరమైన సంబంధాలను విస్తరింపజేసుకునే క్రమంలో సైనిక వినియోగాన్ని సైతం ఎత్తిచూపింది. భారత ప్రభుత్వం మయన్మార్‌లో ఎన్‌ఎల్‌డీ నాయకత్వంతో ఎప్పటిలాగానే సంబంధాలను కొనసాగించాలి. అదే సమయంలో ప్రస్తుత టాట్మాడా హయాంతో సత్సంబంధాలకు పైన పేర్కొన్న మార్గాన్ని భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆశిద్దాం.

(ఆర్గనైజర్‌ ‌నుంచి)

(రచయిత్రి ఇండియా ఫౌండేషన్‌లో

సీనియర్‌ ‌రీసెర్చ్ ‌ఫెలో)

About Author

By editor

Twitter
YOUTUBE