– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలు నిస్సైనికమయ్యాయి. దీనితోనే చైనా వంటి సరిహద్దు దేశంతో శాంతిభద్రతలు నెలకొని, ఆగమేఘాల మీద సత్సంబంధాలు ఏర్పడతాయని అర్ధం కాదు. భారత్ ఇక నిశ్చింతగా ఉండవచ్చుననే అసలే కాదు. అందుకు భరోసా కూడా లేదు. ఇందుకు కారణాలు రెండు – ఒకటి చైనా వైఖరిని చెప్పే చరిత్ర. మరొకటి వేర్వేరు పేర్లతో సరిహద్దు దేశాల భూభాగాలను ఆక్రమించు కోవడానికి చైనా నిరంతరాయంగా వేస్తున్న పథకాలు. అంటే ఆ దేశ చరిత్ర, వర్తమానం రెండూ అనుమానాస్పదమే. ఆ సరస్సు తీరాల నుంచి సైనికులు వెనక్కి తగ్గి ఉండవచ్చు. కానీ సరిహద్దులోని మిగిలిన సమస్యలు యథాతథంగానే ఉండబోతున్నాయి. ఇది తథ్యం. ఇలా భావించడం శుభసూచకం కాదని ఎవరు భావించినా వారి ఆశావహ దృక్పథాన్ని ఆహ్వానించాలి. అదే సమయంలో కీడెంచి మేలెంచాలన్న విధానం చైనా విషయంలో తప్పదన్న వాస్తవిక దృష్టినీ గౌరవించాలి. అలాంటి దృష్టి లోపించడం వల్ల 1962లో ఈ దేశం ఎలాంటి అవమానానికి గురైందో చరిత్రనడిగితే చెబుతుంది. మళ్లీ యుద్ధం అంచులకు వెళ్లి, శాంతికి మొగ్గు చూపాయి. అయినా ఇప్పటికీ చైనాను నమ్మవచ్చుననడానికి ఏ ఒక్క సూచనా కనిపించకపోవడం చేదునిజం. ఇప్పటికీ ఆ దేశం భారత్‌ను శత్రుదేశంగానే పరిగణిస్తున్నది. సరిహద్దులోని ఈ తాజా ఉద్రిక్తతలన్నింటికి కారణం భారత్ అని కూడా డ్రాగన్ చెబుతూనే ఉంది. ఆఖరికి గల్వాన్ లోయ వద్ద భారత్ సైనికులే చొరబాటుకు యత్నించారని చెప్పడానికీ వెనుకాడడం లేదు.
దాదాపు ఎనిమిది మాసాల నుంచి రెండు ఆసియా దిగ్గజాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన దళాల మోహరింపు ప్రస్తుతానికి సడలిపోయింది. నిస్సందేహంగా ఇప్పటికి ఇది ఆహ్వానించ తగిన పరిణామమే. హిమాలయాలోని ఈ ప్రాంతంలో ఇరుదేశాల సరిహద్దుల నుంచి దళాల ఉపసంహరణ పూర్తయిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అస్పష్టమైన సరిహద్దులు, చైనా విస్తరణ కాంక్షకు ఊతమిచ్చాయి. నిరంతరం దురాక్రమణ వాదంతో వేగిపోతూ ఉండే చైనా సైన్యం దూకుడును నివారించే క్రమంలో ఇరవై మంది భారత జవాన్లు అమరులయ్యారు. 1967 తరువాత ఇంత పెద్ద స్థాయిలో ఘర్షణ జరగడం, ఇంతమంది సైనికులు చనిపోవడం మళ్లీ ఇదే. భారత్, చైనా దాదాపు యుద్ధం అంచులకు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. నిజంగా ఇదొక మంచి పరిణామం. దళాల ఉపసంహరణ దరిమిలా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి దీనితో దారి ఏర్పడిందని భారత్, చైనా ప్రతినిధులు చెప్పారు. ఫిబ్రవరి 11న చెప్పినట్టుగానే తొమ్మిది రోజులలోనే దళాల ఉపసంహరణ దాదాపు పూర్తయింది. ఇది ఈ వివాదానికే పరిమితమన్న సంగతి విస్మరించలేం.
హడావుడి జ్ఞానోదయం
ఒకవైపు దళాల ఉపసంహరణకు అంగీకారం కుదిరి, అది పూర్తయిపోయినట్టు ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో జూన్ 15/16, 2020న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ, అందులో మరణించిన తమ సైనికుల సంఖ్యను హఠాత్తుగా చైనా ఎందుకు ప్రకటించినట్టు? మా సైనికులు నలుగురు మరణించారు, ఒక అధికారి మరణించారని ఫిబ్రవరి 19న చైనా ప్రకటించింది. ఆ నలుగురు కూడా ‘విదేశీ సైన్యం’ చొరబాటును ఆపే యత్నంలో మరణించారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆ దేశం విడుదల చేసింది. భారత్ సైనికుల చొరబాటును ఆపే యత్నంలోనే తమ సైనికులు ప్రాణత్యాగాలు చేశారని ఆ దేశ కథనం. ఆ సమయంలో కల్నల్ సంతోష్‌బాబు సహా ఇరవై మంది మన జవాన్లు అమరులైయ్యారు. చిత్రం ఏమిటంటే, ఆ ఘర్షణలో 45 మంది చైనా సైనికులు చనిపోయారని రష్యా పత్రిక టాస్ వెల్లడించింది. అప్పుడే అమెరికా నిఘా విభాగం బయటపెట్టిన లెక్క ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయారు. అప్పుడు భారత్ సైనిక పెద్దలు కూడా పెద్ద సంఖ్యలోనే చైనా సైనికులు చనిపోయారని చెప్పారు. జూన్ 15 నాటి ఈ ఘర్షణ 1967లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తరువాతి స్థానం పొందు తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆనాడు 80 మంది భారత్ జవాన్లు అమరులయ్యారు. 300 మంది చైనా సైనికులు నిహతులయ్యారు. గల్వాన్ లోయ ఘర్షణలో మృతుల సంఖ్య వాస్తవం కాదని ఆ వెంటనే తెలిసిపోయింది. ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంతవరకు నిజం అంటూ నిలదీసిన ముగ్గురు బ్లాగర్లను చైనా అరెస్టు చేసింది. అణచివేతకు, ఆక్రమణలకు చైనా చాలా చక్కని పేర్లు పెడుతుంది. ఇప్పుడు ఆ ముగ్గురు బ్లాగర్ల అరెస్టుకు కారణం – వారు గల్వాన్ సైనికులను అవమానించే విధంగా వ్యవహరించారట. మృతసైనికులు ఎందరో వాస్తవాల బయటపెట్టమనడం కూడా అక్కడ నేరమే. ఇలా వాస్తవాలకు మసిపూయడం చైనాకు ఆది నుంచి ఉన్న రుగ్మతే.
గతం ఎలాంటిది?
కడుపులో కత్తెర… నోట్లో చక్కెర అన్న సామెత చైనాకు చక్కగా వర్తిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలతో ముఖ్యంగా భారత్‌తో అది వ్యవహరించే తీరు ఎప్పుడూ ఇలానే ఉంటుంది. శిఖరాగ్ర సమావేశాల్లో, అంతర్జాతీయ వేదికలపై, పర్యటనల సమయంలో పెద్దపెద్ద మాటలు చెబుతుంది, శాంతి మంత్రమే జపిస్తుంది. పరస్పర సహకారం, గౌరవం గురించి పదేపదే ప్రవచిస్తుంది. ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఇందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి నుంచి బలగాలు వెనక్కు తీసుకోవాలని బీజింగ్ నిర్ణయించినంత మాత్రాన దాన్ని పూర్తిగా నమ్మాల్సిన పని లేదని దౌత్య నిపుణులు హెచ్చ రిస్తున్నారు. దాని ప్రవర్తనను, వ్యవహారశైలిని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టి ఉండాలని సూచిస్తు న్నారు. ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గినంత మాత్రాన పూర్తిగా విశ్వసించడం అమాయకత్వం అవుతుంది. గతానుభవాల నేపధ్యంలో బీజింగ్ పట్ల భరోసా కనబరచడం సరైనది కానే కాదని చెబుతున్నారు. గతంలోనూ బీజింగ్ స్నేహాన్ని నటించి ఆకస్మిక దాడులకు దిగిన ఘటనలు ఉన్నాయి. గత ఏడు దశాబ్దాల కాలంలో దాని వైఖరి ఏమీ మారలేదు. బీజింగ్ అధికార పగ్గాలు ఎవరి చేతుల్లో ఉన్నా ఇదే పరిస్థతి. నాటి చౌ ఎన్ లై నుంచి నేటి జిన్‌పింగ్ వరకూ ఇదే విధానం.
స్వతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో నాటి ప్రధాని నెహ్రూ చైనాను నమ్మి నిలువునా మోసపోయారు. అప్పట్లో అగ్రరాజ్యమైన అమెరికా విధాన నిర్ణేతలు ఒకింత పాకిస్తాన్ వైపు మొగ్గు చూపారు. దీంతో వామపక్ష భావజాలం గల నాటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా), చైనాతో సత్సంబంధాల పట్ల నెహ్రూ ఆసక్తి చూపించారు. కాంగ్రెస్‌ది వామపక్ష భావజాలం కానప్పటికీ, ఉదార భావాలు కలిగి ఉన్నట్టు చెప్పుకునే పార్టీ. దీంతో ఆయన మాస్కో, బీజింగ్ వైపు అనివార్యంగా మొగ్గు చూపారు. ఈ ఉద్దేశంతోనే చైనాతో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చు కున్నారు. ఇందుకోసం 1954 ఏప్రిల్ నెలాఖరులో చైనా సందర్శించారు. ఈ సందర్భంగా నాటి చైనా రాజధాని పెకింగ్ (ప్రస్తుత బీజింగ్)లో పంచశీల ఒప్పందాన్ని పట్టాలకెక్కించారు. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు ఏప్రిల్ 28, 29 తేదీల్లో చౌ ఎన్ లై, నెహ్రూ సంతకాలు చేశారు. పరస్పర శాంతి, సహకారం, ఇరుదేశాల సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించుకోవడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం, దూకుడు వ్యవహారశైలికి దూరంగా ఉండటం పంచశీల ఒప్పందంలోని ప్రధానాంశాలు. దీంతో రెండు దేశాల మధ్య చక్కటి సంబంధాలు నెలకొంటా యని అప్పట్లో అంతర్జాతీయ నిపుణులు, దౌత్యవేత్తలు విశ్లేషించారు. రెండు దేశాల మధ్య సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో సామీప్యతలు ఉండటం, రెండు దేశాల్లో భౌద్ధమతం విస్తరించడం, భావజాలాల పరంగా సారూప్యతల కారణంగా ఉభయ దేశాల మధ్య శాంతి చిరకాలం వర్థిల్లు తుందని అంచనా వేశారు. పంచశీల ఒప్పందం తరవాత నాటి చైనా ప్రధాని చౌ ఎన్ లై మే నెల రెండో వారంలో భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండుదేశాల మధ్య సంబంధాలు బలపడాలన్న ఉద్దేశంతో నాటి భారత ప్రధాని నెహ్రూ ‘హిందీ, చినీ భాయి భాయి’ అని పిలుపిచ్చారు.
కానీ పంచశీల ఒప్పందంపై సంతకాలకు సంబంధించి సిరా ఆరకముందే, హిందీ చినీ భాయి భాయి నినాదం పూర్తిగా ప్రజల్లోకి వెళ్లక ముందే బీజింగ్ భారీ కుట్రకు తెరదీసింది. అనూహ్యంగా భారత్‌పై 1962 అక్టోబరు 20న యుద్ధానికి తెగబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే దండ యాత్రకు దిగింది. నమ్మక ద్రోహానికి పాల్పడింది. చైనాతో సరిహద్దు వివాదం అనంతమైనది. 3,440 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దు అస్పష్టంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి చైనా విస్తరణ కాంక్ష తోడవుతున్నది. రెండు దేశాలకు మధ్య సరిహద్దుగా మెక్‌మహన్ రేఖ ఉందని చెబుతారు. కానీ ఆ రేఖ గురించి తనకు తెలియదని చౌన్ ఎన్ లై సాక్షాత్తు నెహ్రూతోనే అన్నారు. కాబట్టి ఎలాంటి సరిహద్దు రేఖను చైనా అంగీకరించడానికి సిద్ధంగా లేదు.ఈ కుట్రను పసిగట్టలేకపోయిన భారత్ యుద్ధంలో వెనకబడిపోయింది. ముందస్తు నిఘా సమాచారం ఉంటే కొంతవరకైనా సన్నద్ధత కనబరిచేది. దీనికితోడు అప్పట్లో భారత సైన్యం పూర్తి స్థాయి సంసిద్ధతలో లేదు. అలాగే సైనికులకు కావలసిన సరంజామా కూడా లేదు. ఆ ఏడాది నవంబరు 21 వరకు 31 రోజుల పాటు జరిగిన యుద్ధంలో భారత్ దాదాపుగా చేతులెత్తేసింది. చైనాను నమ్మి మోసపోయినట్లు నెహ్రూ ఆవేదన చెందారు. 1964లో ఆయన మరణానికి ఈ అవమాన భారం కూడా కారణం ఒకటన్న వాదన అప్పట్లో వినిపించింది.
వర్తమాన దృశ్యం
ప్రస్తుత చైనా అధినేత షి జిన్ పింగ్ కూడా నాడు చౌ ఎన్ లై తరహాలోనే నేడు మోసానికి పాల్పడ్డారు. నమ్మించి నట్టేట ముంచారు. నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. అప్పట్లో చౌ ఎన్ లై మాదిరిగానే ఇప్పుడు జిన్‌పింగ్ కూడా తీయటి మాటలు మాట్లాడారు. శాంతిమంత్రం పఠించారు. పరస్పర గౌరవం గురించి వివిధ సందర్భాల్లో నొక్కి వక్కాణించారు. 2019 అక్టోబరు 11న భారత్ సందర్శించారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని చారిత్రక నగరం మహాబలిపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రాంతీయ సహకారం, సరిహద్దుల్లో శాంతి గురించి పరస్పరం అభిప్రాయా లను తెలియజేసుకున్నారు. మోదీ తమిళ సంప్రదాయంలో తెల్లటి పంచె, చొక్కా ధరించి చైనా అధినేతకు స్వాగతం పలికారు. ఇద్దరూ దేశాధినేతల్లా కాకుండా, సన్నిహిత మిత్రుల్లా వ్యవహరించారు. నాటి సమావేశాన్ని దగ్గరగా చూసిన పాత్రికేయులు ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయని అంచనా వేశారు. శాంతి విరాజిల్లు తుందని సంపూర్ణంగా విశ్వసించారు. యుద్ధం అన్న మాట ఇక వినపడదని భావించారు.
కానీ పట్టుమని ఏడెనిమిది నెలలు తిరక్కుండానే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. చైనా మరోసారి నమ్మక ద్రోహానికి పాల్పడింది. దారుణానికి తెగబడింది. గల్వాన్ లోయ, తూర్పు లద్దాఖ్, పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వద్ద అతిక్రమణలకు పాల్పడేందుకు ప్రయత్నించింది. జూన్‌లో గల్వాన్ లోయ ప్రాంతంలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు అమరు లయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు చైనా దళాలను అడ్డుకునే పక్రియలో అమరుడయ్యారు. ఆయనకు ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహా పరమ్ వీరచక్ర అవార్డును ప్రకటించి గౌరవించింది. సైన్యంలో ఇది రెండో అత్యున్నత పురస్కారం. చైనా సైనికులు కూడా దాదాపు 45 మంది మరణించారు. అమెరికా, రష్యా దేశాల వార్తా సంస్థలు ఈ విషయాన్ని నిర్థారించాయి. తమ సైనికుల మరణాల గురించి చైనా చెప్పకున్నా అంతర్జాతీయ సమాచార సాధనాలు కోడై కూశాయి. చాలారోజుల పాటు బుకాయించిన బీజింగ్ తాజాగా నలుగురు మరణించినట్లు అంగీకరించింది. నాడు 1962లో, నేడు 2020లో భారత్‌ను బీజింగ్ నమ్మించి మోసగించిందన్నది వాస్తవం. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఒక ప్రధానమైన తేడా ఉంది. 1962 నాటి యుద్ధంలో భారత్ వెనకబడి పోగా 2020లో బీజింగ్‌ను గట్టిగా ప్రతిఘటించింది. చైనా దళాలు అడుగు ముందు వేయకుండా అనుక్షణం అడ్డుకున్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించిన చైనా బలగాలకు గట్టిగా బుద్ధి చెప్పాయి.
కొద్దిమందికే తెలిసిన వాస్తవం ఒకటి ఉంది. భారత సేనలు చైనా బలగాల కంటే కఠినమైన యుద్ధ వాతావరణానికి అలవాటు పడినవారు. సియాచిన్ వద్ద ఎత్తులో పాకిస్తాన్ చొరబాట్లను నివారించడానికి 1984 నుంచి కూడా అనుక్షణం జీవన్మరణ సమస్యను తలపించే యుద్ధ క్రీడకు అలవాటు పడినవారు. లేహ్ లో ఉండే 14వ దళం కమాండర్ సియాచిన్, లద్దాఖ్ రక్షణ చర్యలను నిర్వహించినవారే కూడా.
తాజా వివాదంలోను అదే ధోరణి
గల్వాన్, దరిమిలా పాంగాంగ్ సరస్సు వద్ద మోహరింపు వివాదం తలెత్తిన తరువాత ఉభయ దేశాల సైనికాధికారుల మధ్య తొమ్మిదిసార్లు చర్చలు జరిగాయి. పదో దఫా చర్చలు ఫిబ్రవరి 20వ తేదీన జరిగాయి. సుదీర్ఘంగా, దాదాపు 16 గంటలు జరిగిన ఈ చర్చలలో దీర్ఘకాలికంగా నలుగుతున్న సమస్యల గురించి కూడా ఒక నిర్ణయానికి రావాలని భావించారు. ఈ నిర్ణయాలను దేశాధినేతలు కూడా చర్చించే విషయం గురించి వచ్చే సమావేశంలో సైనికాధికారులు నిర్ణయిస్తారు. ఫిబ్రవరి 17న మన విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా మాస్కోలో చెప్పినట్టు భారత్, చైనా సంబంధాలు సజావుగా నడవాలంటే సరిహద్దులలో ఉద్రిక్తతలు ఉంటే సాధ్యం కాదు. నిజానికి మాస్కో నుంచి ష్రింగ్లా చైనాకు చేసిన హెచ్చరిక. రష్యన్ డిప్లమాటిక్ అకాడెమి ఏర్పాటు చేసిన చర్చా వేదిక నుంచి ఆయన ఈ మాటలు చెప్పారు. ఇది జరిగిన మూడు రోజులకు గోర్గా, హాట్‌స్ప్రింగ్, డెమ్‌చోక్ ప్రాంతాల నుంచి కూడా వేగంగా దళాలను ఉపసంహరించే పని చేపట్టాలని చైనా మీద భారత్ ఒత్తిడి తేవలసి వచ్చింది. దీనితోనే తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు తగ్గి భారత జవాన్ల పెట్రోలింగ్‌కు ఆస్కారం కలుగుతుంది. మొత్తానికి చైనా మాట విన్నది. సరస్సు ఉత్తర తీరంలోని దళాలను ఫింగర్ 8 తూర్పు భాగం వరకు వెనక్కి మరలించింది. అలాగే భారత్ దళాలు కూడా ధన్‌సింగ్ థాపా పోస్ట్ వరకు వెనక్కి వచ్చాయి. ముప్పయ్ ఏళ్ల నుంచి సరిహద్దు సమస్య మీద చర్చలు మీద చర్చలు జరిగాయి. ఎన్ని మాయ మాటలు చెప్పే ప్రజ్ఞ ఉన్నా చైనా కూడా ఎల్లకాలం ప్రపంచాన్ని మోసం చేయలేదు. ప్రపంచం, దానికంటే ముందు భారత్ చైనా నైజాన్ని క్షుణ్ణంగా గ్రహించింది. ఇది చైనా గ్రహిస్తే మంచిది.
బలగాల ఉపసంహరణ గురించి మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేసిన ప్రకటన (ఫిబ్రవరి 11)ఎంతో హుందాగా కనిపిస్తుంది. ఎంతో ఆచితూచి మాట్లాడుతూ ఆయన దశల వారి సేనల ఉపసంహరణ జరుగుతుంది అని మాత్రమే అన్నారు. ఇది ప్రభుత్వ విజయం వంటి మాటలు ప్రయోగించ లేదు. సైనికులు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వైదొలగి ఏప్రిల్ 2020 కంటే ముందు స్థితికి తీసుకువస్తామని అన్నా, యథాతథ స్థితి అన్న మాటను ఆయన ఉపయోగించలేదు. కానీ ఇంతటి రాజనీతిజ్ఞతను చైనా వైపు నుంచి ఏనాడూ ప్రపంచ దేశాలు చూడలేదు. దానికి తగ్గట్టు విస్తరణ వాదం చైనా విదేశాంగ విధానంలో అంతర్భాగంగా ఉందంటే అతిశయోక్తి కాదు. తైవాన్ లేదా జపాన్, పాకిస్తాన్ లతో చైనా విధానాన్ని పరిశీలిస్తే ఇది అర్ధమవుతుంది. అది ఏనాడో సిద్ధం చేసిపెట్టుకున్న ఒక ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తున్నది కూడా.
ఆరు సమరాలు తప్పవట?
చైనా యాభయ్ ఏళ్ల కాలంలో (2013 నుంచి) చేయవలసి ఉన్న ఆరు యుద్ధాల గురించి ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. చైనా ప్రభుత్వ అనుకూల వెన్‌వీపో దీనిని జూలై 8, 2013న ప్రచురించింది. ఆ వ్యాసం శీర్షికే వచ్చే యాభయ్ ఏళ్లలో చైనా చేయక తప్పని యుద్ధాలు. దీని ఆంగ్లానువాదాన్ని హాంకాంగ్ బ్లాగ్ మిడ్‌నైట్ ఎక్స్‌ప్రెస్ తరువాత (సెప్టెంబర్ 16) ప్రచురించింది. అదే ఇండియన్ డిఫెన్స్ రివ్యూలో ప్రచురించారు. ‘చైనా ఇప్పటికీ ఐక్యంగా ఉన్న మహాశక్తి కాదు. ఈ విషయం చైనా ప్రజలకు దుర్భరమే. చైనా చిన్నారులకు అవమానం. జాతీయ ఐక్యత, ఆత్మగౌరవాల కోసం చైనా వచ్చే యాభయ్ ఏళ్లలో ఆరు యుద్ధాలు చేయవలసి ఉంటుంది. ఇందులో కొన్ని ఇరుగుపొరుగుతో జరిపే యుద్ధాలు. ఇంకొన్ని ఇతరులతో జరిపే సంపూర్ణ యుద్ధాలు. అవి ఎలాంటి యుద్ధాలైనా కావచ్చు. కానీ అందులో ప్రతియుద్ధం చైనా ఐక్యతకు అత్యవసరమే…’ అని తీర్మానించారా వ్యాసంలో. తైవాన్, వియత్నాం, ఇతర దీవుల కోసం ఒక్కొక్క యుద్ధానికి డ్రాగన్ ప్రణాళికలు రచించినట్టు అర్ధం చేసుకోవచ్చు. ఏ యుద్ధం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు జరుగుతుందో కూడా లెక్కలు వేసుకుంది.
ఇందులో ‘దక్షిణ టిబెట్’ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉద్దేశించినదే మూడో యుద్ధం. మన అరుణాచల్ ప్రదేశ్‌నే చైనా దక్షిణ టిబెట్‌గా పిలుస్తూ ఉంటుంది. ప్రతికూల ధోరణితోనే అయినా ఇందులో కాస్త వాస్తవిక దృక్పథం కూడా చైనా వెలగబెట్టింది. మనం యుద్ధాలు చేసుకుంటూ పోతే అమెరికా చూస్తూ కూర్చుంటుందని అనుకోలేం. కాబట్టి దానితో కూడా ఘర్షణ తప్పదని ఆ వ్యాసం పేర్కొంటున్నది. దక్షిణ టిబెట్ కోసం యుద్ధం నేరుగా ఇరు దేశాల సేనల మధ్య జరగడం కాదు. భారత్‌లో అంతర్గతంగా విభేదాల సృష్టించడం ద్వారా సెగ రగిలించాలన్నదే దాని యుద్ధ వ్యూహం. అంటే భారత్‌ను విభజించడం ద్వారా తన పథకాన్ని అమలు చేయవచ్చునని చైనా ఉద్దేశం కావచ్చు. కొన్ని దేశాలతో సంబంధాలను చెడగొట్టి భారత్‌ను ఏకాకిని చేయాలన్నది కూడా దాని ఉద్దేశం. ఇలాగే ఎందుకంటే చైనా నేరుగా దక్షిణ టిబెట్ మీద సైన్యాన్ని ప్రయోగిస్తే కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. తన దురుద్దేశాన్ని అమలు చేయడానికి అస్సాంలో అల్లర్లు రేపడం కూడా చైనాకు చేరువలో ఉన్న అవకాశమే. 2035 సంవత్సరానికల్లా దక్షిణ కశ్మీర్‌ను ఆక్రమించుకోవడానికి వీలుగా పాకిస్తాన్‌ను ప్రోత్సహించి ఆయుధాలు అందించడం కూడా ఇందులో భాగమే. ఇండియా, పాకిస్తాన్ ఆ యుద్ధంలో మునిగి తేలుతూ ఉంటే దక్షిణ టిబెట్‌ను ఆక్రమించుకునే పనిని చైనా చేసుకుంటుందన్నమాట.
ఇంత చరిత్ర తరువాత ఇకనైనా భారత్ వాస్తవిక దృక్పథంతో ఉండక తప్పదు. ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య పది సార్లు జరిగిన చర్చల్లో భారత్ నిర్దిష్ట వైఖరికి కట్టుబడింది. నిర్మొహమాటంగా వ్యవహరించడం దాని ఫలితమే. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్ 4 వరకు చొచ్చుకు వచ్చిన డ్రాగన్ బలగాలు ఫింగర్ 8 వరకు తగ్గవలసిందేనని భారత్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. చైనాకు చెందిన మూడు, భారత్‌కు చెందిన ఒక ట్యాంకులు వెనక్కి మళ్లుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. బలగాలు వెనక్కి పోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేనేలేదని చైనాకు తేల్చిచెప్పింది. తాము వాస్తవాధీన రేఖను ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించబోమని, బీజింగ్ కూడా ఇదే వైఖరితో ఉండాలని నిర్దేశించింది. చైనా దుందుడుకుగా వ్యవహరిస్తే తగిన సమాధానం చెబుతామని విస్పష్టంగా హెచ్చరించింది. దీంతో చివరికి చేసేదేమీ లేక చైనా వెనక్కి తగ్గింది. మొండిగా ముందుకు వెళితే ఏం జరుగుతుందో గ్రహించింది. అభాసుపాలవుతామని కాస్త ఆలస్యంగా అయినా అర్థం చేసుకుంది. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తిగా వెనక్కి తగ్గింది.
గల్వాన్ ఘటన అనంతరం ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలను ఉపశమింపచేసేందుకు రష్యా చొరవ తీసుకుంది. భారత్‌కు రష్యా చిరకాల మిత్రదేశం. గత ఏడాది సెప్టెంబరు 10న మాస్కోలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ కౌన్సిల్ (ఎస్‌సిసి) సమావేశం, రష్యా, ఇండియా, చైనా (ఆర్‌ఐసీ- రష్యా, ఇండియా, చైనా) విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉభయ దేశాల మధ్య శాంతి నెలకొనాల్సిన ఆవశ్యకతను రష్యా ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ విషయమై భారత, చైనా విదేశాంగ మంత్రులు జయశంకర్, వాంగ్‌యీలతో రష్యా విదేశాంగ మంత్రి సెర్టి లావరోస్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆసియా దిగ్గజాలైన భారత్, చైనా మధ్య విభేదాలు తగవని సూచించారు. చైనా వెనక్కి తగ్గడానికి ఈ సమావేశం సైతం కొంతవరకు దోహదపడిందన్న అభిప్రాయం దౌత్యవర్గాల్లో ఉంది. అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చినా మిగిలిన దేశాల పట్ల కొంత సడలింపు చూపించినా చైనా ఎడల వాస్తవికమైన వైఖరికే ఆయన కట్టుబడి ఉండడం కూడా మంచిదయింది.
ప్రస్తుతానికి చైనా వెనక్కి తగ్గినా సరిహద్దుల్లో గతంలో మాదిరిగానే భారత్ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎంతమాత్రం అలసత్వం పనికిరాదు. పరిమితంగానే అయినా సరిహద్దుల్లో బలగాల మోహరింపు తప్పనిసరి. దీనితో పాటు బీజింగ్‌కు దీటుగా అధునాతన ఆయుధాలను సమాకూర్చుకోవడం అవసరం. ముఖ్యంగా వంతెనలు, రహదారుల వంటి మౌలిక సౌకర్యాలను మరింత వేగంగా విస్తరించాలి. రక్షణ బడ్జెట్ను పెంచాల్సిన అవసరం ఉంది. ఈఏడాది బడ్జెట్‌లో రక్షణశాఖకు రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది కన్నా ఇది 1.4శాతం అధికం. గతేడాది కేటాయించిన మొత్తం రూ.4.71 లక్షల కోట్లు. చైనా రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే ఇది తక్కువే. ఈ ఏడాది కరోనా కారణంగా ఆరోగ్య రంగానికి భారీగా నిధులు మళ్లించాల్సి వచ్చింది. వచ్చే ఏడాది రక్షణ బడ్జెట్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. దౌత్యపరంగా భద్రతామండలి, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) తదితర అంతర్జాతీయ వేదికలపై బీజింగ్ బండారాన్ని బయట పెట్టాలి. కేవలం సరిహద్దుల్లోనే కాకుండా ఇండో- పసిఫిక్ ప్రాంతం లోనూ చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలి. ఇప్పటికే ఈ దిశగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో చతుర్భుజ కూటమి ఏర్పాటైంది. ఇది చైనాకు కంటగింపుగా మారింది. ఇప్పటికీ ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తనదిగా చైనా అడ్డగోలుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా పరిగణిస్తామని పేర్కొంటొంది. ఈ రాష్ట్రంలో భారత రాష్ట్రపతి, ప్రధాని పర్యటించినపుడల్లా అవాకులు, చెవాకులు పేలడం చైనాకు అలవాటుగా మారింది. ఈ నేపధ్యంలో చైనాను ఎప్పుడూ ఒక కంట గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతచేదు అనుభవాల కారణంగా బీజింగ్ ప్రతి చర్యను, కదలికనూ నిశితంగా పరిశీలించడం తప్పనిసరి. సేనల ఉపసంహరణ గురించి పార్లమెంటులో మాట్లాడిన మన రక్షణమంత్రి ప్రస్తుత చర్య ఇరు దేశాల మధ్య సమస్యల విషయంలో దశాబ్దాలుగా నెలకొని ఉన్న ప్రతిష్టంభన తొలగించడంలో తొలి అడుగు మాత్రమేనని గొప్ప వాస్తవిక దృష్టితోనే వ్యాఖ్యానించారు. ప్రపంచ యుద్ధాల నాటి వ్యూహాలు ఇప్పుడు చెల్లవని చైనా గ్రహించడం కూడా అవసరమనిపిస్తుంది. ఈ ప్రపంచం మీద ఏదో ఒక్క దేశమే ఆధిపత్యం సంపాదించాలన్న ఆవేశం అనర్ధమేనని రెండు ప్రపంచ యుద్ధాల అనంతర చరిత్ర చెప్పడం లేదా?
ఈ దేశంలో వామపక్ష ఉగ్రవాదం పేరుతో గెరిల్లా యుద్ధం చేస్తున్నవారు ఒక సూక్తిని చెబుతూ ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అప్పటికి కాస్త తగ్గడం తెలివైన ‘ఎత్తుగడ’ అంటారు. భారత్‌లోని వామపక్ష ఉగ్రవాదానికి ఆదర్శం చైనాయే. వాళ్ల పరిభాషలో చెప్పాలంటే, వెనుకడుగు కూడా వ్యూహమే. ఇది ప్రపంచంలోని గెరిల్లా యుద్ధ తంత్రానికి అందించిన చైనా సొంతానికి ఉపయో గించుకోకుండా ఉంటుందంటే ప్రపంచం నమ్మలేక పోతున్నది. ఇవాళ్టి చైనా వెనుకడుగు అలాంటి వ్యూహమే అన్నది చాలామంది అనుమానం.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్