సాటి హిందువులతో కలసి జైశ్రీరామ్ అని పలికిన కుటుంబంలో పుట్టడమే ఆ అమ్మాయి చేసిన తప్పయింది. పేరు రష్మీ సామంత్. కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ‘సనాతని’ (సనాతన ధర్మం మీద నమ్మకం కలిగిన స్త్రీ అని ఈ మాట రాసిన ఆ అజ్ఞాని భావం కాబోలు) ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యా లయం విద్యార్థి సంఘం అధ్యక్ష స్థానంలో ఉండడానికి వీల్లేదు అని మానసికంగా హింసించి రష్మి ఆ పదవికి రాజీనామా చేయవలసిన పరిస్థితి కల్పించాడు. అతడి పేరు అభిజిత్ సర్కార్. ఘనత వహించిన ఆ విశ్వవిద్యాలయంలోనే ఆచార్యుడు. సనాతన ధర్మాన్ని విశ్వసించే కుటుంబంలో పుట్టిన వనిత ఆ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నాయకు రాలిగా ఉండకూడదు కానీ, హిందూత్వాన్ని, సనాతన ధర్మాన్ని నిలువెల్లా ద్వేషించే ఉన్మాది మాత్రం బోధకుడిగా పనిచేయవచ్చా? నా చిన్నతనంలో నేను చాలా సరస్వతీదేవి బొమ్మలు పగలగొట్టాను. అయినా నాకు బోలెడతంత చదువు వచ్చింది అని ఈ ఫిబ్రవరి 16నే అతడు పోస్ట్ పెట్టాడు. ఇతడు ఉదారవాది. కానీ తమ విశ్వాసాల మేరకు శ్రీరాముడిని ఆరాధించినవారు యుద్ధ సమర్ధకులా? ఈ ధోరణిని ఏమనాలి? ఆయన పేరును పలికితేనే జాత్యహంకారమా? ఆమె చేత బలవంతంగా రాజీనామా చేయించారని తెలిసి చాలా ఆనందించాను. ఒక సనాతనిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఆమోదించడానికి ఆక్స్‌ఫర్డ్ సిద్ధంగా లేదు అని జీన్యూస్‌తో అభిజిత్ వ్యాఖ్యానించాడు. అంత పెద్ద విశ్వవిద్యాలయంలో ఇంత పైశాచికానందం పొందేవారు కూడా పాఠాలు చెబుతున్నారా?
సామాజిక మాధ్యమాలలో కొన్ని పోస్టులు చూసి తన మీద జాత్యంహకారి, యుద్ధోన్మాది, ప్రమాదకర వ్యక్తి వంటి ముద్రలు ఎలా వేయగలరని రష్మి ప్రశ్నిస్తున్నది. రష్మిని రాజీనామా చేయించడం వెనుక అసలు విషయం ఇది కూడా కాదేమో! ఆక్స్‌ఫర్డ్ పాఠ్యాంశాల నుంచి వలసవాద వాసనలు పోగొడతా నని, అవసరమైన కొన్ని సంస్కరణలు తెస్తామని ఆమె ఎన్నికల ప్రచారంలో గట్టిగానే చెప్పుకుంది. ఈ అంశమే అభిజిత్ ముఠాకు, శ్వేతజాతీయులకు నచ్చి ఉండదు. భారతీయ, హిందూత్వ వ్యతిరేకత పాశ్చాత్య దేశాలలోని చాలా విద్యాసంస్థలలో, సాంస్కృతిక సంస్థలలో ఇటీవలకాలంలో చాలా ఎక్కువగానే బయటపడుతున్నది. కానీ ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలో కూడా ఇలాంటి నీచ ధోరణులు కనిపించడమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎంఎస్‌సి ఎనర్జీ సిస్టమ్స్ విద్యార్థిని రష్మి. ఫిబ్రవరి 11న జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికలలో పోలైన 3,708 ఓట్లకు గాను రష్మికి 1,966 వచ్చాయి. ఇది నిజంగా ఘనవిజయం. ఆ పదవికి ఎంపికైన తొలి భారతీయురాలిగా ప్రపంచ పత్రికలన్నీ ఆమెను శ్లాఘించాయి. రష్మి కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తరువాత ఎనర్జీ సిస్టమ్స్ కోసం ఆక్స్‌ఫర్డ్ లోని లినాకేర్ కాలేజీకి వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌కు ముందు ప్రాగ్, పోలెండ్‌లలో అణు విజ్ఞానశాస్త్రంలో కొంత పరిశోధన చేశారు.
ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులు వెలువరించే షెర్వెల్ పత్రిక, అభిజిత్ కలసి ఈ ఘనకార్యం నిర్వర్తించిన సంగతి అర్ధమవుతుంది. జైశ్రీరాం అని పలుకుతున్న వాళ్లు ఇస్లాంకు బద్ధవ్యతిరేకులని అభిజిత్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదట, రష్మి ఎన్నికల ఖర్చుకు నిధులు భారతీయులే ఇవ్వడం కూడా నేరమేనట. ఇంకా అభిజిత్ అనే చదువుకున్న ఈ అజ్ఞాని రష్మి వచ్చిన ప్రాంతాన్ని కూడా ఇస్లాంను ద్వేషించేదిగానే తీర్పు చెప్పేశాడు. రష్మి వచ్చిన కర్ణాటక కోస్తా తీరమంతా ఇస్లాం అంటే విపరీతంగా ద్వేషిస్తుందని అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో విషం కక్కాడు. అదంతా మితవాదుల అడ్డానట. చిత్రం ఏమిటంటే భారతీయ కమ్యూనిస్టు, ఉదారవాద పైత్యమంతా అతడి భాషలో తుచ తప్పకుండా ప్రతిబింబిస్తున్నది. పరమ హింసాపూరిత పోకడలు ఉండే పితృస్వామ్య వ్యవస్థను, కుల ప్రాతిపదికను జరిగే హింసను సమర్ధించే సనాతన హిందూ సంస్కృతిని పునఃప్రతిష్టించడమే ధ్యేయంగా అక్కడి మితవాద వర్గీయులు తెల్లజాతినీ, పాశ్చాత్యుల ఆధునికతనూ నిరోధిస్తారని కూడా అభిజిత్ సూత్రీకరించాడు. అంతేకాదట, హిందూయేతరులు అంటే, ముస్లింలు, క్రైస్తవులు, ఉదారవాద హిందువు లకు చెందిన విగ్రహాలన్నీ కూడా ఆ వర్గం కూలగొడుతూ ఉంటుందట. అభిజిత్ కువిమర్శలకు తోడు ఆక్స్‌ఫర్డ్ విద్యార్థుల షెర్వెల్ అనే పత్రిక కూడా రష్మి మీద చిమ్మిన విషం తక్కువకాదు. మలేసియాకు సంబంధించిన ఒక మారణహోమం ఫొటోకి రష్మి ‘చింగ్‌చాంగ్’ అంటూ వ్యాఖ్య రాయడం వెక్కిరించడమే నని ఆ పత్రిక భాష్యం చెప్పింది. అది చైనా విద్యార్థుల మనోభావాలను గాయపరిచిందట. అధ్యక్ష ఎన్నిక ప్రచారంలో ఒకసారి కేప్ కాలనీ (నేటి దక్షిణాఫ్రికా) మాజీ ప్రధాని సీసిల్ రోడ్స్‌ను హిట్లర్‌తో పోల్చడం, హిజ్రాల నుంచి స్త్రీలను వేరు చేయడం వంటివి కూడా రష్మి చేసిన నేరాలుగా తేల్చింది. స్త్రీలను, హిజ్రాలను వేరుగా చూసినందువల్ల హిజ్రాల మనోభావాలు దెబ్బతిన్నాయట. నిజానికి ఈ ఎన్నికలలో విజయం సాధించిన వారిలో రష్మితో పాటు దేవిక, ధీతీ గోయెల్ అనే మరో ఇద్దరు భారతీయులు కూడా గెలిచారు.
అభిజిత్‌ను నెటిజన్లు ఉతికి ఆరేశారు. హిందూ ద్వేషుల భావాలకు, మోదీని గుడ్డిగా ద్వేషించేవారి భావాలకి బానిస అభిజిత్ రష్మి సామంత్‌ను పదవి నుంచి తొలగించడానికి కారకుడయ్యాడని మాజీ ఐఏఎస్ అధికారి సంజయ్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. అభిజిత్ పోస్టులు నా విశ్వాసాలను మాత్రమే అవమానించేవి కాదు, మొత్తంగా హింసను ప్రేరేపించేవే. కాబట్టి ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్లని ఏ వైస్‌చాన్సలర్ కూడా ఉపేక్షించకూడదు, విశ్వవిద్యాలయంలో ఉండనివ్వకూడదు అని ఆక్స్‌ఫర్డ్ విజిటింగ్ ఫెలో అల్పేష్ బి పటేల్ తన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్ బెహన్ అనే మరొక ఆక్స్‌ఫర్డ్ అధ్యాపకురాలు ఆ విద్యార్థిని పట్ల అభిజిత్ ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఊచకోతకు అభిజిత్ హిందూత్వను ఆయుధంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నా రని కూడా ఆమె విమర్శించారు. రష్మి తల్లిదండ్రులు తమ సోషల్ మీడియా పోస్టుకు రాముడి బొమ్మ పెట్టడం కూడా ఆక్స్‌ఫర్డ్ మేధావులకు నచ్చలేదట. భారత స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమంలో తెల్లజాతిని, అనంతర కాలాలలో పాశ్చాత్య పోకడలను భారతీయులు వ్యతిరేకించడం సనాతన ధర్మ స్థాపనకేనా? ఇది ఏ పరిశోధకుడైనా చెప్పాడా? అంటే నెహ్రూ పోరాటం కూడా అందుకేనని అనుకోవాలా? శాంతి కాముకత గురించి, జాత్యహంకారంలోని ప్రమాదం గురించి ఇంగ్లండ్ నడిబొడ్డు నుంచి మాట్లాడడం చరిత్రలోనే అత్యంత వికారం కలిగించే విషయమని అభిజిత్ వంటివాళ్లకి కూడా తెలియదా? పుట్టిల్లు గురించి మేనమామకు చెప్పే చాపల్యం ఇంకానా? రష్మి తల్లిదండ్రులు జైశ్రీరాం అనడం నేరమే అయినా, అభిజిత్ పూర్వికులు ఎప్పుడో ఒకసారి కాళీమాతకు జై అని పలికే ఉంటారు. గుడ్డి మేధావులు అది గమనించాలి.
రష్మి పదవికి రాజీనామా చేసి ఉడిపి వచ్చారు. స్వస్థలం వచ్చే ముందు ఒక లేఖ రాశారు. అది కూడా షెర్వెల్ పత్రికలోనే అచ్చయింది. తనపై జరిగిన సైబర్ దాడి ఎంత నీచమైనదో, నికృష్టమైనదో ఆ లేఖలో చెప్పారు. దీనికి తాను ఎంతగానో మనస్తాపం చెందానని అన్నారు. అయినప్పటికి తాను ఆక్స్‌ఫర్డ్ విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి ఎన్నికకావడం జీవితాంతం మరచిపోలేని మధురమైన అనుభూతిగానే ఉంచుకుంటానని చెప్పారు. తనవిగా చెప్పి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఏవీ ఇటీవల కాలంలో ఉంచినవి కానేకావని స్పష్టం చేశారు. అంతేకాదు, నేను హిందువునేనని స్పష్టంగా ప్రకటించారు. నేను హిందువును కావడం వల్లనే అధ్యక్ష పదవికి అనర్హురాలిని అయిపోనని కూడా బల్లగుద్ది చెప్పారు. నాకు నా సంస్కృతి నేర్పిన సున్నితత్వం కారణంగానే పదవికి రాజీనామా చేశానని వివరించారు. తన తల్లిదండ్రులను ఈ వివాదంలోకి లాగడం గురించి స్పందిస్తూ హిందువులుగా జైశ్రీరాం అనడంలో తప్పేమిటని కూడా ప్రశ్నించారు. ఇది నేరం కాదుకదా అని కూడా అన్నారు. నా తల్లిదండ్రుల విశ్వాసాలను కించపరడం వల్ల నేను బాగా కలతపడ్డానని అంతిమంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నానని అన్నారు.