– సుజాత గోపగోని, 6302164068
పడకేసిన పరిశ్రమలకు పాత వైభవం తెస్తామన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి గెలిచారు. తాము ఇచ్చిన హామీల సంగతి పక్కనపెట్టి పక్క రాష్ట్రాల పరిశ్రమలను కాపాడతామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లి మరీ పోరాటాలు చేస్తామని మైకుల ముందు మాట్లాడుతున్నారు. ఇదీ తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల వైఖరి.
అప్పుడు అమరావతికి మద్దతు ఇస్తామన్నారు. తర్వాత ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చారు. ఒక్కసారి, రెండుసార్లు ఆ అంశాలను ప్రస్తావించి తర్వాత గాలికొదిలేశారు. ఇప్పుడేమో విశాఖ ఉక్కుకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. అవసరమైతే విశాఖ వెళ్లి పోరాటాల్లో పాల్గొంటామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన ప్రకటన ఇది. అయితే, ఆ ప్రకటన కన్నా.. దానిని ప్రస్తావించడం వెనుక ఉద్దేశం, అవసరంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధప్రదేశ్‌లోనూ అవసరానికి మాట్లాడే టీఆర్‌ఎస్ నేతల వైఖరిని మరోసారి జనం మననం చేసుకున్నారు. వాటిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంలేదని కూడా ఏపీలో రాజకీయ పార్టీలు, విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న సంస్థలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు.
సందర్భం చూసి జనం దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో కేసీఆర్‌ను మించినవాళ్లు లేరని సాధారణంగా చెప్పుకుంటారు. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చినా, జనం ఎంత రగిలిపోతున్నా.. ఓట్ల సమయంలో మాత్రం ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో కేసీఆర్‌కు కేసీఆరే సాటి. ఇప్పుడు కేటీఆర్‌లో కూడా అదే మార్గాన్ని అనుసరించాలన్న తాపత్రయం కనిపిస్తోంది. తండ్రి మాదిరిగానే సమయం, సందర్భానుసారంగా ప్రకటనలు చేయడం, అవసరమైనప్పుడు జనాన్ని, ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటన కూడా అందులో భాగమే అన్నది ఎవరూ కాదనడం లేదు.
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. టీఆర్‌ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ ఉండగా.. బీజేపీ గ్రాఫ్ మాత్రం పెరుగుతూ పోతోంది. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగుతుందేమో అని తెలంగాణ రాష్ట్రసమితి భావించింది. ఈ విషయంలో అనివార్యంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. ఎన్నికల ప్రచారసభల్లో ఎంత ఉత్సాహంగా మాట్లాడినా.. ఓటమి భయం మాత్రం వెన్నంటే ఉందన్న సంకేతాలు పలు సందర్భాల్లో స్పష్ట మయ్యాయి. ఈ క్రమంలోనే తమ అమ్ములపొదిలోంచి షరామామూలు హామీల బాణాలు, సంఘీభావ అస్త్రాలు బయటకు తీశారు కేటీఆర్. అందులో ఒకటి విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు కాగా, రెండోది ఉద్యోగుల పీఆర్సీ, మూడోది పెన్షన్ స్కీమ్ అమలు, నాలుగోది ఉద్యోగుల పదవీ విరమణ పెంపు. పట్టభద్రుల ఎన్నికల్లో ఈ అంశాలు కచ్చితంగా ప్రభావం చూపుతాయనుకున్న కేసీఆర్, కేటీఆర్ వీటిని తెరపైకి తెచ్చారు. విశాఖ ఉక్కుపై ప్రకటన కొత్తది కాగా, మిగతా మూడు అంశాలూ వివిధ సందర్భాల్లో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు ఆయుధాలుగా పనికొస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఎన్నికల హామీలుగా మారిపోయాయి.
తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఈనెల 14వ తేదీన ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా మారిన టీఆర్‌ఎస్ పరిస్థితిని ఈ ఎన్నికల్లోనైనా మెరుగుపరచాలని కేటీఆర్ తలపోశారు. ఆ ప్రణాళికలో భాగంగానే ‘ఉక్కు’ బాణం వదిలారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో ఉండే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పట్టభద్ర ఓటర్లను ఆకర్షించడమే ఈ ప్రకటన వెనుక ప్రధాన ఉద్దేశమన్నది తర్వాత అందరికీ అర్థమయింది. ఈ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా అనేక విమర్శలు వినిపించాయి.
పక్క రాష్ట్రంలోని విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన కేటీఆర్‌కు.. సొంత రాష్ట్రంలో మూతపడ్డ నిజాం సుగర్స్, అజంజాహీ మిల్లు గుర్తులేవా? అంటూ ముప్పేట దాడి కొనసాగింది. రాజకీయ పార్టీలే కాకుండా.. అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇచ్చేముందు.. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల గురించి చెప్పాలని బీజేపీ నిలదీసింది. కేటీఆర్ మొదట అజంజాహీ మిల్లు, నిజాం సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిజాం సుగర్స్‌ని తెరిపిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిన టీఆర్‌ఎస్‌కు విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి మాట్లాడే అర్హత లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. పట్టభద్రుల ఓటర్ల నుంచి కూడా టీఆర్‌ఎస్ వైఖరిపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఏపీలోనూ కేటీఆర్ ప్రకటనపై పెదవి విరుపులే కనిపించాయి. గతంలో పలు సందర్భాల్లో ఆంధప్రదేశ్‌కు అనుకూలంగా చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలను అక్కడి జనం నెమరేసుకున్నారు. విశాఖ ఉక్కుకు టీఆర్‌ఎస్ మద్దతు ఎన్నికల స్టంట్ మాత్రమే అని అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఏపీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించుకున్నారు. తోటి తెలుగు వాళ్లుగా అమరావతికి మద్దతు ఇస్తామని గతంలో టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఆ తర్వాత కనీసం ఆ ఊసే ఎత్తలేదు. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు తాము మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్ సభ్యులు ప్రకటించారు. కానీ, తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని మెలిక పెట్టారు. ఆ తర్వాత అసలు ఆ అంశం ఎక్కడా ప్రస్తావించలేదు. ఎన్నికలయిన తర్వాత ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్ టీఆర్‌ఎస్ ఎంపీలు ఎక్కడా వినిపించలేదు. నిజానికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ‘ఆంధ్ర’ జపం చేస్తూంటారని, ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటన కూడా అదే కోవలోకి వస్తుందని ఆంధప్రదేశ్‌లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమం నడుస్తున్నందున స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు ప్రకటించారన్న విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం ఎన్నికలయ్యాక రైతు చట్టాలకు మద్దతు ప్రకటించినట్లుగానే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతు ప్రకటించినా ఆశ్చర్యంలేదన్న అభిప్రాయం తెలంగాణలోని విపక్షాలతో పాటు.. ఆంధ్ర ప్రాంత రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇక, ఉద్యోగులకు సంబంధించిన హామీలపైనా సర్వత్రా విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది టీఆర్‌ఎస్. ఉన్నట్టుండి పోలింగ్ నాలుగైదు రోజులు ఉందనగా పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు తెరపైకి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నకారణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ‘స్క్రిప్ట్’ చదివి వినిపించారు. కేసీఆర్.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న కుతూహలంలోనే ఉన్నారని, ఎలక్షన్ కోడ్ కారణంగానే చేతులు కట్టి పడేసినట్లు అయిందని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన పీఆర్సీని ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారని, అలాగే, సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకూ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయబోతున్నారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచే అంశంపై కేసీఆర్ స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. ఇక, ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలోనూ కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే వీటిని ప్రకటిస్తారని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా సన్నద్ధమై ఉందని కూడా చెప్పుకొచ్చారు. కానీ, ప్రభుత్వంలో ఎవరూ వీటిపై ప్రకటన చేయలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి చూస్తే ఉద్యోగులకు సంబంధించిన ఈ అంశాలను టీఆర్‌ఎస్ పక్కాగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఉపయోగించుకుందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఎందుకంటే పీఆర్‌సీ మొదలుకొని మిగతా అంశాలన్నీ.. ప్రభుత్వం పరిధిలో ఉన్నవే. సంవత్సరాలుగా ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నవే. కానీ, వాటిని ప్రత్యేకంగా ఇప్పుడే తెరపైకి తీసుకురావడం, ఎన్నికల కోడ్ అమలులో ఉందని నొక్కి వక్కాణించడం ఎన్నికల గిమ్మిక్కే అని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈ హామీలను టీఆర్‌ఎస్ ఉపయోగించుకుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్