‘ఈ పుస్తకం చదవడంవల్ల మాతృదేశం పట్ల భక్తి పెరగడమే కాదు, సంస్కృత భాషను మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలోని అన్ని విద్యాసంస్థలలో దీనిని పాఠ్య పుస్తకంగా ఉంచాలి. అది కాకున్నా భారతదేశ సంతానంగా దీనిని కొని చదువుదాం’ అన్నారు ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్. ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన ‘విశ్వభారతం’ గ్రంథావిష్కరణ ఫిబ్రవరి 25న హైదరబాద్‌లోని హైటెక్ సిటిలో జరిగిన కార్యక్రమంలో సర్ సంఘచాలక్ చేతుల మీదుగా జరిగింది. ఈ గ్రంథం, సంస్కృతం గొప్పదనం, భారతీయతకూ ఆ భాషకూ ఉన్న అవినాభావ సంబంధం గురించి డాక్టర్ భాగవత్ రసస్ఫోరకంగా, ఉత్తేజకరంగా ప్రసంగించారు.
‘వ్యాస భగవానుడు చెబుతుంటే వినాయకుడు మహాభారతం రాశాడు. అందరికి బుద్ధిని ప్రసాదించే వినాయకుడే ఆలోచించి రాయవలసి వచ్చింది.ఈ గ్రంథకర్త కూడా ఆ విధంగానే ఈ రచన చేసారనిపిస్తున్నది. ఇది గ్రంథం కాదు. ఇదొక కృతి. లోక కల్యాణం కోసం రాసిన ఈ పుస్తకం గొప్పది. సంస్కృతం స్వల్ప మాత్రంగా తెలిసినవారు కూడా ఈ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవచ్చు. మనసు నిలిపి దీనిని పఠిస్తే సంస్కృతం నేర్చుకోవడంలో వేగం పెరుగుతుంది. ఇదొక భక్తి గ్రంథం. ఈ గ్రంథాన్ని చదవడం వలన మన అంతఃకరణంలో భారత్ పట్ల భక్తి ప్రజ్వరిల్లుతుంది’ అన్నారు డాక్టర్ భాగవత్. చరిత్ర, సంస్కృతి, సంస్కారం వంటి అంశాలను లోతుగా స్పృశిస్తూ ఆయన ఎన్నో అంశాలు చెప్పారు. విశ్వహితాన్ని దృష్టిలో ఉంచుకొని, భారతీయుల హృదయాల్లో దేశభక్తి భావన ఉదయించడం అవసరం. మన దృష్టితోనే కాదు, గ్రంథకర్త దృష్టితో, అనేకమంది మహాపురుషులు ఆలోచనలను చూసినా మన భారతమాత అఖండమైనది. హిమవంతుడు తన రెండు భుజాలను చాచి సాగర పర్యంతం ఆలింగనం చేసుకొంటే ఎంత భూమి ఉన్నదో అదంతా అఖండ భారతదేశమే. ఆమె కేవలం మృణ్మయి కాదు. చైతన్యమయి, చిన్మయి అని అనేకమంది అనుభూతి చెంది, దర్శించి తెలియజేశారు. ఈ భూమాత కోసం నిస్వార్థ బుద్ధితో కీర్తికాంక్షలను దూరంగా పెట్టి, తను, మన, ధన పూర్వకంగా యోగ్యతతో సాధన చేసిన సామాన్యుల నుండి మహాపురుషులందరికీ అనుభూతి కలిగిన విషయమే ఇది. ఇక్కడ కణకణం జగజ్జనని స్వరూపమే. భారత దేశం జాగృతం కావడం ప్రపంచానికి అవసరం.
గత 2000 సంవత్సరాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి పాఠం నేర్చుకొని సంపూర్ణ మానవజాతి సుఖశాంతులతో వర్ధిల్లాలని, అన్ని బాధల నుండి విముక్తి పొందాలని, ఆపదల నుండి దూరం కావాలని, విభిన్న రీతులలో తమ తమ సిద్ధాంతాల ఆధారంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం శూన్యం.
ఈ విధంగా 2000 సంవత్సరాల నుండి సమస్యల పరిష్కార దిశగా జరిగిన మథనంలో అనేక రత్నాలు ప్రాప్తించాయి. మోహ నిద్ర లభించింది. సృష్టిని నాశనం చేయగలిగిన హాలాహలం పుట్టుకొచ్చింది. ఈ హాలాహలాన్ని తాగగలిగే శక్తి పరమశివునికున్నట్లే మన భారతదేశానికీ ఉంది. ఇంకెవ్వరికీ ఆ సామర్థ్యం లేదు. ఎందుకంటే భారత్ తనకంటు ఏమీ కోరుకోదు. ఈ 2000 సంవత్సరా లలో చాలా కాలం ఇక్కడ పరాయి పాలనే సాగింది. ఆ సమయంలో దేశం బయట నుండి ఆక్రమణలు ఒకవైపు జరుగుచుంటే, మరోవైపు మూఢాచారాలు బాగా ప్రబలుతుండేవి. కొంత భూభాగం విడి పోయింది. ప్రజలు ఎంతో శీలవంతులుగా ఉండే వారు. ఆ ప్రమాణం కొతమేరకు తగ్గింది. ఈ స్థితిలో కూడా ప్రపంచం అంతా భారత్‌వైపే చూస్తున్నది అని చెప్పవచ్చు.
ప్రపంచ స్థాయిలో ఆర్థిక సమ్మేళనాలు జరుగు తుంటాయి. అందులో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొని తమ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు ఏర్పాటు చేసుకొంటుంటారు. మన దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకు ఇక్కడి నుండి కూడా ఒక మంత్రివర్యులు ఈ ఆర్థిక సమ్మేళనంలో పాల్గొనడానికెళ్లారు. తిరిగి వచ్చాక నాతో అక్కడ జరిగిన అనుభవాలను పంచుకొన్నారు. సమ్మేళనం ముగింపుకి ముందురోజు రాత్రి మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధులు వారిని కలిశారు. ‘ఇలాంటి సమయంలో దేశదేశాలతో ఒప్పందాలు చేసుకోవడం పరిపాటి కదా! ఆ ఒప్పందాలు ప్రకారం మేము మాట ఇస్తాం, కాని ఆయా దేశాలు మా మాట నెరవేర్చినట్లే, లాభం చేకూర్చినట్లే నమ్మించి మా దగ్గర నుండి రెండు, మూడింతలు లాగేస్తాయి. అందుకని మేమంతా భారత్‌తోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలను కొంటున్నాం. కనుక మీ టెండర్‌ను తగ్గించండని కోరారు. భారత్‌పై వారికున్న విశ్వాసంతోనే ఆ విధంగా జరిగిందని అనిపిస్తోంది. కాబట్టి నేటికీ ప్రపంచ సమస్యల నుండి గట్టెంక్కించేది భారతదేశమే నని ప్రపంచం మనవైపు చూస్తోంది. ఆయా దేశాలన్నీ సమస్యల పరిష్కారం కోసం తమ పురుషార్థాన్ని ఉపయోగించి చూశారు. లాభం లేకపోయింది. మనతో కావడం లేదు, ఎవరితో ఇది సాధ్యమౌ తుందో తరచి చూశారు. ప్రపంచం అమృతాన్ని సేవించినప్పటికీ జీవించలేకపోతుంది. కాని మనం విషాన్ని స్వీకరించినా ప్రపంచాన్ని బ్రతికించాం. ఇది మన చరిత్ర. పురాణకాలంలో శివుని గొప్పతనం ఏమిటి? చైతన్య స్వరూపిణి అయిన జగజ్జననీ దుర్గ శివునిలో ఉంది. ఈ శక్తిని శివుని నుండి వేరు చేస్తే శివుడు కూడా శవంతో సమానం. అలాగే మనలో భారతమాత విరాజిల్లుతూ ఉంది. కనుక శక్తిని ఆరాధించాలి.
స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆంగ్లేయులతో జరిగిన పోరాటంలో ప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గొప్ప పాత్ర పోషించారు. వారు ఒక కవితలో ఆనాటి స్థితిని గురించి ‘ఓ! భారత జననీ! నీవు ఈ సమస్త ప్రపంచాన్ని ధరించి పాలిస్తున్నావు. నీ సంతాన మైన మేము మోహనిద్రకు గురై నీ కోసం ఏమీ చేయలేని శక్తిహీనులుగా నీ ఒళ్లో ఆడుకుంటున్నాం. నీవు అత్యంత బలహీనంగా, దీనస్థితిలో దర్శన మిస్తున్నావు. పరాయిపాలనలో దాస్యశృంఖలాలతో నీవు బందీ అయినట్టు కనిపిస్తున్నావు. ఇదంతా నాటకంలా ఉంది. బలహీనతలను తొలగించి మాకు దృఢమైన శక్తిని ప్రసాదించు. నీ పూర్వ వైభవాన్ని సాధించేందుకు నాటకాన్ని రక్తికట్టించే శక్తిని మాకివ్వు. తల్లీ!’ అని ప్రార్థించారు. భారతదేశాన్ని ఉద్ధరించే సామర్థ్యాన్ని ఇవ్వవలసింది భారతమాతయే. ఆమె మనతో నాటకమాడిస్తూ మనలను పరీక్షిస్తున్నది. ఈ పరీక్షలో మనం సఫలమైతే విశ్వానికి గురుత్వం వహించే దిశగా అఖండమైన, సర్వసంపన్నమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ పనిని భారతమాత కృపాకటాక్షాలతో, మన స్వహాస్తాలతో నెరవేర్చగలం. కనుక భారత్ పట్ల భక్తిని జాగృతం చేయవలసిన అవసరం ఉంది. దేశభక్తితో అడుగడుగున నిండిన భారత సంపూర్ణ వర్ణన ఉన్న ఇలాంటి పుస్తకాన్ని నేను మొదటిసారిగా చదివాను. మనందరం సంస్కృత పండితులం కాకపోయినా దీనిని చదువుతుంటే భావార్థాన్ని గ్రహించటంతోపాటు సంస్కృత భాష పట్ల కూడా జ్ఞానాన్ని పెంచుకోగలం. ఇది అత్యంత అవసరం.
అఖండ భారత్‌ను తిరిగి సాధించాలి. సంపూర్ణ విశ్వాన్ని ఒక గృహంగా మార్చాలనే కలను సాకారం చేసే దిశగా భారత్ ముందుకు సాగుతోంది. యావత్తు ప్రపంచానికి భారతదేశమే సుఖశాంతులను కలుగ చేయాలి. ఈ పని చేయడానికి భారతీయులమైన మనమే కారకులమవుదాం. ఇది ఎలా సాధ్యమవు తుంది? ఇది కల్పన మాత్రమే అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇది సాధ్యమవుతుందా? అని చాలామంది అడుగుతుంటారు. జరగాల్సి ఉంటే త్వరగా జరిగి ఉండాలి అంటుంటారు. దేశ విభజనకు ఆరునెలల ముందు విభజన జరుగుతుందని ఎవరూ నమ్మలేదు. పాకిస్తాన్ అనే కొత్త పేరు వినబడుతున్నదని నెహ్రూను అడిగితే, ఇది మూర్ఖుల కల మాత్రమే, అలా ఎప్పుడైనా జరుగుతుందా అనేశారు. లార్డ్ వేవెల్ బ్రిటన్ పార్లమెంటులో మాట్లాడుతూ ‘భారత్ భగవద్ నిర్మిత దేశం. దానిని విభజించడానికి మనమెవరం’ అన్నారు. అలా అందరూ దేశ విభజనను చేయలేం, ఇది అసంభం అన్నవారే. కానీ అసంభవమనుకున్నది జరిగింది. అలాంటప్పుడు అఖండ భారత్ అనేది అసవంభవమని అనిపించినా, అది జరగదని ఎలా చెప్పగలం? అది జరిగి తీరాలి కూడా. ఎందుకంటే భారత్‌లో తిరిగి కలవాలన్న కోరిక ఇప్పుడున్న ఖండిత భారతదేశం నుండి విడిపోయి ఉన్న భూభాగాలకే ఎక్కువగా ఉంది. ఆ విధంగా వేరైపోయిన భూభాగాలు ఆనాటి నుండి ఈ క్షణం వరకు గమనిస్తే, వాటి చరిత్ర ఏమిటి? జరిగిన సంఘటనలేమిటి? నేటి పరిస్థితి ఏమిటి? గాంధార దేశం, పాకిస్తాన్ విడిపోయిన నాటి నుండి అక్కడ సుఖశాంతులున్నాయా? భారత్ నుండి వేరుపడ్డ భూభాగాలన్నీ దుఃఖంతో నిండి ఉన్నాయి. సుఖశాంతుల కోసం వారూ ప్రయోగాలు చేశారు. ఉపాయమేమి లభించలేదు. కాని ఒకే ఒక ఉపాయం ఉంది. వాటికి ప్రాణశక్తి లభించాల్సిన స్థలం నుండి అవి వేరు పడ్డాయి. ఇప్పుడున్న భారతదేశం అనే ప్రాణాధార మూలంతో (శక్తితో) కలిస్తే వాటి సమస్యలన్నీ పటాపంచలవుతాయి. ఇందులో సామ్రాజ్యవాదం అనే ప్రసక్తే రాదు. వాటిని కలుపుకోవాలంటున్నామే తప్ప వాటిని తొక్కి ఉంచాలనుకోవడం లేదు.
అఖండ భారత్ ఏర్పాటు రాజకీయశక్తి విస్తరణ కోసం కాదు. అది ప్రాణశక్తితోనే సాధ్యం. ఆ ప్రాణశక్తే ధర్మం. ఇది సనాతన ధర్మం, మానవ ధర్మం, సంపూర్ణ విశ్వధర్మం. దీనినే ఈ రోజు హిందూ ధర్మం అంటున్నారు. నా మాట మీద నమ్మకం లేనట్లయితే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సరికొత్త ఎడిషన్‌ను చూడండి. అందులో ‘ధర్మం’ అనే పదానికి గతంలో ఇచ్చిన అర్థాన్ని సరిచేశారు. ధర్మమంటే, ఇది భారతీయ పదం అని, మొత్తం ప్రపంచానికి సంబంధించింది అని ఉంది. అంటే ఇది అందరూ ఆచరించాల్సిన ధర్మం. దీనిని మనం రూపొందించలేదు. పూర్వం నుండి ఉన్నదే. దీనికి ఆది, అంతమూ లేవు. కాబట్టి దీనిని సనాతన ధర్మం అంటాం. ఒకవేళ ఈ ధర్మం అంతం కావాలంటే మొదటగా ప్రపంచం అంతం కావాలి. ధర్మమే మన ప్రాణం. అందరినీ కలిపి ఉంచుతుంది. ఇది సత్యంపై ఆధారపడి ఉంది. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ (అంతా బ్రహ్మమయమే) అంటుంటాం. బ్రహ్మ వేరు వేరు రూపాలలో దర్శనం కావచ్చు. ఆస్తికుడు కావచ్చు, నాస్తికుడు కావచ్చు బ్రహ్మమయమే. వేరువేరుగా విభిన్న రూపాలలోను, పరస్పర విరోధంగానూ కూడా కనపడవచ్చు. ఇవన్నీ ఒకే రూపానికి సంబంధించిన ఆవిష్కారాలు. అందుకనే కనపడేవారంతా వివిధ రూపాలలో ఉన్నప్పటికీ అందరూ ఒక్కటే. మనమూ, మనదీ అన్న భావముంటే చాలు. దీనిని మనస్ఫూర్తిగా ఆచ రించాలి. స్వార్థాన్ని, చెడుభావాలను విడిచిపెట్టాలి. కలిస్తే అందరం ఒకటవుతాం. మీరు ఎలా ఉంటేనేమి, మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటేనేమి? ఎక్కడ ఉంటేనేమి, మనందరం ఒకటే. దీనికి కారణం భారతమాత. ఆమె మనందరినీ సురక్షితంగా కాపాడింది.
ఈ ధర్మం మూలంలోనే సత్యం, కరుణ, తపస్సు నిర్మలత్వం ఉన్నాయి. ఈ సత్యాన్ని ప్రాచీన కాలంలోనే మనం గుర్తించి ఆచరించాం. ఈ ధర్మాన్ని ఇక్కడి తత్త్వం ఆధారంగా స్వీకరించి జీవన పద్ధతిని వికసింపజేశాం. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు. ఎటూ వెళ్లలేం. హిమాలయాలను, సాగరాన్ని దాటి ఎవరూ ఇక్కడికి రాలేకపోయేవారు. భారత మాత మనకు అన్నీ సమకూర్చి పెట్టింది. సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం అన్న రీతిలో అడవులు, నదులు, ప్రకృతి సౌందర్యం, అమూల్య ఖనిజాలు, ఓషధులు వంటి సకల సంపదలను సమకూర్చింది. మనం అత్యంత సమృద్ధిగా ఉన్నాం. ఒకవేళ బయటి దేశాలవారు ఒకరిద్దరు వచ్చినా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాం. సమృద్ధమైన మన తల్లి వంటగది వరకు వచ్చి ఎవరూ ఆకలితో తిరిగి పోరాదు అనేది తల్లి భారతమాత స్వభావం. మా భాష వేరు, మా పూజా విధానం వేరు అన్నారు. అయినా పర్వాలేదు. 33 కోట్ల దేవత లున్నారు ఇక్కడ. అందులో ఇద్దరు, ముగ్గురు కలిస్తే పర్వాలేదు, ఇక్కడ అనేక ఆరాధనా పద్ధతులున్నాయి వాటిలో ఒకటి రెండు జోడిస్తే ఏమీ కాదు, వందల కొలదిగా ఉన్న భాషలలో మరొక భాష చేరినా ఇబ్బంది లేదని భావించాం. మనకు కావలసినంత పోషక పదార్థాలను ఇచ్చింది ఈ భారతాంబ. ఇతరులకు పెట్టడమే మన ప్రవృత్తి. ఈ సత్య ధర్మం ఆధారంగానే మనం ముందుకు సాగాం. కాని
యూనాన్ రోమ్ మ్రి సబ్ మిట్‌గయా జహాసే ।
కుచ్ బాత్ హై కి హస్తీ మిటతీ హమారీ నహీ ।।
(గ్రీకు, రోము, ఈజిప్టు నాగరికతలన్నీ ఒక వెలుగు వెలిగి నేడు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ మన సంస్కృతి తుడిచిపెట్టుకుపోకుండా ఉండడానికి కారణం ఏదో ఉంది.)
భారతమాత అనంతమైన ఉపకార గుణంతో మనం ఇక్కడ సుఖంగా ఉన్నాం. ఆ కారణంగా ప్రపంచంలో మన స్థానం, ఉనికి ప్రకటితమవు తున్నాయి. ప్రపంచానికి ఈ గుణం అందివ్వాలంటే అందుకు మనం సమర్థులం కావాలి. దీనిని మొట్టమొదటి పనిగా ప్రాధాన్యతనిచ్చి మనం నెరవేర్చాలి. అందుకే స్వామి వివేకానంద ‘రాబోయే 50 సంవత్సరాలలో సమస్త దేవీదేవతలను మరచి పోదాం, భారతమాతను పూజిద్దాం. ప్రతి భారతవాసి ఆమె సేవ చేద్దాం’ అని పిలుపు నిచ్చారు.
మన ఆచరణలోనే ఏకాంతమే ఆత్మ సాధన – లోకాంతమే పరోపకార్ (వ్యక్తిగతంగా ఆత్మసాధనకు ప్రాధాన్యతనివ్వాలి – సామాజికంగా పరోపకార భావంతో వ్యవహరించాలి) అనేది ఉంది. కేవలం నీ స్వంతానికే జీవించకు, రెండు చేతులతో సంపాదించు వేలాది చేతులతో పంచిపెట్టు అనేది మన స్వభావం. మన తల్లి భారతి అనుగ్రహాన్ని, మన మహాపురుషులు ఆచరించి చూపిన మార్గాన్ని తిరిగి మనం పొందాలి. ఇది భక్తితోనే సాధ్యం. అహంకారంతో కానే కాదు. నేను గొప్ప హీరోను, గొప్ప హిందూ రక్షకుడను, నేను భారతదేశానికి అది ఇది అనీ అనుకోకూడదు. మన ప్రధానమంత్రి కూడా తనకు తాను ప్రధానిగా కాకుండా ప్రధాన సేవకుడనని భావిస్తున్నారు. అయితే నేను ప్రధాన సేవకుడను గర్వంతో చెప్పకుండా మొదటిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టకముందు ప్రారంభంలోనే మెట్లకు తలవంచి తన నొసటిని తాకించారు. ఇలాంటి వినమ్రతాపూర్వకమైన భక్తితో అనుగ్రహం లభిస్తోంది.
కృష్ణ భగవానుకి తులాభారం జరిగింది. ఎనిమిది మంది భార్యలలో ఏడుగురు తులాభారం దగ్గరికి చేరుకున్నారు. ఎప్పుడూ అహంకారంతో ఉండే సత్యభామ కూడా ఉంది. బంగారంతో తులాభారం చేయాలి అని నిర్ణయమైంది, ఒక్కొక్కరు తమ దగ్గరున్న సంపదనంతా త్రాసులో వేస్తున్నారు. కానీ కృష్ణుడు కూర్చున్న పళ్లెం లేవడం లేదు. అందరి వంతు పూర్తవుతున్న సమయంలో రుక్మిణి వచ్చింది. మీ దగ్గరున్న సంపదను వేయండి అని రుక్మిణితో అన్నారు. రుక్మిణి వెంటనే ఒక తులసీదళాన్ని త్రుంచి త్రాసులో వేసింది. వెంటనే కృష్ణుని తులాభారం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే రుక్మిణి ప్రేమ పూర్వక భక్తికి, ప్రామాణిక భక్తికి తులతూగింది అని కృష్ణుడు బోధపరిచాడు.
ఈ విధంగా భక్తితో కూడిన ప్రేమను జనింప చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ఇలా చేయడం ద్వారానే శక్తి ప్రాప్తిస్తుంది. శక్తి ఎప్పుడూ భక్తితో కూడుకుని ఉంటుంది. అయితే జ్ఞానం, కర్మ రెండూ అవసరమే. ఈ రెండింటికీ భక్తి కూడా జతకావాలి. భక్తిలేని జ్ఞానం అహంకారానికి జన్మనిస్తుంది. భక్తిలేని కర్మ విక్షుప్త (వివేకం కోల్పోయిన) కర్మగా తయారవుతుంది.
రామ రావణులిద్దరిలో జ్ఞానం ఉంది. గొప్ప శివభక్తుడైన రావణుడు శివుని స్తుతిస్తూ పాడిన శివస్తోత్రం ఇప్పటికీ పఠిస్తుంటాం. రాముడు కూడా శివభక్తుడే. రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించాడు. అయినప్పటికీ రాముణ్ణి భగవంతుడనీ, రావణుని రాక్షసుడనీ ఎందుకంటున్నారు? ఇద్దరిలో ఉన్న తేడా భక్తే. భక్తి అనేది సృష్టిలోని సత్యంతో కలిసుండాలి. కేవలం శుష్కవేదాంతం పనికిరాదు. కర్మతో కూడిన వేదాంతం అవసరం. అప్పుడే అది భక్తి. అది రామునిలో ఉంది. కర్మ కూడా అంతే. భక్తి పూర్వకంగానే కర్మను ఆచరించాలి. వేసవి కాలం వస్తుంది. దారిలో ప్రయాణిస్తున్నప్పుడు దప్పిక వేసి రెస్టారెంటులోకెళ్లి గ్లాసునీళ్లు అడిగి తాగి తిరిగి వెళ్లిపోతుంటే- నీళ్ల కోసమే వచ్చాడా అని గ్రహించి తిరస్కారభావంతో ఆ వ్యక్తివైపు చూస్తుంటారు. అదే చిన్న హోటల్‌కెళ్లి గ్లాసు నీళ్లడిగితే సర్వర్ నాలుగు గ్లాసుల్లో నింపుకొని వ్రేళ్లు అందులో ముంచి పట్టుకొని తెచ్చి టేబుల్‌పై ధనాన పెట్టి వెళ్లిపోతాడు. అదే దారిలో సాధారణ గృహస్తుని ఇంటికెళ్లి మంచి నీళ్లు అడిగితే ఆ ఇంటి యజమాని ఒక గ్లాసు కాదు గదా ఒక చెంబుడు నీళ్లతోబాటు తినడానికి బెల్లంగాని, ఇంటిలో కలిగినంతమేరకు మరేదైనా తినుబండారం గాని ఆదరపూర్వకంగా ఇస్తూ స్వీకరించమని చెప్పుతాడు. అక్కడ, ఇక్కడా తేడా ఏమిటి? అన్నిచోట్ల దాహం వేస్తుంది కనుక తాగేనీరే అడిగారు. అన్నిచోట్ల ఒకే భాష, ఒకే విధమైన వినమ్రతతోనే అడిగారు కదా! ప్రేమతో కూడిన భక్తియే తేడా. అది ఇంటిలో వ్యక్తమయింది. మిగతా చోట్ల కాలేదు.
భక్తి ప్రాప్తించాలంటే సత్ గ్రంథాలను చదవాలి. ఈ దృష్టితో చూసినపుడు ఒక సర్వాంగ సుందరమైన ఉత్తమ గ్రంథం ఈ రోజు ఆవిష్కృతమైంది.
భారతీయులందరికి ఇదొక మంచి సందర్భం. మనందరం దీనిని పఠించి, మననం చేసి, చింతన చేస్తుంటే భవిష్యత్ నిర్మాణానికి కొత్తగా ప్రేరణ పొంది ముందుకు సాగవచ్చు. భవిష్యత్తుకు ఇదొక సంకేత రేఖ అవుతుంది.
కోటి కోటి హాథోవాలీ మాఁ కా –
అద్భుత ఆకార్ ఉఠే
జగజననీ కా జయకార్ ఉఠే –
హిందుభూమికా కణకణ హోకర్
శక్తికా అవతార్ ఉఠే –
జలసే, తలసే, అంబరసే
ఫిర్ హిందూకీ జయ జయకార్ ఉఠే –
జగజననీకా జయకార్ ఉఠే
ఈ సమగ్ర దృశ్యాన్ని సంపూర్ణ విశ్వంలో మీరు ఈ కన్నులతో, ఈ జీవితంలోనే దర్శిస్తే అదే ఈ గ్రంథం లక్ష్యం, ఫలశృతి అవుతుంది. ఈ ఫలశృతి పరిపూర్ణత సాధించడానికి మనందరం ఈ గ్రంథాన్ని చదివి మననం, చింతన చేయాలని కోరుతున్నాను. ఈ ఫలశ్రుతి సాకారమయ్యే అవసరం గ్రంథకర్తతో సహా మీ అందరికీ ప్రాప్తించాలని అందరికీ శుభాకాంక్షలు అందిస్తున్నాను అని అన్నారు డాక్టర్ భాగవత్.
అంతకు ముందు ద్విసహస్రావధాని, గ్రంథకర్త మాడుగుల నాగఫణిశర్మ కార్యక్రమ విశిష్టతను వివరిస్తూ ఈ భూమండలమంతా ఒకప్పుడు భారత ధర్మమే విస్తరించి ఉండేదని అన్నారు. అటువంటి ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి భుజ స్కంధాలపైన ఉందని అన్నారు.
కార్యక్రమంలో సంస్కృత విశ్వవిద్యాలయం మాజీ డీన్ రాణీ సదాశివమూర్తి, పద్మశ్రీ రమాకాంత్ శుక్లా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దక్షిణమధ్య క్షేత్ర సహ సంఘచాలక్ దూసి రామకృష్ణ, అఖిల భారతీయ ధర్మ జాగరణ సమన్వయ సహ సంయోజక్ శ్యామ్‌కుమార్, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణామూర్తి, దక్షిణమధ్య క్షేత్ర ప్రచారక్ సుధీర్, తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్, తెలంగాణ ప్రాంత సహకార్యవాహ అన్నదానం సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.