తీర్మానం-1
భారత అంతర్నిహిత శక్తిని సాక్షాత్కారింప చేస్తున్నఅయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం
శ్రీరామజన్మభూమి వివాదం మీద భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధి సమర్పణ ఉద్యమం వంటివి భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలవడమేకాదు, తరతరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ భారత్ అంతర్నిహిత శక్తిని మరింత బలపరచడమేకాక ఆధ్యాత్మిక జాగృతి, జాతీయ సమైక్యత, సామాజిక సమరసత, సద్భావనలకు ప్రతీకగా నిలుస్తాయని అఖిల భారతీయ ప్రతినిధి సభ భావిస్తున్నది.
భాద్రపద కృష్ణ ద్వితీయ, యుగాద్బి 5122 (2020 ఆగస్ట్ 5) రోజున గౌరవనీయ భారత ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్ పూజ్య సర్ సంఘచాలక్, శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, పూజ్య సాధుసంతులు, అన్ని మత సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యుల సమక్షంలో ప్రారంభమయిన మందిర నిర్మాణ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో తిలకించింది. దేశంలోని సమస్త పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టి, అన్ని నదులలోని నీళ్లను ఆ కార్యక్రమంలో ఉపయోగించారు. కొవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమానికి హాజరైనవారి సంఖ్యను పరిమితం చేసినా ఆ కార్యక్రమ ప్రభావం మాత్రం అపరిమితంగానే ఉంది. ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నవారి సంఖ్య పరిమితమైనా హిందూ సమాజం మొత్తం దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా అందులో పాలుపంచుకుంది. సమాజంలోని అన్ని వర్గాలవారు, అన్ని పార్టీల వారు ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
మకర సంక్రాంతి రోజున దేశ ప్రథమ పౌరుడు, భారత రాష్ట్రపతి నిధి సమర్పణతో భగవాన్ వాల్మీకి మందిరం నుండి ప్రారంభమయిన 44రోజుల ‘నిధిసమర్పణ అభియాన్’ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాకార్యక్రమం. దేశవ్యాప్తంగా 5.5 లక్షల నగరాలు, గ్రామాల నుంచి 12 కోట్లకు పైగా రామభక్త కుటుంబాలు భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం నిధి సమర్పించాయి. సమాజంలోని అన్ని తెగలు, వర్గాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఈ అభియాన్‌లో పాల్గొన్నారు. గ్రామ, నగర, అరణ్య, పర్వత ప్రాంతాలకు చెందిన ధనికులు, పేదలు మనస్ఫూర్తిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటువంటి అపూర్వమైన స్పందన, ఉత్సాహం, మద్దతు చూపిన రామభక్తులందరిని అఖిల భారతీయ ప్రతినిధిసభ అభినందిస్తున్నది. శ్రీరామునితో ఈ దేశం భావాత్మకంగా ముడిపడి ఉన్నదనే విషయం ఈ అభియాన్ మరోసారి నిరూపించింది. శ్రీ రాముని ఆదర్శాలు సమాజంలో వ్యాప్తి చెందడానికి సామాజిక, ధార్మిక సంస్థలు, విద్యావేత్తలు, మేధావులు కృషి చేయాలని ప్రతినిధిసభ కోరుతున్నది. అయోధ్య శ్రీరామజన్మభూమిలో మందిర నిర్మాణంతోపాటు సామూహిక నిశ్చయం, సామూహిక కృషి ద్వారా శ్రీరాముని ఆదర్శంతో ప్రేరితమైన సామాజిక, జాతీయ సంకల్పం, జీవనాన్ని తీర్చిదిద్దుకోవాలి. అదే ప్రపంచానికి మేలుచేసే వైభవోపేతమైన, పటిష్టమైన భారత నిర్మాణానికి దారితీస్తుంది.
తీర్మానం-2
కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒకటిగా నిలచిన భారత్
ప్రపంచ వ్యాప్తమైన కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన, సమగ్ర సామూహిక ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ నిర్వర్తించిన పాత్రను హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.
మహమ్మారి గురించిన వార్తలు క్రమంగా వ్యాపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగం రంగంలోకి దిగాయి. వ్యాధి లక్షణాలు, దాని నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి దేశ వ్యాప్తంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగింది. ఇందులో ప్రసార మాథ్యమాలు కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నాయి. దేశ ప్రజానీకం మొత్తం నిబంధనలను తెలుసుకుని, సక్రమంగా పాటించడంతో ఎదురవుతుందనుకున్న పెను ప్రమాదం, నష్టం తప్పిపోయాయి. తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించి, రోగులకు వైద్యం అందించారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా విలువైన సేవలనందించారు. ఇటువంటి సంక్షోభకాలంలో కూడా దైనందిన కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోకుండా భద్రతాదళాలు, ప్రభుత్వ సంస్థలు, నిత్యవసర సేవలు, ఆర్ధికసంస్థలు, సంఘటిత, అసంఘటిత రంగాలు ఎంతో పాటుపడ్డాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు చేపట్టిన ‘శ్రామిక్ రైళ్లు’, ‘వందేభారత్ మిషన్’, ప్రస్తుత టీకా పంపిణీ వంటి కార్యక్రమాలన్నీ ఎంతో ప్రశంసించదగినవి.
ఈ మహమ్మారితో పోరాటంలో నిస్వార్ధసేవలందిస్తూ అనేకమంది కరోనా యోధులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. అటువంటి వారి ధైర్యాన్నీ, త్యాగనిరతినీ ప్రతినిధి సభ అత్యంత కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుచేసుకుంటున్నది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలకు హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తున్నది.
హఠాత్ పరిణామాలతో ఎంతో ఇబ్బందులకు, బాధలకు గురైన లక్షలాదిమందిని ఆదుకునేందుకు ఆహారం, వైద్య సహాయం, రవాణా సదుపాయం, ఆర్ధిక సాయం అందించడానికి భారతీయ సమాజం మొత్తం ముందుకు వచ్చిన వైనం, చూపిన సంవేదన అద్భుతమైనవి. అవసరం ఉన్నవారిని ఆదుకోవడం కోసం సాధారణ ప్రజానీకం, వివిధ స్వచ్ఛంద సంస్థలు స్పందించి బాధితుల ఇళ్లకి వెళ్లి సేవలు అందించాయి. ఇటువంటి నిస్వార్ధ, సంవేదనాశీలమైన సేవలను అందించిన వ్యక్తులను, సంస్థలన్నిటిని అఖిల భారతీయ ప్రతినిధిసభ ఎంతగానో అభినందిస్తున్నది.
కొవిడ్ వ్యాప్తి మూలంగా, దానిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్ వలన వలస కార్మికులవంటివారు ఎందరో, ఎన్నో ఇబ్బందులు, కష్టాల పాలయ్యారు. అయినా మన సమాజం ఈ కష్టాలను, ఇబ్బందులను, అనిశ్చితిని ప్రశంసనీయమైన పట్టుదలతో, ధైర్యంతో ఎదుర్కొన్నది.
సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, నగరాల నుండి పెద్ద ఎత్తున వలసల మూలంగా గ్రామాల్లో చాలా విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని భావించినా పరిస్థితులు మాత్రం ఏ దశలోనూ చేయి దాటిపోలేదు. నిజానికి నగరాల నుండి తిరిగి వస్తున్న వారికి స్థానికులు అందించిన సహకారం, మద్దతు ప్రశంసనీయమైనవి.
ఈ విపత్కర కాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తి సాధారణం కంటే ఎక్కువగా ఉంది. పారిశ్రామిక రంగంతో పాటు మొత్తం ఆర్ధికస్థితి ఆశాజనకంగానే ఉంది. ఈ కఠిన పరిస్థితులను కూడా ఒక అవకాశంగా మలుచుకుని వెంటిలేటర్‌లు, పీపీఇ కిట్‌ల తయారీ, కరోనా పరీక్షలలో కొత్త సాంకేతిక పద్ధతులు, అత్యంత త్వరితంగా చవకైన, ప్రభావవంతమైన టీకా తయారీ వంటివి సాధించాం. కష్టనష్టాలను ఎదుర్కొని నిలవడంలో సమాజ స్థైర్యం, సహిష్ణుత మరొకసారి వెలుగులోకి వచ్చాయి.
ఈ ప్రపంచవ్యాప్త సంక్షోభం ప్రారంభం నుండి ‘వసుధైక కుటుంబకం’ అనే భావనకు కట్టుబడిన భారత్ అనేక దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలతోపాటు అత్యవసర వస్తువులను అందించింది. ఆ తరువాత ‘టీకా మైత్రి’ కార్యక్రమం క్రింద అనేక దేశాలకు వ్యాక్సిన్ అందిస్తున్నది. సమయానికి భారత్ అందించిన అంతర్జాతీయ సహకారాన్ని ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు ప్రశంసిస్తున్నారు.
ఈ మహమ్మారి మూలంగా మన సంపూర్ణ ప్రాపంచిక దృష్టికి ఉన్న శక్తినీ, ప్రాచీన, వికేంద్రీకృత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ గొప్పదనాన్నీ మరొకసారి తెలుసుకోగలిగాం. సంప్రదాయ విలువలపై ఆధారపడిన నిత్య జీవితంలోని అలవాట్లు, ఆచారాలు, కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడం, మితాహారం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, సంప్రదాయ ఆహార అలవాట్లు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఔషధాలు, యోగా, ధ్యాన పక్రియల సకరాత్మక ప్రయోజనం మొదలైనవి ఈ కాలంలో మనకు ఎంతో మేలు చేకూర్చాయి. భారత్‌లో కనిపించే ఏకాత్మ దృష్టి, దానిపై ఆధారపడిన దైనందిన జీవన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు ఆమోదించి, ప్రశంసించారు.
మహమ్మారి మూలంగా కలిగిన దుష్ఫలితాలు, పరిణామాల నుంచి అదే పట్టుదల, సామర్ధ్యంతో బయటపడి భారతీయ సమాజం త్వరగానే సాధారణ జీవనానికి అలవాటుపడుతుందని అఖిల భారతీయ ప్రతినిధిసభ విశ్వసిస్తున్నది. అయితే కరోనా సంక్షోభం పూర్తిగా సమసిపోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక మహమ్మారి వ్యాప్తి చెందకుండా మార్గదర్శక నిబంధనలు, జాగ్రత్తలను తుచ తప్పకుండా పాటిస్తూనే ఉండాలి. ఈ సంక్షోభ కాలంలో నేర్చుకున్న పాఠాలను మన వ్యక్తిగత, సామాజిక జీవనంలో నింపుకుని ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థను, సంయమనంతో కూడిన వనరుల వినియోగాన్ని, పర్యావరణ సంరక్షణ వంటివి సాధించాలని, ‘స్వదేశీ’, స్వావలంబనను జీవితాలలో అలవరచుకోవాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ యావత్ సమాజానికి పిలుపునిస్తున్నది.