ఆంగ్లమూలం : శ్రీరంగ గాడ్బొలే
అను : డా. బి.సారంగపాణి
1919-24 మధ్య మనదేశంలో ఖిలాఫత్ ఉద్యమం పెద్ద ఎత్తున చెలరేగింది. ఆ ఉద్యమానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. అదేమిటో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రపంచయుద్ధం సందర్భంగా టర్కీ ఒట్టొమాన్(టర్కీ కేంద్రంగా ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలలోని కొన్ని భూభాగాలను పాలించిన వంశం, ఉస్మాన్ అన్న పేరు యూరోపియన్ భాషలలో ఒట్టొమాన్‌గా భ్రష్టరూపం దాల్చింది)లు జర్మనీతో చేతులు కలపారు. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కూటమి జర్మనీనీ, ఒట్టొమాన్‌లనూ ఓడించింది. అవిచ్ఛిన్నంగా 4 శతాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన ఒట్టొమాన్ సామ్రాజ్యం దానితో ఛిన్నాభిన్నమయింది. నేటి ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, లెబనాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, అర్మేనియా, జార్జియా, సైప్రస్, ఈజిప్టు, గ్రీస్ దేశాలు ఒకప్పుడు ఒట్టొమాన్ సామ్రాజ్యంలో భాగాలే. మొదటి ప్రపంచయుద్ధ పర్యవ సానంగా, ఒట్టొమాన్ సామ్రాజ్య పతనానంతరం అవి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల వలస దేశాలైనాయి. కాలక్రమంలో ఆ దేశాలన్నీ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఒట్టొమాన్‌ల రాజ్యం ఆధునిక టర్కీ సరిహద్దులకే పరిమితమైంది. ఒకప్పటి ‘కానిస్టాంటి నోపుల్’ ఈనాడు ఇస్తాంబుల్‌గా టర్కీ రాజధాని అయింది. మహమ్మద్ ప్రవక్త కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు మార్గదర్శనం చేసే ‘ఖిలాఫత్’ (ఖలిఫా-గురుపీఠం) వ్యవస్థను టర్కీ రిపబ్లిక్‌గా అవతరించాక ముస్తాఫా కెమాల్ అటాటుర్క్ రద్దు చేశాడు. కాథలిక్ క్రైస్తవులకు ‘వాటికన్’ ఎలాంటిదో ఖిలాఫత్ కూడా ముస్లింలకు అలాంటిదే. ఆ ఖిలాఫత్‌ను పునరుద్ధరించాలని భారతదేశ ముస్లింల• దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. శతాబ్దాల పాటు ఖిలాఫత్‌కు కేంద్ర స్థానంగా ఉన్న టర్కీ లోనే, అక్కడి ముస్లింపాలకులే ఆ వ్యవస్థను రద్దుచేసి, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ వైపుకు అడుగులు వేశారు. ఇక్కడి ముస్లిం ఛాందసవాదులు మాత్రం ఆ వ్యవస్థను పునరుద్ధరించాలని హింసాత్మక చర్యలకు దిగటం విడ్డూరం. అంతిమంగా ఆ ఉద్యమం దేశ విభజనకు దారితీసింది. ఆ ఉద్యమం జరిగి 100 సంవత్సరాలు గడిచినా, దాని ప్రతిధ్వనులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
సహాయ నిరాకరణ ఉద్యమం స్వరాజ్యం కోసం ప్రారంభించారా?
గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికీ, ఖిలాఫత్ ఉద్యమానికీ మధ్య సంబంధం గురించి ఈతరం వారికి తెలిసింది చాలా తక్కువ. తరతరాల నుండి మనం మన పిల్లలకు పాఠ్యగ్రంథాలలో అర్ధసత్యాలనే బోధిస్తున్నాం. 1919లో వచ్చిన రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా, అదే సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన జలియన్‌వాలా బాగ్ దారుణ మారణ కాండకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించి, కాంగ్రెస్ పార్టీ సహాయనిరాకరణను ప్రకటించిందని పాఠ్యగ్రంథాలు చెప్తుంటాయి. సహాయ నిరాకరణోద్యమాన్ని, ఖిలాఫత్ ఉద్యమంతో అనుసంధానం చేయటం ద్వారా, హిందూ-ముస్లిం ఐక్యతను నెలకొల్పి, వలసపాలనకు వ్యతిరేకంగా గాంధీ ఉద్యమించారని బోధిస్తూ ఉంటారు. స్వరాజ్యం కోసమే జాతీయ కాంగ్రెస్ సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిందని భోగరాజు పట్టాభి సీతారామయ్య రాసిన అధికారక ‘కాంగ్రెస్ చరిత్ర’ లోనూ పేర్కొన్నారు. అయితే ఆ వాస్తవాలు పరిశీ లించటం అవసరం. ఏ ఉద్యమం ఏ చారిత్రక సందర్భంలో, ఎందుకు చేపట్టవలసివచ్చిందో సవివరంగా పరిశోధించటం, వాస్తవాలు వెలికితీసి, ప్రచురించటం ఈనాటి అవసరం. చరిత్ర ఉద్దేశం వాస్తవాలు తెలియచెప్పటమే అయితే, చరిత్రకారులు వాస్తవాలను వక్రీకరించారో లేదో పరిశీలించటం కూడా అవసరం. ఖిలాఫత్ ఉద్యమ పూర్వాపరాలు, స్వరూపస్వభావాలు నిష్పాక్షికంగా పరిశీలించటమూ ఎంతో అవసరం. రాజకీయాల కారణంగానో, భావజాలం కారణంగానో వాస్తవాలు మరుగున పడిపోకూడదు. లేదా తొక్కి పెట్టకూడదు.
ఖిలాఫత్ జాతీయ లౌకిక ఉద్యమమా?
అక్టోబరు 25, 2018న కాంగ్రెసు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఖిలాఫత్ ఉద్యమం గురించి పేర్కొన్న విషయాలు గమనిద్దాం. ‘బ్రిటిష్ రాజ్ నుండి విముక్తి కోసం చేపట్టిన ఉద్యమాలలో ఖిలాఫత్ ఉద్యమం ప్రముఖమైంది. ఆ ఉద్యమంలో హిందువులు, ముస్లింలు సంఘటితంగా పాల్గొన్నారు. అందుకు కాంగ్రెసు నాయకత్వం వహించింది. ఆ ఉద్యమంలో సాధించిన ‘విజయం’ నుండి గాంధీజీకి సహాయ నిరాకరణ ఉద్యమం చేప్టటానికి కావలసిన ప్రేరణ లభించింది. ఖిలాఫత్, సహాయనిరాకరణ ఉద్యమాలను ఉమ్మడిగా చేపట్టారు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ప్రకటించటం ద్వారా గాంధీజీ హిందువులు-ముస్లింల మధ్య ఐక్యతను తీసుకురావ టానికి ప్రయత్నం చేశారు. ఖిలాఫత్ ఉద్యమం అట్టి ఐక్యత సాధించటానికి ఆయనకు ఒక మహత్తర అవకాశంగా కనిపించింది. స్వపరిపాలన లేక ‘స్వరాజ్య’ ఆకాంక్షను ఖిలాఫత్ ఉద్యమ ఆకాంక్షతో ముడిపెట్టటంతో మునుపెన్నడూలేనంతగా హిందువులు-ముస్లింల మధ్య ఐక్యత వెల్లివిరిసింది. ఖిలాఫత్, కాంగ్రెసు నాయకుల ఉమ్మడి నాయకత్వ కారణంగా వెల్లివిరిసిన హిందూ-ముస్లిం ఐక్యత వలసపాలనకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటానికి వీలు కల్పించింది. స్వాతంత్య్రం కోసం అన్ని వర్గాల ప్రజలు కలసి పోరాడడానికి కావలసిన వాతావరణం ఏర్పడింది’.
కొందరు చరిత్రకారులు ఖిలాఫత్ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యానాలు కూడా వాస్తవాలను మరుగుపరిచే విధంగానే ఉన్నాయి. ఉదాహరణకు స్కాటిష్ చరిత్ర కారుడు హ్యామిల్టిన్ గిబ్ (1895-71) ఏమంటు న్నాడో చూడండి, ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం లలో, కేవలం భారతదేశంలో ఉన్న ముస్లింలు మాత్రమే ఇస్లామిక్ అంతర్జాతీయత పట్ల పట్టుదలగా ఉన్నారు. పెరుగుతున్న హిందూ జాతీయవాదం పట్ల భయంతోనే వారు ఈ విధంగా స్పందించారు’ (Whither Islam? A Survey of Modern Movement in the Moslem World, 1932, Routeldge, p.73). అంటే ఖిలాఫత్ ఉద్యమం హిందూ జాతీయవాదానికి ప్రతిక్రియగానే వచ్చిందని ఈయన అభిప్రాయపడుతున్నా డన్నమాట. కెనడాకు చెందిన చరిత్రకారుడు విల్‌ఫ్రెడ్ కాంట్వెల్ స్మిత్ (1916-2000) చేసిన సూత్రీకరణ ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి, ‘‘ఖిలాఫత్’ అంటే భారత గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముస్లింలకు అర్థమయింది వేరు. వారు ఆ పదం ‘ఖలీఫ్’ అనే ఉర్దూ పదం నుండి వచ్చిందనుకొన్నారు. ఆ ఉర్దూ పదానికి అర్థం ‘వ్యతిరేకత’. కనుక వలస పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంగా వారు భావించి అందులో పాల్గొన్నారు. అంతేతప్ప మహమ్మద్ ప్రవక్త గురించి, ఆయన తదనంతరం ఏర్పడిన మతవ్యవస్థ పట్ల వారికి ఎట్టి అవగాహన లేదు’ (Modern Islam in India: A Social Analysis, Minerva Book House). టెండూల్కర్ అనే చరిత్రకారుడు సైతం మహాత్మా గాంధీ గురించి రాసిన గ్రంథంలో ఇదేవిధంగా వ్యాఖ్యానించాడు (Mahatma: Life of M.K Gandhi, Vol: 2, p.47). ఆయన వ్రాసిన గ్రంథాన్ని 1985లో రాజీవ్‌గాంధీ ఆవిష్కరించారు కూడా!
మరికొందరు ఖిలాఫత్ ఉద్యమాన్ని ఒక అంతర్జాతీయ ముస్లిం ఉద్యమంగా కాక, జాతీయ ముస్లిం ఉద్యమంగా చిత్రించారు. ఇంకో ప్రముఖ చరిత్రకారుడు భోజానందన్ ప్రసాద్ సింగ్ ఖిలాఫత్ ఉద్యమంలో లౌకిక భావజాలం కోసం అన్వేషిం చారు. ఆయన ఏమన్నారంటే, ‘ఖిలాఫత్ ఉద్యమం మత ప్రాతిపదిక మీదే ఎక్కువ చర్చ జరిగింది. దానితో ఆ ఉద్యమ సెక్యులర్ తత్త్వం మరుగున పడింది. అందుకే అధికారికంగా కూడా ఆ ఉద్యమం గురించి ప్రస్తావించటం మానివేశారు’ (Secular Strands of Khilafat and Non-Cooperation Movement in Bihar: 1920-22, Proceedings of the Indian History Congress, Vol: 63, 2002, pp 615-621). కాంగ్రెసు నాయకుడు రఫిక్ జకారియా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడని 1997లో సింగ్ ‘హిందూస్థాన్ టైమ్స్’కు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. మరొక ప్రసిద్ధ చరిత్రకారుడైతే ఖిలాఫత్ ఉద్యమం గాంధీ లౌకిక జాతీయవాదానికి పరాకాష్టగా నిలుస్తుందని ప్రశంసించాడు! ‘గాంధీ సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలు రెండు లౌకిక జాతీయోద్యమాలకు ప్రతీకలు. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య భారతదేశంలో విభిన్న మతవర్గాలకు చెందినవారు అన్నదమ్ములవలె కలసి బ్రతకటానికి మార్గాన్ని సుగమం చేసిన ఉద్యమాలు. రెండింటి మూల ప్రాతిపదిక, సూత్రం అహింసే…’
మరికొందరు ఖిలాఫత్ ఉద్యమం అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడ్డ యోచనగా అభివర్ణిస్తూ దానికేమీ చారిత్రక, మత ప్రాధాన్యం లేవని పేర్కొన్నారు. ‘మెయిన్‌స్ట్రీమ్’ పత్రికలో జనవరి 25, 2020న గార్గి చక్రవర్తి ఏం రాశాడో చూడండి. ‘1911 వరకు, అంటే ఇటలీ-టర్కీ యుద్ధం ప్రారంభ మయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఏకీకరణ భావజాలం (Pan Islamism) భారత దేశంలో వ్యాపించలేదు. పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ భావజాలం పుట్టుకొచ్చి, వ్యాపించింది. ఇటలీతో బ్రిటన్ ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. దానితో భారతీయ ముస్లింలు ఆంగ్ల పాలనకు వ్యతిరేకులయ్యారు. ఇస్లామిక్ సంస్కృతిని ధ్యంసం చేయటానికి ఆంగ్లేయులు పూనుకొన్నారన్న భావన వ్యాప్తి చెందింది. దానితో ‘ఇస్లామ్ ప్రమాదంలో పడింది’ అన్ని అభిప్రాయాన్ని వ్యాప్తి చేశారు. క్రైస్తవానికీ, ఆంగ్లేయులకూ వ్యతిరేకంగా ఖిలాఫత్ ఉద్యమం మొదలయింది తప్ప, హిందువు లకు వ్యతిరేకంగా కాదు.’’
సెక్యులర్ చరిత్రకారులు ఖిలాఫత్ ఉద్యమాన్ని ఆ విధంగా భుజాలకు ఎత్తుకొని సమర్థిస్తూ వ్యాఖ్యానాలు చేస్తే ముస్లిం ఛాందసవాద చరిత్రకారులు ఎందుకు వెనుకాడతారు? షేక్ ఇమ్రాన్ హోసిన్ ఇలా రాశాడు, ‘ఆంగ్లవలస పాలకులు రాజకీయ సెక్యులరిజాన్ని ఇస్లాంకు ప్రత్యామ్నాయంగా బలవంతంగా నిలబెట్టారు. హిందువులు, ముస్లింలు పాశ్చాత్యుల ఈ కొత్త మతమైన రాజకీయ సెక్యులరిజాన్ని సవాలు చేయసాగారు. తమ దేశీయ సంస్కృతిని, స్థానిక సంప్రదాయాలు పునరుద్ధరించుకొనే ప్రయత్నం చేశారు. పాశ్చాత్యుల రాజకీయ సెక్యుల రిజాన్ని, రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థను శ్వేత జాతీయులు అన్య జాతీయులపై వారి ఇష్టాయి ష్టాలతో ప్రమేయం లేకుండా రుద్దటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దానితో బ్రిటిషు వారు వ్యూహాత్మ కంగా కదలి ముస్తాఫా కెమాల్ చేత టర్కీ సెక్యులర్ రిపబ్లిక్‌లో ఖిలాఫత్‌ను రద్దుచేయించారు. హిందూ, ముస్లిం ఐక్యతను దెబ్బ తీసేందుకు, ఖిలాఫత్ ఉద్యమానికి ముగింపు తీసుకొని వచ్చేందుకు ఆంగ్లేయులు చేసిన కుట్ర ఇది’. ఖిలాఫత్ ఉద్యమాన్ని స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేం దుకు చేపట్టిన ఉద్యమంగా అభివర్ణించ టాన్ని గమనించాలి!
వర్తమానానికీ గతానికీ లంకె
కొందరు పిడివాదులు చరిత్రకారుల అవతారమెత్తి కువ్యాఖ్యానాలు చేయటాన్ని గమనించాలి. దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ప్రస్తుత జాతీయవాద ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయటానికి కుతంత్రాలు చేస్తున్నారు. ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయంలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న జ్ఞానప్రకాష్ ఖిలాఫత్ ఉద్యమానికీ, పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికీ మధ్య పోలికలు ఉన్నాయని కూడా సూత్రీకరించే యత్నం చేశాడు. ఇలా, ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ప్రేరిత భావజాలంతో భారత దేశంలో తమకున్న ప్రాధాన్యం, స్థానాలపై జరుగుతున్న దాడులతో, ముస్లింలు తాము ముందుగా ముస్లింలమని, ఆ తర్వాత భారతీయులమని ఎలుగెత్తి చాటుతున్నారు. అంతేకాని కేవలం భారతీయులం మాత్రమే కాదని అంటున్నారు. మహాత్మా గాంధీ ముస్లింల ఆవేదనను, ఫిర్యాదులను ఆధారం చేసుకొని వలస పాలనకు వ్యతిరేకంగా ఖిలాఫత్‌కు మద్దతు పలికిన వైనం ప్రస్తుత పరిస్థితులలో జ్ఞాపకం వస్తున్నది. అప్పుడు కూడా ముందుగా ముస్లింలు, ఆ తర్వాతే భారతీయులు అన్న భావన ఆధారంగానే ఉద్యమం జరిగింది’. ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రికలో (జనవరి 12, 2020) రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
ఏతావాతా ప్రస్తుతం జరుగుతున్న చర్చ తీరుతెన్నులు గురించి ఈ విధంగా సంగ్రహంగా చెప్పచ్చు. ‘ఖిలాఫత్ ఉద్యమం ఒక బాధిత సమాజం ‘వలస పాలకులకు’ వ్యతిరేకంగా చేపట్టింది. ‘ముస్లిమేతరులను’ సైతం తమతో కలుపుకొని మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన గొప్ప ఉద్యమం అది’. ‘వలస పాలకుల’కు బదులుగా ‘అధిక సంఖ్యాక హిందూత్వం, ముస్లిమేతరులకు బదులుగా ‘నిచ్చెన మెట్లు హిందూ సామాజిక వ్యవస్థలో అణిచివేతకు గురైన ప్రజలు’ అని పై వాక్యంలో రాసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాల వెనుక ఉన్న కుట్రపూరిత భావజాలాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఖిలాఫత్ ఉద్యమం గురించి వండివారుస్తున్న అసత్యాలు, అర్ధసత్యాలు, కువాఖ్యనాలను ఎండగట్ట వలసిన అవసరం ఈనాడు చాలా ఉంది. కొందరిలో ఇప్పటికీ వంద సంవత్సరాల క్రితం ఉన్న మానసిక స్థితి ఎటువంటి మార్పు లేకుండా కనిపిస్తున్నది. 7వ శతాబ్దపు ఎడారి సంస్కృతిని తిరిగి నెలకొల్పాలనే మానసికస్థితి ఈనాటికీ కొనసాగుతుండటం దురదృష్టకరం.
చరిత్రను మర్చిపోయేవారు చరిత్ర పునరావృతం కావడానికి కారణమవుతారు.
(వచ్చేవారం- మతగ్రంథాలే మార్గదర్శకాలు)