– క్రాంతిదేవ్‌ ‌మిత్ర

భూతలస్వర్గంలో కొత్త ఉషోదయమైంది. జమ్ముకశ్మీర్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత కొత్తగాలి మొదలయింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా కశ్మీరీలు అభివృద్ధి ఫలాలను అందుకునే శుభఘడియలు ఆరంభమైనాయి. ఆర్టికల్‌ 370, 35ఏ ‌కారణంగా దశాబ్దాల పాటు కొనసాగిన అవాంఛనీయ పరిస్థితి తొలగిపోవడంతో పాటు కొత్త సంస్కరణలు అమలవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. ఉగ్రవాదం ఉక్కు పిడికిలి సడలిపోయిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి అనే శాపంతో కుంగిన జమ్ముకశ్మీర్‌ ఇవాళ రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా మిగతా రాష్ట్రాలతో కలసి నడిచే రోజులు ద•గ్గరలోనే ఉన్నాయి. తాత్కాలికంగా రద్దు చేసిన రాష్ట్ర హోదాను సరైన సమయంలో పునరుద్ధరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

2019 ఆగస్టు 5 దేశ చరిత్రను కీలక మలుపు తిప్పింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370‌ను, దీనితో పాటు 35ఏ లను రద్దు చేస్తూ కేందప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు, రాష్ట్ర హోదాను రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌ అనే రెండింటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఒక్క సారిగా ప్రతిపక్షాలు గగ్గోల పెట్టాయి. దేశ ప్రజా స్వామ్యంలో అత్యంత చీకటిరోజు అంటూ విరుచుకు పడ్డాయి. కొన్ని దశాబ్దాలుగా జనసంఘ్‌, ‌దాని తరువాతి రూపం బీజేపీ చేస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దు వాదన సరైనదేనని ఇప్పుడిప్పుడే రుజువవుతున్నది. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో సాహసోపేతంగా, వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఫలితాలు ఇస్తోంది. ఆర్టికల్‌ 370, 35ఏ ‌రద్దయితే ఉపద్రవం ముంచుకొస్తుందన్న ప్రతిపక్షాల వాదన, ఆరోపణ పటాపంచలవుతున్నాయి. ఇతర ప్రాంతాలతో సమానంగా జమ్ముకశ్మీర్‌ అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని కల్లోలితం చేసిన ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకూ తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వేర్పాటువాదులపై కఠిన చర్యలు చేపట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను అదుపులోకి తేగలిగింది. ఇప్పటివరకూ ఉగ్రవాద ముద్రపడిన ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధిపథంలోకి అడుగు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి హామీ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి.

సమాన అవకాశాలు

ఆర్టికల్‌ 370, 35ఏ ‌రద్దుతో జమ్ముకశ్మీర్‌లో ప్రధానంగా వివక్ష పూరిత విధానాలు రద్దయ్యాయి. అన్నివర్గాల ప్రజల ప్రయోజనాలకు రక్షణ లభిస్తోంది. నివాస చట్టంలో మార్పులు తెచ్చారు. ఇంతకాలంగా వివక్షను ఎదుర్కొన్న పశ్చిమ పాకిస్తాన్‌ ‌శరణార్థులు, గుర్ఖాలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకున్న రాష్ట్ర మహిళలు ఇప్పుడు డొమిసైల్‌ ‌సర్టిఫికెట్‌కు అర్హత పొందారు. ఇప్పటివరకూ మాజీ మంత్రులకు ఇచ్చిన అనవసర సదుపాయాలను రద్దు చేసి, రాజకీయ నాయకుల పింఛన్‌ ‌మీద నియంత్రణ విధించారు.

370, 35ఏ రద్దు తర్వాత బయటి ప్రాంతాల వారు కూడా ఇప్పుడు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయవచ్చు. ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం ద్వారా ఇక్కడి మహిళలు ఇప్పుడు తమ ఆస్తి హక్కును కోల్పోనక్కరలేదు. గతంలో జమ్ము కశ్మీర్‌లో అమలు కాని బాల్య వివాహాల నివారణ చట్టం, అందరికీ విద్య, భూమి కొనుగోలు చట్టం, బహుళ వైకల్యాల చట్టం, సీనియర్‌ ‌సిటిజన్స్ ‌చట్టం, గిరిజనుల సాధికారిత చట్టాలు, జాతీయ మైనారిటీ కమిషన్‌, ఉపాధ్యాయ విద్య జాతీయ కమిషన్‌ ఇప్పు‌డు ఇక్కడ కూడా వర్తిస్తున్నాయి. ప్రస్తుతం 170 కేంద్ర చట్టాలు జమ్ముకశ్మీర్‌కు వర్తిస్తున్నాయి.

370 రద్దు తర్వాత చేకూరిన ప్రయోజనాలల్లో కొన్నింటిని గమనిద్దాం.

పీఎం ఉజ్జ్వల యోజన కింద 12,60,685, ఉజాలా పథకం ద్వారా 15,90,873 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది.

స్వచ్ఛభారత్‌ ‌కార్యక్రమ అమలులో జమ్ముకశ్మీర్‌ ‌ముందడుగు వేసింది. నూటికి నూరు శాతం ఓడీఎఫ్‌గా గుర్తింపు పొందింది.

ఫించన్‌ ‌లబ్ధిదారుల సంఖ్య 7,42,781కి పెరిగింది. రాష్ట్ర పరిధిలోని ఐఎస్‌ఎస్‌ఎస్‌ ‌పథకం, ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలను 4,76,670 మందికి అందించారు.

ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పథకం కింద 11.41 లక్షల గోల్డ్ ‌కార్డులు ఇచ్చారు. దీంతో 3,48,370 కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది.

పీఎం కిసాన్‌ ‌యోజన అమలులో జమ్ముకశ్మీర్‌ ‌ముందంజలో ఉంది. ఒక్క ఏడాదిలోనే 9.86 లక్షల లబ్ధిదారుల• ఈ పథకం పరిధిలోకి వచ్చారు.

సౌభాగ్య పథకం కింద 3,87,501 లబ్ధిదారు లకు మేలు జరిగింది.

జమ్ములో మిషన్‌ ఇం‌ధ్రధనుస్‌ ‌ద్వారా 1,353 మంది పిల్లలు, 381 మంది గర్భిణులకు టీకాలు అందాయి. బారాముల్లా, కుప్వారాల్లో జీఎస్‌ఏ ‌కింద చేపట్టిన మిషన్‌ ఇం‌ద్రధనుష్‌ ‌ద్వారా 2,259 మంది పిల్లలు, 320 మంది మహిళలకు టీకాలు ఇచ్చారు.

డిసెంబర్‌ ‌మాసంలో జమ్ముకశ్మీర్‌ ‌నివాసు లందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పీఎమ్‌-‌జేఏవై సెహత్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

భారీ ఎత్తున ఉద్యోగాలు

జమ్ముకశ్మీర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతోంది. ఇటీవల 10 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ ‌విడుదల చేశారు. మరో 25 వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2022 నాటికి అన్ని ఉద్యోగాలనూ భర్తీ చేస్తారు. వీటన్నింటికీ ప్రత్యేకంగా నిబంధనలు రూపొందిస్తున్నారు. హిమాయత్‌ ‌పథకం ద్వారా 74,324 మందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కేంద్రాలను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రధాని ప్రశంసలు అందుకుంది.

జమ్ముకశ్మీర్‌లో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా శ్రీనగర్‌లో నిర్వహించిన ప్రపంచ పెట్టుడుల సదస్సులో రూ.13,600 కోట్ల విలువైన 168 అవగాహన ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. 6 వేల ఎకరాల్లో 37 పారిశ్రామిక ఎస్టేట్లు నెలకొల్పుతున్నారు.

పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహం

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జమ్ముకశ్మీర్‌ ‌పారిశ్రామిక రంగానికి భారీ స్థాయిలో ఊతం ఇచ్చే విధంగా కేంద్రం రాబోయే 15 ఏళ్ల కోసం రూ. 28,400 కోట్లు వెచ్చించబోతోంది. ఈ దిశగా ఇప్పటి వరకూ వివిధ పథకాల కింద రూ.112 కోట్లు పంపిణీ అయ్యాయి. పెద్ద ఎత్తున చిన్న, పెద్ద ఎంఎస్‌ఎంఈ ‌యూనిట్ల ఏర్పాట్ల కోసం ప్రోత్సాహ కాలు అందించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాయితీలు ఇవ్వనున్నారు. కొత్త పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలను బలోపేతం చేయనున్నారు. ఈ పథకం ద్వారా 4.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, పశుసంవర్ధ, పాడి రంగాలను ప్రోత్స హించనున్నారు. నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేం దుకు చర్యలు చేపడుతున్నారు. జమ్ముకశ్మీర్‌ను జాతీయ స్థాయిలో పోటీపడే స్థితికి తేవడమే ఈ పథకం అంతిమ లక్ష్యం.

అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు

కశ్మీరీ, డోగ్రీ, హిందీ భాషలను అధికార భాషలుగా చేరుస్తూ కేంద్ర కేబినెట్‌ ‌బిల్లును ఆమోదించింది. ఇప్పటికే అక్కడ ఉర్దూ, ఇంగ్లిష్‌ అధికార భాషలుగా ఉన్నాయి.

జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటీవల రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. 2023-24 వరకూ దీన్ని అమలు చేస్తారు.

కశ్మీర్‌ ‌కుంకుమపువ్వుకు భౌగోళిక గుర్తింపు ట్యాగ్‌ ‌లభించింది. ఆపిల్‌ ‌పంటకు ప్రత్యేక మార్కెట్‌ ‌పథకం ప్రవేశపెట్టారు. నేరుగా నగదు చెల్లింపు ద్వారా గిట్టుబాటు ధరను చెల్లిస్తున్నారు.

లోయలో 2022 నాటికి రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయి. జమ్ము- శ్రీనగర్‌ ‌ప్రాంతాల మధ్య మెట్రో ఏర్పాటు కోసం డీపీఆర్‌ ‌సిద్ధం చేశారు.

కార్గిల్‌ ‌ప్రాంతాన్ని కశ్మీర్‌ ‌లోయతో కలిపేలా ఆసియాలోని అతి పొడవైన 14.15 కి.మీ.ల జోజిలా సొరంగ మార్గం పనులు ప్రారంభమయ్యాయి

పీఎండీపీ పథకం కింద చీనాబ్‌ ‌నది మీద ప్రపంచంలోనే ఎత్తైన 467 మీటర్ల ఎత్తు వంతెన నిర్మిస్తున్నారు.

జమ్ము ఐఐటీ తన సొంత క్యాంపస్‌ ‌నుంచి పనులు ప్రారంభించింది. అలాగే జమ్ము ఎయిమ్స్ ‌పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో కశ్మీర్‌లో ఎయిమ్స్ ‌పనులు ప్రారంభం కానున్నాయి.

భూముల రిజిష్ట్రేషన్‌ ‌పక్రియను సంస్క రించడంలో భాగంగా 77 మంది సబ్‌ ‌రిజిస్ట్రార్లను నియమించడంతో పాటు ఎలక్ట్రానిక్‌ ‌స్టాంపింగ్‌ ‌నిబంధనలు రూపొందించారు.

పుల్వామా ఇప్పుడు దేశ పెన్సిల్‌ ‌తయారీ కేంద్రంగా మారింది. అక్కడి ఓఖూ పెన్సిల్‌ ‌గ్రామంగా గుర్తింపు పొందింది. అక్కడి 90 శాతం దేశ అవసరాలను తీర్చే పెన్సిల్స్ ‌తయారవుతున్నాయి.

జమ్ముకశ్మీర్‌ ‌విభజన తర్వాత విద్యుత్‌ ‌విభాగంలో సంస్కరణలు తీసుకువచ్చి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. హైడ్రో ప్రాజెక్టుల సంఖ్య పెరిగింది.1000 మెగావాట్ల పాకల్‌ ‌దల్‌ ‌ప్రాజెక్టు, 624 మెగావాట్ల కిరు ప్రాజెక్టు కాంట్రాక్టులు పూర్తయ్యాయి.

కిస్టావర్‌ ‌జిల్లా పరిధిలోని చీనాబ్‌ ‌నది మీద రత్లే దగ్గర రూ.5,281,94 కోట్ల పెట్టుబడితో 850 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్‌ ‌కేంద్ర నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

ఎవరైనా భూముల కొనవచ్చు

జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌లలో  ఎవరైనా భూమి కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి చట్టం, సెక్షన్‌ 17‌లోని ‘రాష్ట్రంలోని శాశ్వత నివాసి’ అనే పదాలను తొలగించి స్థానికేతరులు భూములు కొనుగోలు చేయకూడదనే కీలక నిబంధనను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వస్తాయని వివరించింది. వ్యవసాయ భూమిని సాగుచేసే వారు మాత్రమే కొనుగోలు చేయాలని జమ్ముకశ్మీర్‌ ‌లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌సిన్హా వెల్లడించారు. విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు సంబంధించి వ్యవసాయ భూములను సాగు చేయని వారు కూడా కొనుగోలు చేయవచ్చని మినహాయింపు నిచ్చారు.

విజయవంతంగా డీడీసీ ఎన్నికలు

ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికలు దేశ ప్రజలందరి దృష్టినీ ఆకర్షించాయి. మూడు దశాబ్దాలకు పైగా వేర్పాటువాదుల ఆగడాలతో నలిగిపోయిన ఈ రాష్ట్రంలో తొలిసారిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. గతంలో చోటు చేసుకున్న బహిష్కరణ పిలుపులు, హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్‌ ‌డీడీసీ ఎన్నికల్లో కనిపించలేదు. ప్రతి జిల్లాను 14 ప్రాదేశిక నియోజకవర్గాలుగా ఏర్పాటు చేస్తూ 20 జిల్లాల్లోని 280 సీట్లు ఏర్పాటు చేశారు. నవంబర్‌ 28 ‌నుంచి డిసెంబర్‌ 19 ‌వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. 1,427 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 15 శాతం పోలింగ్‌ ‌నమోదైతే డీడీసీ ఎన్నికల్లో 51శాతం పోలింగ్‌ ‌జరగడం శుభ పరిణామం.

డీడీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుకొని విమర్శకుల నోళ్లకు తాళం వేసింది. బీజేపీ సొంతంగా 75సీట్లను గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. గుప్కార్‌ ‌కూటమికి 110 సీట్లు రాగా ఇందులో భాగస్వాములైన నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ 67, ‌పీడీపీ 27 సీట్లు పొందాయి. స్వతంత్రులు 50 చోట్ల గెలవగా, కాంగ్రెస్‌కు 26 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య విజయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. వేర్పాటువాదులకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టుగా బీజేపీ వ్యాఖ్యానించింది. కొందరు కాంగ్రెస్‌ ‌నాయకులు కూడా ఈ ఎన్నికల నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

అభివృద్ధే ప్రధానం

జమ్ముకశ్మీర్‌ ‌ప్రజల అభివృద్ధి మన ప్రభుత్వానికి అతి ప్రధానమని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారత, యువతకు అవకాశాలు కల్పించడం, దళితులు, బలహీన, వెనుకబడిన వారి సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. రాజ్యాంగ, ప్రాథమిక హక్కుల రక్షణ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవలి జమ్ముకశ్మీర్‌ ‌జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలను అక్కడ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ప్రతి ఓటరు అభివృద్ధి కోసం నిరీక్షిస్తున్నారన్న విషయం స్పష్టమైందని మోదీ పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని ప్రతి ఓటరు దృష్టిలో మంచి భవిష్యత్తు ఉందనే నమ్మకాన్ని చూశానని వ్యాఖ్యానించారు.

సరైన సమయంలో రాష్ట్ర హోదా : అమిత్‌ ‌షా

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్దరించా లంటూ వస్తున్న డిమాండ్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఇటీవల కీలక ప్రకటన చేశారు. లోక్‌సభలో జమ్ముకశ్మీర్‌ ‌పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2021 ఆమోదం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఈ బిల్లులో ఎక్కడా చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేయొద్దని హితవు పలికారు. కశ్మీర్‌లో హింస, అశాంతి పరిస్థితులు మళ్లీ రాబోవని ఆయన అన్నారు. ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత కశ్మీర్‌ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు వెల్లడించారు. కశ్మీర్‌ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.

దారికొస్తున్న రాజకీయ పక్షాలు

ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత తమ ప్రత్యేక సామ్రాజ్యాలు కూలిపోయినట్లు గగ్గోలు పెట్టిన నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీపుల్స్ ‌డెమొక్రటిక్‌ ‌పార్టీ సహా వేర్పాటు వాద సంస్థలు మారిన పరిస్థితులను ఇప్పుడిప్పుడే అవగతం చేసుకుంటున్నాయి. శాంతి భద్రతలను అదుపులో ఉంచడంలో భాగంగా చాలాకాలం పాటు నిర్భందంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు ఇతర నాయకులను విడుదల చేశారు. వీరంతా జమ్ముకశ్మీర్‌ ‌స్వతంత్ర ప్రతిపత్తి, ఆర్టికల్‌ 370 ‌పునరుద్దరణ లక్ష్యంగా ఏకమై పీపుల్స్ అలయన్స్ ‌ఫర్‌ ‌గుప్కర్‌ ‌డిక్లరేషన్‌(‌పీఏజీడీ) పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేశారు.

ఆర్టికల్‌ 370 ‌పునరుద్ధరణ జరిగేవరకూ త్రివర్ణ పతాకం ఎగరవేయనని మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. జమ్ము కశ్మీర్‌ ఇం‌డియాలో అంతర్భాగం అని వ్యాఖ్యానించిన ఒమర్‌ అబ్దుల్లా, భారత్‌తో సత్సంబంధాలు లేకుండా రాష్ట్రానికి భవిష్యత్‌ ఉం‌డబోదనే నిర్ధారణకు వచ్చానన్నారు. పైకి ఎన్ని మాటలు అంటున్నా మారిన పరిస్థితుల్లో వీరంతా క్రమంగా రాజీకి వచ్చినట్లు స్పష్టమవుతోంది.

తెరచుకుంటున్న ఆలయాలు

ఉగ్రవాదం, హిందువుల వలసల కారణంగా 31 సంవత్సరాల క్రితం తలుపులు మూసివేసిన శ్రీనగర్‌లోని హబ్బా కదల్‌ ‌ప్రాంతంలో ఉన్న శీతల్‌నాథ్‌ ఆలయం వసంత పంచమి సందర్భంగా భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం బెదిరింపుల వల్ల ఈ ఆలయం బలవంతంగా మూసేశారు. శీతల్‌నాథ్‌ ఆలయం తిరిగి తెరచుకోవడం కశ్మీర్‌లో తిరిగి శాంతియుత వాతావరణం ఏర్పడటానికి నిదర్శనమని స్థానిక హిందువులతో పాటు ముస్లింలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం కట్టుబట్టలతో లోయ విడిచిన కశ్మీరీ పండితుల కుటుంబాలు క్రమంగా తిరిగిరావడానికి ఎంతో కాలం పట్టదని కొందరు వ్యాఖ్యానించడం విశేషం.

ఆలయం తిరిగి తెరవడం వల్ల అక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా ఉందని, కశ్మీర్‌ ‌ప్రాంతం ఇప్పుడు సురక్షితమైనదన్న సందేశాన్ని ఇస్తోందని అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు లోయకు తిరిగి వచ్చేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని దేవాలయానికి చెందిన ఆశ్రమ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పుంజుకుంటున్న పర్యాటక రంగం

జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా కుదుట పడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగం తిరిగి ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇండియన్‌ ‌రైల్వే కేటరింగ్‌ అం‌డ్‌ ‌టూరిజమ్‌ ‌కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించిన ఏడు రోజుల ‘శ్రీనగర్‌-‌గుల్‌మార్గ్- ‌పెహల్‌గావ్‌- శ్రీ‌నగర్‌’ ‌ప్యాకేజీ అందరినీ ఆకర్షించింది. ఇందుకోసం ఒక్కో పర్యాటకునికి రూ. 35,000 నిర్ణయించారు. ఈ పర్యటనలో శ్రీనగర్‌ ‌షాలిమర్‌ ‌తోటలు, శంకర్‌ ‌నారాయణ్‌ ‌టెంపుల్‌, ‌గౌరీ మార్గ్ (‌గుల్‌మార్గ్), ‌పెహల్‌గావ్‌లోని కుంకుమ  తోటల్లో విహారం, అవంతిపురా పర్యటన, థాజ్‌వాస్‌ ‌గ్లేసియర్‌ ‌తీరాన గుర్రపు స్వారీ, శ్రీనగర్‌లో శికారా రైడ్‌ ఉం‌టాయి. మొదటిరోజు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో పికప్‌ ‌చేసుకుంటారు. చివరిరోజు తిరిగి శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో దించుతారు.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE