‘మీరంతా నా కుటుంబమే. మీ రుగ్మతలు నా కుటుంబంలో వచ్చిన రుగ్మతలే. అందుకే నా దేశ పౌరులంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. జన ఔషధి కేంద్రాలు వైద్య వ్యయాల భారం నుంచి పేద ప్రజలకు సాంత్వన కల్పిస్తాయి.’ జన ఔషధి వారోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశంలోని మాటలివి. అందుబాటు ధరలలో ఉండే మందులను జన ఔషధి కేంద్రాలలో కొనుగోలు చేయవలసిందని కూడా ప్రధాని దేశ ప్రజలకి సూచించారు. సందర్భం చాలా ముఖ్యమైనదే. అది- జన ఔషధి వారోత్సవాల (మార్చి ఏడు) ప్రారంభ కార్యక్రమం. అదే రోజున ఆయన దేశంలో 7,500వ జన ఔషధి కేంద్రాన్ని షిల్లాంగ్‌లోని నీగ్రమ్స్‌లో (నార్త్ ఈస్టరన్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఉద్యమంలా మార్చిన ప్రధాని ఇప్పుడు స్వస్థతా భారత్ కోసం నడుం బిగించారు. కొవిడ్ 19 తరువాత ఏ దేశాధినేత అయినా ఆరోగ్యం పట్ల గరిష్టంగా శ్రద్ధాసక్తులు చూపకుంటే భారీ మూల్యమే చెల్లించక తప్పదని ఆ పరిణామాలు వెల్లడించాయి. ఆరోగ్యమే మహా భాగ్యమన్న నానుడి ఎప్పటికీ నవ్యమైనదేనన్న వాస్తవమూ విశ్వం గుర్తించింది. ఆరోగ్యం, అభివృద్ధి పరస్పరం ఆధారపడే గొప్ప వాస్తవాలు. అది మోదీ గుర్తించారు.
ఈశాన్య భారతంలోని అస్సాం మొదలు, తమిళనాడు వరకు ఇప్పుడు జన ఔషధి కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రాల సేవ, అక్కడ అందుబాటు ధరలలో దొరికే మందుల గురించి దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం తేవడానికి ఉద్దేశించినదే జన ఔషధి వారోత్సవం. ఏటా మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు వీటిని నిర్వహిస్తారు. ఈ పథకం పూర్తి పేరు ‘ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన’.
జన ఔషధి యోజన పేద ప్రజలకు సన్నిహిత మవుతున్నదని ఈ ఏటి ఉత్సవాల సందర్భంగా ప్రధాని తెలియచేశారు. ఈ పథకం వల్ల ఇప్పుడు దేశంలోని పేద ప్రజలు ఏటా కొన్ని కోట్లు ఆదా చేసుకో గలుగుతారు. సేవగానూ, ఉపాధిగానూ కూడా ఇది ఉపయోగపడుతున్నది. ఆరేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా ఇలాంటి సేవ అందించే కేంద్రాలు వంద కూడా లేవు. ఇప్పుడు 7500 కేంద్రాలు వెలిశాయి. పేదలకు ఔషధాలను అందుబాటులో ఉంచాలన్న ఆశయానికి ఆకృతిని ఇచ్చే కృషిలో ఇది పెద్ద అడుగు. ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ఈ కేంద్రాలలో వేయి వరకు మహిళలకే అప్పగించారు. గుండె సంబంధిత వ్యాధులకు గురైన వారికి స్టెంట్ ధరలు తగ్గించి మహోపకారం చేసిన ఎన్‌డిఏ ప్రభుత్వం ఇప్పుడు జన ఔషధి కేంద్రాలను ప్రారంభించి, ప్రతి పౌరునికి ఉన్న జీవించే హక్కును గౌరవిస్తున్నది.
పేదరికానికి మందు
ఒక వ్యక్తి ఔషధాలు, వైద్యం అందుబాటులో లేక ప్రాణం వదిలితే ఆ పాపం వ్యవస్థ మొత్తానిదే అనడం తొందరపాటు కాదు. గడచిన కొన్నేళ్లుగా నాణ్యమైన బ్రాండెడ్ ఔషధాలు, జనరిక్ మందుల తయారీలో మన దేశం ఎంతో పురోగతి సాధించింది. థెరపిక్ తరగతికి చెందిన మందులు కూడా దేశం ఘనంగా ఉత్పత్తి చేస్తున్నది. ఇదెంతో గర్వకారణం. 1980లో రూ. 1,500 కోట్లు ఉన్న ఔషధ పరిశ్రమ 2012 నాటికి రూ. 1,19,000 కోట్ల పరిశ్రమగా వృద్ధి చెందింది. నిజానికి ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మందులు, అవే రకం విదేశీ మందుల కంటే తక్కువ ధరలకే లభ్యమవుతున్నాయి. అయినప్పటికి మన దేశంలో ఉన్న పేద ప్రజానీకానికి ఇప్పటికి ఔషధాలను కొనుగోలు చేసే స్థోమత రాలేదు. ఇదే విషాదం. ప్రతి థెరపి విభాగం ఔషధం బ్రాండెడ్ మందుగానే కొనుగోలు చేయవలసి ఉంటుంది. వీటి ధరలు సాపేక్షంగా చూస్తే ఎక్కువే. మన పేద ప్రజల పరిస్థితి ఏమిటో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియచేసింది. 2008 లెక్కల ప్రకారం 65 శాతం భారత ప్రజానీకం ఆధునిక వైద్య విధానాలకు దూరంగానే ఉండిపోయింది. ఇందుకు కారణం ఒక్కటే- 80 శాతం ఔట్ పేషెంట్ సేవలు, 60 శాతం ఆసుపత్రిలో చేరే వారు ప్రైవేటు ఆసుపత్రులకే వెళుతున్నారు. దేశంలో చాలామంది మందుల కోసం ప్రైవేటు సంస్థలనే ఆశ్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో జరిగే వైద్య వ్యయంలో 79 శాతం ఔషధాల కోసమే అవుతున్నది. కాబట్టి దేశంలో జనరిక్ ఔషధాల అందుబాటు తక్షణావసరం.
తొలి యత్నం విఫలం
ఇందుకోసం 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. అదే జన ఔషధి పథకం. ఇది సత్ఫలితాలను ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన లోపాలను సరిదిద్దడం ప్రధాని మోదీ ఆశయాలలో ఒక•ని అందరికీ తెలిసినదే. చిన్నదైనా, పెద్దదైనా ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపే వాటిని మోదీ క్రమబద్ధం చేయాలని భావిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉత్తమ ఫలితాలు ఇస్తూ, ప్రజలకు నిజంగానే సాయపడగల కొన్ని పథకాల పట్ల కూడా కాంగ్రెస్ అలక్ష్యం వహించింది. ఫార్మాస్యూటికల్ శాఖ 2008లో ఆరంభించిన జన ఔషధి పథకం (జేఏఎస్) అలాంటిదే. కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఈ పథకం నిర్వహించి నట్టయితే ప్రజలకు ఎంతో మేలు జరిగేదని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఔషధాల ధరలు సామాన్యు లకు అందుబాటులోకి లేకుండా పోతున్న వాస్తవాన్ని గుర్తించిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం జేఏఎస్‌ను ప్రారంభించనట్టు కనిపిస్తుంది. వీటి నిర్వహణను ఫార్మాస్యూటికల్స్ శాఖలో అంతర్భాగమైన బ్యూరో ఆఫ్ ఫార్మా సెక్టర్ అండర్ టేకింగ్స్ ఆఫ్ ఇండియా (బీపీఎస్‌యు)కు అప్పగించారు. నిజానికి 1995 నాటి డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ఔషధాల చిల్లర విక్రయాలు, ధరలను క్రమబద్ధం చేసింది. మన ఔషధ పరిశ్రమ నాణ్యమైన జనరిక్ ఔషధాలను విజయవంతంగా ఉత్పత్తి చేయగలిగింది. అవి సరసమైన ధరలకు వినియోగదారులకు అందుబాటు లోకి వచ్చాయి. ఇది చాలా దేశాలకు మార్గదర్శకంగా మారింది. కానీ మనదేశంలో పరిస్థితి వేరు. భారతీయులలో ఎక్కువ మంది ఇప్పటికి రుగ్మతలకు లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోగల స్థితిలో లేరు. ఒక సాధారణ కుటుంబంలో ఎవరో ఒకరు ఆసుపత్రి పాలైతే ఆ కుటుంబం దారిద్య్ర రేఖకు సమీపంగా రావలసిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇలాంటి వారిని ఆదుకోవాలంటే విస్తృత దృష్టితో కూడిన పెద్ద ప్రయత్నం అవసరమే. అది కూడా అత్యవసరంగా జరగవలసి ఉంది.
అందుకోసం యూపీఏ-2 హయాంలో గోవా, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలలో, ఇంకా రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో కూడా జేఏఎస్‌లు మొదలయి నాయి. అండమాన్ నికోబార్, దాద్రా నాగర్‌హవేలీ, దామన్ డయ్యు, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో వాటి జాడ లేదు. అందులో 87 జేఏఎస్‌లు పని చేశాయి. మిగిలినవి నామమాత్రంగా మిగిలాయి. చాలావాటికి మందుల సరఫరా సక్రమంగా లేదని సమాచారం. అంటే, అర్హులకు జేఏఎస్‌లు చేరువ కాలేకపోయాయి. ఒక ఉదాహరణ చూస్తే వింత అనిపిస్తుంది. మధ్యప్రదేశ్ మొత్తానికి ఒకే జేఏఎస్ ఏర్పాటుచేశారు. అది కూడా భోపాల్ నగరానికి పది కిలోమీటర్ల అవతల వెలిసింది. దాని సంగతి ఎవరికీ తెలియ లేదు. అలాగే జేఏఎస్‌ల ద్వారా అందుబాటులో ఉంచాలనుకున్న 361 మందులలో కేవలం 130 వరకే వాటిలో దర్శనమిచ్చేవి. 2016 నాటికి దేశవ్యాప్తంగా 3000 జేఏఎస్‌లు నెలకొల్పాలని యూపీఏ ప్రభుత్వం భావించనప్పటికి 2014 ఎన్నికలలో ఓడిపోయింది. అంతకు ముందయినా ఈ పథకం మీద యూపీఏ ప్రభుత్వం చూపిన శ్రద్ధ నామమాత్రమేనని లెక్కలు చెబుతున్నాయి. 2008లో ఆ పథకం ప్రారంభించినప్పుడు ఉన్న స్టోర్లు కేవలం ఏడు. తరువాత 36 (2009-10), 43 (2010-11), 55 (2011-12), 98 (2012 -13), 104(2013-14) వంతున పెంచారు.
జన ఔషధి కేంద్రాలు
ఈ ఆటుపోట్ల నేపథ్యంలోనే జూలై 1, 2015న ప్రధాని మోదీ పీఎంబీజేపీ పథకానికి శ్రీకారం చుట్టారు. మార్చి 7, 2021న 7500వ పీఎంబీజేపీ శాఖను జాతికి అంకితం చేశారాయన. 2016-17 బడ్జెట్‌లో 3000 కేంద్రాలు తెరుస్తామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2060 కేంద్రాలను ప్రారంభించగలిగారు. అంత శ్రద్ధగా ఆయన నిర్వహిస్తున్నారు. వీటి విస్తరణ ఎలా ఉంది! 99 కేంద్రాలతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ఆయన పునఃప్రారంభించారు. తరువాత ఆ కేంద్రాలు 269 (2015-16), 1080 (2016-17), 1253 (2017-18) వంతున పెరిగాయి. 2021 మార్చి 7 నాటికి 7500కు చేరాయి. మొదట ఈ పథకానికి ప్రధానమంత్రి జన ఔషధ యోజన అని పేరు పెట్టారు. 2016లో దీనినే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనగా మార్చారు.
జన ఔషధి ప్రత్యేకత ఏమిటి?
నాణ్యమైన జనరిక్ ఔషధాలను (బ్రాండెడ్ ఔషధాలతో సమానమైన మందులు, బ్రాండెడ్ కాదు) అందించడమే ఈ కేంద్రాల ధ్యేయం. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రారంభించినవే జన ఔషధి కేంద్రాలు. ఫార్మాస్యూటికల్స్ శాఖ, కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించాయి. 2008 నవంబర్‌లో ఇది జన ఔషధి పథకం పేరుతో ప్రారంభమైనప్పటికీ విఫలమైంది. దీనినే ఎన్‌డీఏ ప్రభుత్వం 2015లో పునః ప్రారంభించింది. ఆ విధంగా వచ్చినదే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ). అన్ని థెరపిక్ ఔషధాలు (అస్వస్థతలు, గాయాలు తగ్గించడానికి మందు చీటీ ద్వారా తీసుకోగలిగినవి) ఈ కేంద్రాలలో లభిస్తాయి. ఆయుష్ ఉత్పత్తులు, ముఖ్యంగా 75 ఆయుర్వేద ఔషధాలు కూడా ఈ కేంద్రాలలో ఉంచుతున్నారు. జనరిక్ ఔషధాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడం, డాక్టర్ల ద్వారా వాటికి ప్రాచుర్యం కల్పించడం, మంచి ఔషధాలంటే ఎక్కువ ధరకే లభిస్తాయన్న అపోహను తొలగించడం కూడా ఈ కేంద్రాల స్థాపన వెనుక ఉంది. అంటే నాణ్యమైన ఔషధాలు అందరికీ అందించాలి. ముఖ్యంగా పేదల మీద పడుతున్న మందుల భారాన్ని తగ్గించాలి. ఆరోగ్య సమస్యలతో పేదలు మరింత పేదలు కాకుండా ఆ విష వలయం నుంచి వారిని రక్షించాలి.
ఔషధాల లభ్యత
యూపీఏ 361 రకాల ఔషధాలను జన ఔషధి స్టోర్లలో ఉంచడానికి ప్రయత్నించింది. ఎన్‌డీఏ ప్రభుత్వం 1600 రకాల ఔషధాలను ఈ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెస్తున్నదని భారత ఫార్మాస్యూటికల్ శాఖ తెలియచేసింది. శస్త్రచికిత్సలకు చెందిన మరొక 204 ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాలలో ఉంచారు. దేశంలోని 734 జిల్లాలకు గాను 732 జిల్లాలలో జన ఔషధి కేంద్రాలు ఆవిర్భ వించాయి. యాంటీ ఇన్‌ఫెక్టివ్, యాంటీ అలెర్జిక్, యాంటీ డయాబెటిక్స్, కార్డియో వాస్క్యులర్, యాంటీ కేన్సర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వంటి థెరపీకి సంబంధిం చిన కీలక ఔషధాలు కూడా ఈ కేంద్రాలలో విక్రయిస్తున్నారు. కానీ కేన్సర్ వంటి వ్యాధులకు అవసరమైన మందులు అమృత్ పేరుతో ఉండే కేంద్రాలలోనే లభిస్తాయి. మందుల సరఫరా కూడా నిపుణుల చేత నిర్వహింపచేస్తున్నారు. సానిటరీ నాప్‌కిన్స్ వంటివి నామమాత్రపు ధరలకే ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జన ఔషధి కేంద్రాలలో అన్ని మందులు దొరకకపోయినా, త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. ప్రత్యేకంగా ఈ కేంద్రాలకు సరఫరా చేయడానికి ఢిల్లీ, హరియాణా, చెన్నై, బెంగళూరు నగరాలలో కర్మాగారాలను నెలకొల్పే పనిలో ఉన్నారు.
ఈ కేంద్రాల ఏర్పాటు ఉద్దేశమే అందుబాటు ధరలలో ఔషధాల సరఫరా. మూడు బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసే ఒక మందును ఉదా హరణగా తీసుకుంటే•, దానిని ఆ ప్రముఖ కంపెనీలు విక్రయించే ధరలో సగం ధరకే జన ఔషధి పథకం ప్రకారం అందుతుంది. అంటే జన ఔషధి కేంద్రంలో మందులు యాభయ్ శాతం నుంచి మొదలు, కొన్ని కొన్ని మందులు మార్కెట్‌లో ఉన్న ధర కంటే 80 నుంచి 90 శాతం తక్కువ ధరకు లభిస్తాయి.
మందుల గురించి ప్రజలలో నమ్మకం కలిగించ నప్పుడే వాటిని స్వీకరించడానికి వారు ముందుకు వస్తారు. ఈ విషయంలో కూడా పీఎంబీజేపీ తగిన ఏర్పాట్లు చేసింది. ఈ కేంద్రాల కోసం సేకరించే అన్ని రకాల మందుల నాణ్యతను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ లేబరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) తనిఖీ చేసి, అందుకు పూచీ పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ నిర్దేశించిన ప్రమాణాలకు చేరువైతేనే ఎన్‌ఏబీఎల్ జన ఔషధి కేంద్రాలకు మందులను అనుమతిస్తుంది.
ఆత్మ నిర్భర భారత్‌లో భాగం
మహిళలకు ఆత్మ నిర్భర భారత్ ప్రయోజనాలను అందుబాటులోకి తేవడంతో పాటు, దివ్యాంగులకు, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు కూడా జన ఔషధి కేంద్రాల ద్వారా వాణిజ్యవేత్తలుగా ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నారు. అందుబాటులో ఉండే ధరలతో పేద ప్రజలు ఔషధాల• అందుకోగలగాలి. మందులు లేక పేదలు తమ ప్రాణాలు కోల్పోకూడదు. ఇందుకోసమే దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల స్థాపనకు ప్రణాళిక రచించామన్నారు ప్రధాని.
వీడని జన ఔషధి స్టోర్ల నీడ
కానీ జన ఔషధి కేంద్రాల మీద జన ఔషధి స్టోర్ల నీడ ఇంకా పడుతూనే ఉంది. అందుకే సాధారణ ప్రజలు పీఎంబీజేపీ కేంద్రాల పట్ల కూడా తక్కువగా స్పందిస్తున్నారు. 2008 నాటి దీని మాతృక జన ఔషధి పథకం కాలంలో ఎదుర్కొన్న కొన్ని సమస్యలే ఇప్పటికీ వెంటాడుతున్నాయి. పీఎంబీజేపీ పథకం ఎంతో మెరుగ్గా తీర్చిదిద్దారు. అయినా కొన్ని సమస్యలు తప్పడం లేదు. 2015లో కూడా ప్రభుత్వ ఔషధ గిడ్డంగులలో లభ్యమవుతున్నవి 40 నుంచి 50 శాతం మందులే. చిత్రం ఏమిటంటే, ఫార్మాస్యూటికల్ కంపెనీలకీ, వైద్యులకీ మధ్య నుండే బంధం కారణంగా వారు జనరిక్ ఔషధాలను సూచించడం లేదన్న ఆరోపణ ఉంది. మరొక చిత్రమైన పరిస్థితి కూడా ఉంది. ఔషధాల ఉత్పత్తి కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఆరోగ్య రక్షణ వ్యవహారాలు, ఆరోగ్యానికి సంబంధించిన విధానాల రూపకల్పన, పథకాలు, వాటి నిర్వహణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దగ్గర ఉంటాయి. కానీ భారతదేశంలో ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉంది. కేంద్రం చేయగలిగినది ఏమిటంటే జాతీయ స్థాయి ఆరోగ్య పథకాలను క్రమబద్ధం చేయడమే. రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యం ప్రాథమిక హక్కు కాదు కూడా. అందుకే ఆరోగ్యానికి సంబంధించిన ఏ పథకమైనా కొన్ని చిక్కులను ఎదుర్కొనక తప్పడం లేదు. దేశంలో ఆరోగ్య పథకాల పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఇలాంటి పథకాలు వెంటనే విజయవంతం కాలేకపోతున్నాయి. జన ఔషధి పథకం కూడా ఇందుకు మినహాయింపు కాదు.
పుంజుకుంటున్న జన ఔషధి కేంద్రాలు
కానీ కొద్దికాలం క్రితం కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పీఎంబీజేపీ పథకం గురించి క్షుణ్ణంగా సమీక్షించింది. దేశంలో 6600 జన ఔషధి కేంద్రాలు సేవలు అందిస్తున్న సమయంలో జరిగిన సమీక్ష అది. ఆ సమీక్షలో తేలినదేమిటంటే, 2020-2021 ఆర్థిక సంవత్సరంలోని ఏడు మాసాలలో (గడచిన అక్టోబర్ నుంచి) ఈ కేంద్రాల ద్వారా రూ. 358 కోట్ల ఔషధాల అమ్మకం జరిగింది. సంవత్సరం పూర్తయ్యే నాటికి రూ.600 కోట్లకు అమ్మకాలు చేరుకుంటాయని అంచనా వేశారు. నిజానికి పీఎంబీజేపీని ఆరంభించిన 2014-15 సంవత్సరం నుంచి కూడా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ సంవత్సరం (99 కేంద్రాలు) అమ్మకాలు రూ. 7.29 కోట్లు. అదే 2019-2020 ఆర్థిక సంవత్సరంలో (6600 కేంద్రాలు) అమ్మకాలు రూ. 433 కోట్లకు చేరాయి. కొవిడ్ సమయంలో మందులే కాకుండా, మాస్కులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ చొరవ చూపింది.
ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారికి కేంద్రం రూ. 2.5 లక్షలు ప్రోత్సాహ కాలుగా అందిస్తుంది. వీటిని డాక్టర్లు, ఫార్మాసిస్టులు, వ్యాపారులు, స్వయం సేవా బృందాలు, ప్రభుత్వేతర సంస్థలు, సేవాసంస్థలు వంటివి ఏర్పాటు చేయవచ్చు. తగిన చోట్ల, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరగా మాత్రమే వీటిని నెలకొల్పాలి. 2019 ఆగస్ట్‌లో మొబైల్ అప్లికేషన్ కూడా వర్తింపచేశారు.
వారోత్సవాలతో ఊపు
జన ఔషధి వారోత్సవాలను పథకానికి మూడేళ్లు నిండిన సందర్భంగా ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రజలకు ఇంకా సన్నిహితం చేయాలన్న దృఢదీక్షతో ఈ కేంద్రాల సేవలను మరింత విస్తరింపచేయాలన్న సంకల్పంతో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి అర్ధమవుతుంది. ఈ ఉత్సవాల ప్రణాళికలో అదే ఆశయం కనపడుతుంది. ఆ ఏడు రోజులలో ఏడు ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. మార్చి 1న ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్తపోటు, సుగర్ పరీక్షలు, ఉచిత వైద్య సలహాలు, ఉచిత మందులు అందుబాటులోకి తెస్తారు. 2వ తేదీన జన ఔషధి పథకం గురించి డాక్టర్లు, క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇతర వ్యక్తులు, సంస్థల సహకారంతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 3వ తేదీన పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు జన ఔషధి కార్యక్రమం గురించి వివరిస్తారు. యువతరంలో ఈ పథకం గురించి అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. 4వ తేదీన పీఎంబీజేపీ మహిళల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలలో సానిటరీ ప్యాడ్స్ వినియోగం గురించి వివరిస్తారు. లక్ష వరకు సువిధ సానిటరీ ప్యాడ్లు ఉచితంగా పంచుతారు. దేశ వ్యాప్తంగా అదేరోజు రెండు వేల ప్రదేశాలలో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తారు. 5వ తేదీన వృద్ధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి మందుల ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చునో తెలియచేస్తారు. 6వ తేదీన జన ఔషధిలో ఎంతటి నాణ్యమైన మందులు లభిస్తాయి అందరికీ తెలియచేస్తారు. ఇందుకోసం బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, మానవహారాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజలను నిజంగా ఆదుకునే ఇలాంటి పథకానికి అందరూ చేయూత నివ్వాలి.
చాలా మంచి పథకం
జన ఔషధి పరియోజన చాలా మంచి పథకమని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కరలేదు. జనానికి అందుబాటులో ఉండవలసిన బేసిక్ ఔషధాలు నలభయ్ లేదా యాభయ్ ఉంటాయి. వాటిని ఈ కేంద్రాల ద్వారా నామమాత్రపు ధరలకు అందించడం, అవి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరే విక్రయించడం మంచి ఆలోచన కాక మరేమిటి? ఒక ఆస్ప్రిన్ మాత్ర తీసుకోండి. ఒక్క మాత్ర తయారీకి అయ్యే ఖర్చు ఐదు లేదా పదిపైసలు. మార్కెట్‌కు వచ్చేటప్పుటికి రూపాయి దాటుతుంది. ఈ పథకం వల్ల ఇప్పుడు యాభయ్ నుంచి తొంభయ్ శాతం ఔషధాల వ్యయం ప్రభుత్వం భరిస్తుంది. ఆరోగ్యాన్ని అభివృద్ధిలో భాగంగా చూడగలిగిన ప్రభుత్వం ఈ భారాన్ని తీసుకోకతప్పదు. ఒక చిన్న అనుభవం గుర్తుకు వస్తున్నది. ఇక్కడ ఒక మంచి ఔషధ తయారీ కేంద్రం ఉంది. దాని యజమాని నాకు సన్నిహితులు. విటమిన్ సి, బి కాంప్లెక్స్ వంటి బేసిక్ మందులు కొన్నిటిని భారీగా తీసుకోవలసిన అవసరం వచ్చింది. వాటిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి ఇవ్వడానికి ఎంత అవుతుందని అడిగాను. తయారీకి, ప్యాకింగ్‌కీ అన్నింటికీ కలిపి ఒక్క మాత్రకు 30 నయా పైసలు అవుతుందని చెప్పారు యజమాని. ఇవే మార్కెట్‌లో ఎంత ఉంటాయి అని అడిగాను. రెండు నుంచి మూడు రూపాయలని చెప్పారు. అంటే అన్ని సుంకాలు పడుతున్నాయి. మధ్యలో దుకాణదారు కమీషన్ ఇలాంటివన్నీ కలసి మధ్య తరగతి, పేద వర్గాల మీద వైద్య ఖర్చులను పెనుభారంగా మారుస్తున్నాయి. జన ఔషధి వల్ల పేదలకు భరించలేని విధంగా తయారైన వైద్య భారాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. కానీ ఈ పథకాన్ని ముందుకు నడిపించడం సవాలేనని నా అభిప్రాయం. దానిని అధిగమించాలి.
– డా।। డి. రాజారెడ్డి, న్యూరో సర్జన్, అపోలో
స్పందన బావుంది
అత్తాపూర్ (హైదరాబాద్)లో కొన్ని నెలల క్రితమే ఈ కేంద్రం ప్రారంభించాను. ఈ పథకం విస్తరించే క్రమంలో ఢిల్లీలో ఏర్పాటైన సభకు నేను కూడా హాజరయ్యాను. ప్రధాని నరేంద్రమోదీ గారు మాట్లాడారు. ఆయన పట్టుదల, ఇచ్చే స్ఫూర్తి అనన్య సామాన్యంగా ఉన్నాయి. ఈ ఆలోచన పేద ప్రజలకు పెన్నిధి వంటిదే. మా దగ్గర ఏడు వందల రకాల ఔషధాలు లభిస్తాయి. కానీ ప్రస్తుతం సరఫరా కొంచెం ఇబ్బందిగా ఉంది. బీపీ, సుగర్, గ్యాస్ సంబంధిత మందుల సరఫరా చాలడం లేదు. ఇప్పుడు మళ్లీ వ్యవస్థ మొత్తం మార్చారు. ఈ ప్రాంతానికి అవసరమైన మందుల కోసం మేడ్చల్‌లో గోదాము ఏర్పాటయింది. ఏ ఔషధం నిల్వలు అయిపోతే సాయంత్రానికల్లా వాటిని కేంద్రాలకు చేర్చగలరు. సానిటరీ నాప్‌కిన్ ఇప్పటికీ ఒక రూపాయికే అందిస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ఒక ఆసుపత్రి ప్రారంభించి, ఈ కేంద్రాన్ని దానికి అనుబంధంగా మార్చే ఆలోచన కూడా ఉంది. అక్కడ ఒక్క రూపాయి రుసుముతోనే కొన్ని రకాల పరీక్షలు అందుతాయి. ఇక్కడ స్థలం దొరకగానే అది కూడా కార్యరూపం దాలుస్తుంది.
– వినయ్‌కుమార్, పీఎంబీజేపీ అత్తాపూర్ నిర్వాహకుడు