– డా।।ఆరవల్లి, జగన్నాథస్వామి సీనియర్ జర్నలిస్ట్
హోలీ విశ్వవ్యాప్తమైన రంగుల పండుగ. వసంతు రుతువుకు ఆగమనంగా జరుపుకునే పండుగ. వేదకాలంలో ఉగాది ఈ మాసంతోనే (ఫాల్గుణ) ప్రారంభమయ్యేదట. అప్పట్లో నాలుగేసి మాసాలను ఒక రుతువుగా పరిగణించేవారని, అలాంటి మూడు చాతుర్మాస్యాలలో తొలి చాతుర్మాస్య వ్రతం ఫాల్గుణంలో ప్రారంభమయ్యేదని తెలుస్తోంది. దీనినే వసంతోత్సవం, మదనోత్సవమని వ్యవహరించేవారు.
హోలీ పండుగను శైవ, వైష్ణవ పరంగా జరుపుకునే ఉత్సవాలుగా చెబుతారు. దుష్టశక్తులపై సాధించిన విజయాలకు సంకేతంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఇది హిందువుల పండగే అయినా సర్వ మతస్థులు ఉత్సాహంగా పాల్గొంటారు. తూర్పు, ఉత్తర భారత ప్రాంతాలలో ఈ రోజే వసంత రుతువు మొదలవుతుంది.
ఉత్తర భారతదేశం పండుగగా భావించే దీనికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ఆధునిక కాలంలో దీనిని ‘రంగుల పండుగ’గా వ్యవహరిస్తున్నారు. దీని గురించి అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ, హోలిక (హిరణ్యకశిపుని సోదరి) దహనం, ‘కుమారసంభవం’ నేపథ్యాన్ని ప్రధానంగా చెబుతారు. దుష్టశిక్షణతో పాటు లోకరక్షణకు గుర్తుగా హోలీని జరుపుకుంటారు. మొదటిది, ప్రత్యక్షంగా రాక్షసి సంహారం కాగా, రెండవది త్రిపురాసుర సంహారానికి యోధుని జననం (కుమారస్వామి) నేపథ్యం.
హోలికా దహనం
విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడిని దండించేందుకు తండ్రి హిరణ్యకశిపుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగానే తన సోదరి హోలిక ఒడిలో చితిపై కూర్చోవాలని కుమారుడిని ఆజ్ఞాపిస్తాడు. హోలీకకు నిప్పు వల్ల ఎలాంటి హాని కలగదనే వరంతో పాటు ఆమె ధరించే శాలువలాంటి వస్త్రం రక్షణ కల్పిస్తుంది. తండ్రి ఆదేశాను సారం ప్రహ్లాదుడు ఆమె (మేనత్త) ఒడిలో కూర్చుని శ్రీహరిని ప్రార్థిస్తాడు. చితిమంటలు ప్రారంభం కాగానే అనూహ్యంగా రక్కసి కప్పుకున్న ‘రక్షణ వస్త్రం’ ఎగిరి ప్రహ్లాదుడిని కప్పడంతో ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. మంటల్లో కాలకుండా ఆమెకు వరం ఉన్నప్పటికీ విష్ణుభక్తుడికి కీడు తలపెట్టే ప్రయత్నంచేసింది కనుక హోలిక దహనమైంది. దానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటున్నాం. విజయ దశమి నాడు రావణ విగ్రహం మాదిరిగా, ఈ పండుగ ముందు రోజున హోలిక విగ్రహాన్ని దహనం చేస్తారు. కూడళ్లలో లేదా వీధి చివర కర్రలను కుప్పలుగా పోసి ప్రతిమలను దహనం చేస్తారు. హోలికా దహనంతో రాక్షస అంతానికి నాందీ పలికినట్లైందని భావిస్తారు.
‘కుమారసంభవం’
‘కుమారసంభవం’ ఘట్టం ఈ పండుగకు మరో ప్రధాన కారణంగా చెబుతారు.శివపురాణంలోని రుద్రసంహిత, సతీ ఖండం వివరణ ప్రకారం, తారకసుర సంహారం కోసం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు (కుమారస్వామి) కలగాలి. తపోనిష్టలో ఉన్న శివుని దృష్టిని మరల్చేందుకు బ్రహ్మ సూచన మేరకు మన్మథుడు ఆయనపై పుష్పబాణ ప్రయోగం చేస్తాడు. దానితో ఆగ్రహించిన శివుడు మూడో కన్నుతెరవడంతో మన్మథుడు బుగ్గయి పోతాడు. రతీదేవి విన్నపంతో మన్మథుడిని పునర్జీవితుడిని చేస్తారు. కానీ అతను అశీరంగా ఉంటూ రతీదేవికి మాత్రమే కనిపిస్తూ, అందరి హృదయాలలో ఉంటాడని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఈ ఉదంతం ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగింది కనుక ఆ రోజును ‘కామదహనోత్సవం’ అని అంటారు. ఇక్కడ కామం అంటే శృంగారపరమైన ‘వాంఛ’ అనే అర్థంలోనే కాకుండా ‘కోరిక’ అనే లౌకిక అర్థంలో తీసుకోవాలని పెద్దలు సూచిస్తారు. మానవుడు ఐహికమైన కోరికలను పరిహరించి నిష్కామకర్మతో వ్యవహరించాలని హోలీ పండుగ సందేశాన్ని ఇస్తోంది.యజ్ఞ స్వరూపమైన అగ్నిలో శారీరక వాంఛలు దగ్ధమైనట్లు ఈ పండుగకు ఆధ్యాత్మిక కోణంలో అర్థం చెబుతారు.
శ్రీకృష్ణుడితో హోలీని అన్వయించి చెప్పే మరో కథ ప్రచారంంలో ఉంది. దాని ప్రకారం, రాధ అంత తెల్లగా ఉంటే, తాను ఇంత నల్లగా ఎందుకున్నానని శ్రీకృష్ణుడు తల్లి యశోద వద్ద మారాం చేశాడని, దాంతో ఆమె రాధ ముఖానికి రంగు పులిమి తనయుడిని ఓదార్చిందనే కథనం వాడుకలో ఉంది. అందుకే కృష్ణుడు పుట్టి పెరిగిన మథుర, బృందా వనంలో ఈ పండుగను పదహారు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పౌర్ణమి నాడే బాలకృష్ణుడికి డోలోత్సవం నిర్వహిస్తారు. అయిదవ నాడు అంటే ఫాల్గుణ బహుళ పంచమి నాడు ఈ పండుగ ముగింపు సూచనగా రంగులతో ‘రంగ పంచమి’ జరుపుకుంటారు.
‘రంగుల’ నేపథ్యం
దుష్ట సంహారం, వసంత రుతువు ఆగమనం నేపథ్యంలో ఆనంద చిహ్నంగా రంగులుచల్లుకుంటూ, మధుర పదార్థాలు పంచుకొంటూ ఆరగిస్తుంటారు. రుతువు మారే క్రమంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా ఈ రంగులు దోహదపడతా యని భావించేవారు. అందుకు తగినట్లే సంప్రదాయ బద్ధంగా వేపగింజలు, కుంకుమ, పసుపు తదితర ప్రకృతి సిద్ధ, ఆయుర్వేద పదార్థాలతో రంగులు తయారు చేసేవారు. కాలక్రమంలో వాటి స్థానంలో పూర్తిగా రసాయనాలతో నిండిన రంగులు వాడకం లోకి వచ్చాయి. వీటిని చల్లుకోవడంలో ఆనందం, వినోదం మాట ఎలా ఉన్నా ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతోందని, వాతావరణం కలుషితమవుతోందని నిపుణులు అంటున్నారు.ఈ రంగులలోని రసాయనాల కారణంగా అలెర్జీ, చర్మవ్యాధులు, అంధత్వం, మూత్రపిండాల వ్యాధులు వంటివి సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయకంగా వస్తున్న పండుగలను జరుపుకో వలసిందే. అదే సమయంలో పూర్వీకులు రూపొం దించిన నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యా లను, పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం.